పెళ్లిపిలుపు 4 by S Sridevi

గతం కీకారణ్యంలాంటిది. మనసు అందులోకి తెలిసినదార్లోనుంచే  వెళ్ళగలుగుతుంది. కొత్త దారులు వెతకలేదు.
సంయుక్తకి తెలిసిన దారంతా ముళ్ళపొదలే వున్నాయి. సుదీర్ఘ ప్రయాణం చేసి జ్ఞాపకాలనే గాయాలతో తిరిగి వచ్చింది.  శేషుతో ముడిపడిన జీవితం అంతా ముళ్ళమయమే. అతను  ఇంట్లో వున్న సమయంలో భయం . అతను లేని ఏకాంతంలో కన్నీళ్ళు.
శ్రీధర్ ఆమె దారిలో పూలు పరిచాడు. పాదాలు ఆ దారంట నడవడం మొదలుపెట్టినా మనసు ఆ మెత్తటి నడకకి ఇంకా అలవాటుపడక దాటివచ్చిన ముళ్ళకేసే భయంగా చూస్తూ వుంటుంది. 
తనేనా, ఈ కొత్త జీవితంలో వున్నది? ఇది నిజమా లేక పునర్జన్మా? ఎంత అపనమ్మకమో! పైకి మాములుగానే తిరుగుతుంది.  లోపల ఈ మథనం.
ఈ శ్రీధర్ ఏమిటి,  తనని ఒక్కమాట కూడా అనడు? తన చేతివేళ్లతో ఆడుకుంటాడు . నుదుటిమీద పడే వెంట్రుకలని కొనగోటితో సర్దుతాడు. మాట్లాడతాడు,  నవ్వుతాడు, నవ్విస్తాడు. అతని ముప్పయ్యారేళ్ళ జీవితాన్ని తన ముందు పరుస్తాడు.
పిల్లలగురించి కూడా అతనికి పట్టింపులేమీ లేవు. “ ఇందరు పెద్దవాళ్ళం వున్నాము. ఇద్దరు పిల్లల్ని పెంచలేమా? ఎంతవరకూ చదువుకుంటానంటే అంతవరకూ చదివిద్దాం. పెళ్లి ఎప్పుడు చెయ్యమంటే అప్పుడు చేద్దాం”  అనేసాడు.
అంత చులాగ్గా వుంటుందా జీవితం? ఎన్ని లెక్కలు, ఎంత అహం శాసిస్తే… అప్పుడుకదా, క్షణమేనా, తృణమేనా కదిలేది!
ఇదంతా కలేమో…కరిగిపోతుందేమో…అని  భయం. అతన్ని గట్టిగా తాకాలన్నా భయమే… వాస్తవం కాడేమో, అదృశ్యమైపోతాడేమోననిపిస్తుంది.
ఇప్పుడొక కొత్త గాయమైంది సంయుక్తకి . ఆ గాయంవల్ల జరిగిందింతా నిజమేనని నిర్ధారణ అయింది.  అందుకే ఈ పునరావలోకనం.
ఫోను మోగింది. శ్రీధర్ నుంచి. ఆఫీసుకి వెళ్లాక రెండు మూడుసార్లు చేస్తాడు.
“ఏం చేస్తున్నావు?” అతని ప్రశ్న.
“ఏం లేదు”
“ఖాళీగా వున్నావా? ఏదో ఒకటి ఆలోచిస్తావు. గుర్తు తెచ్చుకుని బాధపడతావు. అదంతా అవసరమా? ఆ రోజులు గడిచిపోయాయి”
“అలాంటిదేమీ లేదులెండి “
“డల్ గా అనిపిస్తున్నావు?”
“శీను పెళ్లికి మనని పిలవలేదు”
అతను సుదీర్ఘంగా 😢 నిశ్వసించాడు. “సంయుక్తా! వాళ్లందరికీ నచ్చనిది చేసి ఇంకా వాళ్ల కళ్ళముందే వున్నాం. పెద్దవాళ్ళు… కోపం వుండదా? మనని ఎలా పిలుస్తారు? నువ్వు అలాంటివి పట్టించుకోవద్దు… ” అన్నాడు.
“నిజమే ” వప్పుకుంది. “ కానీ ఎందుకో అలా అనిపిస్తుంది.  నా జీవితం నాది కాదా?”
“అలాగని వంటరిగా మనకి మనం బతకగలమా? అందరూ కావాలనిపిస్తుంది”
“అందరూ ఏకమై నన్ను వేరుచేస్తుంటే కోపంగా వుంది”
“సరేగానీ ఇంకో పెళ్లికి అర్జెంటుగా వెళ్లాలి” మాట మార్చాడు
“అర్జెంటుగా పెళ్లికి వెళ్లటమేమిటి?” నవ్వొచ్చి నవ్వింది సంయుక్త. ఆ నవ్వుతో ఇద్దరి మనసులూ తేలికపడ్డాయి.
“నాలుగురోజులక్రితం బావ ఆఫీసుకి వచ్చి శుభలేఖ ఇచ్చి వెళ్లాడు. నేను మర్చిపోయాను.  ఇందాకే ఫోన్  చేసాడు. ఏరా, రావట్లేదా? పెళ్లికూతుర్ని కూడా చేసేసాం అన్నాడు” చెప్పాడు.
“మీకిద్దరే కదా, అక్కలు? వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేదు.  మధ్యలో ఈ బావెవరు?” ఆశ్చర్యంగా అడిగింది.
“ఓహ్! మన పెళ్లికి ఎవరినీ పిలవకపోవటంతో నీకెవరూ తెలీదు. నిర్మలక్కావాళ్ళు మా పక్క వాటాలో వుండేవాళ్ళు.  అమ్మ పోయాక ఎక్కువ భాగం వాళ్లింట్లోనే పెరిగాం. నిర్మలా, మేఘమాలా క్లాస్ మేట్స్. అలా తను నాకు మూడో అక్క అయింది. దారిలో అన్నీ మాట్లాడుకుందాం.  కారు పంపిస్తాను.  వచ్చెయ్ “
శీను పెళ్లికి తనని పిలవలేదని బాధపడినదల్లా ఒక్కసారిగా సంకోచంలో పడిపోయింది. “వెళ్లాలా?”  బెరుగ్గా అడిగింది.
“ఎక్కడికీ వెళ్లకుండా ఎంతకాలం?”
“ఏమో! భయంగా వుంది “
“ఎప్పుడో ఒకప్పుడు దాన్ని తుంచాలికదా?”
సంయుక్త ఇంకేం మాట్లాడలేదు.  పది కుటుంబాలమధ్య పెరిగింది.  ఎప్పుడూ ఏవో ఒక శుభాలు, వేడుకలు, అలాగే అశుభాలు… శేషు ప్రవర్తనతో బాధేగానీ ఇవన్నీ ఒక ఆటవిడుపు. ఎప్పుడూ సందడిగా వుండేది.
నలుగురిలో తిరగాలనీ , సరదాగా వుండాలనీ ఎంతగా వున్నా బెరుకు. అప్పుడు ఒకలాగ, ఇప్పుడు ఇంకొకలాగ. ఐనా శ్రీధర్ పక్కన వుంటే భయం దేనికి?అతనే తనకి కొండంత అండ. అతను చూస్తుండగా తనని ఎవరూ ఏమీ అనలేరు.
పెళ్లికి వెళ్లాలనే కోరిక మనసులో నిండుతుంటే వుత్సాహంగా తయారైంది… బెనారస్ సిల్క్ చీర, వర్క్ చేసిన జాకెట్టు…షాంపూ చేసుకున్న మృదువైన వెంట్రుకలని పోనీగా వేసుకుంది… ఆమెలోని అందాన్ని శ్రీధర్ ఎలా వెతికిపట్టుకుంటాడో అలా తయారైంది. పైనుండి కొన్ని నగలు.
ఆమె అలా అలంకరించుకుంటూ, సందడి చేస్తూ వుండటం చూస్తుంటే అతనికి తల్లి గుర్తొస్తుంది.  తమ కుటుంబంలో లోపించిందేదో మళ్ళీ వచ్చి చేరుతున్న భావన . తను పెద్దవాడై, అక్కలుకాక చెల్లెళ్ళై వుంటే తమ జీవితాలు మరోలా వుండేవని అనిపిస్తుంది.
సంయుక్త  తయారయేసరికి వాకిట్లో కారు సిద్ధంగా వుంది.
శ్రీధర్ కేంపు వైజాగ్ లో. అక్కడికి వచ్చేస్తే ఇద్దరం కలిసి వెళ్లచ్చునని డ్రైవర్ తో  చెప్పి కారు పంపాడతను. వైజాగ్ చేరాక డ్రైవర్ని పంపేసి తనే డ్రైవ్ చెయ్యసాగాడు. అప్పుడు తెలిసింది సంయుక్తకి,  ఏ పెళ్లికైతే తను వెలిపడిందో అదే పెళ్లికి ఆడపెళ్ళివారివైపునుంచి వెళ్లబోతోందని.
ఆమె వుత్సాహమంతా దిగిపోయింది.
“వద్దండీ! వెనక్కి వెళ్లిపోదాం.  మావాళ్లు చాలా పట్టుదల మనుషులు.  అసలే ఆడపిల్ల పెళ్లి.  మనని పిలిచారని ఎంత గొడవేనా చేస్తారు” అంది భయంగా.
అతనామెని దగ్గరకు తీసుకున్నాడు. ఈ మలుపు అతనికీ వూహించనిదే. వెంటనే తేరుకుని స్థిరంగా అన్నాడు.   “అలా జరిగితే నిర్మలా, మేఘమాలా వూరుకోరు.  ఇద్దరూ చాలా కచ్చితమైనవాళ్ళు. వాళ్ల జుట్టులోంచీ పుట్టుకొచ్చింది తన్మయి. ఏదైనా తేడా వస్తే పెళ్లివాళ్లని వుతికి ఆరేస్తారు. ఐనా అదంతా అప్రస్తుతం.  వాళ్లు మనగురించి తెలిసే పిలిచారు. మనం వెళ్తున్నాం.  ఎందుకు అంత భయం?”
అన్నిటికీ అతను వున్నాడని ధైర్యం చెప్పుకుంది.
మేఘమాల తనతో సంయుక్త పిల్లలని తీసుకొచ్చింది. ఆమె ఇంకా తెలిసినవాళ్లని పలకరిస్తూ లోపలికి  వస్తోంది,  వాళ్ళు అమ్మమ్మాతాతయ్యలని చూసి వాళ్ళ దగ్గరకు చేరిపోయారు.
వాళ్ళెలా వచ్చారా, ఎవరు తీసుకొచ్చారో చూడటానికి విడిది యింట్లోంచీ హాల్లోకి వచ్చింది జయలక్ష్మి.
“ఏంట్రా, ఇప్పుడా రావటం? పెళ్లికూతుర్ని కూడా చేసేసాం… అంతా మేఘమాల చెప్పిందిలే. ఇప్పటికేనా పెళ్లి చేసుకుని మంచిపనే చేసావు. ఎవర్నీ పిలవకుండా పెళ్లి చేసుకున్నావు సరే, మేం పిలిస్తే కూడా రావా?” అని దబాయించాడు దయానంద్…  నిర్మల భర్త…పెళ్లికూతురి తండ్రి.
” అన్యాయం బావా! పిలిచాను. మీరే రాలేదు” అన్నాడు శ్రీధర్.
దయానంద్ పెద్దగా నవ్వేసాడు. శ్రీధర్ పిలిచాడుగానీ ఆ సమయానికి వాళ్లు అమెరికాలో వుండి రాలేకపోయారు.
నిర్మలకూడా వచ్చింది.  సంయుక్తని ప్రేమగా  దగ్గరకు తీసుకుంది.  అందరూ కలిసి లోపలికి నడుస్తుంటే జయలక్ష్మి చూసింది. 
మళ్ళీ విడిదింట్లోకి వెళ్లింది.
“ఇప్పుడా మామయ్యా, రావటం?…అత్తయ్య చాలా బావుంది…నీ ఎంపిక అద్భుతం” అంది పెళ్లి కూతురు తన్మయి.
ఆ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీరు.  టీసీయస్ లో చేస్తోంది.  నెలకి నలభైవేలట జీతం.  సాంప్రదాయపు పెళ్లికూతుళ్ళలా సిగ్గుపడి ముడుచుకుపోవటం లేదు. ఇంగ్లీషులోనూ తెలుగులోనూ దడదడ మాట్లాడేస్తోంది. వచ్చినవాళ్లని పలకరిస్తోంది. అడిగిన చోట తన ఇష్టాలను నిర్మొహమాటంగా చెప్తోంది.  ఇష్టం లేనివి అంతే నిర్భయంగా చెప్తోంది. అంత  స్వేచ్ఛాస్వతంత్రాలున్నా సాంప్రదాయాన్ని గౌరవిస్తోంది. విస్మయంగా చూసింది సంయుక్త ఆమెని.
శేషుతో తన పెళ్లి జరిగినప్పటి విషయాలు గుర్తొచ్చాయి. వాళ్లకో ఆటబొమ్మ దొరికినట్టైంది.  తను… సంయుక్త కాదు. రాజారావు, శారదల కూతురు కాదు.  చదువుతో, ఆటపాటలతో, సరదాసంతోషాలతో జీవితాన్ని నింపుకోవాలనుకున్న అమ్మాయి కాదు.
పుట్టగానే తను భార్య.  శేషుకి భార్య. తన ప్రతి చర్య,  ఆకాంక్ష ఆ పరిధికి లోబడే వుండేవి. ఆ తర్వాత వరుసగా మూడు అబార్షన్లు. ఇంత చిన్న వయసులో పెళ్ళేమిటని డాక్టర్ తిడితే అప్పుడు కొంత వ్యవధి. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరూ  ఆడపిల్లలని పెద్ద గొడవ. ఏడవటానికే తను పుట్టిందా అనిపించేంత విరక్తి. ఎలాగైతేనేం,  ఆ చెరలోంచీ బయటికి వచ్చింది.  ఇప్పుడు నడుస్తున్న దారి, నడిపిస్తున్న చెయ్యి ఎటు తీసుకెళ్తాయో!
అందరితోటీ పరిచయాలయ్యాయి. తండ్రి ఒక్కడూ వున్నప్పుడు  శ్రీధర్ ని తీసుకెళ్ళి తండ్రి దగ్గర నిలబెట్టింది. అతను నమస్కారం చేసాడు. ఆయన ఆశీర్వాదం  చేస్తున్నట్టు చెయ్యెత్తి వూపి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అందుకే సంతోషపడింది సంయుక్త.
అంతా సవ్యంగానే జరుగుతోందనిపించినా, ఎవరూ ఏ ఆక్షేపణా చెయ్యకపోయినా ఆమెకి గుండె దడదడలాడుతునే వుంది.  ఆమె భయాలని నిజం చేస్తూ మగపెళ్ళివారు దేనికో అలిగారనే వార్త వచ్చింది.  దయానంద్,  నిర్మల కంగారుపడుతూ వెళ్లి,  పాలిపోయిన ముఖాలతో తిరిగొచ్చారు.
“ఛ…ఛ…ఇంత సంస్కారం లేని మనుషులనుకోలేదు. చదువులు చూసి మోసపోయాం. అన్నీ పైపై హంగులు…” గొణిగాడు దయానంద్. ఏం చేద్దాం  అన్నట్లుగా చూసింది నిర్మల. ఇద్దరూ మరో గదిలోకి వెళ్ళారు.
“ఏం జరిగింది బావా?” వెనకే వెళ్ళాడు శ్రీధర్.  సంయుక్త వూహించగలిగింది. అవమానంతో, సిగ్గుతో రగిలిపోతూ తనున్నచోటునుంచీ లేచి బాల్కనీలోకి వెళ్లి నిలబడింది.  తన్మయి వెంట వెళ్లింది.
“ఏంటత్తా!  ఏం జరిగింది?” అడిగింది. ” అమ్మా నాన్నా అలా అంటున్నారేమిటి? మామయ్య కూడా కంగారుపడుతున్నాడు” అంది.
“సారీ, తన్మయీ! పెళ్లికి మేము రాకుండా వుండాల్సింది ” బాధపడుతూ అంది సంయుక్త.
” వివరంగా చెప్పు అత్తా!”
” మా పెళ్లి ఎలా జరిగిందో నీకు తెలుసు కదా? ఇప్పుడు ఇక్కడి మగపెళ్ళివారు నా పుట్టింటివారు. అంటే శ్రీనివాస్ నాకు స్వయానా చిన్నాన్న కొడుకు. నా మొదటి పెళ్లి మేనరికం. మాది ఉమ్మడి కుటుంబం కాదుగానీ ఆ అత్త మాటకి మా ఇంట్లో చాలా విలువ యిస్తారు. మావాళ్లు మమ్మల్ని పెళ్లికి పిలవలేదు. మేము రాకూడదని అనుకున్నారు.  కానీ వూహించని విధంగా మీ పిలుపు అందుకుని మేము వచ్చాము. అదే వాళ్ల కోపానికి కారణం అనుకుంటాను”
” అదేంటి?”
” ఇంతదాకా వచ్చినందుకే నాకు సిగ్గనిపిస్తోంది. అక్కడికీ దారిలో అన్నాను, తిరిగి వెళ్ళిపోదామని  …”
” జరిగినదాంట్లో నీ తప్పేముంది? నీ జీవితం… నీ ఇష్టం.  తిన్న  అవమానాలు నీవి. తెంచుకున్న బంధం నీది. దానికీ మీరు పెళ్లికి రావడానికీ సంబంధం  ఏమిటి? శ్రీను అలాంటివాడు కాదే? మేం చాలా ఓపెన్ గా అన్ని విషయాలూ మాట్లాడుకుంటున్నాము. అతని అభిప్రాయాలు, అభిరుచులు అన్నీ నాకు నచ్చాకే పెళ్లికి వప్పుకున్నాను… ఉండు అతనితో నేను మాట్లాడతాను” అని సెల్ ఫోన్ తీసి నెంబర్ నొక్కబోతుంటే-
” నువ్వు మాట్లాడటం ఏమిటి? అమ్మానాన్నలు చూసుకుంటారు ఆ విషయం” సంయుక్త వారిస్తూనే ఉంది, తన్మయి కాల్ అవతలి వ్యక్తికి చేరనే చేరింది.
మరో గదిలో అదే విషయం చర్చిస్తున్నారు శ్రీధర్, దయానంద్, నిర్మల.
” బావా! ఇలాంటి గొడవేదో జరుగుతుందని సంయుక్త దారిలోనే అంది.  మేము పెళ్లికి వుండము. తన్మయికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్లిపోతాం ” అన్నాడు శ్రీధర్.
“మంచిపని చేస్తే సమాజం హర్షించదు. మళ్లీ ఆ సమాజమే మార్పుని కోరుకుంటుంది” దయానంద్ బాధపడ్డాడు.
” అసలు ఈ సంబంధం  ఎలా దొరికింది? వాళ్ల గురించి అన్నీ తెలుసుకున్నారా? చాలా పేచీకోరు మనుషులు” అలా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాడు శ్రీధర్.  ఒకరిని గురించి చెడ్డగా చెప్పడం అతనికి రాదు. తన్మయిమీద వున్న ప్రేమతో నిజం చెప్పక తప్పలేదు.
“తెలిసినవాళ్ల ద్వారా వచ్చింది. పెద్ద కుటుంబం అని చాలా గొప్పగా చెప్పారు. ఆ అబ్బాయి చదువులోనూ, వుద్యోగంలోనూ తన్మయికి దీటుగా వున్నాడు.  వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అన్నీ బావున్నాయనే అనుకున్నాం ”  అంది నిర్మల.
“చెప్పానుగా, నిర్మలా! మేము వెళ్లిపోతాం. మేఘమాలా, నీహారికా కూడా మాతో వచ్చేస్తారు. మీరు వాళ్లతో మాట్లాడండి. వ్యవహారం సున్నితంగా నడిపిద్దాం”  అన్నాడు శ్రీధర్.
“నువ్వుండరా! మాటకి ముందు వెళ్లిపోతాం  వెళ్లిపోతాం అంటావు. మావైపుని వున్నదెవరు? మీరు తప్ప.  అలా మిమ్మల్ని పంపించేస్తే సమస్య తీరిపోతుందా?  తన్మయి  వూరుకుంటుందా? ఇలా పంపించడమంటే ఎప్పటికీ మీతో సంబంధం తెంచుకోవటమేకదా? అదంత తేలికా? ” కోప్పడింది నిర్మల.
” తన్మయితో మాట్లాడదాం.  అదేమంటుందో! చిన్నపిల్ల కాదుకదా?  దానికి ఇలాంటివి నచ్చవు. దాచిపెట్టి పెళ్లి చేసే విషయం కాదు. మరీ ఇంత   సంకుచితంగా ఆలోచించేవాళ్ళ మధ్య మన పిల్ల ఎలా వుంటుంది? ఈరోజు వాళ్లు కోరుకున్నట్లు చేసి,  బుజ్జగించో  నచ్చజెప్పో పెళ్లిచేసి  దాన్ని పంపిస్తే ఇది ఇక్కడతో ఆగుతుందా? ఇంకెన్ని విషయాలు తలెత్తుతాయో! విబేధాలతో రేప్పొద్దున్ననుంచీ వాళ్లు విడాకులుకోసం కోసం ప్లీడర్ల చుట్టూ  తిరిగే పరిస్థితి వచ్చి   మనం తలలు దించుకోవాలేమో!  ఎవరంతటి వాళ్లు వాళ్లు. ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకుంటే మంచిది” అంది.
“నా ఉద్దేశం నేను చెప్పాను. ఆపైన ఆలోచించుకోవాలసింది మీరు. తన్మయి కన్నా మాకు ఏదీ ఎక్కువ కాదు” అని అక్కడనుండి తన్మయిని వెతుకుతూ వెళ్లాడు. అప్పటికి ఆమె శీనుతో మాట్లాడటం పూర్తైంది. పదిహేను నిముషాలసేపు మాట్లాడింది ఆ అమ్మాయి ఇంకొన్ని గంటల్లో తన పక్కన పెళ్లిపీటల మీద కూర్చోబోయే వ్యక్తితో.
“ఏంటి శ్రీనూ! మీ వాళ్ళేంటో అలిగారట. అలగటమేమిటి సిల్లీగా? మనసులో వున్నదేమిటో చెప్పచ్చు కదా ? … మామయ్యా, అత్తయ్యా వచ్చారని కోపం వచ్చిందా? వాళ్లు వెళ్లిపోవాలా? ఎందుకు? మన పెళ్లికి వాళ్లేం అడ్డు?…మామయ్యంటే స్వంత మామయ్య కాదు. వాళ్ల పెద్దక్కా మా అమ్మా పీజీదాకా కలిసి చదువుకున్నారు.  వాళ్ల రెండవ అక్క, మా  అత్త అంటే నాన్న చెల్లెలు మెడిసిన్ లో క్లాస్ మేట్స్. మా అమ్మమ్మగారి వూరు వాళ్లది. చిన్నప్పుడే తల్లి పోతే   అమ్మమ్మ దగ్గరే ఎక్కువగా పెరిగారు… ముఖ్యంగా అతను. మేము ఈ విషయాలు ఎప్పుడో మర్చిపోయాము. ఈరోజుని మళ్ళీ ఇలా గుర్తుచేసుకుంటున్నాం.  చాలా బాధనిపిస్తోంది. మీరంటున్న విషయం వాళ్లకి తెలిస్తే ఎంత అసహ్యంగా వుంటుంది? చాలా బాధనిపిస్తోంది…
మా అమ్మ పెళ్లిలో నాన్న గెడ్డం కింద బెల్లం ముక్క పెట్టిందీ, ఇప్పుడు నన్ను గంపలో కూర్చోబెట్టి తీసుకు రావలసినదీ అతనే… తల్లి పోవటంతో వాళ్ల కుటుంబం బాగా దెబ్బతింది.   అక్కలు పెళ్లి చేసుకోలేదు. ఇతనూ అలాగే వుండిపోతాడని అనుకున్నాం.  ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకున్నాడని ఎంతో సంతోషపడ్డాం…. అతని భార్య నీ కజిన్ కావడం కేవలం కాకతాళీయం… మాకు తెలియదు. ఐనా మాకు ముఖ్యమైనవాళ్ళని మేము పిలుచుకున్నాం. మీవాళ్ళని మీరు పిలుచుకున్నారు. పిలవకముందు వేరే సంగతి. మేము పిలిచాక వాళ్లు వచ్చాక వెళ్లిపొమ్మని ఎలా చెప్తాం?” అని అతను చెప్తున్నది వింటూ వింటూనే వాయించేసింది.
ఆమె అడిగింది చెప్తూ, ఆమె చెప్పింది విన్నాడు శీను.
“తన్మయీ! కొంచెం అర్థం చేసుకో. మా పెద్దత్తని ఇంట్లో అందరూ గౌరవిస్తారు. ఆవిడకి నచ్చనిదేదీ మాయింట్లో జరగదు”
“ఆవిడని గౌరవించడమంటే మరొకరిని అవమానించడమా? …అరె… సంయుక్త ఎంత చిన్నది? తమ వయసులో సగంకూడా లేని ఆ అమ్మాయిని సతాయిస్తున్నారా మీ పెద్దవాళ్ళంతా? ఆమె ఒక తప్పు చేసిందే అనుకుందాం,  క్షమించలేరా? మీయింట్లోని అమ్మాయితోనే ఇలా వుంటే నాపట్ల మీ ప్రవర్తన ఎలా వుంటుందోని భయం వేస్తోంది”
“తన్మయీ ! నువ్వు అలా ఎందుకు చేస్తావు? ఆ సమస్యే రాదు”
“నేను అలాగే ఎందుకు చేస్తాను? ఇంకోలా చేయచ్చు . నావి చాలా స్వతంత్ర భావాలు. ఇలాంటివి నేను జీర్ణించుకోలేను. నన్ను పెళ్లి చేసుకోవడమంటే నా మెదడు, మనసు, ఆలోచనలు, స్పందనలతోసహా  నన్ను చేసుకోవటం. అంతేగానీ కేవలం నా చదువు, వుద్యోగం,  అందం, ఐశ్వర్యంలాంటి బయటి విషయాలు చూసి కాదు  “

సరిగ్గా అదే సమయానికి పెళ్లి మంటపానికి దూరంగా లాన్లో  కూర్చుని వున్నారు శ్రీధర్ అక్కలు… మేఘమాల,  నీహారిక. 
“నీతో మాట్లాడాలి” అని, అందరికీ దూరంగా తీసుకొచ్చిందిగానీ చెప్పాలనుకున్నది ఎలా చెప్పాలో తెలీక సతమతమౌతోంది నీహారిక.
“ఏమిటే? ఏదో చెప్పాలన్నావు? ” అడిగింది మేఘమాల.
” పెళ్లయ్యాక శ్రీధర్ చాలా మారాడు కదూ?” అంది నీహారిక. “మనం ముగ్గురం కూర్చుంటే  మాట్లాడుకోటానికి మాటలే దొరికేవి కాదు. సంయుక్తతో తెగ ముచ్చట్లు పెడుతున్నాడు “
“నిజమే. వాడిలో చాలా మార్పు వచ్చింది ” మేఘమాల ఏకీభవించింది.
“ఇద్దరి మధ్యా అంత కబుర్లేం వుంటాయా అనుకున్నాను … ఒకటి రెండు సంభాషణలు నా చెవిని పడ్డాయి.  అన్నీ సిల్లీ విషయాలు. అలాంటివాటిమీద అంతంతసేపు మాట్లాడుకుంటారా అని నవ్వొచ్చింది. శ్రీధర్… అంత పెద్ద వుద్యోగం చేస్తున్నది వీడేనా అనిపించింది “
చెల్లెలు ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతోందని అర్థమయింది మేఘమాలకి.
“ఆమధ్యని ఒకరోజు సంయుక్త చిన్నకూతురు స్నానం చేసి వళ్లు తుడవనివ్వకుండా పరుగులు పెడుతూ నాకాళ్ళకి అడ్డం  పడింది.   వంగుని ఎత్తుకున్నాను… మొదటిసారి. నా మొహంలో మొహం పెట్టి నవ్వింది.   తడి వొళ్ళు,  వంటిమీద మెరుస్తున్న నీటి చుక్కలు,  కాళ్ళకి గజ్జెలు, మొలకి మువ్వల మొలతాడు, చేతులకి మురుగులు, చెవులకి లోలక్కులు, మెడలో చిన్న గొలుసు… ఆ రూపం, ఆ నవ్వు, ఎత్తుకున్నప్పటి ఆ స్పర్శ… నేను మర్చిపోలేకపోతున్నాను. నా చదువు, హుందాతనం, నేను పోగేసుకున్న సంపద  అన్నీ దానిముందు తక్కువేననిపించాయి”
“ఇప్పటికేనా మించిపోయిందేమీ లేదు. నీకూ సంబంధాలు చూడమని చెప్పనా?” అడిగింది మేఘమాల.
ఇబ్బందిగా నవ్వింది నీహారిక. కొద్దిసేపు మౌనంగా వుండిన తర్వాత నెమ్మదిగా అంది.”కొంతకాలంగా నా కొలీగ్ ఒకతను పెళ్లిచేసుకుందామని అడుగుతున్నాడు.  ఈ వయసులో పెళ్లేమిటని ఇంతకాలం పట్టించుకోలేదు. నిన్ననే ఇద్దరం కలిసి అనుకున్నాం… వుద్యోగాలు వదిలేసి ఒక హాస్పిటల్ పెట్టి సర్వీస్ చెయ్యాలని. అలాగే ఒకరిని పెంచుకోవాలని…”
“అంటే… అతనికి చేసుకుంటానని చెప్పేసావా? ఎవరతను?”
“ప్రహ్లాద్… నీకు  తెలీదులే. నాలాగే నలభై దాటాయి. జర్మనీకీ, అమెరికాకీ, ఇక్కడకీ తిరిగుతూ తన గురించి తను మర్చిపోయాడు. ఇప్పుడేనా అతను కోరుకుంటే కనీసం పదేళ్ళు చిన్నమ్మాయి దొరుకుతుంది. కానీ అతని కలలు నాతో కలిసి నిజం చేసుకోవాలనుకుంటున్నాడు”
“మరైతే ఎందుకు ఆలస్యం?”
“పెళ్లి చేసుకోవాలనైతే అనుకున్నాంగానీ ఎలా ముందుకి వెళ్ళాలో తెలీడం లేదు”
“శ్రీధర్ కి చెప్పనా, ఐతే?”
“ఏమిటే, వాడితో చెప్పేది? నాకన్నా చిన్నవాడు.  వాడా, నా పెళ్లి  చేసేది?”
” నువ్వొక్కదానివీ చేసుకోలేవుకదా? సాక్షి సంతకాలకేనా కావాలి “
“తన్మయి పెళ్లి హడావుడి అయాక నిర్మలకి చెప్తాను”
“సరే మరి. ఇంకా ఆలస్యం చెయ్యకు. మనసు మార్చుకోకు” అంది మేఘమాల. నీహారిక తలూపింది.
“చాలాసేపైంది. నిర్మల వెతుక్కుంటుంది. వెళ్దామా?” అని లేచింది మేఘమాల.  అడుగు వెయ్యబోతూ ఆగింది. ” మీకన్నా పెద్దదాన్నైనా, మీ జీవితాలు ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలీలేదు. నాన్నేనా చెప్పి వుండాల్సింది. అన్నీ మీకే తెలుస్తాయని వదిలేసాను” బాధపడుతూ అంది.
“మాకన్నా ఎంత పెద్దదానివే నువ్వు? నీకు మాత్రం ఏం తెలుసు?” అంది నీహారిక.
ఇద్దరూ విడిదింట్లోకి అడుగుపెట్టేసరికి అక్కడ శ్రీధర్,  సంయుక్త  కనిపించలేదు.

 (ఇంకా వుంది)

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s