గూడు by S Sridevi


సూర్యుడు ఇంక ఆ రోజుకి ఈ దిగంతాలలోకో జారుకుంటున్న వేళ. పక్షులు కోలాహలంగా గూళ్ల చేరుకుంటున్నాయి. నక్షత్రాలు ఒకటొకటిగా ఆకాశంలో దర్శనమిస్తున్నాయి.
కాళ్లు నొప్పులు పుట్టేలా ఆవరణ అంతా తిరిగి తిరిగి లలిత చివరికి ఒక సిమెంట్ బెంచీమీద కూలబడింది. ఒక భావన ఆమెని స్థిమితంగా ఉండనివ్వడంలేదు. చిన్నప్పుడు తండ్రి ఆశ్రయంలో, పెళ్లయ్యాక భర్త దగ్గర, భర్త పోయాక కొడుకు ఇంట్లో, ఇప్పుడు ఈ సంధ్యారామంలో. ఎప్పుడూ పరాధీనతేనా? ఏ దేవుడు ఈ దేశపు ఆడవాళ్ళ నుదుట ఇలాంటి రాత రాశాడు?
” ఇక్కడున్నావా? నీకోసం గదికి వెళ్లి చూసి వచ్చాను” కమల తను కూడా వచ్చి ఆమె పక్కన కూర్చుంటూ అంది.
ఆమెతో తన విషయాలేవీ చర్చించాలనిపించలేదు లలితకి. ఎందుకో… మరి!
” ఆకాశం చూడు. అప్పటిదాకా పిచ్చిపూలనీ, గులకరాళ్ళనీ అపురూపంగా గుళ్లో దాచుకుని ఆడుకున్న అల్లరి పిల్ల ఆటలు చాలించి వొడి దులిపేసుకున్నట్టు నక్షత్రాలని ఎలా వెదజల్లుతోందో!” తన ఉదాసీనతని గమనించకుండా ఉండేందుకని అంది.
కమల నవ్వింది.” ఇంకా కవిత్వపు వాసనలు పోలేదే నీకు. ఇప్పుడంతా తీరికే కదా, మళ్లీ రాయకూడదూ?” అడిగింది.
” అంతా… తీరికే” అంది లలిత దీర్ఘం తీస్తూ. ఆ అనటంలో విరుపు ఉంది. ఆ విరుపులో దుఃఖం ఉంది. నిరాశ ఉంది . ఏదో కావాలన్న ఆర్తి ఉంది.
ఆద్యంతాలు లేని సృష్టిలో అనంతమైన ప్రయాణం. ప్రతి పుట్టుకకీ గమ్యం మరణం. గమ్యం చేరేలోగా విసుగు పుట్టకుండా రాగద్వేషాలు, మమతానురాగాల కాలక్షేపం.
ఒంటరిగా  లోకంలోకి వచ్చి అలాగే తిరిగి వెళ్లటంలోనే చావుపుట్టుకల సూక్ష్ధర్మం ఇమిడి ఉన్నా, అది అందరికీ తెలిసిందే అయినా, దాని వాస్తవికతని గుర్తించలేనంతగా మనసుని కప్పేసి ఉంచే అవాస్తవిక విలువలు! మనసుని ఛిద్రం చేసేవీ, దాన్ని తులాదండంగా నిలబెట్టి అనురక్తి విరక్తులని త్రాసు పళ్ళాలుగా వేలాడదీసేవి కూడా అవే.
” ఎదురుగా నేనున్నా ఏమిటంత పరధ్యాస?” అడిగింది కమల.
” ఆలోచిస్తున్నాను”
” దేని గురించి?”
ఓ తండ్రికి కూతురిగా, ఇద్దరు అన్నదమ్ములకి తోబుట్టువుగా పుట్టి… అత్తిల్లు మెట్టి… అత్తమామలు, మరుదులు, ఆడపడుచులతో మమేకమై… నేనో నలుగురు పిల్లల తల్లినై ఉండి కూడా ఎవరికీ ఏమీ కాకుండా ఉండిపోవడాన్ని గురించి” అంది లలిత.
అలా అంటుంటే ఆమె గొంతు వణికింది. కళ్ళలో నీళ్లు నిలిచాయి. పమిటకొంగుతో అద్దుకుంది. ఏదైతే కమల ముందు బయటపడకూడదనుకుందో అది అననే అనేసింది. మనసు ఎప్పుడూ అంతే. వైరుధ్యంలో పడి కొట్టుకుంటూ ఉంటుంది.
” బాధపడతావని ఇంకా అడగలేదు. అంతమందీ ఉండి నువ్వొచ్చి ఇక్కడ ఉండడం ఏమిటి?” అడగలేక అడిగింది కమల.
ఇద్దరూ ఇంటర్ దాకా కలిసి చదువుకున్నారు. చదువు అవ్వగానే లలితకి పెళ్లి అయిపోయింది. సంసార బాధ్యతలు వెల్లువలా మీద పడి ఆమెని ముంచెత్తాయి. కమల ఇంటర్ అవగానే ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. కొన్ని కారణాల చేత ఆ పెళ్లి విఫలమై ఒంటరిగా మిగిలింది. రిటైర్మెంట్ తీసుకున్నాక సంధ్యారామం అనే పేరుతో ఈ వృద్ధాశ్రమం పెట్టింది. ఎవరెవరో అపరిచితులు వచ్చి చేరారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క ప్రపంచం. ఎవరి అనుభవాలూ అనుభూతులూ వారివి. జీవనసంధ్యలో ఎదురైన ఈ లేటు అనుభవం మాత్రం ఒక్కటే.
బాధ్యతల వెల్లువలో తన అస్తిత్వాన్ని కోల్పోయిన లలిత అవన్నీ తీరిపోయాక ప్రశ్నార్థకమై వచ్చి కమల దగ్గర చేరింది. అదీ ముందురాత్రి. చేతిలో చిన్న సూట్ కేస్ తో రాత్రి పదకొండు  గంటల వేళ ఒంటరిగా వచ్చి సంధ్యారామం తలుపు తట్టింది. తలుపు తీసిన కమల స్థాణువైంది. ఆమె ఇంకా తేరుకోకముందే తనే చెప్పేసింది,” ఇకపై ఇక్కడే ఉంటాను” అని. మనిషి నిలువునా దుఖంతో వూగిపోతోంది. కదిలిస్తే చాలు విరుచుకుపడే కడలి కెరటంలా ఉంది. అంతటి ఉద్వేగాన్ని తట్టుకునే శక్తి కమలకి లేదు.
” రాత్రి… బాగా పొద్దుపోయింది. పద, పడుకుందాం. పొద్దున్న లేచాక అన్నీ మాట్లాడుకోవచ్చు” అని లలిత భుజాల  చుట్టూ చెయ్యేసి తన గదిలోకి తీసుకెళ్ళింది. పక్క వేసి పడుకోమంది. మానసికంగా బాగా అలసిపోయిందేమో లలిత, ఆపాటి ఆదరణకే సేదతీరి నిద్రలోకి జారుకుంది. కమలకి మాత్రం ఆ రాత్రి మరింక నిద్ర పట్టలేదు.
తనకో ఇల్లూ, పిల్లలూ, సంసారం లేవని ఇన్నాళ్లూ వెల్తిపడేది. అంతర్గతంగా దు:ఖించేది. తన చెయ్యి వదిలేసి వెళ్లిపోయిన భర్తను తల్చుకుని ఎవరూ లేని ఏకాంతంలో ఏడ్చేది. అలాంటిది ఇప్పుడా బంధాలన్నీ పరిహసిస్తున్నట్టుగా ఉంది లలిత ఇక్కడికి రావడం.
మర్నాడు పగలంతా ఏవో పనులు. సాయంత్రానికిగానీ లలితతో మాట్లాడటానికి తీరలేదు. ఇదిగో, ఇప్పటికైంది.
” మూర్తితో ఏంటి గొడవ? పదేళ్లుగా వాడి దగ్గరే ఉంటున్నావు కదా?” అడిగింది కమల తనే మళ్లీ, ఏ జవాబూ రాకపోవడంతో.
” ఇన్నాళ్లూ అంటే వాడి పిల్లలు చిన్నవాళ్లు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్తారు కాబట్టి ఓ మనిషి అవసరం ఉండి నన్ను దగ్గరుంచుకున్నారు. ఇప్పుడు వాళ్ల పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. నా వునికి కిట్టడంలేదు” అంది లలిత.
” మూర్తి కూడానా?” కమల ఆశ్చర్యపోయింది.
ఆమెకి లలిత నలుగురు పిల్లల గురించీ బాగా తెలుసు. పెద్దవాడు మూర్తి సాత్వికుడు. చిన్నవాడు రమణది దుడుకు స్వభావం. పెద్ద సార్ కూతురు హేమది గట్టి వ్యక్తిత్వమే అయినా మృదుస్వభావం దాన్ని నివురులా కప్పి ఉంచుతుంది . అందుకే ఆమె ఉమ్మడి కుటుంబంలో నెగ్గుకురాగలుగుతోంది. చిన్నది స్వర్ణలో కొంచెం స్వార్థం ఉంది. ఇవన్నీ వాళ్లతో తనకున్న పరిచయాన్నిబట్టి కమల వేసుకున్న అంచనాలు. నది ఒడ్డున నిలబడితే అంతా నిశ్చలంగా కనిపిస్తుంది. దిగితేగానీ లోతూ, వొడీ తిన్నాను సార్ తెలియవు. కమల ఒడ్డున నిలబడి లోతుపాతులు అంచనా వేస్తోంది. లలిత ప్రవాహంలో ఉంది.
” మూర్తిని పిలిపించి నేను మాట్లాడనా?” అడిగింది కమల. “నిన్ను ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతోంది. ఏదో… నాలా తాడూ బొంగరం లేనివాళ్ళు చేరటం కోసమని ఈ ఆశ్రమం పెట్టానుగానీ…” పూర్తి చెయ్యకుండా ఆపేసింది.
లలిత నిర్వేదంగా నవ్వింది. ఆమెకి మనసులో ఉంది, ఎవరైనా తన వైపు వకాల్తా తీసుకుని కొంతమందిని నిలదీయాలని… న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి అన్న మనువు దగ్గర్నుంచి దారి నువ్వు చూసుకోమని వదిలేసిన మూర్తి దాకా… అందరినీ.

సంధ్యారామం గేటు తీసుకుని లోపలికి అడుగుపెడుతుంటే అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది మూర్తికి. అక్కడికి రావడం అతనికి అది మొదటిసారి కాదు. కమల కోసం ఎన్నోసార్లు వచ్చాడు. కానీ ఇప్పుడు రావడం వేరు. అయితే తల్లి ఇక్కడికొచ్చి ఉన్నందుకు బాధగానీ, అందుకు తను బాధ్యుడన్న అపరాధభావంగానీ లేవు.
” హలో, బ్రూటస్!” గేటు దాటి కాస్త నడిచాడో లేదో కమల గొంతు వినిపించింది.
” నన్నేనా ఆంటీ?” అటుగా నడుస్తూ భుజాల కుదింపుతో అడిగాడు.
” నిన్ను కాక?” కమల అంది.
” అమ్మ ఇక్కడికి వచ్చిందని మీకు కోపంగా ఉంది కదూ?” ఆమెతో పాటు నడుస్తూ అడిగాడు.
కమల జవాబు ఇవ్వలేదు. ఇద్దరూ నిశ్శబ్దంగా ఆఫీస్ రూమ్ కేసి దారి తీశారు. లలిత అక్కడే ఉంది. మూర్తిని  చూడగానే కోపంగా వెళ్ళిపోయింది.
” అమ్మకి ఇంకా కోపం తగ్గలేదు” అన్నాడు.
” ఇంత సన్మానం జరిగాక కూడానా?” వ్యంగ్యంగా అంది కమల.
” నువ్వు ఒకవైపే ఆలోచిస్తున్నావాంటీ!” మూర్తి ఆరోపించాడు.
” నేను జడ్జిని కాను, తప్పొప్పులు నిర్ణయించడానికి. లలిత నా ప్రాణ స్నేహితురాలు. దాని తరఫున అడుగుతున్నాను. కన్నతల్లి నీకు బరువైందా మూర్తీ? మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. మీ అంతటివాళ్ళు మీరయ్యారు. మేం చెప్పేవీ, చేసేవీ మీకు నచ్చవు. కానీ ఒరే మూర్తీ! చిన్నప్పట్నుంచి మా మధ్యని ఉన్న అనుబంధం చేత తటస్థంగా ఉండలేక అడుగుతున్నాను. చెప్పు…. ఈ వయసులో అమ్మ నీకు బరువైందా?” ఆవేదనగా అడిగింది.
” అమ్మ బరువు ఎందుకు అవుతుంది? కర్మభూమి మనది. ఏ పని చేసినా పాప పుణ్యాల లెక్కలు సరి చూసుకునే మనుషులం మనం”
” మరేంట్రా సమస్య? కోడలిని రాచి రంపాన పెట్టే మనస్తత్వం కాదు దానిది”
” సమస్య అమ్మపరంగా వచ్చినది కాదు. సుమతికి నలభై దాటాయి. బాధ్యతలు పెరిగాయి. ఇంటా బయటా ఒత్తిడులు పెరిగాయి. ఏవో ఆరోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. ఇదివరకట్లా అమ్మ చాదస్తాన్ని భరించలేకపోతోంది. నిత్యం ఇంట్లో ఏదో ఒక గొడవ”
” అందుకని అమ్మని ఇంట్లోంచే వెళ్లగొట్టావా?”
” లేకపోతే సుమతిని వెళ్ళగొట్టాలి. పెళ్లి పేరుతో మేమిద్దరం ఎత్తుకున్న ఉమ్మడి బాధ్యతలు పిల్లలు. వాళ్లకి ఇంకా ఉద్యోగాలూ, పెళ్లిళ్లూ లేవు కాబట్టి అయ్యేదాకా మేము కలిసుండడం తప్పనిసరి”
” ఎంత సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు? తప్పు ఇద్దరిలో ఎవరిదైనా కావచ్చు. మగవాడివి నువ్వు సర్దిచెప్పలేవా?”
” ఏమిటి సర్దిచెప్పాలి? ఎంతకని సర్ది చెప్పాలి? నాన్న పోయాక అమ్మని నా దగ్గర ఉంచుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. తమ్ముడు ఆవిడని తీసుకువెళ్లలేదనిగానీ, ఆవిడ కోసం డబ్బు పంపలేదు అనిగానీ ఎప్పుడూ వంతు పోలేదే? ఆవిడ రాకతో ఒక విధంగా మా ప్రైవసీని కోల్పోయాము. అయినా సుమతి ఏమీ అనలేదు”
” తల్లిదండ్రుల గురించి అలా అనుకుంటే ఎలారా?”
” వాళ్లవైపునుంచి కూడా సహకారం ఉండాలి కదా? ఇల్లు నడపాల్సింది గృహిణిగానీ గృహస్తు తల్లి కాదనే విషయం తెలుసుకోవాలి. ప్రతి దాంట్లోనూ అత్తాకోడళ్ళిద్దరిమధ్యా తగాదాయే. ఈమధ్య మరీ ఎక్కువయ్యాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్లు వాళ్ల తల్లికి ఏమో చెప్పుకుంటారు. అమ్మకి అన్నీ ఆరా కావాలి. ప్రతిదీ తనకి చెప్పి చేయాలంటుంది. లేకపోతే సణుగుతుంది, గొణుగుతుంది, సుమతిని దోషిని చేసి అరుస్తుంది”
” ఏదోలేరా, దానిదో చాదస్తం. అది అన్నట్టే చేస్తే పోలేదా?”
” నీకు రాలేదేం, ఆ చాదస్తం?”
మూర్తి ప్రశ్నతో తెల్లబోయింది కమల. నిజమే. లలిత వయసే తనకీ ఉంటుంది. తనకి ఎలాంటి చాదస్తం లేదేమిటి? ప్రతి పని పద్ధతిగా చేసుకుంటోంది ఇప్పటికి కూడా.
” ఆంటీ! జవాబు నేను చెప్తాను. అమ్మకి చేతినిండా వ్యాపకం లేదు” అన్నాడు మూర్తి క్లుప్తంగా. దాన్ని యధాతథంగా ఒప్పుకోలేకపోయింది కమల.
” మరి రమణకి ఏమైందిరా? వాడో కొద్దిరోజులు తీసుకెళ్లొచ్చు కదా? అందరూ ఉండి దిక్కులేనిదానిలా వదిలేసారు” అంది.
” నువ్వు వాడితో మాట్లాడతావా?”
” ఏం? నువ్వు మాట్లాడటం అయిపోయిందా?”
దానికి జవాబు చెప్పకుండా రమణ నెంబర్ ఇచ్చి లేచాడు మూర్తి. వెళ్లేముందు ఒక్క నిమిషం ఆగి జేబులో నుంచి చెక్కు తీసి సంతకం చేసి చెక్కు ఇచ్చాడు. దానిమీద పదివేలు వేసి ఉంది.
” మూర్తీ!” తెల్లబోయింది కమల.
” మా తరానికిలాగే మీ తరానికికూడా అవసరాలు మారాయి. అమ్మకి కావలసింది కేవలం తిండీ, బట్టా, ఆశ్రయం మాత్రమే కాదు. కాలక్షేపం… ఒక వ్యాపకం కావాలి. ఆవిడ సమస్య ఇదే. దానికి ఇక్కడ పరిష్కారం దొరుకుతుందేమోనని…” అన్నాడు.
” అయితే మాత్రం? డబ్బెందుకు? వద్దు. తెలిస్తే తను చాలా బాధపడుతుంది” అని తిరిగి ఇచ్చేసింది. మూర్తి కొంచెం తటపటాయించి తిరిగి తీసుకుని,” వస్తా ఆంటీ!” అని వెళ్లిపోయాడు.
అతని ధోరణినిబట్టి చూస్తే రమణక్కూడా తల్లిని వుంచుకునే ఉద్దేశ్యం లేనట్టే అనిపించింది. అయినా మూర్తి ఇచ్చిన నెంబరు కలిపింది. రమణే ఎత్తాడు.
” రమణా! అమ్మ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఉంటోంది. తను సంతోషంగా  వచ్చి ఉంటే ఏ బాధా లేదు. మూర్తి ఇంట్లో కోట్లాట పెట్టుకుని వాళ్లు కాదనుకుంటే ఇక్కడికి వచ్చింది” అంది.
” ఆంటీ! నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావా?”
రమణ ప్రశ్నకి తెల్లబోయింది కమల.” ఏమిటది?”
” ఆవిడ బాధ్యత మా ఇద్దరిదేనా?”
” అంటే చెల్లెళ్ళని కూడా పంచుకోమంటావా?” అసహ్యంలాంటి భావం ఏదో పుడుతూ ఉంటే దాన్ని అణచుకుని అడిగింది.
” వాళ్ళిద్దరి సంగతీ తర్వాత. మా చిన్నాన్న గురించి నేను అంటున్నది. మా నాన్న బతికున్న రోజుల్లో ఆయనని పోషించారు. చదివించారు. అత్తయ్యలకి పెళ్లిళ్లు చేశారు. నాన్న అలా చెయ్యడం వాళ్ళ హక్కుగా భావించారు. మరి బాధ్యతలు?”
” హక్కులు, బాధ్యతలు తర్వాత. మధ్యలో నలిగిపోతున్నది మీ అమ్మ”
” ఆవిడే మరి… మమ్మల్ని పక్కనపెట్టి తన ఇల్లంతా దోచి వాళ్లకి పెడుతుంటే మాట్లాడకుండా ఊరుకుంది. మూర్తికి అరకొర చదువు చెప్పించారు. వాడు తెలివైనవాడైనా గుమస్తా ఉద్యోగంతో సరిపెట్టుకున్నాడు. నా దాకా వచ్చేసరికి ఖాళీ చెయ్యి చూపించారు. మా మామయ్య నా మీద దయతలచి ఐ టి ఐ చెప్పించాడు. దాంతో మెకానిక్ ఉద్యోగం వచ్చింది”
” తప్పంతా మీ నాన్నది. ఆయన్ని అడగాల్సింది”
” నీకు అప్పటి సంగతులు తెలియవులే. అలా ఎదురుతిరిగాననే నాన్న చావగొడితే మా మామయ్య దగ్గరికి పారిపోయాను”
ఈ గొడవంతా కమలకి తెలియదు. రమణ మేనమామ దగ్గరుండి చదువుకున్నడనే ఆమెకి చెప్పింది లలిత.
” పోనీలేరా! జరిగిందేదో జరిగిపోయింది. నీకు మీ మామయ్య చదువు చెప్పించినట్టే మీ నాన్న తన వాళ్ళకి చెప్పించుకున్నాడు”
” మా మామయ్యేమీ ఊరికే చెప్పించలేదు. ఆయన కూతురుకి పోలియో వచ్చింది. తనని నేను చేసుకోవాలని బేరం పెట్టాడు.అది నా యిష్టానికీ సంస్కారానికీ వదిలితే బాగుండేది. మనసు లేనివాడిగా, కృతఘ్నుడిగా, చెడ్డకొడుకుగా ముద్ర వేసుకున్నాక ఈ జీవితం నాకు దొరికింది”
” అదంతా నిజమే నాన్నా! కానీ అమ్మని నువ్వో నాలుగు రోజులు తీసుకెళ్తే మార్పుగా ఉంటుంది” అంది నచ్చచెప్తునట్టు.
” సారీ ఆంటీ! నా భార్య ఒప్పుకోదు. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని ఎన్ని మాటలు అన్నారో అన్నవాళ్లు మర్చిపోయినా పడ్డవాళ్ళు మర్చిపోరుగా” అనేసాడు. ఆపైన ఫోన్ పెట్టేసిన చప్పుడు.
హతాశురాలైంది కమల. ఏదో అసంతృప్తి. ఎందుకు? ఎందుకిలా జరుగుతోంది?
పెళ్లి చేసుకోవడం, భార్యభర్తలకు సరిపడకపోవడం, విడిపోవడం ఒకవైపు. సరిపడకపోయినా పిల్లల్ని కనడం, పెద్ద వాళ్ళతో వాళ్లకి పడకపోవడం… మరోవైపు.
మనది ఎంతో ఉత్కృష్టమైన సంస్కృతి అనీ, కుటుంబవ్యవస్థని మనమే పరిరక్షిస్తున్నామనీ ప్రపంచమంతా వినేలాగా డబ్బా కొట్టుకుంటాం. అందులో ఇన్ని లుకలుకలు.
రమ్మని తీసుకెళ్లి మేనమామ చదువు చెప్పించి తన కూతురునిచ్చి చేద్దామనుకున్నాడు. నిజం చెప్పాలంటే రమణ చాలా అందగాడు. అతని కలలు అతనికి ఉంటాయి. ఆ అమ్మాయిని బలవంతంగా ఇచ్చి చేద్దామని ఆయన ఎలా అనుకున్నాడు? ఆయన దగ్గర్నుంచి గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు రమణ. ఏదో షెడ్ లో మెకానిక్ గా చేరి చదువు పూర్తి చేసి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ పెళ్లికి ఇంట్లోంచి శవం కదిలి వెళ్లినంత గొడవ చేశారు లలితా, భర్తాను. అలాంటి తల్లిదండ్రులని ఏ కొడుకులు మాత్రం గౌరవిస్తారు? మూర్తి దగ్గరే ఇమడలేక పోయిన లలిత ఇంకొకరి దగ్గర ఎలా ఉంటుంది?

లలిత పెద్ద కూతురు హేమ తల్లిని చూడటానికి వచ్చింది. చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
“మూర్తి ఇలా చేస్తాడనుకోలేదు. వాడినని ఏమి లాభం? వదినకి మొదటినుంచీ వాళ్ళవైపే తప్పించి మనవైపు ఎవరూ పనికొచ్చేవారు కాదు. అమ్మని తీసుకెళ్లి దగ్గర ఉంచుకోవడం మూర్తి బలవంతం మీదే. ఇన్నాళ్ళకి ఆ కసంతా ఇలా తీర్చుకుంది” అంది తప్పంతా సుమతిది చేసి.
కమలకి ఆశ్చర్యం వేసింది.
” ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. మావారు కానీ మా బావగారు కానీ తల్లి మాట జవదాటరు. ఆవిడ ఏం చెప్తే అది జరగాల్సిందే” అంది.
” మీ అత్తగారికేమే? ఇనప్పెట్టిలాంటి ఇల్లు ఆవిడ పేర్న పెట్టి చనిపోయాడు మీ మామగారు. ఆవిడ్ని మంచి చేసుకోకపోతే ఏ కూతురికో రాసేస్తుంది” లలిత అంది.
కమల ఇంకా ఆశ్చర్యపోయింది. ఇనప్పెట్టెలాంటి ఇల్లో , ఒంటినిండా బంగారమో ఉండకపోవడమే లలిత సమస్యా? అవన్నీ ఉండికూడా ఆశ్రమాల్లో వచ్చి ఉంటున్నవాళ్ళ మాటో? అగమ్యగోచరంగా అనిపించింది.
చాలాసేపు కూర్చుని వెళ్ళింది హేమ. ఆమె ఉన్నంతసేపూ సుమతి గురించే చెప్పుకున్నారు తల్లీకూతుర్లు. పదేళ్లు తనని దగ్గర పెట్టుకుని పోషించిన స్త్రీపట్ల కొడుకునిబట్టేనా లలితకి ప్రేమ లేకపోవడమనేది కమలకి ఆశ్చర్యం కలిగించింది.
….
స్వర్ణ, లలిత చిన్నకూతురు. చూడ్డానికి వస్తూనే తల్లిని కోప్పడింది.” అన్నయ్యా వదినా నిన్ను నెత్తిన పెట్టుకుని చూస్తుంటే కాదనుకుని ఇక్కడికి వచ్చి ఉన్నావు. బావుందా, ఇక్కడ? వాళ్లేనా నిన్ను ఏమన్నారని? అన్నిట్లోనూ తలదూర్చక ఓ వార కూర్చోమన్నారు. నీ కాలక్షేపం నిన్ను చేసుకోమన్నారు. నీ చాదస్తాన్ని వాళ్లు మాత్రం ఎంతకని భరిస్తారు? అక్కడికీ వదినకి నోరు లేదు కాబట్టి నువ్వేం చేసినా ఊరుకుంది” అంది.
రంగస్థలం మీద నటులు మారుతున్నట్టు ఒక్కొక్కరూ వస్తున్నారు. తమ పాత్రల్ని పోషిస్తున్నారు. సంభాషణలు చెప్తున్నారు. వెళ్తున్నారు. ఇంకా తెరమీది పాత్ర పోషించనిది లలిత ఒక్కతే. కమల చాలావరకూ ప్రేక్షకురాలైపోయినా కొంత పాత్ర తను పోషిస్తోంది.
” గొడవలు ఎన్నైనా ఉండొచ్చు స్వర్ణా! అర్ధరాత్రి వేళ ఇల్లు వదిలేసి వచ్చిందంటే దాని మనసు ఎంత గాయపడి ఉంటుందో!” అంది అక్కడికీ ఊరుకోలేక.
” నీకు తెలీదాంటీ, ఈ పెద్దవాళ్ళ చాదస్తాలు. మా అత్తగారుందా, కాల్చుకు తింటుంది. ఏ పనీ ఓ పట్టాన తెమల్చదు. అన్నీ పద్ధతి ప్రకారం చేయాలంటుంది. ఆవిడ వచ్చిందంటే మేము ఒక పూట మాడాల్సిందే. మహా నైవేద్యం అయితేగానీ తిండి పెట్టదు. అది అయ్యేసరికి పదకొండో, పన్నెండో. ఆఫీసులు అప్పటిదాకా ఆగవు కదా! పండగ వచ్చిందంటే చాలు, చచ్చే చావు. సెలవు వచ్చిందని నేను సంతోషపడతాను. ఆవిడేమో బూజులు దులిపించీ, ఇల్లు కడిగించీ సందడంతా వలకపోస్తుంది. పనివాళ్లు చేస్తే మనం చేసుకున్నట్టు ఉండదంటుంది. కోడలనగానే వీళ్లకు ఎలా కనిపిస్తుందో! అందుకే మా దగ్గరికి వచ్చి ఉంటానంటే వద్దన్నాను” టపీమని అంది స్వర్ణ.
” పోనీ, అమ్మని నువ్వు కొన్నాళ్లు తీసుకెళ్ళు. నువ్వు కూడా ఉద్యోగస్తురాలివే కాబట్టి ఎలా ఉండాలో దానికి నేర్పించవే. అమ్మ కాబట్టి నీకైతే స్వతంత్రం ఉంటుంది”
” ఆ< నాకిదే పని. ఈవిడని తీసుకెళ్తే ఆవిడని తీసుకొచ్చుకోవడం నాకు తప్పనిసరి అవుతుంది. అదిగాక ఆయన తనవాళ్ళకీ నేను నావాళ్ళకీ పెట్టుకుంటూ పోతే మా పిల్లలకి మిగిలేది ఏంటి?”
” ఒక్క మనిషి…”
” ఒక్క మనిషి కాదు. ఒక వ్యవస్థ. అమ్మకున్నంత బంధుప్రీతి ఎవరికీ లేదు. వదినకాబట్టి ఇన్నాళ్లు భరించింది”
” బావుందే! ఇల్లన్నాక బంధువులు రారా? మనమేం సమాజంలో ఉంటున్నవాళ్లమా లేక వెలిపడ్డామా?”
” ఎవరమ్మా ఆ బంధువులు? బాబాయికీ అత్తలకీ అంత చేసారే, నాన్న పోయాక ఒక్కరేనా వచ్చి నిన్ను ఎప్పుడైనా పలకరించారా? మూర్తి కాస్త పచ్చగా కనిపిస్తుంటే ఇప్పుడు చుట్టరికాలు కలుపుతున్నారు. ఇంకా నువ్వేదో పెట్టడంలేదనీ, మూర్తి చేత పెట్టించడం లేదని వాళ్లకి కోపం. ఇక నా పెళ్ళికి…పదివేలు తక్కువ పడితే అప్పుగా సర్దమని ఈ బంధువులందర్నీ పేరుపేరునా బతిమాలారు నాన్న. ఆఖరికి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తే రమణకి తెలిసి ఆ డబ్బు పంపాడు. నాలుగు ఇచ్చకం మాటలు మాట్లాడేసరికి వీళ్ళందర్నీ కూర్చోబెట్టి వదిన చేత చేయిస్తున్నావు. ఇందులో వెయ్యోవంతు ప్రేమ నీకు కోడళ్ళమీద ఉంటే ఎంతో సంతోషంగా ఉండేదానివి” అంది స్వర్ణ బాధగా.
” అనండి! అనండి. మీ అందరూ మంచివాళ్లే. నేను ఒక్కదాన్నే చెడ్డ దాన్ని. అందర్నీ కష్టపెడుతున్నాను. ఉద్యోగం చేస్తోందని దీని అడుగులకి మడుగులొత్తలేదని మూర్తికి కోపం. కులాంతరం చేసుకున్నాడు, దాన్ని నెత్తికెక్కించుకోలేదని రమణకి కోపం. వాడి విషయం దాచిపెడితేనేకదా నీ పెళ్లి అయింది? లేకపోతే మీ అత్తగారు ఒప్పుకునేదేనా? అసలే నిప్పులు కడిగే ఆచారంగల మనుషులు”
” వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. దాచిపెట్టి చేసినందుకు తర్వాత గొడవలయ్యాయా లేదా? ఇప్పటికీ నా నోరు మూయించడానికి ఆవిడకి అదే ఆయుధం… సరే, రమణా, భార్యా పనికిరాలేదు కానీ వాళ్ళిచ్చిన డబ్బు పనికొచ్చిందేం”
“ఔనే! నేను చెడ్డదాన్ని. స్వార్థపరురాలిని. అందుకే అందరితో దెబ్బలాడి ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. ఇక్కడి నుంచి కూడా పొమ్మంటే
పోతాను. నన్ను చూడటానికి మీరెవరూ రావద్దు. నా బరువు మీరెవరూ మోయద్దు. నేను పోయాక కూడా” విసురుగా అంది లలిత.
స్వర్ణ కోపంగా వెళ్ళిపోయింది.
కమల ఉక్కిరి బిక్కిరి అయింది. రమణ… తల్లి బాధ్యత తనది కాదని చెప్పేసిన రమణ… స్వర్ణ పెళ్ళికని పదివేలు సర్దాడా? అప్పుడు అంత గొడవ చేసి వీళ్లు ఆ డబ్బు ఎలా తీసుకున్నారు? తనని అడిగితే ఇచ్చేది కదా? ఏమిటి ఈ మమతలకీ అభిమాన పౌరుషాలకీ అర్థం? సమాజం ఏ దిశగా ప్రయాణిస్తోంది?
భూస్వాములు మీద రైతులూ కూలీలూ తిరగబడ్డారు.
పెద్దవాళ్లమీద పిల్లలు తిరగబడుతున్నారు.
ఎక్కడ నిరంకుశత్వం ఉందో అక్కడ తిరుగుబాటు జరుగుతోంది. వ్యక్తిత్వాన్ని పరిరక్షించుకోవడం, అందులో భాగమైన బాధ్యతలకోసం
మనుషులు ఉద్యమిస్తున్నారు. అదొక వెల్లువలా కాకుండా చాప కింద నీరులా సాగుతోంది. మరి మానవ సంబంధాలు ఏమవుతాయి? ఒకరికొకరు ఏమీ కానప్పుడు మనిషికంటూ మిగిలింది ఏమిటి? తనకీ లలితకీ మధ్యన ఉన్నది ఏమిటి? హద్దులు దాటని ప్రేమ, అవధులు లేని స్నేహం. అవును. మనిషికి కావలసినవి ఇవే. ఆమెకి తనని ముంచెత్తుతున్న వెల్లువేదో తొలగి పోయినట్టయింది. తేలికగా నిశ్వసించి తన భావాలని లలితతో పంచుకుందామనుకునేసరికి ఆమె అక్కడ లేదు.

మూర్తి కొడుకు హేమంత్ వచ్చాడు నాయనమ్మని చూడటానికి. మూర్తికి ఇద్దరు పిల్లలు. హేమంత్ తండ్రిలా ఉంటాడు, మగపిల్లాడు కాబట్టి లలితకి చాలా ఇష్టం. రేష్మది సుమతి పోలిక. ఆ పిల్లకి లలిత దగ్గర చేరిక లేదు.
హేమంత్ ది ఇంటర్ అయిపోయింది. బిటెక్ కౌన్సెలింగ్ కోసం చూస్తున్నాడు.
” నమస్తే అమ్మమ్మా!” అని కమలని పలకరించాడు.
” నువ్విక్కడ ఉండటమేమిటి బామ్మా? ఇంటికెళ్దాం పద” అన్నాడు అభిమానంగా.
” నేను రాను రా!” కోపంగా చెప్పింది లలిత.
నవ్వాడు ఆ అబ్బాయి. ఆ నవ్వు మూర్తి భావాలని దొంగిలించి రహస్యంగా చూపిస్తున్నట్టు ఉంది.
” సర్లే, రావద్దు. ఇక్కడే ఉండు. బావుందా, నీకు ఇక్కడ?” ఆమె పక్కనే కూర్చుని ప్రేమగా అడిగాడు. ఇద్దరూ నెమ్మదిగా కబుర్లలో పడ్డారు.
లలిత చాలా ఆరాలడిగింది. పనిమనిషి మళ్లీ వస్తోందా! మీ నాన్నే వాషింగ్ మిషన్ పెడుతున్నాడా? బట్టలు ఎవరు ఇస్త్రీ చేస్తున్నారు? మీ అమ్మమ్మ వచ్చిందా? ఎన్నో ప్రశ్నలు. అన్నిటికీ డిప్లమాటిగ్గా నవ్వేసి ఊరుకున్నాడు హేమంత్. చాలాసేపు మాట్లాడి మరోమాటు ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళాడు.
” వాళ్ల బెడ్రూమ్ మీద కూడా ఓ కన్నేసి ఉంచుతావా?” అతను వెళ్ళిపోయాక దిగ్భ్రాంతిగా అడిగింది కమల.” వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇద్దరికీ మధ్యని సవాలక్ష ఉంటాయి. ఆ పిల్ల తను చేసుకోలేని పనులు మూర్తికి చెపుతుందేమో! సాయానికో, పెద్దదయిందనో తల్లిని పిలిపించుకుంటుందేమో! తటస్థంగా చూసీ చూడనట్టు ఊరుకోవాలిగానీ తలదూరుస్తావా? అయినా హేమంత్ ఎవరని వాడిని ఆరాలడుగుతున్నావు? తల్లిమీద నీకు నేరాలు చెప్తాడా?” అని కోప్పడింది.
” వాడు చిన్నప్పట్నుంచి నాకు చేరిక. తల్లి ఏం చేసినా పూసగుచ్చినట్టు చెప్పేవాడు. ఇప్పుడు ఆ మహాతల్లి తన వైపుకి తిప్పుకుంది లే. అయినా నా పక్షమే” అంది లలిత గొప్పగా.
“ఛ… తప్పు కదూ? సుమతికి తెలిస్తే ఎంత బాధ పడుతుంది?”
“నీకు తెలీదులేవే! ఉద్యోగం చేస్తున్నానని దానికి ఎంత గర్వమో! మగవాళ్లు ఇంటి పనులు చెయ్యడం ఎక్కడైనా చూసావా? మావారు ప్రాణం పోతున్నా ఎప్పుడూ గ్లాసుడు మంచినీళ్లు అందించలేదు. అలాంటిది అర్ధరాత్రి దాహం వేస్తోందని మూర్తి చేత నీళ్లు తెప్పించుకుని తాగేసి మళ్లీ గ్లాసు అందించేస్తుంది. నా కళ్ళతో నేను ఎన్నోసార్లు చూశాను, వాడు మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం. పని మనిషి రాకపోతే వాడిచేత వాషింగ్ మిషన్ పెట్టిస్తుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో!” అంది లలిత.
“రోజులు మారాయి లలితా! మనప్పుడు ఆడవాళ్లు ఉద్యోగాలు చెయ్యటం తక్కువ. ఎనిమిది  గంటల కాలం చేతిలో ఉండేది. ఎన్ని పనులు చేసినా ఇంకా ఎంతో కొంత మిగిలేది. పైగా చాకలి, పని మనిషి… ఇలా ఏ పనికి ఆ పనికి మనుషులు ఉండేవారు. పిల్లలకి తల్లికి సాయం చేయటానికి వ్యవధి ఉండేది. ఇప్పుడు ఆ ఒత్తిడి అంతా ఆడవాళ్ళ మీదే పడుతోంది. నీతో సుమతిని పోల్చుకోకు. ఎన్నని చేస్తుంది ఆమె మాత్రం? యంత్రం కాదు కదా? అందుకని భర్తతో పంచుకుంటోంది. ఏదో ఒకలా ఈ బతుకు రథాన్ని లాగటమే పెద్ద బాధ్యత అయిపోయింది. వాళ్ల గోలేదో వాళ్లని పడనీ. నీకెందుకు?” నచ్చచెప్తున్నట్టు అంది.
” మరి నా పెద్దరికం ఎక్కడేడ్చింది?”
” పెద్దరికం అంటే అది కాదు. మూర్తి అన్నట్టు నువ్వొక వ్యాపకం కల్పించుకోవే. వాళ్ళేం చేస్తున్నారో, వీళ్ళేం చేస్తున్నారో అనే విషయాల మీద ఆసక్తి పోతుంది. మూర్తి దగ్గర నువ్వేదో హాయిగా ఉన్నావని ఇన్నాళ్లూ అనుకుంటూ వచ్చాను”
” పోవే! మొగుడూ మొద్దులూ లేకుండా ఒంటి పిల్లరాకాసిలా బతుకుతున్నావు. నీకీ బాధ అర్థం కాదులే!” విసుగ్గా అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయింది లలిత.
కమ్చీ దెబ్బతిన్నట్లయింది కమలకి. గుండెల్లో చివ్వుమని బాధ ఎగిసింది. లలిత… ఎంత మాటంది తనని! దిగ్భ్రాంతిగా అనుకుంటూ అలాగే కూర్చుండిపోయింది. స్నేహితురాలి పట్ల అప్పటిదాకా ఉన్న ప్రేమంతా యిగిరి ఆవిరైపోయి మిగిలిందంతా ఎడారిలా కనిపించింది. నిజమే! తనకేం తెలుసని వాళ్ల వ్యవహారాల్లో కలగజేసుకుంటోంది? బతుకు బండిలో ఎన్నో పండుటాకులు రాలి తన ముంగిట్లో వచ్చి చేరాయి. అందులో లలిత కూడా… అనుకోబోయిందిగానీ గుండెల్లో కలుక్కుమంది. అస్మదీయ భావన… కొన్నిటిని కావాలనిపించేదీ… పూనుకుని కొందరికి రక్షణనిచ్చేదీ… అనవసరమైన బాధ్యతల్ని పెంచేదీ ఇదే! సుదీర్ఘంగా నిశ్వసించింది. దాన్ని ఎలాగైనా జయించాలనుకుంది.
చాలాసేపటికి భుజం మీద చల్లటి చెయ్యి పడితే ఉలిక్కిపడింది. తలతిప్పి చూస్తే లలిత. ఏడ్చినట్టు ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి.            “ఇప్పుడు ఏమైందని?” అప్రయత్నంగా అంది కమల.
సంజాయిషీ ఇస్తున్నట్టు నెమ్మదిగా అంది లలిత.” నా మనసెందుకో ఇలాగే అశాంతిగా ఉంటుంది. అందరినీ నొప్పించాలనిపిస్తుంది. నేను కొంతమందికి మంచిదాన్ని కావచ్చు. ఇంకొంతమందికి చెడ్డదానిని కావచ్చు. కొన్ని విషయాల్లో మంచిగానూ, ఇంకొన్నింట చెడ్డగానూ ఒకే వ్యక్తితో ఉండచ్చు. నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. వాటిని ప్రకటించుకునే వేదిక లేదు. ఏ కోడలి మీదా నాకు పెద్దగా ప్రేమాభిమానాలు లేవు. కారణం రక్తస్పర్శ లేకపోవడమో, సాంప్రదాయిక వైరమో అయ్యుంటుంది. అయితే వీళ్లిద్దరూ తమకి నచ్చిన రీతిలో తమ జీవితాలని గడుపుతున్నారు. నేను… నేను మాత్రం పెళ్లయ్యేదాకా నాన్న పద్ధతుల్నీ, ఆ తర్వాత భర్తవీ, ఇప్పుడు కొడుకు ఇష్టాలనీ పాటిస్తున్నాను.  అలాగని నాలో ఆలోచనాశక్తి చావలేదు. నిరంతరం సంఘర్షణ. ఎందుకు? ఎందుకని ఈ అణిచివేత? ఈ అస్వతంత్రం?” క్రమంగా లలిత గొంతులో ఆవేశం పెరిగింది. అది ఆవేదనగా రూపుదిద్దుకుంటోంది. కమల విస్మయంగా వింది.
” నాకు ఇప్పుడు అరవయ్యేడేళ్లు. ఒంట్లో ఓపిక ఉంది. ఏదో చెయ్యాలన్న తపన ఉంది. చెయ్యటానికి ఇంట్లో ఏ పనీ కనిపించదు. వేళకి అన్నీ తను చేసుకుని వెళ్లిపోతుంది. నాకు చెప్పాలంటే తనకి మొహమాటం. ఏమైనా అనుకుంటాననీ, అంటాననీ భయం. అందుకని తను చేయలేనివి మూర్తికి చెప్తుంది. వాడేనా నాకు చెప్పచ్చు. కానీ చెప్పడు. తనే చేస్తాడు. అంటే వాళ్ళిద్దరూ ఒకటి… నేను వేరు… నాలో అసహనానికి అదే నాంది”
” ఛ… అదేంటి?”
” జీతాలు తెచ్చుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి ఖర్చులు చూస్తే భయం అనిపిస్తుంది. పొరపాటున కూడా ఇంత వచ్చింది, ఇలా ఖర్చు చేస్తున్నాం అని నాతో అనరు. ఏదైనా కావాలంటే చెప్పమ్మా, సుమతో నేనో తెచ్చిస్తాం అంటాడేగానీ ఈ డబ్బు నీ దగ్గరే ఉంచుకో. కావలసినట్టు ఖర్చుపెట్టుకో అనడు. ఆడపిల్లలకి ఏవో కొనివ్వాలని అనిపిస్తుంది. మా మరిదీ, ఆడపడుచులు నా దగ్గర పెరిగినవాళ్లే కదా, వాళ్లకీ ఏవేనా ఇవ్వాలని ఉంటుంది. ఇచ్చి పుచ్చుకుంటేనే కదా చుట్టరికాలు, ప్రేమలు. నా దగ్గర ఏమీ లేదని వుత్తిచెయ్యి చూపిస్తే ఇంకోసారి రారు”
” ఉన్నంతలో పెట్టారు , పెళ్లిళ్ళు చేశారు. నీ దగ్గర లేకపోతే ఏం చేస్తావే?”
“మూర్తికి ఆ అవసరం లేదంటావా? ఎవరి జీవితాలు వాళ్లవి, నన్ను విసిగించద్దంటాడు”
“నీమీద కోపంతో కాదు. నిజంగానే అవసరంలేదని. కానుకలిచ్చి, కాసులు కురిపించి ప్రేమని కొనలేం”
” కానీ అందరూ నావాళ్ళేకదా? పెద్దదాన్నికాబట్టి ఆశిస్తారు. నామాట ఎక్కడా చెల్లుబడి కాదు.”
“…”
“ఏల నన్ను మనసారా ఏడవనీరు? అని కృష్ణశాస్త్రిగారన్నట్టు ఒక్కోసారి గుండె బరువెక్కి ఏడవాలనిపిస్తుంది. ఏడిస్తే ఇంట్లో అంతా కంగారుపడతారు”
” ప్రేమతోటేగా?”
నిర్వేదంగా నవ్వింది లలిత.” ఈ ప్రేమకోసమని ఎన్ని భావాలని చంపుకుంటాం? కాల్లో ముల్లు గుచ్చుకుంటుంది. బాధ మనది. ఒక్కసారి దాన్ని గుండె నిండా ఆస్వాదిస్తే అనుభూతి చచ్చిపోయి అనుభవం ఒక్కటే మిగులుతుంది. అలా కాకుండా చుట్టూ  అందరూ ఉండి ఓదారుస్తుంటే అనుభవంగా మారకుండా బాధ అక్కడే గడ్డకట్టుకుపోయి ఇంకా బాధిస్తుంది. ఈ ప్రేమాదరణలని సంతోషంగా స్వీకరించే వయస్సు దాటిపోయింది నాకు. అన్నీ కృత్రిమంగా అనిపించి, అశాంతిగా వుంటోంది”
“…”
” పిల్లలు నవ్వుకునే విషయాలు… సుమతి సరదాలు… మూర్తికి దాని మురిపాలు… అన్నీ… వాళ్లేం చేసినా చిరచిరగా అనిపిస్తోంది. ఇంత చిన్న విషయాలకి అలా వుబ్బితబ్బిబ్బౌతారేమిటి? ఇవన్నీ ఎవరికి తెలియవుగనుక? ఎవరు అనుభవించలేదుగనుక? సర్వసాధారణమైన విషయాలే కదా? నాలా నిర్వికారంగా ఉండరెందుకు వీళ్లు? అనుభవాలతో పండిపోయిన నన్ను చూసి ఎందుకు నేర్చుకోరు?”
” బావుంది! నీ వయసు వస్తే అలాగే ఉంటారేమో! ఇప్పటినుంచే ముసలాళ్ళలా ఉండమంటావా?”
” అదే నేననేది. సంసారికుల  మధ్యని వుంటూ ఏదీ పట్టనట్టు ఎలా ఉండటం? నాకంటూ ఇల్లు ఉంటే అందులో నేనుంటే వీలుచిక్కినప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్లేవారు. వీళ్ళ సంసారాల్లో నాకు నచ్చని అంశాలు నన్ను అంతగా బాధించేవి కావు”
” అదేంటే? ఈ వయసులో అంతా పిల్లల దగ్గరికి వెళ్లి ప్రశాంతంగా గడపాలనుకుంటారు?”
” పిల్లల దగ్గర ప్రశాంతత! ఎండమావుల్లో నీళ్లు వెతుక్కోవడం!”
చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. కమల ఆలోచిస్తోంది. లలిత చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. ప్రతివారికీ ఒక గూడంటూ ఉండాలి. రెక్కలు వచ్చి పిల్లలు ఎగిరిపోయాక మధ్యలో వచ్చిన బరువులు, బాధ్యతలు, సరదా సంతోషాలు, బాధలు, ఇబ్బందులు తదితరాలన్నీ వాళ్లతోటే వెళ్లిపోగా మనకోసం మిగిలిన అనుభూతులకీ అనుభవాలకి ఆవాసంలా ఉండేది. సమిష్టి కుటుంబాలు అంతరించి వ్యక్తిగత కుటుంబాలు ఆవిర్భవిస్తున్న ఈ రోజుల్లో కుటుంబంలోని కష్టసుఖాల ఒరవడి వెనక తరంవాళ్ళని ఇముడ్చుకోదు. అక్కర్లేని చుట్టంలా పడివుండాలి. అలా ఉండలేక సంఘర్షణ. ముఖ్యంగా లలితలాంటి వితంతువులకు. అలాంటి మనస్తత్వం కలవాళ్లకి. సర్దుకుపోవడం రానివాళ్ళకి. ఇల్లో, సొంత ఆస్థో ఉంటే తన ఆధిపత్యం నిలబెట్టుకోగలిగేదేమో! కనీసం పెన్షన్ వచ్చినా పట్టు ఉండేది కావచ్చు. మూర్తి చెడ్డవాడు కాదు… లలిత కూడా కాదు. ఆమెలో ఉన్న అభద్రతాభావమో, ఆత్మన్యూనతతో ఇద్దరి మధ్యా స్పర్థని లేపింది.
తన తల్లి ఉండేది. తొంభయ్యేళ్ళు బతికింది ఆవిడ. ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఉన్నా ఎవరి దగ్గరికీ వచ్చి ఉండలేదు. ఆఖరికి తన దగ్గరికి కూడా. తాతలనాటి ఇంట్లో ఒక్కర్తీ ఉండి వండుకుతినేది. పొలానికి వెళ్లి వ్యవసాయం చూసుకునేది. రమ్మని ఎవరు ఎంత బతిమాలినా “మీ పద్ధతులకీ నా పద్ధతులకీ కలవదు. ఓపిక ఉన్నంతకాలం ఇక్కడే ఉంటాను. తర్వాత ఎలాగో తప్పదు” అని తిరస్కరించేది.
ఆవిడది చాలా స్వతంత్ర వ్యక్తిత్వం. చేతినిండా వ్యాపకం ఉండటం చేతేమో అనారోగ్యం ఆవిడ జోలికి రాలేదు. కొంత అంతర్ముఖంగా ఉండేదేమో చావుని ముందుగానే తెలుసుకోగలిగింది. ఇంక మూడు రోజులకి పోతుండగా అందర్నీ రమ్మని కబురు పంపింది. అంతా ఆ చుట్టుపక్కలే కాబట్టి
వెంటనే వచ్చేసారు. అప్పగింతలన్నీ పెట్టేసి ప్రశాంతంగా కన్నుమూసింది. ఆవిడ బతికుండగా ఎలాంటి తిరస్కార దూషణలనీ ఎదుర్కోలేదు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండేది. ఆవిడగురించిన జ్ఞాపకాలు  గొప్పగా అనిపిస్తాయి తమకి… దూరపు కొండలు నునుపుగా ఉన్నట్టా? ఆ రోజుల్లో ఆవిడ గురించి ఎంత ఆదుర్దా చెందేవారు తామంతా. పోయాక కదా ఆవిడ కళ్ళు చారెడనిపించాయి!
లలితకేసి నిశితంగా చూసింది. అప్పుడే తనూ ఆలోచనల్లోంచి తేరుకుంటున్నట్టుగా అంది ఆమె.  ” పెద్దదానివయ్యావు, కృష్ణా రామా అనుకుంటూ ఓ వార కూర్చోకూడదా అంటారు అంతా. ఎంత పెద్దదాన్నని? ఎమ్మెస్ సుబ్బలక్ష్మిని నీకా పాటలెందుకు, పెద్దదానివి అయ్యావు, ఓ మూల కూర్చోమని ఎవరైనా అన్నారా? అలాగే ఇందిరాగాంధీని అనగలిగారా? వీళ్లందరికంటే చిన్నదాన్నేగా?… అనలేరు. ఎందుకంటే అందరికీ తమవైన బతుకులు, గమ్యాలు ఉన్నాయి. నాకు అలాంటివి లేవు. నా భర్త నా గురించి ఆలోచించలేదు. నా గురించి నేను ఆలోచించుకోవడం తప్పనిపించింది. ఆ అవకాశం కూడా దొరకలేదు. రమణ అన్నట్టు పిల్లలకీ అన్యాయమే జరిగింది. నాకూను. మా మామగారు బాధ్యతలు తీరకుండా చనిపోతే, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి నాతోపాటు నా పిల్లలు కూడా త్యాగం చేశారు. ఫలితం… నాకంటూ నిలవ నీడ లేకుండా అయ్యింది… మేడలు మిద్దెలు అక్కర్లేదు. తల దాచుకోవడానికి చిన్న చోటు… నాకు నచ్చినట్టు బతకడానికి”
” మూర్తి ఇంట్లో నీకు ఏం తక్కువే?”
” వాడి ఇంట్లో ఆఖరి మనిషిని నేను”
“లలితా!!”
“మరైతే ఇక్కడ ఉంటావా?”
” ఉండగలనా అని” సందిగ్ధంగా అడిగింది లలిత.
” ఆశ్రమం బాధ్యతలు నేను ఒక్కదాన్నే నిర్వహించలేకపోతున్నాను. మేనేజరు కోసంణ ప్రకటన ఇద్దామని అనుకుంటున్నాను. వాళ్లకు ఇచ్చే జీతం నువ్వు తీసుకో. పెద్దగా ఉండదు. ఒక కాటేజీలో ఉండు. నీకు నచ్చినట్టు ఉండు. కానీ ఒక్క విషయం. ఎక్కడ మనం ఉన్నా కొన్ని నిబంధనలు తప్పవు. ఇంట్లో ఉంటే ఒకలా… ఇక్కడ ఇంకొకలా. సంఘర్షించకు. పిల్లలు చెడ్డవాళ్ళు కాదు. వేగంగా మారుతున్న విలువలు, తరాల అంతరం… అంతే! మన గురించి వాళ్లు కూడా అలాగే అనుకుంటారు. ఈ కోణంలోంచి చూడు. వాళ్లకీ నీకూ మధ్యనున్న సంబంధాలు పారదర్శకంగా అనిపిస్తాయి”
” అలాగేలే” అని నవ్వింది లలిత. కమల తనూ నవ్వి కాటేజీ తాళాలు ఇచ్చింది. తాళం తీసుకుని గదిలో అడుగు పెడుతుంటే వెనకటి నిరాసక్తత స్థానంలో ఒక ఉత్తేజంలాంటిది తనలో చోటుచేసుకోవడం గమనించింది. అన్నీ అయిపోయాయనుకుంటే బతుక్కి అర్థమే లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఉందనిపిస్తుంటేనే ఆసక్తి.
( విపుల – జనవరి 2000 మరియు గూడు అనే కథల సంపుటి)

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s