నేను విసిరిన బంతి by S Sridevi

నాకో అన్నయ్య. నా కన్నా రెండేళ్ళు పెద్ద. తనతో ఒక కౄరమైన ఆట అప్రమేయంగా మొదలు పెట్టాను.
అన్నయ్య నల్లగా తుమ్మమొద్దులా ఉంటాడు చదువుకునేప్పుడు ఫ్రెండ్సంతా నల్లపిల్లాడు,  నల్లపిల్లాడు…. అని వెక్కిరించేవారు. టీచర్లు కూడా నల్లకృష్ణ అనేవారు, తెల్లగా ఉండే కృష్ణ ఇంకొకడు ఉండటంతో.
చాలా తెల్లగా ముట్టుకుంటే కందిపోయే ఎలా ఉంటాను నేను . చుట్టూ ఉన్న బంధువుల్లో కూడా చాలామంది తన నలుపుని ఎత్తిచూపించటంతో తనలో ఏదో లోపం ఉందనే భావం స్థిరడిపోయింది నాకు.  పైగా రోజూ కొన్నిగంటలపాటు చూసే టీవీ ప్రకటనల్లో నల్లగా ఉండటం అన్నిటికీ అనర్హతగా చూపించడంతో ఆ భావం మరింత బలపడడటమే కాకుండా నేనేదో పైమెట్టు మీద ఉన్నాననే అభిప్రాయం ఏర్పడిపోయింది . తనకు నేనంటే అసూయ వుందనుకునేవాడిని చాలాకాలంపాటు. తనెప్పుడూ బయటపడకపోయినా కూడా.
తనకి పెద్దగా చదువు రాలేదు. వానాకాలం చదువులా డిగ్రీ పూర్తిచేసి స్పోర్ట్స్ లో  సెటిలైపోయాడు. నేను మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడిని. మంచి జీతంతో  సాఫ్ట్ వేర్ ఉద్యోగం, ఏసీ రూమ్ లో శరీరానికి సౌకర్యంగా ఉండే జీవితం అమిరాయి.
చదువులు పూర్తై సంపాదనలు మొదలయ్యాక అన్నయ్యకి సంబంధాలు చూడసాగారు ఇంట్లోవాళ్ళు.  ఈ నలకూబరుడికి రంభలాంటి భార్య రావాలని అమ్మ కోరిక.  అందాలభరిణెల్లాంటి అమ్మాయిల ఫోటోలెన్నో తెప్పించి చూసింది అమ్మ. చాలావరకు సంబంధాలు అన్నయ్య గురించి తెలియగానే తిరిగిపోయాయి. ఒక్కటి కూడా పెళ్లిచూపులదాకా రాలేదు. అన్నయ్య మనసులో ఏముందో బయటికి రాలేదు.
ఇప్పుడు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలంతా ఇంజనీరింగ్ చదువుతున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా  చేస్తున్నారు. లక్షల్లో జీతాలు తెచ్చుకుంటున్నారు. పెళ్ళికి ముందే  జీవితం ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు అనువైన సంబంధాలే వెతుక్కుంటున్నారు. అన్నయ్య వీళ్ళకి నచ్చుతాడుని ఆశించటం అత్యాశే. తనకి ఔతేగాని నా పెళ్లి  కాదు.  నా స్నేహితులంతా అప్పుడే పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడుతున్నారు.
మౌనప్రేక్షకుడిలా సహనంగా
చూస్తున్నాను.
“అపూర్వా వెంచర్స్ లో డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకుందామని అనుకుంటున్నాను” అన్నాడు అన్నయ్య ఉన్నట్టుండి.
“ఇప్పుడు నీకు వేరే ఇల్లు ఎందుకురా?  మనది పెద్దదేగా? మీకు పెళ్లిళ్ళై పిల్లలు పుట్టినా సరిపోయేలా కట్టాము” అంది  అమ్మ.
“ వేరే వెళ్లడానికి కాదమ్మా! డబ్బు పోగుపడింది. ఇంటిమీద పెడదామని. కొంత  లోన్ తీసుకుంటాను” అన్నాడు.
నాకు షాక్.  నాకన్నా తక్కువ తెచ్చుకుని నాకన్నా ఎక్కువమంది స్నేహితుల్ని వెనకేసుకుని తిరిగేవాడి దగ్గర ఇల్లు  కొనగలిగేంత డబ్బు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
నాన్న చాలా సంతోషపడ్డారు. ఇంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మతో కలిసి వెళ్లి చూసి వచ్చారు. నన్ను రమ్మంటే తరువాత చూస్తానని తప్పించుకున్నాను. అదయ్యాక  రాబోయే భార్యకోసం నగలు, కారు కొన్నాడు.
టూ మచ్  అనిపించినా సంబంధాలు రావటంలేదుకదా, ఇవన్నీ చూపించి ఎర వెయ్యటానికేమో అనిపించి జాలివేసింది.
ఇంకో షాక్ .
శ్యామలని ఇంటికి తీసుకు వచ్చి పరిచయం చేశాడు. మా నల్లమొద్దు పక్కన తుమ్మమొద్దులా ఉంది. నల్లటి అమ్మాయి. సన్నగా నాజూగ్గానే ఉంది . వయసులోనే ఉంది కాబట్టి ఆకర్షణీయంగానూ ఉంది. కళ్ళతో చూడొచ్చు. మనసులోకి ఆహ్వానించలేము. నేనైతే చేసుకోను ఇలాంటి అమ్మాయిని.
“అమ్మా! శ్యామల.    రెండేళ్లకు పైగా పరిచయం. మొన్ననే బీటెక్ ఫైనల్ రాసింది. తన చదువయ్యాక చెప్పాలని ఇన్నాళ్లు ఆగాను. బ్యాడ్మింటన్ బాగా ఆడుతుంది” అని పరిచయం చేశాడు.
అమ్మావాళ్లూ వాళ్ల వివరాలు తెలుసుకుని వెళ్లి శ్యామల అమ్మానాన్నలని కలిసి వచ్చారు. వాళ్ళు వచ్చి సంబంధం  మాట్లాడుకున్నారు.  అతి త్వరలోనే పెళ్లి వైభవంగా జరిగిపోయింది.  నాకైతే అదంతా ఒక కలలాగా అనిపించింది .
వదిన అమ్మానాన్నలు బాగా ఉన్నవాళ్ళు. ఇద్దరు కూతుళ్లు. ఇద్దరూ నలుపే. వదిన పెద్దది. ఎంతో అపురూపం. చాలా సంబంధాలు చూశారట. అన్నయ్య  చేసుకుంటానని ముందుకి వచ్చేసరికి  చాలా సంతోషపడ్డారు.

వదిన కాపురానికి వచ్చింది. ప్రేమ వేరు, పెళ్ళి వేరు. వాళ్ల పెళ్లి  ఒక అనివార్యమైన సర్దుబాటు అనేది నా భావన.  కానీ అన్నయ్య ఆమెను అపురూపంగా చూసుకుంటున్నాడు. వదిన కళ్ళలోనూ తనంటే ఆరాధన. అన్నయ్య  జాగ్ కి వెళ్ళే సమయానికల్లా  లేచేస్తుంది.  తనకి కావల్సినవి అందిస్తుంది. తను తిరిగి వచ్చేసరికి అప్పటికి కావలసినవి అమర్చుతుంది. అన్నయ్య ఉన్నంతసేపూ తన వెంట వెంటే తిరుగుతుంది. అన్నయ్యకి నిరంతరం తన జపమే. సౌందర్యరాహిత్యంలో ఇంత ప్రేమ సాధ్యమా అనిపిస్తుంది.  ఒప్పుకోవడానికి అహం వప్పుకోదు.

అన్నయ్య పెళ్లి జరిగిన నాలుగునెలల తరువాత నా పెళ్లి జరిగింది. అంజనితో. మాది కూడా ప్రేమ వివాహమే.
అంజని నాకు నప్పినట్టుగా ఉంటుంది. తెల్లగా … పాండ్స్ క్రీమ్ లా… డవ్ సబ్బుబిళ్ళలా… అప్పుడే నేసిన క్షీరాబ్ధి పట్టుచీరలా… ఆ అందానికి పరవశించిపోయాను.
అంజనికి తన అందాన్ని గురించిన స్పృహ చాలా ఎక్కువ.  అందరూ దాన్ని గుర్తించాలనుకుంటుంది. అందులో నాకు తప్పేమీ కనిపించలేదు. నేనైతే ప్రతి నిమిషం పొగడ్తలతో ముంచెత్తుతాను.
” అతన్ని మీ అన్నయ్యని అనుకోలేదు. మా ఇళ్ళల్లో అంత నల్లగా ఎవరూ లేరు.  అబ్బ! పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చేట్టున్నారు. బ్లీచింగ్  చేయించుకోవచ్చు. పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి… డబ్బు బాగానే సంపాదించారట కదా,  కాస్త మంచి సంబంధం చూసి చెయ్యక పోయారా?”  అంది అంజలి పెళ్లి అయ్యాక వెంటనే తన హద్దు దాటేసి.
తను అలా అడగడం  తప్పనిపించినా కొత్తమోజుచేత చెప్పలేకపోయాను. తర్వాత మరెప్పుడూ కూడా చెప్పలేకపోయాను.

ఇంట్లో చిన్న చిన్న గొడవలు. నాకు అన్నావదినలపట్ల కొంచెం చులకన భావం ఉంది. ఐతే  ఎప్పుడూ బయటపడలేదు. మనసు లోలోపలే దాచుకునేవాడిని. కానీ అంజనీ అలా కాదు. వదినతో ఎక్కడికైనా వెళ్లాలంటే నిర్మోహమాటంగా తన అఇష్టాన్ని చెప్పేస్తోంది. “కొంచెమేనా చిన్నతనం లేకుండా అలా ప్రతిచోటికీ తయారైపోవడం దేనికి? తనవైపువాళ్ళకంటే ఆమె సౌందర్యప్రభలు తెలుసును. నాతో కూడా వచ్చి ప్రదర్శించుకోవడం దేనికి? అందరూ అడగడమే ఎవరని? తోటికోడలని చెప్తే-  అదేంటి, మీ బావగారు ఇంత నల్లటిపిల్లని చేసుకున్నారని అడుగుతున్నారు. ఆయనా ఇలాగే వుంటారంటే  మీ మామగారిది రెండోపెళ్ళా, మీ బావగారు మొదటి సంబంధం తాలూకానా అని  ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి చంపుతున్నారు. అదీ కాదంటే దొరికిన పిల్లాడా అని నిలదీస్తున్నారు” అనేసింది. వదిన విని వూరుకున్నా సర్దుకుపోయినా బావుండేది. “ఆ కారు కృష్ణ కొన్నది.  మా కార్లో నాకన్నా ముందు ఎక్కి కూర్చుని నన్ను రావద్దంటావేమిటి? నన్ను పిలవద్దని  నువ్వే  మీవైపువాళ్లకి చెప్పు అంజనీ. పిలిచినా రాలేదు, గర్వం… అని నేనెందుకు మాట పడాలి?” అని దులిపేసింది.
ఆ దుమారమంతా నామీదకి మళ్ళింది.
“ఆమె అలా అంటుందేమిటి? ఉమ్మడిలో మీదీ మాదీ ఏమిటి ? ఐనా మీ కన్నా మీ అన్నయ్య జీతం చాలా తక్కువ కదా? వాళ్ళకి ఇల్లు, కారు వున్నాయి.ఆమెకి బంగారం కూడా చాలానే ఉంది.  మీరెందుకు దాచలేకపోయారు? మనకి తెలీకుండా మీ అమ్మావాళ్ళూ పెడుతుంటారా ఏంటి? ” అని నాతో గొడవ వేసుకుంది అంజని.
“వాడు షేర్లలోనూ ఈక్విటీల్లోనూ పెట్టి చాలా సంపాదించాడు అంజనీ! నాకు రెండుసార్లు  నష్టం వచ్చింది” నిస్సహాయంగా వివరించాను. ఎన్నో విషయాల్లోలాగే పెట్టుబడుల విషయంలోనూ అన్నయ్య సలహా నేనెప్పుడూ తీసుకోలేదు.
తోటికోడళ్ళ మధ్య తగాదాలు చిలికిచిలికి గాలివానలా ఔతున్నాయి. అంజని వాళ్లని చూసి ఓర్వలేక పోతోందని గ్రహించాను. వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒక్కళ్ళకి చాలా ప్రేమ. దాన్ని బాహాటంగా చూపించుకుంటారు. నాకలా వ్యక్తపరచడం రాదు.
“ఆవిడో సమంత… ఆయనో  నాగచైతన్య. ఇద్దర్నీ చూస్తుంటే కంపరం ఎత్తిపోతోంది. ఆ ప్రేమలేవో పడగ్గదిలో వలకపోసుకోవచ్చుకదా? మీరేనా చెప్పండి అత్తయ్యా,  చూసేవాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుందని” అమ్మతో అంది.
“ మీరెలా ఉంటున్నారని  వాళ్ళు ఎప్పుడైనా అడిగారా అంజనీ?  మీ జోలికి వచ్చారా? ఎందుకమ్మా అలా నోరు పారేసుకుంటావు?  అంత ఓర్వలేనితనం మంచిది కాదు” అంది అమ్మ. అన్నయ్యది నాలాగా  టైం  టు టైమ్  చేసే ఉద్యోగం కాదు. పొద్దున జాగ్ కి వెళ్తాడు. అక్కడి నుంచి వచ్చి గ్రౌండ్ కి వెళ్తాడు. పన్నెండింటికి తిరిగొస్తే  నాలుగుదాకా వదినతోనే. తను సోఫాలో కూర్చుని పేపరో, పుస్తకమో చదువుతుంటే లేదా టీవీ చూస్తుంటే పక్కనే కింద కూర్చుని అన్నయ్య  మోకాలిమీద గడ్డం ఆనించి తనూ ఏదో ఒకటి చదువుతూ, మధ్యలో కబుర్లు చెప్తుంది. లేకపోతే పక్కపక్కన కూర్చుని ఏవో చర్చించుకుంటారు. కలిసి సినిమాలు చూస్తారు. ఒకరికి అర్థం కానిది మరొకరు వివరించుకుంటారు. ఇద్దరు  స్నేహితుల్లా కనిపిస్తారు తప్ప మరో చెడ్డభావనేదీ  కలగదు.  నానుంచీ అన్నయ్య  పొందలేకపోయిన స్నేహాన్ని వదిన అందిస్తోందని నా మనసుకి తెలుస్తూనే వున్నా అంజని మీది ప్రేమ దానిని గుర్తించనివ్వదు.

అంజని ఒక మాట అనడం, వదిన పదునుగా జవాబివ్వడం ఇంట్లో చాలా మామూలైపోయాయి.
అంజని అనేదాంట్లో నాకు తప్పేమీ కనిపించట్లేదు. వాస్తవమేకదా తను చెప్పేది? నల్లమొద్దులని నల్లమొద్దులని అనక మరేమంటారు?  అన్నయ్య ముద్దుచేసినంత మాత్రాన తను అపరరంభ అవ్వదు. ఆమె నెత్తికెత్తుకున్న అంతమాత్రాన అన్నయ్య నవమన్మధుడు అయిపోతాడా ?  ఆ చిన్న విషయం ఆమెకి తెలియదెందుకు?
నాన్న  కలిగించుకునేదాకా వచ్చాయి గొడవలు.
” నా చుట్టూ అంతా  ఆహ్లాదకరంగా ఉండాలని ఉంటుంది రవీ! అందమైన వస్తువులు కొంటాను. నా గది అందంగా ఉంచుకుంటాను. నన్ను నేను అందంగా అలంకరించుకుంటాను.  హ్యాండ్సమ్ గా ఉన్నావనే నిన్ను చేసుకున్నాను. ఏదీ, ఈ గది దాటితే వాళ్ళిద్దరూ అసహ్యం పుట్టిస్తున్నారు.  భరించలేకపోతున్నాను. చూసేవన్నీ కంటికింపుగా మనసుకి నచ్చేలా ఉండాలని కోరుకోవడం తప్పులేదు. వాళ్ల దురదృష్టాన్ని మనం ఎందుకు పంచుకోవాలి? రేపటిరోజుని నేను కన్సీవ్ అవుతాను. ఇరవైనాలుగ్గంటలూ   గబ్బిలంలా ఆమె కళ్ళ ముందే ఉంటే మనకు ఎలాంటి పిల్లలు పుడతారో నువ్వే ఆలోచించు” అంది అంజలి. నాలో ఆలోచన మొదలైంది. తను చెప్పేది నిజమే.
” మనం వేరే వెళ్ళిపోదాం” అంది ముందు. అంతకన్నా మరో మార్గం లేదని పించింది నాకు.
” మనం ఎందుకు  వెళ్లాలి? వాళ్ళనే పంపిద్దాం. ఇల్లు కూడా వుంది ” అని మరో ఆలోచన చెప్పింది.
ఆ సందర్భం కూడా అతి తొందర్లోనే వచ్చింది. అయితే మేము ఊహించని మరో పరిణామంతో కలిసి. శనివారం మధ్యాహ్నం. నేను కూడా ఇంట్లోనే ఉన్నాను. భోజనాలయ్యాక  అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నెమ్మదిగా అన్నయ్య ఎత్తాడు. ” ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి బంధుత్వం కన్నా కూడా సౌహార్ద్రత చాలా అవసరం. దేవుడిచ్చిన  రూపురేఖలు మా ఇద్దరివి. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం అంతా మాలో  ఉన్నాయనుకుంటున్న లోపాలతో సహా. ప్రేమకి అందచందాలు ఉండవనే  అనుకుంటూ వచ్చాం. తెల్లగా ఉన్నవాళ్ళ మధ్య అందంగానూ నల్లగా ఉన్నవాళ్ళ మధ్య వికృతంగానూగానూ ప్రేమ ఉంటుందని అనుకోను. నేనంటే  బయట తిరిగేవాడిని. అంజని మమ్మల్ని  అనే మాటల్ని తట్టుకోలేకపోతోంది రోజంతా ఇంట్లో ఉండే శ్యామల. ఇన్ని  మాటలు పడటానికి తనకేం ఖర్మమ్మా? మేము మా ఫ్లాట్ లోకి వెళ్ళిపోతాం ” అన్నాడు అన్నయ్య.
” అదేమిట్రా కృష్ణా!” అంది అమ్మ బాధగా.
” నువ్వు సర్దిచెప్పడం, అంజని పట్టించుకోకపోవటం అన్నీ తెలుసునమ్మా!  శ్యామల నాకుగాక ఇంకెవరికి చెప్పుకుంటుంది? వాళ్ళ పేరెంట్స్ తో చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. అర్థం చేసుకో. ఇవన్నీ పిల్లలు ఎదిగే క్రమంలో జరిగే విషయాలని సర్దుకో. ఇంట్లోనైనా బయట అయినా ఇవే మాటలు మేము ఎదుర్కోవాలి. ఎలా తిప్పికొట్టాలో నేర్చుకుంటాం “
” నువ్వు చెప్పింది  నిజమే కృష్ణా! బైటి ప్రపంచంలోనే మనకు పాఠాలు దొరుకుతాయి” అన్నయ్యతో అని, నావైపు తిరిగి , ” వాడు చెప్పింది విన్నావా? మీరు కూడా ఇల్లు చూసుకోండి ” అన్నారు నాన్న. 
ఇది ఊహించని విషయం. ముందుగా  తేరుకుంది అంజని.
” వాళ్లకంటే యిల్లుంది. మేం ఎక్కడికి వెళ్తాము మామయ్యగారూ?” అంది.
” మాట అనేముందే అది దేనికి దారి తీస్తుందో ఆలోచించుకోవాలి. కృష్ణ వెళ్ళిపోతుంటే మిమ్మల్నెలా వుంచుకుంటాం? వాడి అత్తమామలకు జవాబు ఏం చెప్తాం? సొంత ఇల్లు లేదు కాబట్టి అద్దెకు తీసుకోండి ” అన్నారు.
అలాగ అన్నదమ్ములం విడిపోయాము.
….
సంక్రాంతి పండక్కి కలుసుకున్నప్పుడు  చెప్పాడు అన్నయ్య అమ్మానాన్నలతో.
” పూనాలో నాకు ఆఫర్ వచ్చిందమ్మా! యూరప్ టూరుకి ప్లాన్ చేస్తున్నాం. అక్కడినుంచీ వచ్చాక  చేరాలనుకుంటున్నాను. కొత్త ప్రదేశాల్లో తిరగటం అంటే శ్యామలకి చాలా ఇష్టం” అన్నాడు.
” ఇవన్నీ సరే,మరి పిల్లల్నెప్పుడు కంటారురా?”  అడిగింది అమ్మ.
“పిల్లలు వద్దనుకుంటున్నాం అత్తయ్యగారూ! అంత సాహసం చెయ్యలేం” వదిన చురుగ్గా జవాబిచ్చింది.  అమ్మేకాదు, అక్కడున్న అందరం తెల్లబోయాము.  అదే వింత ఆలోచన? ఎప్పటికీ జంటగా వీళ్ళే వుండిపోవాలన్న స్వార్థమా? అర్థం కాలేదు.
” అదేం పిచ్చిమాట శ్యామలా? పిల్లల్ని కనడానికి సాహసం ఎందుకు? ప్రపంచంలో మీరొక్కరే కనబోతున్నారా?” ఆందోళనగా అడిగింది అమ్మ.
” పిల్లలన్నాక నల్లగానో తెల్లగానో పుడతారు. మేమిద్దరం నల్లగా ఉంటాం కాబట్టి నల్లగానే పుడతారనుకుందాం. ఆ పుట్టినవాళ్లు ఎందుకిలా పుట్టామా అని బాధపడుతూ, ఎందుకు కన్నారని మమ్మల్ని నిలదీస్తూ ఉంటే మేము తట్టుకోలేము. మీ పోలికే  వచ్చి తెల్లగా పుట్టి, నల్లగా ఉన్నామని మమ్మల్ని అసహ్యించుకుంటే అది మరీ నరకం”  స్పష్టంగా చెప్పింది వదిన.
తను అలాంటి నిర్ణయం తీసుకోవటంలో మా తప్పేమీ లేదని సమర్థించుకునేందుకు నేను అంజని అక్కడే కూర్చున్నాం.
“ ప్రతిమనిషీ తన తల్లిదండ్రులనుంచీ పోలికలని తెచ్చుకుంటాడు. అంటే జన్యువులని.  ఆ తల్లిదండ్రులు వాళ్ల తల్లిదండ్రులనుంచీ . ఇలా యేడుతరాలు వెనక్కి వెళ్తే ప్రతివారి వెనుకా చెరోవైపునించీ రెండు వందల యాభైనాలుగుమంది పెద్దవాళ్ళ జన్యువులు  మనలో వుంటాయి.  అవే మనకి దృశ్యతని ఏర్పరుచుతాయి. వీళ్ళంతా మన శరీరంలో కొలువై వున్నట్టు.అందుకే ఈ దేహం దేవాలయమైందని నా నమ్మకం. మా నాన్న నాకీ నమ్మకం కలిగించారు. తిరిగి నా పిల్లల్లో నేను కలిగించగలనో లేదో చెప్పలేను”
“ఇన్ని తెలిసినదానివి ఆ విషయంలో భయం ఎందుకు?” అడిగింది అమ్మ.
వదిన ఒక్క క్షణం అమ్మనీ, నన్నూ మార్చి చూసి, చిన్న నవ్వు నవ్వి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
ఆ ఒక్క నవ్వు నాకు ఎక్కడో చురుక్కుమనిపించింది. సరిగ్గా అప్పుడే… ఆ క్షణాన్నే ఆమెపట్ల గౌరవానికి చిన్ని బీజం పడింది.  ఎంత చక్కగా చెప్పింది! ఆ విజ్ఞతకే అన్నయ్యకి ఆమె అంటే అంత ప్రేమేమో!
” జరిగినవాటికి తను చాలా బాధపడుతుందమ్మా! పెళ్లికి ముందు తనెప్పుడూ ఇలాంటి మాటల్ని పడలేదట. అందుకే మార్పుకోసం కొత్త ప్రదేశాలకి తిప్పుదామని…” అన్నాడు అన్నయ్య.
” దాని మనసు చాలా సున్నితంరా! తనుగా  ఎవర్నీ ఏమీ అనదు. తనని అంటేమాత్రం పడదు. నువ్వన్నట్టు కొన్నాళ్లు గడవనీ. తనకే అర్థమౌతుంది.  ఇంకా చిన్నతనం పోలేదు” అంది అమ్మ.
నా మనసు పొరల్లో ఎక్కడో చిన్నగా కదలిక. అంతగా బాధపడిందా తను?  అలా బాధ పెట్టే అధికారం మాకేం వుంది? మాకే కాదు,  ఎవరికైనా ఎక్కడిది?
” అవకరాలు కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని వేదాంతాలేనా చెప్తారు… మన విషయం అప్పుడే చెప్పకండి. అసలే కుళ్ళుకుపోతున్నారు. ఇంకా కుళ్ళుకుంటారు” తర్వాత  హెచ్చరించింది అంజని నన్ను. తనకి మూడో నెల.
పండుగయాక ఎవరికి వాళ్ళం విడిపోయాము. ఆహ్లాదంగా ఉండాల్సిన కుటుంబ వాతావరణం కలుషితమైంది. అన్నయ్య మామూలుగానే ఉంటున్నట్టు ప్రయత్నం చేస్తున్నా వదినమాత్రం ముభావంగా ఉంది.
అంజని శ్రీమంతానికి వచ్చినా, బాబు బారసాలకి వచ్చినా ఇద్దరూ అంటీముట్టనట్టుగానే ఉన్నారు. రెండోవాడు కడుపున పడ్డప్పటికి వాళ్లు  అమెరికాలో ఉన్నారు.  డెలివరీ అయిన ఆరు నెలలకి తిరిగొచ్చారు. దాదాపు నాలుగేళ్లు మానసికంగానూ భౌతికంగానూ  కూడా దూరదూరంగానే ఉన్నాము.
మనవలని వదిలిపెట్టి ఉండలేక అమ్మానాన్నా మమ్మల్ని ఇంటికి వచ్చేయమన్నారు. ఇద్దరు పిల్లలతో చేసుకోలేనని అంజనికూడా ఒప్పుకుంది. అద్దె నాకు భారంగా అనిపించింది.
అన్నయ్యా వదినా అమ్మావాళ్లతో  బాగానే ఉంటున్నారు. వాళ్ళని పూనా  రప్పించుకుంటున్నారు. వదినకింకా  పిల్లలు లేరు. వయసు దాటిపోతుందని అమ్మ  కంగారుపడుతోంది.  నా మనసులో గిల్ట్ అలాగే ఉంది. అంజనిలో మార్పు లేదు.

ఇంతలో హఠాత్తుగా ఒక ఫోను… వాళ్లదగ్గరనుంచీ… బయల్దేరి వస్తున్నామని. రెండోరోజుకి ఇద్దరూ దిగారు. వదిన ప్రెగ్నెంటని చూడగానే తెలుస్తోంది.  నాకు లోలోపల బరువు తీరినట్టనిపించింది. అమ్మ సంతోషానికి అవధుల్లేవు.
“నేను చెప్పలేదూ? శ్యామలది  అప్పుడంతా చిన్నతనం. ఎవరో ఏదో అన్నారనో, సరిగా పెంచలేమనో  పిల్లలు వద్దనుకోవటమేమిటి? ” అంది వదిన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని. తను నవ్వింది.
ఇంట్లో గొడవలు జరిగి మేం విడిపోయినప్పుడు, అన్నయ్యావాళ్లు పిల్లలు వద్దనుకున్నప్పుడు నాలో వెల్తి 
ఏర్పడటాన్ని నేను గుర్తించలేదుగానీ వాళ్లు  తిరిగి రావటంతో మొదలై ఇప్పటికి నా మనసు పూర్తిగా నిండిన భావన కలిగింది.
“పేచప్ చేసుకుంటారేమో! తిరిగి వచ్చేస్తారేమో! పడనివ్వకండి.హాయిగా వున్నాం” అంది అంజని. “ఒకసారి దెబ్బతిన్నాం ఈ విషయంలో ” గుర్తుచేసాను.
తను విననట్టు వూరుకుంది.
నాలో వచ్చిన మార్పు నాకు స్పష్టంగా తెలుస్తోంది. మేం విడివిడిగా వున్నప్పటి వెల్తినిగానీ, అమ్మానాన్నల కళ్ళలో అప్పట్లో వాళ్లకోసం వున్న తపనగానీ నా ప్రవర్తనని నిలవరించక వాళ్లు చూపించిన నిస్సహాయతగానీ మరోసారి ఎదురైతే నేను తట్టుకోలేను. అన్నయ్యతోటీ, వదినతోటీ కలివిడిగా వుండాలనిపిస్తోంది. వాళ్లకి పిల్లలు పుడతారంటే మనసు వుత్సాహంతో వురకలు వేస్తోంది. దగ్గరగా వున్నప్పుడు  లోపాలూ దూరంగా వున్నప్పుడు ప్రేమలూ కనిపిస్తాయా? అంజనికి వాళ్లపట్ల వున్న ద్వేషాన్ని  ఇదివరకట్లా ప్రోత్సహించకూడదు. ఎప్పటికప్పుడు,  ఎక్కడికక్కడ  తుంచెయ్యాలి.

ఆఫీసులో పర్మిషన్ తీసుకుని ఇంటికి బయల్దేరాను. దార్లో ఎప్పుడూ స్వీట్స్ తీసుకునే మార్వాడీ షాపు దగ్గర ఆగి బెల్లం జిలేబీ వేస్తుంటే కొన్నాను. షాపు బయట సంపెంగలూ, కనకాంబరాలూ కనిపిస్తే అవికూడా తీసుకున్నాను.  వదిన ఇష్టాలేమిటో ఎప్పుడూ గమనించలేదు. అమ్మకి నచ్చేవే తీసుకున్నాను.
ఇంటికి వచ్చేసరికి ఒక అనూహ్య సంఘటన. అన్నయ్య  పాతస్నేహితుల్ని కలవడానికి వెళ్లాడు. అమ్మ పక్కవాళ్ళ ఇంటికి వెళ్ళింది.  అంజని మా గదిలో నిద్రపోతున్నట్టుంది. వదిన హాల్లో కూర్చుని టీవీ చూస్తోంది.  కిందనే నేలమీద కూర్చుని నా పెద్దకొడుకు మూడేళ్ల నందూ కళ్ళనీళ్ళు కడిగేసుకుంటూ ఏడుస్తున్నాడు.
“ఏమైంది?” అడిగాను.
“వాడినే అడుగు, ఏం కష్టం వచ్చిందో! అంజని పిల్లలిద్దరినీ పెట్టుకుని పడుకుంది. నిద్రపోతున్నట్టుంది. కృష్ణ ఫ్రెండ్స్ ని కలవటానికి వెళ్లాడు. వీడు లేచి ఇవతలికి వచ్చేసాడు. ప్లగ్ హోల్స్ లో వేళ్ళు పెట్టబోయాడు. వేళ్ళు పెట్టబోయాడు. పిలిస్తే రావట్లేదు. లాక్కొచ్చి, కుదేసి కూర్చబెట్టాను” అంది
వదిన. పదునుగా వుంది  జవాబు.  అలా తను జవాబిచ్చిందంటే ఏదో జరిగిందని అర్థమైంది.
“బెద్దమ్మ నన్నిక్కల పత్తుకుంది… ఛీ… యాక్” వచ్చీరాని మాటల్తో అంటూ నందూ నన్ను చుట్టుకుపోయాడు. ఆమె పట్టుకుందని చూపించినచోట తుడిచేసుకుంటున్నాడు. నా తల వంగిపోయింది. అంజని పసిపిల్లాడికి ఇలా నేర్పిస్తోందా? !! వాడిని ఎత్తుకుని అక్కడనుంచి వెళ్లబోయాను.
“రవీ! ఒక్క నిముషం నేను చెప్పేది వింటావా? అలా కూర్చో” అంది వదిన.
ఎదురు సోఫాలో కూర్చున్నాను.
“చెయ్యని తప్పుకి వివరణ ఇవ్వటమనేది నేను అసహ్యించుకునే విషయాల్లో మొదటిది. కానీ మూడు విషయాలు నీకు స్పష్టం కావలిసి వుంది. లేకపోతే మీ అన్నదమ్ములు ఎప్పటికీ ప్రేమగా వుండలేరు”
“…”
“మొదటిది, మీతో నెగ్గలేక మేం వేరే వెళ్ళలేదు. మాటలనుకుని, మనసులు కష్టపెట్టుకుని, అందులోంచీ బయటపడటానికి కొంత సమయాన్నీ, శక్తినీ వెచ్చించటం అనవసరమనిపించి వేరే వెళ్ళాం. మాకు కొన్ని గోల్స్ వున్నాయి.  వాటిని సాధించుకోవటానికి వెళ్లాం.”
తను ఇదంతా ఎందుకు చెప్తోందో, ఈ సంభాషణ దేనికి దారితీస్తుందో అర్థం కాలేదు.  మౌనంగా విని తరువాత చెప్పేదానికోసం ఎదురుచూసాను.
“రెండవది మేం ఏమి సాధించామనేది. యూరప్ టూర్ వెళ్ళిన విషయం నీకు తెలిసినదే. అది స్పాస్సర్డ్ ట్రిప్. దాంతో చాలాచోట్ల కృష్ణకి బేడ్ మింటన్ కోచ్ గా మంచి గుర్తింపు వచ్చింది.  చాలా అవకాశాలు తనచేతిలో వున్నాయి. ఇంకో ఫ్లాట్ కూడా కొన్నాం”
“…”
“ఇప్పుడు అన్ని షోరూమ్స్ లో బ్లాకీస్ అనే కలెక్షన్ వుంటోంది.  ఆ బ్రాండ్ బాంబేలోని డైమండ్ టెక్స్టైల్స్ వాళ్లది. ఆ చీరల డిజైనింగ్,  సెలక్షన్ చేసే కమిటీలో నేను మెంబర్ని. నాలా నల్లగా వుండేవారికోసం ఆ ప్రాడక్ట్స్. నా పేమెంటు ఎంత వుంటుందో నీ వూహకి వదిలేస్తున్నాను”
నేను విస్మయంగా చూసాను. అన్నయ్య నన్ను చూసి అసూయ పడుతున్నాడనే భావన అస్పష్టంగా వుండేది.  అది నిజమనే నమ్మకం అంజని కలిగించింది.  వాళ్లు మాకన్నా పైనే వున్నారనేది కచ్చితమైన వాస్తవం.
“చివరిది మేం తిరిగి రావటం. మీరేదో అన్నారని వెళ్లలేదు. బతకలేక తిరిగి రాలేదు. అది స్పష్టమేగా? కృష్ణ పేరెంట్స్ ని బాగా గుర్తుచేసుకుంటున్నాడు. వాళ్లుకూడా మమ్మల్ని మిస్ చేస్తున్నారు. ఒక కొడుకుండి తనలాగా ప్రయోజకుడవాలనే కోరిక నాకు కలిగింది.  కూతుర్ని కని దాని గారాలు తీర్చాలనే కోరిక తనకి కలిగింది.  అత్తయ్య అన్నట్టు అప్పటి చిన్నతనం ఇద్దరికీ తీరింది. పిల్లలని కన్నా మమ్మల్ని ప్రేమించే విధంగా ఎలా పెంచాలో కౌన్సిలింగ్ తీసుకున్నాం”
వదిన ఇదంతా ఎందుకు చెప్తోందో కొద్దికొద్దిగా అవగాహనకి వస్తోంది. తన  గొంతుకూడా పదునెక్కింది.
“మీరిద్దరూ అందంగా వుంటారు. మాకే ఆక్షేపణా లేదు. అందాన్ని నిలుపుకోవటానికి  అంజని చాలా ప్రయాసపడుతుంది. దాంతోటీ నాకు సమస్య లేదు. కానీ నన్ను ఆక్షేపించినప్పుడు కొన్ని విషయాలు ఎత్తి చూపించక తప్పదు. ఎందుకా అందం? స్కిన్ షో చేస్తుందా? మోడలింగ్,  యాక్టింగ్ చేస్తుందా?”
“అలాంటిదేం లేదు…” నా ముఖం ఎర్రబడింది.
“మాకన్నా మీరు ఎందులో ఎక్కువో చెప్పు రవీ! తెల్లటి వొళ్ళు ఒక్కటీ చాలా?  ప్రపంచంలో ఎక్కడికేనా వెళ్లి బతకగలిగే సత్తా మాకుంది. మరి మీకు? షేర్లలో పెట్టి చాలా నష్టపోయావు. ఎప్పుడు వూడుతుందో తెలీని ఈ వుద్యోగం తప్ప ఇంకేమీ లేదు. ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్తే  వుండటానికి మీకంటూ ఇల్లు లేదు. పిల్లాడికి ఇప్పటినుంచే ఇలాంటివి నేర్పిస్తున్నారు. రేపు మా పిల్లలని చూసి అసూయపడటం నేర్చుకుంటాడు. ఎల్లుండి ఆ పరిస్థితికి కారణం అని మిమ్మల్ని నిలదియ్యడా?”
కంగుమంది తన గొంతు.
“సారీ వదినా! చిన్నపిల్లాడు. తెలీక ఏదో అన్నాడు. నేను మందలిస్తాను” అన్నాను. మాట పెకిలి రావటం కష్టమైంది.
“వాడేం చేసాడు? వాళ్ళ అమ్మకి చెప్పు. వాడిని మామీది ఆయుధంగా వాడుకోవద్దని”
ఆమె చెప్పటం అయింది.  అమ్మ వచ్చింది.  నేను, వదిన మాట్లాడుకోవటం చూసి ఆశ్చర్యపోయింది.  నందూ నన్ను విడిపిపించేసుకుని ఆవిడ దగ్గరకు పరిగెత్తాడు.
“బామ్మా! బెద్దమ్మ నన్నిక్కల పత్తుకుంది… ఛీ… యాక్” ఆవిడ కాళ్ళకి అల్లుకున్నాడు.
వంగి వాడిని ఎత్తుకోబోతున్న అమ్మ చేతులు వెనక్కి తీసుకుంది. నాకు చెళ్ళున చరిచినట్టైంది.
నేను చిన్నప్పుడు మొదలు పెట్టిన ఆట పూర్తైంది. విసిరిన బంతి నా దగ్గరకే వచ్చింది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s