ఊదాపచ్చనౌక 12 by S Sridevi

దాదాపు రెండువేల ఐదువందల సంవత్సరాలక్రితం… ప్రతిష్ఠానపురం. మూలక రాజ్యం. శ్రీముఖుడి రాణివాసం. ఉద్యానవనంలో ఒక్కర్తీ కూర్చుని వుంది పద్మమాలిక. చిక్కి శల్యావశిష్ఠంగా వుంది. ముఖంలో ప్రస్ఫుటమైన దిగులు. కాళికాలయంముందు కూర్చున్నప్పటి మనిషి కాదు. అప్పుడొక ఘనీభూత సౌందర్యం. ఇప్పుడు లీలామాత్రపు సౌందర్యరేఖ. దిగులు మనిషిని ఎంతగానేనా మార్చివేస్తుంది.
ఎంతలో పరిస్థితులు ఎంతగా మారిపోయాయి! అవే సంఘటనలు వద్దన్నా ఆమె కళ్ళముందు కదుల్తున్నాయి.
దీపకర్ణి శాతవాహన వంశానికి ఆద్యుడు. అతడి కొడుకు శాతకర్ణి. మనుమడు శ్రీముఖుడు. వారిది మూలకరాజ్యం. ప్రతిష్ఠానపురం రాజధాని. ఒకప్పుడు సూర్యవంశ క్షత్రియుడు, శ్రీరాముడి పూర్వీకుడు అశ్మకుడు అశ్మకరాజ్యాన్ని స్థాపిస్తే అతడి కొడుకు, అక్షత్రియం చేస్తానని శపథం పట్టిన పరశురామునినుంచీ స్త్రీలు కవచంగా ఏర్పడి కాపాడబడి నారీకవచుడని పిలవబడినవాడు, మూలకుడు ప్రతిష్ఠానపురాన్ని నిర్మించి మూలకరాజ్యాన్ని స్థాపించాడు. ఆ మూలకరాజ్యం ఇప్పుడు శ్రీముఖ శాతకర్ణిది.
దక్షిణాపథం ప్రాబల్యంలేని చిన్నచిన్న రాజ్యాలుగా స్థానికవంశాల పాలనలో వుంది. మగథ, ఆంధ్రలాంటి రాజ్యాలు బలహీనపడ్డాయి. ఆఖరి కణ్వరాజు సుశర్మని వోడించి మగథ రాజ్యాన్నీ, ఆంధ్రరాజుని వోడించి ఆంధ్రరాజ్యాన్నీ జయించాడు శ్రీముఖుడు.
మగథ రాజ్యాన్ని బార్హద్రథులు, ప్రద్యోతనులు,హర్యాంకులు, శిశునాగులు, నందులు, మౌర్యులు, శుంగులు, కణ్వులు వరసగా పాలించారు. రెండవ బార్హద్రథుడనే పేరున్న జరాసంధుడు పాండవ మధ్యముడు భీముడి చేతిలో చనిపోయాడు. అంత పురాతనమైనది ఆ రాజ్యం. ఇంక ఆంధ్రరాజ్యంకూడా అంత పురాతనమైనదే. బలి అనే రాజుకి అంగ,వంగ,సుంహ్మ,పుండ్ర,కళింగాంధ్రులనే ఆరుగురు కొడుకులు. వాళ్ళకి అతడు తన రాజ్యాన్ని పంచి యిస్తే వాళ్ళ పేర్లమీద అవి ప్రశస్తమయ్యాయి. మొదటి ఆంధ్రరాజు ఆంధ్రుడు దశరథుడి సమకాలికుడు. ఆ వంశంలో ఆఖరివాడు జనమేజయుడి సమకాలికుడు. ఆ తర్వాత ఆ వంశం ప్రాచుర్యాన్ని కోల్పోయింది.
ఈ రెండు రాజ్యాలనీ శ్రీముఖుడు జయించాడు. అక్కడితో తన జైత్రయాత్రని ఆపలేదతడు. అశ్మకరాజు గోబదనీ, అతడికి సహాయకులుగా వచ్చి అతడి పక్షాన యుద్ధం చేసిన నారన, కమ్వయస,సిరివయస, సామగోపులనే స్థానిక పాలకులనీ కోటిలింగాల దగ్గిర వోడించి వారి సంపదనంతా తన పరం చేసుకుని, తన విజయానికి చెరిగిపోని గుర్తుగా వారు ముద్రించుకున్న నాణాల వెనుక తన ముద్ర వేసుకున్నాడు.
యుద్ధంలో ఓటమి తర్వాత తన తండ్రి ఖిన్నుడై రాచగృహానికి వచ్చాడు. అతడన్నమాటలు-
“అదేమి రాజ్యకాంక్ష…అదేమి యుద్ధకాంక్ష…ప్రశాంతంగా వున్న దక్షిణాపథాన్ని ఒకనాడు అశోకుడు విధ్వంసం చేసి మహా చక్రవర్తినని పేరు తెచ్చుకున్నాడు. కళింగయుద్ధం తర్వాత ఎంత వగస్తేనేమి, ఎంత మారితేనేమి, బౌద్ధాన్ని కౌగిలించుకుంటేనేమి, జరిగిన హింస సమసిపోదుకదా? చరిత్రపుటలమీదినుంచీ చెరిగిపోదుకదా? మనుషుల మనసుల్లోంచీ తొలగిపోదుకదా? ఇప్పుడీ శ్రీముఖుడు మళ్ళీ అదే హింసని తవ్విపోసాడు. అమ్మా! అతడితో సంధి తప్ప మరో మార్గం లేదు. లేకపోతే నీ తండ్రి, అతడి స్నేహితులు బందీలౌతారు. ప్రజలు ఇక్కట్లపాలౌతారు. నీ మనసు సంసిద్ధం చేసుకో…” అని ఆగాడు.
తరువాతిది చెప్పలేక తల దించుకున్నాడు. అందులో సూచనాప్రాయంగా ఆయన అభిప్రాయం… తను దిగ్గున తలెత్తింది.
“ఔను. నువ్వనుకుంటున్నదే నిజం. అతన్ని అల్లునిగా చేసుకుని అందరి పరువూ నిలబెట్టబోతున్నాను”
తన మనసులో ప్రకంపనలు… ఈ యుద్ధం పర్యవసానం ఇదా? ఎవరు చేసిన తప్పు ఎవరి జీవితగతులని మార్చబోతోంది? ఒక చిన్న రాజ్యం అశ్మక. దాని చుట్టూ వున్న మరికొన్ని చిన్న చిన్న రాజ్యాలు… ఎంతో సాదాగా ఎలాంటి ఆకాంక్షలూ లేకుండా జీవిస్తున్నాయి. మూలక కూడా చిన్నదే. దాని రాజ్యకాంక్ష అందరి జీవితాలనూ తలక్రిందులు చేస్తోంది. ఇందులో తన పాత్ర ఎంత? తన కలలెందుకు ఛిద్రమౌతున్నాయి?
“నాన్నగారూ! నెను మైత్రీపాలునికి వాగ్దత్తను. మా వివాహానికి మీరొప్పుకున్నారు” అంది తను కన్నీళ్ళతో. జరగబోయేదాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
“పద్మా! అదంతా గతం” అన్నాడు తండ్రి. “ఇప్పుడీ రాజ్యం, ప్రజలు వారి సౌఖ్యంతోపాటు నీ తండ్రీ అతడి అనుచరుల గౌరవమర్యాదలు నీ చేతిలో వున్నాయి. బంధుత్వం ఒకటే ఈ అన్నిటినీ కాపాడుతుంది”
ఇంక చెప్పేదేమీ లేదన్నట్టు ఆయన అక్కడినుండీ వెళ్ళిపోయాడు.
తనముందున్నవి రెండే దారులు. ఒకటి మైత్రీపాలునితో రాజ్యం వదిలి పారిపోవటం. సమీపారణ్యాలలోని శబరజాతులని సమైక్యపరుచుకుని తిరుగుబాటు చెయ్యటం… దీనికి చాలా మూల్యం చెల్లించవలసి రావచ్చు. తండ్రి భయపడినవన్నిటినీ పణంగా పెట్టవలసిరావచ్చు. రెండవది… అతడిని కడసారి చూసి పరాధీన కావటం… ఈ రెండిటిలో ఏది చెయ్యాలోకూడా అతన్నే నిర్ణయించమనాలి.
తల్లిగానీ తండ్రిగానీ తన ముఖాన్ని చూడలేకుండా వున్నారు. తన నిర్ణయమ్మీద ఐదు రాజ్యాల ప్రజలు ఆశలు పెంచుకున్నారు. సంకేతస్థలానికి రమ్మని మైత్రీపాలునికి కబురు పంపి తను చెలికత్తెలతో బయలుదేరింది. తండ్రి యుద్ధంలో వోడటంతోటే ఆయన అంత:పురమర్యాద అంతరించిందన్న విషయం కొంత ఆలస్యంగా తెలిసింది. తను మైత్రీపాలుడిని కలవటానికి వెళ్ళబోతున్న విషయం శ్రీముఖుడికి తెలిసిపోయింది. కలవటానికి వస్తున్నవాడిని తన కళ్ళముందే చంపేసి తననెత్తుకుపోయాడు.
పెళ్ళైపోయింది. తనీ అంత:పురంలో బందీ అయింది. కానీ తన మనసు?
కళ్ళు మూసినా తెరిచినా అదే దృశ్యం… రక్తపుమడుగులో గిలగిల కొట్టుకుని మైత్రీపాలుడు ప్రాణం వదిలిన దృశ్యం… అతడి చావుకి తనేనా కారణం? అంతిమంగా శ్రీముఖుడితో తన పెళ్ళి తప్పనిదైనప్పుడు మైత్రీపాలుడి అపమృత్యువుని చేజేతులారా ఎందుకు ఆహ్వానించినట్టు? శ్రీముఖుడి రాక కొంచెం ఆలస్యమై వుంటే మైత్రీపాలుడితోపాటుగా తననూ చంపేసి వుండేవాడేమో! అప్పుడు తన తండ్రీ, రాజ్యమూ,ప్రజలూ ఏమై వుండేవారు? తనతనికి దక్కిందిగాబట్టి శ్రీముఖుడనే అగ్నికీల కొంత చల్లారిందేమో! నిరంతరం అదే చింతన… ఈ యుద్ధం, పెళ్ళీ ఒక మిథ్య… మైత్రీపాలుని చావు… అదొక్కటీ మాత్రమే నిజం…
దు:ఖాన్ని తట్టుకోలేకపోయింది పద్మమాలిక. చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న సమయాన ఏదో పెద్ద వాహనం ఆగిన చప్పుడు. అంత:పుర వుద్యానవనానికి బయటినుంచీ చుట్టూ రక్షణవలయం వుంతుంది. దాన్ని ఛేదించుకుని ఎవరూ రాలేరు. కానీ ఈ వచ్చిన వాహనం ఆకాశమార్గంలోంచీ దిగింది.
పద్మమాలిక నివ్వెరబోయింది. అప్పటికింకా విమానాలు లేవు. పురాణాల్లో చదువుకోవటమే. ఆమె ఆశ్చర్యం తీరకముందే అందులోంచీ ఒక వ్యక్తి దిగాడు. అతన్ని చూసి ఆమె నిలువునా కంపించిపోయింది.
“మైత్రీపాలుడా? అచ్చం అలాగే వున్నాడు. కానీ అతడు తనకళ్ళముందే మరణించాడు. అతడు విమానచోదకుడు కాదు. అతని ఆహార్యం ఇలా వుండదు…” అమె ఆలోచనలు సాగుతునే వున్నాయి. అతడొచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
“ఎవరు నువ్వు? ఎంత సాహసం? నేనెవరో తెలుసా? శ్రీముఖ శాతకర్ణి రాణిని…” అని ఆమె ప్రతిఘటిస్తునే వుంది. అతడామెని లాక్కుని వెళ్ళి తన వాహనంలో కూర్చుండబెట్టాడు. క్షణాలలో అది పైకి లేచింది. ఊదాపచ్చ కవచాన్ని ఆమెకి చూపించి తొదుక్కోమని సూచించాదు. ఆమె యాంత్రికంగా చేసింది.

ఆ తర్వాతి సంఘటనలన్నీ త్వరత్వరగా జరిగిపోయాయి.
“చంద్రుడిమీద ఇద్దరు మనుషులు దిగారు” అని ప్రకటించింది నాసా. ఆ తర్వాత కొద్దినిముషాలకే రెండో ప్రకటన వచ్చింది. “వారిలో ఒకరు కనిపించడం లేదు. ఒకరే కనిపిస్తున్నారు” అని.
కొద్దిసేపటికి భూమ్మీది ఒక కోటిమంది వ్యక్తులు వున్నట్టుండి మాయమయ్యారు. చంద్రుడిమీదున్న ధన్యతో సహా. వాళ్ళు వేసుకున్న బట్టలు అలా కుప్పల్లా జారిపోయాయి. వాళ్ళు లేరు. మాయమైన ధన్య స్థానంవైపు సాలోచనగా చూసాడు మృత్యుంజయుడు. ఏం జరిగి వుంటుందో సూచనప్రాయంగా అర్థమైంది. ఆమో తిరిగి వస్తే అది నిర్ధారణౌతుంది. అతనిలా ఎందుకు చేసాడు అనేది ప్రశ్న.
భూమ్మీది పరిస్థితి చాలా గందరగోళంగా వుంది. ఒక పాపాయి వుయ్యాల్లోంచీ తల్లి చూస్తుండగానే మాయమైంది. అలాగే ఆమె తండ్రి, నాయనమ్మ… ఇలా కొన్ని తరాలవాళ్ళు అదృశ్యమయారు. మాట్లాడుతూ మాట్లాడుతూ వున్న యువకుడు, మంచమ్మీద పడుక్కున్న వృద్ధుడు, కంప్యూటర్ ముందు పనిచేసుకుంటున్న వుద్యోగి… ఒకొక్క ఇంట్లోంచే ముగ్గురూ నలుగురూ కొన్ని చోట్ల. మాయమైనవారిలో సామాన్యులు, అనామకులతోపాటు కొన్నిదేశాల అధ్యక్షులు, ప్రముఖ సంస్థల అధిపతులు ఇంకా ముఖ్యమైనవాళ్ళెందరో వున్నారు. ఈ వార్తలన్నీ, దృశ్యశ్రవణ మాధ్యమాలద్వారా ప్రజలకి తెలుస్తున్నాయి. పెద్ద కల్లోలాన్ని సృష్టించసాగాయి.
అబ్రహం ఆమ్నెస్టీ ఇంట్రనేషనల్ ముందు వున్నాడు. అ సంస్థ అధినేతకూడా అదృశ్యమైనవారిలో వున్నాడు.
ఇలా ప్రతి వెయ్యిమందికీ ఒకరు తమ కళ్ళముందే అదృశ్యమయ్యేసరికి ప్రజల ఆగ్రహం మిన్నంటింది. మాయమైన ప్రతి వొక్క వ్యక్తి వెనుకా తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్యాపిల్లలు లేక భర్త, వెరసి ఒక పాతికమంది కనీసం… వెరసి పాతిక కోట్లమంది…తిరగబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద అల్లకల్లోలం చెలరేగింది. ప్రభుత్వాలు శాస్త్రవేత్తల చేత చేయిస్తున్న ప్రయోగాలే కారణమని నిరసనలు వెల్లువెత్తుని లేచాయి. ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేస్తున్నారు.
ఈ వార్తలన్నీ కుప్పతిప్పలుగా వివిధ దేశాధినేతలముందు వచ్చిపడుతున్నాయి. అన్నివేళ్ళూ భారత్‍వైపుకి తిరిగాయి. బాస్ చేస్తున్న ప్రయోగాలవల్లనే ఇదంతా అని.
ప్రిమియర్ ఆలోచనలో పడ్డారు. ఆమో ఆ ఏలియన్ నౌకని పట్టుకోబోయాడా? బాస్‍కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అతనిలాంటి పని ఎందుకు చేసాడు? ఆ ఏలియన్ షిప్‍లోనివాళ్ళే ఇదంతా చేసారా? వాళ్ళే ఆమో ధన్యలని ఎత్తుకుపోయారా? వున్నట్టుండి మనుషులు మాయమవ్వటం ఎలా సాధ్యం? చంద్రుడిమీద దిగినవాళ్ళెవరు? ఎన్నో ప్రశ్నలు. శ్యామ్‍తో కలిసి అంతరిక్షంలోకి బయల్దేరారు.
బాస్ విశ్వా శకలాలు వెతకటానికి తోడ్పడబోయిన పదిదేశాల వ్యోమనౌకలు చంద్రమండలాన్ని చుట్టుముట్టాయి. మృత్యుంజయుడు వాళ్ళకి కనిపించకుండా ఒక కొండ వెనక్కి తప్పుకున్నాడు.
ఇంతలో ఆకాశంలో ఒక అద్భుతం. ఆమో తన ఎనిమిదేళ్ళ వయసులోనే చూసినది… వూదాపచ్చరంగు గాలిపటం… అక్కడ ప్రత్యక్షమైంది. అది వేగంతో గుండ్రంగా తిరుగుతూ మామూలు వ్యోమనౌకగా మారటం అందరూ చూస్తుండగా జరిగింది.
అందులోంచీ ముందు ఆమో దిగాడు. అతను తన స్పేస్ సూట్‍లోనే వున్నాడు. తరువాత వూదాపచ్చరంగు తొడుగు వేసుకున్న ఆకారం దిగింది. ఆ ఆకృతిని చూసి అంతా కొంచెం వెనక్కి తగ్గారు. ఏలియన్ అనుకున్నారు. అన్ని వ్యోమనౌకల్ని చుట్టూ చూసి ఏదో జరిగి వుంటుందని ఆమో గ్రహించాడు. తననీ ధన్యనీ వెతకడానికైతే ఇన్ని నౌకలు రావు.
“ఆమో! నువ్వు బ్రతికే వున్నావా?” అని మొదట పలకరించింది ప్రిమియర్, తరువాత శ్యాం.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s