పెళ్లిపిలుపు 7 by S Sridevi

“ చాలా విషాదకరమైన విషయం ఏమంటే మగవారికి ఏం కావాలో ఆడవాళ్ళే చూసుకుంటారు. పిల్లల్ని కని పెంచి సమాజానికి అందిస్తారు.  వాళ్లకేం కావాలో ఇవ్వాలని ఎవరూ అనుకోరు. తమకి నచ్చి, తమకి వుపయోగపడేదే వారికి ఇస్తారు. ఈ పెళ్లి వద్దనిగానీ, ఈ భర్తని భరించలేననిగానీ ఆమె చెప్తే వినరు. అలాంటప్పుడు మనం పోరాడి సాధించుకోవడంలో తప్పు లేదు. మనది స్వార్థమననీ, అనైతికమననీ… ఈవేళ నాకు నువ్వెందుకో మరీమరీ నచ్చుతున్నావు” అని, “తలుపు తీయచ్చును ఇంక” చెప్పింది.
సంయుక్త వెళ్లి తలుపులు బార్లా తెరిచింది.
అంతా గది అవతలే వున్నారు. ఆవిడ  పెద్దకోడలుకూడా వచ్చింది.
“ఏమిటండీ, అత్తయ్యగారూ! అంతసేపు మాట్లాడేసారు? మీ ఓపికకూడా చూసుకోవద్దా?” అడిగింది నిర్మల తల్లి కాత్యాయని.
ఒకళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు,  ఇంకొకరు వేడిగా కాఫీ పట్టుకొచ్చారు.  తననేమైనా తప్పు పడతారేమోనని బెరుగ్గా పక్కకి నిలబడింది సంయుక్త.
“అంతసేపు ఏం మాట్లాడుకున్నారు నానమ్మా? సంయుక్తైతే ఏమీ మాట్లాడదు. నీచేతే మాట్లాడించి వుంటుంది. అందుకే కంగారుపడుతున్నాం ” అన్నాడు శ్రీధర్. అతని ముఖంలో అల్లరి.
“ఒరేయ్, నీ భార్య మంచిపిల్లని సర్టిఫికెట్ ఇస్తాను, ఓ కొడుకునో కూతుర్నో కని, కాంతమ్మనో , కాంతయ్యనో నా పేరు పెట్టుకోండి ” అంది ఆవిడ నవ్వుతూ.
శ్రీధర్ పెద్దగా నవ్వేసాడు ” కాంతమ్మా, కాంతయ్యానా? పెద్దయ్యాక వురికించి వురికించి కొడతారు మమ్మల్ని ” అన్నాడు. సంయుక్తకి ఆవిడ మాటలకి ఇబ్బంది కలిగింది . అతని మాటలకి  నవ్వూ వచ్చింది. 
” మీ నాన్నంటే భావుకుడూ, కవీగాబట్టి ఓ పిల్లకి మబ్బనీ ఇంకో పిల్లకి మంచనీ పెట్టుకున్నాడు.  మీ అమ్మ అడ్డం పడకపోతే నీకూ నిప్పనో నీళ్ళనో పెట్టుకునేవాడు “
” పెళ్లికి పిలవడానికి ఆశ్రమానికి వస్తున్నామని ముందుగా ఫోను చేసారు నిర్మలావాళ్ళూ. ఆశ్రమంలో లేరటకదా?” అంది కాత్యాయని.
“చిన్మయా మిషన్ ప్రోగ్రామ్స్ వుంటే ఢిల్లీ వెళ్లారు పిన్నీ ”  శ్రీధర్ జవాబిచ్చాడు.
” సంయుక్తా! ఎదురుసన్నాహానికి అందరం తయారైపోయాం. బ్యుటీషియన్ నీకోసమే ఆగింది.  వెళ్లి తొందరగా తయారయ్యి వచ్చెయ్” అంది నిర్మల.  “ఇంకో చీరేదైనా తెచ్చుకున్నావా? నాదేదైనా ఇవ్వనా?” అడిగింది.
“అమ్మ దగ్గర తీసుకుంటానండీ! తన బ్లౌజు నాకు సరిపోతుంది ” అని వెళ్లింది సంయుక్త.
“శ్రీధర్! నన్ను ఇంటి దగ్గర దించాలి. కారు తియ్యి నాన్నా!”అంది కాంతామణి.
“వుండచ్చు కదా?” అంది నిర్మల.
” అర్ధరాత్రి ముహూర్తం.  వుండలేను. ఆ చప్పుళ్లవీ భరించలేను. తెలారేసరికల్లా మేరేజిహాలు ఖాళీ చెయ్యాలి.  అప్పుడు హడావిడిపడటం దేనికి? ” అంది.
శ్రీధర్ వెళ్లాడు.
“పిల్ల మంచిదే. తెలివైనదీ, నెమ్మదస్తురాలు. గడుసుది మాత్రం కాదు” అంది కాంతామణి,  కాత్యాయనితో.
“చాలా భయపడ్డాను.  ఇద్దరు పిల్లల తల్లి… వంటికి నిప్పంటించుకుందంటేనూ, పిలవగానే శ్రీధర్ తో ఇంట్లోంచీ వచ్చేసిందంటేనూ… తొందరపాటు మనిషేమో, వీడి జీవితంలో ఏ తుఫాను సృష్టిస్తుందోనని. దానికి తగ్గట్టు శ్రీధర్ కూడా ఎవరికీ తీసుకొచ్చి పరిచయం చేసాడు కాదు”
” బిగించి పట్టుకుంటే ఏ సందు దొరికితే అందులోంచీ జారిపోతాయి చూడు, కొన్ని వస్తువులు… అలాగన్నమాట…”
” అన్నేళ్ళ కాపురం చేసాక ఎందుకొచ్చాయట గొడవలు?”
” అడగలేదు. మనసుకేదో గట్టి గాయం అయుంటుంది కాత్యాయనీ!”
సుదీర్ఘంగా నిశ్వసించింది కాత్యాయని.  “నేను కన్నది ఒక్క పిల్లనేగానీ నలుగురు పిల్లల తలనొప్పులు భరిస్తున్నాను. లేని తల్లి ఎలాగా లేదు. ఉన్న తండ్రేనా మంచిచెడ్డలు చూసుకోవద్దా?” అంది. అలాగని తన కుటుంబంలోకి అదనంగా వచ్చి చేరిన ఆ ముగ్గురు పిల్లలూ తనకి అందించిన సంతోషాన్ని మర్చిపోలేదు. ఎంత సందడిగా వుండేదో ఇల్లు!
తల్లి పోయినప్పటికి మేఘమాలకి పదేళ్ళు. శ్రీధర్ కి రెండు.  తెల్లకామెర్లు వచ్చి పోయింది ఆమె.  వాళ్ల నాన్నని మరో పెళ్ళి చేసుకొమ్మని ఎందరు ఎన్ని విధాల చెప్పారో!  ఆయన వినలేదు. భార్యమీద ప్రేమ కొండంత, పిల్లలకి అన్యాయం జరుగుతుందనే భయం మరో పర్వతమంత.
ఆడపిల్లలిద్దరినీ హాస్టల్లో వేసి, మగపిల్లవాడిని పెట్టుకుని వుండేవాడు.  శ్రీధర్  తమ దగ్గరే ఎక్కువగా వుండేవాడు. సెలవులిస్తే చాలు నలుగురూ ఒక దగ్గర చేరేవారు.  ఈరోజుకీ అంతే. కష్టం సుఖం కలిసే పంచుకుంటారు.
కాంతామణి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు.  తర్వాత నెమ్మదిగా అంది, ” చాలాకాలం తర్వాత ఆ అమ్మాయిలో నాకు నేను కనిపించాను. కొన్ని సారూప్యతలు ఎక్కడెక్కడి జ్ఞాపకాలో తవ్విపోస్తాయి. నా తల్లిదండ్రుల దగ్గర గడిపిన ఆ ఇరవైనాలుగేళ్ళే జీవితమంతా పరుచుకుపోయి కనిపిస్తున్నాయి”
“బాధపడకండి. అవన్నీ గడిచిపోయిన రోజులు. ఎంతో సాధించారు.  మీ ఇంటి కోడళ్ళమని ఎక్కడకి వెళ్ళినా మర్యాద దొరుకుతోంది ” కాత్యాయని ఓదార్చింది.
” ఆ రోజులు ఎక్కడ గడిచిపోయాయి?  ఎవరో ఒకరి జీవితంలో వున్నాయికదా? ” కాంతామణి ప్రశ్నకి జవాబు ఎవరి దగ్గర వుంది? ఎవరో కొందరు బాగుంటే సమాజం బాగున్నట్టేనా?
శ్రీధర్ వచ్చాడు.
అటునించీ సంయుక్త వచ్చింది,  పిల్లలని, తల్లిదండ్రులనీ వెంటపెట్టుకుని.  అదరినీ పరిచయం చేసుకుని పెద్దవిడకి నమస్కారం చేసి వెళ్ళారు శారద, రాజారావు. కాంతామణి పిల్లలిద్దరినీ ఇద్దరినీ దగ్గరకు తీసుకుని గుండెకి హత్తుకుని  విడిచిపెట్టింది.
“పప్పా!” అంది చిన్నది. ఏదో చెప్పబోయింది. శ్రీధర్ విన్నాడు.  సహజంగా వుంది ఆ దృశ్యం.
శేషుని నాన్నా అనీ, డాడీ అనీ పిలుస్తారు కాబట్టి ఈ పిలుపు అలవాటు చేసింది సంయుక్త. 
కాంతామణిని తీసుకుని శ్రీధర్ వెళ్లాడు.  అంతా ఎదురుసన్నాహానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు.
జయలక్ష్మి పెళ్లికి వుండలేదు. ఎవరెంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది.  ఆమె మనసు దహించుకుపోతోంది. ఇన్నేళ్ళూ నిరాఘాటంగా సాగిన పెత్తనం ఒక్కసారి చతికిలబడిపోయింది. కారణం సంయుక్త… దాన్ని ఈడ్చి పారెయ్యమంటే తమ్ముడు వినలేదు. ఆనాడే ఆ పని చేస్తే పరిణామాలు ఇలా వుండేవి కాదు… అంతరాత్మ ఘోషించింది.
అలా అక్కడ వుండలేకపోయిన మరో వ్యక్తి శేషు.

తన్మయి పెళ్లి హడావుడి కొంత తగ్గాక  నీహారిక విషయం నిర్మలకి చెప్పింది మేఘమాల. క్లుప్తంగా గుళ్ళో పెళ్లి చేసుకుని రిసెప్షన్ అందరికీ తెలిసేలా ఇచ్చారు నీహారికా, ప్రహ్లాద్ .
” వంటరిగా మిగిలిపోయావు పెద్దమ్మాయ్! ” అంది కాంతామణి బాధగా.
“నాకా బాధేమీ లేదు నానమ్మా! సుఖంగా వున్నాను” అంది మేఘమాల. నిజంగాకూడా అంతే. పెళ్లవలేదనీ, అదొక లోటనీ  ఆమె ఎప్పుడూ అనుకోలేదు.
నిర్మల పెళ్లి జరిగాక ఆమెనీ చేసుకొమ్మని అంతా చెప్పారు. తండ్రిలాగే తనూ ఆలోచించింది. తండ్రి వైరాగ్యంలో పడ్డాడు. నీహారిక చదువులో వుంది.  శ్రీధర్ బాగా చిన్నవాడు. వీళ్లని వదిలేసి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. అందులో మరో ఆలోచన లేదు.
రిసెప్షన్ కి రాజారావు, శారదా వెళ్లారు. తన్మయి,  శ్రీనివాస్ వెళ్లారు. వసంతకి వెళ్లాలని వుంది.
” అడవిలో వుండాల్సిన సంతనంతా తెచ్చి నట్టింట్లో నిలబెట్టిందీ సంయుక్త. అన్నయ్య మొహం చూసి వూరుకున్నానుగానీ… వాళ్లతో అంత మమేకం కానక్కర్లేదు.  ఇప్పుడు ఆ ముసలిదాని రిసెప్షన్ కి వెళ్ళాల్సిన అక్కరేం లేదు” అని చిరచిరలాడాడు నారాయణరావు. మోటుగానే మాట్లాడాడు.
సంస్కారం అనేది మనిషి వేసుకుని ఇప్పేసే చొక్కా కాదు. పుట్టుకనుంచి మనిషిని అంటుకుని వుండే చర్మం. అది తనకి లేదని మరోసారి నిరూపించుకున్నాడు.

కాస్త తీరిక చిక్కగానే తనకి కాతామణి చెప్పిన విషయాలు తల్లితో చెప్పింది సంయుక్త.
అహల్యది తప్పు అని నమ్మడం దగ్గర నుంచీ,  అహల్యది హక్కేనట అనటందాకా ప్రస్థానించిన కూతురి జీవితం తమకి భిన్నంగా వుండబోతోందని అర్థమయింది శారదకి. కాబట్టే వాళ్లు అంత తేలికగా ఆమెని స్వీకరించారని కూడా. ఆ స్వీకృతి వెనక వున్న బలం ఎంత అనేది ఇంకా అంచనాకి అందటం లేదు.
సాంప్రదాయం అనేది కొంతమంది మనుషులు ఒక సమూహంగా కొనసాగే సౌలభ్యం కోసం చేసుకునే కట్టుబాటు. దాన్ని సంయుక్త దాటింది.
“భగవంతుడా! ఈ  పిల్లని కాపాడు” అని మనసులోనే అనుకుంది.

తన్మయి పెళ్లి నుంచి వచ్చాక సంయుక్తలో స్పష్టమైన మార్పుని చూశాడు శ్రీధర్. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. కొత్త ఉత్సాహాన్ని నింపుకుంది . శ్రీధర్ తనకన్నా చాలా ఉన్నతుడనీ, ఎంతో త్యాగం చేశాడనీ అనుకునేది. దానివలన కలిగిన న్యూనతాభావం తగ్గింది. ఆ స్థానంలో అతని పట్ల  ప్రేమ, అభిమానం చోటుచేసుకున్నాయి. ఆ ప్రేమ ప్రతి చర్యలోనూ చూపిస్తోంది. శ్రీధర్ కి చాలా సంతోషం కలిగింది.
అతనికి త్వరలోనే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కాబట్టి వెంటనే వెళ్లి చేరాలి. తను వెళ్లి, ఇల్లు చూసుకుని సంయుక్తనీ, పిల్లలనీ తీసుకెళ్తానన్నాడు.
” ఒక్కదానివే ఎందుకు? మన ఇంటికి వచ్చెయ్” అని తీసుకెళ్ళింది శారద.
ఆమె పుట్టింటికి వచ్చిందని తెలిసి శేషు వెళ్ళాడు.
రాజారావు పిల్లల్ని తీసుకుని పార్క్ కి వెళ్ళాడు. సంయుక్త, శారద హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. శేషుని చూసి శారద కంగారుపడింది. ఏం గొడవ జరుగుతుందోనని గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.
దానికి తగ్గట్టే అతను, ” పిల్లల్ని తీసుకెళ్దామని వచ్చాను అత్తయ్యా!” అన్నాడు.
” మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వద్దని నువ్వూ మీ అమ్మా కంకణం కట్టుకున్నారా శేషూ? ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది?” కోపంగా అడిగింది.
సంయుక్త వెంటనే కలగజేసుకుంది. “తీసుకెళ్ళనివ్వమ్మా? నాకే కాదు, అతనికి కూడా బాధ్యత ఉంటుంది కదా? ఎప్పుడు తీసుకెళ్తావు బావా? నాకో రెండు రోజులు వ్యవధి ఇవ్వు. వాళ్లని నెమ్మదిగా ప్రిపేర్ చేస్తాను” అంది. శారద నివ్వెరపోయి చూసింది. కూతురు పిల్లల్ని కూడా వద్దనుకుంటోందా? అర్థం అవ్వలేదు. బాధతో గుండె మెలిపెట్టినట్టైంది. శేషు కూడా కంగుతిన్నాడు.
” నేను తనతో మాట్లాడతాను. అమ్మా!నువ్వు లోపలికి వెళ్లు” సంయుక్త అంది.
శారద లోపలికి వెళ్ళిపోయింది.
” బావా! ఒక్క ఐదు నిమిషాలు నీ కోపం, ఆవేశం అన్నీ పక్కన పెడితే మనం కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ప్లీజ్!” అంది శేషుతో.
అతను అయిష్టంగా కూర్చున్నాడు.
” నేను ఆత్మహత్యకి ప్రయత్నించిన రోజుకి ముందురోజు నువ్వు నాతో మాట్లాడినది ఏమిటి? ఒకసారి గుర్తు తెచ్చుకుంటావా?” అడిగింది.
అతను మాట్లాడలేదు.
” నేనంటే ఇష్టం లేదని చాలా స్పష్టంగా చెప్పావు. అలా కాకుండా పెళ్లయ్యాక ఇన్నేళ్లకి ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్న అనో, ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకుంటాను అనో నువ్వు అని ఉంటే ఆ ఒక్క మాట ఇచ్చే భరోసాతో నీలో మార్పు  కోసం ఎదురు చూస్తూ జీవితమంతా గడిపేసేదాన్ని. నీ అయిష్టాన్ని అంత స్పష్టంగా వ్యక్తపరిచాక అది తెలుసుకోకుండా అన్నేళ్లు నీతో కలిసి ఉన్నందుకు నామీద నాకే అసహ్యం వేసి చచ్చిపోవాలనుకున్నాను”
“అదంతా అయిపోయింది కదా? అన్నీ తెంచుకుని వెళ్లిపోయావు. ఇంక దేనికి?”
” అదే చెప్పబోతున్నాను. మన పెళ్లి ఒక నిర్బంధంలా జరిగింది. నీకు స్పష్టంగా ఇష్టం లేదు. అత్తయ్యకి ఎదురు చెప్పలేకపోయావు. నాకు ఇష్టమో కాదో అనే స్పష్టత లేదు. అమ్మావాళ్ళకి అన్నీ తెలుసుననుకున్నాను. అలా పడ్డ బంధంలో ఇమడలేక నిత్యం అసంతృప్తితో రగిలిపోతూ ఉండేవాడివి”
“సమ్మూ! ఇప్పుడు దేనికే అవన్నీ? పిల్లలని తీసుకెళ్లాలని వచ్చాను. వాళ్లని నాతో పంపించు”
“మంచికో చెడుకో మన దారులు విడిపోయాయి.  ఇష్టం లేని మనిషివలన పుట్టిన పిల్లలు నిత్యం కళ్ళముందు తిరుగుతూ ఉంటే నీకు బావుంటుందా? నామీది కోపంతో వాళ్లని కొట్టి చంపుతావా? నా విషయంలో మా అమ్మావాళ్ళూ వూరుకున్నారుగానీ వాళ్ళ విషయంలో మాత్రం  నేను వూరుకోను.  వాళ్లని నేను పెంచుకోగలను. నువ్వు కూడా నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. విడాకులప్పుడు పిల్లల ప్రస్తావన రాలేదు. నేనే బాధ్యత తీసుకుంటానని చెప్పాను. ఇప్పుడు కొత్తగా ఇదేమిటి?”
శేషు తల దించుకున్నాడు.
శ్రీను పెళ్లిలో జరిగిన అవమానానికి తల్లి రగిలిపోతోంది. సంయుక్తకి బుద్ధి చెప్పాలంటే పిల్లలని తీసుకురమ్మని ఆవిడే పంపింది. నిజానికి అతనుగానీ ఆవిడగానీ వాళ్లని పెద్దగా దగ్గరికి తీసినది లేదు. ఆడపిల్లలని చిన్నచూపే చూసారు తల్లీ కొడుకులు. సంయుక్తలాగే వాళ్లు కూడా బిక్కుబిక్కుమంటూ ఉండేవారు.
ఆమె అంత తెగింపుతో ప్రవర్తిస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు.  ఆమెని  నచ్చుకోకపోవటం తన హక్కు అనుకున్నాడుగానీ ఆమెకికూడా అలాంటి హక్కు వుంటుందనుకోలేదు. ఆమె ఆత్మహత్యకి ప్రయత్నించినప్పుడు కూడా కదలని అతని గుండె మారుపెళ్ళికి వెళ్లినప్పుడు కదిలింది.  ఊహకి  వ్యతిరేకంగా ఒకొక్కటీ  జరిగినప్పుడు సంయుక్త మీద కోపం వచ్చింది. చంపేయాలన్నంత ఆవేశం కలిగింది. ఉక్రోషం, బాధ, అవమానం అన్నీ కలిగాయి. ఆ తర్వాత ఏమీ చెయ్యలేని తన అసక్తత అర్థమయింది. ఆఖరిది  తనేంటి అనే గందరగోళం.
తల్లి దిశానిర్దేశనం చెయ్యలేదు. సంయుక్తని ఏం చేయాలి, ఎలా బాధపెట్టాలని మాత్రమే ఆలోచించింది  . ఇప్పుడు కూడా పిల్లలని తీసుకొస్తే ఆమె గిజగిజలాడుతుందనే ఆవిడ ఆలోచన.
అతని మనసు చదివినట్టు                    ” కావాలనుకుంటే తీసుకెళ్ళు వద్దని నేనేం అనట్లేదు. పిల్లలని తీసుకెళ్లటం అంటే నన్నేదో బాధపెట్టడం కాదు   బావా! ” అంది సంయుక్త . ” చివరిదాకా వాళ్ల బాధ్యతని తీసుకోవాలి. చదివించాలి. బుద్ధులు నేర్పాలి. పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేయాలి. ఎందుకు కన్నారని వాళ్లు రేపటి రోజున మనని నిలదీయకూడదు . ఇవన్నీ నువ్వూ, అత్తయ్యా చెయ్యగలరా? నీకు కాబోయే భార్య వాళ్లతో కంఫర్టబుల్ గా ఉంటుందా? … నీకు దొరికిన స్వేచ్ఛని మళ్లీ సంకెళ్ళలో,ఇరికిద్దామని ఎందుకు అనుకుంటున్నావు? ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మళ్లీ మార్చవలసిన అవసరం ఉందా? ” సూటిగా అడిగింది. ఆమె మాటలు కొరడా అంచులా తాకాయి.
” అవన్నీ నువ్వు చెయ్యగలవా?” బెదిరింపుగా అడిగాడు శేషు.
“చెయ్యగలను” స్థిరంగా వచ్చింది ఆమె జవాబు. ” నా వెనక ఎంతమంది నిలబడ్డారో నువ్వే చూసావుకదా? “
సంయుక్త చెయ్యగలిగిన పని తను మాత్రం చెయ్యలేడా?
అతనికి అహం పొడుచుకు వచ్చింది.  కానీ ప్రశ్న … ఒకసారి తెగిపడిన సంకెళ్ళని మళ్లీ తగిలించుకోవలసిన అవసరం ఉందా?   వాళ్లని కన్నతల్లి చూసుకోగలనంటోంది. ఆమెని కాదని తన తల్లికి ఈ వయసులో బాధ్యతగానో , పెళ్లి చేసుకునే అమ్మాయికి పెళ్లిషరతుగానో ఇవ్వవలసిన అవసరం వుందా? అప్పుడేమౌతుంది?
పిల్లల్ని తీసుకుపొమ్మని తేలిగ్గా అనేసింది  సంయుక్త. ఆమె  తెరిపిన పడుతుంది.  తను ఇరుక్కుంటాడు. దాన్నే పెంచుకోనీ.
ఎదురుగా వున్నది వెనకటి సంయుక్త కాదు. ఎలాంటి బెదురూ లేకుండా సూటిగా అడుగుతోంది. నిర్భయంగా, నిర్మోహమాటంగా చెప్పేస్తోంది.
తన ప్రయత్నంలోని డొల్లతనం తనకే అర్థం అవుతుంటే తలదించుకుని కూర్చున్నాడు చాలాసేపు. ఆ కొద్దిసేపట్లో అతని ఆలోచనల్లో మార్పు వచ్చింది.
” వాళ్లేరి? చూసి వెళ్తాను”
“నాన్నతో పార్కుకు వెళ్ళారు”
“సరే. నీ మాటే కానీ” అతను వెళ్లిపోయాడు.
అతను అంతకి భిన్నంగా ప్రవర్తిస్తాడని ఆమె వూహించలేదు. సమస్య తేలిపోయినందుకు తేలిగ్గా నిశ్వసించింది.  అతను గేటు దాటేదాకా చూసి, వీధితలుపు గడియపెట్టి తల్లి దగ్గరకు వెళ్ళింది.
“తండ్రితో వాళ్లని పంపించేస్తావేమోనని భయపడ్డాను. అసలెంత పెద్ద గొడవౌతుందోనని హడిలిపోయాను” అంది శారద. తన మనసులో కలిగిన భావాలు తనలోనే దాచుకుంది. అలా ఆలోచించినందుకు సిగ్గిలింది.
“అలా ఎలా అనుకున్నావమ్మా? ఎప్పుడేనా వాళ్లని దగ్గరకు తీసిన మొహాలేనా అవి? మూర్ఖుడు. అతను అడిగీ అడగ్గానే పంపించనని ఖరాఖండిగా చెప్పేస్తే బలవంతంగా లాక్కుపోతాడు. అప్పుడు ఇంక పోలీసులు,  కోర్టు కేసులూను. అందుకే సరేనని, బుర్రకి పట్టిన తుప్పు వదిలించాను”
“అలా ఎలా విన్నాడే?” శారదకి ఇంకా నమ్మకం కలగలేదు.
జరిగింది చెప్పింది సంయుక్త.
“చేసుకోనీ చేసుకోనీ…ఎలాంటి పిల్ల వస్తుందో నేనూ చూస్తాను.” అంది శారద.
“ఎవరొచ్చినా నాలా పడి వుండరు, మీలా ఆ పిల్లని వదిలెయ్యరు” కోపంగా జవాబిచ్చింది.
శారద ప్రేమగా కూతురి చెయ్యి పట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుంది.
“సారీ తల్లీ! చాలా బాధపడ్డావుకదూ? బైటి సంబంధమైతే ఎప్పుడో తెగతెంపులు చెప్పేవాళ్ళు.  అత్తకి ఎదురు చెప్పలేక…”
“ఎదురు చెప్తే? ఏమయ్యేది? ఇప్పుడేమైంది? అప్పుడూ ఇదే అయేది”
“సమ్మెటతో కొట్టాలంటే ఇనుము వేడెక్కాలి. నువ్వు  ప్రాణంమీదకి తెచ్చుకున్నాక కదా, మీ నాన్నలో చలనం వచ్చింది?”
“నేనంటే నాన్నకి ఇష్టమేనా? అత్తతో గొడవలు తెచ్చినందుకు కోపమా?”
“పిచ్చిదానా! ఆయన ప్రాణం నువ్వు.  దూరం పంపలేక కళ్ళముందే వుంటావని కదా, నిన్నతనికి ఇచ్చింది? సరసం తెలియని మూర్ఖుడనుకోలేదు. మారతాడనే ఎదురు చూసాం. .. పోనీలే జరిగిపోయిన విషయాలు ఇంక దేనికి?” శారద మాటమార్చింది.
“ఓ కాంతమ్మనో కాంతయ్యనో కనాలట… నానమ్మగారు… అదేనమ్మా, కాంతామణిగారు చెప్పారు ” అంది సంయుక్త.
ఒక్క క్షణం శారదకి అర్థం కాలేదు. అర్థమయాక నెమ్మదిగా అంది, “వెంటనే కాదుగానీ, ఆలోచించు. వాళ్ల కోరిక సమంజసమైనదే. వాళ్లతన్ని అంతగా ప్రేమిస్తున్నారు. ” అంది మృదువుగా.
సంయుక్త ఔననలేదు, కాదనలేదు. తల్లి వొళ్ళో తలపెట్టుకుని పడుకుంది.
….
తల్లిదండ్రుల దగ్గర   పదిహేనురోజులు  వుంది  సంయుక్త. ఢిల్లీ వెళ్లేరోజు దగ్గరపడింది.  వారంరోజులు సెలవుతీసుకుని వచ్చాడు శ్రీధర్.   తమ యింటికే వచ్చెయ్యమని చెప్పాడు రాజారావు. అతను కొంచెం మొహమాటపడ్డాడు కానీ రాజారావు మరీ మరీ చెప్పడంతో అలాగే వచ్చేసాడు. ఉదయాన్న కాలింగ్ బెల్ శబ్దానికి  సంయుక్త తలుపుతీసేసరికి గుమ్మంలో నిండుగా అతని విగ్రహం…సమ్మోహనంగా నవ్వుతూ.
సంయుక్త ఆశ్చర్యపడింది. సంతోషం వుప్పెనలా పొంగింది.
“ఇంకా నాన్న స్టేషనుకి బయల్దేరబోతున్నారు” అంది. 
“ట్రెయిన్ పదిహేను నిముషాలముందే వచ్చేసింది” జవాబిచ్చాడు.
పలకరింపులు, కాఫీ ఫలహారాలు, కొంత విశ్రాంతి,  స్నానాదులన్నీ అయ్యాయి. అప్పటినుంచి కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టే అయింది అతని పరిస్థితి.
మొదటిరోజు ఇద్దరు స్నేహితుల సహాయంతో సామాన్లు మూవర్స్ కి ఇచ్చేసాడు.
మరుసటిరోజు తండ్రిని కలవటానికి ఆశ్రమానికి బయల్దేరాడు సంయుక్తనీ పిల్లలనీ వెంటబెట్టుకొని. 
“మేము కూడా వస్తామని అతనికి చెప్పు  సమ్మూ! వాళ్ల నాన్నగారిని చూసి పరిచయం చేసుకుంటాం” అంది శారద. సంయుక్త శ్రీధర్ కి చెప్పింది.  బంధాలు ఒకటొకటిగా కలుస్తున్నందుకు అతను చాలా సంతోషించాడు.
ఊరికి దూరంగా దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో వున్న ఆశ్రమం అది. ఒక రకంగా వానప్రస్థాశ్రమంలాంటిది. ప్రశాంతమైన వాతావరణం.
సాదరంగా ఆహ్వానించాడు శ్రీధర్ తండ్రి. కొడుకుని దగ్గరకి తీసుకున్నాడు. సంయుక్త వంగి కాళ్ళకి నమస్కరించింది. రాజారావు, శారదలతో   పరిచయ మర్యాదలయాయి.
“తన్మయి తన భర్తతో ఇక్కడికి వచ్చింది శ్రీధర్!  అబ్బాయి చాలా మంచివాడు,  మర్యాదస్తుడు… అతను నీ అన్నయ్యటకదా, సంయుక్తా! విని చాలా సంతోషమైంది” అన్నాడు శ్రీధర్ తండ్రి .
మనవాళ్ళని మంచివాళ్ళని మరొకరు అంటుంటే అందులోని  సంతోషం సంయుక్తకి మొదటిసారి పరిచయమైంది. 
శ్రీధర్ ఆయన్ని తనతో వచ్చెయ్యమన్నాడు. ఎప్పటిలాగే  సున్నితమై తిరస్కారం. ఆయన కుటుంబ జీవనంలో ఇమడలేడు. భార్య పోయాక  అందులోంచీ బయటికి వచ్చేసాడు. తెగిపోయిన పూసలదండలా తమ కుటుంబం,  రాలిపడ్డ పూసల్లా తామూ అనిపిస్తారు. వాటిని తిరిగి కూర్చగలిగే నేర్పు ఆయనలో లేదు.
రాజారావుకి  ఆశ్రమంతా తిప్పి చూపించాడు. తన భావి జీవితం అక్కడ నిక్షిప్తమై వుందనిపించింది రాజారావుకి. అక్కడ వాతావరణం చాలా నచ్చింది.
సాయంత్రందాకా వుండి తిరుగు ప్రయాణం అయారు.
….
“రేపు నానమ్మగారిని చూడ్డానికి వెళ్దాం. తొందరగా బయల్దేరి పోదాం. ” ఇంటికెళ్లాక సంయుక్తకి  చెప్పాడు శ్రీధర్.
అతను చెప్పినట్టే వుదయాన్నే బయల్దేరారు.
” పిల్లలెందుకే? వాళ్లని మా దగ్గర వదిలేసి వెళ్లండి” అంది శారద. పెళ్ళైన వెంటనే ఇద్దరు పిల్లల్ని వెంటేసుకుని తిరగటమంటే అతనికి ఇబ్బందిగా వుంటుందేమోననుకుంది.
కానీ   శ్రీధరే జవాబిచ్చాడు. ” పిల్లలని  తీసుకెళ్తానని అతనొచ్చాడట కదండీ! సంయుక్త చెప్పింది.   సంయుక్త వాళ్లని  తనతోనే వుంచుకోవాలనుకుంటోది. అది చట్టసమ్మతం కూడా. తను లేనప్పుడు మళ్ళీ వస్తే లేనిపోని సమస్యలు”
శారద నిరుత్తరురాలైంది.
వీళ్ళు వెళ్లేసరికి నిర్మల,  దయానంద్ అక్కడే వున్నారు. కాంతామణి తన్మయి పెళ్లప్పటికన్నా బాగా తగ్గిపోయింది.   సంయుక్తని చూడగానే ఆవిడ కళ్ళలో వెలుగు.
“నువ్వు నా అద్దానివా? ప్రతిబింబానివా?” అని అడిగింది.  సంయుక్త నవ్వింది.

తన్మయీ,  శీనూ వాళ్లని భోజనానికి పిలిచారు. పిలిచాక ఇంట్లో చెప్పాడు. తల్లిదండ్రులకి అభ్యంతరం వుంటుందనుకోలేదు. 
” వాళ్లని ఇంటిదాకా ఎందుకురా?”
నారాయణరావు తిరస్కారంగా అన్నాడు.  శీను తెల్లబోయాడు. సంయుక్త విషయంలో తండ్రి యూటర్న్ తీసుకుంటాడనుకోలేదు.
“తన్మయి పిలిచింది ” అన్నాడు.
“ఈ ఐమూల చుట్టరికాలు నాకు నచ్చలేదు. పరాయి మగాడి భార్యాపిల్లలని వెంటేసుకుని తిరిగేవాడు వాడొక మగాడు, అదొక పెళ్లి, నీ భార్యకి మామయ్య…” నిరసనగా అన్నాడు.
ప్రపంచాన్ని పెద్ద మాయ అంటారు వేదాంతులు. దేనికీ కచ్చితత్వం వుండదు. చూసే దృష్టిని బట్టి అది మారుతుంది.  సంయుక్త సమస్యని శ్రీధర్ చూసే కోణం వేరు. ఇతరుల కోణం వేరు.
“మీరిలా మాట్లాడతారనుకోలేదు నాన్నా! లేకపోతే బైటే కలుసుకునేవాళ్ళం. పిలిచాక ఇప్పుడు బావుండదు” అన్నాడు శీను.
“ఎలాగా వెళ్లిపోతున్నారుకదండీ” అంది వసంత. ఆమెకి సంయుక్తని చూడాలని ఆరాటంగా వుంది.  ఢిల్లీ వెళ్తే మళ్ళీ ఎప్పటికో చూడటం!
“ఇంకేం? అమ్మాకొడుకులు ఏకమయారు… ఏదో ఒకటి ఏడవండి” అని విసురుగా వెళ్లిపోయాడు నారాయణరావు.
“ఈయన మారరామ్మా?” అడిగాడు శీను.
“ఆయన ఇంకేం మారతారుగానీ, కనీసం నువ్వేనా మారావు. సంతోషం” అంది వసంత.

నారాయణరావు ఇంటినుంచి నీహారికని కలవడానికి వెళ్లారు. అక్కని గృహిణిగా చూసి గమ్మత్తుగా అనిపించింది శ్రీధర్ కి. బాబుని పెంచుకునే ప్రయత్నంలో వున్నారు. రోజుల పిల్లవాడికోసం చూస్తున్నారు.  మేఘమాల వూళ్ళో లేదు. ఏదో కాన్ఫరెన్స్ కి వెళ్లింది.

ప్రయాణం రోజు.
రాజారావు, శారద స్టేషన్ కి వచ్చారు. తన్మయి,  శీను వచ్చారు. రైలు కదుల్తుంటే ఒక తలకాయ స్తంబం చాటుకి తప్పుకోవటం గమనించింది సంయుక్త.  అది శేషుది. బైటికే అంది ఆశ్చర్యం ఆపుకోలేక.
శ్రీధర్ నవ్వాడు. తర్వాత అతని ముఖం కొద్దిగా సీరియస్ గా అయింది. “ఒకొక్క వ్యక్తిని చూస్తుంటే ఇతన్నొక చెంపదెబ్బ కొట్టి,  దారిలో పెట్టేవాళ్ళు ఎవరేనా వుంటే బావుండుననిపిస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో అతను కొన్ని చెడ్డ పనులు చేస్తూ వుంటే వుపేక్షిచడం వలన ఆ పనుల్లోని చెడ్డతనం అతని వ్యక్తిత్వంలో భాగంగా మారి క్రమంగా అతన్ని చెడ్డవాడిగా మారుస్తుంది.  శేషుని మొదటిసారి చూసినప్పుడు నాకు కలిగిన భావాలు ఇవి” అన్నాడు.
“చెంపదెబ్బ కన్నా బలమైనదే తగిలింది” అంది సంయుక్త.”అతనిప్పుడు మారుతున్నాడు”
“మంచిదేగా?”
“మరో ఆడపిల్ల సుఖపడుతుంది”
రైలు వేగం అందుకుంది.
(అయిపోయింది)
   
   
 

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s