ఊదాపచ్చనౌక 4 by S Sridevi

దాదాపు పదివేల ఎకరాల వైశాల్యంలో విస్తరించుకుని వుంటుంది భారత్ ఆస్ట్రనామికల్ సొసైటీ. మొదట కేవలం అంతరిక్ష పరిశోధనలకోసమే ప్రారంభమైనా తరువాత అనేక దిశలుగా విస్తరించింది. పంథొమ్మిదివందల తొంభై దశకంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో మొదలైన సాంకేతిక విప్లవం భారతసమాజంలో మానవవిలువల్ని మూడు దిశలుగా దెబ్బతీసింది.
ఎదిగీ ఎదగని వయసులోనే పెద్దపెద్ద జీతాలతో వుద్యోగాలు వచ్చి పిల్లలు తల్లిదండ్రులకి దూరంగా ఎక్కడెక్కడో వుద్యోగాలు చెయ్యడంతో మొదలైంది ఈ అపక్రమం. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నాక విపరీతమైన ఆర్థిక స్వేచ్ఛతో వేరువేరు వ్యక్తులుగానే వుంటూ కుటుంబజీవనం చెయ్యటం వరకూ కొనసాగి, చివరికి చాలా పెళ్ళిళ్ళు విచ్ఛిన్నమయాయి. వాళ్ళూ, చేసుకున్న పెళ్ళి నిలుస్తుందో నిలవదో అన్న సంకోచంతో వాళ్ళు కన్న పిల్లలూ నిర్మించిన సమాజం ప్రస్తుతం వుంది. ఇది మొదటి దెబ్బ.
ఒక వ్యాపారవేత్తకో, పారిశ్రామికవేత్తకో డబ్బుంటే దానితో అతడు తన పరిధుల్ని విస్తరించుకుంటాడు. కానీ మధ్యతరగతి కుటుంబాలలో ఎక్కువైన డబ్బు విలాసాలకీ, సుఖలాలసకీ, వస్తువినిమయసంస్కృతికీ దారితీసింది. సంపాదించు, అనుభవించు. . . అనే కొత్త సిద్ధాంతం మొదలైంది. కంప్యూటరు తీస్తే సెల్ ఫోన్ తెరిస్తే శృంగారం . . . విశృంఖల శృంగారం. . . హింస. . . గమ్యం, మార్గనిర్దేశికత లేని ప్రయాణం యువతని నిర్వీర్యం చేసి౦ది. మితిమీరిన స్వార్థం, ప్రపంచంలో వున్నవన్నీ కంటికి నచ్చినవన్నీ తమకే కావాలన్న ఆశ, మితిమీరిన పోటీ. ఇది రెండవ దెబ్బ. దేశం నాలుగైదు తరాల యువతని దేశనిర్మాణంలో భాగం కాకుండా కోల్పోయింది.
ప్రభుత్వఖర్చుతో పేరున్న విద్యాలయాల్లో పెద్దచదువులు చదివిన యువత ఇక్కడ తమ అభిరుచికి తగిన అవకాశాలు కోరుకున్నంత జీతాలు దొరకని కారణాన విదేశాలకి వలస వెళ్ళి తమ మేథోశక్తిని అక్కడ వినియోగించడం అనేది మూడో దెబ్బ.
కొంతంది అంకితభావంగల శాస్త్రవేత్తల కృషివలన అంతరిక్ష పరిశోధనలకోసమే ఆవిర్భవించిన బాస్ ఈ పరిస్థితుల్ని సమీక్షించుకుంది. ప్రభుత్వోద్యోగాలు చెయ్యటానికి ఎవరూ ముందుకి రావడంలేదు, అందులోనూ ఈ అడివిలాంటి చోట. ఉద్యోగాలని చదువుతో అనుసంధానించింది. అదికూడా ఆకర్షణ కాలేకపోయింది. చదువుని కింది స్థాయికి తీసుకెళ్ళింది. అదీ వుపయోగపడలేదు. ఇంకా. . . ఇంకా కింది స్థాయికి తీసుకెళ్ళింది. నాణ్యతగల చదువు. . .విలువలతో కూడిన చదువు. . . విలాసాలకి అలవాటుపడిన ప్రజలకి అదీ అక్కర్లేకపోయింది. ఎవరూ తమ పిల్లలని ఏ స్థాయిలోనూ పంపడానికి ముందుకి రాలేదు.
వీధిపిల్లల్ని చేరదీసి చదువు చెప్పడం మొదలుపెట్టింది బాస్. . . చాలా నిస్సహాయంగా. ఒకవైపు అంతరిక్షప్రయోగాలు చేస్తూనే వారిని తన ఆయుధాలుగా మలుచుకుని, తీర్చి దిద్ది, సమాజంలోకి పంపింది.
అందరూ ఒకేలాంటి తెలివైనవారు వుండరు. కొందరు కెమిస్ట్రీకి స్పందిస్తే మరికొందరి మనసు ఫిజిక్స్‌కి రంజిస్తుంది. కొందరి కళ్ళు కఠినమైన లెక్కని చూడగానే గుప్పుమని మెరిస్తే మరికొందరికి అంతే కరుకైన రాయిని చూడగానే అందమైన వూహలు కళ్ళముందు కదుల్తాయి. కొందరు అసలేమీ నేర్చుకోరు. చదువుకోరు. వారూ బతకాలి. ఆకలి వాళ్ళ పీడకల. కడుపునిండా తినగలగటం వారు కనవలసిన స్వప్నం. తిండికి సంపాదిబంచుకోవడం వారు నేర్చుకోవలసిన విద్య. ఆ పిల్లలందరికీ కలలు కనటం నేర్పి, వాటిని సాధ్యం చేసి౦ది బాస్.
కొన్ని పదుల సంవత్సరాల కృషి . . . వృధాగా పోలేదు. అతికొద్దిమంది గుర్తించారు. వారిలో కొద్దిమంది కుతూహలంగా ఫలితాలకోసం నిరీక్షించారు. అలా మొదలైన కదలిక బాస్‍ని ఇప్పటి ఈ స్థాయికి చేర్చింది. ఉత్తమమైన చదువుకీ దేశ ప్రగతికీ కేరాఫ్ అడ్రెసైంది. తన దగ్గిర ఏం వుందో దాన్ని ప్రజలకి ఇవ్వడం కాదు, వాళ్ళకేం కావాలో దాన్ని అందిస్తుంది. వ్యవసాయం, వ్యాపారం, వుత్పత్తి, పరిశ్రమ, సేవ. . . ఏ రంగంలో ఎవరికి ఏది కావాలంటే దాన్ని విద్యగా మలిచి అందజేస్తోంది బాస్. ఈ పరిక్రమంలో గ్రామాలనీ, పట్టణాలనీ దత్తత తీసుకుంది.
సమున్నతమైన బాస్ భవనాలనీ కార్యాలయాలనీ చూస్తుంటే బాస్ ఆవిర్భావాన్నించీ ఇప్పటిదాకా జరిగిన ప్రస్థానంలోని ప్రతి అడుగూ గుర్తొచ్చింది ఆమోకి. ఇక్కడ చేరినప్పుడు పాఠ్యాంశాలుగా నేర్చుకున్నాడు.
ఆమో వెళ్ళేసరికి శ్యాం తన సీట్లోనే వున్నాడు. అతన్ని చూడగానే లేచి ఎదురొచ్చి ఆత్మీయంగా కౌగిలించున్నాడు.
“ఎలా వున్నావు ఆమో? నిన్ను మేమంతా చాలా మిస్ చేస్తున్నాం” అన్నాడు కుర్చీ చూపించి తను కూర్చుంటూ.
అతన్నుంచీ అంత సౌహార్ద్రత ఆమో వూహించనిది. టైం హంట్ గురించి ప్రయోగాలు వద్దని నిర్మొహమాటటగా చెప్పి తనని గాయపరిచిన వ్యక్తి . . . అదంతా మర్చిపోయి తమమధ్య ఏమీ జరగనట్టు ఎలా మాట్లాడగలుగుతున్నాడు?
“హౌఆర్ థింగ్స్ దేర్? ” అని తర్వాతి ప్రశ్న వేసాడు.
“ఫైన్”
ప్రాజెక్ట్ సాఫ్ట్ కాపీని శ్యాంకి ఇచ్చాడు. హాకి౦గ్ భయంవలన ఫస్ట్ హేండు ఇన్ఫర్మేషన్ని నెట్లో వుంచరు. డాటా ట్రాన్స్ మిషన్‍కి కంపాక్ట్ డిస్క్‌కి ప్రత్యామ్నాయంగా వచ్చిన నానో డిస్క్‌లు వాడతారు. డిస్క్‌ని శ్యాం సిస్టంలో వేసి, ఒకొక్కటీ వివరిస్తున్నాడు ఆమో.
తను కేప్చర్ చేసిన యూఎఫ్‍ఓ ఫొటోలు . . . సాసరుమీద కప్పు బోర్లించినట్టుండే ఒక మామూలు వ్యోమనౌకనుంచీ వూదాపచ్చరంగులోకి మారి, అపరిమితమైన వేగంతో వున్నచోటే తిరిగి అదృశ్యమైన విజువల్‍ని అతను విస్మయంగా చూసాడు.
“ఆమో! యూఆర్ అన్ బీటబుల్” అన్నాడు ఇంకేమీ మాట్లాడటానికి లేనట్టు. “నువ్వనుకుంటున్నట్టుగా అది కాలనౌకేనా?” అడిగాడు. ఆమో తలెత్తి చురుగ్గా చూసాడు. అతని కోపాన్ని శ్యాం పట్టించుకునే స్థితిలో లేడు. అంత ఆశ్చర్యంలో తలమునకలుగా వున్నాడు. పదేపదే ఆ వీడియోని రివైండ్ చేసి చూస్తున్నాడు.
“బాస్ ఆ దిశగా ప్రయోగాలు వద్దందికదా, ఆపేసాను. ఇప్పుడేంచెయ్యాలో ఛెయిర్ పర్సన్ గా మీరే చెప్పాలి” అన్నాడు.
శ్యామ్ చిన్న నవ్వాడు ” ఆమో! బాస్ వద్దన్నది నీ ప్రయోగాలని కాదు, ఆ పేరుతో వద్దని” అన్నాడు. ఆమో కుడి మెదడులో వుండే వైట్‍మేటర్‍లో చిన్న మెరుపు మెరిసినట్టైంది.
“బాస్ కేవలం ఒక సంస్థమాత్రమే కాదు, వ్యవస్థ. ప్రతివారూ దీన్ని తమదిగానే భావిస్తారు, చిన్న అపజయాన్నికూడా తట్టుకోలేనంత పొజెసివ్‍నె‍స్‍తో. ప్రయోగాలన్నాక వైఫల్యాలు తప్పవు. కానీ టైం ట్రావెల్ అనేది ప్రోవెన్ ఇంపాజిబులిటీ. దానిమీద మళ్ళీ ప్రయోగాలంటే చాలా వ్యతిరేకతని ఎదుర్కోవాలి. అది అవసరమా?” అతని గొంతు చిన్నపిల్లవాడికి నచ్చజెప్తున్నట్టుగా చాలా మంద్రస్థాయిలో వుంది.
ఆమోకి అర్థమైంది. తను ఈ ప్రయోగాలని చెయ్యాలి, వేరే ప్రయోజనం కోసం. ఒకవేళ అది కాలనౌకే అయితే యాదృచ్ఛికంగా కనిపెట్టినట్టౌతుంది. తనకి తగినంత క్రెడిట్ రాదు. ఆమో కాలనౌకని కనిపెట్టాడని అనరు. యూఎఫ్‍వోలమీద ప్రయోగాలు చేస్తుంటే ఇది బయటపడింది అంటారు. ఐనాసరే, ఈ ప్రయోగాన్ని తను కొనసాగించాలి.
తన వ్యక్తిగత అవసరంకోసం. . . కాలగమనంలో ఎక్కడో చిక్కుపడిపోయి ఒక చిక్కుముడిలా జ్ఞాపకాలలో కదుల్తూ నిరంతరం వెంటాడే పద్మమాలికనీ, మైత్రీపాలుడినీ వెతికిపట్టుకోవాలంటే ఆ కాలనౌకని పట్టుకుని తీరాలి.
బారతదేశపు చరిత్రలో ఒక శాస్త్రవేత్తగా తన వునికిని స్థిరపరుచుకునేందుకు కూడా ప్రయోగాలని కొనసాగించాల్సిన అవసరం వుంది ఆమోకి. అతను చేసే ప్రయోగాలకి బాస్ సహకారం కావాలి. ఈ పరికరాలు, ప్రయోగశాల ఇవన్నీ స్వంతంగా సమకూర్చుకోలేడు. ఒక నిరంతర విద్యార్థికి ఇక్కడ లభించే అవకాశాలు అతను వదులుకోలేడు. కొన్నిటిని కోరుకున్నప్పుడు ఇంకొన్నిటిని వదులుకోవడానికి సిద్ధంగా వుండాలి.
ఒక్క క్షణంసేపు బాస్ కోణంలోంచీకూడా ఆలోచించాడు. అర్థమైంది. అతికష్టంమీద సంపాదించుకున్న ఈ స్థానాన్ని, దేశంలోని యువతకి దిశానిర్దేశం చెయ్యగలిగి, అందరికీ జీవితంలో ఒక్కసారేనా చేరుకోవలిసినంత అత్యుత్తమమైనదిగా మలుచుకున్న స్థానాన్ని ఒకరి వ్యక్తిగత ప్రయోజనంకోసం రిస్క్‌లో పెట్టుకోవలిసిన అవసరం బాస్‍కి వున్నట్టు అనిపించలేదు.
ఈ విషయాలన్నిటినీ ఆమో అతికొద్ది సమయంలో సమీక్షించుకున్నాడు. మనసు సరిచేసుకున్నాడు. ముభావాన్ని వదిలిపెట్టి శ్యాంతో మామూలుగా వుండే ప్రయత్నంచేసాడు. కొద్దిసేపటికి ప్రయత్నపూర్వకంగా అంటే కృతకంగా మొదలుపెట్టిన సంభాషణ సహజటగా మారిపోయింది.
అంతరిక్షంలో పరిస్థితులగురించీ, అక్కడి లేబ్ గురించీ ఎన్నో ప్రశ్నలు అడిగాడు శ్యాం. అతనికి అంతరిక్షప్రయోగాలమీద చాలా ఆసక్తి వుంది.
“ఎంబియ్యే చేసి ఈ సీట్లో కూర్చున్నానుగానీ నాకు మీరు చేసే ప్రయోగాలంటే చాలా ఆసక్తి. ముఖ్యంగా నువ్వు స్పేస్‍లోకి వెళ్ళేవంటే రిజల్ట్స్ కోసం ఎంతో ఎదురుచూస్తాను” అన్నాడు.
“మన లేబ్ వున్నచోట యూ‍ఎఫ్‍వోలు తరుచుగా కనిపిస్తాయి. ఐతే అవి చాలా దూరంలో వుంటాయి. ఇలా కనిపించి అలా మాయమైపోతుంటాయి. ఈ ప్రయోగాన్ని ముగించడానికి మరో ఆర్నెల్ల టైం కావాలి నాకు. ఈ దూరాలని కచ్చితంగా అంచనా వేసి చెప్పగలిగే ఆస్ట్రోఫిజిస్ట్‌ని నాకు తోడుగా వుండేలా పంపగలరేమో చూడండి” అన్నాడు ఆమో.
శ్యాం కొద్ది క్షణాలు ఆలోచించాడు.
“ధన్యాపార్థసారథి అని. . . కొత్తగా వచ్చిన ఆస్ట్రోఫిజిస్ట్. చాలా తెలివైన అమ్మాయి. ఈ మధ్యనే మాస్టర్స్ పూర్తిచేసి, రిసెర్చి అవకాశంకోసం చూస్తోంది. స్పేస్‍లో చెయ్యడానికికూడా అప్లికేషన్ పెట్టుకుంది. ఆమె కళ్ళల్లో కోన్స్, రాడ్స్ వుండవు. మూలమట్టాలు, వృత్తలేఖినులు వుంటాయి. మెదడులో న్యూరాన్లు వుండవు. అంకెలుంటాయి. నీకు పెర్ఫెక్ట్‌గా సూటౌతుంది. తనని రికమెండ్ చేయనా?” అడిగి అతని జవాబుకోసం ఎదురు చూడకుండా చెప్పడం అవగానే ఆమెకి ఫోన్ చేసి ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రమ్మని అభ్యర్ధించాడు.
ఈలోగా ఆమో ఇచ్చిన డిస్క్‌ని మొదటిసారి చూసినంత సంభ్రమంగా మరోసారి చూడసాగాడు శ్యాం. ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆమో జావాబులు చెప్తున్నాడు.
గది గుమ్మం దగ్గిర మృదువైన చప్పుడు. . . ఆమో తలతిప్పి చూసాడు. అప్పుడే విచ్చుకున్న గులాబీల పరిమళం. . . లావెండర్ పరిమళాలతో మిళితమై ముక్కుని తాకింది. బాదంరంగు ప్రింటున్న లేతగులాబీరంగు కాటన్ చీర, బ్లౌజు, పొడవైన జడ, అందులో జంటగులాబీలు. . . ఇప్పటి ఆడపిల్లలు ఇలాగే వుంటున్నారు. ట్రెండు, ఫాషన్లు మారాయి.
ఆమేనా ధన్య? తీవ్రమైన భావసంచలనం కలిగింది. ఎంతో కాలం తర్వాత కలుసుకున్న పాత మితృరాలిని. . . ప్రాణస్నేహితురాలిని . . . చూసినట్టనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే నెగటివ్‍గా ఛార్జైవున్న అణువు పాజిటివ్‍గా ఛార్జైవున్న అణువు చుట్టూ ఎలా తిరుగుతుందో అలా౦టి స్థితికి చేరుకుంది అతని మనసు. . . మొదటిచూపులోనే.
అతన్ని చూడగానే ఆమె కళ్ళలో ఆశ్చర్యం, గౌరవం. . . ఇంకా అలాంటి ఎన్నెన్నో భావాలు.
“శ్యాం, దేనికి రమ్మన్నారు?” లోపలికి వస్తూ అడిగింది.
“ఆమో! తనే ధన్య. . . ధన్యాపార్థసారథి. . . ” అని ఆమెని పరిచయం చేసి, ఆమోని చూపిస్తూ,
“ఎలాంటి పరిచయం అక్కర్లేని వ్యక్తి. మా అందరికీ ప్రియమైన ఆమో. ప్రొఫైల్ నేమ్ ఆనందమోహన్” అన్నాడు.
“తెలుసు” చిరునవ్వుతో అంది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s