ఊదాపచ్చనౌక 14 by S Sridevi

“గ్రాండ్ ఫాదర్స్ పారడాక్స్” అన్నాడు ఆమో చిన్నగా, వివరిస్తూ.
“అలా అదృశ్యమైనవారిలో రెండో శాస్త్రవేత్త ధన్య పార్థసారథి కూడా ఉంది. ఈ పద్మమాలికని తక్షణం తన స్థానానికి చేరిస్తే మాయమైనవాళ్లంతా తిరిగి వస్తారు. నేను తనని చేర్చి వస్తాను ” అనగానే ప్రీమియర్ లో మార్పు వచ్చింది. కాలనౌకని వదిలిపెట్టటం ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది. ఇతను చెప్తున్నదంతా నిజమేనా? తప్పించుకుపోవడానికి అలా అంటున్నాడా? అనే సందేహంతో ఆమో ముఖం కేసి చూశాడు. ఆమోని కూడా నమ్మలేకపోతున్నాడు. అతడిప్పుడు మృత్యుంజయుడి అధీనంలో వున్నాడుకదా!
“ఈ నౌక గురించి… ఇది విరుద్ధపదార్థంతో నడుస్తుంది. కొన్ని వందలసార్లు ఈ భూగోళాన్ని ధ్వంసం చేయగలిగేంత విరుద్ధ పదార్థం అందులో పోగుపడి ఉంది. దాన్నెలా నాశనం చెయ్యాలో తెలీక నేనిలా అంతరిక్షంలో కాలపు తీగల్ని పట్టుకుని వేలాడుతున్నాను. పద్మమాలికని దింపి తిరిగి వచ్చాక నేనెక్కడ దిగాలో చెప్తే దిగి, మీకీ నౌకని స్వాధీనపరుస్తాను. కానీ ఇందులో వున్నది కొన్ని వందల రణగోళాలకి సరిపడంత పదార్ధం” అన్నాడు మృత్యుంజయుడు.
అణుయుద్ధాలకీ, అణ్వాయుధాలకీ వ్యతిరేక సిద్ధాంతంతో నడుస్తున్న దేశానికి అధినేత ఆ మాటలు విని తల్లడిల్లిపోయాడు.
“ప్రపంచదేశాలన్నీ సమాఖ్యగా ఏర్పడి నిరాయుధీకరణ వప్పందాన్ని చేసుకున్నాయి. ఈ విషయాన్ని వాళ్ళతో చర్చిస్తాను” అన్నాడు.
“ఆలస్యం మంచిదికాదు. కోట్లమంది జనాన్ని నష్టపోతారు” హెచ్చరించాడు మృత్యుంజయుడు. ఇతరదేశాల ప్రతినిధుల మెదళ్ళు విదుదలయ్యాయి. ఆ కొద్దిసేపూ తమకేం జరిగిందీ, ఆలోచనలెందుకు స్తంభించాయో అర్థమవలేదు. తమకి వినిపించకుండా అర్థమైన మాటలు ఎక్కదినుంచీ వచ్చాయో తెలీలేదు.
ప్రిమియర్ శ్యామ్, ఆమోలతో ఇవతలికి వచ్చారు.
అప్పటికి భూమ్మీంచీ వచ్చిన అనేక వార్తలు పోగుపడి వున్నాయి. క్షణక్షణానికీ అక్కడ పరిస్థితులు తీవ్రతరమౌతున్నాయి.
“పద్మమాలిక వెళ్తే పరిస్థితి చక్కబడుతుందా?” ఆమోని అడిగారు ప్రిమియర్.
“సరిగ్గా నేనెక్కడినుంచీ ఆమెని తీసుకొచ్చానో ఆ రీడింగ్ రికార్డై వుంటుంది. అక్కడికి ఆమెని చేర్చాలి” అన్నాడు ఆమో!
“కాలనౌక నీ చేతికి వచ్చినప్పుడు నేరుగా బాస్‍కి రాకుండా నీ కలని వెతుక్కుంటూ వెళ్ళటమేమిటి?” ప్రిమియర్ గొంతు ఖంగుమంది.
“తిరిగి వచ్చే వప్పందంమీదే అతడు దాన్ని నాకిచ్చాడు. అంత ధైర్యంగా ఇచ్చాడంటే అతనిదగ్గిర ఇంకేం వున్నాయో నాకు తెలియదుగా? అందుకే అతని దగ్గిరకే తిరిగి వచ్చాను” తడబడకుండా అన్నాడు ఆమో.
“విరుద్ధపదార్ధం నిజమా?”
“అక్షరాలా. మేం విసిరిన లేజర్, గ్రాఫీన్ మెష్‍కి వ్యతిరేక దిశలో కదిలి కాలనౌక విశ్వాని ఆకర్షించింది”
“విశ్వా ఎలా పేలిపోయింది?”
“పేలిపోలేదు. చీలిపోయింది”
ప్రిమియర్‍కి ఇంకేం మాట్లాడాలో తోచలేదు. ఆమోని విచారించేదుంటే భూమ్మీదికి వెళ్ళాక ఆ పని చెయ్యచ్చుననుకున్నాడు. కానీ ప్రాణాలకి తెగించి అంత సాధించిన ఆ యువకుడిమీద రావల్సినంత కోపం రాలేదు. అల్లరిపని చేస్తూ పట్టుబడ్డ చిన్నపిల్లవాడిలా అనిపించి మోహపెట్టాడు. అంత ప్రయత్నం మీద సాధించుకున్నదాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే ఆలోచన సాగుతోంది. శ్యాంకైతే ఒక ట్రాన్స్‌లో వున్నట్టే వుంది. ఆమోమీద ఆరాధనైతే తలమునకలుగా వుంది. అనుకున్నది సాధించాడు!
ఇతర దేశాల అధినేతలతో ప్రిమియర్ చర్చించారు. వీడియో కాన్ఫరెన్సు పెట్టి పరిస్థితిని వివరించాడు.
“వాళ్ళు గ్రహాంతర జీవులు కాదు. గతకాలంలో జీవించిన మనుషులట. ఇప్పుడు భూమ్మీద మనుషులు మాయమవటానికి కారణం… గ్రాండ్ ఫాదర్స్ పారడాక్స్. అతన్ని వెళ్ళనిస్తే ఆమో తీసుకొచ్చిన స్త్రీని ఆమె కాలందగ్గిర వదిలేసి వస్తాడట. వదిలేసి వచ్చి అతని నౌకని మనకి అప్పగించినా దాన్ని భూమ్మీదికి తెచ్చుకోలేం. అదృశ్యమైనవాళ్ళ విషయం పక్కనిపెట్టి అతన్ని బంధించి నౌకని తెచ్చినా వుపయోగం వుంటుందనుకోను. అందులో అపారమైన విరుద్ధపదార్ధం వుందని చెప్తున్నాడు. కొన్నివేల సంవత్సరాలుగా అంతరిక్షంలోనే మన వ్యోమనౌకలకి అందనంత దూరంలో వున్నాడట. మనం దాన్ని గుర్తించలేదు. ఆమో దాన్ని ట్రేస్ చేసి పట్టుకోబోయాడు. అదంతా ఎంతకి దారితీసిందో తెలుస్తునే వుంది. అతన్ని వెళ్ళనిచ్చి ఆ యువతిని వదిలి రమ్మందాం” అని ఎంతో నేర్పుగా మాట్లాడాడు.
చేతికొచ్చిన కాలనౌకని వదులుకోవటం ఎవరికీ ఇష్టంలేకపోయినా, ప్రిమియర్ చెప్పిన విషయాలు ఎవరూ కాదనలేనివి. ముందీ మనుషులు మాయమైన ముప్పులోంచీ బయటపడాలి. అది జరిగితే నౌకని ఏంచెయ్యాలో ఆలోచించాలనుకున్నారు.
“అతనే వెళ్ళటమెందుకు? ఆమోని పంపండి. లేదా ఇంకెవరేనా వెళ్తారు. అతను మన దగ్గిర వుంటాడు” అని కొన్ని దేశాలు అన్నాయి.
అందులోని సాధకబాధకాలు మృత్యుంజయుడు తనకి వివరించినవి అతను వాళ్ళకి చెప్పాడు. కొంత తర్జనభర్జనమీద తప్పనిసరై వప్పుకున్నారు. అక్కడ భూమ్మీద దేశాలన్నీ తగలబడుతున్నాయి. దాన్ని ముందు ఆపాలి.
మృత్యుంజయుడికి పచ్చజండా వూపారు. గంటకి వెయ్యి సంవత్సరాల వేగానికి కాలనౌకని నియంత్రించాడు మృత్యుంజయుడు. కంట్రోల్స్ దగ్గిర పద్మమాలిక వుంది. ఎక్కడా ఆగకూడదని చెప్పాడు. వాళ్ళు వెళ్ళటాన్ని అద్భుతంగా చూసాయి ప్రపంచదేశాలన్నీ.
ఆమో బతికే వున్నాడన్నవార్త ఇంకా ప్రకటించలేదు. ముందు అతనివలన జరిగిన పొరపాటు సరిదిద్దాలి. అప్పుడు ప్రజలతన్ని ఆహ్వానిస్తారు. ఐతే వారికి ఒక ప్రకటన ఇవ్వటం జరిగింది.
“దయచేసి అందరూ వినండి. మీరు మాయమయారనుకుంటున్న మీ కుటుంబసభ్యులు కొద్దిసేపట్లో తిరిగి కనబడతారు. ఐతే వారు ఏ ప్రదేశంలోంచీ కనిపించకుండాపోయారో అక్కడ వారు ధరించిన బట్టలు కదపకండి. ఒకవేళ కదిపినట్టైతే వాటిని ఆ ప్రదేశానికి అందుబాటులో వుంచి మీరు అక్కడినుంచీ పక్కకి వచ్చెయ్యండి. లేకపోతే అభ్యంతరకరమైన దృశ్యాలు మీకంట పడవచ్చు”
జనమంతా రోడ్లమీదే వున్నారు. ఆగ్రహావేశాలతో మండిపోతున్నారు. చాలాకొద్దిమందిమాత్రమే ఆ వార్త విన్నారు. మొదట నమ్మలేదు. పదేపదే వస్తుంటే నెమ్మదిగా నమ్మకం కలిగింది. అది మళ్ళీ కార్చిచ్చులా వ్యాపించింది.
“నిజమా? సాధ్యమా?” ఎన్నో సందేహాలు.
“ఈ మనుషుల్ని మాయం చెయ్యటమేమిటి? ఇప్పుడిలా రప్పించటమేమిటి? ఇది శాస్త్రవేత్తల పనే. ఈ ప్రయోగాలని ఎలాగేనా ఆపించాలి. ముందుముందు ఏం జరుగుతుందో తెలియదు…” అనేకవిధాల చర్చించుకున్నారు.
సంధ్యా-రమేష్‍లు, ఉమా-పార్థసారధులు చూసారు ఆ ప్రకటనని. అందులో ఆమో, ధన్యా తిరిగొస్తారన్న ఏ సూచనా లేదు. చిన్నగా నిట్టూర్చారు. తమ దు:ఖాన్ని ఎవరూ తీర్చలేరా? కళ్ళు నీటిచెలమలయ్యాయి. మనసు ముకుళించుకుపోయింది.
దాదాపు రెండుగంటల ఇరవైనిముషాల తరువాత చంద్రుడి చీకటిభాగంలోంచీ స్పేస్‍సూట్‍లో ఇవతలికి తేలి వచ్చింది ధన్య. ఆమెని ఆర్తిగా చూసాడు ఆమో. అతని మనసంతా సంతోషంతో నిండిపోయింది. సరిగ్గా అదే సమయానికి అదృశ్యమైన కోటిమందీ తిరిగి ప్రత్యక్షమయారు. ఆ సంతోషంలో ఇంకొన్న ఆస్థులు ధ్వంసమయ్యాయి. మొత్తమ్మీద కాసేపటికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
“ధన్యాపార్థసారధీ! ఆర్యూ ఓకే?” తో మొదలై ఎన్నో ప్రశ్నలు… కెమేరాలన్నీ ఆమె వైపుకి తిరిగాయి.
అప్పుడు ప్రసారంచేసారు ఆ ఫోటోలని భూమ్మీదికి.
ముందుగా చూసింది సంధ్య.
“ధన్య… ధన్య…” ఆమెకి నోట మాట రావటంలేదు. ధన్య దొరికితే మరి ఆమో? ఒక కంట సంతోషం , మరోకంట విషాదం అంటారే అలాంటి స్థితి ఆ నలుగురిదీ.
వివిధ దేశాధినేతలతోటీ వారి అంతరిక్షపరిశోధకులతోటీ వీడియోకాన్ఫరెన్సుల్లో చాలా బిజీగా వున్నాడు ఆమో. భారతదేశంలో అనేకాదు, ప్రపంచంలోనే అన్నివేల సంవత్సరాలక్రితం అంత విజ్ఞానం వుందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. కాలనౌక సూత్రాలన్నీ ఆమో వివరిస్తున్నాడు. కావల్సిందలా విరుద్ధ పదార్ధం.
ఆమో ధన్యలవి చెరొక విధమైన అనుభవాలు. ఒకరేమో కాలనౌకలో గతంలోకి వెళ్ళి వచ్చారు. మరొకరేమో కొన్నిగంటలసేపు అదృశ్యమై తిరిగి వచ్చారు.
కాలనౌకలో సంఘటనలన్నీ కెలాడిస్కోపులో దృశ్యాల్లా కదలటాన్ని ఆమో వివరిస్తే అదృశ్యమైన కొన్నిగంటలూ ఏం జరిగిందో తనకేం తెలియలేదని ధన్య చెప్పింది.
ధన్య తిరిగి రావటాన్ని జనం హర్షించారు.
“వాళ్ళేం చేస్తారు పాపం? ప్రభుత్వం ఏం చెయ్యమంటే అది చేస్తారు…” అని సమర్ధించారుకూడా.
అప్పుడు నెమ్మదిగా ఆమోని కెమెరా ముందుకి తెచ్చారు.
అతన్ని చూడగానే సంధ్య వుద్వేగం తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది.
ఇంకొక రెండుగంటలకి మృత్యుంజయుడు తిరిగివచ్చాడు. అతను తన నౌకని భారతదేశానికి అప్పగించాడు. విరుద్ధపదార్ధాన్ని ప్రమాదరహితంగా డిఫ్యూజ్ చేసేదాకా అది అంతరిక్షంలోనే వుండటానికి నిర్ణయమైంది. ప్రపంచదేశాలన్నీ ఆ నౌకలోని విరుద్ధపదార్ధాన్ని భారతదేశపు బాధ్యతగానే వదిలేసాయి. సమస్యని పరిష్కరించడానికి సాంకేతిక సహకారం ఇస్తామన్నాయి. కాలనౌకలో తిరిగి రావటానికి అన్నిదేశాల అధినేతలూ, శాస్త్రవేత్తలూ అభిలాషపడుతున్నారు.
“అలా నౌకని ఎక్కువగా వాడితే విరుద్ధపదార్ధం ఖర్చౌతుందేమో!” సాలోచనగా అన్నాడు ఆమో.
“వీనస్, యురేనస్ ఇవి రెండు రెట్రోగ్రేడ్ గ్రహాలు. మిగతా గ్రహాలకీ సూర్యుడికీ వ్యతిరేక దిశలో తిరిగే గ్రహాలు. అక్కడేమైనా అవకాశం వుంటుందేమో! అలా కాకపోతే ప్లూటో మంచుగ్రహం. అక్కడకి విరుద్ధపదార్దపు కాప్స్యూల్ని ట్రిగ్గర్ చేస్తే…” అంది ధన్య చప్పుని అవకాశాలని వెతికి పట్టుకుంటూ.
“ఇప్పటికి మీరు చేసింది చాలు” అన్నాడు శ్యాం.
మృత్యుంజయుడు తప్పించుకుపోవచ్చు. తిరిగి రానవసరంలేదు. కానీ తిరిగొచ్చాడు. ఇద్దరు మనుషుల్తో గడిపిన తర్వాత తను మళ్ళీ అనుభవించాల్సిన వంటరితనం అతన్ని చాలా భయపెడుతోంది. ఇంకా ఎంతకాలం ఇలా? అన్న ప్రశ్న వేధించింది. అది కాలనౌకని తెలిసికూడా దేశాలు విరుద్ధపదార్ధానికి భయపడి దాన్ని అంతరిక్షంలోనే వుంచమనటం అతనికి కొంత ధైర్యాన్నిచ్చింది. నేతలంతా సర్వవీక్షణుడిలాంటివాళ్ళు కారనే తొలినమ్మకం కలిగి మనసుకి హాయిగా అనిపించింది.
అతన్ని చాలా గౌరవంగా తనతో తీసుకెళ్ళారు ప్రిమియర్.

ధన్యకి ఆమోపట్ల వున్న భ్రమలేవైనా వుంటే అవి తొలగిపోయి వుంటాయనుకున్నాడు అబ్రహం.
ధన్యా ఆమోలు భూమ్మీదికి తిరిగొచ్చాక ఆమో తల్లిదండ్రులుకూడా అక్కడే వున్నందున అందరూ ధన్య ఇంట్లో చేరారు. అబ్రహం కూడా ధన్యని చూడటానికి వచ్చాడు.
ధన్య మనసు అర్థమైనా అన్నీ తెలిసినా ఆమో మాట్లాడటంలేదు. వంచిన తల ఎత్తడంలేదు. రెండుసార్లు ధన్య ప్రాణాలతో చెలగాటం ఆడాడు. ఆమెని మృత్యుముఖంలోకి తోసాడు. ఆమెని పెళ్ళి చేసుకునే అర్హత తనకి లేదు. ఆమె ఎవర్నేనా చేసుకోనీ, ప్రమాదాల్లేకుండా వుంటే చాలుననుకున్నాడు.
ఆమోపట్ల ద్వేషమేమీ లేకపోయినా, ఉమకికూడా అలాగే వుంది.
“అతను మైత్రీపాలుడు, నేను పద్మమాలిక అంశ. మేం పెళ్ళి చేసుకోకపోతే ఈ ప్రేమకథ ఇంకెప్పుడు సుఖాంతమౌతుంది?” అంది ధన్య.
“రెండుసార్లు చావంటే ఏమిటో చూసివచ్చావు ధన్యా! ఇంకా అతన్తో పెళ్ళేమిటి? ఒక శాస్త్రవేత్తగా ఆమోపట్ల నాకు అపారమైన గౌరవం వుంది. గాంధీలు పక్కింట్లో పుడితే మనం చప్పట్లు కొట్టవచ్చుగానీ మనింట్లోనే పుట్టాలని కోరుకోకూడదు” అన్నాడు అబ్రహం.
“చావుతప్పిన తర్వాతి జీవితంలోకూడా అతనే వున్నాడు అబ్రహం. అతనుకూడా నన్ను తీవ్రంగా ప్రేమించాడు. కాబట్టే ఇద్దరం ఒకరికోసం ఒకరం… ఒకరిని కాపాడుకోవాలని ఇంకొకరం బతికాము. కానీ చూడు, నువ్వు వేస్తున్న అభియోగాలకి తలదించుకుని ఎలా కూర్చున్నాడో! ఆమో ఎప్పుడూ తప్పుచెయ్యడు. అతను లేకుండా నేను బతకలేను” చాలా కచ్చితంగా చెప్పింది ధన్య. మరోసారి హతాశుడయ్యాడు అబ్రహం.
తల్లిదండ్రులకీ చెప్పింది. అంతతంత పెద్దపెద్ద ప్రమాదాల్లో కలిసి వున్న ఇద్దర్నీ ఇప్పుడు జీవించడంకోసం కలిసి వుండద్దనడం అర్థరహితంగా అనిపించింది పార్థసారధికి. ఉమకి నచ్చజెప్పాడు.
“ఏంటి సార్, ఇంకా అలాగే వున్నారు? కాస్త నవ్వచ్చుకదా?” అడిగింది ఆమోని ఏకాంతంలో ధన్య.
“నీ నిర్ణయం సరైనదో కాదో…” అని అంటుంటే-
“వర్చువల్ కార్నేషన్స్ సరైనదేనని చెప్పాయి” అంది ధన్య.
ఆమె చేతిని ఆర్తిగా అందుకున్నాడు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s