పెళ్లిపిలుపు 5 by S Sridevi

“ఎక్కడికెళ్ళిపోయారే, ఇద్దరూను?” వాళ్లకి ఎదురొస్తూ అడిగింది నిర్మల.
“ఆ విషయం తన్మయి పెళ్లీ, అంపకాలు అయ్యాక చెప్తానుగానీ, వీళ్ళిద్దరూ ఏరి?” అని శ్రీధర్,  సంయుక్తల గురించి అడిగింది మేఘమాల.
“పెళ్లీ, అంపకమూనా? పెద్ద గాలివాన వచ్చి వెలిసింది”
“ఏమైంది? గొడవా? ఎవరితో?”
“ఇంకెవరితో? మగపెళ్ళివారితోనే” అంటూ నిర్మల  కొంతా, తన్మయి ఇంకొంతా చెప్పారు.

తన్మయి మాటలు ఒక హెచ్చరికలా వినిపించాయి శ్రీనుకి. ఇంకాసేపట్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అంత ధైర్యంగా కాబోయే భర్తతో మాట్లాడటం అతను ఎక్కడా ప్రత్యక్షంగా  చూడలేదు, వినలేదు కూడా. 
“నీకు నచ్చనిదేదీ జరగదు. నేను మళ్ళీ మాట్లాడతాను” పోన్ పెట్టేసాడు.
అతనికి చాలా కోపం వచ్చింది. అంతా సంయుక్త వల్లనే. తగుదునమ్మా అని పిలవని పెళ్లికి ఎందుకు రావాలి? తెలీక వచ్చినా తమని చూడగానే తలొంచుకుని తిరిగి వెళ్ళిపోవాలి. తిన్నగా వెళ్ళి  ఆడపెళ్ళివాళ్ళ మధ్య కూర్చుని మంతనాలాడిస్తుందా? దాన్ని వెనకేసుకురావడానికి వాళ్లకేనా వుండద్దూ ?   అని భగ్గుమని మండిన మంట తన్మయి ఆఖరిగా అన్నమాటలు  ఒక్కసారిగా చెవుల్లో రింగుమని, కొంత చల్లారింది.
పెద్దవాళ్ళంతా కలిసి ఆమెని సాధిస్తున్నారా అనికదా, అంది. వట్టి అనటం కాదు. అందులో ఆమె భవిష్యత్తు చూసుకుంది.
నిజమే! పెద్దత్తకి ఎందుకంత పంతం? సంయుక్తని పిలవద్దంది. అలాగే పిలవలేదు.  అవతలివాళ్లు పిలిస్తే వచ్చింది. చూసీ చూడనట్టు వదిలేస్తే సరిపోయేది. అందరికీ ఎదురుపడలేక అదే తప్పుకు తిరిగేది…
ఇప్పుడేమైంది? తను అడకత్తెర్లో ఇరుక్కున్నట్టైంది. తన్మయి  దృష్టిలో చులకనయాడు. పెళ్ళి ఆపడానికి బలమైన కారణం కూడా కాదిది. తన్మయిలాంటి  అమ్మాయి మళ్ళీ దొరుకుతుందా? దు:ఖంలాంటిది వచ్చింది. 
ఒక్క సంఘటన పెద్దత్తకి సంబంధించినది జరిగితేనే గిజగిజలాడిపోతున్నాడు.  మరి సంయుక్త? పుట్టినది మొదలు ఆవిడ పిడికిట్లో ఇరుక్కుపోయింది. అందుకే   తెగించింది . తిరగబడింది. బలంగా శ్వాస తీసుకున్నాడు.
మెదడుకి పట్టిన బూజేదో వదిలిపోయినట్టైంది.
విడిదింట్లోకి నడిచాడు.
అక్కడ తల్లిదండ్రుల మధ్య దేనికో వాగ్వివాదం జరుగుతోంది. ఈమధ్య ఎందుకో తల్లి విసుగుపడుతోంది.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తేమాత్రం ఏదో జరగకూడనిది జరిగిందనిపించింది.
“ఏమైంది?” తల్లిని అడిగాడు.
“ఆడపిల్ల… పసిపిల్ల… దాని వుసురుపోసుకుని బతుకుతున్నార్రా మీరంతా !” విసురుగా అంది వసంత. “మీ యింట్లో పెళ్లి.  మీరు ఎవరిని పిలుచుకుంటారో మీ యిష్టానికే వదిలేసాం. సంయుక్తని పిలవద్దనుకున్నారు. దానికీ మేము కాదనలేదు. మా బాధ్యతగా మేము వచ్చాము. ఆడపెళ్లివాళ్ళు పిలిస్తే అది భర్తతో కలిసి వచ్చింది.  దాన్ని వెళ్లిపొమ్మని పంతం పడుతున్నారు. మా కళ్ళముందు దానికి అంత అవమానం జరిగితే చూస్తూ తట్టుకోలేము- అని ఏడుస్తూ పెద్దమ్మ  పెద్దనాన్నని  తీసుకుని వెళ్లిపోయింది”
“పెద్దనాన్న, పెద్దమ్మ వెళ్లిపోయారా?” దిగ్భ్రాంతుడయాడు శీను.
” పెద్దమ్మ నడిపిస్తుంటే కలలో మనిషిలా ఆవిడ చెయ్యి పట్టుకుని నడుస్తూ వెళ్లారాయన. సింహంలా వుండేవారు. అంత దిగిపోయారు. నలుగుర్లోకీ రావడం మానేసారు. ఇంట్లోవాళ్లే తలోమాటా అంటున్నారు.  ఆయన మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోవడంలేదు. పోనీ అన్నయ్యా,  జరిగిందేదో జరిగిపోయింది, కలిసుంటారని పెళ్లి చేసాం, వుండలేకపోయారు. ఎవరిదారిన వాళ్లు సుఖంగా బతికితే చాలు-అని ఒక్క ఓదార్పు మాట చల్లగా అంటారేమోననుకున్నారు. ఒక్కరూ అనలేదు. ఇప్పుడుకూడా ఇలా చేస్తున్నారు.  సమ్మూ పై పిల్ల కాదు. ఆయన కన్నకూతురు. లేకలేక పుట్టిన పిల్ల. ఆయన అంత:ప్రాణంరా అది. మీకది అర్థం కాదెందుకు? ఆయన బాధపడేది అది చేసిన పనులకి కాదు, దానిపట్ల మనందరి ప్రవర్తనకి. పెద్దవాళ్ళు,  వీళ్ళకంటే నచ్చలేదు దాని పని. మరి నీ చదువెందుకు, చట్టుబండలవను?” అంది వసంత.
భార్య మాటలు చెంపపెట్టులా తగిలాయి నారాయణరావుకి. మొదట్నుంచీ ఆమె అంటూనే వుంది,  తల్లిదండ్రులకి ఇష్టమై కలుపుకున్నప్పుడు మనం ఎందుకు దూరం పెట్టాలని. వదిన వత్తిడికి అన్నగారు తటస్థంగా వుంటున్నాడుగానీ జరిగినదేదీ మనసు లోలోపల   ఆయనకి ఇష్టం లేదనే ఇన్నాళ్ళూ నమ్మాడు. కానీ ఈరోజుని కూతురికోసం ఆయన పడిన బాధని తన కళ్ళతో చూసాడు.
తనకీ తన్మయికీ మధ్య జరిగిన సంభాషణ చెప్పాడు శ్రీను. “ఈ విషయంలో తను చాలా పట్టుదలగా వుంది.  అతను వాళ్లకి బాగా కావలసినవాడట” నిస్సహాయంగా అన్నాడు.
“నీకూ మీ నాన్నకీ చెప్పదగినంతదాన్ని కాను. కానీ చెప్పకుండా వుండలేను. కొట్టీ తిట్టీ కాల్చుకు తిన్న అత్తకొడుకు నీకు పెద్ద చుట్టం ఎలా అయ్యాడు? అంత బాధని వోర్చుకున్న మనింటి ఆడపిల్ల… నీ చెల్లెలు… స్వంత పెద్దనాన్న కూతురు పరాయిదెలా అయింది? అందుకే తన్మయి నిన్ను చేసుకుని మనింటికి రావటానికి భయపడుతోంది”  వసంత తన్మయి మనసు చదివినట్లు అంది.
శీను ముఖం ఎర్రబడింది.
అప్పటిదాకా అభావంగా కూర్చున్నవాడల్లా నారాయణరావు గమ్ముని అన్నాడు,” అన్నయ్యా, వదినా ఎంతో దూరం వెళ్లి వుండరు. నేను వెళ్లి వాళ్లని వెనక్కి తీసుకొస్తాను” అని, “నువ్వు  సంయుక్తనీ అతన్నీ పిలుచుకురారా ! అందరం కూర్చుని మాట్లాడుకుంటే కలతలు తీరిపోతాయి. మీ అమ్మ అన్నట్టు ఎవరిదారిన వాళ్లు బతుకుతున్నప్పుడు ఈ గొడవలెందుకు? అన్నయ్యకి లేని అభ్యంతరం నాకు దేనికి?  పీటలమీద పెళ్లి ఆపుకునేంత విషయం ఏమీలేదు. పిల్లావాళ్లకి మతిలేకపోతే మనకేనా వుండాలి” అన్నాడు. అతను వెళ్లాడు.
శీను మేనత్తలు వున్న గదిలోకి వెళ్ళాడు.  ఐదుగురూ అక్కడే వున్నారు. శారదా, రాజారావు వెళ్లాక వాళ్లు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. వాళ్ల మధ్య కూడా ఈ విషయంమీద వాదనలు జరుగుతున్నట్టున్నాయి. ముఖాలు ఎర్రగా వున్నాయి.  శీను రాగానే మాటలు ఆపారు.
శీను వెళ్లి జయలక్ష్మి పక్కన కూర్చున్నాడు. ఆవిడ మొహం తిప్పుకుంది.
“అత్తా! విషయం చాలా దూరం వెళ్లేలా వుంది.  నువ్వే పెద్దమనసు చేసుకోవాలి” అన్నాడు ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుని. ఆవిడ విదిలించుకుంది.
“పెద్దన్నయ్య చాలా బాధపడుతున్నాడే… పెళ్లివాళ్లుకూడా పంతంమీద వున్నారు. ఈరోజుల్లో ఆడపిల్లలు దేనికీ తగ్గడం లేదు. ముహూర్తందాకా ఉండి నాలుగు అక్షింతలు వెయ్యి. ఇష్టమైతే చివరిదాకా వుండు. నీ పెద్దరికం నిలబెట్టుకో. లేదంటే ముహూర్తం అవగానే వెళ్లి పంతం నెగ్గించుకో… ” అని నచ్చజెప్పబోయింది జయలక్ష్మి తరువాతి ఆమె.
ఈ గదిలోకి వచ్చినప్పట్నుంచి అదే చెప్తున్నారు. ఆవిడ వినట్లేదు. ఇంకేదో జరగాలని వుంది.  సంయుక్తని వెళ్లగొట్టేది లేదని వాళ్లు చెప్పేసాక ఇంకేం జరుగుతుంది? ఆవిడేనా సర్దుకోవాలి. పెళ్లేనా ఆగిపోవాలి. రెండవది బైటికి అనలేకపోతోంది.
“ఏమిటే జయక్కా, నీ పంతం? పెద్దదానివి, అమ్మ తర్వాత అమ్మంతటి దానివని ఇన్నాళ్ళూ నీకు ఎదురు చెప్పలేదు.  ఇప్పటికేనా నువ్వు పద్ధతి మార్చుకోకపోతే మేమందరం నష్టపోతాం.    పెద్దవాళ్ళం,  మనమంతా భర్తలని గుప్పిట్లో పెట్టుకుని కాపురాలు చేసుకుంటే   సంయుక్త మాత్రం ఏడుస్తూ,  కన్నీళ్ళు తుడుచుకుంటూ బతికింది. ఇన్నాళ్ళకి దానికి తెలివి వచ్చి తనదారి తను చూసుకుంది” అంది ఆఖరి చెల్లెలు. సమస్య ఇంతకాలం తమ మధ్యనే వుంది. ఇప్పుడు బజారుకెక్కింది.
అక్కగారికి మొదట్నుంచీ చెప్తునే వుంది. 
పెళ్లికి ముందు సంయుక్తకీ శేషుకీ కలవదనీ చెప్పింది.  వాళ్లు గొడవలు పడుతుంటే శేషుని మందలించమనీ చెప్పింది. సంయుక్త మళ్ళీ పెళ్లి చేసుకున్నాక ఆ పిల్ల జోలికి వెళ్లద్దనీ చెప్పింది.  అందరికంటే ఆఖరిది కావటాన్న ఎవరూ ఆమె మాట వినలేదు. రాజారావు కూడా. ఫలితం దగ్గరకు వచ్చేసరికి ఒకరికి అనుకూలమైనది మరొకరికి ప్రతికూలమౌతోంది.
” శీనూ !ఇప్పటికే చాలా జరిగింది.  తన్మయి  ముందు నువ్వు చులకనపడకు. సమ్మూలాంటి పిల్ల ఇంకొకరుండరు. శేషు దాన్ని జారవిడుచుకున్నాడు. తన్మయిలాంటి అమ్మాయి నీకు మళ్ళీ దొరకదు. సమ్మూ విషయాన్ని తన్మయి  భవిష్యత్తుతో తూస్తున్నారు. తెగేదాకా లాగకు. తర్వాత ఏం జరగాలో చూసుకో. వెళ్లు” అందామె.
అతను వెళ్లిపోయాడు.
తన్మయి వున్న దగ్గరకు వెళ్లాడు. సంయుక్త అక్కడే వుంది. 
“ఒకొక్క ఇంట్లో వుంటారు తన్మయీ , మా అత్తలాంటివాళ్ళు. ఆవిడకి ఎదురు చెప్తే జరిగే రచ్చ భరించలేక ఆవిడ ఎలా చెప్తే అలా చెయ్యడానికి అలవాటుపడిపోయాం. ఇది అలవాటులో పొరపాటే తప్ప ప్రత్యేకించి చేసింది కాదు.  ” అన్నాడు తన్మయితో.
“సారీ సమ్మూ! పెద్దత్త గురించి నీకు తెలీనిదేముంది? అమ్మకీ నాన్నకీ మిగిలినవాళ్ళకీ ఏ సమస్యా లేదు. నిజానికి నిన్ను మేమే పిలవాలి. ఆవిడ కారణంగానే ఆగిపోయాం. బావగారేరి? ఇద్దర్నీ వెంటపెట్టుకు రమ్మన్నారు నాన్న.  అందరికీ పరిచయం చేద్దువుగాని” అన్నాడు.
శేషుతో కలిసి శ్రీధర్ ఇంటిమీదికి దొమ్మీకి వచ్చిందీ, పెళ్లికి రావద్దని వసంత ఫోన్లో ఏడ్చిందీ మర్చిపోలేదు సంయుక్త.
“అక్కడికి వచ్చాక మమ్మల్ని  తిట్టరుకదా అన్నయ్యా?” భయంగా అడిగింది.
ఆ ఒక్క ప్రశ్న అక్కడ వున్న ఇద్దరినీ కదిలించింది… శీనునైతే మూలాల్లోంచీ.  చిన్నప్పుడు తామంతా కలిసి ఆడుకున్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. శేషు దౌర్జన్యంగా వుండేవాడు. ఆటల్లో తొండి చేసేనా గెలిచేవాడు. ఎప్పుడేనా వోడిపోక తప్పని పరిస్థితి వస్తే ఆ వుక్రోషాన్ని సంయుక్త మీద తీర్చుకునేవాడు. వంగదీసి రెండు దెబ్బలు వెయ్యటం, జడలు పట్టి లాగటం, మొట్టికాయలు వెయ్యటం, గిచ్చడం… అకారణంగా ఏడిపించేవాడు.
“ఎందుకురా, దాన్నలా కొడతావు?” అని ఎవరేనా అడిగితే ,
“అది నా పెళ్లం. ఏమైనా చేసుకుంటా” అని నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు . అదో నవ్వులాటగా చెప్పేది అత్త. అంత చిన్న వయసునుంచే తమకి అలవాటైపోయింది… సంయుక్తమీద శేషుకి హక్కు వున్నట్లు… సంయుక్త అంటే శేషు నీడ అన్నట్టు.  ఆ జడత్వంలోంచీ బైటికి వచ్చాడు ఇంతకాలానికి.
శ్రీధర్ ని పరిచయం చేసుకుని అతన్నీ సంయుక్తనీ వెంటపెట్టుకుని వెళ్లాడు శీను.

” మొత్తానికి అంతా సుఖాంతమైంది పిన్నీ!” అంది తన్మయి చెప్పడం ముగించి.
” అంత రిస్క్ ఎందుకు తీసుకున్నావే? శ్రీధర్ ఏమీ అనుకునేవాడు కాదు. ఆ అమ్మాయి… సంయుక్త కూడా మంచిదే” అంది మేఘమాల.
“అలా ఎలా పిన్నీ? నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఇది శ్రీనుకి లిట్మస్ టెస్ట్ లాంటిది. తన ప్రాథమ్యాలు ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాడు…. లేకపోతే… మనం పిలుచుకున్నవాళ్ళని వెళ్లిపొమ్మని ఆవిడ  చెప్పటం ఏమిటి?” కోపంగా అడిగింది తన్మయి.
” నా సిద్ధాంతాలు నావరకే.  ఈ కారణాన పెళ్లి ఆగిపోయిందంటే మాకు బాధ కాదా?” అడిగింది మేఘమాల.
” ఇప్పుడు బాధపడ్డా తర్వాత సుఖపడేదాన్ని. సంస్కారం లేని వ్యక్తితో పెళ్లి జీవితకాలపు బాధ కదా?” స్థిరంగా అంది తన్మయి .
ఇటువంటివి ఎవరికి వారు తీసుకోవలసిన నిర్ణయాలు. అందుకే నిర్మల ఆమెకి వదిలేసింది.
సరిగ్గా అదే ప్రశ్న అడిగింది సంయుక్త తన్మయిని కొద్దిసేపటి తర్వాత. ఆమెకి తగిన జవాబు చెప్పింది తన్మయి .
” భార్య అభిరుచులనీ, అవసరాలనీ, ఒక్కొక్కసారి ఆమె పరంగా ఎదురయే తప్పనిసరి పరిస్థితులనీ  అర్థంచేసుకోలేనప్పుడు అతన్ని ఆమె పెళ్లిచేసుకుని లాభమేమిటి? అందమైన పువ్వులు దోసిలి నిండా తీసుకుని వాటి స్పర్శని తనువారా  వాటి అందాన్ని కనులారా ఆస్వాదించి వాటి వాసనని గుండెలనిండా పీల్చుకున్నట్టు ఉండాలి సహచర్యం  అంటే… స్నేహమేనా పెళ్లేనా”  అంది తన్మయి.  “శీను  అలాంటివాడేనని నాకు నమ్మకం ఉంది . ఒకవేళ కాకపోతే అతన్నలా మార్చుకోవగలనని ఇప్పుడు రుజువైందిగా?” ఆమె గొంతులో ధీమా.
సంయుక్తకి శ్రీధర్ మెడ చుట్టూ రెండు చేతులూ వేసి, అల్లుకుపోయి అతని కళ్ళలో కళ్ళుంచి చూస్తూ అతని శ్వాసలో మమేకం కావాలనిపించింది ఆ క్షణాన . అన్ని సంకోచాలను జయించిన క్షణం అది.
వీళ్లు వచ్చీ రావటంతోటే గొడవ మొదలైంది . అది పెద్దవాళ్లదాకా వెళ్లకూడదని జాగ్రత్తపడ్డారు.  అందుకే ఇంకా నిర్మల, దయానంద్ ల తల్లిదండ్రులను కలవలేదు శ్రీధర్,  సంయుక్తలు. ఇప్పుడు శ్రీధర్ సంయుక్తని వెంటపెట్టుకుని అందర్నీ కలిసి వచ్చాడు.
ఇద్దరు పిల్లల తల్లిని అతను చేసుకున్నాడన్న విషయం నిర్మల తల్లిదండ్రులని బాగా ఇబ్బంది పెట్టింది. అటువంటి పెళ్లిని ఇప్పటి తరంవారు నిలబెట్టుకోగలరా అనే భయంనుంచి వచ్చిన ఇబ్బంది అది.
సంయుక్త  శీను పెదనాన్న కూతురన్న నిజం కొంచెం కటువుగా అనిపించింది. ఈ విషయాన్ని పెళ్లివాళ్లు దాచిపెట్టారని అనుకోవడానికి ఇద్దరూ స్వంత అన్నాచెల్లెళ్ళు కారు. సంయుక్త ప్రవర్తనలో సాత్త్వికత, అమాయకత్వం  చాలావరకూ వాళ్ల మధ్య సానుకూలతని ఏర్పరచింది. మనసులోని భావాలు బయటపడకుండా బాగానే మాట్లాడారు.
“బ్యూటీపార్లర్ అమ్మాయిలు వచ్చారు. మీరుకూడా రండి” అని పిలవడంతో సంయుక్త వెళ్లింది.
” అదేమిట్రా, మమ్మల్ని సంబంధం చూడమంటే చూడమా? పిల్లల తల్లిని చేసుకోవడమేమిటి? లోకం గొడ్డుపోయిందా?” అని శ్రీధర్ ని కోప్పడింది నిర్మల తల్లి.
శ్రీధర్ నవ్వేసాడు. “పిల్ల నచ్చిందిలే, పిన్నీ! చాలా మంచిది” అన్నాడు.
“సర్లే. అంతగా నచ్చి చేసుకుంటే సరేమరి. ఆ ఇష్టాన్ని చివరిదాకా నిలబెట్టుకోవాలి” అని హెచ్చరించి ఆ విషయం అంతటితో వదిలేసింది.
అతను వెళ్లి రాజారావు, శారదలని పిలుచుకొచ్చి పరిచయం చేసాడు. సంయుక్త పరోక్షంలోనే వాళ్ల మొదటి పరిచయం జరగాలని అనుకున్నాడు. ఆమె మొదటిపెళ్ళి ప్రస్తావన అనివార్యంగా వస్తుంది. పదేపదే ఆమె గాయపడటం అతనికి ఇష్టం లేదు.
పరిచయాలయ్యి, కొంత సంభాషణ జరిగాక తనుకూడా అక్కడినుంచి వెళ్ళిపోయాడు .
నిర్మల తల్లిదండ్రులు బాహాటంగా  అడగలేని ఎన్నో విషయాలకి రాజారావు,  శారదలు స్పష్టమైన జవాబులు ఇచ్చారు. పెళ్లికి ముందు మాట్లాడుకోని విషయాలు ఇప్పుడు మాట్లాడుకున్నారు.
“మేనరికం అని చిన్నప్పుడే చేసేసాం.  అష్టకష్టాలూ పడింది. ఆత్మహత్య కూడా చేసుకోబోయింది. విడాకులకికూడా వాళ్లే తొందరపడ్డారు… పుట్టిన ఇన్నాళ్ళకి మా పిల్ల మొహంలో నవ్వు చూస్తున్నాం” అంది శారద. ఆమె గొంతు దు:ఖంతో పూడుకుపోయింది.
” ఈ పెళ్లిలో మా ప్రోద్బలం ఏమీ లేదమ్మా! ఈవేళ తన్మయికి మీరు ఎలా స్వేచ్ఛ ఇచ్చారో అలాగే మేము కూడా సంయుక్త  నిర్ణయానికి వదిలేసాం. ఇద్దరూ ఇష్టపడి చేసుకున్నారు. సంతోషంగా తిరుగుతున్నారు. ” అని చేతులు జోడించాడు రాజారావు.
వాళ్లకి ఇదంతా కలలా వుంది తప్ప నమ్మశక్యంగా లేదు. ఇంకొంతసేపు వుండి వెళ్లిపోయారు.
“ఈవేళ ఏం జరిగిందే?” వాళ్లు వెళ్లాక నిర్మలని అడిగింది ఆవిడ. చెప్పక తప్పలేదు.
“అంత గొడవ జరిగితే మాకెందుకు చెప్పలేదు? ” అని నిలదీస్తే…
“మేమే ఏమీ చెయ్యకుండా పక్కకి తప్పుకున్నాం. అందుకే చెప్పలేదు”
పిల్లలు ఇంత స్వతంత్రంగా వ్యవహరించడం ఆవిడ పుట్టింటిలో చూడలేదు. అభ్యుదయ భావాలున్నా తల్లిదండ్రుల వెనకే నిలబడేది తను. అత్తింటికి వచ్చాకే చాలా తెలుసుకుంది.

రాజారావు కుటుంబంలో  సంయుక్త పెళ్లి మొదటిది. చాలా వేడుకగా జరిగింది.  తర్వాత చెల్లెళ్ళ కూతుళ్ళ   పెళ్లిళ్లయ్యాయి. అంతే సందడి. వాళ్ల ఎనిమిది కుటుంబాలు కలిస్తేనే పెద్ద సందడి. మామయ్యలు, పిన్నుల అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు,  వాళ్ల కుటుంబాలు కలిస్తే ఇంక చెప్పనే అక్కరలేదు.  అలాంటిది ఇక్కడ  లెక్కపెట్టుకున్నట్టు ఎక్కువమంది  లేరు. 
చిన్న కుటుంబాలు ఎలా వుంటాయో మరో రెండు మూడు తరాల తర్వాత వుండే దృశ్యం ఇప్పుడే కనిపిస్తోంది.
తన్మయి  అలంకారం జరుగుతుంటే ఒక నడివయస్కుడు  ముసలామెని నడిపించుకుంటూ వచ్చాడు. అతను  నిర్మల పెదనాన్న కొడుకు. ఆవిడ నిర్మల నాయనమ్మ. నిర్మల తల్లిదండ్రులు,  పెద్దనాన్న పెద్దమ్మలు అదే వూళ్ళో ఒకే దగ్గర ఫ్లాట్లు కొనుక్కుని వుంటారు. ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటారు.
” రా అన్నయ్యా! రా నానమ్మా! ” అని ఆహ్వానించి పెద్దామెని సోఫాలో జాగ్రత్తగా కూర్చోబెట్టి దిళ్లూ అవీ అమర్చింది నిర్మల . ” మిగతావాళ్ళు  ఏరి?” అని అడిగింది
“వస్తున్నారు నిర్మలా! నిన్నంతా ఇక్కడే  వున్నారుకదా, అమ్మకి కీళ్ళనొప్పులు వచ్చేసాయి” జవాబిచ్చాడు అతను. 
ఒక్కొక్కరే వచ్చి పలకరిస్తున్నారు  పెద్దావిడని.
“చీరలో బావున్నానా తాతమ్మా?” అడిగింది తన్మయి. ఆవిడ నవ్వి, దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంది.  తనతో తెచ్చిన కానుకలు యిచ్చి, ” రాత్రి  ముహూర్తం కదా, వుండలేను” అంది. ఆవిడకి తొంభయ్యేళ్ళు దాటాయి. చిన్న కుదుపు కూడా తట్టుకోలేదని చెప్పారట డాక్టర్లు. ఆఖరి రోజులన్నట్టే.
“అబ్బాయిని తీసుకొస్తావా, ఒకసారి? ” అడిగింది.
తన్మయి శీనుని తీసుకురావటానికి వెళ్లింది.
అతను  రావటం, పరిచయం ఆశీర్వాదం అన్నీ అయాక –
“శ్రీధర్ ఏడే? ఏదో ఘనకార్యం చేసాడట?” అడిగింది.
నిర్మల అక్కడే వున్న సంయుక్తని ముందుకి తోసింది. “ఈ అమ్మాయే వాడు చేసుకున్న పిల్ల.  పేరు సంయుక్త”  అంది.
అక్కడ అందరూ శ్రీధర్ కి ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం గుర్తించాడు శీను.  అతని చదువు, హోదా, హుందాతనం  పైకి కనిపించే కారణమైతే దాన్ని సాధించి పెట్టిన వ్యక్తిత్వం రెండవ కారణం. వెరసి ప్రయోజకుడైన కొడుక్కి వుండేలాంటి స్థానం.
సంయుక్త ఆవిడకి నమస్కరించింది. “నీ గురించి మేఘమాల చెప్పింది. చూడాలనుకున్నాను. తీసుకురమ్మని చెప్పాను. ఈలోగా ఇలా చూడటం జరిగింది.  చాలా మంచి పని చేశావు . కొద్దిసేపు నా దగ్గరగా వచ్చి కూర్చో. నీతో మాట్లాడాలి ” అంది. అంతా వాళ్లిద్దరినీ వదిలేసి ఎవరి పనిలో వాళ్లు పడ్డారు. ఐనాకూడా మధ్యలో కూడా ఒకరిద్దరు వచ్చి పెద్దావిడని పలకరించి వెళ్తున్నారు.  అవసరమైనవాళ్ళకి  సంయుక్తని తనే పరిచయం చేస్తోంది.  శ్రీధర్ కూడా వచ్చి ఆవిడని చూసి వెళ్లాడు.
“అత్తయ్యగారు చెప్పేవి జాగ్రత్తగా విను సంయుక్తా! జరిగినవాటిని మనం తుడిచివెయ్యలేము. వాటి దుష్ప్రభావం మనమీద లేకుండా చూసుకోవాలి. వాటినుంచీ స్ఫూర్తిని పొందాలి. నువ్వు, శ్రీధర్  సంతోషంగా వుండటం మాకు కావలిసినది” అని,  నిర్మల తల్లి అక్కడ వున్నవాళ్ళందరినీ మరోగదిలోకి తీసుకెళ్ళింది, వాళ్లకి మాట్లాడుకోవడానికి వీలు కల్పిస్తూ.
సంయుక్త చేతిని తన చేతిలోకి తీసుకుంది ఆవిడ.  వడిలి ముడతలుపడినా పట్టు బలంగానే వుంది.
” నా పేరు తెలుసునా? కాంతామణీ, బియ్యే బీఎల్ . ఒకప్పుడు లీడింగ్ లాయర్ని. ఆడవాళ్ళ కేసులు చూసేదాన్ని” చిరునవ్వుతో చెప్పింది. సంయుక్త ఆశ్చర్యంగా విన్నది ఆవిడ మాటలని. అపనమ్మకంగా చూసింది.
“మీ పక్కింటిలో దిగినప్పుడు, మీ ఆయన పద్ధతి చూసి మేఘమాల నాకు ఫోన్ చేసింది. ఏమైనా చేద్దామా నానమ్మా అని అడిగింది”
“పెద్దక్కయ్యగారు… నా గురించి…?”
“ఔనమ్మా! ఇలాంటివి అది చూసి తట్టుకోలేదు… ప్రతివారికీ ఆప్టిమమ్  టాలరెన్స్ పాయింట్ వుంటుంది.  అక్కడదాకా మనిషి ఎదుటి మనిషిని భరిస్తాడు. ఆ తర్వాత తిరగబడతాడు. నువ్వింకా అప్పటికి సహించే స్థితిలోనే వున్నావు. కల్పించుకోవద్దని చెప్పాను. ..ఔనూ, ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నావు? “
“విసుగేసింది ఆ జీవితం. అమ్మావాళ్ళకి అర్థం  కాదు. బావ గురించి వాళ్లకి తెలుసు. ఐనా నన్ను అక్కడే వుండమనేవారు”
” నాతో దీటైన పిల్లవి. ఎంతోకాలంగా వెతుకుతున్నాను.  ఇప్పటికి దొరికావు. నా గురించి చెప్పనా?” అని నవ్వింది ఆవిడ.
(కొనసాగుతుంది)
 

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s