ఊదాపచ్చనౌక 7 by S Sridevi

“ధన్యా! ఒక విషయం చెప్పనా? ఆమో ఒక పబ్లిక్ ఫిగర్. ఎంతోమంది అతన్ని ఇష్టపడవచ్చు, ప్రేమించవచ్చు. కానీ అతను ప్రేమించగలిగేదీ పెళ్ళి చేసుకోగలిగేదీ మాత్రం ఒకరినే. ఆ ఒక్కరూ నువ్వు కావడానికిగల అవకాశం ఎంతో అది నువ్వు అర్థం చేసుకోవాలి”
“ఇవన్నీ నాకుమాత్రం తెలియవా? కానీ మనసుందే, అది మన మాట వినదు. అతనినుంచీ మరలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.”
“స్పేస్‍కి వెళ్ళే అవకాశం వాడుకోవాలనుకుంటున్నావా?”
“అతన్తో కలిసి పనిచేసే అవకాశం ఎలా వదులుకోగలను? అతన్తో అంటే అంతటి వ్యక్తితో. . .పువ్వుని అంటి వున్న దారానికి కూడా కొంచెం వాసన అంటుతుందికదా? కెరీర్ వేరు, వ్యక్తిగత వుద్వేగాలు వేరు”
అబ్రహం సుదీర్ఘంగా నిశ్వసించాడు.
“అతనిమీది ప్రేమని నువ్వు మర్చిపోవడం చాలా మంచిది ధన్యా! అతను నిన్ను ప్రేమించడం జరగదు. నువ్వతన్ని ప్రేమించడం భ్రమ. అది అతనిపట్ల నీకున్న హీరోవర్షిప్. అంతే. నువ్వెంత తొందరగా అందులోంచి బైటికి వస్తే అంత మంచిది. అప్పటిదాకా నేను వేచి చూడగలను.”
ధన్య తలూపింది. బిల్లు చెల్లించి ఇద్దరూ లేచారు.
“డిల్లీ వెళ్ళిపోతున్నాను. చేస్తున్న ప్రయోగాలు నాకు సంతృప్తినివ్వడం లేదు. శ్యాంకి చెప్పాను” దార్లో అన్నాడు.
“ఎందుకని అబ్రహం? నేను నిన్ను డిస్ట్రాక్ట్ చేసానా?” అడగలేక అడిగింది ధన్య.
“లేదు. అదేంలేదు. నువ్వే ఆలోచించు . . .ఆమో ఒక యూఎఫ్‍ఓని పట్టుకున్నాడే అనుకో, అది మనకెందుకు వుపయోగపడుతుంది? అందులో ఒక గ్రహాంతరవాసికూడా వున్నాడనుకో, వాడూ మనకి దొరికాడు. సో వాట్? మన జీవితాలు మారిపోతాయా?”
” . . . “
“మారవు. ఇలాగే వుంటాం. ఆ యూఎఫ్‍ఓనీ ఆ ఏలియన్నీ మనం స్టడీ చేస్తాం. వాళ్ల టెక్నాలజీ తెలుసుకుంటాం. అప్పుడూ మన జీవితాల్లో వచ్చే మార్పేమీ వుండదు…ఇంకో పదిమంది శాస్త్రవేత్తలు స్పేస్‍లో ప్రయోగాలు చెయ్యడంతప్ప. “
“అలా మాట్లాడకు అబ్రహం. నువ్వు బాస్‍ని వదిలిపెట్టే విషయం మరోసారి ఆలోచించు. ఏ ప్రయోగాలూ చెయ్యకపోతే భూమి బల్లపరుపుగా వుందనే సిద్ధాంతంలోనే ఇంకా వుండేవాళ్లం. క్షితిజరేఖ అంచుదాకా వెళ్తే అక్కడినుంచీ పడిపోతామేమోననే భయంతో ఎక్కడికీ వెళ్లకుండా మన చుట్టూ గిరిగీసుకుని వుండిపోయేవాళ్ళం. క్వినైనూ, పెన్సిలినూ వుండేవికాదు”
అబ్రహం నిరాసక్తిగా నవ్వాడు. శ్యాంతో మాట్లాడినప్పుడు అతన్లో ప్రయోగాలపట్ల విముఖత మాత్రమే వుంది. ఇప్పుడు ప్రేమ ఫలించని బాధ కూడా వుంది.
ఇద్దరూ బాస్ కేంపస్‍కి చేరుకున్నారు. మరుసటిరోజు అతను వెళ్ళిపోయాడు. ఆమోకి జ్వరం తగ్గి నార్మల్ అవటంతో సంధ్య, రమేష్ కూడా బయల్దేరారు. వెళ్ళేముందు సంధ్య ధన్య క్వార్టర్‍కి వచ్చింది గులాబీలు చూసింది.
“ఇన్ని మొక్కలా, ధన్యా! నాకైతే ఇక్కణ్ణుంచీ వెళ్ళాలనిపించడంలేదు” అంది విస్మయంగా.
“ఉండిపొండి” నవ్వింది ధన్య.
“ఇంకో నాలుగురోజులు వుండాలనే వుంది. కానీ ప్రిన్స్ బెంగపెట్టుకున్నాడట. వీడియోలో మమ్మల్ని చూపిస్తేనేగానీ తిండి తినటం లేదని చెప్పింది కేర్‍టేకర్. రమ్మని అరుస్తాడట. మా స్పర్శ అందక ఏడుస్తాడట. మేం వెళ్ళాలి. తప్పదు ధన్యా! ఐనా ఇక్కడుండి చేసేదేముంది? కాస్త ఆరోగ్యం చిక్కిందో లేదో ఆమో ఇ౦ట్లోనే వుండట్లేదు. ఎప్పుడూ ఆఫీసు, లేబ్ . . .”
ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. పద్మమాలికగురించీ ఆమెపట్ల ఆమోకి వున్న ప్రేమగురించీ ఎన్నో అడగాలనిపించింది ధన్యకి. కానీ ఏమని అడుగుతుంది? అతని వ్యక్తిగతజీవితంలోకి తనకి ప్రవేశం ఎక్కడిది?
సంధ్య వెళ్తానని లేస్తుంటే పెద్దపెద్ద పువ్వులు కోసి ఇచ్చింది ధన్య. సంధ్యకూడా తన మన్సులో వున్న మాట పైకి అనలేకపోయింది.


రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. కాలానికి సంబంధించి అదొక పెద్ద భ్రమ. కాలం ఎక్కడికి వెళ్తుంది? మనుషుల్నీ, నాగరీకతల్నీ సంస్కృతుల్నీ మోసుకుంటూ తిరుగుతుందా?
కాలం ఎక్కడికీ కదలదు. ఉన్నచోటే వుంటుంది. ఒక సరళరేఖలా. దాని పొడవెంతో ఇప్పటి శాస్త్రవేత్తలు తేల్చి ఇదమిద్ధంగా చెప్పలేకపోతున్నారుగానీ భారతీయ ఋషులు చెప్పేసారు. సృష్టి మొదలైనప్పట్నుంచీ లెక్కవేసి కాలాన్ని కల్పాలుగా, మన్వంతరాలుగా, మహాయుగాలుగా, యుగాలుగా, సంవత్సరాలుగా, రోజులుగా, ఇంకా చిన్నచిన్నగా విభజించి. దానిమీద మానవ ప్రయాణం.

వైభవ్ వెనక్కి వచ్చేసాడు. అబ్రహంని తీసుకురావటానికి వెళ్ళిన శాస్త్రవేత్త అనసూయ. ఆమెకూడా తిరిగి వచ్చేసింది. అలా ముగ్గురు శాస్త్రవేత్తలు తిరిగొచ్చాక, ఆమోకి మళ్ళీ స్పేస్‍లోకి వెళ్ళే అవకాశం వచ్చింది. మరో మూడునెలలకి ధన్య వెళ్ళింది.
ఆమోని అంత వెంటనే పంపించడాన్ని గురించి కొన్ని విమర్శలు వచ్చాయిగానీ అవేవీ నిలబడలేదు. అతని ప్రయోగాల స్థాయి అందరికీ తెలుసు. అతను యూఎఫ్‍ఓని పట్టుకోబోతున్నట్టు బాగా ప్రచారమైందికూడా. ధన్య వెళ్ళినప్పుడు మాత్రం బహిరంగంగానే చర్చలు జరిగాయి. శ్యాం తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నాడనే వాదనలు గట్టిగా వినిపించాయి.
“ఎన్నో అప్లికేషన్లు పెండింగ్‍లో పెట్టి అంత జూనియర్ని పంపించడం అవసరమా?” అనే ప్రశ్నతో దుమారం రేపారు చాలామంది. ప్రిమియర్ అతన్ని వివరణ అడిగారు.
“ఆమోకి అసిస్టెన్స్ ఇవ్వడానికి ఆమె వెళ్ళింది. అతని ప్రయోగాల్లో ఆమె సహాయం చేస్తుంది. అంతే తప్ప స్వతంత్రంగా ప్రయోగాలు చేసేందుకుకాదు. ఇలా వెళ్ళినందుకు తన టర్న్ ప్రకారం వచ్చే అవకాశాన్ని వదులుకుంటుంది” అని ఎంతో సంజాయిషీ ఇచ్చినమీదట అది చల్లారింది.


ధన్య వెళ్ళినది అన్నపూర్ణ అనే శాస్త్రవేత్త స్థానంలో.
మనిషి మనసు చాలా విచిత్రమైనది. అన్నపూర్ణకి పెళ్ళైంది. భర్త వ్యాపారస్థుడు. తను పై చదువులు చదవడానికి ఖర్చుపెడతాడనే అతన్ని చేసుకుంది. కొన్నేళ్ళదాకా ఆమెకి సంతోషంగానే ఉండేది. భర్తతో అన్యోన్యంగా ఉండటం, తను చదువులోనూ అతను వ్యాపారంలోనూ బిజీగా వుండటం నచ్చాయి. తనొక పెద్ద బిజినెస్ మేగ్నెట్ భార్యనని చెప్పుకోవడం సంతోషాన్నిచ్చింది.
బాస్‍లో అడుగు పెట్టాక ఆమె దృక్పథంలో మార్పొచ్చింది. ఆమో ఆమె మనసుని కదిలించాడు. అంటే అన్నపూర్ణ అతన్ని ప్రేమించిందని కాదు. తనుకూడా రిసెర్చి ఫీల్డులో ఉన్నతన్ని చేసుకుని వుంటే బావుండేదన్న ఆలోచన ఆమెని సతమతం చేస్తోంది. అటువంటి వ్యక్తి తన భర్త స్థానంలో వుంటే జీవితం భిన్నంగా వుండేదన్న భావన. అదొక దిగులుగా, అసంతృప్తిగా రూపు దిద్దుకుంది. ఆమోని చేసుకునే అమ్మాయి ఎవరో? ఇది అతన్ని చూడగానే తటాలుమని స్ఫురించే ప్రశ్న. అలా ఎందర్నో గమనించింది. గమనించడం ఒక అలవాటుగా మార్చుకుంది.
తనకి రిలీవరుగా వచ్చిన ధన్యని చూసి ఆ అమ్మాయి కళ్ళలో ఉన్న చురుకుతనాన్ని ఆమోతో పోల్చుకుని ఈమె అయితే అతనికి సరిపోతుందనుకుంది అన్నపూర్ణ. అది అసూయకాదు. మానవమనస్తత్వంలో వుండే ఒక పార్శ్వం. తనది కాకపోయినా అపురూపమైనది కనిపిస్తే అది మరొకరిదగ్గిరేనా పదిలంగా వుండాలని కోరుకునే తత్త్వం.
ఒకరినొకరు చూసుకోగానే వాళ్ళ కళ్ళలో లిప్తపాటు మెరిసిన మెరుపుల్ని పట్టుకుంది. ఇద్దరూ ఇంతకుముందే పరిచయస్తులు కావచ్చునన్న ఆలోచన రాలేదు. ఒకరికోసం ఒకరు పుట్టారేమోననిపించింది. ఒకరి వునికి మరొకరికి స౦తోషాన్నిస్తోందన్న విషయాన్ని వాళ్ళింకా గుర్తించలేదేమో! వాళ్ళ పెళ్ళి చరిత్రని తిరిగి రాస్తుందనిపించింది. ఇక్కడికి ఎలా వచ్చిందో అలాగే ధన్య అతని జీవింలోకి వెళ్ళిపోవాలన్న ఆకాంక్ష బలంగా కలిగింది.
ఇద్దరికీ వీడ్కోలు చెప్పి ధన్యని తీసుకొచ్చిన షటిల్లో వెనక్కి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. ఆమె నిష్క్రమించడాన్ని పూర్తిగా చూసాక, “స్వాగతం…మనకిమాత్రమే చెందిన ప్రపంచంలోకి” అన్నాడు ఆమో బాస్ విశ్వ సెంట్రల్ జోన్‍వైపు దారితీస్తూ. ధన్య అనుసరించింది.
ఆమె సరిగ్గా అక్కడికి రాగానే కంప్యూటర్ బటన్ నొక్కాడు. వర్చువల్ సాఫ్ట్‍వేర్‍లో తయారు చేసిన రంగురంగుల కార్నేషన్స్ ఆమె మీద వర్షంలా ఆగకుండా కురిసాయి. ఆ ఇమేజెస్ చూసి ఆమె థ్రిల్లౌతుంటే అతను సంతోషంగా నవ్వేసాడు. ఎంతగానో ఆశించిన పెన్నిధి దొరికినంత సంతోషం అది. పోగొట్టుకున్నానని భయపడుతున్నది మళ్ళీ దగ్గిరకి వచ్చినప్పుడు కలిగే ఆనందం అది.
ఒకవైపు పద్మలతకోసం అన్వేషిస్తూ మరోవైపు తన సమక్షంలో ఇంత సంతోషం ఎలా సాధ్యం? పద్మలత దుర్లభమని తెలుసా? తనంటే ఇష్టమా? ఎంత? ప్రేమ అనిపించేంతా? అతన్ని తదేకంగా చూసింది.
అతని మనసులో పద్మలతే వుండనీ. . . తనుమాత్రం ఈ ఆకర్షణలోంచీ బయటపడగలదా? అదొక సూదంటు రాయి. మనసుని దహించేసే నిప్పు. అతనిమీంచీ చూపులు తిప్పుకోలేకపోతోంది.
ఎదురుగా వెళ్ళి … మునివేళ్లమీద కాళ్ళెత్తి నిలబడి … నుదుటిని ముద్దు పెట్టుకుంటే … ముక్కూముక్కూ రాసి అతన్నింకా నవ్వించి ఆ నవ్వులో తను జతకలవగలిగితే? క్షణంసేపే ఆ ఆలోచనలు. అతనికి తెలిసిపోతాయేమో! కనురెప్పలు వాలిపోయాయి. ముఖం ఎర్రబడిపోయింది.
అప్పటిదాకా తన చూపుల్లో చూపులు కలిపి నిలబడిన అమ్మాయి ఒక్కసారి ఇలా సిగ్గుపడిపోతోందేం? ముఖంలో ఆ ఎరుపేంటి? ఆ వింత వెలుగేంటి? కనురెప్పలు పైకెత్తలేనంతగా అంత బరువేంటి? ఆమో వింతగా చూసాడు.
పువ్వులవాన ఆగిపోయింది. ఇద్దరూ వాస్తవంలోకి వచ్చారు. ఆమెని తనతో తీసుకెళ్ళి లేబ్‍నీ పరికరాలనీ పరిచయం చేసాడు ఆమో. ధన్య చాలా థ్రిల్లైంది. ఇక్కడికి రావాలని ఎన్నో కలలు కన్నది. ఎందరో అలాంటి కలలు కని వుంటారు. కానీ తనకి దొరికినది మాత్రం చాలా అరుదైన అవకాశం…
ఆమోతో కలిసి అంతరిక్షంలో ప్రయోగాలు చెయ్యడంకూడా అబ్రహం, అన్నపూర్ణలాంటి అతికొద్దిమంది విషయంలో జరిగివుంటుంది. కానీ అతని ప్రయోగాల్లో భాగం కావడంమాత్రం కేవలం తన ఒక్కరి విషయంలోనే జరిగింది. అతని మనసు తను గెలవగలదో లేదో… అతని ప్రయోగాల్లో విజయాన్ని మాత్రం సాధించడానికి ఎంతేనా కృషి చెయ్యగలదు. అతను కోరుకున్న సహకారాన్ని ఇవ్వగలదు.
వ్యక్తులు భౌతికంగా పక్కపక్కనే వున్నా ఆంతరంగిక ప్రపంచాలు వేరే వుంటాయి. ఒకే ఆలోచన చేసినా ఆ ఆలోచన తాలూకూ ఆవర్తాలు వేరేగా వుంటాయి. ధన్య ఒకలా ఆలోచిస్తే ఆమో అదే విషయాన్ని మరోలా ఆలోచిస్తున్నాడు.
ఆమె మనసులో తనపట్ల అపోహలేవేనా వుంటే వాటిని తొలగించాలి. పద్మమాలిక తనని ఆకర్షిస్తున్న మృగతృష్ణేతప్ప తనకి జీవధార కాదని చెప్పాలి. ధన్యని ప్రేమిస్తున్నానని చెప్పాలి. అతనికి ఈ దూరం భరించడానికి దుస్సహంగా వుంది. తనిక్కడ అంతరిక్షంలోనూ ఆమె అక్కడ బాస్ కేంపస్‍లోనూ వున్నా కొంతవరకూ తట్టుకోవచ్చుగానీ పక్కనే వుండి సూటిగా కళ్ళలోకి చూస్తూ మాట్లాడుకోలేని ఈ స్థితిమాత్రం దుర్భరంగా వుంది.
ఇద్దరూ మరోసారి ఒకర్నొకరు చూసుకున్నారు. వెంటనే చూపులుకూడా మరల్చుకున్నారు.
“ఇక్కడ అసలు మీరేం చెస్తారు?”కుతూహలంగా అడిగింది ధన్య.
“అలా టెలిస్కోప్ ముందు కూర్చుని గమనించడమే.” నవ్వాడతను.
“మరి అన్నపూర్ణగారు? ఆవిడ ప్రయోగాలు పూర్తయాయా? కాకపోతే మరెలా?”
“తను తోకచుక్కల్ని పరిశోధిస్తుంది. ఇప్పటిదాకా చేసిన ప్రయోగాల ఫలితాలతో వెళ్ళింది. అవి పూర్తవడం వుండదు. మళ్ళీమళ్ళీ వస్తుండాలి. తను రిసెర్చిపేపర్స్ పబ్లిష్ చేసాక అవే ప్రయోగాలతో ఇంకెవరేనా ముందుకి వెళ్ళచ్చు. ఫినామినల్ అవి. కాబట్టి మరొకరు వాటిని వాడుకోవడంవలన ఆమెకి వచ్చే నష్టం ఏదీ వుండదు. “
“అబ్రహం బాస్‍లో పొజిషన్ని వదులుకున్నాడు” కొంచెం సంకోచిస్తూ చెప్పింది ధన్య. ఆ నిర్ణయాన్ని అతను తనని కలవకముందే తీసుకోవడంచేత రిలీఫ్‍గా వుంది. లేకపోతే ఆ నిర్ణయానికి కారణం తనేననిపించి జీవితాంతం బాధ వెంటాడేది. ఆమోతో తనకిగల మానసికమైన బంధాన్నికూడా కొంతవరకూ ప్రభావితం చేసేదేమో! ఏది ఏమైనా కాలం అనేది మనుషుల జీవితాలమీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.
“తెలిసింది” అన్నాడు ఆమో. అత్యున్నతస్థాయి ప్రయోగాలుకూడా నిర్వేదాన్ని కలిగిస్తాయనేది అతనికి ఆశ్చర్యం కలిగించింది.
ఊదాపచ్చనౌకమీద తను తీసిన ఫొటోలనీ రాసుకున్న నోట్స్‌నీ ఆమెముందు పెట్టాడు.
బాస్ విశ్వాకి ఆ నౌక ఎంతదూరంలో వుందో నువ్వు కచ్చితంగా అంచనా వేసి చెప్పగలిగితే నేను ఎల్‍ఎస్‍ టీని సెట్ చేసుకుంటాను.”
“అదేంటి? యూఎఫ్‍ఓని పట్టుకుందుకు మన టెక్నాలజీ ఏమిటి?”
“లేజర్ స్క్రైబింగ్ టెక్నాలజీమీద ఆధారపడుతున్నాం. దానితో ఒక గ్రాఫీన్ ట్రిగ్గర్ గన్ ప్రత్యేకంగా ఇందుకోసం చేయించాను. రిమోట్‍తో పని చేస్తుంది. బటన్ నొక్కగానే సన్నటి గ్రాఫీన్ దారాలు లేజర్ బీమ్స్‌తో కలిసి బయల్దేరతాయి. అవొక కనిపించని మెష్‍లా యూఎఫ్‍ఓని చుట్టేస్తాయి. మనం వాటిని విత్‍డ్రా చేసుకున్నప్పుడు వాటితో చిక్కుపడిన యూఎఫ్‍ఓకూడా వచ్చేస్తుంది. మనం మెసేజి పంపగానే బాస్ క్రూ వస్తారు. మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు” ఆమో వివరించాడు.
ధన్యకేం అర్థం కాలేదు. ఇంత కష్టపడి సాధించినదాన్ని బాస్‍కి ఇచ్చేస్తే మరితని ప్రయోగాలు?
అదే అడిగింది.
“అది కాలనౌక కాకపోతే” కచ్చితంగా వుంది ఆమో జవాబు. ఆమె అలా అడిగినందుకు లోలోపల సంతోషం వేసింది.
అది కాలనౌక కాకపోతే… దాన్ని అతను బాస్‍కి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో ధన్యకి తెలుసు. అతను కాలప్రవాహంలో ఏ దూరతీరానికో వెళ్ళిపోతాడు. మళ్ళీ వర్తమానంలోకి వస్తాడో రాడో! పద్మమాలికని వెతుక్కుని… ఆమెని పెళ్ళి చేసుకుని… ఆమె ముఖం మ్లానమైంది. అతను గమనించకుండా వుండాలని చూపులు కంప్యూటర్ స్క్రీన్ వైపుకి తిప్పింది.
అతను మరోలా అర్థం చేసుకున్నాడు.
“ఇందులోని ఎథిక్స్‌గురించి ఆలోచించాలనుకోవటంలేదు ధన్యా! బాస్‍ని డిచ్‍చేస్తున్నానా, నా స్వంత ప్రయోగాలకి వాడుకుంటున్నానా అనే విషయాన్నిగురించి నాకు కొ౦త కన్సర్న్ వుంది. కానీ పద్మమాలిక నన్ను చాలా బాధపెడుతోంది. ఒక ఎండమావిలా నన్ను పరిగెత్తిస్తోంది. ఆ పజిల్ విడకపోతే నాకు మనశ్శాంతి లేదు. ఆ తర్వాత బాస్‍కి లొంగిపోతాను. ప్రిమియర్ నన్నేం చేసినా ఎలా౦టి క్రమశిక్షణ చర్య తీసుకున్నా నేను పట్టించుకోను” అన్నాడు.
మరి తను? ఏమీ కానప్పుడు ఎందుకు ఇదంతా తనకి చెప్తున్నాడు? ఇది అత్యంత గోప్యనీయమైన విషయమేకదా? ఈ విషయం బయటికి తెలిస్తే అతని వుద్యోగమేకాదు, కెరీర్‍కూడా ముగిసిపోతుంది. అదేకాదు అతని ప్రయత్నాలు నెరవేరే దారికూడా మూసుకుపోతుంది. అలా౦టి విషయాన్ని ఏమీకాని తనకెందుకు చెప్పాడు? ఆమెకి చాలా అయోమయంగా వుంది. ఎలా అర్థంచేసుకోవాలో మరెలా అన్వయించుకోవాలో తెలియలేదు.
ఆమో ఆలోచనలు వేరు. అతనికి ధన్య పరాయిదనే భావన లేదు. పద్మమాలిక ఒక ప్రయోగంమాత్రమే. టైంహంట్‍తో ముడిపడివున్న ప్రయోగం.
ధన్యతో తన మనసు ఇప్పి చెప్పాలనుకున్నవాడు మళ్ళీ స౦దిగ్ధంలో పడి అగిపోయాడు. ఇది సందర్భం కాకపోవచ్చు. తన మనసు నిండా వున్న ప్రేమ అనే మాధ్యమంలోంచీ చూస్తుంటే ఆమెకూడా ప్రేమలో వున్నట్టే అనిపిస్తోంది. కానీ అది నిజంకాకపోతే? తన వూహ మాత్రమే అయితే? ఇలాంటి అనివార్యమైన ఏకాంతాన్ని తప్పుగా వాడుకుంటున్నాడని ఆమె అపోహపడితే? అలాంటి దురూహతోటే ఈ అవకాశాన్ని కల్పించాడనుకుంటే? ఈ స్పేస్‍లాబ్‍లోని జీవితాలు ఇలాంటి అనైతికతతో నిండి వుంటాయనే నిర్ణయానికి ఆమె వస్తే? ఆమో తల బలంగా విదిలించాడు. తను చెయ్యబోయినది ఎంత పెద్ద తప్పో అర్థమైందతనికి.
వాస్తవంగా అది పెద్ద తప్పే అయి వుండేది, ధన్యకి అతనిమీద ప్రేమ లేకపోతే. ప్రేమ వుందిగాబట్టి దాన్ని వ్యక్తపరచకపోవటం ఇప్పుడు తప్పై కూర్చుంది.
ప్రేమ చాలా జటిలమైనది.
అక్కడితో ఇద్దరి భావోద్వేగాలూ చల్లబడ్డాయి. భావాలు మనసు లోలోపలి పొరల్లోకి ఇంకిపోయాయి. ఎక్కడో చిన్న పరిమళం ఒక సౌహార్ద్రతలా వ్యక్తమైంది తప్ప ప్రేమలా కాదు. ఇద్దరూ ప్రొఫెషనల్స్‌గా మారిపోయారు.
అతను వేసిన లెక్కలన్నీ ఆమె సరిచూసింది. కంప్యూటర్లోకి తనకి అనువైన పద్ధతిలో ఎక్కించింది. వాస్తవంగా ఆ వూదాపచ్చనౌక ఎదురైనప్పుడు వాటంతట అవే రీడింగ్సన్నీ అనుసంధానించుకుని సరిచేసుకునేలా ప్రోగ్రామింగ్ చేసుకుంది. ఊదాపచ్చ నౌక కనిపించే అతి తక్కువ సమయంలో ఇదంతా జరిగిపోవాలి. కేవలం ఒక బటన్ టచ్చిస్క్రీన్ చేస్తేనే అదంతా జరిగిపోయే అలాంటి ప్రోగ్రాంనే తయారు చేసింది. ఆమో చాలా ప్రశంసించాడు.
మొదటిసారికాబట్టి ఎంత శిక్షణ పొందినా ధన్య స్పేస్‍లాబ్‍లో అందర్లానే చాలా ఇబ్బంది పడింది. ఆమోకి తనొక సీనియర్ననే ఆధిక్యభావన ఎప్పుడూ ఎవరిపట్లా లేదు. తను సీనియర్, అన్నీ తెలిసినవాడూ కాబట్టని అన్ని బాధ్యతలూ జాగ్రత్తలూ తనే తీసుకునేవాడు. అతనితో కలిసి పనిచేసేవారికి భూమ్మీదైనా అంతరిక్షంలోనైనా నిశ్చింతగా వుంటుంది. ధన్య విషయంలో అతను ఇంకా జాగ్రత్త తీసుకున్నాడు. ఆమె అతని వుపిరి, ప్రాణం, సర్వం. ఆమె డైట్, నిద్ర, అన్నీ స్వయంగా చూసుకుంటున్నాడు. ఆమె ఎంజాయ్ చేస్తోంది, ముడుచుకుపోతోంది కూడా మరొకరికి చెందాల్సిన ప్రేమని తను ఆస్వదించలేక.
బాస్ విశ్వలో ప్రయోగాలకి స్పేస్‍సూట్ అవసరం లేదు. కానీ బయటి నౌకతో చేస్తున్నారు, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. నౌకలోంచీ బైటికి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. లేదా అవతలి నౌకని ఆకర్షించే క్రమంలో కుదుపులు వుండవచ్చు. అందుకని ఇద్దరూ స్పేస్ సూట్లు వేసుకునే వుంటున్నారు. ఆమో ఆలోచనన్లు అంతకిమించి సాగలేదు.
అతనికి మళ్ళీ ఆ కల రాలేదు. కలతో నిమిత్తం లేకుండానే ఒకరోజు…ధన్య వచ్చిన దాదాపు నెలరోజుల తర్వాత…
“ఆమో! అదేనా మీరు చెప్పినది?” అని కంగారుగా పిలిచింది. అప్పటికి అతనడిగిన లెక్కలన్నీ వేసేసింది. ఆమె లెక్కల్తో వాస్తవదూరాలు ఆటోమెటిగ్గా కంప్యూటర్ పోల్చి సరిచూసుకుంటోంది, సరిగ్గా సరిపోతున్నాయి. ఆ క్షణౌకోసమే చూస్తున్న ఆమో తటాలున స్పందించాడు. ఇద్దరూ సీట్ బెల్టులు బిగించుకున్నారు. దూరాన్ని ఫీడ్ చేసి గ్రాఫీన్‍మెష్‍ని ట్రిగ్గర్ చేసాడు. మెష్ వెళ్ళి యూఎఫ్‍ఓని అల్లుకోవడం తెలుస్తోంది.
ముందు చిన్న కుదుపు. తరువాత పెద్ద పేలుడుతో కూడిన ఇంకా పెద్ద కుదుపు. శబ్దం శూన్యంలో ప్రయాణించదుకాబట్టి పేలుడు వినిపించలేదు కానీ ఇద్దరూ అంత దూరానికి విసిరెయ్యబడ్డారు. అది అర్థమైంది.
ఏ పొరపాటు దీనికి కారణమైందో తెలియలేదు ఆమోకి. బాస్ విశ్వలోకి చీకటి ఎలా నిండింది? ఎక్కడికో విసిరెయ్యబడుతున్నట్టుగా వుంది…ఏం జరుగుతోంది?ఆమో వూహించిన కుదుపులు ఇవి కావు. ఒకపక్కనుంచీ క్రమంగా యూఎఫ్‍ఓ దగ్గిరౌతోంది. వేగం చాలా నియంత్రణలో వుంది. అప్పుడు గమనించాడతను… రెండోవైపుని వీళ్ళకి దూరంగా జెట్టిసన్ చేస్తూ దూరమౌతున్న వస్తువుని… దానిమీద బాస్ విశ్వ… అనే అక్షరాలని… రెండు గ్రహశకలాలు కొట్టుకున్నప్పుడు జనించిన వుష్ణకాంతిలో. అది బాస్ విశ్వ ఐతే మరి తామున్నది?
వాస్తవం అర్థమైంది అమోకి. మెదడు మొద్దుబారినట్టైంది. బాస్ విశ్వ నిలువునా రెండుగా చీలిపోయింది. ఒక సగంలో తామున్నారు. రెండో సగం రోదసిలో గింగిర్లు కొడుతోంది. ధన్య…ధన్య ఏమైంది? అతని గుండె చప్పుడు ఆమె. దాన్ని వెతుక్కున్నాడు.
“ధన్యా!” పిలిచాడు.
ఆమెకేం వినిపించలేదు. ఆమెకి భయం వెయ్యట్లేదు. ఆమో పక్కనున్నాడని ధైర్యంగా వుంది. వున్నాడో లేదో కనిపించడంలేదు. కానీ వున్నాడనే నమ్ముతోంది.
ఆమోకి ఏడవాలనిపించింది. ధన్యని ఏం చేసాడు తను?


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s