అంతా అర్థమయ్యీ కానట్టు… అంతా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టే వుంది. కానీ అది అరటిపండు కాదేమోనన్న సందేహం…
“నేనేం చెయ్యాలిప్పుడు?” ఒక ప్రశ్న. అక్కడెవరూ లేరు. ఆ సాధువు కనిపించలేదు. ఆ ప్రశ్నకి జవాబు వెతుకుతూ విశ్వమంతా పరిభ్రమించాడు. కాలమంతా తిరిగాడు. చనిపోవాలనుకున్నాడు. కానీ ఆత్మహత్యతో ఈ దు:ఖం ఆగుతుందా? వచ్చే జన్మకి కొనసాగితే? కాలనౌకనేం చెయ్యాలి? అందులో అపారమైన విరుద్ధపదార్ధం వుంది. భయంకరమైన రణగోళాలకి సరిపోతుంది. దాన్నేం చెయ్యాలి? సర్వవీక్షణుడు వేసిన సంకెళ్ళు తొలగిపోయాయిగానీ తనకి తను వేసుకున్న సంకెళ్ళలో తనే ఇరుక్కుపోయాడు మృత్యుంజయుడు.
అంత విరుద్ధపదార్ధంతో భూమ్మీద దిగాలంటే భయం. సర్వవీక్షణుడి వారసులు ఎందరున్నారో! భూమికీ, భూమిపైనున్న సృష్టికీ నష్టం జరగకుండా విరుద్ధపదార్ధాన్ని ధ్వంసం చేసేలా వుపయోగపడతాయేమోనని మనుషులు చేసే విజ్ఞానశాస్త్రప్రయోగాలు చూద్దామంటే మహాభారతయుద్ధం తర్వాత నాగరీకతంతా కనుమరుగైంది. బౌద్ధధర్మం ఆవిర్భవించి కొంత విజ్ఞానాన్ని వెలికి తీసిందిగానీ, అంతర్గత మార్పులతో అది మతంగా మారిపోయింది. ఆ తర్వాత భరతఖండం వెలుపలినుంచీ విదేశీయుల దాడులు… నలందా, తక్షశిలా విద్యాలయాలు కాలగర్భాన కలిసిపోయాయి. రాజులకి ఎంతసేపూ రాజ్య విస్తరణ, అందుకోసం యుద్ధాలు, యుద్ధ విద్యలు తప్ప మరేవీ చదువులు కాకుండా పోయాయి. తదుపరిరోజుల్ని చీకటిరోజులనవచ్చు. ఇప్పుడు మళ్ళీ శాస్త్రవిజ్ఞానం వూపందుకుంది. ఎదురుచూపుతో, వంటరితనంతో సహజీవనానికీ అలవాటుపడిపోయాడు.
మళ్ళీ అతడు గతంలోకి వెళ్ళినప్పుడు తను వాళ్ళని కాలనౌక ఎక్కించినప్పటివరకే వాళ్ళు కనిపించారు. ఆ తర్వాత భౌతికంగా వాళ్ళు కాలంలోంచీ దాటిపోయారుకాబట్టి ఇంక కనిపించలేదు. ఆ గతానికీ, క్షణక్షణానికీ గతంగా మారుతున్న వర్తమానానికీ మధ్య ప్రయాణం చేస్తూ కాలంలో ముందుకి వెళ్తున్నాడు. ఆయువుని పోగుచేసుకుంటున్నాడు.
…
ఆమో, ధన్యా నిద్రలేచాక ఇదంతా ఇంత వివరంగా కాదుగానీ చెప్పనైతే చెప్పాడు మృత్యుంజయుడు, “అందరూ ఒకసారే మరణిస్తారు. నావాళ్ళు రెండుసార్లు చనిపోయారు. ఆ రెండుసార్లకీ కారణం నేనే కావటం విషాదం” అన్న ముక్తాయింపుతో.
“బలమైన బంధం వుంటేనే ఒక మనిషి రెండో మనిషిని జన్మజన్మాంతరాలవరకూ అనుసరించి వస్తారు. కాబట్టి ఏ యిద్దరూ కలిసి కాలనౌకలో ప్రయాణం చెయ్యటం కుదరదు” అన్నాడు. ఇంకో పెద్ద పొరపాటు జరగవలసి వుండటంతో ఆ మాటలెందుకో ఆమో మనసులోకి ఇంకలేదు. ఇంకినంతవరకూ అతను వాటిని మరోలా అన్వయించుకున్నాడు.
…
ఆమో కలని పూర్తిగా విన్నాడు మృత్యుంజయుడు. పద్మమాలికతో ముగియని అనుబంధమేదో ఆమోని వెంటాడుతోందని అర్థమైంది.
“గతంలోకి వెళ్ళి ఆమెని కలుసుకుంటావా?” అని అడిగాడు.
ఇప్పటికి భూమ్మీద ఇరవైనాలుగ్గంటల పైనే అయింది. బాస్ విశ్వా పేలిపోయి. అక్కడంతా కంగారుపడుతుంటారని తెలుసు. తామిద్దరూ క్షేమంగానే వున్నారని వాళ్ళకి వార్త పెడితే అన్న ఆలోచన వచ్చింది ఆమోకి. తన తల్లిదండ్రులకీ, ధన్య తల్లిదండ్రులకీ అది ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఆ వార్త ఆధారంగా బాస్ గాలింపు మొదలుపెడుతుంది. తాము దొరికిపోతే? అందుకు మృత్యుంజయుడు వప్పుకుంటాడా? కచ్చితంగా వప్పుకోడు. తనకి సహాయంకూడా చెయ్యడు. అసలతను తమనేం చెయ్యబోతున్నాడో ఇంకా ఒక స్పష్టత రాలేదు. అందుకే తన ప్రతిపాదనలేవీ బయటికి అనలేదు. ఐనా తన మనస్సులో ఏం జరుగుతోందో తెలుసుకోవడం మృత్యుంజయుడికి పెద్ద విషయమేంకాదు. అతడు చెప్పినట్టే చేద్దామనుకున్నాడు.
కాలనౌకని వాడటం ఆమో పూర్తిగా నేర్చుకున్నాడు. మరో సాంకేతికతతో తయారైన వ్యోమనౌకనికూడా. అతని గమ్యం చాలా కచ్చితంగా వుంది. ఆ కాళికాలయం… గతంలో ఎక్కడుందో స్థలకాలాలతోసహా వెతికి పట్టుకోవాలి.
మృత్యుంజయుడిదగ్గిర వున్న సెల్ఫోన్లాంటి దర్పణం అందుకు వుపయోగపడింది. దాన్ని కాలనౌకకి అనుసంధానిస్తే ప్రతి ప్రదేశాన్నీ కాల వ్యత్యాసంతో చూపిస్తుంది. ఆమో తన వెతుకులాటని కుదించుకుంటూ వెళ్ళాడు. తెలుగుదేశాలు, స్వచ్చమైన తెలుగు భాష, కాళికాలయాలు… అలా వెతకగా వెతకగా కనిపించింది పద్మమాలిక… రెండువేల సంవత్సరాలక్రితం… అదీ ఇప్పుడు బాస్ వున్న చోటికి దగ్గిరగానే…. సరిగ్గా ఆమో కలలో కనిపించినట్టుగానే. అతడే కాదు, ధన్యకూడా చకితురాలైంది.
ఒక కల పదేపదే రావడం… అందులో కొన్ని దృశ్యాలు కళ్ళకి కట్టినట్టు కనపడటం, అవి నిజంగానే వుండటం… దిగ్భ్రాంతిని కలిగించాయి. అతను ఆమెని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడా? ఆ ఆలోచనే ధన్యని వంటరితనంలో ముంచెత్తింది. అంతరంగమంతా అనంత శూన్యంతో నిండిపోయింది. తనిప్పుడేం చెయ్యాలి? ఈ మృత్యుంజయుడితో కాలయానం చేస్తూ, శాశ్వతంగా వుండిపోవాలా? లేదా, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా? తనని పంపిస్తాడా? అన్న ప్రశ్నలు ఆమె మనసులో కదిలాయి.
ఆమోకి మాత్రం పద్మమాలికని చూసి ఒక పజిల్ విడినట్టనిపించింది తప్ప ఎలాంటి ప్రేమా కలగలేదు.
“కాబట్టి పద్మమాలిక నిజం. నీ కలా నిజం. ఆనందమోహనా! నువ్విప్పుడు నిర్ణయించుకోవలసినది అప్పట్లో నువ్వెవరు అనేది. మైత్రీపాలుడివా? అశ్వికుడివా?” అన్నాడు మృత్యుంజయుడు.
నిజమే తనెవరు? పద్మమాలికకోసం పోటీ పడ్డ ఇద్దర్లో తనెవరు?
“నేనక్కడికి వెళ్తాను” అన్నాడు ఆమో వుద్వేగంతో.
“అవసరమా?” అన్నాడు మృత్యుంజయుడు. వద్దని ఆపితే బావుండునని ఆరాటంగా చూసింది ధన్య.
“నా కలా , అందులోని మనుషులూ నిజమని తెలిసింది. అక్కడితో సరిపోదు. వెళ్ళి లెక్కలు తేల్చుకోవాలి. ఆ స్త్రీ ఎందుకు నన్నిలా వెంటాడుతోందో తెలుసుకోవాలి. లేకపోతే నాకు మనశ్శాంతి వుండదు” అన్నాడు ఆమో. చిన్నపిల్లవాడు మారాము చేస్తున్నట్టుగా అనిపించింది మృత్యుంజయుడికి. తన కొడుకు గుర్తొచ్చాడు.
అతని ప్రయాణం నిర్ధారించబడింది. గంటకి వెయ్యి సంవత్సరాల వేగంతో.
“నువ్వు మైత్రీపాలుడివైతే నీ మృత్యుస్థానం అక్కడ వుంది. అశ్వికుడు కత్తితో అతన్ని పొడిచి చంపేసాడు. నువ్వే అశ్వికుడివైతే నీ మృత్యుస్థానం ఇంకెక్కడో వుంటుంది. రాజకుమారిని ఎత్తుకుపోతుంటే చూస్తూ వూరుకోరుకదా? అతన్ని తరుముతూ వెళ్తారు. అతన్ని చంపేనా ఆమెని రక్షిస్తారు” అని అతనింకా చెప్పబోతుంటే ఆమో అతన్ని ఆపి,
“నేనెవర్నేనా పర్వాలేదు. పద్మమాలికని నేను కలవాలి” అన్నాడు కచ్చితంగా మరో ఆలోచనకి చోటులేనట్టు.
అతన్నెందుకు వెళ్ళనిస్తున్నారు? అన్ని ఆలోచనలూ తెలిసిన మీకు నా మనసు తెలియదా అన్నట్టు కన్నీళ్ళతో చూసింది ధన్య. భయంలేదన్నట్టు ఆమె తలమీద చెయ్యి వేసి నిమిరాడు మృత్యుంజయుడు. కాలనౌకే చేతిలో వున్న అతనికి భవిష్యత్తు తెలియదా? అని స్థిమితపడింది ధన్య. ఆమోకి కలిగిననట్టు అతను తమనేదో చేస్తాడన్న భయం ఆమెకి కలగలేదు.
“మా యిద్దర్నీ చంద్రగ్రహంమీద వదిలిపెట్టి నువ్వు వెళ్ళు” అన్నాడు మృత్యుంజయుడు. వాళ్ళిద్దర్నీ చంద్రగ్రహంమీద వదిలిపెట్టి తను మళ్ళీ బాస్ ఇప్పుడున్న స్థానానికి వేలకిలోమీటర్ల ఎత్తుకి చేరుకోవాలి. అలాగైతేనే ఎవరూ గమనించరు.
“చంద్రుడిమీద ఎక్కడ?” అడిగాడు ఆమో. అతను ధన్యకేసి సూటిగా చూడలేకపోయాడు. చాలా బాధపెడుతున్నాడు ఆమెని. కానీ ఇంతటితో పద్మమాలిక అధ్యాయాన్ని ముగించేసి తనతో మనసు విప్పి మాట్లాడాలి, కలిసి మనసారా నవ్వాలి అనుకున్నాడు. వర్చువల్ కార్నేషన్స్ పడుతుంటే ఆమెతో కలిసి నవ్విన నవ్వు గుర్తొచ్చిందతనికి. అలాంటి క్షణం మళ్ళీ రావాలని ఆరాటపడ్డాడు… అందుకు తన అర్హతని అంతరరంగం ప్రశ్నిస్తున్నా.
“భూమికి కనిపించని సగంలో. లేకపోతే వాళ్ళు మమ్మల్ని తేలిగ్గా పట్టుకోగలుగుతారు” అన్నాడు మృత్యుంజయుడు.
చంద్రుడికి ఒక ప్రత్యేకత వుంది. చంద్రుడు తన చుట్టూ తను తిరిగే వేగం, భూమి చుట్టూ తిరిగే వేగం ఒకటే. ఆ కారణంచేత చంద్రుడెప్పుడూ తన చుట్టూ తను చేసే పరిభ్రమణాన్ని పూర్తిచేసుకోలేడు. చంద్రుడిలో ఒక సగంమాత్రమే భూమికి కనిపిస్తుంది. భూమికి కనిపించని ఆ రెండో సగంలో దిగారు ధన్యా, మృత్యుంజయుడు. ఆమో వాళ్ళకి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు.
“అతను తిరిగొస్తాడా?” అని మళ్ళీ అడిగింది ధన్య.
“నువ్వే చూడు” అన్నాడు మృత్యుంజయుడు.
…