ఖైదీ by S Sridevi

( ఆంధ్రభూమి దినపత్రిక 15. 11. 1997)
నా కూతురు అక్బర్‍ని ప్రేమిస్తోందన్న విషయం ఈరోజు దాకా నాకు తెలియదు. ప్రేమంటే వాళ్ళిద్దరూ దొంగతనంగా కలుసుకోలేదు. చెట్టాపట్టాలేసుకుని పార్కులకీ, సినిమా హాళ్ళకీ తిరగలేదు. కనీసం ఎవరూ లేని ఏకాంతంలో ప్రేమబాసలు మాట్లాడుకున్నారో లేదో తెలియదు. అసలు వాళ్ళిద్దరూ కలుసుకునే పదేళ్లు అయింది.
పదేళ్ల క్రితం…
రాగిణి పదిహేనేళ్ల పిల్ల. అక్బర్‍కి పదిహేడో పద్ధెనిమిదో. అప్పటి జ్ఞాపకాలు ఈరోజు ఉదయం పేపర్లో వచ్చిన ఒక చిన్న వార్తతో ఎగదన్నుకొచ్చాయి. మతకల్లోలాలలోనూ, అల్లర్లలోనూ పాల్గొని లెక్కలేనన్ని హత్యలు చేశాడని అక్బర్‍కి ఉరిశిక్ష విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అమలౌతుంది. ఆ వార్తతోపాటు అతని ఫోటో , వివరాలు కూడా పేపర్లో వేశారు. అది చూసి రాగిణి స్పృహతప్పి పడిపోయింది.
తెలివి వచ్చాక తనన్న మొదటి మాట, “నాన్నా నేను అక్బర్‍ని చూడాలి “అని.
“వీల్లేదు . సమాధి కట్టేసిన ఆ జ్ఞాపకాలని తిరగదోడటానికి నేనొప్పుకోను. వాడిని చూడాల్సిన అవసరం మనకు లేదు” నా భార్య శాంతి ఆవేశంగా అంది.
మరేమీ అనకుండా ఏడుస్తూ కూర్చుంది రాగిణి. పచ్చి మంచినీళ్లు కూడా గొంతులో పోసుకోలేదు. రెండు రోజులు అలాగే గడిపింది. తన ఆంతర్యం ఏమిటో నాకు తెలీలేదు. స్త్రీ హృదయం మరొక స్త్రీకి తెలుస్తుందంటారు. తనకేం అర్థమయిందోగానీ శాంతి బయటపడలేదు . చాలా నిగూఢంగా ఉంచింది.
అక్బర్ని వురి తీసే రోజు అతి దగ్గరలో ఉంది. ఆ రోజు తెల్లవారిందంటే రాగిణి ఇంకెప్పటికీ అతన్ని చూడలేదు. తను పడుతున్న క్షోభ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. శాంతి కనురెప్పలు కూడా తడి అవడం చూశాక నేనింక ఆలస్యం చెయ్యలేదు రాజమండ్రికి రెండు టికెట్లు కొనుక్కుని వచ్చాను.
“ “మళ్ళీ దాన్ని ఆ రొంపిలోకి దింపుతున్నారా?” భయంతో అడిగింది శాంతి .
“వాడికి ఉరి కాకుండా మరే శిక్ష వేసినా నేనూ నీలాగే ఆలోచించేవాడిని” అన్నాను.
” “వాడితో మనకి అనుబంధం ఉందని మీరు భావిస్తున్నారా? వాడు మనకేమీ కాడు. విశ్వాసఘాతకుడు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన నీచుడు. వాడి జ్ఞాపకాలలోంచీ ఇప్పటికీ రాగిణి బైటపడలేదు”
కొంతమంది శాపగ్రస్తులు వుంటారు. మనంకూడా అంతే. రాగిణి పసిపిల్లేం కాదు. మంచి చెడులు మనం దగ్గరుండి చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఏ బాధ రగులుతోందో, ఏ జ్ఞాపకం ఆ బాధని కలిగిస్తోందో కానీ తను అక్బర్ని చూడాలనుకుంటోంది . కాదనే హక్కు మనకి లేదు.ఒక్కసారి చూసి వచ్చినంత మాత్రాన జరిగే కీడు ఇప్పటిదాకా జరిగినదానికన్నా ఎక్కువేమీ ఉండదు” ఓదారుస్తూనే నచ్చజెప్పాను.
రాగిణిని తీసుకుని బయలుదేరాను. రైల్లో ఇద్దరం ఎదురుగుండా కూర్చున్నాము. ఎరుపు ప్రింటున్న నల్లచీర కట్టుకుని షాల్ కప్పుకుంది రాగిణి. నుదిటి మీద ఎర్రటి బొట్టు మెరుస్తోంది. కళ్ళల్లో మాత్రం కళాకాంతీ లేవు. చూపులు ఎక్కడో దూరాన చిక్కుబడి ఉన్నాయి. నాకు తన మౌనం చూస్తుంటే బాధ కలుగుతోంది.
ఈ పదేళ్ళ కాలంలో రాగిణి చాలా అరుదుగా నవ్వింది. మొదటినుంచీ వున్న స్వభావం అది కాదు. బిగుసుకున్న తన పెదాలు చూస్తుంటే అనిపిస్తోంది, అవి ఇకమీదట నవ్వడాన్ని పూర్తిగా మర్చిపోతాయని. ఆ వూహే భరించలేకపోయాను.
” రాగిణీ! కాఫీ తాగుతావా?” మౌనాన్ని ఛేదిస్తూ అడిగాను. తాగుతానన్నట్టు తలూపింది. వెంటనే రైలు దిగి రెండు కప్పుల్తో కాఫీ తీసుకొచ్చి ఒకటి తనకిచ్చి మరొకటి నేను తీసుకుని కిటికీ దగ్గర నిలబడి తాగసాగాను. ఇంతలో రైలు కూతవేసింది. రెండు కప్పులూ డస్ట్ బిన్ లో వేసి రైలెక్కాను.
నా సీట్లోకి వెళ్లి కూర్చున్నాను కాసేపటికి రాగిణి కూర్చునే నిద్రలోకి జారిపోయింది. నా ఆలోచనలు గతంలోకి పరుగుతీశాయి.
….
ఉద్యోగరీత్యా దేశం నలుమూలలా తిరిగి వచ్చి హైదరాబాద్ చేరుకున్నాను. చార్జి ఇస్తూ-
“అభ్యంతరం లేకపోతే మా ఇల్లు లెటౌట్ చేస్తాను, అందులో ఉండండి” అన్నాడు రెహమాన్. పాతబస్తీలో ఉన్న పురాతనమైన ఇల్లు అది. నాలుగు గదులు, వరండా, విశాలమైన ఆవరణ. నీటి వసతి బాగానే వుంది. ఇంటిముందు చిన్న తోట కూడా ఉంది. నాకు ఇల్లు బాగా నచ్చింది. వెంటనే రెహమాన్ ప్రతిపాదనకి వప్పేసుకున్నాను.
నేను పుట్టింది మద్రాసులో. నాన్న ఆలిండియా సర్వీసెస్‍లో చేసేవారు. నాలుగేళ్లకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. చదువు పాడవుతుందని నన్ను చిన్నప్పుడే హాస్టల్లో వేశారు. చదువంతా మద్రాసులోనే జరిగింది. చదువయ్యాక నేను కూడా ఆయన వారసత్వమే తీసుకుని ఢిల్లీ, బెంగుళూరు, జయపూర్లలో ఒక్కొక్క టెన్యూర్ చేసి చివరికి ఈ ఊరు చేరాను.
హైదరాబాద్, ముఖ్యంగా పాతబస్తీలో వుండే భావోద్వేగాల గురించిగానీ ప్రభుత్వోద్యోగులుకానివారి సర్కిల్స్‌గురించిగానీ, నాకు పెద్దగా తెలియదు. తెలుగువాడిని అన్న భావన నా నరనరాన జీర్ణించుకుపోయి ఉందేమో, స్వరాష్ట్రానికి వచ్చి చేరుకున్నందుకు చాలా సంతోషించాను. ముందు నేనొచ్చి విధుల్లో చేరిపోయి, తర్వాత వెళ్లి శాంతినీ పిల్లల్నీ వెంటపెట్టుకుని వచ్చాను.
ప్రభు ఇంటరు, రాగిణి తొమ్మిది చదువుతున్నారు. వాళ్లని హాస్టల్స్‌లో వెయ్యడం నాకు ఇష్టం లేదు. చిన్నప్పటినుంచి బయట పెరిగినవాడిని. ఇంటి జీవితం కోసం తపించినవాడిని. వాళ్లని వదిలిపెట్టి ఉండలేను.
ఇక్కడికి వచ్చిన ఆరు నెలలకి అనుకుంటాను, ప్రభు అక్బర్‍ని వెంటబెట్టుకుని వచ్చాడు. ఇద్దరిదీ ఒకటే క్లాసు , ఒకటే గ్రూపు. అక్బర్ ప్రభుకన్నా పొట్టిగా ఉన్నాడు. దైన్యంతో నిండిన మొహం , దిగులు గూడుకట్టుకున్న కళ్ళు… నన్ను చూడగానే వంగి వాళ్ళ పద్ధతిలో నమస్కరించాడు. అప్పటికే ప్రభు అతని గురించి అన్నీ చెప్పాడు. అతడి తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. ఉన్నది ఒక అన్న. అతను కూడా వారం రోజులక్రితం యాక్సిడెంట్‍లో చనిపోయాడు. దానితో అక్బర్ బజారున పడ్డాడు. ఆశ్రయం ఇచ్చి చదివించడానికి ఎవరూ ముందుకి రాలేదు.
” నాన్నా! ఈ ఒక్క సంవత్సరం మన ఇంట్లో ఉండనిస్తే అక్బర్ ఇంటరు పూర్తిచేస్తాడు. ఏదో ఒక ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతాడు. చాలా తెలివైనవాడు. మనం కాదంటే చదువు ఆగిపోతుంది” ఆశగా నా మొహంలోకి చూస్తూ అడిగాడు ప్రభు.
” బాబుగారూ! నాకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు అంటూ ఎవరూ లేరు. మా అన్న తన కడుపు మార్చుకుని ఫీజులు కట్టి ఇంతదాకా చదివించాడు. ఒక్క సంవత్సరం సాయం చేస్తే ఇంటర్ పాస్ అవుతాను. నా అన్న కోరిక తీరుతుంది. మీ రుణం నేను ఉంచుకోను. మీ నౌకర్ని మానిపించండి పనులన్నీ నేను చేసి పెడతాను” అక్బర్ దీనంగా అన్నాడు.
బీదరికం మనిషికి పెద్ద శాపం. దాన్ని ఒంటరిగా అనుభవించాల్సి రావటం ఇంకా పెద్ద శాపం. ఈ అక్బర్ నాకేమీ కాకపోవచ్చు. ఎలాంటి ఆత్మీయతా, పూర్వ పరిచయం లేకపోవచ్చు. కానీ సాటి మనిషిగా, అతని కంటే పరిపక్వమైన వ్యక్తిగా అతని ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసాను. ఇప్పుడు కావలసినవి ఆశ్రయము, ఆదరణ. అవి రెండూ లేకపోతే దాదాగానో రౌడీగానో మారిపోతాడు. ఒక భావిభారతపౌరుడి జీవితగమ్యం నా చేతిలో ఉంది.
నా చిన్నప్పుడు మా ఇంట్లో వారాల పిల్లలు ఉండేవారు. నేను బతికిన వాతావరణం నాలో కులమత బేధాల ఇరుకు గోడలని నిర్మించలేదు. నా మీద ఎంతో నమ్మకం ఉంచి ప్రభు తన మిత్రుని ఇంటికి తీసుకొచ్చాడు. వాడిని సంతోషపెట్టడం నాకు అన్నిటికన్నా ముఖ్యం . అలాంటి సంతోషంలోనే పరిపూర్ణమైన పెరుగుదలకి అవకాశం వుంది.
అక్బర్‍కి ఆశ్రయమిచ్చి చదువవ్వగానే ఒక ఉద్యోగం కూడా వచ్చేలా చూడాలని నిశ్చయించుకున్నాను. శాంతి కూడా ఆమోదం తెలిపింది. ఆ విధంగా అక్బర్ ప్రవేశం మా ఇంట్లోకి జరిగింది. సమస్యలకు దారితీస్తుందని నేననుకోలేదు.
అతడు అన్నాడు కదాని నేను నౌకర్ని మానిపించలేదు. ఒకరోజు సుస్తీ చేసిందని నౌకరు రాలేదు. మున్సిపాలిటీ వాళ్ళ స్ట్రైక్ కారణంగా అంతకు ముందురోజు పంపుల్లో నీళ్ళు రాలేదు. మేము నిద్రలేచేసరికి డ్రమ్ములన్నింటిలో నీళ్లు నింపి ఉన్నాయి. వీధి బోరింగ్‍నుంచి తెచ్చి అక్బర్ నింపాడు. అతడిని పిలిచి నాలుగు కేకలేసాను, ఒక్కడివే ఎందుకు చేసావని. తర్వాత నాకే అనిపించింది, అతడిలో దారుణమైన ఆత్మన్యూనత చోటుచేసుకుంటోంది. అది పోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు అతనికి వదిలేయాలి . తద్వారా అతను కృతజ్ఞతని చూపించుకుని భారాన్ని తగ్గించుకుంటాడు. అప్పట్నుంచి చూసీ చూడనట్టు కొన్ని పనులని అక్బర్ చేస్తుంటే పట్టించుకోవడం మానేశాను. అది అతని వ్యక్తిత్వాన్ని వంకరపోకుండా సాపు చేసింది.
రోజులు ఇలాగే సాగిపోతే అక్బర్ చదువు అయిపోయేది. ఎక్కడో ఒక ఉద్యోగం కూడా దొరికేది. కానీ చాలా బలమైన మలుపు మా ముందుంది. మలుపు దగ్గర మా గమ్యాలు విడిపోయాయి. అందుకు అక్బర్ ఎంతవరకు బాధ్యుడు అనేది ప్రశ్న.

బ్రతుకు దేవుడిచ్చిన వరం. కొందరికి ఆ వరాన్ని ఉపయోగించుకోవడం చేతకాక శాపంగా మలుచుకుంటారు. ఖాదరు ఈ కోవకి చెందినవాడే. మొదట పెళ్లయింది. నలుగురు పిల్లలు. మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ద్వారా మరో ఐదుగురు. ఈ ఇద్దరు భార్యలనీ, తొమ్మండుగురు పిల్లల్నీ పోషించలేక చాలా అవస్థ పడేవాడు. అతనిది మా పక్క ఇల్లు. రెండు గదులది. మా ఇంటికి అనుకుని ఉంటుంది. ఆ అంతమందీ ఆ యింట్లోనే వుంటారు. సహజమైన కుతూహలంచేత నేను ఖాదర్ జీవనసరళిని క్షుణ్ణంగా పరిశీలించాను. పవిత్రంగా కనిపించే అతనిలో ఒక మిష్టర్ హైడ్ దాగున్నాడేమోననిపించేది.
ముస్లిం ఏరియాలో హిందూ ఫ్యామిలీ ఉండడం మా చుట్టుపక్కల చాలామందికి నచ్చలేదు అందునా ఒక ముస్లింకి మేము ఆశ్రయం ఇవ్వడం కంటగింపుగా ఉండేది. అతన్ని మేము హిందువుగా మారుస్తామేమోనని వాళ్ల భయం. అతన్ని బయటకు పంపించేయమని అన్యాపదేశమైన హెచ్చరికలు తరుచుగా వచ్చేవి.
“ “ఆ ప్రాంతంలో ఉంటూ వాళ్ళ కుర్రాడిని మీ ఇంట్లో ఉంచుకుని లేనిపోని సమస్యలు ఎందుకు తెచ్చుకుంటావు? వాడినేనా బయటికి పంపించు. లేకపోతే మీరేనా ఇల్లు మారండి” అని నా స్నేహితులు హెచ్చరించారు.
ఇల్లు మార్చడం మంచిదనిపించింది. నలుగురైదుగురికి చెప్పి వుంచాను. “ఎందుకు వచ్చిన గొడవ? నెమ్మదిగా నచ్చచెప్పి అక్బర్ని ఖాదర్ దగ్గరికి పంపించేయండి. కావాలంటే తన చదువుకయ్యే ఖర్చు మనమే పెట్టుకుందాం ” అంది శాంతి. సరేనని తలూపాను. ఇల్లు మార్చబోతున్న సంగతి తనకు ఇంకా చెప్పలేదు . మరో ఇల్లు దొరికాక అప్పుడు చెప్పచ్చనుకున్నాను.
సమస్య తలెత్తగానే నలుగురితో పంచుకునే అలవాటు నాకు లేదు. కొంత యోచన చేసి ఒక పరిష్కారం దొరికాక, లేకపోతే నాకు ఎటువంటి పరిష్కారం దొరకనప్పుడు మాత్రమే చెప్తాను.
“ఈ మధ్యన అక్బర్ ప్రవర్తన కూడా మారింది. సాయంత్రాలు ఆలస్యంగా వస్తున్నాడు . రాత్రి మళ్ళీ బయటకి వెళ్తున్నాడు . ఖాదర్‍తో ఒకటే మంతనాలు” కాస్త ఆగి మళ్ళీ చెప్పింది.
నేను ఆలోచనలో పడ్డాను. అక్బర్ ఖాదర్ వైపు మొగ్గు చూపిస్తున్నాడా? ఎందుకు? దీని పర్యవసానం ఏమౌతుంది? సమస్య ఆలోచించిన కొద్దీ జటిలంగా కనిపిస్తోంది. ఎందుకింత ఆలోచన? నాలుగు నెలల్లో ఇంటర్ పరీక్షలు ఉన్నాయి. పాసయితే ఏదో ఒక జీవనోపాధి దొరుకుతుంది. వాళ్ళ వాళ్ళే ఎవరో ఒకరు పిల్లనిచ్చి అతడిని తమలో కలుపుకుంటారు. దీని గురించి ఎందుకింత భయపడటం?
….
ఆదివారం బద్ధకంగా తెల్లారి చురుగ్గా సాయంత్రమైంది. ఎవరం ఎక్కడికీ వెళ్ళలేదు. అందరూ ఇంట్లోనే ఉంటున్నాం. రాత్రి భోజనానికి అక్బర్ బిర్యానీ చేస్తున్నాడు. అతను ఇంట్లో బాగా కలిసిపోయాడు. అతనికి కావలిసినవి అందిస్తూ అటూ ఇటూ తిరుగుతోంది శాంతి.
అక్బర్ హైదరాబాదీ వంటలు చాలా బాగా చేస్తాడు. ముఖ్యంగా బిర్యాని, డబుల్ కా మీఠా… అతన్ని పొగుడుతూ తినేసాం. భోజనాలు అయ్యేసరికి బాగా రాత్రైంది. అంతా ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. నాకు నిద్ర రాలేదు. టీవీ చూసి ఇంక పడుక్కుందామనుకుంటుంటే వీధి తలుపు చప్పుడైంది. ఇంత రాత్రి ఎవరై ఉంటారా అని కిటికీలోంచీ చూసేసరికి ఖాదర్ కనిపించాడు.
” ఇంత రాత్రి వచ్చారేంటి ?” అని ప్రశ్నిస్తూ తలుపు తీశాను. లోపలికి వచ్చాడు. ఆ రావటంలో కొంత జబర్దస్తీ కనిపించింది. వెంట ఒకరొకరుగా ఖాదర్ మిత్రులు ఐదారుగురు వచ్చి చేరారు. అందరితో నాకు ముఖపరిచయం మాత్రమే ఉంది. ఇంత రాత్రయ్యాక అంతా కట్టకట్టుకుని వచ్చారంటే నాకు ఏదో అనుమానంగా ఉంది .అక్బర్ విషయంలో గొడవ పడటానికి వచ్చారా?!!
నా ఊహ సరైనదే.
“ “అక్బర్ మీఇంట్లో ఎందుకుంటున్నాడు?” సూటిగా అడిగాడు . తన స్నేహితులంతా వచ్చేశాక అతనీ ప్రశ్న అడగడానికి ఎంతో టైం తీసుకోలేదు.
“ “తనకంటూ ఎవరు లేరు కదా , మా ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు” క్లుప్తంగా అన్నాను.
” వంటవాడిగానా? నౌకరుగానా?” ఖాదర్ మాటల్లో వెటకారం.
” అవసరమైతే నా కొడుకు నా బూట్లు తుడుస్తాడు, నా కూతురు నేను తిన్న కంచం ఎత్తుతుంది. అతనికి వచ్చినవీ, నచ్చినవీ అతను చేస్తున్నాడు ” జవాబిచ్చాను.
నా జవాబునుంచి తేరుకోవడానికి ఖాదర్‍కి కొంత వ్యవధి పట్టింది.
” వాడిని హిందువుని చేద్దామనుకుంటున్నారా?”
నేను నవ్వాను . ” మతం అనేది ఒక నమ్మకం . దాన్ని ఉగ్గుపాలతోటే రంగరించి పిల్లలకి పోస్తాము. దాన్ని మార్చటం సాధ్యపడుతుందని నేను నమ్మను. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న వ్యక్తి కూడా అసలు ఏ దేవుణ్ణీ నమ్మడం మానేస్తాడేమోగానీ మతాన్ని మారడు. అలా మారినట్టు ఎక్కడా చూడలేదు”
” సాబ్! ఈ పెద్ద పెద్ద మాటలు మాకు తెలియవు . మావాడొకడు హిందువుల ఇంట్లో ఉండటానికి మేము ఒప్పుకోము. వాడిని మాతో పంపియండి “అన్నాడు ఖాదర్.
” అతడు నా కొడుకు స్నేహితుడు. నా కొడుకు కోరికమీద అతనికి ఆశ్రయం ఇచ్చాను. ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అదవ్వగానే ఎక్కడో ఒక చోట ఉద్యోగం చూస్తాను. తన బతుకు తను బతుకుతాడు”
వాళ్లు ఒప్పుకోలేదు. అక్బర్‍ని తక్షణం ఇంట్లోంచి పంపించమని పట్టుపట్టారు.
” పదోతరగతితోకూడా ఉద్యోగం వస్తుంది. ఇంటరే అక్కర్లేదు. ఉద్యోగం ఇప్పిస్తానని వాడిని వాడుకుంటున్నారు. అరటిపళ్ళబండి పెట్టుకుంటే వాడు మీరు చూపించే ఉద్యోగంకన్నా కూడా స్వతంత్రంగా బతుకుతాడు”
మాటామాటా పెరిగింది. ఆవేశాలు పెరిగాయి. గొంతులు పెరిగాయి. పట్టుదలలు పెరిగాయి. ఈ గలభాకి లోపల గదుల్లో ఉన్న వాళ్లంతా వచ్చేసి నిశ్చేష్టులై చూడసాగారు.
మతం అనేది ఆచరించే మనిషినిబట్టి విలువని సంతరించుకుంటుంది. హిందూధర్మం పామరులచేత పడి మూఢనమ్మకాలకు, జంతుబలులకు నిదర్శనంగా నిలబడింది. అదే సమయంలో వేదపండితుల చేతుల్లో విరాజమానంగా వెలిగింది. ఇంకే మతమైనా కూడా అంతేననిపించేలా ఉంది, ఖాదర్‌వాళ్ల ప్రవర్తన. ఏ ధర్మమైనా, ఏ మతమైనా ఒక మనిషిని నిరాశ్రయుణ్ణి చేయమనవు. అతని నోటి దగ్గర ఉన్న అన్నాన్ని లాగేయవు… కరుడుగట్టిన స్వార్థం ఆడిస్తుంటే తప్ప.
నేనిప్పుడేం చేయాలి? ఈ గొడవ ఎంతదాకా వెళుతుంది? అసలు ఈ రాత్రి తెల్లవారుతుందా లేక రేపటి న్యూస్ పేపర్లలో వార్తగా వస్తుందా? ఎలా పరిష్కరించాలి, ఈ సమస్యని?
ఉన్నట్టుండి ఖాదర్ లేచి వెళ్లి రాగిణి చెయ్యి పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి తెల్లబోయాను. ” అక్బర్ ని మీరే ఉంచుకోండి ఈ పిల్లని నేను వుంచుకుంటాను” అన్నాడు వక్రంగా చూస్తూ.
వెంటనే ఖాదర్ రెండో భార్య గుర్తొచ్చింది నాకు. ఆమెకి పాతికేళ్ళకు మించి ఉండవు పదేళ్ల పిల్లలకి తల్లి . నా రక్తం ఉడికిపోయింది.
రాగిణి బిత్తరబోయి చూస్తోంది.
” ఖాదర్ పాప చెయ్యి వదులు” కటువుగా అన్నాను.
” చాచా! ఆమెను వదులు” గట్టిగా అన్నాడు అక్బర్. యధాలాపంగా అతనికేసి చూసిన నేను ఉలిక్కిపడ్డాను. కళ్ళలో ఎర్రటి జీరలు. ముఖం కఠినంగా ఉంది. నాకు పూర్తిగా అపరిచితమైన వ్యక్తిలా అనిపించాడు.
ఖాదర్ రాగిణిని వదిలిపెట్టేశాడు. అక్బర్ పక్కకి వెళ్లి నిలబడింది. నా మెదడులో ఏదో సందేహం పురుగులా తొలచడం మొదలైంది. ఇద్దరి మధ్యా అవాంఛనీయమైన చనువు చోటు చేసుకుంటోందా? అనే ప్రశ్న తలెత్తిన మరుక్షణం అతడిపట్ల వ్యతిరేకభావం మొదలైంది.
రాగిణి చిన్నపిల్ల. ఏమి తెలీదు. అమాయకంగా పెరిగింది. కానీ అక్బర్? అందుబాటులోకి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటాడా?
” రావు సాబ్! మా మతం మీకు ఎంత గొప్పదో, మా మతం మాకు అంతే .మీ పాపని నేను ముట్టుకుంటేనే అంత కోపం వచ్చింది, మావాడు మీ ఇంట్లో ఉంటే మాకు రాదా?” ఖాదర్ అడిగాడు.
” అదీ ఇదీ ఒకటేనా?” ఆ వ్యక్తిని చూస్తుంటే నాకు అసహ్యం వేసింది ఇలాంటి మూర్ఖుల చేతిలో అర్ధాలు మారిపోయిన మతం కోసం నా కూతురిని బలి చేయనా? ఖాదర్‍కిగానీ అక్బర్‍కిగానీ?
తల బలంగా విదిలించాను. ఖాదర్ ఈరోజు రాగిణి చెయ్యి పట్టుకున్నాడు. రేపు ఇంకో అడుగు ముందుకేస్తాడు. ఈ కుంపటి నిత్యం రగులుతూనే ఉంటుంది. ఈ నాటకంలో అక్బర్ పాత్ర కూడా ఉందేమో. ఖాదర్ వాళ్ళకి వ్యతిరేకంగా వాడిని ఉంచుకుంటే ఆ తర్వాత నెమ్మదిగా ప్రేమ కలాపాలు మొదలుపెడతాడేమో!
నా సంయమనం విచ్చుకుపోయింది . అక్బర్ వైపు తిరిగాను. ” నీకేదో చెయ్యాలనుకున్నాను. వీళ్లు పడనివ్వటంలేదు. నీ కోసం గొడవలు పడి నా ఇంటి పరువు బజారుకి యీడ్చుకునేంత ఔదార్యం నాకు లేదు. ఖాదర్ తో వెళ్ళిపో . చదువు పూర్తయ్యాక వచ్చి కలువు. నాకు చేతనైన సాయం చేస్తాను” అన్నాను.
ఒక్క క్షణం. ఇల్లంతా సూదిమొన ఆనినా వినిపించేంత నిశ్శబ్దంతో నిండిపోయింది.
” బాబుగారూ!” అక్బర్ దిగ్భ్రాంతిగా అన్నాడు.
“ప్లీజ్!” నా గొంతు నాకే కఠినంగా అనిపించింది. అక్బర్ మారు మాట్లాడకుండా తన వస్తువులు సర్దుకుని ఖాదర్ వాళ్ళ వెంట వెళ్ళిపోయాడు. మరుసటిరోజే నేను శాంతీ వాళ్ళని మా ఊరు పంపించి, ఇల్లు మార్చేశాను.

” మీ ఇంట్లో ఉండేవాడే , అదే ప్రభు ఫ్రెండ్ … చెడుసావాసాలు పడుతున్నాడు ” అని ఒక మిత్రుడు నాతో అంటే-
” అందుకే ఇంట్లోనుంచి పంపించేశాను” జవాబు ఇచ్చాను.
ఎంత వద్దనుకున్నా అక్బర్ గురించి ఏదో ఒక వార్త నా చెవిన పడుతూనే ఉంది. ఖాదర్ చిన్న ఎత్తున దొంగ వ్యాపారాలు చేసేవాడు . అతనికి ఒక నమ్మకమైన మనిషి అవసరం. అందుకు అక్బర్ ని ఎంచుకున్నాడు. అక్బర్ ని తన వ్యాపారాల్లోకి లాగాడు . అతని పేరు పోలీస్ రికార్డుల్లోకి ఎక్కగానే సంబంధాలు తెంచుకున్నాడట. అక్బర్‍కి ఇప్పుడు తనదైన దారి వెతుక్కోవలసిన సమయం వచ్చింది. ఏదైతే కాకూడదని అతనికి ఆశ్రయం ఇచ్చానో అదే అయ్యాడు.
నాకు కొంచెం బాధ కలిగింది. తీసుకున్న నిర్ణయాన్ని గురించి అంతకు మించి ఎప్పుడూ బాధపడలేదు. అలా కాకుండా ఇంకోలా చేసి ఉండాల్సిందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ఆలోచనే రాలేదు. చాలా పెద్ద సమస్యలోంచీ గట్టెక్కినట్టనిపించింది. రోజులు మారాయి. నేనూ మారక తప్పదు.
రాగిణి చాలాకాలం అక్బర్‍ని మర్చిపోలేదు అతను వెళ్ళిపోయిన కొత్తలో నన్ను రెండుమూడుసార్లు అడిగింది, “నాన్నా! అక్బర్‍ని ఎందుకు పంపించేశారు?” అని.
“పెద్దైతే నీకే అర్థమవుతుంది” నేనూ, శాంతీ మాట దాటేసేవాళ్ళం.
పెద్దవుతున్నకొద్దీ రాగిణిలో ఒక విధమైన ఉదాసీనత , నిర్లిప్తత కనిపించి నన్ను పజిల్ చేసేవి. అక్బర్‍ని మర్చిపోలేదా ఇంకా? అనే సందేహం నాలో తలెత్తేది. అంత చిన్న వయసులో అలాంటివి ఏమీ ఉండవని నాకు ఒక నమ్మిక. తన తత్వమే అంత అనుకుని వదిలేశాను. నా నమ్మకాన్ని వమ్ము చేస్తూ రాగిణి అక్బర్ కోసం బయలుదేరడం…. ఏమిటిదంతా?

సూపరింటెండెంట్‍ని కలిసి పర్మిషన్ తీసుకున్నాము. మమ్మల్ని థరోగా చెక్ చేసారు. సెంట్రీలు అక్బర్ ఉన్న సెల్ దగ్గరికి తీసుకెళ్లారు. ఊచలకి వీపు ఆనించి నిల్చున్నవాడల్లా మా అలికిడికి మాకేసి తిరిగాడు. నేను ఒక్క అడుగు వెనక్కి వేసాను. రాగిణి బొమ్మలా అలాగే నిలుచుంది.
అక్బర్‍లో చాలా మార్పు వచ్చింది. అప్పటి అమాయకమైన మొహం, సున్నితమైన రూపము లేవిప్పుడు. మొహంనిండా కత్తిగాట్లు, దెబ్బల మచ్చలూ ఉన్నాయి. భయంకరంగా ఉన్నాడు. మమ్మల్ని చూసి తెల్లబోయాడు. తర్వాత రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. మృత్యుముఖంలో నిలబడి వున్న అతన్ని చూస్తుంటే నాకు విషాదం కలిగింది. ఈ భయంకర విధ్వంసానికి అంతటికీ నేనే బాధ్యుడిననిపించింది. అక్బర్‍ని కాపాడగలిగే మార్గంతరాలగురించి నేను ఆరోజు ఆలోచించలేదు. భయపడ్డాను… అతన్ని వదిలించుకున్నాను… వట్టి పిరికివాడిలా.
“నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి?” రాగిణిని సూటిగా అడిగాడు.
వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారా? నేను కొంచెం దూరంగా వెళ్లి నిలబడనా, లేక ఇక్కడే ఉండనా అనే సందేహం కలిగింది. కొంత ఆలోచించుకున్నమీదట అక్కడే ఉండాలనుకున్నాను వాళ్ళ సంభాషణ వినాలని కూడా అనుకున్నాను.
“నన్ను క్షమించమని అడగటానికి”” రాగిణి గొంతులో ధ్వనించిన భావమేదో నాలోని అపరాధభావనని మరింత పెంచింది.
” అదేంటి రాగిణీ నువ్వేం చేసావు?” అక్బర్ అయోమయంగా అడిగాడు.
” ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్పు. నేను ఆడపిల్లని కాకపోయి ఉంటే ఖాదర్ నాతో అలా అని ఉండేవాడు కాదు. ఖాదర్ లాగే నువ్వు కూడా ఏదో ఒక రోజుని నా చెయ్యి పట్టుకుంటావని మా నాన్న భయపడేవాడు కాదు”
రాగిణీ! దిగ్భ్రాంతిగా అనుకున్నాను. అంత తేలిగ్గా ఒక చిన్నపిల్లకి దొరికిపోయానా? !!
“మా నాన్న నిన్ను నమ్మలేకపోయాడు. ఎందుకంటే నువ్వు పైవాడివి. కానీ నన్ను కూడా నమ్మలేదు. అది నాకు బాధనిపిస్తోంది. నువ్వు ఈవేళ చావుకి దగ్గరయ్యావు. కానీ నేను? ఆ విషయం అర్థమైనరోజే మానసికంగా చచ్చిపోయాను”
నేను నా కూతుర్ని నమ్మలేకపోయానా? అందుకే అక్బర్ని వెళ్లగొట్టానా? అప్పటి నా భయాన్ని ఇప్పటి తన ఆలోచనతో తూకం వేస్తోందా? నన్ను నేను శోధించుకోవటం మొదలుపెట్టాను.
“నేనే కాదు, ఏ ఆడపిల్లేనా సరే, చెయ్యి పట్టుకోగానే ఆ మగవాడితో వెళ్లిపోతుందా? మగవాడి స్పర్శ క్షణంసేపు రక్తంలో రేపే అలజడిని తట్టుకుని నిలబడలేనంత దుర్బలురా, ఆడవాళ్ళు? జన్మసంస్కారం, పెంపకం, కుటుంబ నేపథ్యం ఇవన్నీ ఆ అలజడి ముందు ఓడిపోతాయా? ప్రపంచంలోని తండ్రులందరి విషయం వదిలెయ్. నా తండ్రి ఎంతో ఉదాత్తుడనుకున్నాను. ఆయన కూడా అలాగే ఆలోచించడం నేను తట్టుకోలేకపోతున్నాను… “
నేను తల దించుకున్నాను.
“… మనం ఒక సమస్యలో ఇరుక్కున్నాము. ఆ సమస్యలో నువ్వూ వున్నావు. అంతే తప్ప సమస్యవి నువ్వు కాదన్న విషయం మన అందరి పక్షాన నిర్ణయం తీసుకునే స్థానంలో ఉన్న ఆయనకి అర్థం కాకపోవటం నాకు ఒక సవాలులా అనిపిస్తోంది. నిర్ణయాధికారం గల స్థానంలో ఉన్న వ్యక్తి బయాస్‍డ్‍గా ఆలోచిస్తే ఎలా ఉంటుందో దానికి ప్రత్యక్ష తార్కాణం నువ్వు. అలాంటివారి ఉద్యోగ సంబంధిత నిర్ణయాలమీద కూడా నాకు సంశయమే. అందుకే మనం దేశం మొత్తంగా ఈ రోజున ఇలాంటి స్థితిలో ఉన్నామని నా అభిప్రాయం. ఆయన కూతురిగా కాదు, అలాంటి వ్యక్తులు కీలక స్థానంలో కూర్చుని నడిపిస్తున్న ఈ వ్యవస్థలోని ఒక పౌరురాలిగా చెప్తున్నాను “
ఒక విస్ఫోటనం జరిగినట్టు నాలో ప్రకంపనాలు. అవును! నేను చాలా సంకుచితంగా ఆలోచించాను. సమస్యని తప్పు కోణంలోంచి చూశాను. అక్బర్‍ని ఇంట్లోంచీ పంపించటం చాలా పెద్ద తప్పు… రెహమాన్ దగ్గరకో మరో సురక్షితమైన చోటుకో కాకుండా కాకుండా ఖాదర్ దగ్గరికి…
అతన్ని చేరదీసినప్పుడు చాలా వున్నతంగా ఆలోచించాను… కానీ ఆ ఔన్నత్యాన్ని చివరిదాకా నిలబెట్టుకోలేదు. ఒక గులకరాయి దొర్లిపోతుంటే పట్టుకుని ఆపగలిగీ ఆపలేదు.
ఒక నేరం జరిగిందంటే అందులో ప్రత్యక్షంగా నేరస్తులుగా కనిపించేది ఒకరో ఇద్దరో. కానీ వాళ్ల వెనక ఒక పెద్ద గుంపు వుంటుంది. న్యాయానికీ ధర్మానికీ తేడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ధర్మం ప్రతి మంచిపనీ చెయ్యమని ప్రేరేపిస్తుంది. మనిషి అవన్నీ చెయ్యడు. కొన్ని విద్యుక్తధర్మాలు వుంటాయి.అవికూడా చెయ్యనప్పుడు అలాంటి వుపేక్షలకి పర్యవసానం ఆ నేరం. విద్యుక్తధర్మాన్ని వుపేక్షించినవాళ్ళు ఆ గుంపులో వుంటారు. నేనూ వున్నాను.
“రాగిణీ! చాలా పెద్దదానివయావు. చాలా పెద్దమాటలు చెప్తున్నావు. కానీ ఆ సమయంలో అంతకన్నా బాబుగారు మాత్రం ఏం చేస్తారు ? ” నెమ్మదిగా అడిగాడు అక్బర్. రాగిణికోసం అతను తగ్గి మాట్లాడాడుగానీ, ఈ వ్యవస్థ మొత్తంమీద తిరగబడాలనే ఆవేశం అతనిలో లావాలా కుతకుత వుడుకుతోందనిపించింది మొదట. కానీ నిదానించి చూస్తే తనకోసం ఏమీ చెయ్యని తండ్రిమీద అలిగినట్టు అనిపించాయి.
” నిన్ను నేను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను అక్బర్! ఎలాగంటే ఒక్క కుటుంబంలోనివాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నట్టు, ఒక మనిషి సాటి మనిషిని ప్రేమించినట్టు. ఈరోజు నీ పరిస్థితికి మేమంతా కారణం అన్న ఊహ నన్ను అడకత్తెరలో వేసినట్టు నొక్కేస్తోంది”
ఆ తర్వాత వాళ్లిద్దరిమధ్యా దుస్సహమైన మౌనం.
” రాగిణీ! అవన్నీ ఎందుకు ? ఇలా జరగాలని ఉంది. జరిగిపోయింది. మీ ఇంట్లో ఉన్న ఆ కొద్ది రోజులూ నేను నిజమైన సంతోషాన్నీ కల్మషం లేని ప్రేమనీ అనుభవించాను. మీ అందరికీ జన్మ జన్మకీ రుణపడి ఉంటాను” చాలా సేపటి తర్వాత గొంతు విప్పాడు అతని మాటల్లో నిజాయితీ ధ్వనిస్తోంది.
” ఆ రోజుని … అంటే ఇంట్లోనుంచి నిన్ను వెళ్లగొట్టిన రాత్రి… నేను చిన్నపిల్లని. నా చేతుల్లో ఏమీ లేదు. ఈరోజు నాకు డబ్బుంది ఉద్యోగం ఉంది నీ కోసం ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఉంది. చెప్పు అక్బర్! నీకోసం నేనేం చేయగలను?” అడిగింది రాగిణి. దారుణంగా ఓడిపోయినవాడిలా నిలుచున్నాను. అవమానంగాకానీ కోపంగాకానీ లేదు. చిత్రంగా రాగిణి ఇతని కోసం ఏం చేయగలదా అని ఆలోచిస్తున్నాను.
“చెప్పు..” రెట్టించింది.
“క్షమాభిక్ష తిరస్కరించారు” నిదానంగా అన్నాడు అక్బర్. అతని మొహం మీద విచారపు నీడలు పరుచుకున్నాయి.
“మంచి ప్లీడరుని పెట్టుకుని మరొక ప్రయత్నం చేస్తాను. కనీసం యావజ్జీవంగానేనా మార్చుతారేమో నాకు సాధ్యమైనంతవరకూ ప్రయత్నిస్తాను” పట్టుదలగా అంది. రాగిణి.
“రెండు హత్యానేరాలు రుజువయ్యాయి” అక్బర్ ముఖంలో ఆశనిరాశలు ఒకే ఒక్క క్షణంలో కనిపించడం, తలక్రిందులవడం రెండూ కూడా చూసాను. సరిగ్గా కొన్నేళ్ల క్రితం జరిగినట్టే.
సెంట్రీ వచ్చి టైం అయిపోయిందని చెప్పాడు.
నిజమే! టైం అయిపోయింది… ఏం చేయటానికీ కూడా. రాగిణిని అక్కడినుంచి తీసుకుని వచ్చేసాను.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s