ఆమె విజేత కాదు by S Sridevi

(చినుకు మాసపత్రిక నిర్వహించిన  క్రేన్ – కథలపోటీలో తృతీయబహుమతి పొందిన కథ. ఏప్రిల్ 2006 చినుకులో  ప్రచురించబడింది)
వంటవగానే ఎప్పట్లా పార్వతమ్మ వెళ్తానని చెప్పి వెళ్ళిపోలేదు. వచ్చి నా ఎదురుగా మోడా లాక్కుని కూర్చుంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. చెప్పలేకపోతోంది. సంకోచపడుతోంది . డబ్బు
కావాలేమోననుకున్నాను. కానీ అదికాదు.
“సాయికి ఉద్యోగం వచ్చిందమ్మా! ఒక చోటకాదు, మూడు నాలుగు కంపెనీల్లో వచ్చింది. వాటిల్లో ఒకటి యీ వూళ్ళోనూ వుంది. ఐతే వాడు బెంగుళూర్లో చేస్తాడట. ఇక్కడ చెయ్యడట” అంది. సాయికృష్ణ
ఆమె కొడుకు. కొడుక్కి ఉద్యోగం వచ్చిన సంతోషం ఆమె గొంతులో
ధ్వనించలేదు.
“వంటమనిషి కొడుకునని చెప్పుకోవడానికి నామర్దాగా
వుంటుందట. ఇక్కడైతే అందరూ తెలిసిన వాళ్ళు, తన చదువుకీ
ఉద్యోగానికీ విలువ  యివ్వరంటున్నాడు” ఆమె ముఖం చిన్నబోయింది.
ఆమె బాధ అర్థమైంది.
భర్త చిన్నవయసులోనే చనిపోతే అప్పట్నుంచీ కష్టపడి సాయిని
పెంచుకొచ్చింది.
నా తల్లి కూడా చిన్నప్పుడే చనిపోయింది. సవతితల్లి …..
ఎందుకనో నాపట్ల అయిష్టంగా వుండేది. ఆమె మా కుటుంబంలోకి
రాగానే నాన్న పరాయివాడనిపించసాగాడు. అలాంటి పరిస్థితుల్లో డెలివరీలప్పుడు నాకొక మనిషి బాగా అవసరమయ్యేది. హైద్రాబాదంతా గాలించగా పార్వతమ్మ దొరికింది. ఆమె మాకు దూరపు బంధువు కూడా. అప్పట్నుంచీ ఆమే మాకు వంట చేసేది. పురిటి పథ్యం, పిల్లల ఆలన చూసుకునేది పిల్లలు పెద్దవాళ్ళయ్యాక కూడా ఆమెని వదల్లేకపోయాం . మా యింటి చట్టుపక్కలే ఇంకో నాలుగైదు యిళ్ళల్లో కూడా వంటచేస్తూ భుక్తిని వెళ్ళదీసేది. ఆమె మా యిళ్ళలో వంట చేస్తున్న సమయాన సాయి మా కారిడార్లో ఓమూల కూర్చుని చదువుకుంటుండేవాడు. అతడు నాలుగైదు తరగతుల్లో వున్నపుడు పార్వతమ్మే అతనికి తెలీనివి చెప్పేది. తర్వాత నేనో రాజానో చెప్పేవాళ్ళం. అటు తర్వాత రాజా కాంట్రాక్టరుగా బిజీ అవటం, నాది సైన్సు గ్రూపు కావటంతో అతడికి మా చదువులు ఉపకరించలేదు. క్రమంగా మా యింటికి రావటం తగ్గించేసాడు. ఇప్పుడతను కంప్యూటర్ సైన్సుతో బీటెక్ పూర్తిచేశాడు. ఉద్యోగం కూడా వచ్చింది. పిల్లవాడు మంచివాడు. తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంక పార్వతమ్మ కష్టాలు గట్టెక్కినట్టే.
ఐతే యీ పిల్లవాడిని పార్వతమ్మ చాలా కష్టపడి చదివించింది. బంధువులంతా తనని వదిలి పెట్టేస్తే వంటరి పోరాటం చేస్తూ చదివించింది. తన విజయాన్ని యిక్కడి వాళ్ళంతా గుర్తించాలని ఆమెకి వుంది. ఆమెవైపునుంచి చూస్తే అందులో తప్పేమీలేదు. పడ్డ గోడని నిలబెట్టిన గర్వం ప్రకటించుకోవాలని ఎవరికుండదు?
“నీకిక్కడే వుండాలనుందా?” చిన్నగా నవ్వి అడిగాను.
“కాదామ్మా? మన వాళ్ళ మధ్యనుండే నిశ్చింత కొత్త వూళ్ళో ఎలా వస్తుంది? సాయంత్రం వాడిని తీసుకొస్తాను. మీరు నచ్చజెప్పండమ్మా” మీ మాటంటే వాడికి గొప్ప గురి” అంది అర్థింపుగా.
సరేనన్నాను. అన్నట్టుగానే సాయంత్రం సాయిని వెంట పెట్టుకుని వచ్చింది.
“నమస్తే ఆంటీ! బాగున్నారా?” అన్నాడు రాగానే. ఈ మధ్య చూడకపోవటంతో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. బాగా పొడుగయాడు. హుందాతనం కూడా వచ్చి చేరింది. ముచ్చటనిపించింది.
“ఉద్యోగం వచ్చిందటగా, సాయీ? ఇంతవాడివి, ఎంతలో పెద్దయ్యావు?” అభిమానంగా అన్నాను.
“అంకుల్, మీరూ చిన్నప్పుడు నేర్పిన పాఠాలే నన్నింతవాడిని చేసాయి” అన్నాడు తను కూడా నవ్వుతూ. తనతో తెచ్చిన స్వీట్సు,పళ్ళు నాకిచ్చాడు.
“ఎందుకివన్నీ?” మందలించాను. అతను నవ్వి వూరుకున్నాడు. కూర్చోమన్నాను. నా ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆ కుర్చోవడంలో కొంత యిబ్బంది కనిపించింది. పార్వతమ్మ ఎప్పట్లాగే
మోడాలాక్కుని కూర్చుంది. సాయి ఒకసారి ఆమెనీ నన్నూ మార్చి చూసి, తలదించు కున్నాడు.
“ఎక్కడ జాబ్? ఏ కంపెనీ? జీతం ఎంత?” వివరాలన్నీ అడిగాను. చెప్పాడు.
“అంతదూరం ఎందుకు సాయీ? ఈ వయసులో కొత్తప్రదేశం అంటే అమ్మ ఎడ్జెస్టవ లేదేమో!” అన్నాను.
అతను నెమ్మదిగా తలెత్తి నన్ను చూసాడు. “ఆంటీ! మీ అందరి సహకారం వల్లనే నేనింతటివాడినయాననే విషయం ఎప్పుడూ
మర్చిపోలేను. కానీ యిక్కడే వుంటే నన్ను పార్వతమ్మ కొడుగ్గా తప్ప నా క్వాలిఫికేషన్నీ, ఉద్యోగాన్ని ఎవరూ గుర్తించరు. నేనెవరో  తెలీనివాళ్ళు  కూడా యీ విషయం తెలిసాక నన్ను చులకనగానేచూస్తారు… ఐవాంట్ ఏ ఫ్రెష్ బిగినింగ్. నాతోటి సాఫ్ట్ వేర్ యింజనీర్ల మధ్య సమానస్థాయిలో బ్రతకాలనుంది. అది ఎవర్నో మోసం చెయ్యటానికి కాదు, నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి”
అన్నాడు. అతని భావం అర్థమైంది.
పార్వతమ్మ కాఫీ కప్పులతో వచ్చింది. ఒకటి నాకిచ్చి, యింకొకటి సాయికిచ్చింది. తనుకూడా తాగుతూ మధ్యలో అంది.
“తల్లి వంటలక్కని చెప్పుకోవడానికి యిన్నాళ్ళూ లేని నామార్దా యిప్పుడొచ్చిందటమ్మా వాడికి. ఇక్కడుంటే అందరూ తనని చిన్నచూపు చూస్తారని ఎక్కడికో వెళ్ళి గొప్పగా బ్రతకాలనుకుంటున్నాడు. ఎంత బతుకు బతికినా కాకి కాకే, హంస హంసే. హంసని చూసినట్టు కాకిని చూడరు. ఐనా… తండ్రిలేని పిల్లవాడిని యింతప్పట్నుంచీ సాకానంటే అది మీలాంటి నలుగురు తల్లుల చలవే కదమ్మా? మీకన్నా గొప్పవాళ్ళమా మేము?”
“నీకు తెలీదులేమ్మా!” అన్నాడు సాయి విసుగ్గా,
“సాయి చెప్పినట్లే చెయ్యి  పార్వతమ్మా!  చదువుకున్నవాడు. అతడికి మంచీ చెడూ తెలీదా? నీకుకూడా మార్పుగా వుంటుంది
మిమ్మల్ని చిన్నచూపు చూసేచోట ఎందుకుండటం?” అని పార్వతమ్మకే నచ్చజెప్పాను.
రాజా వచ్చాడు. విషయమంతా తెలుసుకుని, తనూ సాయినే బలపరిచాడు. “సంఘంలో హోదా, పలుకుబడి పెరగాలని ప్రతివాళ్ళూ అనుకుంటారు. అలా పెంచుకోవటానికి మనకున్నన్ని అవకాశాలు కష్టపడి పైకొచ్చిన వాళ్ళకి వుండవు. మన గతాన్ని ఎంతగా పట్టించుకోరో అంతగా వాళ్ళ గతాన్ని వదిలిపెట్టరు. అబ్రహాం లింకన్ అనగానే
కట్టెలు కొట్టే అబ్బాయిగానూ, లాల్ బహదూర్ శాస్త్రి అనడంతోటే వీధిదీపాల దగ్గిర చదువుకున్న అబ్బాయిగానూ మాత్రమే మొదట మనకి గుర్తొస్తారు. . ఆ తర్వాతే వాళ్ళు ప్రెసిడెంటు, ప్రధాని…. అలాంటి గుర్తింపుని ఎవరూ కోరుకోరు. సాయి నిర్ణయం కరెక్టు. వాడి చిన్నతనం, చదువూ ఎలా గడిచాయో పనిగట్టుకుని ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు” అన్నాడు.

అక్కడితో పార్వతమ్మ బెంగుళూరు ప్రయాణం స్థిరపడింది.

తను చాలా సంతోషంగా వున్నట్టూ, సాయి చాలా బాగా చూసుకుంటున్నట్టూ పార్వతమ్మ తరుచు ఫోన్ చేసి చెప్పేది.  వారాంతాల్లో బెంగుళూరంతా తిప్పి చూపించాడట. మైసూరుకూడా తీసుకెళ్ళాడట, చాముండి హిల్స్, బృందావన్ గార్డెన్స్  చూసామని చెప్పింది.
“హైదరాబాద్ వదిలి వెళ్ళటమంటే అప్పట్లో నాకు  ఎలాగో అనిపించినా అలా వదిలిపెట్టి రావడం చాలా తెలివైన పని అని యిప్పుడు అర్థమౌతోంది.సాయికి ఉద్యోగం వచ్చిందని తెలీక యింకా నన్ను వంటలకి పిలుస్తూనే వుండేవాళ్ళు. కాదని తిరస్కరించలేని మొహమాటాలూ కొన్ని వుండేవేమో! ఇంక నేనా జీవితంలోంచీ బైటికి రాలేనంతగా కూరుకుపోయి వుండేదాన్ని. ఇక్కడిలా స్వేచ్ఛగా  తిరిగే  వుండేది కాదు. వాడు… సాయి ఎంత చలాకీగా హుషారుగా వున్నాడనుకుంటున్నారు…..” అంది.
తర్వాత కొద్ది రోజులకే మరో ఫోను. సాయి ఎవర్నో  ప్రేమించాడట. పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాడట.
“ఇలాంటి వ్యవహారాలు నాకు చేతకావు. మీరూ, రాజారావుగారూ ఒకసారి వీలుచేసుకుని వచ్చి అన్నీ మాట్లాడితే సాయి ఓ  ఇంటివాడౌతాడు” అనే అభ్యర్థన.
రాజాకి కూడా బెంగుళూర్లో ఏదో పని వుండటంతో వెంటనే ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నాము. ఇంతలోనే మళ్ళీ వార్త- సంబంధం తప్పిపోయిందని.
“ఏం జరిగింది? సాయికేం తక్కువని వాళ్ళు కాదన్నారు?” ఆతృతగా అడిగాను.
“వాడు తన గతాన్ని దాచి ఎవర్నీ మోసగించాలనుకోలేదమ్మా! అవసరం లేనిచోట చెప్పుకోవడం ఎందుకనుకున్నాడు. ఆ అమ్మాయీ వీడూ ఒకేచోట ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది పరిచయం. మనసులు కలిసాయి. పెళ్ళి చేసుకుందామనుకున్నారు. జీవితాంతం కలిసి వుండబోయేదాని దగ్గిర దాపరికమెందుకని వీడు అంతా చెప్పాడు. ఆ పిల్ల పెద్దవాళ్ళు, ఆక్షేపించి తిరిగి పోయేరు” అంటూ ఏడ్చేసిందామె.
రాజా ఫోనందుకుని అక్కడికక్కడే సాయిని దులిపేసాడు.
“పనిగట్టుకుని ఆ విషయం చెప్పడం దేనికిరా? తెలిసేది ఎలాగా తెలుస్తుంది. పెళ్ళయాక తెలుస్తుంది. తెలిసాక కాపురం వదులుకుని
పోదు కదా? నాలుగు రోజులు గునిసినా ఆ తర్వాత సర్దుకుపోయేది. ఐనా అంతా గతం. అదంత తప్పు పనీకాదు. ప్రతివాళ్ళకీ విన్నవించుకోవటానికి. అర్థాంతరంగా భర్తపోయి బంధువులంతా వదిలేస్తే నిస్సహాయురాలైన ఒక స్త్రీ ఏం చేయగలదో అదే మీ అమ్మా చేసింది”
అన్న రాజా మాటల్ని సాయి తూచా తప్పకుండా పాటించాడు.
మేం వెళ్ళి మాట్లాడి కుదర్చాల్సిన అవసరం లేకుండానే సాయి పెళ్ళి కుదిరిపోయింది. అతడి చదువూ, వుద్యోగం, జీతం చూసి ఆడపెళ్ళివాళ్ళే ఆతృతపడిపోయారు. పిల్ల పేరు సుమలత. ఫొటో
పంపించింది పార్వతమ్మ. చక్కగా వుంది. బీటెక్ పాసైందట తనుకూడా. తండ్రి బెంగుళూర్లోనే పిడబ్ల్యుడీలో క్లర్కు ముగ్గురాడపిల్లల్లో యీమే ఆఖరు. పెళ్ళికి వెళ్ళాము. రెండువైపులా సుమలత తండ్రి నిభాయించుకుని వచ్చాడు. కట్నకానుకలు ఆశించని, బాధ్యతలూ, బాదరబందీలూ లేని సంబంధం కూతురికి దొరికినందుకు ఆయనెంత సంతోషపడిపోయాడో! సాయివైపు నుంచీ బంధువులం మేమే.
పెళ్ళితర్వాత మేం  మళ్ళీ  బెంగుళూరు వెళ్ళలేదుగానీ వాళ్ళ విషయాలు ఫోన్లోనో పోస్టుద్వారానో తెలుస్తునే వున్నాయి. సాయికి
యిప్పుడు యిద్దరు పిల్లలు. వాళ్ళ ఫొటోలు పంపించింది పార్వతమ్మ.
సుమలత కూడా యిప్పుడు ఉద్యోగం చేస్తోంది. ఒకప్పుడు నెలకి నాలుగైదువేల ఆదాయంతో హైద్రాబాదులాంటి వూళ్ళో గడిపిన ఆ కుటుంబ ఆదాయం యిప్పుడు అరలక్షని దాటి లక్షని దాటింది . చాలా సంతృప్తికరమైన విషయం.
ఉన్నట్టుండి వాళ్ళ దగ్గిర్నుంచీ ఫోన్లూ, ఉత్తరాలూ ఆగిపోయాయి. కొత్త జీవితపు ఉద్వేగాలు బలహీనపడ్డాయనుకున్నాను.

అంతకు మించి నా ఆలోచనలు సాగలేదు.

హఠాత్తుగా మా యింటి కొచ్చింది పార్వతమ్మ. హైద్రాబాద్ లోనే వుంటోందట.
“ఏమిటోనమ్మా! ఎవర్నీ కలవాలనిపించలేదు. బాబాగారి ఆశ్రమంలో ఆర్నెల్లున్నాను.  తిని కూర్చోవటం, భజన్లు చెయ్యటం విసుగనిపించింది. ఇవతలికొచ్చేసి  రెండు గదులపోర్షన్ అద్దెకి  తీసుకుని వండుకు తింటున్నాను”  అంది. కళ్ళలోకన్నీటి మేఘాలు… కదిలిస్తే కడివెడు దుఃఖం. ఏదో జరిగిందని అర్థమైంది. లేకపోతే వంటరిగా  యిక్కడుండాల్సిన అవసరమేమిటి ఆమెకి?
“అంతా బావున్నారా పార్వతమ్మా? అసలు బెంగుళూరునుంచీ  ఎప్పుడొచ్చావు? ఎందుకొచ్చావు? ఏం జరిగింది?” అడిగాను.
జవాబు చెప్పకుండా చాలాసేపు ఏడ్చింది. “కడుపులో దాచుకున్న యీ దుఃఖం నన్ను తినేస్తోందమ్మా! ఎవరికి చెప్పినా ఆక్షేపించేవాళ్ళేగానీ  ఆదరించేవాళ్ళెవరు? కనీసం మీలా చల్లగా  మాట్లాడేవాళ్ళు మాత్రం ఎవరున్నారని?” అంటూ అన్ని విషయాలూ చెప్పుకొచ్చింది.
సాయికి ఉద్యోగం వచ్చి, అతని పెళ్ళైన నాలుగైదేళ్ళదాకా అంతా బాగానే జరిగిందట. పార్వతమ్మ రకరకాల వంటలు చేసి పెడుంటే సుమలత సంతోషంగానే తిందట. పిల్లల్ని నాయనమ్మమీద వదిలి పెట్టి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్ళేవారట. పనివాళ్ళమీదనో, క్రెష్ లోనో వదిలి పెట్టి ఆందోళన చెందే అవసరం లేకుండా నాయనమ్మ దగ్గిరే పిల్లలు పెరుగుతున్నారని ఆ అమ్మాయి సంతోషపడేదట.
“స్వంత తల్లిని చూసుకున్నట్టు చూసుకునేదమ్మా, నన్ను. ఇంతలో
దూరపు బంధువొకాయన పనుండి మా యింటి కొచ్చాడు. ఆయన
యిక్కడివాడు. నేను తెలుసు. ఎలాగ తెలియకూడదో అలాగ తెలుసు. రెండు రోజులుండాలని వచ్చిన వాడు పని చూసుకుని వెళ్ళిపోక-
మీ నాన్న ముందు వెనుకలు చూసుకోకుండా యిలాంటి
సంబంధం ఎలా చేసాడమ్మా? ఆవిడ వంటలు చేస్తూ బతికేది.నలుగుర్లో యీ విషయం తెలిస్తే ఎంత నామార్దా? నాకై నేను ఎవరితోటీ
అననుగానీ ముందా ముసలామెని ఇంట్లోంచి పంపెయ్యి. నేను సరే.
ఇంకెవరైనా ఐతే?  అందరికీ తెలిసిపోతుంది – అన్నాడు. ఇంకేముంది? గొడవలు మొదలు” అంది పార్వతమ్మ.
కష్టపడి పైకొచ్చినవాళ్ళని చూస్తే ఎందుకింత చులకన అనిపించింది నాకు. సుమలత తండ్రి క్లర్కు. వెనక ఆస్తిపాస్తులేమీ లేవని తనే చెప్పుకున్నాడు. ఐనా బెంగుళూరు సిటీ పొలిమేరల్లో  ఫ్లాటుంది. ముగ్గురు కూతుళ్ళనీ బాగా చదివించి మంచిమంచి
సంబంధాలు చేసాడు. ఇదంతా ఆయన జీతం వల్లనే సాధ్యపడిందా?  కానేకాదు అక్రమంగా ఎంతో కొంత సంపాదిస్తేనే సాధ్యపడింది. మరి ఆయనకన్నా పార్వతమ్మ ఎందులో తక్కువ?
“అప్పటిదాకా కనిపించని చెడ్డతనాలన్నీ నాలో కనిపించాయి ఆమెకి. వంటవాళ్ళకీ పనివాళ్ళకీ నీతీ నిజాయితీ వుండదంది. దొంగతిళ్ళు తింటారంది. లేకీవాళ్ళంది. ఒక మాటకాదు. ఒక తిట్టు కాదు.
ఇంటిముందు యాచనకొచ్చి నిలబడ్డ మనిషినికూడా అననన్ని మాటలు నా ఇంట్లో నేను పడ్డాను. నేను యింట్లో వుండకూడదు.  వెళ్ళిపోవాలి. అదా అమ్మాయి అభిప్రాయం. పంపించెయ్యమని సాయికి చెప్పింది. వాడు వినకపోయేసరికి తన తల్లిదండ్రుల్ని పిలిపించింది. పెద్ద రభస”
“…”
“ ఇంక నా వియ్యంకుడు-
ఆయన పెద్దకూతుళ్ళిద్దరినీ మంచి కుటుంబాలలో యిచ్చాడట. నేనిలాగని తెలిసాక ఆ వియ్యాలవారితో సమానంగా గౌరవిస్తే ఆ కూతుళ్ళ యిళ్ళలో గొడవలైపోతాయట. నా కొడుకుతో మాట్లాడి ఎక్కడేనా గౌరవంగ బతికే ఏర్పాటు చేయిస్తాను- అన్నాడు”
“…”
“ నా తల్లికి నేనేం చెయ్యాలో ఒకళ్ళు నాకేంటి చెప్పేదని సాయి అన్నాడు.
నాకే అసహ్యం వేసింది. అలా వాళ్ళతో దెబ్బలాడుతూ నాకు గౌరవంలేనిచోట ఎందుకు వుండాలనిపించి, వచ్చేసాను. సాయి ఎంతో బాధపడ్డాడు. వెళ్ళద్దని బ్రతిమాలాడు. సుమలతని వదిలి పెట్టేస్తానన్నాడు.ఇటు చూస్తే ముక్కుపచ్చలారని పసివాళ్ళని తల్లికో తండ్రికో దూరం చేసిన పాపం…. అమ్మా! ఏజన్మలో చేసుకున్న కర్మకో యీ జన్మలో
అనుభవించాను.అనుభవిస్తున్నాను. వచ్చే జన్మకి కూడా మోసుకెళ్ళనా?
వద్దమ్మా… వద్దు వాడికి నచ్చజెప్పి వచ్చేసాను” అంది తనే మళ్ళీ.
“వాళ్ళకి బుద్దెలా వస్తుంది. పార్వతమ్మా? తాము చేసిందే  రైటనుకుని విర్రవీగుతారు” అన్నాను.
“వాళ్ళకి బాగానే బుద్ధి చెప్పాడమ్మా సాయి. లంచాలు తిని  మిమ్మల్ని యీ స్థాయికి తీసుకొచ్చిన మీ నాన్న మా అమ్మకన్నా  పరమనీచుడు – అని ఆయన మొహంమీదే చెప్పి, సుమలతని పుట్టింటికి  వెళ్ళద్దనీ వాళ్ళని తనింటికి రావద్దనీ ఆంక్ష పెట్టాడు. అందుకు  వ్యతిరేకంగా జరిగితే ఆయన మీద విజిలెన్స్ కంప్లెయింటిస్తానని  బెదిరించాడు” అని చెప్పి, అంతా చెప్పేసాక మనసులోని ఉద్వేగం  కొంత చల్లబడినట్టై “ఇటు నన్నూ అటు వాళ్ళవాళ్ళనీ దూరం చేసుకుని
భార్యాభర్తలిద్దరే బతుకుతున్నారు” అంది తాత్త్వికంగా.
పార్వతమ్మ మా యింట్లో రెండు రోజులుంది. ఆ రెండురోజులూ తానే వండింది. నన్ను వంటింట్లోకి రానివ్వలేదు. ఈ తక్కువతనమేనా సుమలతకి అభ్యంతరంగా అనిపించింది?
నా మనసంతా కలచివేసినట్లైంది. కొత్త జీవితాన్ని కోరుకుని బెంగుళూరెళ్ళి సాయి పొరపాటు చేసాడనిపించింది.
“ఇక్కడే వుంటే పార్వతమ్మని తెలిసిన వారే ఎవరో పిల్లనిచ్చేవారు. ఈ సమస్య యింత జటిలంగా మారేదికాదు” అన్నాను రాజాతో
“ సాయిని తప్పుపట్టడానికి లేదు. కిందపడ్డ మనిషివాడు.తండ్రి పోవటంతో ఆధారం పోగొట్టకుని  తన స్థాయినుంచి తోసివెయ్యబడ్డాడు. పడ్డవాడెప్పుడూ లేచి మళ్ళీ
నిలబడటానికే ప్రయత్నిస్తాడుగానీ పడ్డచోటే సర్దుకుని కూర్చోవాలనుకోడు. బంధువులంతా వదిలేస్తే మరో మార్గంలేక పార్వతమ్మ వంటలు చేసిందిగానీ అది వాళ్ళ వృత్తికాదు. అందుకే సాయి ఆస్థాయి జీవితంలో ఆ మనుషులమధ్య
యిమడలేకపోయాడు. దాన్ని వదిలి పెట్టాలని ప్రయత్నించాడు” అన్నాడు.
“ఔను. సాయిదీ తప్పులేదు. సుమలతది తప్పసలేకాదు. వాడిని చదివించి యింతవాడిని చేసిందే, పార్వతమ్మదే తప్పు. ఈరోజుకి నిలవనీడ లేకుండా అయింది” అన్నాను నిరసనగా.
రాజా చిన్నగా నవ్వాడు “జీవితమంటే మానవసంబంధాలే
కాదు, ఆర్థిక సంబంధాలు కూడా. వాస్తవ దృక్పథం అనే పెర్స్పెక్టివ్
ఏంగిల్ కి యీ రెండూ భుజాలు. ఆ కోణాన్ని విశ్లేషించి చూస్తే సమస్యలోతు తెలుస్తుంది. కష్టపడ్డది పార్వతమ్మ. పైకొచ్చింది సాయి.
అంటే శ్రమనుంచీ విజయం వేరు చెయ్యబడింది. అదే ఒక అంబానీగానీ మరో బిల్‌గేట్స్ గానీ తమ శ్రమ నుంచీ తామే విజయం పొందారు. విజేతలయ్యారు. విజేతల దర్బారులో శ్రామికులకి సమమైన స్థానం వుండదు” అన్నాడు.
కాదనలేని నిజమిది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s