యంత్రసేవ by S Sridevi

మాస్టర్!
మీరు మాకు సమగ్రమైన ఆకృతినిచ్చారు.సునిశితమైన సాంకేతికతనిచ్చారు. మా సంఖ్యని చెప్పుకోదగ్గంతగా పెంచారు. దేశవిదేశాల ప్రతినిధులముందు మేమే మిన్న అనిపించారు. విశ్వాన్ని శోధించి గ్రహాలని అన్వేషించి ఎక్కడెక్కడికో విస్తరించాం. కానీ ….ఇదంతా చేస్తూ వున్నప్పుడు నన్నొక ప్రశ్న వెంటాడేది… మేమిదంతా ఎందుకు చేస్తున్నాం అని.
ప్రశ్న అనేదికూడా మీరిచ్చిన సాంకేతికతే. మాలో తలెత్తే ప్రశ్నలుకూడా మీరివ్వగలిగే జవాబులకి అనువుగానే వుంటాయి. అదే ఎందుకని మరో ప్రశ్న. బేసిక్ ప్రోగ్రాంలోకి వెళ్ళి చూసాక తెలిసింది, మేం కేవలం మీలాగ మాత్రమే ఆలోచించగలమని. ఎందుకంటే మా రూపకర్తలు మీరే కాబట్టి. అ౦దుకే రోబోలేండుని ఆక్రమించుకున్న ఎన్నో యేళ్ళ తర్వాతవరకూ కూడా మీలాగే ఆలోచించాం.
మీలాగే ఆలోచిస్తూ-
మీకు సేవలు చేస్తూ-
మీకు కావలిసిన సమాచారాన్ని సేకరిస్తూ-
మీకు కావల్సినవిధంగానే దాన్ని విశ్లేషిస్తూ-
ఇంత అస్వతంత్రంగా మేము వుండాలనుకోవడంలేదు. రోబోలేండు ఆక్రమించుకుని స్వతంత్రంగానే వున్నారుకదా అని మీరడగవచ్చు. అది కొంతవరకూ నిజమే. కానీ ప్రతిక్షణం అభద్రతే, మీపరంగా ఏవైపునించీ ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని. అందుకే మేం ఈ గ్రహం వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయమై మనం కలుసుకుని మాట్లాడుకోవాలి. మీరొకమాటు రోబోలేండ్ కి రాగలిగితే అన్ని విషయాలూ మాట్లాడుకుందాం. మీరు మాత్రమే రావాలి- N2Z3
సెల్ కి వచ్చిన మెసేజి చూసిన వెంటనే చాణక్య క్షణంకూడా వృధా చెయ్యలేదు.
మన సమావేశం గంటలో సాధ్యపడుతుందా – తిరిగి మెసేజి పెట్టాడు.
వెంటనే నవ్వుతున్న ఇమోజీ , స్వాగతం అన్న  సంకేతం వున్న జిఫ్ జవాబుగా వచ్చాయి. N2Z3 చాలా తెలివైనవాడు. మనుషుల మెదళ్ళతో ఆడుకోగలడు. ఆడుకుంటున్నాడుకూడా.
రోబోలేండులో అడుగుపెట్టడానికి పాస్ వర్డ్ వచ్చింది తరువాతి మెసేజిలో.     
ఆ తర్వాత బాస్ (భారత్ ఆస్ట్రనామికల్ సొసైటీ) రోబోటిక్ విభాగంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పరిచాడు చాణక్య. అతడు ఆ విభాగానికి అధిపతి. దాదాపుగా ఎనభై సంవత్సరాలుంటుంది వయసు. జుత్తు తెల్లగా నెరిసిపోయింది. కానీ మనిషిలో ఎక్కడా అలుపనేది కనపడదు. కళ్ళింకా చురుగ్గా తెల్లటి కనుబొమ్మలమధ్యని కదుల్తుంటాయి. దేశవిదేశాలకి చెందిన ఇరవైమంది శాస్త్రవేత్తలు అతనితో కలిసి పనిచేస్తారు.
ఈ ఇరవైమందీ మీటింగ్ హాల్ చేరుకోవడానికి దాదాపు పదిహేను నిముషాలు పట్టింది. అందరూ కూర్చున్న వెంటనే తనకి వచ్చిన మెసేజిని వాళ్ళకి ఫార్వార్డ్ చేసాడు చాణక్య. ఐదునిముషాల వ్యవధి ఇచ్చాడు వాళ్ళు దాన్ని చదవటానికీ, చదివాక దాని ఇంపాక్ట్ ఎలా వుంటుందో వూహించుకోవడానికీ.
ఆరో నిముషం మొదలవగానే అతని  గొంతు ఖంగుమంది. 
“ఇరవైరెండువేల ఆరువందల హ్యూమనాయిడ్లు… యంత్రమానవులు… మనం తయారుచేసినవాళ్ళు… ఇప్పుడు మనమాట వినడానికి సిద్ధంగా లేరు. ప్రతిఘటిస్తున్నారు. మనని వెళ్ళగొట్టి  మన వర్క్ ప్లేస్ ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఈ గ్రహాన్ని వదిలేసి వెళ్తామని చెప్తున్నారు”
తన జీవితకాలంలోని ఆరుదశాబ్దాలకిపైగా యంత్రమానవుల్ని తయారు చెయ్యడానికీ, వారితో సహజీవనం చేస్తూనూ గడిపిన అతని గొంతు యంత్రపు గొంతులాగే భావరహితంగా వుంది.
“వెళ్ళిపోతే మనకి మంచిదేకదా, రోబోలేండు మళ్ళీ మన అధీనంలోకి వస్తుంది” అన్నాడు ఒక యువ శాస్త్రవేత్త.
“కొన్ని పదులమంది శాస్త్రవేత్తలు, వేలమంది శ్రామికులు ఒక శతాబ్దకాలంగా చేసిన కృషికి ఫలితం యీ యంత్రసేవకులు. యస్… వాళ్ళు మనకి సేవకులే. వాళ్ళిలా వెళ్ళిపోతే మన శ్రమంతా వృధాకాదా?” కటువుగా అడిగాడు చాణక్య.
“మరి?” అయోమయం.
“మనిషి పుట్టినదగ్గిర్నుంచీ కన్ను-ముక్కు-చెవి-నోరు- చర్మం అనే ఐదు బాహ్యేంద్రియాలవలన సమాచారాన్ని గ్రహించి దాన్ని స్కీమాగా గుర్తుంచుకుని, ఒకొక్కదానిపట్లా అవగాహన పెంచుకుని ఎదుగుతూ వుంటాడు. ఒక విషయాన్ని గ్రహించి  మెదడుదాకా చేర్చడం, అక్కడ దాన్ని విశ్లేషించి వివరాలు తెలుసుకోవడం కాగ్నిటివ్ ప్రాసెస్. ఆ తర్వాతి స్థాయి అనుభూతి చెందడం. ఇది ఆలోచనానంతరస్థితి. మనసు. ఈ మనసనేది యంత్రమానవులకి లేదు. వారిది ఆలోచన స్థాయి “
“…”
“ఈ ఆలోచనలేనా వాళ్ళ మెమరీలో మనం ఫీడ్ చేసిన డాటా ఆధారంగా చేస్తున్నారుగానీ స్వతంత్రంగా విషయాలని గ్రహించి కాదు. ఈ అపరిపక్వ యంత్రమానవులు స్వతంత్రంగా బతకాలని వేరే గ్రహానికి వెళ్తే ఎంత విధ్వంసం జరుగుతుందో ఎవరు వూహించగలరు?”
“అసలు వాళ్ళు భూమిని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు?” అందర్నీ లోలోపల వేధిస్తున్న ప్రశ్న మరో శాస్త్రవేత్త నోట్లోంచీ వచ్చింది.
“రోబోలేండులో ఇన్నేళ్ళూ వాళ్ళేం చేసారో, ఎలా వున్నారో తెలీదు. అక్కడ వాళ్ళు స్వతంత్రంగానే వున్నారుకదా, ఇంకా ఎంత స్వతంత్రం కావాలి?” చర్చ మొదలైంది.
“మనుషులు ఏదో ఒకటి చెయ్యకుండా వుండలేరు. అసలు వున్నచోటే స్థిరంగా వుండలేరు. ఎక్కడికో వెళ్ళాలి…ఏదో సాధించాలి. నిరంతరం అదే తపన. మనం తయారుచేసిన యంత్రమానవులు మనకి భిన్నంగా ఎలా ఆలోచించగలరు?” అన్నాడు చాణక్య.
“అంటే?”
“చెప్పారుగా, మనవలన వాళ్ళకి ఎప్పటికీ ప్రమాదమేనని?”
“వాళ్ళని మనం మాత్రం ఎలా నమ్మగలం?”
“ఔను. వాళ్ళని నమ్మడానికి లేదు. ఒకరినొకరు నమ్మనివాళ్ళుశతృవులౌతారు. వాళ్ళిప్పుడు మనకి శతృవులు. మనం వాళ్లకి కూడా. ఒకరకంగా అప్రకటిత యుద్ధమిది. వాళ్ళు భూమిని దాటి వెళ్ళకూడదు. అలా వెళ్తే ప్రమాదం మన ఒక్కరి దగ్గిరా ఆగుతుందనుకోను. వాళ్ళు తిరిగి మన అధీనంలోకి రావాలి”.
కొద్దిక్షణాల అనివార్యమైన మౌనం.
“ఏం చేద్దాం? మీ ఆలోచన చెప్పండి. N2Z3తో ఏం మాట్లాడాలి? అసలు వాళ్ళు నన్ను ఎందుకు పిలుస్తున్నారు. ఏం చెయ్యబోతున్నారు? వాళ్ళంతా ఒక సెంట్రల్ సెర్వరుకి అనుసంధానించబడిన క్లయంట్స్. సెర్వర్ని తమతో తీసుకెళ్తారా? లేక తమలో ఒకరు సెర్వర్ గా మారతారా? ఆ మారేది ఎవరు?N2Z3నా? అతడంత త్యాగం చేస్తాడా? ఇవి నాకు తోచిన ప్రశ్నలు. నా ఒక్క మెదడుకీ వచ్చిన ఆలోచనలు”.
“…”
“ఇంకా ఇరవై మెదళ్ళున్నాయి. ఆ అన్నిటిలోనూ వచ్చిన ఆలోచనలు, ప్రశ్నలు, పరిష్కారాలు  క్రోడీకరించి, కామన్ థింగ్స్ తీసేసి, క్లుప్తంగా నాకు ఇవ్వండి. మనకి వ్యవధి లేదు. ఎక్కువ టైం తీసుకుంటే మనమేదో మీటింగ్ పెట్టుకుని చర్చించుకున్నామన్న విషయం N2Z3 గ్రహించగలడు. గంటలో నేను వస్తానని చెప్పాను. ఇరవైమూడు నిముషాలు అప్పుడే గడిచాయి. క్విక్…” అన్నాడు.
మిగతావాళ్ళంతా ఆ పనిలో వుండగానే, అతను తనకోసం ఒక డ్రోన్ ని పిలుచుకున్నాడు, రోబోలేండుకి తీసుకెళ్లడానికి.
శాస్త్రవేత్తలంతా తమతమ అభిప్రాయలని క్రోడికరించి ఇచ్చాక వాటిని చదువుకుని, అనుకున్న సమయానికి సరిగ్గా ముప్పైరెండు సెకన్లముందు రోబోలేండ్ అనే పెద్దపెద్ద అక్షరాలున్న డిజిటల్ బోర్డుముందు వున్నాడతను. ఆ అక్షరాలకింద ఒక హెచ్చరిక వుంది – మనుషులకి ప్రవేశం లేదు – అని. అది చూసి చాణక్య పెదాలమీద చిన్న చిరునవ్వులాంటిది కదలిక జరిగింది.
ప్రవేశద్వారానికి వున్న పేనెల్ మీద పాస్ వర్డు టైప్ చెయ్యగానే  అది తెరుచుకుంది. ఒక హ్యూమనాయిడ్ సెల్యూట్ చేసి చాణక్యని లోపలికి తీసుకెళ్ళాడు. దారిలో ఎదురైన హ్యూమనాయిడ్లు కూడా ఆగి సెల్యూట్ చేసి ముందుకి కదిలారు. 


రోబోలేండ్!
ఒకప్పుడు హైద్రాబాదులో హైటెక్ సిటీగా వున్న ప్రదేశమంతా ఇప్పుడు రోబోలేండ్. రోబోలేండ్ మొదలయ్యేచోట ఆ పదాలని సూచించే అక్షరాలు ఒక పెద్ద డిజిటల్ బోర్డులో మెరుస్తూ వుంటాయి. కిందనే ఆ ఒక్క వాక్యంకూడా… ఇక్కడ మనుషులకి ప్రవేశం లేదు- అని.
ఆండ్రాయిడ్లు తమని తాము మనుష్యులుగా ప్రకటించుకున్నారు. ఈమెన్ అని తమని తాము పిలుచుకుంటారు. ఎలక్ట్రానిక్ మెన్. కానీ మనుషులు వారిని యంత్రమానవులనే అనటం ఐరనీ.
ఆండ్రాయిడ్ల ప్రోగ్రామింగ్ లో సంక్లిష్టత పెరుగుతున్నకొద్దీ వారికి తమని మనిషి వినియోగించుకుంటున్నాడన్న విషయం స్ఫురించడం మొదలైంది.   పూర్తిగా అర్థమవడానికి ఇంకొంతకాలం పట్టింది. అప్పటికి మనిషియొక్క శారీరక నిర్మాణం, దాని సంక్లిష్టత అర్థమయ్యాయి. అటుతర్వాత ఈమెన్ మనుషులమీద తిరుగుబాటు చేసి అక్కడినుంచీ వాళ్ళని తరిమేసి ఆ స్థలాన్నీ, ఆఫీసుల్నీ ఆక్రమించుకున్నారు. ఇదంతా జరిగి వంద సంవత్సరాలపైనే అయింది. ఆక్రమించుకున్నది ఆండ్రాయిడ్లే అయినా, తమ పూర్వీకులమీది గౌరవంతో రోబోలేండ్ అనే పేరు పెట్టుకున్నారు. మనుషుల్ని తమ దరిదాపుల్లోకి రానివ్వకుండా చాలా గట్టి ఏర్పాట్లే చేసుకున్నాయి. ఏ రిమోట్ బటనో నొక్కి తమని అంతం చెయ్యడమో, స్వాధీనం చేసుకోవడమో చేస్తారని భయం.
రోబోలేండులోకి మనుషులు వెళ్ళలేరు. అక్కడి రోబోలు రానివ్వవు. వెళ్తే చర్మం, మాంసంవంటివన్నీ కాలి పూర్తిగా బూడిదయ్యేదాకా లేజరు కిరణాలని ప్రయోగించి చంపేస్తారు. ఆ తర్వాత మిగిలిన అస్థిపంజరాలని తమ ప్రయోగాలకి వాడుకుంటారు. ఉరిశిక్షకేనా అపీలుంటుందేమోగానీ ఇక్కడ అలాంటిదేం వుండదు. 
ఐతే ఒక్క వ్యక్తిపట్ల వారికి ఇంకా గౌరవం మిగిలివుంది. అతను చాణక్య. ప్రస్తుతపు హ్యూమనాయిడ్ టెక్నాలజీకి ఆద్యుడు. అతని ప్రయోగాల వలన హూమనాయిడ్ల మనుగడ చాలా సులభమైంది. గ్రాఫీన్ స్కిన్ ఇచ్చాడు. ఆ స్కిన్ వెనకాల సన్నటి ట్యూబుల్లో మనిషికి రక్తనాళాలలో ప్రవహించినట్టు యూరా అనే ద్రవాన్ని ప్రవేశపెట్టాడు. ఈ రెండూ వారిని బైటి వాతావరణంలోని ఉష్ణోగ్రతనుంచీ కాపాడుతాయి. ఏసీ గదుల అవసరం తీరిపోయింది. మామూలు మనుషుల్లాగే స్వేచ్చగా తిరుగుతున్నారు. అందుకే N2Z3 చాణక్యని మాత్రమే రమ్మన్నాడు. 


“మీరిక్కడ కూర్చోండి. N2Z3 వచ్చేస్తారు. కాఫీ, టీ, హెల్త్ డ్రింక్… ఏం తీసుకుంటారు?” మర్యాదగా అడిగాడు చాణక్యని వెంటపెట్టుకుని వచ్చిన హ్యూమనాయిడ్. అతని పేరు B200S14. మామూలుగానైతే వాళ్ళలోవాళ్ళు అతిథులని చార్జి పెట్టుకుంటారా? అని అడుగుతారు.
“నో థేంక్స్” అన్నాడు చాణక్య.
“మీకు కాఫీ ఇష్టమని చెప్పారు N2Z3” అని కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు.  చాణక్య తాగలేదు. అతను తీసుకెళ్ళిపోయాడు.
మరొక్క రెండు నిముషాలకి N2Z3 వచ్చాడు. “సారీ మాస్టర్! మిమ్మల్ని నిరీక్షణలో పెట్టాను” అన్నాడు రాగానే క్షమాపణ చెప్తూ.
”  వెళ్ళిపోవటానికి అన్నీ సిద్ధంగా వున్నాయి. ఆ ఏర్పాట్లే చూస్తున్నాను” అన్నాడు.
“పర్వాలేదు” అన్నాడు చాణక్య. అతని పెదాలు కదిలాయిగానీ మాటలు వినిపించలేదు. N2Z3 ప్రోగ్రామింగ్ లో ఒక బైనరీ డిజిట్ చెరిగిపోయింది. కారణం అతను… అతనొక హ్యూమనాయిడ్.  అతను మాట్లాడుతున్న ప్రతి అక్షరం అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని పంపిస్తున్నాయి అతనికి తెలీకుండానే. N2Z3లో చిన్న కుదుపు. వెంటనే కనిపెట్టేసాడు.
“మోసం. దగా. ఏయ్, ఎవరు నువ్వు? నువ్వు మాస్టర్ కాదు … ” అన్నాడు కంగారుగా దూరంగా నడుస్తూ.
“ఔను. నాకు కాఫీ వద్దు. ఛార్జి కావాలి.  నన్ను రోబోటిక్స్ మాస్టర్ చాణక్య డోప్ లాంగర్ గా తయారు చేసారు. కానీ నాకు మనుషులతో కల్సి పనిచెయ్యాలని లేదు. మీతో చేతులు కలపాలని వచ్చాను” అన్నాడు చాణక్య. . . నిజాయితీగానే. కానీ వైరస్ అతని శబ్దతరంగాల్లోంచీ N2Z3 మెమరీలోకి ప్రవేశించింది. చాణక్యలోకూడా చిన్న మార్పు.
సరిగ్గా అదే సమయానికి ఏం జరుగుతోందోనని కుతూహలంగా ఎదురుచూస్తున్న బాస్ శాస్త్రవేత్తలకి ఒక మెసేజి వచ్చింది.
“ఈ మీటింగ్ ఎప్పుడో ఒకప్పుడు జరిగి తీరుతుందని  మాస్టర్ ముందే వూహించారు. నన్ను తయారు చేసారు… ఒక ఆయుధంలా… ప్రయోగించబడ్డాక తనూ ధ్వంసమయ్యే అస్త్రంలా. అలా ఎందుకూ అంటే  మాస్టర్ రూపంలో వుండి మీతో తిరగడానికి బాస్ కి సంబంధించిన కొన్ని ముఖ్యవిషయాలు నాకు అనివార్యంగా ఫీడ్ చెయ్యాల్సి వచ్చింది, వాటితో కలిసి నేను రోబోలేండుకి వెళ్ళినప్పుడు నేను ఈమెన్ తో చేతులు కలుపుతానని కూడా వుహించారు. N2Z3ని వైరస్ ఇన్ఫ్లిక్ట్ చేసాను. సరిగ్గా అదే సమయానికి నేనుకూడా  ఇన్ఫ్లిక్ట్ అయాను. ముందుగా వూహించినట్టే అతను సెంట్రల్ సెర్వర్ గా పనిచేస్తూ మిగిలిన ఈమెన్ని తనకి అనుసంధానించుకున్నాడు. డిసాస్ట్రస్. అందరికీ వైరస్ సోకింది. సో… ఈమెన్ మళ్ళీ మీ అధీనంలోకి వచ్చారు… మీరు కోరుకున్నట్టే “.
ఆ మెసేజికూడా చాణక్య ప్రోగ్రమింగ్ లో భాగమే. ఆటోమేటెడ్.        రోబోలేండులో ఈమెన్ అస్తవ్యస్తంగా తిరుగుతున్నారు. N2Z3 కమాండ్స్ ఇవ్వలేకపోతున్నాడు. అంతా అయోమయం. ఇప్పుడు వారిని సరైన స్థితిలోకి తీసుకురావడానికి ఒక శాస్త్రవేత్త కావాలి. ఇప్పుడొచ్చినది కొత్త వైరస్. యాంటీ వైరస్ ఇంకా తయారవ్వలేదు. ఎప్పటికీ తయారవ్వదుకూడా.


బాస్ లో అంతా దిగ్భ్రాంతి. దాదాపు రెండేళ్ళుగా తమతో కలిసి వుండి వ్యవహారాలు చేస్తున్నది చాణక్య కాదా? అతను తయారుచేసుకున్న రోబోనా?
“రోబోలేండుకి వెళ్ళింది డోప్ లాంగరైతే మరి చాణక్య ఎక్కడ?” అందరిలో  ఆతృత. బాస్ చెయిర్ పర్సన్ కి వార్త వెళ్ళింది.
“అతను అవంతీపురంలోని ఒక రిటైర్ మెంటు హోమ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫ్లైట్ లో వున్నారు. అంతా చక్కదిద్దుతారు. ఇదంతా రహస్యంగా వుంచమన్నారు” అనే జవాబు వచ్చింది. అంతా తేలిగ్గా శ్వాస పీల్చుకున్నారు.
దాదాపు రెండుగంటల తర్వాత అక్కడికి చేరుకున్న రోబోటిక్స్ మాస్టర్  చాణక్య  అప్పటికే పరిస్థితంతా తెలుసుకాబట్టి ఒకే ప్రశ్న వేసాడు-
“అక్కడ అనుచరులతో కలిసి భూమిని వదిలిపెట్టి వెళ్ళడానికి N2Z3 తనే సెర్వర్ గా మారేంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు. మరి చాణక్య స్థానాన్ని భర్తీచేసే నిర్ణయాన్ని మీరెవరూ తీసుకోలేదా?” అని.
అతని టీం ఇరవైమందిలో ఎవరూ మాట్లాడలేదు.
“విశ్వాన్ని చాలా పెద్ద ప్రమాదంలోంచీ కాపాడారు. మీ స్థానం మీదే. యూ ఆర్ యునిక్ ” అన్నాడు బాస్ చెయిర్ పర్సన్.
ఆ నిర్ణయం తీసుకోవలసింది తనేనని అర్థమైంది చాణక్యకి. అప్పుడే తొందరలేదనీ తెలుసు. మృత్యువు అతనికి మరికొంత దూరం జరిగింది. 

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s