ముల్లు by S Sridevi


(ఆంధ్రప్రభ , జనవరి 1993)
పని ముగించుకుని బాల్కనీలో కొచ్చి నిలబడ్డాను . పేరేగానీ పెద్దగా పనంటూ ఏమీ ఉండదు . రమేష్ బ్యాంకులో మేనేజరుగా చేస్తున్నాడు . బాంకు వాళ్లిచ్చిన అధునాతనమైన క్వార్టరు . ఇంట్లో సమస్తమైన సామగ్రీ ఉన్నాయి .
పొద్దున్న తొమ్మిదిన్నర దాకానే హడావిడి . వంట చెయ్యడం , పిల్లల్ని స్కూలుకి పంపించడం , రమేష్‍ని బాంకుకి పంపడం , అంతటితో సరి ! మళ్లీ నాలుగున్నరకి ఆగిపోయిన నా దినచర్య పిల్లల రాకతో తిరిగి వేగం పుంజుకుంటుంది .
రమేష్ కాలం విలువ తెలిసిన మనిషి . బాగా ప్రాక్టికల్ . ఇంట్లో ఉన్నంతసేపూ అపనీ ఈపనీ సాయంచేస్తూనే ఉంటాడు . ముఖ్యంగా పిల్లల తగాదాలు తీర్చి , వాళ్లకి కావల్సిన పెన్సిళ్లు , రబ్బర్లలాంటి వస్తువులు ఇవ్వడం అతని డ్యూటీ . వాళ్లు కూడా ఏం కావల్సినా నాన్నని పిలుస్తారే తప్ప అమ్మని పిలవరు . అతనికి భేషజాలు కూడా ఏమీ లేవు . జీతం తీసుకొచ్చి నా చేతికే ఇస్తాడు . ఎలా ఖర్చు చేసినా అదేమని ప్రశ్నించడు . ” నీకు మాత్రం బాధ్యత తెలీదా ? ” అనేస్తాడు తేలిగ్గా.
నిజమే ! అతనంత కష్టపడి సంపాదించుకొస్తే దాన్ని జాగ్రత్త చెయ్యడం కూడా నాకు రాకపోతే ఎలా ? కానీ వాస్తవానికి ఇది చాలా గురుతరమైన బాధ్యత . సంపాదించేవాళ్లకి డబ్బు విలువ తెలిసినంతగా ఇంట్లో కూర్చునే నాలాంటివాళ్లకి తెలీదు . అతని ముందు దించిన తల యెత్తుకోలేని పనులు చాలా చేశాను .
ఒకసారి చీరలకి మేచింగ్ జాకెట్‍ముక్కలు తీసుకుందామని తెలిసిన షాపుకెళ్లాను .
” చందేరి జరీచీరలు కొత్త స్టాకొచ్చాయి మేడమ్ ! ” అని వద్దంటున్నా పడేశాడు షాపతను . నా పట్టు సడలిపోయింది . కళ్లు చెదరగొట్టేలా ఉన్నాయి ఆ చీరలు , రంగులు. వదల బుద్ధి కాలేదు . ఆరేడు వందల ఖరీదులో మూడు చీరలు తీసుకుని బిల్లు ఇంటికి పంపించమని చక్కావచ్చాను .
ఆ తర్వాత నాకే తప్పు చేసినట్లు అనిపించింది . రమేష్‍కేసి సూటిగా చూడలేకపోయాను . అతను నన్ను నమ్మి ఇంటి పెత్తనం చేతిలో పెడితే ఇలా చేశానేమిటి ? నాలో నేను మధనపడి పోయాను .
అతను మాత్రం చాలా తేలికగా తీసుకున్నాడు .
” ఎంతో మనసుపడి కొనుక్కున్న చీరలు గూర్చి ఇలా మధనపడతావేంటి గీతా ? రెండు వేలు మనకేమంత పెద్ద మొత్తం కాదు . నా జీతంలో సగంకూడా కాదు ” అనేశాడు తేలిగ్గా. ఆ తర్వాత అతనన్నమాటలు నన్ను కదిల్చాయి .
” నువ్వు సంతోషంగా ఉంటే చాలు నాకు ఎంతేనా ఖర్చు పెడతాను . ఏదేనా చేస్తాను. పెళ్ళికి ముందు … నువ్వు , నేను , వింధ్య కలిసి తిరిగే రోజుల్లో చాలా చురుకుగా ఉండే దానివి . అదంతా ఏమైపోయింది ? ఎందుకు నీలో ఇంత మార్పు? నాలో ఏదేనా తప్పుందా ? ఎన్నో సార్లు నిన్నిమాట అడగాలని అనుకుని కూడా అడగడం మానేశాను “
అతను నా సమాధానం ఆశించలేదు . ప్రశ్నలు వేసి నాలో నేను ఆలోచించుకునేలా చేసి అక్కణ్ణుంచి వెళ్ళి పోయాడు . ఎంత సంస్కారం ! ఎంత ఔన్నత్యం ! నాకా వ్యక్తిని భర్తగా పొందినందుకు సంతోషం వెయ్యడం లేదు . మనసు మూలల్ని ముల్లు తెలుకుతున్నట్టు బాధ వేస్తోంది . నాది కాని జీవితం , ఎవరికో చెందాల్సిన ఔన్నత్యం నేనుభవిస్తున్నాననిపిస్తుంది . అతనికి మాత్రం తెలీదా , నా ఆవేదన ఏమిటో ? బహుశ: అతని ఊహకి కూడా అందదేమో ! నాలాగా ఆలోచించగలిగే వ్యక్తి అయితే నా భర్తయి ఉండేవాడే కాదు .
ఇలాంటి ఆలోచనలతో నా మనసు చచ్చుబడిపోయింది . శరీరంలో ఓ భాగం అలా పనిచెయ్యకపోయినా మనుగడ సాగించవచ్చుగానీ మనసు చచ్చుబడితే బ్రతకడం చాలా కష్టం. రెండు సార్లు ఈ డిప్రెషన్‍తో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించి వెంట్రుకవాసిలో బయటపడ్డాను. ” శరీరంలో జరిగే జీవరసాయన చర్య కారణంగా పుట్టుకొచ్చే వ్యర్ధ పదార్ధం మనసనేది . దాన్ని తీసవతల పారెయ్యాలి . లేకపోతే బ్రతకడం కష్టం ” అంటుంది వింధ్య.
” ఔన్నిజమే ! ” అని ఏకీభవిస్తాడు రమేష్. నేను మాత్రం ఆ నిజాన్ని వప్పుకోలేను . నిజంగానే వింధ్యకి మనసనేది లేదు. ఉంటే ఇంత ధీమాగా బ్రతికెయ్యలేదు . అదీ హాయిగా ఉంది . రమేష్ హాయిగానే ఉన్నాడు . ఇద్దరి మధ్య నలిగిపోతున్నది నేనే .
పదేళ్ల క్రితం వింధ్య జీవితంలో అడుగుపెట్టబోయి నా బ్రతుకుబాటలోకి నడిచొచ్చాడు రమేష్ . లోకం దృష్టిలో చాలా తేలికగా జరిగిపోయిందా సంఘటన నాకు మాత్రం పెనుతుఫాను .


మేం ముగ్గురు అక్క చెల్లెళ్లం . అందరి తర్వాత ఒక తమ్ముడు . అక్క పెళ్ళైపోయింది . వింధ్య , తర్వాత నేను పెళ్లికున్నాము . మా ఇద్దరికీ రెండేళ్ల తేడా , తను బాంకులో క్లర్కుగా చేస్తుండేది . నేను బి.ఎస్.సి. పూర్తి చేసి ఖాళీగా ఉన్నాను .ఎక్కడా ఉద్యోగం దొరకలేదు . ఎమ్మెస్సీ చదుపుతానంటే నాన్న వప్పుకోలేదు .
నాకూ వింధ్యకీ కలిపి సంబంధాలు చూసేవారు .
కట్నం తక్కువడిగి , ఉద్యోగం చేస్తున్న పిల్ల కావాలంటే వింధ్యని చూపించేవారు . డబ్బాశ ఎక్కువగా ఉన్నవాళ్లకి నన్ను చూపించేవారు . డబ్బు గుప్పించడానికి మా దగ్గర పెద్దగా ఏమీ లేదు . అక్క పెళ్లికైన అప్పులు ఇప్పటిదాకా తీర్చారు నాన్న . ఇప్పుడు మా పెళ్లిళ్లకి కొత్త అప్పులు చెయ్యాలి . కొంతవరకూ వింధ్య పరిస్థితి నయం . దాని జీతంలో కొంత దాని పేరవేసేవారు నాన్న . పెళ్లంటూ కుదిరితే బాంకు వాళ్ళు అప్పు ఇస్తారట . నా పరిస్థితి హీనం . నా రూపం చూసి చేసుకోవాలి . రెండు తెప్పల మీది ప్రయాణంలా ఏ సంబంధమూ కుదిరేది కాదు . ఈ తతంగం నాకు చాలా అసహ్యం వేసేది . ఎప్పటికి విముక్తి దొరుకుతుందా ! అని ఎదురుచూసేదాన్ని .
ఒకసారి రాజమండ్రినుంచీ నన్ను చూసుకోవడానికి పెళ్లివారొచ్చారు . తీరా ఇంటికొచ్చాక మడతపేచీ పెట్టుకూర్చున్నారు .
“ఇద్దర్నీ చూపించండి . ఎవరు నచ్చితే వాళ్లని చేసుకుంటాం ” ఉక్రోషంతో నా గుండె రగిలిపోయింది . ” ఇదేమైనా గొర్రెల బేరమా ? ఇద్దర్నీ కూర్చోబెడ్తే చుసి ఎంచుకోవడానికి ? ముప్పైవేల కట్నం కావాలనుకుని వచ్చారు . నచ్చితే నన్ను చేసుకోమనండి . లేకపోతే వచ్చిన దారిని పొమ్మనండి . అంతేగానీ ఇదేమిటి ? ఇలాంటి ఈడియట్స్‌ని ఇంకోసారి తీసుకొస్తే నేను ఇల్లొదిలేసి ఏ అనాధాశ్రమానికో పారిపోతాను ” నాన్నతో పొట్లాడాను .
నాన్న చాలా బాధపడ్డారు . ” మిమ్మల్ని కన్నప్పుడు నేనేమీ బాధపడలేదమ్మా . అడ్డమైనవాళ్ల గడ్డాలూ పుచ్చుకుని మా రత్నమాణిక్యాలని మీరు స్వీకరించడయ్యా అని అర్ధిస్తూ బాధపడుతున్నాను . గీతా ! పెళ్లంటూ అయితే మొగుణ్ణి ముప్పతిప్పలు పెట్టి నీ క్షోభకి బదులు తీర్చుకుందువుగాని . వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు ” అని బ్రతిమాలారు .
ఆ సంబందంకూడా మా ఇద్దర్లో ఎవరికి కుదర్లేదు. వింధ్యకి నలభైవేలిస్తే చేసుకుంటామన్నారు . పైగా మేమే డబ్బు మనుషులం అన్నట్టు మాట్లాడాడు మధ్యవర్తి.
” మీరిలా వింధ్యకి కట్నం ఇవ్వను , గీతకే ఇస్తాను అని భీష్మించుకుని కూర్చుంటే కుదరదు రావుగారూ ! నలభైవేలంటే ఎంత ? ఆ పిల్ల రెండేళ్ళు సంపాదించినంత కాదు. నాలుగేళ్లనించీ ఉద్యోగం చేస్తోంది ఆ లెక్కలన్నీ వాళడిగారా ? పిల్ల సంపాదిస్తే వాళ్లకేమైనా ఒరుగుతుందా ? మీరిచ్చే కట్నమే కదా , మిగులు ? ” అన్నాడు.
” మాకేం పాతికలు మించిపోయాయా నాన్నా ? కొన్నాళ్ళసలు సంబంధాలు చూడకండి . రాతుంటే వాళ్ళే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు . ” వింధ్యకూడా బాగా గాయపడింది .
మధ్యతరగతి సంసారాల తీరే అంత . ఎప్పుడూ సర్దుకుపోవడమో , త్యాగమో తప్పదు . ఇరవైనాలుగేళ్ళ వయసున్న వింధ్య , దాని కన్నా రెండేళ్ళు చిన్నదాన్నయిన నేను – మాకింకా పెళ్లిడు రాలేదని మభ్యపెట్టుకుంటూ తిరగాలి . ఏ వయసుకాముచ్చట కావాలనుకుంటే కాసులు గుమ్మరించక తప్పదు .
ఆర్నెల్ల కాలం గతంలోకి జారుకుంది . రమేష్‍ని తీసుకొచ్చి పరిచయం చేసింది .
” మా కొలిగ్ నాన్నా ! మన వాళ్లే… “
ఆ పరిచయం చెయ్యడమే తమాషాగా ఉంది .
” మీ కభ్యంతరం లేకపోతే నేనూ , రమేష్ పెళ్లి చేసుకుంటాం . అతనికి కట్నం అక్కర్లేదట . అతనికో చెల్లెలు వుంది . ఆమెకి పదహారేళ్లు . మరో రెండు మూడేళ్లలో ఆమెకి చేసేశాక మాకు లైన్ క్లియరౌతుంది ” ఇంకో సందర్భంలో చెప్పింది .
అమ్మ , నాన్న చాలా సంతోషించారు . ” కట్నం వద్దన్నాడని నీకేం అన్యాయం చెయ్యను వింధ్యా ! అవంతీపురంలో వున్న ప్లాటు నీపేర రాస్తాను . వెంటనే ఇల్లు కట్టుకుందురుగాని ” అన్నారు నాన్న
” నా గురించి మీరు బాధపడవద్దు . ఇంకో పదివేలు ఎక్కువిచ్చేనా సరే , గీతక్కూడా కుదర్చండి ” అంది ఆరిందాలా . నేను వింధ్యను మనస్ఫూర్తిగా అభినందించాను . రమేష్‍ని మనసులోనే ప్రశంసించాను . రమేష్ తరుచుగా మా ఇంటికొచ్చే వాడు . నాతో కూడా సరదాగా ఉండేవాడు . ఔచిత్యపు హద్దులు దాటని చనువతనిది . మొదట్లో వాళ్లిద్దరి మధ్యకి వెళ్లడానికి ఇబ్బందిగా అనిపించేది . రాను రాను అలవాటైపోయింది . ముగ్గురం కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్లం . ఫ్రెండ్స్‌లానే తప్పించి కాబోయే భార్యాభర్తల్లా ప్రవర్తించేవారు కాదు వాళ్లిద్దరూ .
రమేష్ చాలా ప్రాక్టికల్‍గా ఆలోచిస్తాడు . ఎనిమిదిమంది సభ్యులున్న కుటుంబానికి ఆధారం ఇతను . తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు . తాత , ఆయన రెండో భార్య, తనకన్నా ఆరేళ్లు చిన్నవాడైన వాళ్ల కొడుకు , తల్లి, తమ్ముడు , ఇద్దరు చెల్లెళ్లు – అంతా అతని మీద ఆధారపడ్డవాళ్లే తప్ప అతని భారం మోసేవాళ్లు లేరు . అందువల్లనే అతనింత మెటీరియలిస్టుగా తయారయ్యాడేమోననిపిస్తుంది . ఏమైనా మానవజీవితంలోని విలువలు బాగా తెలిసిన వ్యక్తి.
మొదట్లో వింధ్య అన్నట్టుగానే పద్దెనిమిదేళ్ళు రాగానే రమేష్ తన పెద్దచెల్లెలికి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు . వెంటనే కుదిరిపోయింది . అతను నలభై వేలిస్తానన్నాడట . వాళ్లు యాభై అడిగారు . పెద్దమీమాంసలేపి పడకుండా వాళ్ళడిగినంతా యిచ్చేసి తనది పైచేయిగా వుంచుకుని క్లుప్తంగా పెళ్ళికానిచ్చేసాడు . ఈ సందర్భంలో వింధ్య దగ్గర్నుంచి ఇరవైవేలు తీసుకున్నాడు – అప్పుగానే !
” జీవితంలో ఒక్కసారి జరిగేది పెళ్లి . దాన్ని వేడుగా జరుపుకోవాలని పెళ్లికొడుక్కుండాలి . అతనికి కట్నమే ముఖ్యమైతే మనమేం చెయ్యగలం?” అనేశాడు సింపుల్‍గా
” మహాలౌకికుడు ! ” అన్నారు నాన్న , పెళ్ళైనా కాకుండా వింధ్య దగ్గర్నుంచీ రమేష్ ఇరవైవేలు తీసుకున్నాడని ఆయనకి కినుకగా ఉంది . భలే మనుషులు !
రమేష్ , వింధ్యల పెళ్లికి గ్రీన్‍సిగ్నల్ వచ్చేసినట్టే !
” ముహూర్తాలెప్పుడు పెట్టించను ? ” అడిగారు నాన్న .
” మీ ఇష్టం ” నవ్వి చెప్పాడు రమేష్ . ” మా పెద్దవాళ్లని ఓసారి కలవండి ” అన్నాడు . ఆపై ఆదివారం తిథి , నక్షత్రం చూసి రమేష్ వాళ్ల ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు అమ్మ , నాన్న .
” గీతక్కూడా కుదిరితే బావుండేది . ” వింధ్య గొణుగుతూనే ఉంది . ” మనిద్దరం కలిసి మీ చెల్లెలికి చూద్దాం . ” అన్నాడు రమేష్ .
ఎదురు చూసిన ఆదివారం మేం అనుకున్న విధంగా రాలేదు . మా జీవితాల్ని తారుమారు చేస్తూ , మా గమ్యాలని మార్చేస్తూ వచ్చింది . ఆరోజు ఉదయాన్నే పేపరు కోనమని లైబ్రరీ కెళ్ళిన నాన్న ఏక్సిడెంట్లో చనిపోయారు . ఇది విధి మామీద చేసిన మెరుపు దాడి .
నా పెళ్ళికని కూడబెట్టిన కొంత మొత్తం తప్పించి వేరు పైసలేదు . నాలుగువేళ్ళు లోపలికి పోవడమే గగనమయ్యే మాలాంటి కుటుంబాల్లో పెద్దగా దాపరికాలేముంటాయి ? పైసా పైసా కూడబెట్టి దాచినదేదో అల్లుడికి ధారపోశారు . ఒకటి రెండు ఇన్సూరెన్సు పాలసీలు తీసుకుని వాటిని కట్టలేక మధ్యలో ఆపేశారు . ఆయన చేసేది ప్రైవేటు కాలేజీలో కావటం చేత యాజమాన్యంనించీ సానుభూతే తప్ప ఇంకేమీ రాలేదు .
” ఈ వేళ చనిపోతే రేపటికి రెండో రోజు . ” అన్నారెవరో . రోజులు గడిచిపోతున్నాయి . అంతా అగమ్యగోచరం . ఓ వైపు పెళ్లి , ఉద్యోగం లేకుండా నేను . మరోవైపు అమ్మ , పదహారేళ్ళ చెల్లీ , పద్నాలుగేళ్ల తమ్ముడు కుటుంబభారం అనివార్యంగా వింధ్య మీద పడింది .
రమేష్ వచ్చి వెళ్తునే ఉన్నాడు .
” నువ్వు పెళ్ళిచేసుకుని వెళ్ళిపోవే వింధ్యా ! ఈ ఊబిలో కూరుకుపోతే పైకి లాగడానికి చెయ్యందించే వాళ్లుండరు . గీతక్కూడా ఒకటి చూడండి ఉన్నదేదో పెట్టి చేసేస్తాను .” ఏడుస్తూ అంది అమ్మ.
” నా స్వార్ధం నేను చూసుకుంటే మీరంతా ఏమైపోతారే ? ” అయోమయంగా అంది వింధ్య .
” మారాతెలా ఉంటే అలానే జరుగుతుంది . నువ్వేనా సుఖంగా ఉంటావు . అందులోనూ చేతికి అంది వచ్చిన సంబంధం . ” మొండిగా అంది అమ్మ.
ఎటూ మాట్లాడలేని పరిస్థితిలో నేనున్నాను . నాది ఏ దార్లోనూ పరిష్కృతం చెయ్యలేని సమస్య . ఉన్న డబ్బుతో పెళ్లిచేసుకుని వెళ్లిపోతే అమ్మావాళ్ళూ నిరాధారంగా మిగిలిపోయారు . పెళ్లి వద్దంటే వింధ్య నెత్తిన గుదిబండలా తయారౌతాను ఏడుపొచ్చింది . నాకు మా గమ్యం నిర్దేశించి నాన్న వెళ్లి పోయింటే ఎంత బాగుండేది . నాలో నేను ఏడ్చాను .
నాలుగురోజులు గడిచాయి . ” పార్కుకెళ్దాం రావే ” అని బయల్దేరదీసింది వింధ్య . జనసమ్మర్థం లేనిచోట కూర్చున్నాం .
“రమేష్ నిన్ను చేసుకుంటానన్నాడు . ఉపోద్ఘాతమేమీ లేకుండా సూటిగా అనేసింది . నా చెవుల్ని నేనే నమ్మలేక పోయాను .
” ఏమిటక్కా నువ్వవేది ? ” కంగారుగా అడిగాను .
” ఆలోచించు గీతా ! రమేష్ తనంతట తానుగా ఇలా ప్రపోజ్ చేశాడు. మంచివాడుగాబట్టి ఇంకా మనకోసం ప్రాకులాడుతున్నాడు . వేరే ఎవరైనా ఐతే ఈపాటికి ముఖం చాటేసేవారు . ” ఊపిరి తీసుకోవడానికి ఆగింది. నేను కలగజేసుకోబోయాను . నన్నాపి తనే కొనసాగించింది . ” అతని కోణంలోంచి ఆలోచించు . నేనా, బాధ్యతలన్నీ వదులుకుని నాదారిని పోలేను. అతన్ని నాకోసం ఎంత కాలం ఆగమంటావు ? అప్పుడే అతనికి ముప్పై. నువ్వు కాదంటే మరో పిల్లని చూసుకుంటాడు . “
” అదేమిటే ? అతనూ నువ్వు ప్రేమించుకున్నారు . పెళ్ళి చేసుకుందామనుకున్నారు ” నా నోట్లోంచి మాటలు పెగలటం లేదు .
“నీ మొహం . కులం , గోత్రం చూసి చేసుకునేది ప్రేమేమిటి ? అతను వుద్యోగస్తుడు, సాటికులంవాడు . కట్నం ఆశలేదు . అవి నాకు ప్లస్ పాయింట్స్ . నేనూ వుద్యోగం చేస్తున్నాను … బాదరబందీల్లేవు . అవి అతనికి నాలో కనిపించిన ప్లస్‍పాయింట్సు . ఒక అవగాహనకి వచ్చి యిద్దరం పెళ్ళి చేసుకోవాలనుకున్నాం . ఇన్ని ఆలోచించి తీసుకున్న నిర్ణయం ప్రేమెలాగౌతుంది ? ” అడిగింది వింధ్య.
తన గొంతులో ఏ కోణంలోంచే వినిపించిన దుఃఖపుజీర నా కర్ణపుటాలని తాకకపోలేదు . ఎందుకా బాధ ? మనసు వంచించుకుంటున్నందుకా ? లేక కలల సాధం కూలిపోతున్నందుకా ?
” నీ జీతంకోసం నిన్ను చేసుకోవాలనుకున్నాడు. ఏం చూసి నన్ను చేసుకుంటాడు ? ఉద్యోగం లేని నన్ను చేసుకున్నా బాధ్యతల్లో వున్న నిన్ను చేసుకున్నా ఒకటే ! “
” అతనిపరంగా ఆలోచించు గీతా ! అయిదేళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకుని అప్పట్నించీ బాధ్యతల్ని తీర్చుకోవడమే ద్యేయంగా పెరిగిన రమేష్ ఈ కొత్తబాధ్యతల్ని తలకెత్తుకోవడానికి సిద్ధంగా లేదు . అలాగని అతనికి మోరల్స్ లేవనుకోకు . నా జీతంకన్నా అతనికి ముఖ్యమైనది నిశ్చింతయిన జీవితం . అతని భాషలో చెప్పాలంటే పెళ్లనేది సామాజిక శారీరక అవసరం ! దానికోసం అనవసర బాధ్యతల్ని తలకెత్తుకునే పురుషుడుండు” సమర్ధిస్తూ అంది సంధ్య .
” చీకటి పడింది . వెళ్దాం పద .” ” ఇంక ఆ విషయం చర్చించడం ఇష్టంలేక లేచి నిల్చున్నాను . వింధ్య మౌనంగా నన్ననుసరించింది . వారం రోజులపాటు ఇంట్లో మౌనం విలయతాండవం చేసింది . నేను , వింధ్య తప్పించుకు తిరిగాము . ఎనిమిదోరోజుని అమ్మే నన్నడిగింది .
” వింధ్య నిన్నేదో అడుగుతానందే ! ” అంది . అంటే అమ్మకి అంతా తెలుసన్నమాట ! ఏం చెప్పాలో తెలీక మౌనం వహించాను .
నా మౌనాన్ని ఆధారంగా తీసుకుని అమ్మ చెప్పసాగింది . ” అతనా దాన్ని చేసుకోవడానికి సిద్ధంగా లేదు . నిన్ను చేసుకోవడానికి సుముఖత చూపించాడు . నువ్వేనా , వింద్యేనా నాకొక్కటే . అది చెప్పి మార్గం బావుంది . దాని దారిన అది పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే మన సంసారం బజారున పడుతుంది . ఇలాగైతే నీ బారం తీరుతుంది . ఇంక మిగిలేది చెల్లి , తమ్ముడు . కాస్త నిలదొక్కుకుని చెల్లిక్కూడా చేసేస్తే ఈలోగా వాడు అందొస్తాడు . అప్పుడిక దాని బాధ్యతలు తీరిపోతాయి . నాన్న స్థానంలో నిలబడి ఈ ఇంటి భారం మోస్తోందిగాబట్టి దానికి ఎదురు చెప్పకు “
నేను అక్కణ్ణుంచి వెళ్లిపోయాను . రమేష్‍ని చేసుకోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు . నా మాటెవరు వింటారు ? దాని జీవితం నాశనం కాకూడదు అమ్మకి . దాన్ని తిరస్కరించినందుకు చెడ్డపేరు రాకూడదు రమేష్‍కి . అతని సామాజిక – శారీరకావసరాలు తీర్చడానికి వింధ్యో , గీతో మరో రమో ఎవరో ఒక ఆడపిల్ల కావాలి . అతని స్టేటస్‍కి సింబల్ కావాలి . నాకంటూ ఓ మననుందని ప్రకటించుకోలేని అస్వతంత్రురాలిని. నాన్న నాకిస్తానన్న కట్నం చూసో , నా అందం చూసో నన్ను నాకోసమే స్వీకరించే మగాడు కావాలి . వింధ్యని , మరో సంధ్యని ఒకేలా చూసే వ్యక్తి కాదు .
నేను ఔనని కాదనీ అకుండానే నా వివాహం జరిగిపోయింది . అంతా అతను నన్ను ప్రేమించి చేసుకున్నాడనే అనుకున్నారు . ఈవేళ చనిపోతే రేపటికి రెండో రోజు . ఎంత నిజం ! నేను మానసికంగా చనిపోయిన రోజు నిన్నగానూ , మొన్నగానూ , పదేళ్ల వెనక్కి జారుకుంది . ఇద్దరు పిల్లల తల్లినయ్యాను . అంత జరిగినా , నాకు రమేష్‍పట్ల అనురక్తి మాత్రం పుట్టలేదు . అతను గీతా అని పిలిచినా వింధ్యా అంటున్నట్టే ఉంటుంది నాకు .
వింధ్య కూడా పెళ్లి చేసుకుంది . ముప్పై ఐదేళ్ళకి బాధ్యతల్ని తీర్చుకుని నలభైయ్యేళ్ల లెక్చరర్ని చేసుకుంది . ఇద్దరు పిల్లలు వాళ్లకి . వెయ్యేసి రూపాయల చీరలు కడుతుంది . ఈ వేళో రేపో కారు కూడా కొంటారట .
రమేష్ , వింధ్యా కలుసుకుంటే ఇవే కబుర్లు . ఎవరెంత సంపాదించినదీ , ఎవరెంత దాచినదీ.
తోడల్లుళ్లిద్దరూ కలుసుకున్నా అంతే !
ఎటూ … ఎవర్లోనూ కలవలేనిది నేనే !
కనిపించని ముల్లేదో నా వ్యక్తిత్వాన్ని కెలుకుతూ ఉంటుంది . ఎన్నున్నా ఏదో వెలితి !


“ఏమిటండీ , మిసెస్ రమేష్! అలా నిలబడే ఆలోచనల్లోకి జారుకున్నారు ? ” పక్క క్వార్టర్లోంచి పలకరింపు విని ఈ లోకంలో కొచ్చాను .
” అబ్బే ! ఏమీ లేదండి ! ” నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాను .
“మీ పెళ్లి రోజు మీకు గుర్తొచ్చిందేమో! అదుగో… మీ చెంపలు ఎర్రబడుతున్నాయి… ఇద్దరు పిల్లల తల్లై వుండీ మీరు ఇంత స్మార్ట్‌గా ఉంటారు? మీది లవ్ మేరేజటకదా? …. మీకోసం నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారటకదా, రమేష్‍గారు? ఈమధ్యనోసారి, మాటల్లో మా శేఖర్ అన్నారు. ఎంత అదృష్టవంతులండీ మీరు?” ఆవిడ పరిహాసం చేస్తుంటే ముల్లులాంటి ఆ బాధ మళ్ళీ మొదలైంది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s