ఊదాపచ్చనౌక 5 by S Sridevi

ఆమో చెయ్యి చాపాడు. ఆమె చెయ్యి మృదువైన పూమొగ్గలా అతని చేతిలో ఇమిడిపోయింది. ఆమె సన్నగా కంపించడం తెలుస్తోంది. ఎందుకలా? ఆమె స్పర్శలోంచీ సాన్నిహిత్యం ఒక వరదలా ఆమోలోకి ప్రవహించింది. తెలియని అలజడి. ఎందుకలా? చెయ్యి వదిలేసాడు.
“స్కూల్లో చదువుతున్నప్పట్నుంచీ బాస్‍లో చదివే పిల్లలగురించి తరుచు చెప్పేవారు మా టీచర్లు. మీగురించి చాలా వినేవాళ్ళం. అప్పట్నుంచీ హీరో వర్షిపే. మీ ఆర్టికల్స్ ఒక్కటీ వదలకుండా చదువుతాను. మిమ్మల్ని చూసే అవకాశంకోసం చాలా ఎదురు చూసాను” అంది.
ఆమో చిరునవ్వు నవ్వాడు. తన కలలాగా, వూదాపచ్చ గాలిపటంలాగా తమ కలయికకూడా జీవితాన్ని నిర్దేశించే మరో బలమైన శక్తి కాగలదని అనిపించింది అతనికి.
శ్యాం ఆమెకి కుర్చీ చూపించాడు. థేంక్స్ చెప్పి కూర్చుంది. ఆమో ఇచ్చిన డిస్క్ చూపించాడు. చాలా ఆసక్తిగా చూసింది పీపీటీ క్రిస్టల్ని అతను కాలనౌక అనటం ఆమెకి బాగా నచ్చింది.
“ఆమో ప్రయోగాలు ఇంకా పూర్తవలేదు. మళ్ళీ వెళ్ళబోతున్నాడు. నువ్వూ అతనితో వెళ్తావా?” సంభాషణమధ్య అడిగాడు శ్యాం.
ఆమె షాకైంది. స్పేస్‍లోకి ఎవర్నేనా పంపించాలంటే దానికి చాలా ప్రొసీజరు వుంటుంది. వెయిటింగ్ లిస్టే కొండవీటి చాంతాడంత వుంటుంది. తను చాలా జూనియరు. అలాంటిది తనని రికమెండు చెయ్యటం. . . ఇంత పెద్దపెద్ద నిర్ణయాలు ఇలాంటి ఇన్‍ఫార్మల్ మీటింగ్స్‌లో తీసుకుంటారంటే నమ్మలేకపోయింది.
“ఇప్పటిదాకా నేను మూడుసార్లు స్పేస్‍లోకి వెళ్ళాను. ఒకసారి కెమిస్టుతోటీ మరోసారి ఫిజిస్ట్‌తోటీ మూడోసారి బయాలజిస్ట్‌తోటీ కలిసి పని చేసాను. ఇప్పుడు నాకు నా ఫీల్డులోనే వున్నవాళ్ళ హెల్ప్ కావాలి. సీనియర్సైతే ఎవరి ప్రయోగాలు వాళ్ళవి. కలిసి పనిచెయ్యగలిగే అవకాశం వుండదు” వివరించాడు ఆమో.
ధన్యకి వివరణ అక్కర్లేకపోయింది. సంభ్రమంలో తలమునుకలుగా వుంది.
“ఆ పీపీటీ క్రిస్టల్ని ఎలాగైనా పట్టుకోవాలి ఆమో! నువ్వది చెయ్యగలవు. నువ్వుమాత్రమే చెయ్యగలవు. నీకేం కావాలో చెప్పు. అవసరమైతే నేను ప్రిమియర్‍తో స్వయంగా మాట్లాడుతాను. కానీ నేను చెప్పింది మర్చిపోవుకదా? మనం గ్రహాంతరవాసుల స్పేస్‍షిప్ పట్టుకోబోతున్నాం, కాలనౌకని కాదు. నో టైం హంట్స్. సరేనా?” అన్నాడు శ్యా౦. ఆమో సగం తృప్తితో తలూపాడు.
“ముందు మన స్పేస్‍లాబ్‍కీ దానికీ మధ్యగల దూరం, ఏ కోణంలోనైతే అది తక్కువగా వుంటుందో ఆ కోణం ఇవన్నీ లెక్క వెయ్యాలి. అత్యంత బలమైన లేజర్ అయస్కాంతాన్ని తయారు చెయ్యాలి. అది ఆ నౌకని మన షిప్ వైపు ఆకర్షించాలి. వీటికి నేను ప్రాజెక్టు తయారుచేసి ఇస్తాను” అన్నాడు.
“మీరు చెప్పిన దూరాలని నేను లెక్క వెయ్యగలను” అంది ధన్య.
ఆమో తలూపాడు.
క్రమంగా ఆమో, శ్యాం జనరల్ టాపిక్స్‌లో పడేసరికి వెళ్తానని లేచింది ధన్య. “ఇంకా చాలామందిని కలవాలి శ్యాం. మళ్ళీ వస్తాను” అని ఆమోకూడా లేచాడు.
ఇద్దరూ కాంపస్‍లో పక్కపక్కని నడుస్తున్నారు. ధన్య ఫ్రీగా వుండలేకపోతోంది. ఆమె సన్నగా కంపించడం పక్కని నడుస్తున్న ఆమోకి తెలుస్తోంది. అది భయం మాత్రం కచ్చితంగా కాదు. మరేమిటి? తన వునికిని గుర్తించినట్టు ఆమె స్పందనా? తనలాగే ఆమె‍కూడా దగ్గరితనాన్ని అనుభవిస్తోందా?
“నా క్వార్టర్ ఇక్కడే. అభ్యంతరం లేకపోతే ఒక కప్పు టీ. . . ” అడిగింది. ఆమో తలూపాడు. ఆమెని అప్పుడే వదిలిపెట్టి వెళ్ళాలని లేదు . ఇంకొంతసేపు గడపాలని వుంది.
ఇద్దరూ కలిసి ధన్య క్వార్టర్‍కి వెళ్ళారు. విశాలమైన ఆవరణలో కట్టిన ఇండిపెండెంట్ క్వార్టర్స్ అవి. ఇన్‍టర్న్స్‌కి ఇస్తారు. ప్రతి విద్యార్థికీ ఏదో ఒక దశలో బాస్‍కి వచ్చి కనీసం ఆర్నెల్ల ఇన్‍టర్న్‌షిప్ చెయ్యాల్సి వుంటుంది. ఆ పిల్లలు ఇక్కడే వుంటారు. ఇది ఒకరకంగా చెప్పాలంటే బాస్ యొక్క బాహ్యపరిధి. ఆ తర్వాతేవాళ్ళకి కోర్స్ పూర్తిచేసినట్టు సర్టిఫికెట్, వుద్యోగార్హత వస్తాయి.
ఇంటిచుట్టూ నేలమీదా కుండీలలోనూ గులాబీ మొక్కలు. వాటినిండా విరగబూసిన పువ్వులు. ఇవేకాకుండా క్రీపర్స్. వాటినిండా గుత్తులుగుత్తులుగా తలుపు, ఎరుపు, గులాబీరంగు గులాబీలు. . . మనసునిండా వున్న ఇష్టంపైకి వొలికినట్టుగా వుంది.
“గులాబీలంటే మీకు ఇష్టమా? ” అని అడిగాడు.
“ప్రాణం” అంది “ఎవరు పెట్టారోగానీ నేను ఇక్కడికి వచ్చేప్పటికే చాలా మొక్కలున్నాయి. వాటన్నిటినీ ట్రిమ్ చేసి ఆర్డర్లో పెట్టాను. ఎన్నిపువ్వులో చూడండి. దాదాపు పది రంగులున్నాయి. ఒక్క పింక్‍లోనే ఐదారు షేడ్స్ వున్నాయి.”
ఆ డిజిటల్ ఫ్రేం పంపినది ఎవరు? ఆమో వూహకి అందీ అందనట్టుగా వుంది.
“ఐదు నిముషాలు కూర్చోండి. టీ చేసి తీసుకొస్తాను. తాగుతూ మాట్లాడుకుందాం” అని, చూడటానికి కొన్ని పుస్తకాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళింది. ఆమె వంటింట్లో చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి తరువాత టీ సువాసన. అన్నట్టుగానే ఐదునిముషాల్లో ట్రేలో రెండు కప్పులతో వచ్చింది. ఒకటి ఆమోకిచ్చి, రెండవది తను తీసుకుని అతని ఎదురుగా కూర్చుంది.
ఏమీ మాట్లాడుకోలేదు. మౌనమే ఇద్దరిమధ్యా సంభాషణ అయింది. ఎంతో కాలంగా పరిచయం వున్న వ్యక్తులు. . . ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసినవాళ్ళు మౌనంగానే భావాలు ఎలా పంచుకుంటారో అలా వుంది ఆమోకి. తెలియని ఒక ఆత్మీయత. . . ఎన్నో యుగాలుగా కలిసి వుంటున్నామన్న భావన. . .
వచ్చి చాలాసేపైంది, ఇంక వెళ్ళాలనే సూచన మెదడు ఇస్తున్నా దాన్ని పాటించలేకపోతున్నాడు. ధన్యలో వున్న ఏదో ఆకర్షణ అతన్ని కట్టిపడేస్తోంది.
“టీ చాలా బావుంది” అన్నాడు.
ఆమె కళ్ళు మెరిసాయి.
“ఇంకో కప్పు తాగుతారా? ” అడిగింది. ఆమో తలూపాడు. ఆమె వెంటనే వెళ్ళి కెటిల్ తెచ్చింది. రెండో కప్పు తాగాక ఇంకా అక్కడే వుండటానికి మరే కారణం కనిపించలేదు.
“ఇంక వెళ్తాను. థా౦క్స్ ఫర్ యువర్ టీ ” అన్నాడు అతి కష్టంమీద వెళ్ళడానికి లేస్తూ.
“వన్ మినిట్. ఇక్కడకి వచ్చి ఈ మొక్కదగ్గిర నిలబడండి. ఒక స్కెచ్చి గీస్తాను” అంది, పెన్సిలు, పాడ్ తెచ్చుకుని. ఫొటో తీసుకుందాం అనలేదు, సెల్ఫీ అనలేదు, బొమ్మ గీస్తానంది. ఆమో ఆమె చెప్పినట్టే వెళ్ళి నిండా పూలున్న గులాబీమొక్క వెనుక నిలబడ్డాడు.
కదలకండి, అలా నిలబడండి, ఇలా చెయ్యి వేయండి అని డైరెక్షన్స్ ఇస్తుందేమోననుకున్నాడు, ఏమీ లేదు, తిప్పలన్నీ తనే పడింది. యాంగిల్‍కి తనే సర్దుకుంది. చకచక పది పెన్సిలు గీతలు గీసి-
“ఇదుగో మీ బొమ్మ” అని చేతిలో పెట్టింది.
“వండ్రఫుల్” అన్నాడు ఆమో ఇంకేమీ మాట్లాడటానికి తోచక. తనెలా వున్నాడో అలాగే వున్నాడు. పూలమొక్కా అలాగే వుంది. బేక్ గ్రౌండూ అచ్చుగుద్దినట్టుంది. పెన్సిలు గీతల్లో ఇంత జీవం సాధ్యమా? అది అంత తేలికైన విద్య కాదు, ఆమె సాధన చేసి సాధ్యం చేసుకుని వుంటుంది.
“గులాబీరేకుల వర్షం. . .నేను . . . డిజిటల్ ఫోటో ఫ్రేం. . .పంపింది మీరేనా?” అడగకుండా వుండలేకపోయాడు. ఆమేనని అర్థమైంది. కానీ అడిగాడు.
“ఒక మేగజైన్లో పడ్డ మీ ఫోటో తీసుకుని ఫోటోషాప్‍లో చేసాను” అంది.
“థేంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. . . మరి నేను వెళ్తాను. ఇంకా చాలామందిని కలవాలి”
“మీ అంతటివారు పిలవగానే వచ్చినందుకు నేనే థేంక్స్ చెప్పాలి. బై.” అంది. మాటల్లో అలా అందిగానీ ఆమె చూపుల్లో ఒక దిగులు. . . కనీ కనిపించనట్టు. మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడుగుతున్నట్టే వుంది.
తొలి చూపులో ప్రేమ. . . నిజమేనా? సాధ్యపడుతుందా? అది ప్రేమేనా? మరేదైనా అనుబంధమా? క్రిందటి జన్మ తాలూకూ అసంపూర్ణ సమీకరణం తమ మధ్య వుందా? పూర్తి చెయ్యమని అది ప్రేరేపిస్తోందా? ఆమో తలనిండా ఎన్నో ప్రశ్నలు.
ఇంటికి వచ్చాడుగానీ మనసునిండా దిగులు. ఏదో కోల్పోయినట్టనిపిస్తోంది. ధన్య మరీమరీ కావాలనిపిస్తోంది. వెనక్కి వెళ్ళిపోవాలని బలమైన కోరిక. దాన్ని దాచుకుందుకు సంఘర్షణ. తాళం తీసుకుని మంచానికి అడ్డంగా వాలిపోయాడు. కళ్ళు మసగ్గా అనిపించాయి. చేత్తో తుడుచుకుంటే వెచ్చటి కన్నీళ్ళు తగిలాయి.
పద్మమాలిక. . . మైత్రీపాలుడు. . . వీళ్ళతో ముడిపడ్డ తన బాల్యం. . . వాళ్ళే నిర్దేశించిన తన ప్రస్తుతపు గమ్యం. ఎవరీ ధన్యాపార్థసారథి? గతంలో ఆమె ఎవరు? ఎందుకు తను అందర్లా వుండలేకపోతున్నాడు? ఒకే ఒక్కసారి చూసిన అమ్మాయిగురించి తనకంత ఆవేదన ఎందుకు? గుండె బరువెక్కిపోతోంది. ఆ బరువంతా కన్నీటిరూపాన్న వెలువడుతోంది. ఎంతసేపు అలా వున్నాడో. ఒళ్ళంతా వెచ్చగా అనిపించడం తెలిసింది. సమ్మెట్లతో కొడుతున్నంత బలంగా తలనెప్పి.
అటెండెంటు భోజనం తెచ్చి పెట్టాడు. దాన్ని వెనక్కి పంపేసి స్ట్రాంగ్ కాఫీ తెప్పించుకున్నాడు.
“ఏమైనా ప్రాబ్లమా ఆమో సాబ్?” అటెండెంట్ కళ్ళలోనూ మాటల్లోనూ ఆదుర్దా. ఆమో నుదురు, పక్కలు తాకి చూడాలన్న కోరికని బలంగా ఆపుకున్నాడు తామిద్దరి మధ్యా వున్న అంతరాన్ని గుర్తించి.
“అలాంటిదేమీ లేదు. పొద్దుట తిన్న టిఫెను అరగలేదు. కడుపులో బరువుగా వుంది”
“ఏమైనా కావాలంటే పిలవండి” అని చెప్పి అటెండెంటు వెళ్ళిపోయాడు.
పడుకుంటే వెంటనే గాడనిద్ర పట్టేసింది. దాదాపు రెండగంటల తర్వాత మెలకువ వచ్చింది.
సాయంత్రం ఐదింటికి ఫెలిసిటేషన్ వుంది. ఇంకో గంటవ్యవధి వుంది. దానికి కొంత ప్రిపేరయ్యాడు. మనసంతా అల్లకల్లోలంగానే వుంది. ధన్య గుర్తొస్తోంది. పద్మమాలిక అలజడి రేపుతోంది. మనసులోంచీ ఎవరిని తోసెయ్యాలో, ఎవరు లేకపోతే ప్రశాంతంగా వుంటుందో అర్థమవలేదు. అంతా గజిబిజిగా వుంది.
ఐదుగంటలకి కన్వెన్షన్ హాల్‍కి బయల్దేరాడు.
హాలంతా క్రిక్కిరిసిపోయి వుంది. బాస్ కేంపస్ కేంపసంతా అతనికోసం ఎదురుచూస్తోంది. ప్రవేశద్వారం దగ్గిరే హారతి ఇచ్చి పూలదండ వేసి మంగళవాయిద్యాలతో తీసుకెళ్ళారు. వేదిక దగ్గిరకి రాగానే శ్యాం సాదరంగా ఆహ్వానించాడు. ప్రిమియర్ చిరునవ్వు నవ్వారు.
“నువ్వు అసాధ్యుడివి” అనే భావం అందులో వ్యక్తమై౦ది.
హర్షధ్వానాలమధ్య ఆమో స్టేజి ఎక్కాడు. అతని కళ్ళు ధన్య కోసం వెతికాయి. ఆమె వవుంది. జనం మధ్య తప్పిపోయిన చిన్నపిల్లవాడికి తల్లి కనిపిస్తే ఎలా వుంటుందో అంత సంతోషం కలిగిందతనికి.
ఉపన్యాసాలు మొదలయాయి. ప్రిమియర్ ముందు మాట్లాడాడు. ఆ తర్వాత శ్యాం మాట్లాడాడు. ఆమో ప్రయోగాలు సీడీ వేసి చూపించారు. వూదాపచ్చరంగులోకి మారుతున్న ఫ్లయిగ్ సాసర్ని చూడగానే అందర్లో దిగ్భ్రాంతి. అదేంటి? అలా ఎందుకు మారుతోంది? ఎలా మారగలుగుతోంది? అందులో ఎవరున్నారు? ఏలియన్సా? ఎన్నోగుసగుసలు.
“ఇప్పటివరకూ ఇది మాత్రమే సాధించాం. ఇదేం చిన్న విజయం కాదు. ఇకముందు సాధించాల్సినది చాలా వుంది. ఆ ఫ్లయింగ్ సాసర్ని పట్టుకోవాలి. ఆ టెక్నాలజీ తెలుసుకోవాలి. . . అందుకు ఆమోయే సరైనవాడు. తను మొదలుపెట్టిన ప్రయోగాన్ని తనే పూర్తి చెయ్యాలి” అన్నాడు ప్రిమియర్. ఎక్కడా టైం హంట్ ప్రస్తావన లేదు.
“మన ప్రియతమ ఆమో! నిత్యం వార్తల్లోకి ఎక్కుతుండే యూఎఫ్‍ఓల రహస్యాన్ని బహిర్గతం చెయ్యబోతున్నాడు. గివ్ అ బిగ్ అప్లాజ్ ” అని శ్యాం అనగానే హాలంతా చప్పట్లతో మార్మోగింది.


“ఆమో. . . ఆమో! ఇలా చూడు. కళ్ళు తెరిచి చూడు. ఎలా వుంది నాన్నా?” తల్లి గొంతు. . .ఎక్కడో దిగంతాల అవతల్నుంచీ వినిపిస్తున్నట్టుగా. అతి కష్టమ్మీద కళ్ళు తెరిచి చూసాడు. కన్నీళ్ళతో తడిసిన తల్లి ముఖం. పక్కనే తండ్రిది. అతని ముఖంలోకి వంగి చూస్తూ ఆతృతగా అడుగుతోంది ఆమె.
ఏమైంది తనకి? గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించాడుకానీ సాధ్యపడలేదు. సమ్మెట్లతో కొడుతున్నట్టు తలనెప్పి. వెలుతురు భరించలేకపోతున్నాడు.
“స్పృహలోకి వచ్చాడుగా? నార్మలైపోతాడు. మీరేం కంగారుపడకండి” డాక్టరు అనటం వినిపించింది. తరువాత ఇంజెక్షను. నొప్పి. . . మళ్ళీ మగత.
ఇంకో రెండురోజులతర్వాత పూర్తిగా స్పృహలోకి వచ్చాడు.
“అబ్బ. చాలా భయపెట్టేసావురా! వారంరోజులైంది, వంటిమీద స్పృహన్నది లేదు. క్వార౦టైన్‍లోంచీ బయటికి వచ్చిన రోజే ఇలా జరగటంతో ఇన్‍ఫెక్ట్ అయావనుకున్నారు అంతా. రూంలో వళ్ళు తెలియకుండా పడివుంటే అటెండెంటు ఆఫీసులో చెప్పాడట. వాళ్లు వెంటనే హాస్పిటల్లో చేర్చారు. ధన్య అనీ. . . ఇదుగో, ఈ అమ్మాయే మేం వచ్చేదాకా నిన్ను చూసుకుంది” అంది సంధ్య పక్కనే నిలబడి వున్న ధన్యని చూపిస్తూ.
ఆమోకి ఒకొక్కటీ గుర్తొచ్చింది. ధన్యకోసం తను ఏడ్చాడని గుర్తొచ్చి, సిగ్గుతో ముఖం ఎర్రబడిపోయింది. ఆమెని సూటిగా చూడలేకపోయాడు. ఆ సాయంత్రం ఫెలిసిటేషన్ మీటింగ్‍కి వెళ్ళాడు. అక్కడినుంచీ ఎలా ఇంటికి వచ్చాడో గుర్తులేదు. ఆ తర్వాత ఏం జరిగిందోకూడా గుర్తు రాలేదు. ఒక్కటి మాత్రం అర్థమైంది. ధన్య తనని చాలా డిస్టర్బ్ చేసింది.
“మీకు జ్వరం వచ్చిందనీ హాస్పిటల్లో చేర్చారనీ శ్యాం నాకు ఫోన్ చేసి చెప్పారు. మీ ఫెరెంట్స్ వచ్చేదాకా హాస్పిటల్లో వుంటానన్నాను. . .ఇన్ ఫాక్ట్. . . అవసరం లేదన్నారనుకోండి, కానీ నేనలా వదిలిపెట్టలేకపోయాను. నేను అడగ్గానే మా యింటికి వచ్చారు, టీ తాగారు, మళ్ళీ ఫెలిసిటేషన్లో చూసాను. ఇలా మంచంమీద స్పృహలేకు౦డా వుండటం చూసి చాలా బాధనిపించింది. రెండురోజులు అసలు స్పృహలోనే లేరు. . . ఆస్ట్రానమిస్ట్ ఆమోని అలా చూసి తట్టుకోలేకపోయాను” అంది ధన్య.
అతను చిన్నగా నవ్వాడు. ఆమె ఎదురుగా వుండటం అతనికి చాలా సాంత్వననిచ్చింది. తను పొరబడ్డాడు. పద్మమాలిక తనలో రేపే అలజడికి జవాబు ధన్య. అంతేగానీ ధన్యే అలజడి కాదు.
“నేనింక ఇంటికి వెళ్తాను. ఫ్రెషై మళ్ళీ వస్తాను” అంది ధన్య. ఆమో ఆమె ముఖంలోకి చూసాడు. భావాలలో ఏదో స్వల్ప మార్పు.
“ఆమోని డిశ్చార్జి చేస్తామన్నారుగా, ఇంటికే వచ్చెయ్. ధన్యా! నీ భోజనం మా యింట్లోనే. నేనున్నన్నిరోజులూ మాతోనే తిందువుగాని” అంది సంధ్య.
“ఐతే ఆమోకోసం రసం చేసి తీసుకొస్తాను. నేను చాలా బాగా చేస్తాను” అని వెళ్ళిపోయింది.
“చాలా మంచి పిల్ల” అంది సంధ్య.
ఆమో తలూపాడు.
డిశ్చార్జి ఫార్మాలిటీస్ పూర్తయాయి. ప్రతివారూ అతనికి సర్వీస్ చెయ్యడం ఒక అవకాశంగానే అనుకుంటున్నారు.
“జాగ్రత్త. మరీ బైట తిరక్కండి. అలసట పడకండి… కనీసం కొద్దిరోజులు” చెప్పాడు డాక్టరు.
“థేంక్స్ డాక్టర్. చాలా కేర్ తీసుకున్నారు” అన్నాడు ఆమో.
“బాస్‍కి మీరు చేస్తున్నదానిముందు ఇదెంత? ఎంతోమంది యువత మిమ్మల్ని తమని తాము చూసుకునే అద్దంలా భావిస్తున్నారు. మీలాగ తమని తాము తయారుచేసుకుంటున్నారు. మీకు తగ్గాలని ఎంతోమంది పువ్వులూ, ప్రేయర్ కార్డ్స్ పంపారు. గుడిలో పూజలు చేయించారు. ఛెయిర్ పర్సన్ శ్యాం మీగురించి చాలామాట్లు ఫోన్ చేసి తెలుసుకునేవారు. స్వయంగా ప్రిమియర్ ఫోన్ చేసారు” అన్నాడు డాక్టరు.
ఆమో మనసు లోలోపల ఎక్కడో చిన్న జ్వాల. ఇంత అభిమానం ఒక వ్యక్తి పొందాలటే అతను విజయాల శిఖరంమీద నిలబడి వుండాలి. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఆ శిఖరాన్నించీ ఎప్పుడూ దిగకూడదు. అదేకదా, శ్యాం తనతో అన్నది? టైం హంట్ సాధ్యపడదని ముద్రపడిన సిద్ధాంతం. అదొక మూసివెయ్యబడిన దారి. మరోదారిని తెరవటంద్వారా ఆ ముద్రని చెరపాలి. తన విజయ శిఖరాన్ని మరింత ఎత్తుకి మార్చాలి.
తనలో రేగిన అసంతృప్తి జ్వాలని చిన్న చిరునవ్వుగా మార్చి పెదవుల మీద నిలబెట్టాడు. డాక్టరుకి బై చెప్పి కదిలాడు.
బాస్ కేంపస్‍లో ప్రైవేటు వాహనాలని అనుమతించరు. ఆమో వున్నది కమ్యూనిటీ హాస్పిటలు. బాస్‍కి చెందినది. పేషెంట్లు డిశ్చార్జైతే అవసరమైనప్పుడు హాస్పిటలే కారు ఇస్తుంది. ఆమోకి శ్యాం కారు పంపించి తన అభిమానాన్నీ, గౌరవాన్నీ ప్రకటించుకున్నాడు.
ఇంటికి చేరుకునేసరికి ధన్య వచ్చి వుంది. ఇంట్లో అక్కడక్కడా గోడలకి సెలోఫెన్ టేపుల్తో అందంగా అలంకరించిన గులాబీలు. వస్తూ తెచ్చిందేమో, గ్లాసుల్లోనూ ఖాళీసీసాల్లోనూ గుత్తులుగుత్తుగా అవే పువ్వులు.
సంధ్యకి ఆ అమ్మాయిని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. తనకి ఒక కూతురుంటే ఇలాగే వుంటుందనిపించింది. ఆమోకి పెళ్ళైతే వచ్చే కోడలుకూడా ఇలాగే వుంటుందనికూడా అనిపించింది. రెండిటి సారాంశం వొక్కటే. . . ఒక ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే బాగుంటుందని.
ఆమో స్నానం చేసి వచ్చేసాడు. అతను వచ్చేసరికి అన్నం వండి, కొంచెం బీరకాయకూర చేసింది సంధ్య. ఎన్నో రోజులుగా సరైన తిండిలేక, ఆవురావురుమంటూ తినేసాడు. ధన్య చేసిన రసం చాలా నచ్చింది.
అతన్ని హాల్లో కూర్చోమని, ధన్యని అతన్తో కబుర్లు చెప్తుండమని తను మిగిలినవాళ్లకి వంట మొదలుపెట్టింది సంధ్య.
“చాలా భయపెట్టేసారు. ఒకటే కలవరింతలు. ఏమీ అర్థమవలేదు” అంది ధన్య. అతన్తో ఎంతో చనువు పెరిగినట్టుగా వుంది. మొదటిరోజులా బెరుకుపడలేదు.
ధన్యలో కనిపించిన మార్పుకి కారణం అర్థమైంది. ఆమోకి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏమని కలవరించి వుంటాడు? ధన్యా, నిన్ను వదిలిపెట్టి వుండలేననా? లేక పద్మమాలికనీ, మైత్రీపాలుడినీ కలవరించాడా? మొదటిదైతే ధన్య మొహం చూడలేడు. ఆమెకి తనపట్ల వున్న గౌరవం అంతా సమసిపోతుంది. ఇంక పద్మమాలికా, మైత్రీపాలుడూ ఐతే వివరణ ఇచ్చుకోవాలి. ఎలా అర్థంచేసుకుంటుందో!

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s