ఊదాపచ్చ నౌక 2 by S Sridevi

Nothing has really happened unless it is recorded-
Virgenia Wolf
లిఖించబడనిది ఏదీ కూడా వాస్తవంగా జరిగినట్టు కాదు. . . లిఖించబడటం. . . కంటితో చూసి, మనసుతో గుర్తించి కాలంపొరల మీద ముద్రించడం. . . అలా లిఖించబడిన సంఘటనలు ఎంతకాలానికి చరిత్రగా మారుతాయి? చరిత్రగా మారాకా మరెంత కాలానికి ఆధారాలని కోల్పోయి ఇతిహాసాలుగా మారి ప్రజల నమ్మకాలలోనూ, తద్వారా ఒక సంస్కృతిలోనూ మిళితమౌతాయి? ఆధారాలకి నిలిచే చరిత్ర గొప్పదా? ప్రాణాన్ని సైతం తృణప్రాయం అనిపించే నమ్మకం గొప్పదా? తన సబ్‍కాన్షస్‍మైండ్‍లో వున్న అటువంటి ఏ నమ్మకం వాళ్ళని తన కలల్లోకి ఆహ్వానిస్తోంది?
గతజన్మల బంధాలు కొన్ని స్పష్టంగానూ ఇంకొన్ని అస్పష్టంగానూ మనుషుల్ని వెంటాడుతుంటాయి. కలలు, అవ్యక్తంగా వుంటూ వెంటాడే ఆవేదనలు, అకారణ దు:ఖాలు…అవే. గతజన్మలలో అసంపూర్తిగా వుండిపోయిన బలీయమైన చర్యల తాలూకూ శేషఫలాలు ఈ జన్మలో పరిచయాలుగా రూపుదిద్దుకుంటాయి.
మనిషి ఒక ఎనర్జీ కాప్స్యూల్. పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ కౌంటర్‍పార్ట్‌ని వెతుక్కుంటుంది, నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ కౌంటర్‍పార్ట్‌ని వెతుక్కుంటుంది. ఇది మనిషి మంచి చెడ్డలకి సంబంధించిన విషయంకాదు. సాంత్వన పొందని వుద్వేగాలకి సంబంధించినది. గత జీవితకాలంలో పూర్తిచెయ్యలేకపోయిన ఇంటరాక్షన్స్‌ని పూర్తిచేసుకొమ్మని చేసే ప్రేరేపణ. ఈజీక్వల్టూకి అటూ ఇటూ చేర్చి సమానం చెయ్యవలసిన బీజగణితపు సమీకరణంలాంటిది. అసంపూర్ణంగా మిగిలిపోయిన సమీకరణం. . . మనిషి జీవితం జన్మజన్మలుగా ఇలాంటి అసంపూర్ణ సమీకరణాలతో నిండి వుంటుంది. ఏవి ఎప్పుడు పూర్తౌతాయో ఎవరికీ తెలియదు. అన్నీ పూర్తవ్వటం బహుశ: అదే ముక్తి.
పద్మమాలిక, మైత్రీపాలుడు అలాంటి ఏ సమీకరణానికి, ఏ జన్మకి చెందినవారు? ఈ జన్మలో ఎవరుగా పరిచయం కానున్నారు? వాళ్ళకి తనెవరు? తాము ఒకరినొకరు గుర్తుపట్టగలరా? ఆమో అన్వేషిస్తున్నాడు. . . ఎవరూ ఆమోదించని సిద్ధాంతపు ప్ర్రాతిపదికమీద ఎవరికీ అర్థమవని వెతుకులాట అది.


గతం ఒక పునాది.
వర్తమానం ఒక వూహ. భ్రమ. అవాస్తవం.
భవిష్యత్తు ఒక ఆలంబన.
ఒక క్షణం . . . పుట్టకముందు అది భవిష్యత్తు. పుట్టాక అది గతం. ఈ రెండిటిమధ్య మనిషి వుందనుకునే వర్తమానం వూహమాత్రమే.
గతంలో జీవితరహస్యాలన్నీ ఇమిడి వుంటాయి. సంఘటనలన్నీ వొదిగిపోయి వుంటాయి. అది ఎంత సుదూరకాలానికి అనే ప్రశ్న ఆమోని వెంటాడుతూ వుంటుంది. ఎన్ని జన్మల వెనక్కి అనే సందేహంకూడా అందులో అంతర్లీనంగా ఉంది, అది సాధ్యమేనా అన్న అనుమానంతోపాటుగా.
మనిషి జ్ఞాపకాలన్నీ శరీరంతో అనుసంధానించుకుని వుంటాయి. శరీరంతో మొదలౌతాయి. శరీరంతోనే అంతమౌతాయి. శరీరానికి ముందు అనుభవాలు, వాటి గుర్తులు లేవా అంటే వుంటాయి. అవి ఆత్మలో నిక్షిప్తమై వుంటాయి. వాటిని నిద్రాణ స్థితిలోంచీ లేపాలంటే ఆత్మని జాగృతం చెయ్యాలి. ఆత్మ అంటే?
ప్రాణికోటికి ఆద్యుడు స్వయంభువ మనువు. స్వయంభువం అంటే తనంతట తను ఆవిర్భవించినది అని అర్థం. హాట్‍డైల్యూట్‍సూప్‍లో ఆవిర్భవించిన మొదటి ప్రాణకణం. అదే ఆత్మ. అది రూపాంతరం చెంది అనేక ప్రాణులుగా తయారైనా, మనిషిగా మాత్రం ఒక ప్రత్యేకతని ఏర్పరుచుకుంది. అందుకే మనుసంతతిలో ఈ ద్విపాదప్రాణినే మానవులనీ, మనుజులనీ అన్నారు. అతనియొక్క ఒక జీన్ ప్రతి ప్రాణిలోనూ వుంటుంది. మనిషిలోనూ వుంటుంది. జన్మజన్మల బలమైన అనుభవాలు… అసంపూర్ణ వుద్వేగాలు డీయెన్‍ఏ నిచ్చెనమెట్లమీద వ్రాయబడి వుంటాయి…ఆ మనిషిని నిరంతరం వెన్నంటి వుండేలా.
భూమితో ప్రాణికి తొలి అనుబంధం ఏర్పడినప్పటినుంచీ ఆ ప్రాణి అనుభవాలన్నీ డీ‍ఎన్‍ఏ నిచ్చెన మెట్లమీద లిఖించబడి వుటాయి. అంటే అదంతా వాస్తవంగా జరిగినది. అందుకే మనుష్య శరీరంతో ఒక ఎనర్జీ కాప్స్యూల్ ఏర్పడినప్పుడు అంత వెతుకులాట. ఆమో దీనికి మినహాయింపు కాదు.
మిగిలిన అన్ని ప్రాణులకికూడా ఇలాంటి వ్యవస్థే వుండవచ్చు. కానీ వాటి భావవ్యక్తీకరణ మనిషికి అర్థమవదు.
మైత్రీపాలా! అన్న కలలోని పిలుపు తన యెనిమిదో ఏట కలలో మొదటిసారి విన్నాడు ఆమో.
మెలకువ వచ్చాక చూసుకుంటే నీలిరంగు బెడ్‍లాంపు వెలుతుర్లో తనెవరో ఎక్కడున్నాడో మొదట అర్థమవలేదు. క్రమంగా తెలిసింది. గదిలో తనొక్కడే. తల్లీ తండ్రీ వేరే గదిలో నిద్రపోతున్నారు. ఒక్కసారి తన వయసు చాలా పెరిగిపోయినట్టనిపించింది. ఎవర్నీ లేపాలనిపించలేదు. ఒక్కడూ పక్కమీద పడుకుని గుండె మెలిపెట్టినంత బాధని ఆ చిన్న వయసులోనే అనుభవించాడు.
మరుసటిరోజు పొదున్న లేవగానే తల్లికి తనకొచ్చిన కల చెప్పి, “మైత్రీపాలుడెవరు?” అని అడిగాడు. ఆమెకేం అర్థమవలేదు. కొడుకు కలలోకి వచ్చిన వ్యక్తి గురించి ఎంత అమ్మేనా ఎలా చెప్తుంది? అంత చిన్నపిల్లవాడికి అలాంటి కల రావడమేమిటి? ఆ కలగురించి అతనంత విపులంగా చెప్పడమేమిటి? ఏమౌతోంది ఆమోకి?
“మైత్రీపాల సిరిసేన. . . శ్రీలంక అధ్యక్షుల్లో ఒకరు. చాలా ఏళ్ళ క్రితం శ్రీలంకని పాలించారు. ” అని జవాబిచ్చింది సంధ్య. ఐతే ఆయన గుర్రమెక్కి తన కలల్లోకి ఎందుకు వస్తాడు? పద్మమాలిక కోసం ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటాడు? ఇవి జవాబు దొరకని ప్రశ్నలు ఆమోకి.
అప్పట్నుంచీ ఎన్నోసార్లు ఆ కల వచ్చింది. ప్రతిసారీ తండ్రినీ, తాతగారిని, బామ్మని ఇంకా ఎంతోమందిని ఎవరు దగ్గిరుంటే వాళ్ళని అడిగేవాడు మైత్రీపాలుడెవరని. అప్పుడే కాదు, ఇప్పటికీ వాళ్ళకి అర్థమలేదు. వాళ్ళకే కాదు, ఎవరికీ అర్థమవదనీ, అది తనకి మాత్రమే సంబంధించిన విషయమనీ తనే పరిష్కరించుకోవాలనీ . క్రమంగా గ్రహింపుకి వచ్చింది.
ఒకరోజు రాత్రి… ఆ కలగురించి తల్లిని అడిగిన మొదటిరోజు తర్వాత కొన్ని రోజులకి . . . ఆరుబయట కుర్చుని వున్నారు. సంధ్య మల్లెమొగ్గలు మాలకడుతోంది. రమేష్ పళ్ళెంలో వున్న మొగ్గల్ని చేతుల్తో కదిలిస్తూ ఏవో మాట్లాడుతున్నాడు . . . అప్పుడు చూసాడు ఆమో, ఆకాశంలో చాలా ఎత్తుని దాదాపు నక్షత్రాలమధ్యని అనిపించేలా వూదాపచ్చరంగులో వెలుగుతూ ఎగురుతున్న గాలిపటాన్ని. క్షణంసేపుమాత్రమే. . . ఇలా కనిపించి అలా మాయమైంది.
“అమ్మా! అక్కడ చూడు, గాలిపటం. నక్షత్రాలమధ్యని ఎగురుతోంది” చెయ్యి చూపిస్తూ వుద్విగ్నంగా అరిచాడు. వాళ్ళు తలతిప్పి చూసేసరికి అక్కడ ఏమీలేదు.
ఆమో తల్లితండ్రులు ముఖాలు చూసుకున్నారు. రమేష్ మరింక ఆలస్యం చెయ్యకుండా సైకియాట్రిస్టు అపాయింటుమెంటు తీసుకున్నాడు ఆమోకోసం. అప్పటికే సంధ్య ఆమో కలగురించీ అతనడిగిన ప్రశ్నగురించీ చెప్పింది. మర్నాడు ఇద్దరూ కలిసి ఆమోని డాక్టరు దగ్గిరకి తీసుకెళ్ళారు.
“బజార్లో పనుంది. నువ్వు కొద్దిసేపు ఇక్కడే ఈ అంకుల్‍తో మాట్లాడుతూ, బొమ్మలవీ చూస్తూ వుండు. మేం పని చూసుకుని వచ్చేస్తాం” అక్కడికెళ్ళాక చెప్పాడు రమేష్ . అసలెప్పుడూ చూడని వ్యక్తితో గడపడం చిన్నపిల్లలకి ఇష్టం వుండదు. ఆమో ఏడుపుముఖంపెట్టాడు.
“కొద్దిసేపే. మాతో వస్తే నీకు బోర్ కొడుతుంది. అక్కడ ప్లేజోన్ వుండదు ఇక్కడైతే బోలెడన్నీ పెట్స్, బొమ్మలూ, కామిక్ పుస్తకాలూ వున్నాయి” సంధ్య ఎంతో నచ్చజెప్పాక వప్పుకున్నాడు.
అది హాస్పిటలనీ పృథ్వీరాజ్ డాక్టరనీ పెద్దయేదాకా ఆమోకి తెలియలేదు. లోపలికి అడుగుపెట్టగానే రెండు బొచ్చుకుక్కపిల్లలు గెంతుతూ ఎదురొచ్చాయి. మందుల్లేవు. స్పిరిటువాసన లేదు. నర్సులూ కాంపౌండరూ లేరు. పైగా పృథ్వీరాజ్ టేబుల్ మీది వేస్‍లో రకరకాల పువ్వులున్నాయి. ఒక ట్రేలో పళ్ళూ స్నాక్సూ వున్నాయి.
పృథ్వీరాజ్ చాలా మంచివాడు. ఆమోకి బాగా నచ్చాడు. ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆమో స్కూలుగురించీ, టీచర్లగురించీ, ఇంటిదగ్గిరా స్కూల్లోనూ అతనికున్న స్నేహితులగురించీ , స్నేహితులంతా కలిసి ఆడుకునే ఆటలు, బొమ్మలు, చదివే పుస్తకాలు, ఇలా ఎన్నో విషయాలు మాట్లాడాక, ఆమోకి వచ్చిన కలగురించీ, అతను చూసిన గాలిపటాన్నిగురించీ అడిగాడు పృథ్వీరాజ్. ఆమో ఏదీ దాచకుండా చెప్పేసాడు.
“ఫన్నీ!” అంటూనే కుతూహలంగా విన్నాడు పృథ్వీరాజ్.”పద్మమాలిక, మైత్రీపాలుడు అనే పేర్లు నీకెలా తెలిసాయి?” అడిగాడు.
“ఏమో! కలలో అలా అనిపించింది”
“వాళ్ళు నీకు బాగా తెలిసినట్టనిపించిందా? గుర్రంమీద వచ్చి రాజకుమారిని ఎత్తుకెళ్ళినది నువ్వేనా . . . చందమామ కథలోలా?”
“నేను కాదు”
“మరి మైత్రీపాలుడివా? రాజకుమారికోసం కత్తిపట్టుకుని యుద్ధం చేసావా?”
“నేనసలు మైత్రీపాలుణ్ణి చూడనేలేదు”
“కథలో మరి నువ్వెవరు?”
“నేను లేను”
ఆమోకి తనన్న జవాబు తనకే తికమకగా అనిపించింది. నిజమే. కలలో తను కనిపించలేదు. తనెవరు? అసలలా ఎవరి కలలో వాళ్ళకి వాళ్ళు కనిపిస్తారా? అది కథా? కలా? కథ కలలా వచ్చిందా?
“ఆ గాలిపటం మాటేమిటి? నువ్వొక్కడివే చూసావా? అమ్మావాళ్ళూ చూడలేదా?”
“చాలా కొంచెంసేపు కనిపించింది. నేను వాళ్ళకి చెప్పేంతలోనే మాయమైపోయింది.”
“గాలిపటం ఎక్కడన్నా మెరుస్తుందా? అంతెత్తుకి ఎగురుతుందా?”
“ఏమో తెలీదు. కానీ దాన్ని నేను చూసాను.”
“నక్షత్రాలమధ్యనా? రాజకుమారి వుందా, దానిమీద? ” ఆయన నవ్వుతూ అడిగాడు.
“కనిపించలేదు. గాలిపటం చాలా ఎత్తుని ఎగిరిందికదా?”
పృథ్వీరాజ్ ఈమాటు పెద్దగానే నవ్వేసి, ఆమో భుజం తట్టాడు.
” మీ అమ్మానాన్నలు వచ్చారేమో చూడు. వస్తే బయట కూర్చుని వుంటారు. వెళ్ళి పిలుస్తావా?” అని అడిగాడు. ఆమో తలూపి వెళ్ళేలోపు వాళ్లే లోపలికి వచ్చారు. పృథ్వీరాజ్ తో చాలాసేపు మాట్లాడారు. ఆమోకి వాళ్ళ సంభాషణ అర్థంకాక ఆసక్తి కలగలేదు. కామిక్స్ చదువుతూ కూర్చున్నాడు.
“ఆమోకి ఏమీ అవలేదు. చాలా తెలివైన పిల్లవాడు. చురుకైనవాడు. మీరేమీ భయపడక్కర్లేదు. ఐతే అతనికి కొన్ని హెలూసినేషన్స్ వున్నాయి. కథల పుస్తకాలవీ చదువుతాడుకదా, వాటిగురించే ఆలోచిస్తూ పడుకుంటే అవే కలల్లోకి వస్తాయి. ఆలోచించడం అనేది అతని వయసుకి చాలా పెద్ద మాట. పుస్తకాల్లో చదివినవీ టీవీలోనూ కంప్యూటర్లో చదివినవీ, చూసినవీ మనసుమీద ముద్రపడి అవే కలలుగా వస్తున్నాయి. పెద్ద ప్రమాదకరం ఏమీ కాదు. వయసు పెరుగుతున్నకొద్దీ తగ్గిపోతాయి. ఒక టేబ్లెట్ రాస్తాను. ఆరునెలలపాటు వాడండి. మనసుకి నిలకడ వస్తుంది” అన్నాడు పృథ్వీరాజ్.
ముగ్గురూ ఇంటికి తిరిగి వచ్చేసారు.
“ఆయనెవరు?” దార్లో అడిగాడు ఆమో.
“సైకియాట్రిస్ట్”
రమేష్ టేబ్లెట్స్ తెస్తానన్నారు.
“వాడికేమీ లేదు.” సంధ్య ప్రిస్క్రిప్షన్ చింపి పారేసింది.
ఆమోకి ఏమీ అర్థమవలేదు. అర్థంకాని, ఆసక్తిలేని ఎన్నో విషయాల్లాగే అదికూడా మరుగుని పడిపోయింది. తరువాత చాలా ఏళ్లకి సైకాలజీ అనే సబ్జెక్టు వుంటుందని తెలిసే వయసు వచ్చాక తల్లిదండ్రులు తన గురించి ఆ కోణంలో భయపడ్డారని అర్థమైంది.
ఆ క్షణాన్నించీ అతని జీవనగతిని నిర్దేశించినవి ఆ రెండే- పద్మమాలిక కల, వూదాపచ్చ గాలిపటం.
ఆ కల మళ్ళీ మళ్ళీ వస్తునే వుంది. కల వచ్చినప్పుడల్లా గాలిపటం కనిపిస్తునే వుంది.
తను ఎప్పుడూ చూడని పరిసరాలు, ఏమాత్రం పరిచయం లేని, ఈ కాలానికి సంబంధించని, వ్యక్తులు తన కలల్లోనూ జ్ఞాపకాలలోనూ ఎందుకు పదేపదే కదుల్తున్నారు? ఎవరా పద్మమాలిక? ఆమె ఎలుగెత్తి పిలిచిన మైత్రీపాలుడెవరు? ఆమెని ఎత్తుకెళ్ళినవాడెవరు? వాళ్ళ గురించి తనకెందుకీ బాధ? ఈ ఆందోళనేమిటి? తనకేమిటి సంబంధం? వాళ్ళెవరో తనకెలా తెలుస్తుంది? వాళ్ళని ఎలా కలవగలడు? ఇవి నిరంతరం అతన్ని వేధించే ప్రశ్నలు.
ఆ గాలిపటమేమిటి, వింతైన రంగులో అలా కనిపిస్తుంది? పృథ్వీరాజ్ అన్నట్టు మామూలు గాలిపటం అంత ఎత్తుని ఎగరగలదా? దాన్ని అందుకోవాలంటే అంతరిక్షంలో విహరించాలి. ఆ కలగురించి తెలుసుకోవాలంటే కాలంలో ప్రయాణించాలి. ఈ రెండూ అతని గమ్యంగా రూపుదిద్దుకున్నాయి.


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s