హలో మనోరమా! by S Sridevi

( ఆంధ్రప్రభ, 13 మార్చి 1996, గూడు కథలసంపుటి)
“హలో మనోరమా! నిన్నెవరేనా ప్రేమిస్తున్నానంటే నువ్వేం సమాధానం చెప్తావ్?”

సమయం: తొమ్మిదీ పది.
ప్రదేశం : బృందావన్ గార్డెన్స్
పౌర్ణమినాటి రాత్రి.
తోటి ట్రెయినీలతో కలిసి బయటికి వచ్చింది మనోరమ. ఆరోజు టైనింగ్ ఆఖరురోజు. పక్కరోజు వెలిడిక్షన్. ఆ తర్వాత రెండు రోజుల జాయినింగ్ టైమ్. ఎక్కడి వాళ్లక్కడికి వెళ్లిపోతారు. ఆంధ్రా, కర్ణాటక, కేరళ- మూడు రాష్టాలవాళ్లున్నారు తమ బేచిలో. మళ్లీ కలుసుకునే ముచ్చటలేదు. ఎవరిదారి వారిది.ఆ తర్వాత ఉద్యోగస్టులు తాము. బాధ్యతల్లేని కాలేజీ జీవితానికీ బాధ్యతాయుతమైన ఉద్యోగపర్వానికీ మధ్య వంతెనలాంటి ట్రైనింగ్.. కలిసున్న కొద్ది రోజులూ పంచుకున్న అనుభూతులు పదిలపరుచుకోవడానికి చిన్న అవుటింగ్….
రాహుల్ “హమ్ బనే తుమ్ బనే” పాడుతున్నాడు. అతని చూపులో తన చూపులు కలవకుండా జాగ్రత్తపడింది మనోరమ. కానీ పాట వింటుంటే ఏదో గుండెల్లో గుబులు మొదలైంది.
“ఐ లవ్యూ… ఐ లవ్యూ….” గుండె గూట్లో కువకువలాడుతున్నటు అతని గొంతు. తల విదిల్చింది.
సరిగ్గా అప్పుడే వాన చినుకొకటి టప్పుమని ఆకాశంలోంచి జారి మనోరమ చెక్కిలి మీద పడి నిలవలేక జారిపోయింది. అంతే! క్షణాల మీద వాతావరణం మారిపోయింది. ఆ కోపంతో కొన్ని వందల, వేల వాన చినుకులు దాడి చేశాయి. ట్రైనీలంతా కంగారుగా లాన్స్ లోంచి లేచారు.
“ప్లీజ్, వినండి. అందరూ తలవైపుకీ పరిగెత్తకండి. ఒక్కచోటే ఉంటే తిరిగి వెళ్లేటప్పుడు వెతుక్కోనక్కర్లేదు. అదుగో ఆ చెట్టుకింద నిలబడదాం.” కేర్‌టేకర్ ప్రకాశ్ నోట్లోంచి మాటలింకా పూర్తిగా రానేలేదు. అందరూ పొలోమని పరిగెత్తారు.
కరెంటు పోయింది. కరువులో అధిక మాసం! జనం అస్తవ్యస్తంగా తిరగడం తెలుస్తోంది.
తనొక్కర్తే ఇక్కడ మిగిలిపోయిందా? ఆ విషయం మిగతావాళ్లు గుర్తించారా? ఎలా వాళ్లని చేరుకోవడం? కరెంటు ఎప్పుడొస్తుంది?
పూర్తిగా తడిసి ముద్దయిపోయిందామె. కప్పుకున్న శాలువా చలిని ఏమాత్రం ఆపడంలేదు. పైగా పరవళ్ళు తొక్కుతున్న కావేరి మీంచి వడివడిగా వీస్తూ చలిగాలులు. గడ్డిపోచలా వణికిపోతోంది. భయంలేదని ధైర్యం చెప్తున్నట్లు ఎవరిదో చెయ్యి ఆమె భుజాల చుట్టూ చుట్టుకుంది. కెవ్వుమని అరిచింది ఇలాంటివి కూడా ఉంటాయా? దూరం జరగబోయింది. వదిలేసి చెయ్యి మాత్రం పట్టుకున్నాడు.
“భయంలేదు. నేను రాహుల్” మెత్తగా అతని స్వరం. విడిపించుకుని దూరం జరిగి కొనకంట చూసింది. తనకి అత్యంత సమీపంలో అతని కళ్లు వుద్విగ్నతతో మెరవడం అంత చీకట్లోనూ గమనించింది. అతను కూడా సన్నగా వొణుకుతున్నాడు. అయితే చలికి కాదు.
“ఐ లవ్యూ. ఐ లవ్యూ” లోలోపల గుసగుసలు. అతను నోటితో చెప్పక్కర్లేదు. అలా అంటున్నట్టు తెలిసి పోతూనే ఉంది. ఇద్దరి హృదయాలూ ఒక శృతికి ట్యూనౌతున్నాయా? ఇదేనా ప్రేమంటే?
ఇదేనా…ప్రే…..మం….టే?! వాడివాడి వయసు, వేడి వేడి వొళ్లు, మత్తెక్కించే వాతావరణం ఉంటే చాలా ప్రేమ పుట్టడానికి? చాలా అనీజీగా అనిపించింది. అంతకన్నా వుదాత్తమైన ప్రేమ వుండదా?
“పద. వాళ్లంతా ఆ చెట్టు కిందున్నారు” అన్నాడు. అతనలా అనటమూ, కరెంటు రావడమూ ఒకేసారి జరిగాయి ప్రకాశ్ వీళ్లదగ్గరికి వచ్చాడు.
“మీరొక్కరూ ఎలా ఉండిపోయారు? తీసుకురమ్మని రాహుల్ని పంపించాను. భయపడ్డారా?” అభిమానంగా అడిగారు. మనోరమ నవ్వి ఊరుకుంది. తనెంత భయపడిందో ఇప్పుడు తల్చుకుంటే తనకే నవ్వొచ్చింది.
వాన తెరిపినిచ్చింది. అందరూ కలిసి తిరుగుముఖం పట్టారు. దారిలో టీ తాగారు. టీ తాగాక కాస్త చురుకుపుట్టింది. రాహుల్ మధ్యలో దిగిపోయాడు.
వేన్ దిగి నేరుగా మెస్ కెళ్లి భోజనం చేసేసరికి పదిన్నరైంది. మనోరమ ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ కేసి నడుస్తోంది.
“రాహుల్ ఎందుకే మధ్యలో దిగిపోయాడు?” ఒకమ్మాయి అడిగింది.
“ఈవేళ చాలా మూడీగా ఉన్నాడు.”
“చాలా స్మార్ట్ “
“పాటలు బాగా పాడతాడు”
“సరదాగా వుంటాడు”
వాళ్ళలా మాట్లాడుతుంటే మనోరమకి అహనంగా అనిపించింది. ఆ మాటల్లో పాలుపంచుకోలేకపోతోంది. ట్రెయినీస్ లో అతని పట్ల ఒక క్రేజ్ వుంది. అతనికి చాలా విషయాలు తెలుసు. ఎప్పుడూ పాడుతూ నవ్విస్తూ తిరుగుతాడు. అలాంటి అతనిలోని ఈ ప్లస్ పాయింట్స్ మనోరమకి కనిపించడం లేదు. పరిచయమైన మూడోరోజునే ఐ లవ్యూ అనటం గుర్తొస్తోంది. ఇందాకా తనని పట్టుకోవడం గుర్తిస్తోంది. చాలా చికాగ్గా అనిపించింది.
రూమ్ దాకా వచ్చాక వంగుని తాళం తీస్తుంటే అటెండరొచ్చి చెప్పాడు.
“మేడమ్! మీకు ఫోను.”
తనకి అనుకోలేదు మనోరమ. తలెత్తలేదు.
“మనోరమా మేడం! మీకు ఫోను” అటెండర్ మళ్లీ చెప్పాడు.
అప్పుడామెకి ఆశ్చర్యం వేసింది. ఇంత రాత్రి వేళ తనకెవరు ఫోన్ చేస్తారు? అదీ ఈ పరాయి ఊళ్ళో? మర్నాడు ప్రయాణానికి టికెట్ రిజర్వేషన్ కన్ఫర్మెందో, లేదో తెలుసుకోవటానికి తండ్రిగానీ ఫోన్ చేశాడేమో అనుమానం వచ్చి-
“ట్రంకాలా?” అడిగింది.
“కాదమ్మా! లోకలే!”
“అయితే నాకు కాదు.” స్పష్టంగా చెప్పి తాళం తీసింది.
“మీకెనమ్మా! మీ పేరు కూడా చెప్పారు.”
ఇప్పుడిక వెళ్లక తప్పలేదామెకి.
“హలో!”
“హలో, నేను రాహుల్ ని ఫర్ హెవెన్స్ సేక్ ఫోన్ పెట్టెయ్యకు”
ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయానికొచ్చినట్టు స్థిరంగా అంది. “చెప్పు”
“ఐ లవ్యూ. అయాం నాట్ జోకింగ్.”
మనోరమలో కోపం కట్టలు తెంచుకుంది.
“పరిచయమైన మూడో రోజునే ఆ మాటనే అబ్బాయంటే నాకు అసహ్యమని ఆ రోజునే చెప్పాను. చెప్పు. ఏం చూసి నన్ను ప్రేమించావు? ఒంటి తెలుపూ, నునుపూ చూశా?” పదునుగా అడిగింది.
“నీకంటే ఆ కొంకిణి అమ్మాయి షాలినీ బావుంటుంది. అబ్బాయిలందరం ఆమెకే ఓటు వేశాం.”
మనోరమ దారుణంగా దెబ్బతింది. అతని మాట అక్షరాలా నిజం. అయిదూ నాలుగు హైట్ తో నప్పినట్టుండే కట్టూబొట్టూతో శాలిని పాలరాతి శిల్పంగా ఉంటుంది. అమ్మాయిలే ఆమె వెళ్తుంటే ఆగి చూడకుండా ఉండలేరు.
“చెప్పు. మరైతే నాలో ఏం చూసి ప్రేమించావు? నా గురించి నీకేం తెలుసు? అసలు మనిద్దరికీ ఎలా కుదుర్తుంది? నువ్వు కేరళ క్రిష్టియనివి, నేను ఆంధ్రా బ్రాహ్మిన్ని. సాంప్రదాయాల్లో ఎన్ని తేడాలు?”
“సో వాట్? నీ కోసం నేను ఎన్వీ మానేస్తాను. అంతగా కావాలనిపిస్తే బైటెక్కడో తింటాను.మా పేరెంట్సిద్దరూ ఎంప్లాయీస్. మన దగ్గరుండి నువ్వే సంప్రదాయాలు పాటిస్తున్నావో చూసేంత తీరికా, ఓపికా వాళ్ళకి లేవు. మనకి పిల్లలు….”
మనోరమ ముఖం ఎర్రబడింది. “సాపిట్ ఐ సే … వర్తమానంలో మన ప్రేమ సాధ్యంకాదని నేను చెప్తుంటే నువ్వు ఎక్కడికో వెళ్లిపోతున్నావు?”
“బికాజ్… ఐ లవ్ యూ!” –
“బట్ ఐ డోస్ట్ లవ్ యూ!” –
“కావచ్చు .. ఒక్క రెండు నిముషాలు మనసు పెట్టి నా మాటలు విను. జవాబు ఏమైనా మారుతుందేమో చూడు”
“అయాం సారీ అని చెప్పానుగా.”
“నన్ను ప్రేమించమనట్లేదు. నా మాటలు వినమంటున్నాను.”
“సారీ! నాకు నిద్రోస్తోంది”
“ప్రేమ పుట్టడానికి ఎంతో కాలం పట్టదు. దాన్ని వ్యక్తపరచడానికి వ్యవధి కావాలి, మొదటిసారి నిన్ను క్లాస్ రూమ్ లో చూసినప్పుడే నాలో చిన్న జెర్క్”
“నేను పెట్టేస్తున్నాను.”
“ మనోరమా! నాకు రెండంటే రెండు నిముషాలు టైము కావాలి. ఆ తర్వాత నీ ఇష్టం.డబుల్ ప్లీజ్.”
“….” చాలా అనాసక్తిగా, అతను చెప్పడం ముగిస్తే ఫోను పెట్టేద్దామని నిల్చుంది. నిజానికతను చెప్పేది వినాలనేం లేదు, మొండిగా పెట్టేసి వెళ్లిపోవచ్చు. అలా చేస్తే అతనికి తనకీ ఉన్న తేడా ఏమిటి? అతనెంత చెప్పినా తన నిర్ణయం మారదు. వినకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తునే వుంటాడు.
“చెప్పానుగదూ, ఆ రోజు క్లాసురూమ్ లో మొదటి పరిచయమప్పుడే నేను జోల్టయాను. ఆ రోజంతా నా దృష్టి నీ మీదే ఉంది. రాత్రంతా నీ ఆలోచనలే! ఒక వ్యక్తి గురించి అందునా ఒక ఆడపిల్ల గురించి ఇంతగా ఆలోచించడం అదే మొదటిసారి. రెండో రోజూ అలాగే జరిగింది. పగలూ రాత్రి నీ ధ్యాసే. మూడో నాటికి నా మీద నేను కంప్లీట్‌గా కమేండు పోగొట్టుకున్నాను. అప్పుడే నీతో అన్నాను ఐ లవ్యూ అని.”
మనోరమ వాచీ చూసుకుంది.
“మరో సందర్భంలోనైతే నేనలా తొందరపడేవాణ్ని కాదు. నీతో పరిచయం పెంచుకుని స్నేహంగా మార్చుకుని అప్పుడు నా ప్రేమని చెప్పేవాడిని. ఇప్పుడు వేరు. మనం కలిసుండేది అతికొద్ది సమయం. ట్రైనింగయాక మనం కలుస్తామనేది లేదు. నేను సైలెంటుగా ఉండిపోతే యనువ్వు నా గురించి ఆలోచించవు. మీ ఊరికి ఉత్తరం రాయచ్చు. దానికి నువ్వెలా రెస్పాండౌతావో? మొదటి ఉత్తరాన్నే ప్రేమలేఖలా రాస్తే నెగెటివ్ ఎఫెక్టు రావచ్చు. మామూలు వుత్తరానికి నువ్వు జవాబివ్వకపోవచ్చు. ఆ ఉత్తరం వెనకాలున్న నా తపన నీకెలా తెలుస్తుంది? నేను ప్రేమని వ్యక్తపరిచేలోపు నీకు మీ వాళ్లు సంబంధాలు చూడచ్చు. తెల్లకాగితంలాంటి నీ మనసు మీద మరో వ్యక్తి ముద్ర పడచ్చు. అందుకే నా ప్రేమని రిస్కులో పెట్టాలనుకోలేదు.
“……”
తను చాలా శ్రద్ధగా అతను చెప్తున్నది వింటోందని మనోరమ గ్రహించనేలేదు.
“నువ్విప్పటికే ఎవర్నీ ప్రేమించకపోతే కాస్త నా గురించి ఆలోచించు మనోరమా!” అతని అభ్యర్ధనతో ఆమె ఈ లోకంలోకొచ్చింది.
“అయాం సారీ!” రిసీవరు పెట్టేసింది.
రూమ్ కి తిరిగి వచ్చింది. అందరూ నిద్రలో వున్నారు. మంచంమీద ఒరిగిందిగానీ నిద్రరాలేదు.
“ఐ లవ్యూ… ఐలవ్యూ….”
“ఆ కొంకిణి అమ్మాయి నీకన్నా బావుంటుంది. అయినా నేను నిన్నే ప్రేమించాను.”
రాహుల్ మాటలు పదేపదే గుర్తొస్తున్నాయి. చాలా దు:ఖం వచ్చిందామెకి. అలా మాట్లాడకుండా పురుషుడు స్త్రీకి దగ్గరవలేడా? ఆడపిల్లని ఆకట్టుకోవడానికి అతను పన్నే వ్యూహమా అది?
ఎవరీ రాహుల్? ఎందుకు తన వెంట పడుతున్నాడు? తల్లిదండ్రులెవరు? వాళ్ల జీవన శైలి ఎలాంటిది?నిన్నటిదాకా ఇతనెలా గడిపాడు? ఇవేవీ తెలీకుండా అతన్ని తనెలా ప్రేమించగలదు? అసలు ప్రేమంటే ఏమిటి? ఎంత గొప్ప ప్రేమకైనా ఆఖరి అంకం ఏమిటి? ఇంత ప్రేమించానంటున్న రాహుల్ని పెళ్ళి చేసుకున్నా తనతనితో చేసేది సంసారమే. కనేది కళ్లూ ముక్కూ చెవులు ఉండే పిల్లల్నే. మళ్లీ వాళ్లని పెంచి పెద్ద చెయ్యడం. మరే ప్రత్యేకతా ఉండదు. అందుకు తను తన వాళ్ళనెదిరించాలి. అతను అతనివాళ్లనెదరించాలి. అందరికీ దూరంగా గడపాలి. అలా చేసుకున్న పెళ్లి సక్సెసౌతుందా? అయితే పర్వాలేదు కాకపోతే?
ఆలోచనలు ఆ దార్లో బాగా ముందుకి సాగాక అప్పుడు తెలివొచ్చిందామెకి. తనసలు రాహుల్ని ఎందుకు ప్రేమించాలి? ఎవర్నేనా ఎందుకు ప్రేమించాలి? పెళ్ళిని లాటరీ చేసుకుని బతుకుని రిస్కులో ఎందుకు పెట్టుకోవాలి?
అంత సొగసైన పౌర్ణమి రాత్రి ప్రేమ ఊపులో ఉయ్యాలలూగకుండా జీవితం కాచి వడబోసిన అనుభవజ్ఞురాలిలా తనకి ఆతిథ్యమివ్వబడిన ప్రేమలోని సంభవాసంభవాల గురించి ఆలోచిస్తుంటే అప్పుడొచ్చిందామె పెదాల మీదికి ఆవులింత. నిద్రలోకి జారుకుంది.
కానీ…..
ఆమెకి తెలీదు, ప్రేమ ఉప్పెనలాంటిదని, అది ఎగిసిపడితే ఏ వ్యక్తిత్వాన్నైనా తనలోకి లాక్కుంటుందని. ఇప్పుడైతే తను తీరాన్న వుండి ఆలోచిస్తోందిగానీ తన కాళ్ల కింద ఇసుకకూడా కదుల్తోందని.
….
వెలిడిక్టరీ ఫంక్షనైపోయింది. పదిన్నరకల్లా సర్టిఫికెట్లు యిచ్చేసారు.చాలామంది ట్రైనీలు వెంటనే వెళ్ళిపోయారు. మనోరమ గది అంతా ఖాళీ అయింది.
ఆమె మాత్రం హైదరాబాద్ కి డైరెక్ట్ బస్సు ఉంటే దానికి టిక్కెట్ బుక్ చేసుకుంది. అక్కడనుంచి వరంగల్ వెళ్లాలి. మైసూర్ నుంచి హైదరాబాద్ డైరెక్ట్ ట్రెయిన్ లేదు. బెంగుళూరులో మారాలి. లగేజితో ఒక్కదానికీ కష్టం అవుతుందని బస్సు ప్రయాణాన్ని ఎంచుకుంది. బస్సు సాయంత్రం ఆరింటికి. కారిడార్‌లో ఛెయిర్ వేసుకొని వచ్చిపోయేవాళ్ళను చూస్తూ కూర్చుంది. ఆరెప్పటికికాను?

అదే సమయానికి రాహుల్ తన ఆఖరి ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు మనోరమ వెళ్ళిపోయిందంటే మళ్ళీ తనకి కలవదు. తనామె స్మృతిపథంలో ఎక్కడికో వెనక్కి పడిపోతాడు. ఎప్పుడైనా గుర్తొచ్చినా ఒక టీజింగ్ రోమియోగా గుర్తుంటాడే తప్ప ప్రేమికుడిగా కాదు. ఆ సంగతి పదేపదే గుర్తిస్తూ ఇబ్బందిని కలగజేస్తోందతనిలో.
మనోరమ ప్రయాణం చేయబోతున్న బస్సుకే తను హైదరాబాద్ టిక్కెట్ కొనుక్కొన్నాడు.
చాలా కాకతాళీయంగా ఇద్దరివీ పక్కపక్క సీట్లయ్యాయి. ఆ సంగతి బస్సెక్కాకగానీ అతనికి తెలియలేదు.
ఇంకో పది నిమిషాలకి బస్సు కదులుతుందనగా వచ్చింది మనోరమ. తన పక్క సీట్లో పేపర్లో తలదూర్చుకొని కూర్చున్న మగవ్యక్తిని చూడగానే చిరాకేసిందామెకి. టిక్కెట్టు రిజర్వు చేసుకొనేటప్పుడు విండో సీటు కావాలని అడిగిందేకానీ తన పక్కన ఎవరుంటారని ఆలోచించలేదు. తప్పదు ఇంక!
“ఒకసారి లేస్తారా? నా లగేజి సర్దుకున్నాక మళ్ళీ కూర్చుందురుగాని!” చికాకుణచుకుంటూ వీలైనంత పొలైటిగా అడిగింది.
అతను పేపర్లోంచి తలెత్తాడు. ఆమె తెల్లబోయింది.
“నువ్వా?!” ఇందాకటి చికాకు స్థానే మరో రకమైన ఇబ్బంది.
“నేను ఇక్కడ కూర్చోవటం నీకు ఇబ్బందయితే కండక్టరుతో చెప్పి సీటు మార్చుకుంటాను” లేచి నిలబడ్డాడు. ఇలా పక్కపక్క సీట్లు కావడం అతనికి లోపల్లోపల సంతోషాన్ని కలిగించిందనే చెప్పాలి.
కానీ ఆమె ఏమంటుందో?
మనోరమ ఒక క్షణం ఆలోచించింది. ఇతను కాకపోతే మరొకరొచ్చి ఆ సీట్లో కూర్చుంటారు. ఆడవాళ్ళెవరూ అంత దూరం వంటరిగా ప్రయాణం చెయ్యరు. వాళ్ల వాళ్లతో వచ్చినవాళ్ళు వాళ్ళను వదిలి పెట్టి ముక్కూమొహం తెలియని తన పక్కన వచ్చి కూర్చోరు. ఎవరో తెలియనివాళ్ళు వచ్చి కూర్చునే బదులు ఈ రాహులే కూర్చుంటే పోలే? అనుకుని, నవ్వు ముఖానికి పులుముకుంది.
“పర్వాలేదు” అంది.
“థాంక్సు” చెప్పి, ఆమెకి లగేజి సర్దుకోవడంలో సాయం చేశాడు. ఇద్దరూ సీటో సర్దుకు కూర్చున్నారు. అప్పుడన్నాడు నవ్వుతూ “కొత్త మిత్రుడూ పాత శత్రువూ కంపేరిజనా?”
“షటప్.” అంది మనోరమ.
“నువ్వెటు?” అనుమానంగా అతనికేసి చూస్తూ తనే మళ్లీ అడిగింది.
“హైదరాబాదు.”
“ఎందుకిలా నా వెంట పడున్నావు? నా జవాబేమిటో చెప్పేశాను.”
“వెంటపడుతున్నానని ఎందుకనుకుంటున్నావు? నాకు టూరిజంలో ఆసక్తి, హైదరాబాదు చూద్దామని బయల్దేరాను” అన్నాడు. అతను చెప్పినదాంట్లో సగం నిజం ఉంది. సగం అబద్దం ఉంది. అతనికి టూరిజంలో ఆసక్తి ఉన్న మాట నిజం. అందుకు హైదరాబాద్ వెళ్తున్నాననడం అబద్ధం .
ఇంకా మాట్లాడ్డం వృధా అనిపించింది మనోరమకి, కిటికీలోంచి బైటికి చూస్తూ కూర్చుంది. అతను మళ్ళీ పేపర్లో నిమగ్నమైపోయాడు.
బస్సు కదలబోతుంటే అడిగాడు “మంచినీళ్లున్నాయా?” అని. ఆమె తలూపింది. బస్సు కదిలింది. మాటలాగిపోయాయి. మాటలు పెంచాలనుంది రాహుల్ కి.
నిజానికి అతనికి తన పరిస్థితేమిటో అర్ధమవటం లేదు. ఆమె విదిలించి కొడుతున్నా తనకేమిటీ ఆరాటం? తను దీన్నే ప్రేమంటున్నాడు. ఆమె వెంటపడటమంటోంది. వన్ సైడ్ లవ్! ఇప్పుడీ ప్రయాణం ఎందుకు చేస్తున్నట్టు తను? ఏం సాధించాలని? ఆమె ఎలా చెప్పినా వినదు. తనకి మరో విధమైన చెడు భావన లేదని చెప్తేనేనా నమ్ముతుందా?
“రాహుల్! యూ ఆరేన్ ఇడియట్, లేకపోతే పరిచయమైన మూడో రోజున ప్రేమిస్తున్నానని చెప్పి ఆడపిల్ల మనసు విరిచెయ్యవు!”
“బెంగుళూరు చూశావా మనోరమా!” అడిగాడు యధాలాపంగా.
“ట్రెయినింగ్ కి వచ్చేటప్పుడు చూశాము.”
“ఎలా ఉంది?”
“చాలా బావుంది.”
“మైసూరు?”
“చాలా ప్లాన్డ్ సిటీ.”
“మహారాజా పేలస్?”
“చాలా పెద్దది”
అతనెంత పొలైట్ గా అడుగుతున్నాడో ఆమె అంత కర్ట్ గా జవాబిచ్చింది.
“కే ఆర్ ఎస్పీ?”
అతని ఈ ప్రశ్న వినగానే దిగ్గున తల తిప్పి చూసింది మనోరమ. కనీకనిపించనట్టుగా అతని మొహంలో కొంటెతనం. ఆమె బరస్టయింది.
“ఏమిటసలు నీ ఉద్దేశం? ఐ లవ్యూ అని నువ్వనగానే ఐసైపోయి వచ్చి నీ వళ్ళో వాలిపోవాలనా? ఛ… ఛ… మగవాళ్లంటేనే అసహ్యం పుట్టేలా ప్రవర్తిస్తున్నావు నువ్వు.”
అతను కొద్ది సేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత మాటలు పేర్చుకుంటూ నెమ్మదిగా
అన్నాడు. “మనం చాలా ప్రిమిటివ్ స్టేజిలోనే ఉన్నామనుకుంటాను. సెక్స్ కోసమే స్త్రీని ప్రేమించాలనే నమ్మకంలోంచి మగవాడు, అందుకోసమే తను ప్రేమించబడుతోందన్న
భావననుంచీ స్త్రీ ఎదగాలి.”
మనోరమ కంగుతింది. ఎంత ఓపెన్ గా చెప్పాడీ విషయాన్ని? అంటే? తన ఆలోచనన్లోనే తప్పుందని అతని ఉద్దేశ్యం కాబోలు.
“అయితే నీ ఉద్వేశ్యం?” చురుగ్గా అడిగింది.
“పెళ్లి చేసుకుందామని అడిగాను. అంటే జీవిత సాహచర్యం.”
“దానికి చెప్పాను. మా అమ్మానాన్నలని సంప్రదించకుండా నేనేమీ చెయ్యను.”
“వాళ్లనడిగి చెప్పు.”
“వాళ్లు వప్పుకోరు.”
“అయితే వదిలెయ్.”
తెల్లబోయిందామె. ఈ రెండు పదాల వాక్యం చెప్పడం కోసం అతను తన వెంటపడి హైదరాబాదు వస్తున్నాడా? చాలా విచిత్రమైన మనిషి!
“ట్రైనింగవగానే పోస్టింగివ్వలేదా నీకు?” అడిగింది మనోరమ.
“ఇచ్చారు. నాలుగు రోజుల తర్వాత చేరడానికి అనుమతి తీసుకున్నాను.”
“సీనియారిటీ పోదా?”
“పోదట. మెరిట్ లిస్టులో ఇచ్చిన ఆర్డరు ప్రకారమే సీనియారిటీ చూస్తారట. చేరిన తేదీ ముఖ్యం కాదని చెప్పారు. ఆఫీసులో కనుక్కుంటే”
“బీటెక్ కదా, గుమస్తా ఉద్యోగానికి వచ్చావేమిటి?”
“పోస్టు గ్రాడ్యుయేట్ వి, లెక్చరర్ పోస్టు రాలేదా?”
సుదీర్ఘమైన నిశ్శబం తర్వాత అతనన్నాడు. “మనకా ఉద్యోగాలు రావు కూడా. ఎందుకంటే ప్రవృత్తికీ – చదువుకీ, చదువుకీ – వృత్తికీ, వృత్తికీ – ప్రవృత్తికీ పొంతనలేనంత అనిశ్చితిని నింపుకున్నాం మన జీవితాల్లో. మూలకారణం ఏమిటో తెలుసా? మనిషి స్వాత్మవాదిగా కన్నా ఆర్ధికదృష్టిలోకి మారడమే. మనిషి పుడితే డబ్బు, పేరు పెట్టుకుంటే డబ్బు, పెళ్లి చేసుకుంటే డబ్బు, పిల్లల్ని కంటే డబ్బు.. డబ్బు అలా చేతులు మారాల్సిందే! అలా డబ్బులు చేతులు మార్చగలిగేవాళ్ళకి మంచిమంచి ఉద్యోగాలు కావాలి. ఏదో ఒకలా తన్నుకుపోతారు. మనలాంటి వాళ్లు అసంతృప్తి మేస్తూ ఇలా రాజీపడాల్సిందే.”
అతను చాలా లోతైన మనిషనిపించాడు మనోరమకి. పైకి కనిపించే వ్యక్తిత్వంలో మరో భిన్నమైన వ్యక్తిత్వం ఇమిడి ఉంది. మూడో రోజుని అతనా మాట అనకుండా ఉంటే మంచి స్నేహితుడయ్యేవాడు.
అతను తన కుటుంబాన్ని గురించి చెప్పాడు.
” మా నాన్న డాక్టరు. అమ్మ నర్సు. మేం నలుగురు అన్నదమ్ములం. ముగ్గురికి పెళ్లిపోయాయి. ఏ ఒక్క కోడలి వలనా మా అమ్మకి సంతోషం లేదు.”
“అది తెలిసి కూడా నువ్విలాంటి పనెందుకు చెయ్యబోయావు?”
“ఎలాంటి పని?”
“ప్రేమించడం, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం.”
నవ్వాడతను. “మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మా నాన్నతో ఆవిడెప్పుడూ వాదించడం నేను చూడలేదు. అంతగా వాళ్లిద్దరి అభిప్రాయాలూ కలిసిపోయాయి. అలాంటి కోడళ్ళే తనకి రావాలనుకుంది.”
మనోరమ అంది. “మీ తల్లిగారు వెనకటితరం మనిషి. మీ నాన్నగారి అభిప్రాయాలకనుగుణంగా తను మారింది. మీ వదినలు ఈ కాలం వాళ్ళు. వాళ్ళకో వ్యక్తిత్వం వుండకుండా ఎలా వుంటుంది?”
“ఏమిటి, వ్యక్తిత్వం అంటే? ఇంట్లో ఉండే నలుగురికీ నాలుగభిప్రాయాలుండి, ఏదేనా సమస్యని తాడు తెగేదాకా నాలుగు వైపులకి లాగడమా?” చురుగ్గా అడిగాడు. ” నాయకత్వాన్ని అన్నిచోట్లా వొప్పుకుంటున్నాం. దేశానికి ప్రధానమంత్రి కావాలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఉద్యోగస్తులకి ఓ యూనియను, దానికి నాయకుడు కావాలి. ఆఖరికి ఎల్‌కేజీ చదివే పిల్లలక్కూడా ఒక లీడరుంటాడు. వాళ్లు మనలనెలా చావగొట్టినా సణుక్కుంటూనో
గొణుక్కుంటూనో భరిస్తాం. ఇంట్లో పెద్దవాళ్లు మన మంచికోరి ఏదైనా చెప్తే మాత్రం వినడానికి మన అహం అడొస్తుంది. ఆత్మగౌరవం దెబ్బతినిపోతుంది.”
అతని అభిప్రాయాలు విని మనోరమ నివ్వెరబోయింది. ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా వ్యక్తపరుస్తున్నాడు. వాటిల్లో ఆర్తి ఉంది. ఆదర్శం ఉంది. ఆలోచనుంది. అన్నిటికి మించి అతను కొత్త మనిషిలా అనిపించటం లేదు. ఎప్పట్నుంచో పరిచయం ఉన్నట్టనిపిస్తున్నాడు.
ఒక వ్యక్తితో ఇంత సాన్నిహిత్యం . అదీ కొన్ని గంటల్లో… ఎలా సాధ్యం ?
తన వ్యక్తిత్వంతో ఆమెని ముంచెత్తుతున్నాడు రాహుల్. అతను ఉద్దేశ్యంతోనైతే బస్సెక్కాడో
అదైతే నెరవేరింది. తరవాతది… ఆ దేవదేవుడికే ఎరుక!
“ఇదంతా ఎందుకు జరుగుతోందో తెలుసా మనోరమా? మనిషి మానవ సంబంధాలకన్నా ఎక్కువ ప్రాముఖ్యం డబ్బుకివ్వడం. మా పెద్దన్నయ్య, వదిన డాక్టర్లు. మా వదినకి మేరేజి గిఫ్టుగా వాళ్ల నాన్నగారు ఒక ఇల్లిచ్చారు. పెళ్లి, హనీమూన్ నుంచి రాగానే వాళ్ల ఇంట్లోకి వాళ్లు వెళ్లిపోయారు. అది అమ్మని గాయపరచింది. కొత్తింట్లోకి వెళ్లిన దగ్గర్నుంచీ పందెపుకోళ్లలా పోట్లాడుకునేవారు అన్నయ్యా వదినా. ఇద్దరూ సమవుజ్జీలు. ఎవరూ తగ్గే ప్రసక్తి లేదు. రెండో అన్నయ్య లెక్చరరు. వదిన టీచరు. ఆవిడకి మా అమ్మ ఉద్యోగం నామోషీ. ‘ఇందరం తెచ్చుకుంటున్నాం గాబట్టి మీరా ఉద్యోగం మానెయ్యండి’ అనేది. నిత్యం ఇంట్లో దేనికో ఒకదానికి అమ్మతో గొడవ పెట్టుకునేది. ఆఖరికి అమ్మే తన ఓన్ సేవింగ్స్ లోంచీ కొంత డబ్బిచ్చి పైనవేసుకుని ఇల్లు కొనుక్కోమంది రెండో అన్నయ్యని. అలా వాళ్లు వేరైపోయారు. మూడోవదిన మా దగ్గరే ఉంటుంది. అన్నయ్య దుబాయిలో ఉంటాడు. ఆరేళ్లైంది వాళ్ల పెళ్లై. వాడా దుబాయ్ వదిలి పెట్టి రాలేడు. ఇక్కడ ఈవిడ వాడు పంపించే డబ్బుతో వచ్చే సుఖాలని వదులుకోలేదు. అలాగని భర్త ఇక్కడ లేకపోవడాన్ని సంయమనంతో భరించలేదు. ఆవిడ విసుగులకీ కోపాలకి టార్గెట్ మా అమ్మ. అన్నిటికీ సర్దుకుపోతుంది గాబట్టి అందరూ ఆవిడనే అంటారు.”
దాదాపు అందరిళ్లలోనూ ఉండే గొడవలే అవి. కొడుకు సంపాదన కావాలి. కోడలక్కర్లేదు. అత్తమామాలిచ్చే ఆస్థికావాలి. దాన్ని అనుభవించడానికి వాళ్లు అడ్డం అనుకునేవాళ్లే నూటికి తొంభైతొమ్మిది మంది ఉంటారు. ఆ నూరో వ్యక్తి ఇతనా? ఏమో!
“నీలో సింప్లిసిటీ ఉంది మనోరమా!నాకది నచ్చింది”
భూమి గుండ్రంగా ఉంటుంది. సంభాషణ మళ్లీ మొదటికే వచ్చింది.
“ఆ విషయాన్ని వదిలేద్దామన్నావు ఇందాకా.” మనోరమ గుర్తు చేసింది.
“అన్నానా? మర్చిపోయానైతే” రాహుల్ నవ్వాడు.
రాత్రి రెండున్నరైంది. బస్సులో లైట్లు డిమ్ గా వెలుగుతున్నాయి. ముందురోజు రాత్రి సరైన నిద్రలేక ఇద్దరికీ కళ్లు కూరుకుపోతున్నాయి. నిద్రపోవాలంటే ఇద్దరికీ ఇబ్బందిగానే అనిపిస్తోంది. మూడుచోట్ల బస్పాగినప్పుడు దిగి ఇద్దరికి తీసుకొచ్చాడు రాహుల్ తన స్వంత అన్నతోటో, తండ్రితోటో ప్రయాణం చేస్తున్నంత సౌకర్యంగా ఉంది. మనోరమకి. అతను తన అవసరాలు గమనిస్తున్నందుకా? ఏమో!
పదింటికల్లా హైదరాబాదు చేరారు. ఈలోగా తన ఫేమిలీ గురించి క్లుప్తంగా చెప్పింది మనోరమ. హైదరాబాదులో ఏమేమీ చూడచ్చో వివరంగా చెప్పింది. వరంగల్ వెళ్లే బస్సు దగ్గరుండి ఎక్కించాడు రాహుల్.
“నీ లైఫ్ పార్టర్ పోస్టుకి నా అప్లికేషన్ మొదటిదని మర్చిపోకు మనోరమా!” బస్సవతల విండో దగ్గర నిలబడి అన్నాడు. తన పర్సనల్ అడ్రెస్సు, ఫోన్ నంబరు చిన్న స్లిప్ మీద రాసిస్తూ,
“ఆ విషయం నువ్వు మర్చిపోవా?” మనోరమ నవ్వింది.
“మర్చిపోయే విషయమైతే ఇంతదూరం నీ వెంటపడి ఎందుకొస్తాను?”
“నాకి రైల్వే ప్లాట్ ఫామ్ లవ్ మీద నమ్మకం లేదు రాహుల్.”.
“మూడు నెలల పరిచయం, పదహారు గంటల సుదీర్ఘ ఏకాంతం ప్లాట్ ఫామ్ లవ్వైతే ఐదు నిముషాలు పెళ్లి చూపులనే మనాలి?”
మనోరమ తలొంచుకుంది. ఆమె జవాబివ్వకముందే బస్సు కదిలింది.
రాహుల్ నవ్వుతూనే చెయ్యూపాడు.
“నాకు సమాజం ఇచ్చే సెక్యూరిటీ కావాలి. నేను సగటు ఆడపిల్లని రాహుల్. ప్రవాహానికి ఎదురీదే నేర్పు నాకు లేదు.” ఆమె మనసు ఘోష పెట్టింది.
….

“ఒక్కదానివీ ఏం ఇబ్బంది పడతావోనని హడిలిపోయామే మనోరమా!అన్నయ్యకేమో ఇన్ స్పెక్షనుండి వీలుకాలేదు. మీ నాన్న అంత దూరం వచ్చి మళ్లీ వెంటనే తిరుగు ప్రయాణం చెయ్యలేరు. ప్రయాణం బాగా జరిగిందామ్మా?” దగ్గరికి తీసుకుంటూ ప్రేమగా అడిగింది తల్లి.
“కాళ్లూ చేతులు కడుక్కునిరా. అన్నం పెడతాను. ఎప్పుడనగా తిన్నావో!” అభిమానంగా ఆవిడంటుంటే ఆ మూడు నెలలూ మెస్ లో తినీ తినకా చంపుకున్న ఆకలంతా ఒక్కసారే గుర్తొచ్చింది మనోరమకి. ఏకంగా వెళ్లి స్నానమే ముగించుకుని వచ్చింది.
తల్లి అన్నం పెడ్తూ చెప్పింది. “అన్నయ్యకి ఆ రాజమండ్రీవాళ్ల సంబంధమే కుదిరిపోయిందే మనో!”
“అదేంటి? అన్నయ్య అమ్మాయి నచ్చలేదన్నాడు కదమ్మా?” తెల్లబోతూ అడిగింది.
“వాడి మొహం! వాడికేం తెలుసు? పిల్ల అందం కొరుక్కుతింటామా? ఎనభై వేల కట్నం, స్కూటరు ఇస్తామన్నారు. ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందేమిటి?”
మరో సమయంలోనైతే మనోరమ తల్లి మాటల్ని పెద్దగా పట్టించుకునేది కాదు. ఆవిడలాగే తనూ ఆలోచించేదేమో. నాలుగున్నర లక్షలు ఖర్చు చేసి ఇల్లు కట్టించాడు తండ్రి. ఇంకా లక్షన్నర పని మిగిలింది. ఊర్నిండా అప్పులున్నాయి. ఈ సమయంలో అన్నయ్యకట్నం దగ్గిర బిగబట్టకుండా తన స్వార్ధం తను చూసుకుంటే ఎలా అనుకునేది. కానీ రాహుల్ ప్రభావంచేత ప్రపంచానికి కొత్త ద్వారాలు కనిపిస్తున్నాయామెకి. తన తండ్రి యూడీసీ. కొద్దిపాటి ఆస్థి ఉండేది. సుఖంగా రోజులు నడిచిపోయేవి, ఇల్లు కట్టుకున్నాకే ఇబ్బందులు మొదలయ్యాయి. ఎందుకంత పెద్దిల్లు కట్టి బతుకుల్ని దానికి తాకట్టు పెట్టడం అనిపిస్తోందిప్పుడు.
ఆనక అన్నయ్యని ఒంటరిగా పట్టుకుని అడిగింది-
“ఆ అమ్మాయి బావోలేదన్నావు కదరా?” అని.
అతను శుష్కహాసం చేశాడు. “నాన్న అంత కష్టపడి కట్టించాక ఇల్లు నిలుపుకోవల్సిన బాధ్యత నాదే కదే మనో! నచ్చకపోవడానికి ఆమె ఏమంత తీసికట్టుగా లేదు. కన్నొంకరా, కాలొంకరా లేదు.” అంటూ వేదాంతం మాట్లాడాడు.
మనోరమకి దిగులేసింది. ‘ఇహమీదట ఎప్పుడూ అన్నయ్యిలాగే ఉండిపోతాడా అనిపించింది.
ఆమె అనుకున్నట్టు ఆమె అన్నయ్య అలాగే ఉండిపోవడమే కాదు, కోటి కలలతో కొంగొత్త ఆశలతో అత్తిల్లు మెట్టిన తన భార్య పెదవులమీది నవ్వునీ, మొహంలోని మెరుపునీ కూడా
చెరిపేశాడు.

ఇంట్లో నిత్యం ఏదో ఒక దెబ్బలాట! మనోరమ తల్లి తనూ ఒకప్పుడు పరాయింటి ఆడపిల్లనే, తనూ ఒకప్పటి కోడల్నే అని మర్చిపోయింది.
ఆ పిల్ల తననిబట్టి ఆ ఇంటికొచ్చిందనీ లేకపోతే పుట్టింట రాణివాసం ఏలేదనీ, ఆమెని సుఖపెట్టాల్సిన బాధ్యత తనమీద ఉందనీ మనోరమ అన్నకి ఉండదు.
ఇష్టంలేని పెళ్లి! మనస్సు లగ్నమవదు. పరిపరి విధాల పోతోంది. అన్నిటికీ మించి డబ్బు ఇబ్బంది. ఇల్లు ఎంతొచ్చినా మింగేస్తోంది.
మనోరమ వదిన తండ్రి రిటైరయ్యాడు. రెండు లక్షలో ఎంతో వచ్చి ఉంటుందని వీళ్లు లెక్కలు వేసుకున్నారు.
“ఆడపిల్లలకి ఆస్థి హక్కు వచ్చింది. నీ వాటాగా రావల్సింది వెళ్ళి తీసుకురా” అంది మనోరమ తల్లి.
దాని మీద వాదోపవాదాలయ్యాయి. గొడవపడ్డారు.
“ఆస్తిహక్కంటే పిత్రార్జితమైన పొలాలో ఏవో ఉంటే అందులో వాటా ఉంటుంది. అంతేగానీ ఇలా రిటైర్మెంట్ డబ్బులోనూ, పెన్షన్లోనూ కాదు. నాకివ్వాల్సిందేదో ఇచ్చేసారు . నాకూ ఒక అన్నయ్య వున్నాడు. మీరు మీ కొడుక్కివ్వాలని ఎలా అనుకుంటున్నారో మా నాన్నకి తన కొడుక్కి ఇచ్చుకోవాలనుంటుంది” అని తెగేసి చెప్పింది మనోరమ వదిన.
“ఏమిటే, తెగ నీలుగుతున్నావు? నా కొడుకు నీ మొగుడు కాదా? అప్పనంగా వచ్చిందని ఇంత యిల్లూ అనుభవిస్తున్నావు. యోగ్యత ఉండాలి. ఇల్లు నిలబెట్టుకోవే పిచ్చిదానా అని చెప్తుంటే అర్ధమవట్లేదా?” అరిచింది మనోరమ తల్లి.
ఆవిడ అలా కూడా మాట్లాడగలదని ఆశ్చర్యం వేసింది మనోరమకి. ఈ గొడవలప్పుడు తన గది వదిలిరాదు మనోరమ. అప్పుడూ అంతే చేసింది.
ఈ మధ్య ఆమెకి రాహుల్ తరచుగా గుర్తిస్తున్నాడు. అతని మాటలు గుర్తిస్తున్నాయి. అతని మాటలు తలుచుకుని తన ఇల్లేమిటిలా నిప్పుల గుండమైపోయిందని బాధేస్తుంది. వదిన్ని చూస్తే జాలేస్తుంది. తండ్రిని పీడించి ఎంత డబ్బు తెచ్చి ఈ ఇంట్లో కుమ్మరించింది! అయినా అన్నకి జాలి లేదు. తండ్రి కష్టపడి కట్టించిన ఇల్లు భార్య పుట్టిల్లు నొల్లుకుని నిలుపుకుందామని ఒకటే తాపత్రయపడిపోతున్నాడు. బ్రతుకులోని సొగసునీ, పెళ్లిలోని మాధుర్యాన్నీ ఎండగట్టేసుకుని వొట్టి ఎండిన పువ్వులా మిగిలాడు.
ఆ రోజు గొడవల్లో మనోరమ అన్న భార్యని కొట్టాడు, తన్నాడు. ఆమె సొమ్మసిల్లిపోయాక వదిలాడు. ఆ తర్వాత తల్లితో చాలాసేపు గుసగుసలాడాడు. ఎంతకీ అవట్లేదు వాళ్ల మంతనాలు. ఒకటీ ఆరా వాళ్ల మాటలు వినిపించాయి.
ఆమె దిగ్రాంతి చెందింది. తన తల్లి, తన అన్నే! తనకి కాల్లో ముల్లు గుచ్చుకుంటే తనకన్నా ఎక్కువగా ఏడ్చిన అన్నే తన కడుపు తడిమి నింపే తల్లే! ఆ ఇంటికోడల్ని అంతమొందించడానికి
కుతంత్రాలు పన్నుతున్నారు.
ఎందుకు?
మాటపంతం.
దేనికా మాట పంతం?
డబ్బు కోసం.
డబ్బు ముందర మరేమీ ఉండదు. ఇంకెక్కడి రక్షణ? తన వదినకుందా?
తనకి మాత్రం ఉంటుందా? రేపొద్దున్న తనని చేసుకునేవాడు కూడా తనని నచ్చుకోకపోవచ్చు.
నెలకి మూడు వేలు తెస్తోందని లెక్కలేసుకుని చేసుకుని ఆనక లాభనష్టాల త్రాసులో లాభం
వైపు మొగుకోసం తనని పావులా వాడుకోవచ్చు. డబ్బు పిచ్చి పట్టిన మనుషులు, ఏమైనా
చేస్తారు, చెయ్యగలరు.
ఏదీ చెయ్యకనూ పోవచ్చు. కానీ కట్నం మాత్రం తీసుకుంటాడు. కానుకలు
దండుకుంటాడు. ఇంట్లో కళ్ల ముందర ఇంత జరుగుతుంటే చూసి కూడా అలాంటి పెళ్లి చేసుకుని ఆ పరంపరలోని మగవాడితో తను కాపురం చెయ్యగలదా?
రాహుల్ని చేసుకుంటే తన భవిష్యత్తు ఏమౌతుందో అని కదూ తన భయం. వదిన బతుకుకన్నా అధ్వాన్నమవదు.
“అయ్యో వదిన! ఏం చెయ్యాలి తనిప్పుడు?” ముచ్చెమటలు పోశాయి మనోరమకి.
మైసూర్ నుంచి వచ్చేటప్పుడు వాడిన జర్నీ బేగ్ తీసి రాహుల్ ఫోన్ నంబరు కోసం వెతికింది. అట్టే ప్రయాసపడక్కర్లేకుండా దొరికింది.
స్థిరనిశ్చయంతో ఇంట్లోంచి బైటకినడిచింది. పబ్లిక్ బూత్ కి వెళ్లి రెండు కాల్స్ చేసింది. ఒకటి లోకల్, ఒకటి ఎస్టీడీ.
మొదటిది పోలీస్ స్టేషన్ కి.
రెండవది బెంగుళూరు రైల్వే స్టేషనుకొచ్చి తనని రిసీవ్ చేసుకోమని రాహుల్ కి.
(ఐపోయింది)

.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s