ఊదాపచ్చనౌక 13 by S Sridevi

ఆమోతో వున్న మరో ఆకృతిని చూసాక ఏం జరిగివుంటుందో వూహించాడు మృత్యుంజయుడు. ఆమో పద్మమాలికని గతంలోంచీ భౌతికంగా ఎత్తుకొచ్చేసాడు. ఆమెనుంచీ విస్తరించిన జనాభా అంతా గల్లంతై వుంటారు. ధన్య అదృశ్యానికి గల కారణంకూడా ఇదే.
“ఆమో! ఆ ఏలియన్నీ, ఏలియన్ నౌకనీ మాకు అప్పగించు” గంభీరంగా అన్నాడు శ్యాం తన విధినిర్వహణలో భాగంగా.
“నువ్వు చేసిన ప్రయోగంవలన కోటిమంది ప్రజలు వున్నట్టుండి అదృశ్యమయారు. ఏలియన్‍షిప్‍ని నువ్వెందుకు పట్టుకున్నావు? అది నువ్వొక్కడివే చెయ్యాల్సిన పని కాదు. వాళ్ళకి నువ్వెలా చిక్కావు? ఎందరున్నారు, ఇలాంటివాళ్ళు?” నాసా ప్రతినిధి అడిగాడు.
ప్రశ్నలమీద ప్రశ్నలు… ఆరోపణలమీద ఆరోపణలు… ఆమో చుట్టూ ఒక వలయం బిగుసుకుంటోంది. పరిస్థితి మృత్యుంజయుడికి అర్థమైంది. అతడు కొండ వెనకనుంచీ వచ్చాడు.
“మరో ఏలియన్…” సంభ్రమం. ఎంతమంది వున్నారు వీళ్ళు?
ఎవరూ పట్టుకునే ప్రయత్నం చెయ్యలేదు. నేరుగా దగ్గిరకి వెళ్ళడానికి భయపడ్డారు. అతను వెళ్ళి నౌకలో కూర్చున్నాడు. టెలిపతిక్ కమూనికేషన్ సిస్టం ఆన్ చేసాడు. అక్కడున్న అందరి మెదళ్ళూ పనిచెయ్యడం మానేసాయి. మృత్యుంజయుడు చెప్పిన విషయాలుమాత్రమే గ్రహించసాగాయి.
“మేం మాట్లాడుకోవాలి” అన్నాడు మృత్యుంజయుడు. ఆమో పద్మమాలిక చెయ్యిపట్టుకుని నౌకలోపలికి వెళ్ళిపోయాడు. ధన్యకోసం అతని కళ్ళు వెతుక్కున్నాయి.
“నువ్వేం చేసావో నీకు అర్థమౌతోందా?” అతనికి ఆంటెన్నా అమర్చాక అడిగాడు మృత్యుంజయుడు.
“ధన్య ఏది? ఏం జరిగింది? మేం బతికే వున్నామని వీళ్ళకెలా తెలుసు?” అయోమయంగా అడిగాడు ఆమో.
“నీకోసం ధన్యకోసం వెతుకుతున్నారు. ఈ నౌకలన్నీ అవే. కానీ నువ్వీ పద్మమాలికని గతంలోంచీ తీసుకొచ్చావు చూడు, దాని పరిణామం ఏదిగా వుంటుందో నీకు తెలుసునా?”
ఆమో ఆలోచన పనిచెయ్యలేదు.
“గ్రాండ్ ఫాదర్స్ పారడాక్స్” అన్నాడు మృత్యుంజయుడు.
ఆమో కరెంటు షాక్ కొట్టినవాడిలా అయాడు. ఒక వ్యక్తి యొక్క తాతని అతని తండ్రి పుట్టకముందే గతంలోకి వెళ్ళి చంపెయ్యడం. పద్మమాలికని గతంలోంచీ తీసుకురావటంకూడా అలాంటిదే. ఆమె ఈ రెండువేలసంవత్సరాల వారసులంతా ఇప్పుడు అదృశ్యమయ్యారు. తనకీ చిన్న విషయం తట్టలేదెందుకని? తలపట్టుకున్నాడు.
“ధన్యకూడానా?” అడిగాడు. మృత్యుంజయుడు తలూపాడు.
“పరిష్కారం?”
“పద్మమాలికని తిరిగి పంపెయ్యటమే”
“అందుకు కొంచమెనా వ్యవధి వుందా? నేనామెతో మాట్లాడాలి. ఇంతలో ధన్యకేం కాదుకదా?” అడిగాడు ఆమో.
“ఇలా మాయమైనవాళ్ళు ఏమౌతారో నాకు తెలీదు. అక్కడ నువ్వు మాట్లాడలేదా?”
“లేదు. అమె నన్ను చూసి భయపడింది. చెయ్యిపట్టుకుని తీసుకొచ్చేసాను” “ఆమె నీతో రావడం ఒక వింతే” అన్నాడు మృత్యుంజయుడు తన ఆత్మీయుల విషయంలో జరిగింది తలుచుకుని.
ఇద్దరికీ ఆంటెనాలు అమర్చాడు. సంభాషణ మొదలైంది. పద్మమాలిక ఆమోని కోపంగా అడిగింది.
“నువ్వెవరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నా భర్త శాతవాహనరాజు శ్రీముఖశాతకర్ణి. అత్యంత బలవంతుడు. నీ గతేం కానున్నదో తెలుసా?”
“అసలు నువ్వెవరివి? మైత్రీపాలా, మైత్రీపాలా అని అరుస్తూ నా కలలోకి వస్తున్నావు?” అంతకంటే కోపంగా అడిగాడు ఆమో.
“మైత్రీపాలుడా? ” ఆమె ముఖం వివర్ణమైంది. ఆమోని పట్టి చూసింది. “నిన్ను చూడగానే మొదట అలాంటి అనుభూతి కలిగిందిగానీ నువ్వు మైత్రీపాలుడివి కావు. అతడిలాంటి ఆహార్యం ధరించడు” అంది.
“చెప్పు పద్మమాలికా! నీ కథేంటో!” అన్నాడు మృత్యుంజయుడు.
ఆమె చెప్పింది.
“మాది అశ్మకరాజ్యం. నా తండ్రి గోబద అని పిలవబడే గోభద్రుడు. మా రాజధాని బహుధాన్యపురం. మా తల్లిదండ్రులకు నేనొక్కదాన్నే కూతుర్ని. అపురూపంగా పెంచారు” అని ఆగింది. అమె కళ్ళు కన్నీళ్ళతో నిండాయి. “రాచకూతుళ్ళూ, కొడుకులూ చాలా గారాబంతో పెరుగుతారు. కానీ కొడుకులని యుద్దాలకీ, కూతుళ్ళని సంధిప్రయత్నాలకీ బలివ్వక తప్పదు” అంది కన్నీరు తుడుచుకుంటూ.
ఆమోకి ఇది అప్రస్తుతమైన విషయం. అతని మనసంతా ధన్య నిండి వుంది.
“మా రాజ్యంలో పేరుకు తగ్గట్టే వజ్రాలు విస్తారంగా దొరుకుతాయి. శ్రీముఖుడనేవాడిది ప్రతిష్ఠానపురం. మూలకరాజ్యం. శాతకర్ణి బిరుదు దాల్చి, ఆఖరి కణ్వరాజు సుశర్మని చంపి మగధ రాజ్యాన్ని ఆక్రమించాడు. అలాగే ఆఖరి ఆంధ్రరాజుని చంపి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. తర్వాత అస్మకరాజైన మాతండ్రిని కోటిలింగాలవద్ద వోడించాడు. మా తండ్రికి సహాయకులుగా వచ్చిన నారన, సిరివయస,కమ్వయస, సామగోపులనే రాజులనికూడా వోడించాడు.”
ఆమో మనసులో ధన్య కొంచెం తొలిగి పద్మమాలిక చెప్పిన మాటలకి చోటిచ్చింది. ఇవన్నీ ఆర్కియాలజీ విభాగపు వ్యాసాలలో ఎప్పుడో చదివినవి. ఇప్పుడు ప్రత్యక్షసాక్షి చెప్పగా వింటున్నవి. ఆశ్చర్యంగా అనిపించింది.
” సంధి ప్రయత్నంలో భాగంగా మా తండ్రి నన్నిచ్చి వివాహం చేయటానికి వప్పుకున్నాడు. తప్పలేదు. అప్పటికే నేను మైత్రీపాలుడిని వరించాను. ఇద్దరి వివాహానికి మా తల్లిదండ్రులుకూడా అనుమతించారు. కానీ ఇంతలో ఇలా మారిపోయింది. ఎవరో అపరిచితుడిని, నా తండ్రిని వోడించినవాడిని చేసుకోవడం నాకెంతమాత్రం ఇష్టంలేకపోయింది. మైత్రీపాలుడితో కలిసి ఎక్కడికేనా పారిపోవాలనుకున్నాను. అందుకై కాళికాలయానికి వచ్చి అతడికోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో గుర్రంమీద వచ్చి నా కళ్ళముందే అతడిని చంపి నన్నెత్తుకుపోయాడు ఒక వ్యక్తి. అతడే రాజు శ్రీముఖుడు.”
శ్రోతలిద్దరూ ఆశ్చర్యంగా చూసారు. తను ఆ జన్మలో మైత్రీపాలుడా? ఆమోకి నమ్మశక్యంగా అనిపించలేదు.
“మైత్రీపాలుడు గొప్ప యోధుడు. గుర్రపుస్వారీ, కత్తిసాములో సాటిలేనివాడని మా రాజ్యంలో పేరుగాంచినవాడు. అలాంటివాడిని తృటిలో చంపి నన్ను సునాయసంగా గెలుచుకున్న రాజుపట్ల నాకు కించిత్ గౌరవం కలిగింది. అతనితో వివాహం తప్ప మరో మార్గాంతరం కనిపించలేదు. నేనొప్పుకోకపోతే నా తండ్రినతడు బందీగా తీసుకుపోతాడు. మైత్రీపాలుడితో పారిపోతేకూడా నీ తండ్రి బందీయేకదా అని అనచ్చు. మైత్రీపాలుడితో నా పెళ్ళి దైవికమైనది. నా అనుబంధం ఆంతరంగికమైనది. ఆ వ్యక్తిని మొదటిసారి చూడగానే నా తనోమనస్సాంతరంగాలన్నీ పులకించిపోయాయి. నేను నా భర్తతో తప్పించుకుని పారిపోతున్నాననుకున్నాను. బయటినుంచీ తిరుగుబాటు చేసి, రాజ్యాన్ని తిరిగి సాధించుకోవాలనుకున్నాను. నా తండ్రిని విడిపించుకోవాలని భావించాను. కానీ అతడే లేకపోయాక ఇంక నేను చేయగలిగినదల్లా నా రాజ్యాన్నీ తల్లిదండ్రులనూ కాపాడుకోవడం.
శ్రీముఖునితో నా పెళ్ళైంది. రాజ్యవిస్తరణ కాంక్షతో నిరంతరయుద్ధాలతో మునిగి తేలే రాజులకి ఎందరో భార్యలు. క్రమంగా నేను నా వునికిని కోల్పోయి అంత:పురంలో భాగమయాను. మైత్రీపాలుడి జ్ఞాపకం జాగృతమైంది. ప్రాణాలొదిలేముందు అతడు చూసిన చూపు, అతడినలా వదిలేసి నేను రాజుతో వెళ్ళిపోవటం, నా పెళ్ళి, ఇవన్నీ నాలో అపరాథభావన నింపాయి. నాలోని జీవరసాన్ని పీల్చేసాయి” పద్మమాలిక ఇంక చెప్పలేక ఆగిపోయింది. అది ఆమె వర్తమానం. ఆమో అక్కడినుంచీ ఆమెని తీసుకొచ్చాడు.
ఆమెకి మైత్రీపాలుడితో వున్న అనుబంధం ఎంత బలీయమైనదో అర్థమైంది మృత్యుంజయుడికి. అందుకే ఆమె ఆమో వెంట ఇంతకాలందాకా రాగలిగింది. ఇప్పుడిక చెయ్యవలసినది ఆమోనే అప్పటి మైత్రీపాలుడని ఆమెకి నచ్చజెప్పి సాంత్వన చేకూర్చడం. అప్పుడుగానీ ఆ అనుబంధం సమసిపోదు. ఆమోకి కలనుంచీ విముక్తి వుండదు.
“పద్మమాలికా! మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారో లేదో నాకు తెలియదు. కానీ మేము నమ్మే విషయాలని చెప్తాను. ఆ రోజుని అలా చనిపోయిన మైత్రీపాలుడి ఆత్మ అక్కడితో ఆగిపోయిందంటావా? లేదు. పునర్జన్మనెత్తింది. ఎత్తుతునే వుంది. సాంత్వన పొందని తన వుద్వేగంకోసం వెతుకుతునే వుంది. ఇదుగో ఇతడే అప్పటి ఆ మైత్రీపాలుడు. చూసావుగా, సజీవంగా యౌవనంతో ఎలా వున్నాడో!” అన్నాడు ఆత్మీయంగా.
తను వూహించినదే ఐనా మృత్యుంజయుడి నోటి వెంట వినేసరికి ఆమోకి ఆశ్చర్యం కలిగింది. కానీ పద్మమాలికపట్ల ఎలాంటి భావోద్రేకం కలగలేదు. అతడీ అనుబంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నాడు.
“నిజమా?” అడిగింది పద్మమాలిక కుతూహలంగా ఆమోని చూస్తూ. ఆమె మనసుని చల్లటి ప్రశాంతత ఆవరించింది.
“ఆమో, నీలో ఆ జ్ఞాపకం ఎందుకు జాగృతమైందో తెలుసా?” అడిగాడు మృత్యుంజయుడు.
ఆమో చెప్పమన్నట్టు చూసాడు” మైత్రీపాలుడిగా నువ్వు చనిపోయిన స్థానంలోనే ఆమోగా పడుక్కున్నావుకాబట్టి” అన్నాడు.
“ఇద్దరూ నిశ్చింతగా వుండండి. ఆమో, పద్మమాలిక నిన్ను భర్తవనుకుందిగాబట్టి నీతో వచ్చేద్దామనుకుంది. నువ్వు చనిపోయాక రాజ్యరక్షణకోసం శ్రీముఖుడిని చేసుకుంది. పిల్లల్నికూడా కన్నది. అలాగే పద్మమాలికా, నువ్వు విను. మైత్రీపాలుడు చనిపోయి అలాగే వుండిపోలేదు. ఎన్నో జన్మలెత్తి ఈరోజుకి ఆమోగా అవతరించాడు. ఎవరిదారిని వారు బ్రతకండి” అని బలమైన సూచనలిచ్చాడు. పద్మమాలికలోని అపరాథభావం తొలిగిపోయింది.
“ఇప్పుడింక ఎక్కువ ఆలస్యం చెయ్యద్దు. బయట వున్నవాళ్ళ మెదళ్ళు స్తంభించిపోయాయి. ముందు మీదేశాధినేతతో మాట్లాడదాం. తర్వాత ఇదే కాలనౌకలో పద్మమాలికని పంపించేద్దాం” అన్నాడు మృత్యుంజయుడు.
“మరి నౌక తిరిగి ఎలా వస్తుంది?” అడిగాడు ఆమో.
“నేను తనతో వెళ్తాను. గతంలోకీ వర్తమానంలోకీ తిరుగుతున్న ఈ కాలంలో నా చావుపుట్టుకలు రచించబడలేదు. నాకు జన్మస్థానంగానీ మృత్యుస్థానంగానీ లేవు. పద్మమాలికతో నాకు రుణానుబంధంకూడా ఏదీ లేదు. అందుకని తిరిగొస్తాను” అన్నాడు మృత్యుంజయుడు. అతనిమాటల్లో లోతైన వుద్వేగం వుంది. అదేంటో అర్థం కాలేదు ఆమోకి.
“తిరిగొస్తారా?” అని అడిగాడు సందేహంతో.
నిగూఢంగా నవ్వాడు మృత్యుంజయుడు.
“తర్వాత చెప్తాను. ఈ వ్యోమనౌకలన్నీ మనని చుట్టుముట్టాయి. ముందు మీ దేశాధినేతతో సమావేశం ఏర్పరుచుకుని దారి సుగమం చేసుకోవాలి” అన్నాడు మృత్యుంజయుడు.
ఆమో బయటికి వచ్చి, ప్రిమియర్‍నీ, శ్యాంనీ వెంటపెట్టుకుని వెళ్ళాడు.
వాళ్లకి నమస్కరించాడు మృత్యుంజయుడు. నిజానికి వాళ్లకన్నా అతను చాలా పెద్దవాడుకాబట్టి నమస్కరించాల్సిన అవసరం లేదు. అయినా లోకమర్యాదని పాటించాడు. యాంటెనాలు అమర్చబోతుంటే ఏదో చెయ్యబోతున్నాడని భయపడి వాళ్లు వెనక్కి జరిగారు.
కంగారుపడొద్దని సంకేతం ఇచ్చాడు ఆమో. మృత్యుంజయుడు తన పని చేసుకున్నాడు. సంభాషణ మొదలైంది. ఆమోలాగే వాళ్లు కూడా అనుభూతి చెందారు. పెదాలు కదలకుండా మెదడులోంచి ఆలోచనలు వస్తూ వెళ్తూ ఉంటే తికమకగా అనిపించింది. ఆమో అయితే శాస్త్రవేత్త కాబట్టి మొదట తికమకపడ్డా తొందరగానే అలవాటు పడ్డాడు. ఈ ఇద్దరికీమాత్రం చాలా కష్టమనిపించింది.
“నమస్తే . నా పేరు మృత్యుంజయుడు. ఈమె పద్మమాలిక. మీరనుకుంటున్నట్టు మేము గ్రహాంతరవాసులము కాము. కాలాంతరవాసులము. నేను తొమ్మిది, పద్మ మాలిక రెండు సహస్రాబ్దాల వెనుక బతికినవాళ్ళం” అని పరిచయం చేసుకున్నాడు.
ప్రీమియర్, శ్యామ్ ఆశ్చర్యంతో తలమునకలయ్యారు. ఆమోవైపు కొంత ప్రశంసగానూ, కొంత సందిగ్ధంగానూ చూశారు.
“మీ శాస్త్రవేత్తలు ఆమో, ధన్యాపార్థసారథి నా నౌకని పట్టుకోవాలని ప్రయత్నించారు. అది కచ్చితంగా దుందుడుకు చర్యే. అయితే ఆ ప్రయత్నం విఫలమయ్యి, వాళ్ళిద్దరూ ప్రాణాపాయస్థితిలో పడ్డారు. నేను కాపాడి నా నౌకలోకి తీసుకొచ్చాను. ఒక సహశాస్త్రవేత్తగా వాళ్ల ఆసక్తిని అర్థం చేసుకుని నౌక సూత్రాలన్నీ చెప్పాను. అతని ఆలోచనలు కొన్నిటిలో అస్పష్టత ఉంది. దాన్ని గురించి చర్చించే క్రమంలో అతని ఆలోచనలను ఈ పద్మమాలిక ప్రభావితం చేస్తోందని తెలిసింది. అతనివరకు పద్మమాలిక ఒక కల. కానీ గత జన్మల్లోని జ్ఞాపకం అని నేను గ్రహించాను” అని ఆగాడు మృత్యుంజయుడు.
ఆమో కలల్లో విహరించే పద్మమాలిక గురించి ఎవరికీ తెలీదు. అది అతని ఆంతరంగిక విషయం. అతను బాస్ లో చేరటానికి, చేరాక చేసిన ప్రయోగాలకి, ఇప్పటి ఈ పరిణామాలకు సంబంధం ఉంటుందని వాళ్ళు అనుకోలేదు.
“ఇది కాలాంతరయానం చెయ్యగలిగే వ్యోమనౌక. మీరు అసాధ్యం అనుకున్న దాన్ని మేము కొన్ని వేల సంవత్సరాల క్రితమే సాధించాము. తన గతాన్ని వెతుక్కోమని ఆమోకి నా నౌకని ఇచ్చాను. అతను ఏకంగా పద్మమాలికనే తీసుకు వచ్చేసాడు. దీని పరిణామం ఆమె సంతతి అంతా అదృశ్యమయ్యారు. అంటే గతంలోకి వెళ్లి ఒక వ్యక్తి తండ్రి పుట్టకముందే అతని తాతని చంపేయటంలాంటిది”

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s