ఊదాపచ్చనౌక 6 by S Sridevi

“పద్మమాలిక ఎవరు? చాలా కలవరించారు తనగురించి” అంది ధన్య. ఆమె ముఖంలో ఆశాభంగం గుర్తించాడు. ధన్యకూడా తనగురించీ అలాగే ఫీలౌతోందా? తామిద్దరిమధ్యా తను వూహించినట్టు అసంపూర్ణసమీకరణం వుందా? అదెప్పుడు మొదలైంది? ఈ జన్మలోనా? గత జన్మలోనా? ఇంకా ముందా?
“నీకు టైంహంట్ మీద నమ్మకం వుందా?” అడిగాడు.
“ఐన్‍స్టీన్ స్పెషల్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం సాధ్యం. కానీ ప్రాక్టికల్‍గా సాధ్యపడదనే అనుకుంటున్నాను. మీకు చెప్పదగ్గంతదాన్ని కాదు నేను” అంది ధన్య అతనలా ఎందుకు అడిగాడో అర్థ౦కాక.
“జన్మలమీద?”
“ఎప్పుడూ ఆలోచించలేదు.”
“నాకు నమ్మకం వుంది” అన్నాడు. ” అప్పుడప్పుడు ఒక కల వస్తుంటుంది. అందులో పద్మమాలిక అనే యువతి వుంటుంది. ఆమెని ఎవరో ఎత్తుకుపోతుంటారు. కాపాడమని ఆర్తనాదాలు చేస్తుంది. అవి నా చెవుల్లో మార్మోగుతుంటాయి. ఆమె ఎవరు? ఎప్పటి వ్యక్తి? నాకెలా పరిచయం? అవి తెలుసుకోవాలంటే టైంహంట్ చెయ్యాలి. గతంలోకి వెళ్ళాలి. గతజన్మలో ఆమె ఎవరో తెలుసుకోవాలి. ఆ పీపీటీ క్రిస్టల్నికూడా నా చిన్నప్పట్నుంచీ చూస్తున్నాను. దాన్నిపట్టుకోవాలి. ఇవే నా ప్రయోగాలు” ఈమాటలన్నీ ధన్యతో చెప్పాననుకున్నాడు ఆమో. అంతర్ముఖుడైపోయాడు. ఒక్కమాటకూడా నోట్లోంచీ రాలేదు. అలాగే చూస్తూ వుండిపోయాడు.
ధన్యకి ఏదో అర్థమైంది. తనకి తనే అర్థం చేసుకుంది.
ఇంతలో సంధ్య ఆమెని భోజనానికి రమ్మంది. రమేష్ సంధ్యలతో కలిసి భోజనం చేసింది.
“మీ నాన్నగారు ఎవరమ్మా? అమ్మేం చేస్తారు?” అడిగింది స౦ధ్య.
“మాది వరంగల్. నాన్న బేంకు ఆఫీసరు. అమ్మ డాక్టరు” చెప్పింది ధన్య.
“నీకు బాస్‍కి రావాలని ఎలా అనిపించింది? ఇక్కడికొచ్చి ఎంతకాలమైంది?”
“ఆమో కేరాఫ్ ఇక్కడుంది మరి. తనని చూడలంటే అతనితో కలిసి పనిచెయ్యాలంటే ఇక్కడికి రావాలి”
“నీకు వాడంటే అంత ఇష్టమా?”
“నాకే కాదండీ, ఇక్కడున్న ప్రతివాళ్ళకీ అతనంటే ఇష్టం. అతనొక రోల్ మోడల్” చెప్తున్నప్పుడు ధన్య ముఖంలో మొదటిరోజు వున్నంత దగ్గరితనం లేదనిపించింది సంధ్యకి.
ఒక ఆడపిల్ల అంత చొరవ తీసుకుని రాత్రంతా హాస్పిటల్లో వుంది. ఎంతో ఆదుర్దా చూపెట్టింది. ఇంతలో ఏం జరిగింది? ధన్యకి ఆమోపట్ల వున్న గౌరవం కేవలం వృత్తిపరమైనదేనా? అసలు వీళ్ళిద్దరికీ పరిచయం ఎప్పట్నుంచీ? తను వీళ్ళ పరిచయాన్ని తప్పుగా అనుకుందా? అమోకోసం కంగారుపడుతూ హాస్పిటల్లో ఈ అమ్మాయిని చూడగానే ఎన్నో ఆలోచనలు కలిగాయి. అవన్నీ వూహలేనా? కలలన్నీ కరిగిపోతున్నట్టుగా అనిపించింది.
భోజనాలయాక సంధ్య టేబుల్ సర్దుతుంటే తనూ సాయం చేసింది.
“నీకెందుకు ధన్యా, ఇవన్నీ?” అని వారించినా వినలేదు. అంతా అయాక ఇద్దరూ కూర్చున్నారు.
“పద్మమాలిక ఎవరండీ?”అని అడిగింది ధన్య.
“ఆమో చెప్పాడా?” బదులుగా అడిగింది సంధ్య.
“లేదు. తను నిద్రలో కలవరించారు. అడిగితే ఏం మాట్లాడలేదు.మౌనంగా వుండిపోయారు. రెట్టించి అడగలేనుకదా? మీకు తెలుసా? తన ఫియాన్సీనా? ” ఆమె కళ్ళలో ఏదో నిరాశ. దాన్ని గుర్తించింది సంధ్య.
“ఇన్ని ప్రశ్నలే? ఒక్క నిముషం వుండు చెప్తాను” అంటూ లేచి లోపలికి వెళ్ళి, ఐదునిముషాలకి మళ్ళీ వచ్చింది. ఈలోగా ధన్యలో ఎంతో సంఘర్షణ.
వారంరోజులేనా లేని పరిచయంలో తనిలా అడగడం తప్పేమో! ఆమోని అడిగింది. అతను మౌనం వహించాడు. మళ్ళీ అతని తల్లిని ఎందుకడిగింది? ఎందుకంత కుతుహలం తనకి? ఆమోని మొదటిసారి చూడగానే తన మనసు పురివిప్పిన నెమలిలా ఆడింది. అతనెంతో సన్నిహితుడనిపించింది. అతన్ని ఇంటింటికీ రమ్మనడం పెద్ద సాహసమే. కాని అతను వచ్చాడు. టీ తాగాడు. బాగుందన్నాడు. మెచ్చుకున్నాడు. మరో కప్పు తాగాడు. అదంతా అతని కలుపుగోలుతనం.
అతనికి జ్వరం వచ్చిందని శ్యాం ఫోన్ చేసి చెప్పగానే తల్లడిల్లిపోయింది. అదంతా తన ఫీలింగ్.
తను అతిగా చనువు తీసుకుందేమో!
“ఈ పెయింటింగ్ చూడు” అంది సంధ్య.
ధన్య అందుకుంది. కాళికాదేవి గుడిముందు కూర్చున్న అందమైన అమ్మాయి చిత్రపటం అది.
“ఆమో కలలోకి తరుచు వచ్చే అమ్మాయి బొమ్మ యిది. ఈమే పద్మమాలిక. ఈమెని ఎవరో ఎత్తుకుపోయారు. ఆమె ఎవరో, ఎవరెత్తుకుపోయారో ఏమీ తెలియదు. అసంపూర్ణమైన కల పదేపదే వచ్చి వాడిని విసిగిస్తుంది. కలంటే నిద్రలో వస్తుంది. మెలకువ రాగానే కరిగిపోతుంది. మర్చిపోతాం. ఈ కల అలాకాదు. జరిగిన విషయంలా కళ్ళకి కట్టినట్టు వస్తుంది. ఈ బొమ్మే దానికి నిదర్శనం. నీతో వాడు ఇదంతా చెప్పలేక మౌనంగా కూర్చున్నాడు” అంది సంధ్య.
ధన్య చిత్రపటాన్ని అందుకుంది. చాలా సజీవంగా వుంది. అందులోని అమ్మాయి ముఖకవళికలు, ఆమె చుట్టూ వున్న చెట్లూ, గుట్టలూ పువ్వులతోసహా అన్నిటినీ చాలా సూక్ష్మంగా చిత్రించాడు. రంగుల వాడక౦ ఎంతో సహజంగా వుంది. ప్రత్యేకత ఏమిటోగానీ చిత్రపటానికి పొడవూ వెడల్పులే కాక లోతుకూడా తెలుస్తోంది.
తనేదో గొప్ప ఆర్టిస్టుననుకుని అతన్ని గులాబీ మొక్కల పక్కని నిలబెట్టి నాలుగు పెన్సిలు గీతలు గీసి ఇదే నీ బొమ్మ పొమ్మంది. మరి అతను? కలలో వచ్చిన అమ్మాయిని సజీవంగా నిలబెట్టాడు.
నవ్వుకున్నాడేమో! అసలంత చనువు ఎలా తీసుకుంది? తల దించుకుంది.
మళ్లీ ఆమె దృష్టి పద్మమాలికమీదికి పోయింది. ఎంత అందంగా వుంది! కళ్ళు చెదిరిపోయేంత అందం. . .పదేపదే ఆమో కలలోకి వస్తోందట. ఇద్దరిదీ జన్మజన్మల బంధమేమో! జన్మలమీద అతనికి నమ్మకం వుందన్నాడు. బహుశ పద్మమాలికని వెతికి పట్టుకుంటాడేమో!
“చాలా బావుంది” అంది. అది పెయింటింగో, పద్మమాలికో అర్థంకాలేదు సంధ్యకి.
మళ్లీ ఆమోతో మాట్లాడలేదు ధన్య. ఇద్దరూ ఎదురుపడిన సందర్భాలు అరుదు. ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమైపోయారు. అది కావాలని అతన్ని నివారించడం కాదు. కలవాలని కోరుకోకపోవడం.


అబ్రహం స్పేస్‍నుంచీ తిరిగొచ్చాడు. అతనప్పటికి మరో పదిసార్లు అంటే మొత్తం 143 మెసేజిలు రాసాడు, సెండ్ బటన్ నొక్కకుండా.
పద్ధతి ప్రకారం స్పేస్‍నుంచీ తిరిగి వచ్చిన ప్రతి శాస్త్రవేత్తా బాస్ చెయిర్‍పర్సన్ శ్యాంకి రిపోర్ట్ చెయ్యాలి. అబ్రహం తన ప్రయోగ ఫలితాలున్న రిపోర్టులతో శ్యాంని కలిసాడు. అన్నీ విశదంగా వివరించాడు.
“ఎక్కడో సుదూర గ్రహాలలో మనం ప్రయాణించలేనంత దూరంలో జీవం వున్నట్టుగా సెన్సర్లు గుర్తించాయి. నీలిపచ్చరంగు పేచెస్ కనిపించాయి. ఆ జీవం వృక్షసంబంధమైనది కావచ్చునని నా అంచనా. చెట్లున్నాయంటే మనుషులుకూడా వుండవచ్చు.”
శ్యాం ఆశ్చర్యంగా చూసాడు. తన శాస్త్రవేత్తల ప్రయోగాలు అతనికి ఎప్పుడూ ఆశ్చర్యాన్నే ఇస్తాయి.
“కానీ శ్యాం, అక్కడ చెట్లున్నా మనుషులున్నా మనకి లాభం ఏమిటి? మనకన్నా అద్భుతమైన టెక్నాలజీ వుండి వాళ్ళు మన దగ్గిరకి రావాలిగానీ ఇప్పట్లో కాదుకదా, కలలోకూడా మనం అక్కడికి చేరుకోలేం. మనం సాధించిన వేగంలో ఆ దూరాన్ని చేరుకోవాలంటే ఒక మనిషి జీవితకాలం చాలదు. నాకీ ప్రయోగాలు నిరర్ధకంగా అనిపిస్తున్నాయి. నేనింక కొనసాగించలేను. అందుకు ఇంకెవరినేనా వినియోగించండి” అ౦తలోనే అన్నాడు అబ్రహం.
“ఏమైంది అబ్రహంకి?” చకితుడయాడు శ్యా౦.
అబ్రహం ముఖంలో ఒక నిస్పృహ. నిరాసక్తి. అతను చెప్పే విషయాలు వాస్తవమే కావచ్చు, కానీ ఒక శాస్త్రవేత్తకి ఆమోదయోగ్యమైనవి కాదు.
భూమి స్థిరంగా వుంటుంది, ఆకాశం ఒక టిన్‍షీట్‍లా, నక్షత్రాలు, సూర్యచంద్రులు ఇవన్నీ ఆ టిన్‍షీట్‍పై అతికించినట్టుగా వుంటాయన్న నమ్మకంనుంచీ, భూమి బల్లపరుపుగా వుంటుందన్న నమ్మకంనుంచీ, ఇంకా ఎన్నో అవాస్తవమైన నమ్మకాలనుంచీ ఎదిగిన మనం ఎన్ని ప్రయోగాలు చేస్తే, ప్రజలు గాఢంగా నమ్మిన ఇంకెన్ని సిద్ధాంతాలని ఖండిస్తే ఈరోజుని ఈ స్థాయికి ఎదిగాం? ఇంకా మరెన్నిటిని ఖండిస్తే ఇంకా ఎదగగలుగుతాం?
ఏ శాస్త్రవేత్తా ఇలా రాజీ పడకూడదు. రాజీపడితే అతను ఒక మామూలు వుద్యోగి ఔతాడు. జీవికకోసం వుద్యోగం చేసే వ్యక్తికీ అతనికీ తేడా వుండదు. అతని విజ్ఞానం నిరర్థకమే. కొన్ని కోట్లమందిలో అతనొకడు. అబ్రహం అలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడా? ఒకసారి స్పేస్‍లోకి వెళ్ళి వచ్చాక? శ్యాం నమ్మలేకపోతున్నాడు.
“నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. నా పాత వుద్యోగానికి” అన్నాడు అబ్రహం.
ఆమోకీ, అబ్రహంకీ వున్న స్పష్టమైన తేడా కనిపించింది శ్యా౦కి. అసాధ్యమైనదాన్ని సుసాధ్యం చెయ్యడానికి పరుగుపెడుతున్నాడు ఆమో. ఇతను వున్నతమైన కెరీర్‍ను వదిలిపెట్టి సాధారణమైన జీవితం గడపాలనుకుంటున్నాడు. చేసిన ప్రయోగాలు అతనికి వుత్తేజాన్నివ్వటంలేదు. మనుషుల్లో వుండే వైవిధ్యం. . .
శ్యాంకి అన్నీ అప్పజెప్పి బయటికి వచ్చేసరికి కేంపస్‍లో ఎదురైంది ధన్య. గుండె ఆగిపోయినట్టైంది. పంపకుండా స్టోర్ చేసిన మెసేజిలన్నీ రెక్కలొచ్చిన గువ్వల్లా అతని మనసునిండా సందడి చేసాయి.
ఇద్దరూ ట్వెల్త్‌దాకా కలిసి చదువుకున్నారు. ఊహ తెలిసినప్పట్నుంచీ ఆమెని ఆరాధిస్తున్నాడు. అంత చిన్న వయసులో అది ప్రేమనిపించలేదు. ఒక దగ్గరితనంలా అనిపించింది. గ్రాడ్యుయేషన్‍లో ఎవరి డిసిప్లిన్ వాళ్ళదైనా, తరుచు కలిసేవారు. మాస్టర్స్‌లో విడిపోయారు. అప్పుడు అర్థమైంది అబ్రహంకి తనది ప్రేమని. కానీ మొదట్లో వ్యక్తపరచలేకపోయినది ఇప్పటిదాకా సడిచెయ్యకుండానే వుండిపోయింది.
మనిషి ఒక స్థాయి వరకూ ఎదుగుతాడు. ఆ తర్వాత అతని ఎదుగుదల ఒక వృక్షపు శాఖల్లా విస్తరిస్తుంది. చిన్నప్పటి స్నేహాలు, పరిచయాలు మూలాల్నుంచీ పెరుగుతాయి. పసితనపు స్నేహాల్లో ఎదుటివ్యక్తి మానసిక స్థితి, గతి తెలుస్తాయి. అతడు ఎంతవరకూ ఎదిగాడో, అక్కడినుంచీ ఏమేరకి విస్తరించాడో అర్థమౌతుంది. పెద్దయాక ఏర్పడే స్నేహాల్లో విస్తరణనుంచీ ఎదుగుదలకీ అక్కణ్ణుంచీ మూలాల్లోకీ చూసుకోవల్సివుంటుంది.
ధన్యా, అబ్రహంల స్నేహంలో బాల్యపు పరిమళాలున్నాయి. అవి ఇద్దరికీ చిరపరిచితమైనవి. ప్రేమంటే ధన్య ఎలా స్పందిస్తుందోనని అబ్రహం భయపడ్డాడుగానీ ఇద్దరికీ ఒకరినొకరు చూసుకోగానే అవధుల్లేని స్నేహపు పరిమళం చుట్టుముట్టి౦ది.
“ధన్యా! నువ్వేంటి ఇక్కడ?” సంభ్రమంగా అడిగాడు.
“నేనూ అదే అడుగుతున్నాను” ధన్య దబాయించింది. ఆమో సమక్షంలో వున్న బిడియం ఇప్పుడు లేదు.
ఇద్దరూ నవ్వుకున్నారు.
క్వారంటైన్, ఫెలిసిటేషన్ అన్నీ యథాతథంగా జరిగాయి. ఫెలిసిటేషన్‍కి ధన్య వెళ్ళింది. ఆమోకూడా వచ్చాడు. అబ్రహంని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. ధన్య ఆమోతో ఫ్రీగా వుండలేకపోయింది. పదేపదే పద్మమాలిక గుర్తొచ్చింది.
ప్రేమకోసం సృష్టిని తిరగేసే ప్రయత్నంలో వున్నాడితను! ప్రేమ ఎంత బలమైనది! ఒక ప్రేమికుడిగా అతను చేస్తున్న సాహసం గొప్పది. ఒక శాస్త్రవేత్తగా అతను చేసే ప్రయోగాలు గొప్పవి. తను అతని ప్రేమని ఆశించదు. అతని విజయానికి దోహదం చేస్తుంది అంతే. తనదీ ప్రేమే. ఇలా వ్యక్తపరుస్తుంది. ఎప్పటికేనా అతను దాన్ని గుర్తిస్తే చాలు! అనుకుంది. మాటల్లో అలా అనుకోగలిగినా మనసు లోలోపల బాధగానే అనిపించిది.
ధన్యలో మార్పు ఆమో గుర్తించాడు. తప్పు తనదే. తను ఆమె సందేహాన్ని సరిగా తీర్చలేకపోయాడు. మళ్ళీ ఆమెతో మాట్లాడే అవకాశం రాలేదు. ప్రయత్నపూర్వకంగా తప్పించుకు తిరుగుతోంది. స్పేస్‍లోకి వెళ్ళాక వివరంగా మాట్లాడాలనుకున్నాడు.
ఎంతోకాలంగా వాయిదాపడుతున్న విషయాలు అనుకోకుండా జరిగిపోతుంటాయి. అప్పటికప్పుడు జరగబోయిన విషయాలు ఎప్పటికప్పుడు వాయిదాపడుతుంటాయి.
“ధన్యా! నిన్నిక్కడ చూడటం చాలా సంతోషంగా వుంది. లంచికి బైటికి వెళ్దామా? ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. చాలాకాలమైంది మనం కలుసుకుని, మాట్లాడుకుని ” అబ్రహం అడిగాడు.
ధన్య సరేనంది.
సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరాన వుంటుంది బాస్ కేంపస్. కేంటిన్‍లో ఆహారం చాలా బావుంటుంది. డైటీషియన్ సలహాలమేరకి రుచిగా చేస్తారు. అందుకే అక్కడ వుండేవాళ్ళకి చాలామందికి ఇల్లు గుర్తు రాదు. బైటికి వెళ్ళి తినాలనుకునే సందర్భాలు చాలా తక్కువ. ఆ అరుదైన సందర్భాల్లో ఇదొకటి.
ఇద్దరూ ప్రైవేట్ రూంలో ముందుగా రిజర్వు చేసుకున్నటేబుల్ ముందు ఇద్దరూ కూర్చున్నారు.
“చెప్పు” మెనూ కార్డు ధన్య ముందుకి తోసి అన్నాడు అబ్రహం.
ధన్య ఆర్డరిచ్చింది. అవి వచ్చేదాకా ఇద్దరూ ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ట్వెల్త్ పూర్తైన దగ్గిర్నుంచీ ఇప్పటిదాకా జరిగినవీ, సోషల్ నెట్‍వర్క్‌లోనూ ఫోన్‍లోనూ చెప్పుకోని ఎన్నో విషయాలు ఇప్పుడు మాట్లాడుకున్నారు.
ఆర్డరొచ్చింది. తింటూకూడా ఆగకుండా మాట్లాడుకున్నాక కొద్దిసేపటికి మాటలన్నీ ఐపోయినట్టు ఆగిపోయాడు అబ్రహం.
“ఇద్దరివీ చదువులయ్యాయి. కెరీర్లో స్థిరపడ్డాం. నాకు బాస్‍లోకూడా పొజిషన్ వుంది. నీ అభిప్రాయాన్నిబట్టి నేను ఇక్కడుండాలా ఢిల్లీ వెళ్ళాలా అనేది నిర్ణయించుకుంటాను. శ్యాంతో ఆల్రెడీ చెప్పాను డిల్లీ వెళ్ళిపోతానని. నిన్ను చూసాక ఆ నిర్ణయం మారింది. చెప్పు ధన్యా, మనం పెళ్ళిచేసుకుందామా?” కొద్దిసేపటి మౌనం తర్వాత అడిగాడు.
ధన్యకి కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. వేళ్లతో సుతారంగా పట్టుకున్న చెమ్చా జారిపోయింది. అబ్రహం ఇలా అడిగినందుకు ఆమె బాధపడలేదు. యువతీయువకులు కలిసి తిరుగుతున్నప్పుడు ఇటువంటి ప్రతిపాదనలు వస్తుంటాయి. ఇద్దర్లో ఎవరికి ఇష్టం లేకపోయినా రెండోవాళ్ళు అర్థం చేసుకుంటారు. పెళ్ళనేది ఏకపక్షం కాదనే అవగాహన బాగా వచ్చింది.
కొన్ని దశాబ్దాలక్రితం ప్రేమని కాదంటే అబ్బాయిలు అమ్మాయిల్ని నరికి చంపడం, వాళ్ళమీద ఏసిడ్ పొయ్యటం వుండేవి. ఇంకొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు కాదనటం, వేరేవాళ్ళతో బలవంతపు పెళ్ళిళ్ళు చెయ్యటం, అవి విఫలమవ్వటం జరిగేదట. కొన్నికుటుంబాలలో పరువుకోసం అమ్మాయో అమ్మాయి తండ్రో తన ప్రాణం తను తీసుకోవడం లేదా అమ్మాయి ప్రాణం తియ్యడంకూడా వుండేవట. ప్రేమ, పెళ్ళి భీభత్సంగా వుండేవట. ఇప్పుడు అందరూ కలిసి ఒక రాజీకి వచ్చినట్టుంది.
ధన్య కన్నీళ్ళు పెట్టుకుంటే వింతగా చూసాడు అబ్రహం.
“ఏమైంది?” అడిగాడు.
“ప్రేమ విఫలమైతే ఎలా వుంటుందో ఆ బాధని అనుభవిస్తున్నాను అబ్రహం” కళ్ళు తుడుచుకుంటూ అంది ఆమె.
అబ్రహం ముఖం మ్లానమైంది. పెద్ద పిడుగు నెత్తిమీద పడ్డట్టైంది. ఏదైతే జరుగుతుందని తను భయపడ్డాడో భయపడి వాయిదా వేస్తూ వచ్చాడో అది జరగనే జరిగింది. ప్రపంచం యథాతథంగా అలానే వుంది. ఎదురుగా కప్పుల్లో సూప్ పొగలు చిమ్ముతోంది. పనీర్‍తో చేసిన కూర మసాలా వాసన వేస్తోంది. అతనికీ కళ్ళల్లో నీళ్ళు చిమ్ముకొచ్చాయి. గొంతు గద్గదమైంది.
“ఎవరు నిన్ను కాదనుకున్న ఆ దురదృష్టవంతుడు?” అడిగాడు.
“ఆనందమోహన్”
చెప్తున్న ఆమెకి మతిపోయిందో, వింటున్న తనకి మతిపోయిందో అర్థమవలేదు అతనికి. “ఆమోనా?!” వింతగా అడిగాడు.
ధన్య తలూపింది.
“నీకు మతిపోయిందా? అతనొక పబ్లిక్ ఫిగరు. ఇద్దరం కలిసి స్పేస్‍లో పనిచేసినా అతను నాకన్నా ఎంతో ఎత్తుని వున్న వ్యక్తి.”
“ట్వెల్త్ చదువుతున్నప్పుడు మనకి ఫిజిక్స్ క్లాసులో మొదటిసారి అతని గురించి చెప్పారు. గుర్తుందా? అప్పట్నుంచీ అతన౦టే నాకు ఆరాధన. అతని ఫొటోలు కలెక్ట్ చేసి దాచుకునేదాన్ని. అతని ఆర్టికల్స్ చాలా ఆసక్తిగా చదివేదాన్ని.అతన్ని రోల్‍మోడల్‍గా చూపిస్తూ ఇంట్లోకూడా నన్ను చాలా ప్రోత్సహించేవారు. అతన్ని కలవాలనే నేను బాస్‍లో రిసెర్చికి అప్లై చేసాను.”
“. . .”
“ధన్యా! నాతో ఎప్పుడూ అనలేదు”
“నాకు అతనిపట్ల చాలా పొజెసివ్‍నెస్ వుండేది. అతని విషయాలు ఎవరితోటీ పంచుకోవాలనిపించేది కాదు”
“. . .”
“బాస్‍కి వచ్చిన నాలుగునెలలకి అతన్ని కలవడం జరిగింది. అంతకు ముందురోజే స్పేస్‍నుంచీ వచ్చాడు. క్వారంటైన్ అయింది. చెయిర్‍పర్సన్ నన్ను రమ్మని కాల్ చేసాడు. అక్కడ ఆమో వున్నాడు. నేను షాకయ్యాను. అప్పటిదాకా నా వూహల్లో వున్నాడు. టీవీలో చూసాను, వర్చువల్ ఇమేజెస్ చూసాను. ఇప్పుడతను వాస్తవంగా వున్నాడు. నాతో మాట్లాడాడు, తనతో స్పేస్‍లోకి వెళ్ళటానికి రికమెండ్ చేసాడు.”
“నిజంగానా? కంగ్రాట్స్.”
“అతనొక యూఎఫ్‍ఓని ట్రేస్ చేసాడు. దానిమీద ఇంకా ప్రయోగాలు చెయ్యాలట. అందుకు ఒక ఆస్ట్రోఫిజిస్ట్ సహాయం కావాలన్నాడు.”
” . . . “
” ఆఫీసులోంచీ ఇద్దరం ఒకేసారి బయటికి వచ్చాం. అతన్ని టీకి రమ్మని నా క్వార్టర్‍కి ఆహ్వానించాను. వచ్చాడు. అదేరోజు అతనికి జ్వరం వచ్చింది, కమ్యూనిటీ హాస్పిటల్లో చేర్చారు. అతని పేరెంట్స్ వచ్చేదాకా నేనే అటెండయాను. నా మనసంతా అతనిపట్ల ప్రేమతో నిండిపోయింది. కానీ అతను వళ్ళు తెలియని స్థితిలో కలవరించింది నన్నుకాదు.”
అబ్రహంకి బాధతో గుండె మెలిపెట్టినట్టనిపించింది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s