బేబీ ఆఫ్ అర్చన by S Sridevi


( విపుల – మే 1999, గుండెలోతు కథలసంపుటి)
బేబీ ఆఫ్ అర్చన…
ఐదునెలల మృతశిశువు…
ఆపరేషను బల్లమీద నిర్జీవంగా పడి ఉంది.
ఐదు నిమిషాలక్రితందాకా కదులుతూనే ఉన్న ముద్దొచ్చే చిన్ని ప్రాణి.
బేబీ ఆఫ్ అర్చన గుండెకి చిల్లుంది. మెటర్నిటీ వార్డునుంచి కార్డియాలజీ వార్డుకి పంపించారు. శిశువుకి ఆపరేషన్స్ చెయ్యాలి. డాక్టర్ రావు చేశాడు. కానీ మొదటి ఆపరేషనే విజయవంతం కాలేదు.
అర్చన!  ఈ శిశువు కోసం ఏడ్చేది.  తపన పడేది. నేనేం పాపం చేస్తే ఇలా జరిగిందని శోధించుకునేది. తనని కలవడానికి వచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో గుండ్రటి నీటి అలలు కదిలేవి. దుఃఖానికి సూచనగా ముక్కు కొన ఎర్రబడేది. కొడుక్కి ఆయువు పోసే దేవుడిలా తనని భక్తిగా చూసేది. కనబడగానే రెండు చేతులూ ఎత్తి జోడించేది.
అక్కడికీ ఆమె భర్తతో  అన్నాడు, ” పిల్లవాడు బతకడం కష్టం ఇంత డబ్బు ఖర్చుపెట్టి ఆపరేషన్ చేయడం అనవసరం” అని. అతని పరిస్థితి చూశాక అలా చెప్పక తప్పింది కాదు. స్టేట్ గవర్నమెంట్‍లో చిన్న ఉద్యోగం. గవర్నమెంటు కొంత భరించినా అతనికీ  ఖర్చు తప్పదు.
దానికి అతను నిర్వేదంగా నవ్వి-
“వాడు పుట్టకుండా చనిపోతే ఒక్కేడుపు ఏడ్చి వూరుకునేవాళ్ళం.  మా కళ్ళముందు వాడు నరకయాతన పడుతుంటే చూస్తూ ఎలా వూరుకోగలం  సార్? డబ్బు అంటారా, బండి నడిచినంతకాలం నడుస్తుంది. ఆపైన భగవంతుడి దయ. బాబు  అదృష్టం.  మా ప్రాప్తం” అన్నాడు.
తనకి ఇవన్నీ రొటీన్. అయినా సరే అంతరాంతరాళాలలో చిన్న కదలిక . బహుశా అది కమలిని ప్రభావం కావచ్చు. రావు తల బలంగా విదిలించాడు. ఆ ఐదు నెలల మృతశిశువుకోసం అతను అంతగా అప్సెటవ్వడం చూసి థియేటర్ లోని ఇతర సిబ్బంది ఆశ్చర్యపోయారు.

అది ఒక యాంత్రిక వాతావరణం. బతికున్న మనిషి గుండెని తెరిచి కదలికలు సృష్టించడం, కొట్టుకుంటూ ఉన్న గుండె హఠాత్తుగా  ఆగిపోవడం చూడటానికి అలవాటు పడిపోయినవారు వీళ్లంతా.  
రావు అలా అంతర్ముఖుడై వుండడం అక్కడి వారికి మరోలా అర్థమైంది. ఆపరేషన్ ఫెయిలైనందుకు బాధపడుతున్నాడనుకున్నారు.
“టేకిట్ ఈజీ” తోటివారినుంచి ఒక చిన్న ఓదార్పు.
ఆలోచనల్లోంచి తేరుకున్నాడు. నెమ్మదిగా థియేటర్‍లోంచి బయటికి అడుగుపెట్టాడు. విజిటర్స్‌లాంజిలో కూర్చున్న బేబీ తల్లిదండ్రులు అతన్ని చూడగానే గమ్మున దగ్గరకు వచ్చారు. అర్చన మొహం చూడటానికి తప్పు చేసినట్టు అనిపించింది . తన బేబీ బతకదని తెలిసీ బతికించుకోవడానికి ఎంత తాపత్రయపడిందో గుర్తొచ్చి అసహనంగా అనిపించింది.
రావు మౌనం చూసి వాళ్లు సంగతి గ్రహించారు. అతనక్కడ ఉండలేక వడివడిగా వచ్చేసాడు.  ఇంటికి వెళ్ళాలనిపించలేదు. బార్‍లో కూర్చున్నాడు. తనకేమిటీ బాధ? తనెందుకిలా దుర్బలుడైపోతున్నాడు? ఒక్కొక్క పెగ్గు గొంతులోకి జారుతున్నకొద్దీ కసి పెరిగిపోతోంది. క…మ…లి…నీ!  నిస్సహాయ కోపంతో అనుకున్నాడు.


ఉదయం నిద్ర లేచి మంచం  దిగగానే ఎదురుగా కిటికీలోంచి బంతిపూలు కనిపించాయి కమలినికి. తనని పలకరిస్తున్నట్టు వూగుతూ. గాలి తెరలు వీచినప్పుడల్లా  కిలకిల్లాడుతున్నట్టు కదులుతున్నాయి.
“ఉన్నవాళ్లు రకరకాల గులాబీలు పెంచితే లేనివాళ్ళు బంతిపూలతో సరిపెట్టుకుంటారు” చదువుకునే రోజుల్లో క్లాస్‍మేట్ రోజీ అన్న మాటలు గుర్తుకొచ్చాయెందుకో. రోజీవాళ్ళింట్లో యాభై రకాల గులాబీలు ఉండేవి. ప్రత్యేకించి వాటికోసం తోటమాలి ఉండేవాడు. నీళ్లు పెడుతూ, కొమ్మల్ని కత్తిరిస్తూ , అంట్లు కడుతూ… అదే అతని పని. వాళ్ళ రోజ్‍గార్డెన్ ఖర్చుతో ఒక కుటుంబం దర్జాగా బతకొచ్చుననిపించేది తనకి.
ప్రతి ఆలోచన వెనుక ఒక కారణం ఉంటుంది. తనకలాంటి భావం కలగడానికికూడా ఒక కారణం ఉంది. సరిగ్గా అదే రోజుల్లో కాలేజీ ఫీజులకి డబ్బు లేక అల్లల్లాడేది తను. డబ్బు… డబ్బు …డబ్బు. ఏ సమస్య చూసినా డబ్బుతో ముడిపడి ఉండేది.
తండ్రి  గవర్నమెంట్ జాబ్ చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు.  ఆ వచ్చిన డబ్బుతో అక్క పెళ్లి చేశాడు. తనకి సీటు వస్తే మెడిసిన్‍లో చేర్పించాడు. అక్కకీ తనకీ మధ్య అన్నయ్య. అతనికి ఎంతో కాలం ఉద్యోగం రాలేదు. తండ్రి ధైర్యంతో ఉద్యోగవిరమణ చేశాడోకానీ ఆ ధైర్యాన్ని భగవంతుడు వమ్ము చేశాడు. నాలుగేళ్లు తిరగకుండానే  హార్ట్ఎటాక్ వచ్చి చనిపోయాడాయన.  అయితే ఆయనకి తనకేమీ చేయలేదనే దిగులుండేది.
” అక్కకి పెళ్ళి చేశారు. నాకు చదువు చెప్పిస్తున్నారు . అన్నయ్య… వాడి బతుకు వాడు బతుకుతున్నాడు. నిశ్చింతగా ఉండండి “అని తనే ధైర్యం చెప్పేది. కానీ ఆ దిగులు ఆయన గుండెల్లో గూడుకట్టుకునిపోయి ఆయన్ను  తినేసింది.
” ఆ పోయేదేదో సర్వీసులో ఉండగా పోతే ఆయన ఉద్యోగం నాకు వచ్చేది. అడ్డదిడ్డమైన లెక్కలన్నీ వేసుకుని ఉద్యోగం వదిలేశారు. దాని పెళ్ళికీ దీని చదువుకీ వచ్చినదంతా తగలేసారు. అక్కయ్యకి చేసినప్పుడే ఒక సంబంధం చూసి ఇద్దరికీ అందులోనే సరిపెడితే అయ్యేది… నాకేం మిగిల్చారు?” అని గొడవ చేసి తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయాడు అన్నయ్య… తండ్రి పోగానే.
మధ్యతరగతి కుటుంబాలని బ్రతికించేది మమకారాలు , వాటి వెనకనుంచి రాలే అరాకొరా డబ్బు. అవి రెండూ లేనివారయ్యారు తాము. తనప్పుడు ఆఖరి సంవత్సరంలో ఉంది. తల్లికి వచ్చే పెన్షన్ తప్ప మరి ఏ ఆధారం లేదు. ఇంటద్దె, తిండి, చదువు అందులోనే జరుగుబాటవాలి. రాత్రి పడుకుంటే నిద్రపట్టేది కాదు. రేపు  ఎలా గడుస్తుందన్న చింత. చదువు మధ్యలో ఆగిపోతుందన్న భయం. ఇంట్లో ఇన్ని సమస్యల మధ్య మెరిట్, ర్యాంక్ రమ్మంటే ఎలా వస్తాయి?  అందునా ఆడపిల్ల తను.
తన అవసరాలు తెలుసుకుని ఎవరూ సహాయపడలేదు. తన నిస్సహాయత కొంతమందికి అవకాశంగా కనిపించింది. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ డేటింగ్‍కి ప్రతిపాదించారు.  పమిటకొంగు తగిలితేనే రెపరెపలాడే మనసు గల వీళ్లు ప్రతిపాదించినది డేటింగ్ ముసుగు వేసిన నాజూకైన అనైతికతని. వెరసి ఈ సమస్యలకీ, అవమానాలకీ కారణం డబ్బు. మనుషుల బతుకులనీ, మనుగడనీ శాశిస్తూ డబ్బు.
తల బలంగా విదిల్చింది కమలిని. ముందు బంతిపూలు ఆ తర్వాత రోజీ జ్ఞాపకాలు, ఆ పైన బతుకుగతుకుల్లోకి  వెళ్లిపడేసరికి ఆమె మనసు బరువెక్కింది. పొద్దున్నే ఎందుకీ పాడు ఆలోచనలని తన మీద తనే విసుక్కుని పెరట్లోకి వెళ్ళి పళ్ళు తోముకుని వంటింట్లోకి అడుగుపెట్టింది.
” ఎంతకాలం ఇలా?” కాఫీ గ్లాసు అందిస్తూ అడిగింది తల్లి.
“ఎలా?”
” తాడూ బొంగరం లేకుండా”
” లేకేమి? చదువుంది . అంతో ఇంతో వస్తోంది”
” ఆ <! ఇదీ ఒక సంపాదనేనా? డాక్టర్ చదివినవాళ్ళంతా రెండుచేతులా ఆర్జిస్తున్నారు” నిరసనగా అంది తల్లి. ఎన్నో ఆశలు పెట్టుకుని కూతుర్ని చదివిస్తే ఎందుకూ పనికిరానట్టు ఇలా తయారైందేమిటా అని ఆవిడకి బాధగా ఉంది.
” వాళ్లందరూ చిన్నప్పుడు బంగారు ఉయ్యాల్లో ఊగిన వాళ్ళు ” తల్లిని కించపరచాలని కాకుండా నవ్వుతూనే అంది కమలిని. కాఫీ తాగాక గ్లాసు కింద పెట్టబోయింది.
” కడిగివ్వు. ఇవాళ పనిమనిషి రాదు” చెప్పింది తల్లి.
“ఎందుకని?” ఆరాగా అడిగింది  కమలిని.
“దాని భర్తకి ఒంట్లో బాలేదట. నీతో చెప్పకుందుకు సిగ్గుపడింది. మగడాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి ఈ పూట రాలేదు”
కమలిని నిట్టూర్చింది. తను ప్రాక్టీస్ పెట్టి అప్పుడే రెండేళ్లు అయింది. అరాకొరా తప్పించి కేసులు రావడం లేదు. పెళ్లి అవలేదు, చిన్న వయసు కాబట్టి గైనిక్ కేసులు రావు. లేడీ డాక్టర్ కాబట్టి అందుకు తప్ప ఇంకెందుకూ పనికిరాదని మిగిలిన కేసులూ రావటం లేదు. తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇప్పటిదాకా ఒక్కటేనా ఎదురవలేదంటే తనమీద తనకే అపనమ్మకం కలుగుతోంది.
““డాక్టర్ దగ్గర సిగ్గేమిటి? ఏమిటసలు అనారోగ్యం?”
“నీరుట్లో రక్తం పడుతోందట. విపరీతమైన నొప్పితో విలవిల్లాడిపోతున్నాడట” తల్లి చెప్పడంతో ఆమె భృకుటి ముడిపడింది లోపల్లోపల ఏదో అనుమానం.
“ఏదో ఆపరేషన్ చేయించుకున్నాడట కదూ? ఒకసారి అన్నట్టు గుర్తు ” సాలోచనగా అడిగింది కమలిని.
” వాడిక్కాదు. వాడి కొడుక్కి ఆపరేషన్ అయింది.   ఏదైతేనేం ఆ పిల్లవాడు దక్కలేదు” అంది తల్లి.
కమలిని  గ్లాస్ కడిగి  తల్లి చేతికిచ్చి చుక్కమ్మ భర్తని చూసి వస్తానని  చెప్పులేసుకుని బయటపడింది.
క్లినిక్‍లో తనకి సాయం కోసం పెట్టుకుంది చుక్కమ్మని. ఆర్ధికంగా భారమే. తప్పదు. ఆమె ఇంటిపని కూడా చేస్తుంది. తల్లికి కొంచెం వెసులుబాటు. తనే చెయ్యొచ్చు. కానీ కుచ్చెళ్ళు దోపుకుని ఇంటిముందు కళ్లాపి చల్లుకుంటూ లేదా ఇంట్లో పనులు చేసుకుంటూ జనం కంటపడితే డాక్టర్‍గా గుర్తించరు. తన వృత్తి మీద గౌరవం, తన నైపుణ్యంమీద నమ్మకంకూడా తగ్గుతాయి. ఇది ఒక ధోరణి. మామూలు ధోవతితో రైలు దిగినప్పుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్‍ని ఒక విజిటింగ్ ప్రొఫెసర్‍గా విద్యార్థులు గుర్తించలేదు. సాటి వ్యక్తికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వలేదు. అదే వ్యక్తి ఆహార్యాన్ని మార్చుకుని వచ్చేసరికి గుర్తించారు. గౌరవం ఆహార్యంలో ఉండదని మనం ఎంత అనుకున్నా, అదే ఇద్దరు అపరిచితులమధ్య స్నేహభావం ఏర్పడటానికి మొదటి మెట్టౌతుంది. ఆ తర్వాతే పరిచయాలు, పరస్పర అవగాహన ఏర్పడతాయి.


కమలిని వెళ్లేసరికి చుక్కమ్మ భర్త మంచంలో నొప్పితో గిలగిల్లాడిపోతున్నాడు. చుక్కమ్మ శోకాలు పెడుతోంది. డాక్టరమ్మతో చెప్పడానికి సిగ్గుపడిందిగానీ చెప్తే తక్కువ ఖర్చులో వైద్యం చేసేది. తన దగ్గర మందులుంటే ఇచ్చేది.  బయట డాక్టర్ అంటే ఎంత డబ్బు కావాలో! అంతరంగంలో  గిజగిలాడిపోతోంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చోద్యం చూస్తున్నారు. అందరివీ అంతంత మాత్రం జీవితాలే. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు.
కమలినిని చూసి అంతా పక్కకి తప్పుకున్నారు.
” శంకర్‍కి ఒంట్లో బాలేదని అమ్మ చెప్పింది. నాకెందుకు చెప్పలేదు?” అని అడుగుతూ శంకర్‍ని పరీక్షచేసింది. అంత బాధలోనూ చేతులెత్తి దండం పెట్టాడు శంకర్.
“ఏమిటి అనారోగ్యం?” అడిగింది కమలిని. వాడి బాధలన్నీ చుక్కమ్మ ఏకరువు పెట్టింది. కండిషన్ చాలా క్రిటికల్‍గా ఉందని అర్థమైంది కమలినికి. ఒక అనుమానం. అది నిజమైతే తన డయాగ్నసిస్ నూటికి నూరుపాళ్లూ నిజమే.
” తాగుతాడా?”
“లేదమ్మా! పిల్లగాడు పోయినసుంది సుక్క ముట్టుకోలేదు” కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చెప్పింది చుక్కమ్మ.
” పిల్లాడు ఎలా పోయాడు?” మామూలుగా అడిగినట్టు అడిగింది.
” అపెండిక్సొచ్చిందమ్మా!”
” ఆపరేషన్ చేయించారా?”
” సేయించినం తల్లీ!”
” ఎక్కడ?”
చుక్కమ్మ చెప్పింది. ఖర్చు వేలల్లో వచ్చి ఉంటుంది. అదంతా తన దగ్గరికి పనికి రాకముందు.
” ఆపరేషన్‍కి డబ్బు ఎక్కడిది?” అడిగింది కమలిని.
” మా దగ్గర డబ్బేడిదమ్మా?” చుక్కమ్మ చెప్పటానికి తటపటాయించింది. జవాబు కావాలన్నట్లు చూసింది కమలిని. “అదేదో ఆపరేషన్ చేపించుకుంటే డబ్బులిచ్చారు”
” చేయించుకున్నాడా?”
తలూపింది చుక్కమ్మ. ఇవన్నీ కమలిని ఎందుకు అడుగుతుందో అర్థం కాలేదు.
” ఏ ఆపరేషన్? పిల్లలు పుట్టకుండానా?”
” సీ! కాదమ్మా!”
” మరి?”
” అదేటో… కిడిని… కిడినీ ఆపరేషన్ చేపిచ్చుకుంటామంటే ముందుగాలే పైసలు ఇచ్చారు”
కమలిని చేతిలోని సిరంజి జారిపోయింది. ఆమధ్య  వూర్లోకెల్లా పెద్దదైన ఒక హాస్పిటల్లో ముమ్మరంగా కిడ్నీ   ఆపరేషన్ల ముసుగులో కిడ్నీల సేకరణ జరిగింది. ఆ విషయంలో అనధికార వార్తలొచ్చి కొంత హంగామా జరిగి అంతా చప్పబడిపోయింది. అలా డబ్బు అవసరం కొద్దీ కిడ్నీ అమ్ముకున్న వాళ్ళలో శంకర్ ఒకడు. దురదృష్టవశాత్తూ అతని రెండవ కిడ్నీ ఇప్పుడు చెడిపోయింది. ఇప్పుడిక గత్యంతరం ఏమిటి? ఐదువేలకో పదివేలకో తన కిడ్నీ అమ్ముకున్న శంకర్ లక్షలు పోసి మళ్లీ కొనుక్కోగలడా? తను చెయ్యగలిగిందేమీ లేదని గ్రహించింది. మౌనంగా తన కిట్ సర్దుకుని అక్కడినుంచి ఇవతలికి వచ్చేసింది.
“ఏటమ్మా ఆడికి?” వెనకే వస్తూ అడిగింది చుక్కమ్మ.
దిగ్గున తలెత్తి సూటిగా చూసింది కమలిని. ఆ చూపు ఎంతో ఆవేదనకి భాష్యం పలికింది. ఎందుకు ఈ సమాజం ఎలా తయారవుతోంది? ఒకరి అవసరానికి ఇంకొకర్ని దోపిడీ చేయటం. ఇది దేనికి దారి తీస్తుంది? శంకర్ పరిస్థితి వివరించి చెప్పింది. అర్థమైంది చుక్కమ్మకి, అతనిమీద ఆశలు వదులుకోవాలని.
” దేవుడా!” ఏడుస్తూ అక్కడే కూలబడింది.
కమలిని వడివడిగా అక్కడినుంచి వచ్చేసింది. ఇంటికి రాగానే తల్లి చెప్పింది. “నీకోసం ప్రకాష్ వచ్చాడు. చూసి చూసి ఇప్పుడే వెళ్ళాడు”
” ఎందుకు  వచ్చాడు?” అసహనంగా అడిగింది కమలిని. అది పెడసరంగా వినిపించింది ఆవిడకి.
” ఎందుకేమిటే? తెలిసినవాడు. కష్టసుఖాలు విచారించి వెళ్ళాడు” గట్టిగా అంది. ” ఈ చీటీ నీకు ఇవ్వమన్నాడు”
అనాసక్తంగా అందుకుని మడతలు ఇప్పింది కమలిని.
“హనీ!” అదీ సంబోధన. అలా పిలవద్దని అతనికి ఎన్నోసార్లు చెప్పి విసిగిపోయి చివరికి ఆ పిలుపుకి అలవాటు పడిపోయింది.
హనీ!
మా గైనకాలజిస్ట్ రమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతోంది. ఆ వేకెన్సీకి నువ్వు అప్లై చెయ్యి. నీకు తప్పకుండా వస్తుంది. నేను కూడా రికమెండ్ చేస్తాను. మన ఇద్దరి వ్యక్తిగత విషయాలని దీంతో కలగలిపి బంగారంలాంటి అవకాశాన్ని వదులుకోకు. వజ్రాన్ని సానపెడితేనే మెరుస్తుంది. నువ్వు సర్జరీలో బాగా షైన్ అవుతావని మన ప్రొఫెసర్లు అనేవారు గుర్తుందా? పూర్ డియర్! అప్పట్లో నేను కూడా అసూయపడేవాడిని. నైపుణ్యం ఉన్నంతమాత్రాన సరిపోదు. దాన్ని అందరూ గుర్తించాలి. అందుకు నీకిది చక్కని అవకాశం-
చివర్న చూసి నవ్వొచ్చింది కమలినికి. యువర్స్ అగ్లియెస్ట్ రావ్… ప్రకాశరావ్.
తనలోని స్త్రీత్వాన్ని మొదటిసారి తాకిన వ్యక్తి. అతనితో ఒక్కసారి ఔటింగ్‍కి వెళ్తే చదువయ్యేదాకా ఖర్చంతా భరిస్తానన్న వ్యక్తి. అప్పటి ఆ ఆకర్షణే ప్రేమగా పరిణమించి తన చుట్టూ తిరిగేలా చేస్తోంది. కానీ తను అతన్ని ప్రేమించలేదు. ఒక్కనాటికీ కూడా. ఎందుకంటే అతను డబ్బుని ప్రేమిస్తాడు. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. విలువలకీ సిద్ధాంతాలకీ నీళ్లు వదిలేస్తాడు. ఆపరేషన్లు చేసి లక్షలు లక్షలు సంపాదిస్తాడు. పచ్చనోటు లేనిదే పేషెంట్ కేసి కన్నెత్తి చూడడు. మొజాయిక్ ఫ్లోర్లమీదా, పాలరాతి గచ్చుమీద తప్పించి నడవడు. ప్రజల డబ్బుతో నడిచే గవర్నమెంట్ కాలేజీలో చదువుకుని కూడా గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యడు. అతని గమ్యం వేరు. తన గమ్యం వేరు. ఈ ప్రేమకి పర్యవసానం పెళ్లి కావాలని అతని ఆకాంక్ష. భిన్న గమ్యాలు గల వ్యక్తులు చివరిదాకా కలిసి ప్రయాణించటం సాధ్యమా?
ఆ మాట అలా ఉంచితే ఈ ఉద్యోగంలో తను చేరగలదా? మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అనారోగ్యానికి వైద్యం చేయించుకోవడం లగ్జరీగా భావించే స్థాయిలో పెరిగిన తను స్టార్‍హాస్పిటల్స్ మనస్తత్వం అలవర్చుకోగలదా? ఒక్కనాటికీ సాధ్యపడదు. అవసరం  ఉన్నా లేకపోయినా రక్త పరీక్షలనీ, ఈసీజీలనీ పీడించలేదు. కత్తి పుచ్చుకుని కాన్పు కాన్పుకీ కోతలు కొయ్యడం తనకి చేతకాదు. అలాగని ఉద్యోగం లేకుండా రికామీగా ఉంటూ ఎంతకాలం ఇలా? ఒక తపస్సులాగా చదివి సాధించుకున్న మెడిసిన్ సీటు… దాని చుట్టూ తను అల్లుకున్న ఆశలు వెక్కిరిస్తున్నట్టు తోచింది. నిస్త్రాణగా అనిపించింది కమలినికి. చాలా… చాలా…
సరిగ్గా అప్పుడే బయట కారు ఆగిన చప్పుడు  అయింది. ప్రకాష్ మళ్లీ వచ్చినట్టున్నాడు. వచ్చినట్టుండటం ఏమిటి?  అతనే.  తన అగ్లియెస్ట్ రావ్.
” కళ్లద్దాలు మర్చిపోయాను” సంజాయిషీ  ఇస్తున్నట్టు అన్నాడు. కళ్ళల్లో కొంటెతనం. అవి అతని జేబులోనే ఉన్నాయి.
” మీ జేబులోనా?” కోపంగా అడిగింది. అతను గట్టిగా నవ్వేసాడు.
” చెప్పండి. నేను రావడం చూసి మళ్ళీ వచ్చారు కదూ?” నిలదీసింది .అతను మళ్ళీ నవ్వాడు. ఐదూ ఎనిమిది ఎత్తుతో పచ్చగా దృఢంగా ఉండే ఈ రిచ్ హీమేన్ కమలిని తనని ప్రేమించకపోవడం దురదృష్టమని అనుకుంటాడు. ఆమెలాంటి అందం, ఆకర్షణా గల అమ్మాయి  అతనికి మరెక్కడా కనిపించలేదు. నిజానికి ఆమె అతని పక్కన తీసికట్టే. అతను అంతగా వెంటపడటానికి ఏముంది ఆమెలో అనిపిస్తుంది ఎవరికైనా!  తా వలచినదే రంభ.
” సరేగానీ, నీతో మాట్లాడాలి. అలా బయటికి వెళ్దాం” అన్నాడు.
“నేనింకా స్నానం చేయలేదు”
“స్నానం కూడా చేయకుండా ఏ విహారానికి వెళ్ళారో, రాణీగారు ?”
“ఇప్పుడే వస్తాను ” అతని వేళాకోళాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది . పెరటి గుమ్మంలో తల్లి ఎదురైంది. ఆవిడ కళ్ళలో కోటి ఆశలు. ఆవిడని దాటుకుని వెళ్లి ఐదు నిమిషాలలో తయారై వచ్చింది. లేత నీలం ప్రింట్ ఉన్న చీరలో ఆమె అద్భుతంగా అనిపించింది రావు కళ్ళకి. తదేకంగా చూశాడు. అతని చూపులనుంచి తప్పించుకుంటూ “పదండి ” అంది.
ఇద్దరూ కార్లో కూర్చున్నారు. నగర పొలిమేరల్లోకి కారు మెత్తగా దూసుకుపోతోంది.  పక్కన కమలిని ఉండగా డ్రైవింగ్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాడతను. పక్కన ఆమె వుండటం  అతని మనసుని సూదంటురాయిలా లాగేస్తోంది. ఆమెని తాకాలని, గాలికి ఎగురుతున్న ముంగురులని చేత్తో సర్దాలని… వెరసి అతని మనసు కోరుకుంటున్నది ఒక సాన్నిహిత్యం. ఇక డ్రైవ్ చేయలేక ఒక పక్కకి ఆపేసాడు.
“కమలినీ! నీకు గుర్తుందా? నాగార్జునసాగర్ పిక్నిక్కి రమ్మనగానే నా చెంప పగలగొట్టావు?” ఆలోచనల్లోంచి తేరుకుంటూ అడిగాడు. అసందర్భమైన ఆ ప్రశ్న ఆమెకు ఇబ్బందిని కలిగించింది. జవాబివ్వలేదు. “ఎప్పటినుంచో నిన్నడగాలనుకున్నా అడగలేకపోయాను. ఫైనలియర్లో మీ నాన్నగారు పోవడం చేత చాలా ఇబ్బంది పడ్డావని తెలుసు.  నీ చదువెలా పూర్తయింది?” అతని మనసులో మరో భావం ఉంది. ఒక కోరిక ఉంది . అది ఆమె జీవితంలో తను కాక ఇంకెవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలని.
” మా బావ చదివించాడు” క్లుప్తంగా అంది.
ఆ సమయంలో అతని మనసులో ఏముందో, ఆ ప్రశ్న ఇన్నేళ్ల తర్వాత అడగటంలోని అంతర్యం ఏమిటో ఆమెకు అంతుచిక్కడం లేదు. అతనెందుకో  తనని శోధిస్తున్నాడనుకుంది. అదామెకు ఇష్టంగానూ ఉంది, అయిష్టంగానూ ఉంది. ద్వైదీభావం.
“బావంటే ?”ఏదో అర్థమైనట్టు ఈర్ష్యగా అడిగాడు.
“మా అక్క భర్త . అక్క అతన్ని అడిగింది. దానిమీది గౌరవంతో అతను నా చదువు బాధ్యత తీసుకున్నారు. చాలా మంచివాడు” అంది . ఆమె ముఖంలో అక్క భర్తపట్ల గౌరవం, భక్తి స్పష్టంగా కనిపించాయి. అలా ఆమె మరో మగవాడిని పొగుడుతూ ఉంటే ప్రకాశరావుకి తనని  కించపరుస్తున్నట్టు అనిపించింది.
“కానీ అతనుకూడా కట్నం తీసుకునే వుంటాడు” వ్యంగ్యంగా అన్నాడు.
“కట్నం తీసుకున్న ప్రతివాడూ చెడ్డవాడు కాదు “
“అంటే నేనొక్కడినే చెడ్డవాడిని అంటావు?”
” నేనెప్పుడు అన్నాను ఆ మాట?”
“మరైతే నన్ను చేసుకోవడానికి నీకేంటి అభ్యంతరం ?” పదునుగా అడిగాడు.
కమలిని తలవంచుకుంది.” నాకు డబ్బంటే భయం రావ్! డబ్బు సంపాదించడం అంటే ఇంకా భయం. అందునా అన్యాయంగా సంపాదించటమంటే మరీను” అంది.
ప్రకాశరావు అహం దెబ్బతింది. “కావచ్చు” అన్నాడు ఆవేశాన్ని అణచుకుని చాలా నెమ్మదిగా.” నేను ఈ ఒంటరితనంతో చాలా విసిగిపోయాను. చేసుకుందామంటే నాకు నువ్వొక బాధ్యత అయిపోయావు. నిన్ను జీవితంలో స్థిరపరచకుండా నా దారిని నేను సుఖపడలేను”
కమలిని మౌనం వహించింది.
“కమలీ! ఈ వుద్యోగంలో చేరిపో. ఆదర్శాలు కూడూ గుడ్డా పెట్టవు. బంగారుపళ్లేనికేనా గోడ చేర్పు కావాలంటారు. నీ టేలెంటు ఎవరికీ ఉపయోగపడకుండాపోతోంది . ఎంతో చదవచ్చు నువ్వు. కానీ డబ్బు లేక ముందుకు వెళ్లలేక పోతున్నావు. ఎందుకు?  ఎందుకోసం ఇలా? ఎవరికోసం ఈ పోరాటం?” నచ్చజెప్తున్నట్టు అన్నాడు.
” నాది ఆదర్శమో పోరాటమో కాదు. మా బావ డబ్బు సర్దుతూ ఏమన్నాడో తెలుసా? మనిషికి సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్యసమస్యలు జలుబు, దగ్గు, జ్వరం ప్రసూతి . ఇవి జబ్బులు కావు. ప్రకృతికి దూరంగా మెసలడంచేత వీటి గురించి అవగాహన లేకుండా పోయింది. డాక్టర్ల చుట్టూ తిరగటం మొదలైంది. సరిగ్గా అక్కడే మనం  దోచుకోబడుతున్నాం. చిన్నప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇచ్చే అరకు మందుకి తగ్గిపోయే బాధలన్నిటికీ ఇప్పుడు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అని పీడిస్తున్నారు. అప్పుడు ఒకటి అరా వుండే సిజేరియన్లు ఇప్పుడు మామూలు అయిపోయాయి. మధ్యతరగతి వాడు బతుకే బరువై ఏడుస్తుంటే ఆ ఏడుపునుంచికూడా పిండుకుంటున్నారని. మన కుటుంబంలో నువ్వు ఒక్కదానివే డాక్టర్‍వి. డబ్బుకి ఆశపడకుండా ప్రజలలో చైతన్యం పెంచు, దోచుకోకు అని”
” నీ నెత్తి” విసుగ్గా అన్నాడు రావు. ” నీకేం ఉందని  ఇలాంటి కబుర్లు చెబుతున్నావు? చిన్నప్పట్నుంచీ నా తల్లిదండ్రులకి నన్ను పెద్ద సర్జన్ని చెయ్యాలని కోరిక. నాకోసం ఎంతో ఖర్చు పెట్టారు. గవర్నమెంట్ కాలేజీలోనైనా సీటు సంపాదించడానికి ముందు కోచింగుకీ, పుస్తకాలకీ, ఖర్చు పెట్టారో తెలుసా? అమ్మ నాకోసం తన ఉద్యోగాన్ని వదిలేసింది. అలాంటప్పుడు సంపాదించుకోవడంలో తప్పేముంది? వాస్తవంగా ఆలోచించు”
“ఇంత ఖర్చుపెట్టి సీటు సంపాదించినందుకు మరింత సంపాదించాలనువడానికి ఇదేమీ వ్యాపారం కాదు. మీరు ఈ పోటీ నుంచి తప్పుకుని మీ డబ్బుని ఏ వ్యాపారంలోనో పెట్టుబడి పెడితే నాలాంటి ఇంకొకరు చదువుకోగలుగుతారు కదా? రావ్! మీ నాన్నగారి ప్రాక్టీస్ అందుకోవడానికో ఉన్న మారుతి అమ్మేసి బెంజ్ కొనుక్కోడానికో నువ్వు డాక్టర్‍వి కావచ్చు. కానీ నావి అందుకు భిన్నమైన పరిస్థితులు. మా అమ్మకి జ్వరం వచ్చింది. నేనప్పుడు బాగా చిన్నదాన్ని. లంఖణాలు  చేస్తోంది. లేని ఓపిక తెచ్చుకుని తిరుగుతోంది. ఆవిడ అవస్థ చూడలేక నాన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను, తయారవమన్నారు. దానికి ఆవిడ జవాబేంటో నువ్వు ఊహించలేవు “అని ఆగింది కమలిని. రావు మాట్లాడలేదు.
” డబ్బు ఖర్చు. ఇంకో రెండు రోజులు చూద్దాం. ఆ డబ్బు ఉంటే రెండు రోజులు ఇంట్లో కూర ఖర్చుకి వస్తుంది- అంది. అలాంటి బతుకులు మావి. వైద్యం లగ్జరీ”
“…”
” ఇద్దరి గమ్యాలూ వేరు. దారులు కలవవు . భార్యాభర్తల్లో సౌహార్ద్రత, పరస్పర సహకారం ఉండాలి. కాడికి కట్టిన ఎడ్లు చెరోవైపుకీ లాగుతున్నట్టు భార్యాభర్తలిద్దరూ చెరోవైపూ పరిగెడుతుంటే కాపురం ఎలా సాధ్యపడుతుంది?”
” నువ్వేంటో, నీకేం కావాలో నాకు తల పగలగొట్టుకున్నా అర్థం కావడం లేదు. చదువు ఆగిపోయే పరిస్థితిలో కూడా నాతో ఒక్కసారి రమ్మంటే రాలేదు. ఆఫ్ట్రాల్… అదొక గంటసేపు సరదా”
” డబ్బు ఖర్చు చేసి నన్ను కొనుక్కోగలగటం నీకు సరదా కావచ్చు.  నాకు అది అవమానం కాదా? నాక్కూడా డబ్బుండి, అవసరంకోసం కాకుండా ప్రేమికుల్లా వెళ్ళగలిగితే నేనూ ఎంజాయ్ చేసేదాన్నేమో!”
” కానీ నాకప్పుడు నీమీద ప్రేమ లేదు. హనీ! నీ బ్రౌన్ స్కిన్, నీ ఫిజిక్… వాటినే నేను కోరుకున్నది. ఈ ప్రేమ, తపన తర్వాత మొదలయ్యాయి. అప్పట్లో నా ప్రతిపాదన చాలా జనాంతికమైనది. మా సర్కిల్లో అది సాధారణం. అది మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా? ఐ యాం ఎక్స్ట్రీమ్లీ సారీ! నాకు మధ్యతరగతి మేనర్స్, మేనరిజమ్స్ తెలియవు” బాధపడుతూ అన్నాడు ప్రకాశరావు.
” నామీద నీకు ప్రేమ ఎందుకు పుట్టింది? నీకు నేను లొంగలేదు కాబట్టి ఆ ఆకర్షణ, లొంగదీసుకోవాలనే పట్టుదల కలిసి ప్రేమగా నీకు కనిపిస్తున్నాయి. కానీ నేను నీ ప్రేమని… అందులో నిజాయితీ ఉన్నా కూడా స్వీకరించే పరిస్థితిలో లేను. విలువలకీ, నియమాలకీ నీళ్లు వదిలేసి నీతో కలిసి వైద్యాన్ని వ్యాపారం చెయ్యలేను”
ప్రకాశరావు ముఖం ఎర్రబడింది. కళ్ళలో ఎర్రటి జీర కనిపించింది. ఆ అన్నది తన తోటి ప్రొఫెషనల్ … అది కూడా కమలిని కావడంతో కోపాన్ని నిగ్రహించుకున్నాడు.
”  నాన్నకి చనిపోయే ముందు దగ్గు, ఆయాసం పట్టుకున్నాయి. మందులకి చాలా ఖర్చయ్యేది.  అన్నయ్య మాకేమీ ఇచ్చేవాడు కాదు. పూర్తిగా పెన్షన్‍మీదే ఆధారపడి బతికేవాళ్ళం. ఆయన పడే అవస్థ చూడలేక ఇంకా మెరుగైన వైద్యం చేయించలేక ఎప్పుడు పోతాడా అనిపించిన రోజులున్నాయి… ఇంకా చాలా చీకటి కోణాలు… నీకు తెలియనివి, నువ్వు చూడలేనివి ఉన్నాయి. అవన్నీ నన్ను నువ్వు చూపిస్తున్న వెలుగుకేసి చూడనివ్వటం లేదు”
” అన్ని కష్టాలు పడ్డ నీకు… నీ కష్టాలన్నిటికీ కారణం తెలియదా? తెలిసి కూడా డబ్బు వద్దంటావేమిటి?”
” ఆ సంపాదన వల్ల నేను ఒక్కదాన్నే సుఖపడతాను. నాకలాంటి సుఖం వద్దు. డబ్బు కోసం చాలామంది నీతినియమాలు వదిలేసినట్టు నీతి నియమాల కోసం డబ్బుని వదిలేయమన్నాడు మా బావ. అతని మాట నేను తీసేయలేను”
” నీ నెత్తి”
ప్రకాశరావు ముఖం ఎర్రబడింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. విసురుగా కారు స్టార్ట్ చేసాడు. ఐదే ఐదు నిమిషాల్లో ఆమె ఇంటి ముందు ఆగారు. కమలిని డోరు తీసుకుని దిగబోయింది. ప్రకాశరావు చెయ్యి పట్టి ఆపాడు. ఆమె అతని మీదికి తూలిపడింది. ఒక్క క్షణం… అతను చలించిపోయాడు. ” నిన్ను కాదని నేను మరొకర్ని ఎలా చేసుకోను? నువ్వు కాని అమ్మాయితో కాపురం ఎలా చేయను? అయినా ప్రయత్నిస్తాను.  నీకన్నా పెద్ద మొండివాడిని నేను” అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. గొంతు గద్గదమైంది.
కమలిని కళ్ళు దించుకుంది. “అక్కకి ఒక్కడే కొడుకు. ఇంకొకర్ని కంటే పెంచలేమని వాడితోనే సరిపెట్టుకున్నారు. వాడు… పుట్టినప్పుడు పండులా వుండేవాడు. ప్రైమరీ కాంప్లెక్స్‌కి యాంటీబయోటిక్స్ వాడివాడి ఇప్పుడు ఎండుకుపోయాడు. అలాంటి పిల్లలు మనదేశంలో ఎందరో తెలుసా? మనుషులందరినీ పీనుగులని చేసి వాటి మీద పడే రాబందులమౌదామా? నాకలా బతకడం చేతకాదు. సారీ అండ్ గుడ్ బై” లోగొంతులోనే అయినా స్థిరంగా చెప్పి దిగిపోయింది.


ఆ కమలిని రావుని ఇంత సంఘర్షణకి గురిచేస్తోంది. ఆలోచనలో పడేస్తోంది.


చుక్కమ్మ కూలికి పోతోంది.  కూతుర్ని మూడో తరగతి మాన్పించి ఇళ్లల్లో   పనికి పంపిస్తోంది. మిగిలిన పిల్లలు ఇద్దరూ బడి మానేసి వీధుల వెంట తిరుగుతున్నారు.
” ఇంకో నాలుగు రోజులు పోయాక ఇది మారు మనువు ఆడుతుంది. వాళ్లలో తప్పులేదు. అప్పుడు పిల్లలు మరీ గాలికి పోతారు” అది కమలిని తల్లి.
డబ్బులు ఏమీ మనుషుల జీవితాలతో ఎలా ఆడుతుందో మరోసారి చూసింది కమలిని మొదటిసారిగా ఆమె తనని గురించిన ఆలోచన కలిగింది. ఈరోజు తన తల్లి ఉంది. ఆవిడకి పెన్షన్ వస్తుంది. ఇంత తిండి తింటోంది. రేపు ఆవిడకి ఏదైనా అయితే? చుక్కమ్మలా తనకి కూలి పని రాదు. కూలి పనే కాదు, వైద్యం తప్ప మరేపనీ రాదు. అలాంటి రోజున ఏమవుతుంది తన బతుకు? మరోసారి బజారు పాలు అవుతుంది. అప్పుడు ఈ అగ్లియెస్ట్ రావు తనకు ఏమైనా చేస్తాడా? ఏమో! అప్పటికి అతను మరింత ఎత్తుకి ఎదుగుతాడు. మరో స్త్రీ కనుసన్నల్లో బందీ అవుతాడు. ఇప్పట్లా స్వేచ్ఛాజీవికాడు.
కమలిని గుండె బరువెక్కింది . రావు తనతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయి అప్పుడే వారం రోజులైంది. చాలా మొండి మనిషి. అన్నంత పనీ చేస్తాడు నిజంగానే ఎవరినైనా తీసుకుని చేస్తాడేమో! అతను ఊ< అనాలేగానీ కోట్లు కుమ్మరించటానికి సిద్ధంగా ఉన్నారు. తన చుట్టూ తిరుగుతున్నాడని తెలిసి తనని వాళ్ళ వాళ్ళు బెదిరించారు కూడా . అతని జీవనసరళితో తను  ఎలాగా రాజీ పడలేదు.  అలాంటప్పుడు అతను మరో అమ్మాయిని చేసుకోవటమే మంచిది. కానీ…
అతను పెళ్లి చేసుకుంటాడంటేనే ఎలాగో ఉంది. ఈ వారం రోజులూ రాకపోయేసరికి పిచ్చి పట్టినట్టైంది. కళ్ళు వాకిలికే అతుక్కుపోయాయి. ఏ చిన్న శబ్దం వినిపించినా తనలో వులుకు. అతడేనేమోనని ఆశ. కాకపోయేసరికి దుఃఖం. ఎందుకిలా? ఒక వ్యక్తి జీవన సరళిని ద్వేషిస్తూ దానికి అతీతంగా అతన్ని మాత్రమే ప్రేమించటం సాధ్యమేనా? ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం? అసలిది ప్రేమేనా? మరో మనిషి అంటూ లేని తన జీవితంలో అతను ఒక అవసరమా?  మనుషులు ప్రాథమ్యాలు ఎంచుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. అలాంటప్పుడు ఏర్పడే అనిశ్చితినుంచీ క్రమంగా ఒక అవగాహన… దాన్ననుసరించి ఒక నిశ్చితి.


చుక్కమ్మ వుండే బస్తీలో రెండుగదులు అద్దెకి తీసుకుని బోర్డు కట్టింది కమలిని. రెండూమూడూ ఐదురూపాయలూ కన్సల్టేషన్ ఫీజు. జనం బాగానే వస్తున్నారు. ఇదివరకు చుక్కమ్మ తనవాళ్ళని తీసుకొచ్చేందుకు స్వతంత్రించలేకపోయింది. కమలిని ఎంత ఫీజు తీసుకుంటుందో,  ఫీజు ఇచ్చుకోలేరంటే ఏమనుకుంటుందోనని సంకోచించేది. ఇప్పుడు ఆమే ఇక్కడికొచ్చేసరికి ఆ అస్పష్టత తొలగిపోయింది. దాదాపు నెలరోజులు పట్టింది కమలినికి ఒకమాదిరిగా స్థిరపడటానికి. జనం కిటకిటలాడుతున్నారు. విషాదకరమైన విషయం ఏమంటే వాళ్ళకి డాక్టర్ని ఎంచుకునే అవకాశం లేదు. చిట్కావైద్యం, ఆరెంపీ, ఎంబీబియస్ అందరూ ఒకటే. అచ్చం కమలిని అనుభవాల్లో వున్నట్టుగానే.
రావు వచ్చాడు పెళ్ళి శుభలేఖ తీసుకుని. కమలిని అనుకున్నదే. బాధను అనుభవించి, అతను తన ప్రాథమ్యం కాదని తెలుసుకుని అందులోంచీ బైటికి వచ్చినదే. పెద్దగా నిరాశపడలేదు.
“కూర్చో” అంది తన ఎదురుగా వున్న కుర్చీ చూపిస్తూ. అతను కూర్చున్నాడు. చుట్టూ చూసాడు. చాలా చిన్న క్లినిక్. ముందుగది పేషెంట్లు కూర్చోవడానికి. లోపలిగది కమలిని కూర్చోవడానికి. అక్కడ పేషెంట్లని చూస్తుంది. వాళ్ళని పడుకోబెట్టి పరీక్ష చెయ్యటనికి ఒక బల్ల, దాన్ని కవర్ చేస్తూ ఆకుపచ్చటి కర్టెన్. కమలిని ఎదురుగా ఎదురుగా గోడకి హిపోక్రేట్స్ ఓత్. అతను దానిమీంచీ చూపు మరల్చుకున్నాడు.    
“కాఫీ తాగుతావా?” అడిగి, అతని జవాబుకోసం చూడకుండా టేబుల్‍మీద వున్న ఫ్లాస్కులోంచీ పోసి అతనికి ఒక కప్పు ఇచ్చి తనొకటి తీసుకుంది. తాగటం అయాక కార్డు తీసాడు రావు.  
“కంగ్రాట్స్” అంది కార్డు అందుకుని.  
ఆమె ముఖంలో భావాలకోసం వెతికాడు రావు. అభావంగా వుంది.
“ఆర్యూ హేపీ?” అడిగాడు.
“నిర్వచనం?” అడిగింది.
“నువ్వే చెప్పాలి…” ఆగాడు.
“నేను ఈ విషయంలో మొదట్నుంచీ స్పష్టంగానే వున్నాను” అంది.
ఇద్దరిమధ్యా మౌనం.
నెమ్మదిగా అంది కమలిని. “ఇద్దరం క్షితిజరేఖకి చెరో అంచునీ వున్నాం రావ్! క్షితిజరేఖే ఒక మిథ్య. దాని అంచుల్ని వున్నామనుకోవడం ఇంకా పెద్ద మిథ్య “
“మరి నిజమేది?’
“బేబీ ఆఫ్ అర్చన”
“దట్ బేబీ ఈజ్ నో మోర్. చనిపోయాడు”
“ఔనట. తెలిసింది. సిస్టర్ లిల్లీ ద్వారా. నువ్వు బాగా అప్సెటయావనికూడా చెప్పింది లిల్లీ. ఎందుకు రావ్?”
“బేబీ జన్యులోపాలతో పుట్టాడు. సర్జరీ చేసినా ప్రయోజనం వుండదని మొదటే చెప్పాను. వాళ్ళు వినలేదు”
“ఇంకొంచెం మెరుగైన వైద్యం చేయించి వుంటే బాగుండేదన్న బాధ జీవితమంతా వాళ్ళని వెంటాడుతుంది”
అతను హర్టయాడు. “ఏ డాక్టరేనా ఒకలాగే చదువుకుంటాడు కమలీ! ఆపరేషన్ బల్లముందుకు వెళ్ళాక వుండాల్సిన నిబద్ధతలోకూడా మార్పుండదు. ఏ సర్జనూ తనొక హంతకుడు కావాలనుకోడు”
కమలిని నవ్వింది. “నేను పేషెంట్లగురించి మాట్లాడుతున్నాను. ఇంకొంచెం మెరుగైన- అనే అవకాశం దొరక్కుండా ఎవరికీ వుండకూడదు”
రావు వెంటనే జవాబు చెప్పలేదు. కమలినికి సరిపడే జవాబుకోసం ఆలోచించాడు.  బెటర్ ఆప్షన్సనేవి మనిషికి లేకుండా వుండటం అసంభవం. అతని ఆలోచనే ఆ అంతరాలని సృష్టించుకుంటుంది. ఆ అంతరాలనేవి లేకపోతే డాక్టర్లు, ఇంజనీర్లు అనే బేధం వుండదు. ఇదో అదో కావాలనే కోరిక వుండదు. అందరూ ప్రాథమిక దశలోనే వుండిపోతారు. ప్రాథమిక అవసరాలవరకూ ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది.  ఆపైవి ఎవరివరకూ వారు అమర్చుకోవలసిందే. అలా అమరనందుకు ఎవరిదో తప్పనుకోవడం కూడా సరైనది కాదు. అలా అమర్చుకోలేనివాళ్ళ కోసం ప్రపంచం ఆగదు. అతని ఆలోచనలకి స్పష్టత వచ్చింది.
“ఎక్కడో ఒక ఆవిష్కరణ జరుగుతుంది. దాని వెనుక అనేకమంది దివారాత్రాలూ కష్టపడి పనిచేసిన కృషి వుంటుంది. చాలా పెట్టుబడి వుంటుంది. ఆయా దేశాల ప్రోత్సాహం వుంటుంది. వీరంతా ఆ ఆవిష్కరణకి హక్కుదారులు. వాళ్ళకి తగిన మూల్యం చెల్లించకుండా అది మనకి అందాలని ఆశించటం సరైనది కాదు. ఈ కారణం చేతనే ప్రభుత్వంకూడా ప్రైమరీ హెల్త్‌పై పెట్టినంత  ఫోకస్ లేటెస్ట్ టెక్నాలజీమీద పెట్టలేకపోతోంది. జనాభా మనకి మరొక పెద్ద ఆటంకం. వీరిలో చాలామందికి అన్నీ వుచితంగానే అందాలి”
అతను తన సిద్ధాంతాన్ని సమర్ధించుకుంటూ చెప్తుంటే కమలిని నిర్వికారంగా చూసింది.  
“పెద్ద హాస్పిటల్స్‌లో ఆర్థికపరమైనదోపిడీ జరుగుతోందనేది నీ మరో నమ్మకం. అది దోపిడీ కాదు కమలీ! ఇకనామిక్ డివైడ్‍ని పాటించకపోవటంవల్ల వచ్చిన సమస్య.  నీ అఫర్డబిలిటీనిబట్టే నువ్వు ఎర్రబస్సులోనో, ఏసీకోచ్‍లోనో, విమానంలోనో వెళ్ళగలుగుతావు. నాకు క్వాలిటీలైఫ్ వద్దా, నన్నెందుకు విమానంలో ఎక్కించుకోరు అని నువ్వెవరితో దెబ్బలాడతావు? ”      
“సిగ్గులేదు నీకు” అంది కమలిని కోపంగా.
“నేను సిస్టంగురించి చెప్తున్నాను. అందులో నేను సిగ్గుపడటానికిగానీ నువ్వు కోపం తెచ్చుకోవటానికిగానీ ఏమీలేదు”
“…”
“ఇంకొక్క విషయంకూడా చెప్పనీ కమలీ! నీమీది కోపంతోనో ప్రేమ చచ్చిపోయో నేనీ నిర్ణయం తీసుకోలేదు. ఏదో ఒక బలహీనక్షణంలో మనం పెళ్ళిచేసుకోవాలనే నిర్ణయం తీసుకుని వుంటే అది చాలా డిసాస్ట్రస్‍గా వుండేది. నీ  ఆలోచనలతో నాతో సంతోషంగా వుండేదానివి కాదు. సరే నేను నీదార్లోకి వస్తే… జరిగేదేమిటో నీకు తెలీదని నేననుకోను.  నాకు నాలెడ్జిమాత్రమే వుండి చేతిలో ఎలాంటి ఎక్విప్‍మెంటూ వుండదు. అప్పుడు నేను సర్జన్ని కాదు. ఒక కన్సల్టెన్ట్ ఫిజీషియన్‍గా మిగిలిపోతాను. ఏదేనా ఎమర్జెన్సీ వస్తే ఇంకో సర్జన్‍కో హాస్పిటల్‍కో రిఫర్ చెయ్యాల్సివుంటుంది. ఆత్మహత్యాసదృశం… సరే, నువ్వు కోరుకున్నట్టు ఒక హాస్పిటల్ నేనే పెట్టాలనుకుంటే… రిసోర్సెస్ సరిపోవు. సపోర్ట్ సిస్టం లేదు. అప్పుడుకూడా నా పరిస్థితి అదే. .. ఇప్పటిదాకా నేను నీలా ఆలోచించాలని నువ్వూ, నువ్వు నన్నర్థం చేసుకోవాలని నేనూ అనుకున్నాం. దాని పరిణామం ఇలా వుంటుందని అర్థమైంది. అందుకే ఈ నిర్ణయం. కమలీ! నీకు నచ్చినట్టే వుండు. నీలా ఆలోచించేవాడినే చేసుకో  ” అతను లేచాడు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s