పెళ్లిపిలుపు 3 by S Sridevi

సెల్ ఫోన్ తీసుకుని సంయుక్త ఇచ్చిన నెంబరుకి చేసాడు.
“మీ అమ్మ మీ దగ్గర వున్నారా? ” అని అడిగాడు.
“వంటింట్లో వుంది ” అంది సంయుక్త. ఆమెకంతా అయోమయంగా వుంది.
“ఆమె దగ్గరకు వెళ్లి స్పీకర్ పెట్టండి. ప్లీజ్!” అన్నాడు. సంయుక్త అలానే చేసింది.
శ్రీధర్ చెప్పసాగాడు.”సంయుక్తా! నిన్న మీతో చెప్పిన విషయం మీ నాన్నతో చెప్పాను. ఆయన కచ్చితంగా ఏదీ  చెప్పకుండా నన్ను గేటు బయటికి తోసుకుంటూ వెళ్లి తనెక్కడికో వెళ్లిపోయారు”
“…”
“అంటే నిర్ణయం మనకే వదిలేసారని అనుకుంటాను “
“…”
” మనకి పెద్దగా పరిచయం లేదు. మనం కలుసుకున్నది కూడా రెండే రెండుసార్లు . అంతలోనే ఇలాంటి నిర్ణయానికి ఎలా వచ్చానని మీరు అనుకోవచ్చు. నన్ను మీ పక్కింట్లో మొదటిసారి చూసాకే మీలో చైతన్యంలాంటిదేదో పుట్టుకొచ్చి ఆ జీవితంలోంచీ బయటపడ్డారనుకుంటున్నాను”
“…”
“నాకుకూడా మిమ్మల్ని చూసాకే పెళ్లిమీదికి ధ్యాస పోయింది.   అమ్మ మా చిన్నప్పుడే పోయింది.  నాన్న మరో పెళ్లి చేసుకోలేదు. ఆడదక్షత లేని కుటుంబం కావటాన్న పండుగలు, వేడుకల్లాంటివాటికి మేము దూరంగా వుండిపోయాము. అక్కలు ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు. వాళ్లకి కాకుండా నేనెలా చేసుకుంటానని ఇన్నేళ్ళూ ఆగిపోయాను”
“…”
“…మీ జీవితం ఇలాంటి మలుపు తీసుకోకపోతే మీ స్ఫూర్తితో  కుటుంబం ఏర్పరుచుకునేవాడిని. ఎందుకు… అంటే…  దే జస్ట్ హేపెన్… జనాంతికంగా కొన్ని విషయాలు జరుగుతాయి.  కాబట్టి… సంయుక్తా! ఇప్పుడు మనమధ్య ఎలాంటి అవరోధాలూ లేవు.అందుకే ఈ ప్రతిపాదన.”
“…”
“నేను మీ గేటు అవతల వున్నాను. ఇక్కడ ఇలా ఎంతోసేపు నిలబడితే బావుండదు. పది నిముషాలు ఎదురుచూస్తాను. ఇష్టమైతే నాతో వచ్చెయ్యండి. సివిల్ మేరేజి చేసుకుందాం “
చెప్పదలుచున్నదంతా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు.
“ఏమిటే ఇది?” అని శారద అడిగేలోగా సంయుక్త అక్కడినుంచి వెళ్ళిపోయింది.
ఒక అపసవ్యమైన పనికి అనేక సమస్యలు పిలకల్లా పుట్టుకొస్తాయి.  కూతురి పెళ్ళి ఒక పొరపాటు.  శేషు తనకి అల్లుడి స్థానంలో నచ్చలేదు.  మేనల్లుడిగా అతని అల్లరి భరించడం వేరు. ఎవరూ తనమాట వినలేదు. అక్కగారితో వియ్యమని వుబ్బితబ్బిబ్బయాడు భర్త.  ఆ ఆనందం ఎన్నాళ్ళో నిలవలేదు. విడాకులని దాటుకుని వచ్చి నిలబడింది. 
ఇప్పుడేం చెయ్యాలి తను? సంయుక్తని వెళ్లద్దని ఆపాలా? ఎంతకాలం? ఆగితే శేషు మారతాడా?అవకాశం  వుందా? అప్పుడే మరో పెళ్ళికి సిద్ధమయాడతను.  ఈ శ్రీధర్ ఇప్పటికిప్పుడు తేల్చమంటున్నాడు.
ఏదో ఒకటి తేల్చి చెప్పి అతన్ని పంపేయకుండా గేటుదగ్గర నిలబెట్టి భర్త తను వెళ్లిపోవటమేమిటి? అంటే నిర్ణయం కూతురికి వదిలేసాడా? సందిగ్ధంలో పడింది.

అరగంట తర్వాత రాజారావు తిరిగి వచ్చాడు. గేటు బయట శ్రీధర్ కనిపించలేదు.  గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టాడు.  ఇల్లంతా శ్మశాన నిశబ్దం పరుచుకుని వుంది.  శారద అనేక భావాలతో సంఘర్షించి అలిసిపోయి అభావంగా కూర్చుని వుంది. భర్త రాకతో మళ్ళీ సంఘర్షణ మొదలైంది.
“అది అతన్తో వెళ్లిపోయింది ” అంది ధైర్యం తెచ్చుకుని.
“పిల్లలు?”
“వెంట తీసుకెళ్ళిపోయింది “
రాజారావు దిమ్మెరపోయాడు.  నిలుచున్నపళంగా కుర్చీలో కూలబడ్డాడు. ఇది రెండో అఘాతం. చాలాసేపు ఏమీ మాట్లాడలేదు.  కూతుర్లో ఇంత తెగింపు వుందనుకోలేదు. ఎన్నో విషయాల్లో జయలక్ష్మి జోక్యం చేసుకుని ఆమె నిర్ణయాలని తనపై రుద్దినప్పుడు అతని మనసులో ఇంకోలా జరగాలనే కోరిక వుండేది.  ఇప్పుడూ అలానే జరిగింది.  శారదో, సంయుక్తో తను శ్రీధర్తో గట్టిగా చెప్పలేకపోయిన విషయాన్ని చెప్పి పంపిస్తారనుకున్నాడు. అందుకు భిన్నంగా జరిగింది. కొన్ని పొరలని తవ్వుకుంటూ వెళ్తే ఇలా జరగాలనేది కూడా అతని ఆకాంక్షే.
ఏం జరగబోతోందోనని శారద భయపడింది. రాజారావు జడుడిలా అలా కూర్చోవడం ఇంకా భయాన్ని కలిగించింది. తనుగా మాట్లాడాలన్నా భయమే. ఒక పరిస్థితి ఇన్ని రకాల భయాలని సృష్టించడం మనుషులమధ్య గడ్డకట్టిన సంకోచాలని వ్యక్తపరుస్తుంది. మనసులో మాటలని పంచుకోనివ్వదు.
అతనెవరు? ఎలాంటివాడు? నీకెలా పరిచయం ?అని కూతురిని అడగటానికి భయం… జవాబేం వస్తుందోనని. ఎంతసేపూ ఆ పరిచయం తుంచెయ్యమనే చెప్తూ వచ్చింది.  అలా కాకపోతే ముందు రాత్రి అతను అడిగినదాన్ని తనకి చెప్పేది. విని భర్తతో చర్చించగలిగే అవకాశం…ముగ్గురూ కూర్చుని ఏం చెయ్యాలో నిర్ణయించుకోగలిగే సానుకూలత వుంటే  ఏం చెయ్యటానికేనా తమకి వ్యవధి వుండేది.  పునరాలోచనకి వీలుండేది.
చాలాసేపటికి నోరు తెరిచాడు రాజారావు.
“ఇంటి తలుపులు ఎప్పుడూ తెరచే వుంచు శారదా, ఏ క్షణాన ఏ స్థితిలో అది  తిరిగొచ్చినా చోటివ్వడానికి”
“…” 
శారదకి ఏడుపొచ్చింది. ఈ సమస్యకు ఇదా పరిష్కారం?
“నేను చాలా పిరికివాడిని. పరిస్థితులని ఎదుర్కోలేను. ఆరోజున జయక్కకి ఎదురు చెప్పలేక ఇష్టం లేకపోయినా సమ్మూని శేషుకిచ్చి  చేసాను. అది కాపురం చెయ్యలేక ఏడ్చినప్పుడల్లా నా లోలోపల బాధపడ్డానుతప్ప గట్టిగా నిలదీసి అడగలేకపోయాను. ఈరోజు అతనొచ్చి అడిగితే ఖరాఖండిగా కాదనలేక పక్కకి తప్పుకున్నాను. వాళ్లే నిర్ణయించుకుంటారనున్నాను. అలాగే నిర్ణయించుకున్నారు.  మంచో…చెడో…ఏం జరిగినా ఇకమీదట దాని జీవితం దానిష్టం” అంటూ కుర్చీలో వెనక్కి వొరిగి టవల్ ముఖంమీద కప్పుకున్నాడు. శారద బహిరంగంగానే ఏడ్చింది. 
ఇద్దరూ ఇల్లు దాటి ఎక్కడికీ వెళ్లకపోయినా  విషయం గుప్పుమనిపోయింది. రాజారావు పరివారమంతా వచ్చింది.  ఎవరూ ఈ సంఘటనని జీర్ణించుకోలేకపోతున్నారు.
“అది బరితెగించిందిరా! నీ కడుపున చెడబుట్టింది. చచ్చిందనుకో!  అసలు పుట్టనేలేదనుకో… “అని జయలక్ష్మి తిడుతుంటే గిజగిజలాడిపోయాడు. మిగిలిన అందరూ తలోమాటా అన్నారు.
“అది కాపురానికి వెళ్లనని మొండికేసినప్పుడే జాగ్రత్తపడాల్సింది. చస్తే చచ్చేది. ఈ తలవంపులు వుండేది కాదు” అన్నాడు నారాయణరావు.
రెండు కాలువల్లో సమాంతరంగా సాగుతున్న నీళ్ళు  ఒక కాలువలోంచీ ఇంకో కాలువలోకి ఎలా వెళ్లలేవో,  వీళ్ళ ఆలోచనలూ అంతే. ఎదుటివారి అక్కరని గుర్తించవు. రాజారావుకి కోరుకుంటున్నదీ వాళ్లు ఇస్తున్నదీ కలవట్లేదు.
శారదకైతే కడుపు మండిపోతోంది.  లోపల ఒక్కత్తే  కూర్చుని ఏడుస్తుంటే వసంత వెళ్లి దగ్గర కూర్చుంది. 
“ఏంటి అక్కయ్యా ! దిక్కులేనిదానిలా ఒక్కత్తినీ నడిరోడ్డుమీదికి పంపేసావా? మీరిద్దరూ నిలబడి కనీసం ఏ గుళ్ళోనో పెళ్లి చేసినా బావుండేది ” అంది కళ్ళ నీళ్ళు పెట్టుకొని.
అంతమంది వున్న కుటుంబంలో వాళ్లిద్దరే ఒకరికొకరు ఓదార్పు. మూడోకోడలు మళ్ళీ మేనరికం. ఆ తానులో ముక్కే.
“అతనొచ్చాడు. హాల్లో కూర్చున్నాడు.  బావగారితో చెప్పదలుచుకున్నది చెప్పాడు.  నేను వంటింట్లోనూ అది దానిగదిలోనూ వుండి విన్నాం. ఆ తర్వాత ఇద్దరూ వెళ్లిపోయారు.  అది ఫోను తీసుకుని నా దగ్గరకి వచ్చింది. అతనే… చెప్పాలనుకున్నది మరోసారి చెప్పి గేటవతల పదినిమిషాలు ఎదురుచూస్తానన్నాడు. అది దాని గదిలోకి వెళ్ళింది.  నాకేం చెయ్యాలో తోచలేదు. ఆడవాళ్ళకి ఏ స్వతంత్రం వుండదుగా,  మెదళ్ళు మొద్దుబారిపోయి వుంటాయి .  అతను వెళ్లేదాకా గదిలోనే వుండిపోతుందనుకున్నాను. అలికిడికి హాల్లోకి వచ్చి చూస్తే గేటు దాటుతూ కనిపించింది” పదేపదే అదే దృశ్యం కళ్ళముందు కదలాడుతుంటే అంది శారద.
“ఇప్పుడేం చేద్దాం అక్కయ్యా! బావగారు ఏమంటున్నారు?”
“ఆయనేమంటారు వసంతా? సగం మనిషి. మిగిలిన సగం ఆ పెద్దావిడ “
“ఎంత అపురూపంగా పెరిగింది అది! శేషుకి ఇచ్చి చేసి బతుకు బుగ్గి చేసారు.  ఇతనెవరో, ఎలాంటివాడో! ఒకసారి వెళ్లి చూడు అక్కయ్యా!” అంది.
“ఎక్కడికి వెళ్ళాలి? వెళ్లి ఏం చెయ్యాలి? బావగారు కలిసి వస్తే ఏదేనా చెయ్యగలను. ఎదిరించి ఇల్లొదిలి వెళ్తే …. దానికి ఏ కష్టమేనా వస్తే ఆశ్రయం ఎక్కడ ఇవ్వాలి?”
వాళ్లిద్దరూ మాట్లాడుకోవటం చూసి జయలక్ష్మి హాల్లోంచే అంది, “ఆడపిల్ల విషయంలో ఆ తెలివి ముందే వుండాలి. నయాన్నో భయాన్నో కాపురానికి పంపమంటే విన్నావు కాదు…ఇప్పుడు అనుభవిస్తున్నావు. తల్లీకూతుళ్ళు ఏకమై నా తమ్ముడిని క్షోభపెడుతున్నారు. ఇహమీదట ఇంట్లో దాని మాటెత్తడానికి వీల్లేదు”
శీను,  శేషు ఇంకో నలుగురు మగపిల్లలు శ్రీధర్ ఇంటిమీదకి గొడవచెయ్యటానికి బయల్దేరారు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగనే వూహించిన శ్రీధర్ పోలీసు ప్రొటెక్షన్ తీసుకున్నాడు. వీళ్ళు ఇంకేం చెయ్యలేక తిరిగొచ్చారు.
పరామర్శల పర్వం, ఓదార్పుల అధ్యాయం అయాయి. తుఫానుగాలి కుదిపి కుదిపి వదిలిపెట్టిన చెట్లలా మిగిలారు భార్యాభర్తలు.

క్లుప్తంగా రిజిస్టర్ మేరేజి చేసుకున్నారు శ్రీధర్,  సంయుక్త.  అన్నీ తనతో నిమిత్తం లేకుండానే జరిగిపోతున్నట్టు అనిపించింది ఆమెకి.  ఆమె విడాకులు తీసుకుంది కాబట్టి పెళ్లికి ముందు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు శ్రీధర్.
దానికిముందు ఇంట్లో చాలా చర్చ జరిగింది.
పెద్దక్క మేఘమాల అంది
” చాలా సాహసంతో కూడిన నిర్ణయం తీసుకున్నావు.  ఆ అమ్మాయికి ఇదివరకే పెళ్లి అయ్యింది. అంటే కొంత గతం… నీతో సంబంధం లేనిది… ఉంటుంది. ఆ పెళ్లి విఫలమైంది… అంటే ఆమె గతం విషాదంతో నిండి ఉంటుంది.  ఆ పైన ఇద్దరు పిల్లలు. సంఘం వొప్పని  ఎవరి సపోర్టూ ఉండని పెళ్లి మీది . మా విషయం వదిలేయ్.  ఆ అమ్మాయి తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఏమాత్రం సహకరించరు.  ఆమెని నువ్వు మామూలు మనిషిని చెయ్యాలి.   ఆమె పిల్లల్ని ప్రేమించగలగాలి.  పెద్దగా చదువుకున్నది కాదు కాబట్టి సోషల్ లైఫ్ కూడా పెద్దగా వుండదు. ఆశాభోంస్లేనో శోభాడేనో  ఆమె స్థానంలో ఊహించకు. ఆమెనుంచి ఏమీ  ఆశించకుండా అన్ని నువ్వే ఇవ్వడానికి సిద్దపడి ఉంటేనే చేసుకో” అని హెచ్చరించింది. 
“ఆమెను చూశాకే నాకు పెళ్లి మీదకి పోయింది. అనుకోకుండా ఆమె చేసుకోబోతున్నాను. ఈ పెళ్లి  నాకోసం ” అన్నాడు శ్రీధర్.
సంయుక్తని కూడా అలాగే అడిగింది మేఘమాల.  “మీరిద్దరూ కలుసుకోలేదు. పెద్దగా మాట్లాడుకోలేదు . ఏం చూసి  ఎలా నమ్మి మా తమ్ముడిని చేసుకోవాలనుకుంటున్నావు?” అడిగింది.
దానికి సంయుక్త చాలా స్పష్టంగా  జవాబు చెప్పింది.
”  మా జీవితాలని మార్చుకోవడం కోసం అతను నాకు, నేను అతనికీ ప్రేరణ అయ్యాము. మేము ఒకరిలోకి ఒకరం సింకయాము. ఏవేనా కారణాలచేత నా నిర్ణయం తప్పైతే…” ఆగింది సంయుక్త. బలంగా శ్వాస తీసుకుని పూర్తి చేసింది. ” మా యింటి తలుపులు నా వెనుక ఎప్పుడూ మూసుకోవు” 
సంయుక్త తను అనుకున్నంత బలహీన మనస్కురాలు కాదని అర్థమయింది మేఘమాలకి. శేషుతో తన పెళ్లి ఎందుకు విఫలమైందో క్లుప్తంగానే అయినా మరో సందేహానికి అవకాశం లేకుండా చెప్పింది. ఆడవాళ్ళు బలహీనతతోనే కాక ఆఖరి పోరాటంగా కూడా ఆత్మహత్యకి ప్రయత్నిస్తారని అర్థమయి, తను నమ్మే స్త్రీవాద భావాలకు కొత్త భాష్యం దొరికినట్టైంది మేఘమాలకి.
అలాగ వాళ్ల పెళ్లైంది. పెళ్లైన విషయంగానీ , పెళ్లి తేదీగానీ పెద్దగా ఎవరికీ చెప్పలేదు శ్రీధర్.  ప్రత్యేకించి బహిరంగపరచకపోవటానికి కారణం సంయుక్త పిల్లలు తమ కుటుంబానికి బహిర్భాగమౌతారని.
పెళ్లి విషయం సంయుక్త తల్లిదండ్రులకీ తెలిసింది.ఆమె చర్యలో అనైతికత లేదని ఇద్దరూ నిశ్వసించారు.
చిన్నచిన్న తిరస్కారాలు, ఇబ్బందులు వస్తునే వున్నాయి శ్రీధర్ కి సంయుక్త కుటుంబంనుంచి . దూరంగా వెళ్లిపోతే బాగుంటుందన్న వుద్దేశ్యంతో ఢిల్లీకి ట్రాన్స్ఫర్  పెట్టుకున్నాడు. అతని పై ఆఫీసరుకూడా విషయాలన్నీ విని రికమెండ్ చేసాడు.

నలుగురు వేరువేరు వ్యక్తులు సభ్యులుగా వుండేవారు శ్రీధర్ కుటుంబంలో. ఎవరి ఆలోచనలూ,  జీవనగమ్యాలూ వారివి. ఐదో వ్యక్తిగా సంయుక్త వచ్చి చేరింది.  పిల్లలు ఆమెకి ఎవరివల్లనో పుట్టినవాళ్ళుగా కాకుండా  ఆమె పిల్లలుగానే చూడబడుతున్నారు.
తనకొక విశిష్టమైన స్థానం,  గౌరవం…సంయుక్త కలలోకూడా వూహించనివి లభించాయి.
ఇల్లు నాలుగ్గదులూ హాలుగా వుంటుంది. ఎవరెవరు ఎక్కడ వుద్యోగం చేస్తున్నా రెండు మూడు రోజులకొకసారి ఇక్కడికి వచ్చేస్తారు.  ఆదివారంనాడు శ్రీధర్ తండ్రి  వస్తాడు. ఆరోజుని అందరూ కలుసుకోవడం తప్పనిసరి.  ఎవరి గది వారికి వుంది. 
ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలే…పొందికగా సర్ది వుంటాయి. 
మేఘమాల ఫెమినిస్టు సాహిత్యం ఎక్కువగా చదువుతుంది. రెండవ ఆమెవి మెడికల్ జర్నల్స్, రిసెర్చి పేపర్లు.  శ్రీధర్ తండ్రి జిడ్డు క్రిష్ణమూర్తిని. శ్రీధర్  ఆఫీసు రూల్స్,  వ్యవహారాలకి సంబంధించినవి,  లా బుక్స్ తోపాటు సాహిత్యం చదువుతాడు.
“పాతివ్రత్యంనుంచీ ఫెమినిజందాకా… ” అనే మల్లాది సుబ్బమ్మగారి పుస్తకాన్ని సంయుక్తకి చదవమని ఇచ్చింది మేఘమాల.
కట్టుబట్టలతో ఇంట్లోంచీ వచ్చిన సంయుక్తని తీసుకెళ్ళి ఆమెకీ పిల్లలకీ బట్టలు,  పెళ్లికని వుంగరం కొన్నాడు శ్రీధర్. 
“రేపు మేఘమాల వస్తుంది.  తనతో వెళ్లి ఇంటికి కావలిసినవన్నీ తెచ్చుకో” అని తన కార్డు ఇవ్వబోయాడు. తీసుకోలేదు సంయుక్త.
“ఎందుకు? నా దగ్గర డబ్బు  వుంది. కావలిసినప్పుడు అడుగుతాను ” అంది.
శ్రీధర్ చిన్నగా నవ్వి, ” నువ్వూ నేనూ ఇక వేరువేరు కాదు.  ఒకరిలోకి ఒకరం సింకయామని నువ్వేగా చెప్పావు” అన్నాడు.
ఆ అమ్మాయి చాలా సాధారణమైనదని అర్థమయింది శ్రీధర్ కి. చీరలు, నగలు, ఒక చిన్న ప్రశంస, ఒక చిరునవ్వు …అంతకన్నా మరేమీ అక్కరలేదు. పిల్లలని ఆడిస్తూ, తనాడుతూ, అందరినీ నవ్విస్తూ తను నవ్వుతూ ,  అందరి అవసరాలూ చూస్తూ,  మాటపడకుండా మాట అనకుండా అనుభవాల బరువుని దింపుకుంటోంది. తన వునికిని చూపించకుండా వీచి ఆహ్లాదపరిచే పిల్లగాలి తెమ్మెరలా అనిపించింది అందరికీ…శ్రీధర్ కి. అతనంటే చాలా ఇష్టం ఆమెకి. కానీ చిన్న సంకోచం.

విషయాలు కొద్దిగా పాతబడ్డాక సంయుక్తని చూడటానికి వచ్చింది శారద. ఆమె దుఃఖం చూడలేక, తనని తను ఓదార్చుకోలేక రాజారావే పంపాడు. అది శ్రీధర్ ఆఫీసులో వుండే సమయం. పిల్లలని మేఘమాల తీసుకెళ్లింది. వాళ్ల కాలేజీలో ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని. ఆమెకి వాళ్లతో గడపడం చాలా సరదాగా వుంది.
శ్రీధర్ కీ, సంయుక్తకీ ఏకాంతం కల్పించటం కోసం కూడా అదొక ప్రయత్నం.
” ఎలా ఉన్నావమ్మా? పిల్లలు ఏరి? బావున్నారా? స్కూలుకి పంపటం లేదట? ” ఆర్తిగా అడిగింది శారద.
తల్లిదండ్రుల  విషయంలో తన నమ్మకం నిజమైనందుకు  సంయుక్త సంతోషపడింది. 
“నువ్వెలా వున్నావమ్మా? నాన్న? ” ఆరాటంగా అడిగింది.  తన విషయాలన్నీ చెప్పింది.
” శ్రీధర్ ఢిల్లీ  ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడట. ఏకంగా అక్కడే చేరుద్దామన్నాడు. ఇప్పుడు వాళ్లని అతని పెద్దక్క…ఆరోజు నన్ను చూడటానికి వచ్చిందే ఆవిడ… తీసుకెళ్ళింది”
“మనుషులు మంచివాళ్ళేనా?”
“చాలా”
“నువ్వు కోరుకున్నట్లేనా?”
“అనుకుంటున్నాను “
“ఆరోజు నీ తెగింపు చాలా భయపడ్డాను సమ్మూ!”
“అతను గవర్నమెంట్ ఆఫీసరు. పెళ్లి చేసుకుంటానన్నాడు. భయం దేనికి?”
“ఏమోనే! నీ బతుకిలా అస్తవ్యస్తం చేసామని నాన్న ఒకటే ఏడుపు. ఆ మనిషిని అలా ఎప్పుడూ చూడలేదు”
“అక్కడే వుంటే ఏం జరిగేదో చెప్పనామ్మా? బావకి మళ్ళీ పెళ్లి చేసేవారు. తర్వాత పిల్లలని లాక్కునేవారు. పిల్లలకోసమని నన్ను అతనికి రెండో భార్యని చేసేవారు…మన ఆస్తి పోకూడదుకదా?”
“అంత ఆలోచించావా నువ్వు?” ఆశ్చర్యంగా అడిగింది శారద.
“అలాగని భయమేసేది”
“నీ బేంకుకార్డు వాళ్లదగ్గరే వుంది.  తిరిగివ్వలేదు చూడు. అందులో వున్నదంతా చెక్కు మీద డ్రా చేసేసాను. అకౌంటు క్లోజ్ చెయ్యటానికి నువ్వు కూడా సంతకం చెయ్యాలట. అందుకని అలా వదిలేసాను” అని తను తెచ్చిన డబ్బు ఇచ్చింది.
“ఆ కార్డు బ్లాక్ చేయించి కొత్త కార్డు తీసుకునేదాకా  ఇది వాడుకో” అని రాజారావు ఏటీయం కార్డు ఇచ్చింది శారద.
“డబ్బుకి అతనిమీద ఆధారపడకు. అలాగని పొగరుమోత్తనంగానూ వుండకు. ఆడవాళ్ళు విలువ కోల్పోయేది డబ్బు లేనప్పుడే. తన డబ్బు మరొకరు ఖర్చు చేస్తుంటే దూబరాగానే అనిపిస్తుంది సంపాదించేవాడికి …అదెంత అవసరమైన ఖర్చైనా. గొడవలూ అసంతృప్తులూ ఎన్నున్నా నేను మీ అత్తలమధ్య నిలబడగలిగానంటే నాకు మా నాన్న ఇచ్చిన పొలం, అమ్మ బంగారం…నా డబ్బు నాకుండటం. అవి లేక వసంత పిన్ని ఇంకా ఎక్కువ కష్టాలు పడుతోంది. దానికి బాబాయ్  కొనే చీరకి కూడా మీ అత్తలు లెక్కలు వేస్తారు. అంత అస్వతంత్రపు బతుకు… కార్డు మీద నీకు కావలిసినప్పుడు తీసి వాడుకో. నాన్న వేస్తుంటారు. మాకున్నది నువ్వేగా?”అంది.
“నాన్నకి నామీద కోపం పోయిందా?” అడిగింది సంయుక్త.
“మనిషికి రెండు ముఖాలుంటాయి. ఒకటి బైటికి చూపేందుకు, ఇంకొకటి మనసనే అద్దంలో మనని మనం చూసుకునేందుకు.  సంఘంకోసం కొన్ని డాంబికాలు చూపించక తప్పదు. దాని విలువలకి వ్యతిరేకంగా వెళ్లినప్పుడు మనని మరోసారి నమ్మదు. ఆ నమ్మకం పోగొట్టుకోలేము. తప్పనిసరై చేసానని వొప్పించడానికి ప్రయత్నిస్తాము. ఆ బేరం దగ్గర వున్నారు ఆయన”
” మనం ఇలా ఎప్పుడూ మాట్లాడుకోలేదు ” అంది సంయుక్త.
శారద నవ్వింది.
“శేషూవాళ్ళమీద శ్రీధర్ పోలీస్ రిపోర్టు ఇచ్చాడట?”
“మరి లేకపోతే? వీధిన పడి కొట్టుకోలేముకదా!”
“జయత్త చాలా గొడవచేసింది. ఆమెకి నాన్న భయపడతారు. అదే ఈ గొడవలన్నింటికీ కారణం. అలాగని నిన్ను దూరం చేసుకోలేరు కదా? ఆ మనిషి మనసులోది బైటపడటానికి సమయం పడుతుంది “
“ఇంటికి రానా అమ్మా? నాన్నని చూడాలని వుంది.  ఇలా వెలిపడ్డట్టు వుంటే బాధనిపిస్తోంది “
“రా. వచ్చి నీ వస్తువులన్నీ తీసుకెళ్ళు”
ఎక్కువసేపు వుండలేకపోయింది శారద అక్కడ. అది కూతురి ఇల్లు కాదనిపిస్తోంది. కానీ ఆ కొద్దిసేపట్లోనే ఎంతో గ్రహించింది. శ్రీధర్ అభిరుచులు…అతను చదివే పుస్తకాలు… ఆ ఇంట్లోని వాతావరణం…శేషుకీ అతనికీ గల తేడా స్పష్టంగా కనిపిస్తోంది.  
మనిషి చుట్టూ వుండే సహజ వాతావరణం అతని మనసుకి అద్దం పడుతుంది.  ఆ వాతావరణం కృత్రిమంగా వుంటే చూసేవారికి వారి సహజజ్ఞానంవల్లనో, అనుభవంవల్లనో, వయసువల్లనో తెలిసిపోతుంది.  హాని కలగనంతవరకూ ఎవరూ పట్టించుకోరు.  తెలుసుకోలేరు కాబట్టి ఆడపిల్లలు మోసపోతున్నారు. సంయుక్తకి అనుభవం వుంది.  అందుకే శ్రీధర్ ని సరిగానే అంచనా వేసింది.  శారదకి వయసూ, అనుభవం రెండూ వున్నాయి. అర్థమయింది. మనసుకి సాంత్వన కలిగింది. 
ఇంటికొచ్చాక రాజారావుకి చెప్పింది. “దాన్నొకసారి ఇంటికి పిలిపించుకుంటాను. అక్కడేం మాట్లాడలేకపోయాను” అంది.
అతను తలూపాడు.
విషయం తెలుసుకుని జయలక్ష్మి గొడవచేసింది.
“కూతుర్ని వదిలిపెట్టి  శారద వుండలేదక్కా! బెంగపెట్టుకుని చచ్చిపోయేలా వుంది” అన్నాడు.
“ఇంకేం? నువ్వూ వెళ్ళు . కూతురు నీకూ అపురూపమేగా?” ఎద్దేవా చేసింది.
అతను నిర్వేదంగా నవ్వాడు.
“మంచికో చెడుకో అది అలాంటి పని చేసింది. ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒకలా వుండరు. మాకున్నది ఒక్కర్తి. అన్ని అవలక్షణాలతోనూ పుట్టిందనుకో.  తెలివితక్కువది. అమాయకురాలు. అందుకని నష్టపోవాలని అనుకోలేంకదమ్మా?  అది సుఖంగా వుండాలనే కోరుకుందాం. మా సంతోషం దానితోనే అని నాకు అర్థమైంది… అది మా దగ్గరున్నా, ఎక్కడున్నా ” అన్నాడు రాజారావు.  ఆయన గొంతు వణికింది. “శేషుకికూడా మంచి సంబంధం చూసి చేద్దాం”
“నువ్వేదో కలలు కంటున్నావుగానీ, పూర్ణకుంభాన్ని తన్నుకుని, ఎండమావి వెంట పరిగెత్తింది. ఆవిషయం అర్థమైన రోజునా నిన్ను వోదార్చటానికి నేనే వస్తాను” అని జయలక్ష్మి అంటుంటే రాజారావు అక్కడినుంచి లేచి వెళ్ళిపోయాడు.
సంయుక్తని తామెవరూ కలుపుకోకూడదని నిర్ణయించుకుని మిగిలినవాళ్ళంతా ఆవిడకి దన్నుగా నిలబడ్డారు.  అయ్యో! అక్కయ్య ఎంత బాధపడుతోంది అనుకుంటున్నారుగానీ, అన్నయ్యకెంత కష్టం వచ్చిందని అనిపించట్లేదు. ఆయనది స్వయంకృతం…వాళ్లకి
“వేసెయ్ అక్కయ్యా,  బావగారికొక వీరతాడు” అని నవ్వింది వసంత.
(కొనసాగుతుంది)
 

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s