లే ఆఫ్ by S Sridevi

(ఆంధ్రభూమిలో 2003 లో ప్రచురించబడి, గుండెలోతు సంపుటంలో చేర్చిన నా కథ)


నాకు సముద్రమంటే చాలా ఇష్టం. సముద్రాన్ని ప్రేమించేవాళ్ళు ప్రకృతినీ దాన్నిబట్టి మనుషుల్నీ, మానవ సంబంధాలనీ ప్రేమిస్తారని నాకో గట్టి నమ్మకం.
నేను చీరాలలో ఒడ్డున ఉన్న పడవలో కూర్చుని చూసిన సముద్రాన్నే జ్వాల రామకృష్ణా బీచ్ లో చూసి మానవ సంబంధాలను మరోలా విశ్లేషిస్తుందని తెలీదు. ఆ తెలీక పోవడానికి కారణం అప్పటిదాకా తనతో నాకు పరిచయం లేకపోవటమే.
విశాఖపట్నంలో తను, గుంటూరులో నేను ఎంసీఏ చేసి ఉద్యోగాల వేటలో హైదరాబాద్ చేరుకున్నాక అప్పుడయింది మాకిద్దరికీ పరిచయం. జ్వాల నాకు శరత్ చంద్రని పరిచయం చేసింది. నేను తనకి వెంకటరత్నాన్ని.
వెంకటరత్నం నాకు బి ఎస్ సి లో పరిచయం. ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసి ఎవరి దారిన వాళ్ళు విడిపోయాక నాకు అతన్ని చూడాలని తీవ్రంగా అనిపించేది. మనసు అతనికోసం తపించిపోయేది.
ఒకరోజు తనే ఫోన్ చేసి చెప్పాడు, తనకి కూడా అలాగే నన్ను చూడాలనిపిస్తోందని.
” ఏం చేస్తున్నావు?” అడిగాడు.
“ఖాళీగా ఉన్నాను”
“ఐసెట్ రాయకూడదూ? నేను ప్రిపేరవుతున్నాను”
“ఇంట్లో ఒప్పుకోరేమో? ప్రైవేట్ గా ఎమ్మే చదవమంటున్నారు మా నాన్న”
“పెళ్లి చేసుకుంటావా!”
“సంబంధాలు చూస్తున్నారు కానీ నాకు ఇప్పుడే ఇష్టం లేదు”
“నువ్వు కూడా ఎంసీఏకి ప్రయత్నించకూడదూ? మరో మూడేళ్లు కలిసి చదవచ్చు”
“ఒక్కచోటే వస్తుందనేముంది?”
“కనీసం కాంటాక్ట్ లో ఉంటాం. నీ పెళ్లి అయిపోతే మనం కలుసుకోవడం ఎలా సాధ్యం?”
“మనం ప్రేమలో వున్నామా?” సందిగ్ధంగా అడిగాను.
“అనుకుంటున్నాను ” సంకోచంగా చెప్పి, “తప్పుగా అనుకోవుగా?” అడిగాడు.
నేను నవ్వేసి ఫోన్ పెట్టేసాను.
అప్పట్నుంచీ ఇంట్లో యుద్ధం మొదలు. ఎంసీఏ చదువుతానని నేను, పెళ్లి చేసి పంపించే పిల్లకి అంత చదువెందుకని అమ్మ.
“నీ భవిష్యత్తు గురించి నీవుగా ఏమైనా ఆలోచించుకున్నావా? డిగ్రీ అయిపోయింది కాబట్టి పెళ్లి చేసి పంపించాలని మా ఉద్దేశ్యం” అన్నారు నాన్న.
“ఎంసీఏ చేయాలనుంది”
“ఎందుకు?”
“అదింకా నేను చెప్పలేను కానీ ఇప్పటినుంచే పెళ్లి చేసుకుని బాధ్యతలు మోస్తూ తిరగాలని లేదు”
“ఈ మూడేళ్లు అవ్వగానే చేసుకుంటావా? మళ్లీ పై చదువులంటే ఒప్పుకోను. అంతేకాదు, పెళ్లి చెయ్యకుండా విదేశాలకు పంపించను” కచ్చితంగా అన్నారు నాన్న. తలూపాను. వెంటనే వెంకటరత్నాన్ని కాంటాక్ట్ చేశాను.
“నీకు లక్ లో నమ్మకం ఉందా?” అడిగాడు.
“ఎందుకు?”
“నాకుంది”
“అయితే నాకూ ఉంటుంది”
“లవ్ ట్యూన్స్ టూ హార్ట్స్ టు వన్ ట్యూన్ అని చాలా సరిగ్గా చెప్పారెవరో” అన్నాడు .
“చెప్పవా, ఎందుకు అడిగావో?”
“మన ప్రేమ ఇంకా బలపడి పెళ్లికి దారితీసేదైతే ఇద్దరికీ ఒకచోటే సీటు వస్తుంది”
“లేకపోతే?”
“పరిస్థితులు బలీయంగా మారి మన ప్రేమని శాసిస్తాయి”
“ఛ…సిల్లీగా మాట్లాడకు”
అతను నవ్వేసాడు. “ప్రతి క్షణం నిన్ను చూస్తూ వుండాలనిపిస్తుంది గీతా! నువ్వు కనిపించని సమయంలో ఎంత ఆందోళన గా ఉంటుందో తెలుసా? నీమీద ఎవరైనా పెళ్లికి ఒత్తిడి చేస్తున్నారేమో, ఏదో ఒక బలహీన క్షణంలో నువ్వు వొప్పేసుకుంటావేమోనని భయపడుతుంటాను”
” నామీద నీకు నమ్మకం లేదా?”
” పల్లెటూరివాడిని గీతా ! మనుషులకన్నాకూడా విధినీ, దేవుడినీ ఎక్కువగా నమ్ముతాను. నాట్లు వేసాక వర్షాలు ఆగిపోయి నేల నెర్రెలు విచ్చుతుంటే ఆకాశంకేసి చూడటం మినహా మరేమీ చెయ్యలేని నాన్న నిస్సహాయతనీ వరికంకులు పొట్ట విచ్చాక వానలు రాకుండా చూడమని అమ్మ దేవుడికి కోళ్లనీ మేకల్నీ మొక్కుకోవడాన్నీ చూసినవాడిని”
నేను బాగా కదిలిపోయాను. అతను కోరుకున్నట్టే నాకు సీటు రావాలని ఆశించాను. అతను చాలా తెలివైనవాడు. అతనితో సమానంగా సీట్ తెచ్చుకోవాలంటే బాగా కష్టపడాలని కష్టపడ్డాను. ఆపైన విమెన్స్ కోటా సహకరించింది. ఇద్దరికీ గుంటూరులో సీట్ వచ్చింది. చూస్తుండగానే మూడేళ్లూ గడిచిపోయాయి.
ఫైనల్ ఇయర్ అవుతూనే అతనికి హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. నేను కూడా హైదరాబాద్ లో జాబ్ చేస్తాననగానే ఇంట్లో గొడవ మొదలు. అప్పటికి నాన్నకి మా గురించి చూచాయగా తెలిసిందనుకుంటా.
” ఎందుకిదంతా? ఎవరికోసం చేస్తున్నావు గీతా?” మెత్తగా అడిగారు. దాపరికం లేకుండా చెప్పాను.
” మన కులం కాదంటున్నావు. కానీ తనుగా నిన్ను ఇష్టపడి ముందుకొచ్చాడంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మ కూడా కాదనదు. నీకు ఎలాంటి సంబంధం వస్తుందోనని ఇంతకాలం భయంగా ఉండేది. ఇప్పుడింక మాకా దిగుల్లేదు. మరి నేను వెళ్లి మాట్లాడి ముహూర్తాలు పెట్టించనా?”
“కొన్నాళ్లు ఉద్యోగం చేశాక.”
“ఏం? వాళ్ల మాటెలా ఉన్నా మనకున్నది మీ ఇద్దరికీ చాలదా?”
” అలాగని కాదు. ఎవరిది వాళ్ళు సంపాదించుకోవటంలోని ఆనందం మాకూ తెలియాలి”
” అప్పటికి మనసు మారి అతను చేసుకోనంటే?”
“అతను కాదనేంత మైనస్ పాయింట్లు నాలో లేవు”
“ఒకవేళ కాదంటే?”
“మీరు చూపించిన వ్యక్తిని చేసుకుంటాను. ఐదేళ్ళ పరిచయం మాది.ఇలాగని ఎవరికైనా తెలుసునా నాన్నా? మా ప్రేమ మా గుండెల్లోనే వుంది.అతను కాదన్నా నాకు చెడ్డపేరు రాదు. కొంత బాధ వుండకుండా వుండదు. దాన్ని నేను అధిగమించగలను. మోసం చేసినవాడికోసం ఏడ్చి బతుకు పాడుచేసుకునేంత తెలివితక్కువదాన్ని కాను నేను. అతను చాలా యాంబిషస్ పర్సన్. విజయం కడపటి అంచుదాకా జైత్రయాత్ర చేసే ఊపులో ఉన్నాడు. పెళ్లి పేరుతో డైవర్ట్ చెయ్యటం నాకిష్టంలేదు.. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి”
“స్టేట్స్ వెళ్తాడటనా? ”
“ఎంసీఏ కి ఇప్పుడక్కడ అవకాశాలు లేవు. తన డబ్బు పెట్టుకుని ఎమ్మెస్ చేసే స్తోమత లేదతనికి. వాళ్లది చాలా సాదా కుటుంబం”
“ఆడపిల్ల ప్రేమలో పడిందంటే ముందు వెనుకలు చూసుకోకుండా ఈ గోతిలో పడుతుందోననే భయం ఉండేది ఒకప్పుడు. తరం మారింది. మగపిల్లల్లాగే మీరుకూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటున్నారు” అన్నారు నాన్న.
“ఇంకొక్క ఏడాది టైమ్ ఇస్తాను” హెచ్చరించారు. చిన్నాన్నగారి ఇంట్లో నన్నుంచేందుకు ఏర్పాటయింది.
అలా ముందు వెంకటరత్నం, తర్వాత నేనూ హైదరాబాద్ చేరుకున్నాక జ్వాల పరిచయమైంది. తన ద్వారా శరత్ చంద్ర. అతను నా ఇమ్మీడియెట్ బాస్ కూడా.

మా కంపెనీ లే ఆఫ్ లిస్టులో శరత్ చంద్ర పేరు ఉంటుందని ఎవరం ఊహించలేదు. అతను కూడా అనుకుని ఉండడు.
చిన్న పిల్లవాడు బలమంతా ఉపయోగించి బెలూన్ వూది అది బాగా సాగాక సరిగ్గా పట్టుకోలేకపోతే గాలిని కోల్పోయి ముడుచుకుపోయినట్లు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా క్రమంగా కుదించుకుపోతోంది. పంతొమ్మిదివందల తొంభైల్లో కంప్యూటర్ హాండ్స్ కి, ఐటీకి ఉన్న అవకాశాలను చూసి అంతా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వెంటపడ్డారు. తమ బలం కొద్దీ దాన్ని వుబ్బించారు. ఇప్పుడది గాలి పోగొట్టుకుని యధాస్థితికి వచ్చేస్తోంది.
ఇంక శరత్ చంద్ర.
యంగ్ అండ్ డైనమిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. యువతీ యువకులందరికీ అతనొక రోల్ మోడల్. వెంకటరత్నానికైతే ఏకంగా ఆరాధ్యదైవమే. మా కంపెనీలో ఎండి దగ్గర్నుంచి హార్డ్వేర్ మెకానిక్ దాకా అందరి నోట్లోనూ అతని పేరే ఆడేది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అతన్నే పిలిచేవారు.
ప్రస్తుతం వర్క్ కల్చరంతా అమెరికన్ స్టైల్లో నడుస్తోందంటే అది అతిశయోక్తి కాదు. గవర్నమెంట్ ఆఫీసుల్లోలా పని విభజన ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లైవ్ ప్రాజెక్ట్ ఇచ్చి డెడ్ లైన్ ఇస్తారు. అలాగే ఒక టీంని కూడా. శరత్ చంద్ర మా టీం లీడ్. ఎవరెంత వర్క్ టైం మిగుల్చుకున్నారన్న దానిమీద వారి సమర్థత నిర్ధారించబడుతుంది. ఇన్సెంటివ్ లు ఉంటాయి. మా కంపెనీ మంచి బూమ్ లో ఉన్నప్పుడు రాత్రి పన్నెండింటిదాకా కూడా చేసేవాళ్ళం. శరత్ చంద్ర మాతోనే వుండేవాడు. అలాంటి శరత్ చంద్ర లే ఆఫ్ అయ్యాడంటే…

నన్ను నేను కంట్రోల్ చేసుకుని అతని చాంబర్లోకి వెళ్ళాను. టేబుల్ మీద రెండు మోచేతులూ ఆన్చుకొని, అరచేతుల్లో ముఖం దాచుకుని ఉన్నాడు. ఒంటి మీద నుంచి వచ్చే పెర్ఫ్యూమ్ వాసన, అతని బట్టలు మెరుపు వెలవెలబోతున్నాయి.
“శరత్! ” పిలిచాను.
అతను నెమ్మదిగా తల ఎత్తాడు. “అంతా అయిపోయింది. ఐ యాం ఆన్ రోడ్స్” అన్నాడు అస్పష్టంగా.
“మీరు లే ఆఫ్ కావడమేమిటి?నమ్మలేకపోతున్నాను”
“ఎస్. నేనే నమ్మలేకపోతున్నాను. నలుగురు స్టాఫ్ తో మొదలైనప్పుడు ఈ కంపెనీలో అడుగు పెట్టాను. అప్పటినుంచి ఇప్పటిదాకా దీని గురించి కృషి చేశాను. కానీ, నేను వర్కర్నే. అందుకే ఈ లే ఆఫ్” అతని గుండెల్లోని ఆవేదన మాటల్లో వ్యక్తమైంది.
“జి ఎం గారిని కలిసారా?”
“ఆయనే స్వయంగా చెప్పారు”
నాకింకేం మాట్లాడాలో తెలియలేదు. అతను మళ్లీ ముఖం చేతుల్లో దాచుకున్నాడు. నేను వచ్చేసాను.
టీమ్ అంతా వచ్చే ఉన్నాము. ఎవరికీ పని ధ్యాస కలగడం లేదు.

“మనం గమనించట్లేదుగానీ ఈమధ్య పని ఒత్తిడి బాగా తగ్గింది. చూశారా?” అన్నాడు జావీద్.
“ఇదివరకటిలా కొత్త ప్రాజెక్టులు ఇవ్వడం లేదు. పాత వర్క్ అప్డేట్ చేయిస్తున్నారు”
“యూఎస్ మళ్లీ రెండు లక్షల మందిని లే ఆఫ్ చేసింది.”
“ వాళ్ల సెనేట్లో బాగా మూవ్ చేస్తున్నారట, ఇమిగ్రేషన్స్ తగ్గించమని”
“సెప్టెంబర్ 11 ప్రభావం బాగా ఉంది. మొత్తం ఆసియావాళ్ళనే ద్వేషిస్తున్నారు వాళ్లు”
“మనం బెంచిలో ఉన్నామా?” ఎవరిదో ప్రశ్న అప్పటిదాకా అస్పష్టంగా, పొగమంచులా పరుచుకుని ఉన్న భయం ఒకచోట పోగై గుండెల్లోకి చేరుకున్నట్టు చల్లటి భావన నన్ను వణికించింది.
ఒరాకిల్ మ్యాథ్యూస్, సి ప్లస్ జావీద్, ఆటో కాడ్ మూర్తి… అందరూ వెలిసిపోయిన బొమ్మల్లా కనిపించారు. శరవేగంతో మారిపోయే ఈ ఫీల్డ్ లో ఎవరికి ఏ లాంగ్వేజ్ మీద, ఏ ప్రోగ్రాం మీద ఎంత పట్టు ఉన్నా ఖచ్చితమైన స్టేచర్ ఉండదనే భావన ముల్లులా గుచ్చుకుంది.
” కంపెనీ మూసేస్తారేమో!” మ్యాథ్యూస్ అన్నాడు.
“ఛ… కాదేమో. శరత్ చంద్ర లాంటివాళ్ళంటే వైట్ ఎలిఫెంట్స్ . యాభైవేల జీతం, పెర్క్స, ఏసీ చాంబరు, లాప్టాప్… ప్రాజెక్టులు లేనప్పుడు ఇంత ఖర్చు దేనికని పంపించారు. మన దేముంది? అతనికిచ్చేదాంతో పది మందిని మెయింటెన్ చెయ్యొచ్చు” ఖండించాడు జావిద్.
” పిక్ అప్ అయ్యాక మళ్లీ స్టాఫ్ కావాలంటే ఎక్కడినుంచి వస్తారు?” సమర్థించాడు మూర్తి.
ఎవరికీ ఉన్న ఉద్యోగం వదులుకోవాలని లేదు. ఇక్కడే ఉండి ఇంకొంచెం ఎదగాలని కోరుకుంటున్నారు. రెండున్నరేళ్ల బాల్యం నుంచి మొదలుపెట్టి ఇరవయ్యేళ్ల వయసుని ఖర్చుపెడితే వచ్చిన ఎంసీఏ డిగ్రీతో వచ్చిన ఉద్యోగానికి స్థిరత్వం లేకపోవడంలో ఉన్నంత వ్యంగ్యం ఇంకెక్కడా లేదు. పోయేది ఉద్యోగం ఒకటే కాదు, ఆత్మవిశ్వాసం కూడా.
వెంకటరత్నం గుర్తొచ్చాడు. వారం రోజులు సెలవు పెట్టి వాళ్ల ఊరు వెళ్ళాడు. శరత్ చంద్ర విషయం తెలిస్తే ఎంత కిందుమీదులౌతాడో! వాళ్ళ కంపెనీ కూడా డల్ గానే ఉందిట. వాళ్ల దగ్గర కూడా లే ఆఫ్ లు అవుతున్నాయి. కళ్ళ ముందు ఇన్ని మార్పులు వస్తున్నా అతనికి ఈ ఫీల్డ్ అంటే ఉన్న క్రేజ్ తగ్గదు. వినూత్నమైన మార్పేదో ప్రభంజనంలా వచ్చి చుట్టుముడుతుందని నమ్ముతాడు.
నేను ఆలోచనల్లో ఉండగానే శరత్ చంద్ర తన పర్సనల్ ఫైలు, సర్వీస్ సర్టిఫికెట్ తీసుకుని కారు తాళాలు ఇచ్చేసి మా ముందునుంచే వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత మా ఇంటికి నిమ్స్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ సమయానికి నేను అక్కడే ఉండటం అత్యంత విషాదకరమైన విషయం.
” శరత్ చంద్ర గారికి హార్ట్ ఎటాక్ వచ్చింది. మా దగ్గర అడ్మిట్ అయ్యారు” అన్న నిమ్స్ ఫోన్ కాల్ కి-
” అతనిప్పుడు మా దగ్గర ఎంప్లాయి కాదు” అని మా ఎండీగారి జవాబు.
కార్పొరేట్ ప్రపంచంలో మనిషి విలువ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో నా మనసులో విషపు సూదితో గుచ్చినట్టు ఇంకింది.
నిజానికి ఇంత నిక్కచ్చిగా ఉండాల్సిన అవసరం ఏముంది? మనిషికీ మనిషికీ మధ్యనుండే సంబంధాలు కొత్తరూపాన్ని దిద్దుకుంటున్నాయి. మనిషి పైకొచ్చి ఒక స్థాయిని చేరుకోవడానికి తన శక్తిని మించి కష్టపడుతున్నాడు. చేరుకున్నాక అక్కడి అస్థిరత్వం అతనిలోని మానవీయతను దెబ్బతీస్తోంది. శాడిజం నిద్ర లేస్తోంది. ఇప్పటి ఈ పరిస్థితిలో మా ఎండీయేనా అంతే, ఇలాంటి మరో సందర్భంలో శరత్ చంద్ర అయినా అంతేనేమో!
ఇంతకీ ఎందుకు వచ్చింది అతనికి హార్ట్ ఎటాక్? లే ఆఫ్ కావడాన్ని తట్టుకోలేకపోయాడా? జ్వాల వచ్చిందా? లేక ఆమెకి చెప్పేంత టైమ్ కూడా లేదా? ఒంటరిగా మృత్యువుతో పోరాడుతున్నాడా? ఒక వ్యక్తి తనంతట తనే హార్ట్ ఎటాక్ ని గుర్తించి హాస్పిటల్లో చేరడం కన్నా పెద్ద విషాదం ఇలా తృణీకరించబడటం. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
వెంటనే అతన్ని చూడాలనిపించింది. స్నేహం, కృతజ్ఞత, అభిమానం, ప్రేమ… ద్వేషం కూడా. ఇవేకదూ, అనుబంధాలంటే? ఏమీ కానట్టు తటస్థంగా ఉండడం కన్నా ద్వేషించడమే ఒక్కొక్కప్పుడు మంచిదేమో.
” సర్! లీవు కావాలి” అన్నాను ఎండీతో.
” నిమ్స్ కా? శరత్ చంద్రను చూడటానికా? వెళ్ళగానే ఫోన్ చెయ్యి ఎలా ఉన్నాడో. వీలుంటే నాకోసారి ఫోన్ ఇవ్వు మాట్లాడతాను” అన్నాడు ఆయన వెంటనే సెలవు మంజూరు చేసి.
తలూపి బయటపడ్డాను. నిమ్స్ చేరుకునేసరికి శరత్ చంద్ర ఐసీసియూలో ఉన్నాడు… ఒంటరిగా, నిద్రలో. డ్యూటీ డాక్టర్ తో మాట్లాడాను.మైల్డ్ ఎటాక్ అనీ, సర్జరీ అవసరం ఉండకపోవచ్చనీ, అయినా ఇరవైనాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉండాలనీ చెప్పాడు. అందుకే ఐసీసియ్యూలో ఉంచారట.
” అడ్వాన్స్ కట్టారా?” రిసెప్షన్ లో అడిగాను.
” క్రెడిట్ కార్డ్ ఇచ్చారు” రిసెప్షనిస్ట్ చెప్పింది. మళ్ళీ వచ్చి సిస్టర్ ని అడిగాను, మెలకువ ఎప్పుడు వస్తుందని. చెప్పలేకపోయింది. అతను లేచేదాకా అక్కడే వుండి నేను చేసేదేమిటో తెలియలేదు. అలాగని వదిలేసి వెళ్ళలేకపోయాను.
శరత్ చంద్ర తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటారు. వాళ్ల ఫోన్ నెంబర్లు నాకు తెలీదు. అసలతనిగురించి నాకే వివరాలూ తెలీవు, జ్వాల చెప్పినవి తప్ప. జ్వాల ఇక్కడెందుకు లేదు? తెలీదా ఇంకా? తెలియకుండా ఎలా ఉంటుంది? లే ఆఫ్ విషయాలు చాలా తొందరగా తెలిసిపోతాయి. తనకి ఫోన్ చేశాను. సెల్ స్విచ్ఛాఫ్ లో ఉంది.
దాదాపు రెండు గంటల తర్వాత శరత్ చంద్ర కి మెలకువ వచ్చింది. అద్దాల తలుపుల్లోంచి నన్ను చూసిన అతని కళ్ళలో విస్మయం. పల్చటి కన్నీటి పొర. ఆ తర్వాత పెదాల మీద చిన్న చిరునవ్వు. లోపలికి రమ్మన్నట్టుగా చెయ్యి ఊపేడు.
చెప్పులు విడిచి లోపలికి అడుగుపెట్టాను.అతన్నలా చూస్తుంటే చాలా బాధనిపించింది. ముప్పయ్యైదేళ్ళ వయసు ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
” నీకెలా తెలిసింది?”
” ఎలా ఉంది?”
” ఐ యాం ఓకే. పెర్ఫెక్టులీ ఓకే. పంజాగుట్ట దగ్గర ఒక ఫ్రెండుంటే
వాడిని కలవాలని వస్తున్నాను. ఉన్నట్టుండి చెస్ట్ పెయిన్ మొదలైంది. చెమట కూడా పట్టింది. వెంటనే వచ్చి జాయినయ్యాను” అన్నాడు. అతనేదో దాస్తున్నాడనిపించింది. నా దగ్గర చెప్పలేకపోతున్నాడా? ఏంటది?
” జ్వాలకి తెలుసా?” అసంకల్పితంగా అడిగాను. అతని ముఖంలో నవ్వు మాయమైంది.
ఏదో జరిగింది. ఏం జరిగింది? ఉద్యోగం పోవటం అనేది ప్రైవేట్ సెక్టార్లో చాలా సాధారణం. దానికి అప్సెట్ అయి హార్ట్ ఎటాక్ తెచ్చుకునేంత సున్నిత మనస్కులు సాధారణంగా ఉండరు. ఇంకా ఏదైనా జరిగిందా?
“మీవాళ్లకి తెలిసిందా?”
తలూపాడు.
“రేపటికల్ల వచ్చేస్తారేమో!” అన్నాడు.
” గీతా! నీకెలా తెలిసింది? అడిగాడు తనే మళ్ళీ.
“ఎండీకి నిమ్స్ నుంచీ ఫోన్ వచ్చింది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆయన చెప్పాడు”
” ఐ సీ”
సిస్టర్ వచ్చింది.” మీరింక వెళ్ళండి మేడం” అంది.
” అటెండెంట్?” సందిగ్ధంగా అడిగాను.
” ఐసీసియూలో ఎవరినీ ఉండనివ్వరు”
నేను శరత్ చంద్రకేసి చూశాను.” నాకేం పర్వాలేదు. వెళ్లు గీతా! ” అన్నాడు.
” ఏం జరిగింది? ఏదో దాస్తున్నారు” అన్నాను. అతను ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. సిస్టర్ నేనెప్పుడు వెళ్తానా అన్నట్టు అక్కడే నిలబడి చూస్తోంది. ఉండమన్నట్టా, వెళ్ళమన్నట్టా? అతని అభిప్రాయం? ఏమైనా చెప్పాలా?
చప్పుని నా చెయ్యి పట్టుకున్నాడు.”నాకో సాయం చేస్తావా?” ఆర్తిగా అడిగాడు.
” చెప్పండి”
అతను చెప్పలేకపోతున్నాడు. అదోలాంటి ఇబ్బంది.
” ప్లీజ్! మరేం పర్వాలేదు, చెప్పండి” అన్నాను.
” రెండుసార్లు జ్వాలకి ఫోన్ చేసి నా పరిస్థితి చెప్పబోయాను. తను బిజీగా ఉన్నానని చెప్పి కట్ చేసేసింది. మళ్లీ తీయాలంటే… ఉ<హు<… నా వల్ల కావట్లేదు” అన్నాడు ముఖమంతా ఎర్రబడుతుండగా. జ్వాల ఏదో బిజీలో ఉండి సరిగ్గా వినిపించుకొని ఉండదు. ఇతను చిన్నబుచ్చుకున్నాడు. ఇతననే కాదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా ఇలానే అనుకుంటారు.
“ జ్వాల నిజంగానే ఏదో హడావిడిలో ఉండి ఉంటుంది. అందుకే సరిగ్గా వినిపించుకుని ఉండదు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. మీరు వెళ్ళమన్నట్టు కాక, నా అంత నేనే వెళ్లినట్టు వెళ్తాను. సరేనా?” అడిగాను
” థాంక్స్” రిలీఫ్ గా అన్నాడు. ఇంకా నా చేతిని వదిలిపెట్టలేదు.” గీతా! నేనెవర్నని, ఏమౌతానని ఇంత శ్రమ తీసుకుంటున్నావు?”
” శ్రమ ఏముంది? ఫ్రెండ్ కాబట్టి చేస్తున్నాను. మరి వెళ్లనా? సాయంత్రం మళ్ళీ వస్తాను. ఈలోగా ఏం కావలసినా నా సెల్ కి చెయ్యండి” చెప్పాను.
” టెన్షన్స్ ఉండకూడదని ఆయన దగ్గర్నుంచి ఫోన్ తీసేసుకున్నాం. మీ నెంబరు రిసెప్షన్ లో ఇచ్చి వెళ్ళండి. అవసరమైతే కాంటాక్ట్ చేస్తాం” అంది సిస్టర్ నాతోపాటే నడుస్తూ.
నేను రిసెప్షన్ లో నెంబర్ ఇచ్చి బయటకి నడిచాను. ఆ వెళ్ళటం జ్వాల ఆఫీసుకి . కానీ తను లేదు. నేను వస్తే ఇమ్మందని చిన్న ఉత్తరం ఇచ్చింది తన పక్క సీట్లో కొలీగ్. అంతా అసహజంగా ఉంది. మడత విప్పి చదవసాగాను.
గీతా!
నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని తెలుసు. నన్ను ఎలాగైనా వెంటబెట్టుకుని వస్తానని శరత్ కి మాట కూడా ఇచ్చి ఉంటావు. లెటర్ చదువుతుంటే టైంకి నేను మా ఊరు వెళ్లే రైల్లో సగం దారిలో ఉంటాను. దీన్ని పారిపోవడం అంటారా? అననీ . బాధపడను. నా స్థానంలో శరత్ ఉన్నా మరో ఆలోచన లేకుండా అతను చేసేది కూడా ఇదే. ఐ యాం సారీ.
ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో అతనికి మరో జాబ్ రావడం కష్టం. చిన్న చిన్న ఉద్యోగాలు అతను చేయలేడు. అతని అర్హతకీ , అనుభవానికీ తగిన ఉద్యోగం రాకపోయినా, నేను చేస్తూ తను చెయ్యకపోయినా అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలవుతుంది. ఇప్పటికే కెరీర్ కోసం ఏడేళ్లు ఆగాము. ఎక్కడ బయలుదేరామో మళ్ళీ అక్కడికే చేరుకున్నామనిపిస్తోంది నాకైతే. చదువుకైన లోను, బాధ్యతలు తీర్చుకుని, ఇల్లు, కారు… అన్ని అమర్చుకున్నాక తర్వాత ఎంజాయ్ చేయడానికి ‘ పెళ్లి’ అనేది శరత్ చంద్ర సిద్ధాంతం. నన్ను ప్రేమించడానికి అతను ఉండి ఎలాంటి బాధ్యతలూ లేకుండా ఉండడం నాకూ బాగానే ఉండేది.
కానీ అతనితో పెళ్లి ప్రస్తావన తెచ్చాక, అతను తన కలల గురించి చెప్పాకే నేనీ కేర్ ఫ్రీ లైఫ్ ని ఎంజాయ్ చేయడం ప్రారంభించాను. ఇదంతా సముద్రం ఒడ్డున నిలబడి కెరటాలు తగ్గాక స్నానం చేయాలనుకోవడంలాంటిది. పెళ్లిని కష్టసుఖాలనుంచీ, బాధ్యతలనుంచీ వేరుచేసి చూడటంకూడా అలాంటిదే.
గీతా!
ఇద్దరు మగవాళ్ళు స్నేహంగా వుండచ్చు. ఇద్దరు ఆడవాళ్ళు స్నేహంగా వుండచ్చు. ఆడా మగా కూడా స్నేహంగా వుండచ్చు. కానీ ప్రేమికులు అలా వున్నారంటే వాళ్ళలోనో వాళ్ళ ప్రేమలోనో ఏదో లోపం వున్నట్టే.
మేము ఒకరినొకరు ఇష్టపడ్డాం.పెళ్లి చేసుకోవాలనున్నాం. అదొక వప్పందం. మేం కెరీర్ గురించీ, భవిష్యత్తు గురించే మాట్లాడుకునేవాళ్ళం. అతనెప్పుడూ నా అందాన్నీ, కోమలత్వాన్నీ ప్రశంసించలేదు. తన చూపుల్తోగానీ, స్పర్శతోగానీ నాలో స్త్రీత్వాన్ని తట్టి లేపలేదు. నేనొప్పుకుంటే మామధ్య ఎఫేర్స్ వుండేవేమో. పెళ్లికిముందు నాకలాంటివి ఇష్టం లేదు.
గీతా! ఈ ఆటలో నేను అలిసిపోయాను. నాకు స్థిరపడి సుఖంగా బతకాలని ఉంది. ఇతనితో ఇప్పుడెలా ? అప్పుడే మా పెళ్లై ఉంటే అది వేరు…
నా చేతిలోని ఉత్తరం జారిపోయింది. వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయాను. జ్వాల మనసు విరిగిపోయింది. శరత్ చంద్ర ఎంత నైరాశ్యంలో కూరుకుపోయాడో అంతకంటే ఎక్కువ నిరాశలో తనుంది.
” జ్వాల నిర్ణయం సరైనదే. పెళ్లంటూ చేసుకుంటే ఎప్పుడో చేసుకోవాల్సింది. ఉద్యోగం లేక, ఆరోగ్యం లేక ఇప్పుడింకేం పెళ్లి అతన్తో?” అంది జ్వాల కొలీగ్.
జ్వాల చేసింది సరైనదో కాదో కానీ సందర్భం మాత్రం ఇది కాదు. అతనికి తగ్గి డిస్చార్జ్ అయ్యాక ఇద్దరూ కలిసి చర్చించుకుని విడిపోవాల్సింది. ఎందుకింత తొందరపడింది? నా తల వేడెక్కిపోతోంది. లెటర్ తీసుకుని ఇంటికి వచ్చేసాను.
ఆలోచనలతో మెదడు మొద్దుబారిందో, లేక అలసటతో నిస్త్రాణే కలిగిందో, ఫోన్ రింగ్ అవుతుంటే మళ్లీ బాహ్య స్పృహ కలిగింది.
శరత్ చంద్ర!
ఏమీ మాట్లాడలేకపోయాను. నా మౌనాన్నిబట్టి తనే అంతా గ్రహించాడు. అతనివైపునుంచి కూడా కొంత మౌనం. తర్వాత-
” జాబ్ పోవడంకన్నా పెద్ద లే ఆఫ్ ప్రేమికుడి పోస్టులోంచీ తొలగించబడటం” అనేసి పెట్టేసాడు.
ఏడుపు ముంచుకొచ్చింది నాకు. పెద్ద సుడిగాలిలో కొట్టుకుపోతున్న గడ్డిపోచలా గిజగిజలాడాను. ఈ సుడిగాలి నన్నెటు తీసుకెళ్లబోతోంది? వెంకటరత్నంతో పరిచయం పెరగకపోతే ఈపాటికి అమ్మవాళ్ళు చూపించిన పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లినయ్యేదాన్ని. అమ్మతో కబుర్లు చెప్తూ అమాయకంగా ఉండేదాన్ని. వెంకటరత్నం నన్ను హైదరాబాద్ చేర్చాడు. అక్కడ చీరాలలో జీవితమంటే మనుషులు, మమతలు. ఇక్కడ? కెరీర్, డబ్బు, తెలివి కలిస్తే మనిషి. దానిని అనుసంధానించుకుని జీవితం. మానవ సంబంధాలలో సుశిక్షితమైన మనసు నడిపించినట్లు కాకుండా బాహ్య విషయాలు ఆ జీవితాన్ని నడిపిస్తాయి. ఎటు, నా తదుపరి ప్రయాణం? ఏడ్చేశాను.

శరత్ చంద్ర చాలా గమ్మత్తుగా త్వరగా రికవర్ అయ్యాడు. కానీ వెనకటి మనిషి కాలేదు. జరిగిన దానంతటికీ తక్షణ పరిణామంలా నా పెళ్లి వెంకటరత్నంతో జరిగిపోయింది.
పెళ్లికి అతను వచ్చాడు. మమ్మల్ని దీవించాడు. అతనిలో చాలా మార్పు. నిన్నటి డైనమిక్ యంగ్ హీరో కాదు. ఎవరికీ రోల్ మోడల్ కాదు.
మళ్లీ హైదరాబాద్ వచ్చాను… వెంకటరత్నంతో కలిసి. పెళ్లికి ముందు ఇద్దరిలోగల ఇండివిడ్యువాలిటీ తగ్గింది. ఒకరి కోసం ఒకరం సర్దుకుంటున్నాము. ఒకరికొకరం మళ్లీ కొత్తగా పరిచయమైనట్టున్నాం. అప్పటిదాకా నన్ను తాకనివాడల్లా చనువుగా దగ్గరికి తీసుకుంటాడు. ఏవో చెప్తాడు. ఇద్దరి మధ్యా హద్దులు చెరిగిపోయాయి . అతని స్పర్శలో నాకెంతో ప్రేమ, సౌఖ్యం దొరుకుతాయి. అతని గుండెల్లో తలదాచుకుని పడుకుంటే స్వర్గం ఎక్కడో లేదనిపిస్తుంది. మేం విడివిడిగా ఉంటూ ప్రేమించుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా! జ్వాల పొందలేకపోయింది దేన్నో అర్థమయింది.
శరత్ చంద్ర తల్లిదండ్రుల దగ్గరికి ఢిల్లీ వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. నాలుగైదు ఇంటర్వ్యూలు చేశాడుగానీ సంతృప్తిగా లేదట.
” లక్ష దాకా ఎదిగిన నేను మళ్లీ ఏ పదివేల దగ్గరో ప్రారంభించలేను . నా ఎక్స్పీరియన్స్, బ్యాక్ గ్రౌండ్ చూసి అలాంటి ఆఫర్స్ కూడా ఎవరూ ఇవ్వలేకపోతున్నారు. అక్కడికి వెళ్లి ఆలోచిస్తాను” అన్నాడు.
హైదరాబాద్ వీధులు, ట్యాంక్ బండ్ చిన్నబోతున్నాయి. ఆ వెలితి నన్నూ ,వెంకటరత్నాన్నీ బాధిస్తోంది. ముఖ్యంగా శరత్ చంద్రని చూసినప్పుడు.

శరత్ చంద్ర ఢిల్లీ వెళ్లే రోజు నేనూ, వెంకటరత్నం స్టేషన్ కి వెళ్ళాము. ఇంకా చాలామంది వచ్చారు సెండ్ ఆఫ్ చెప్పడానికి.
రైలు కూత కూసి కదలడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు అన్నాడు శరత్ చంద్ర నేనడగని ప్రశ్నకి జవాబుగా,” జ్వాల డిపెండెంట్ వీసా మీద స్టేట్స్ వెడుతోంది”. చప్పున అతని ముఖంలోకి చూశాను.
శరత్ చంద్ర చెప్పింది విని అదోలా నవ్వాడు వెంకటరత్నం.
” అమెరికాని మనకి పరిచయం చేసింది కొలంబస్. అక్కడికి మనని తీసుకెళ్లే విమానాన్ని కనిపెట్టింది రైట్ బ్రదర్స్. వీళ్లంతా మగవాళ్ళే. అంతేకాదు, కంప్యూటర్ను కనిపెట్టిన బాబేజీ, మైక్రోసాఫ్ట్ త్రిశంకు స్వర్గపు అధినేత బిల్ గేట్స్ కూడా మగవాళ్ళే. ఏం చేసినా మగవాళ్ళే చేస్తారు” అన్నాడు.
” గీత నీకోసం ఎంసీఏ చదివింది. అవసరం లేకున్నా హైదరాబాద్ వచ్చింది” అన్నాడు శరత్ చంద్ర.
” ఇప్పుడు జ్వాలని డిపెండెంట్ గా మార్చింది కూడా ఒక మగవాడే”
” ఒక్కరు కాదు, ఇద్దరు… నేను కూడా. నేనేనేమో! అయితే ఒక్కరే. ఇద్దరు కాదు” అన్నాడు. అన్నాక శరత్ చంద్ర కళ్ళలో నీళ్లు నిలిచాయి.
గ్లాసెస్ జేబులోంచి తీసి పెట్టుకుని రైలెక్కేసాడు. ఆ తర్వాత రైలుతోపాటు కనుమరుగైపోయాడు

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s