ఊహించని అతిథి by S Sridevi


కొన్ని సంభావ్యతలు సంఘటనలుగా మారినప్పుడు అవి ఎలాంటి భౌతికమైన ఆధారాలూ మిగల్చవు. భౌతికశాస్త్రసూత్రాలకి లోబడని ఈ సంఘటనలు మన జీవితంమీద మాత్రం కచ్చితమైన ముద్ర వేసి ఒక సందిగ్ధంలో పడేస్తాయి. జరిగింది నిజమా కాదా అని మనకే అనుమానం కలిగేలా.


పాయింట్‍బ్లాంక్ రేంజిలో నా కణతకి తుపాకీ గురిపెట్టబడి వుంది. దాన్నతను తీస్తున్నప్పుడు చూసాను. బాగా తుప్పు పట్టి వుంది. అందులోంచీ బులెట్ బైటికి వస్తుందో లేదో అనుమానమే. పొరపాట్న వస్తే ఏం జరుగుతుందో తెలుసుకాబట్టి తల కదపకుండా జాగ్రత్తగానే వున్నాను.
ఐతే నేనెప్పుడూ నిజజీవవితంలో తుపాకీని చూడలేదు. ఇదే మొదటిసారి. సినిమాల్లో హెచ్చులు వుంటాయని తెలుసు. ఇది ఓవర్ సింప్లిఫికేషన్.
అవంతీపురం కోట వెనుక… తపస్వినీ నది కనిపిస్తూ హోరు వినిపిస్తూ వుంటుంది. ఇటువైపు జనసమర్దం వుండదు. కోటకీ నదివొడ్డుకీ మధ్య నేను  రెగ్యులర్‍గా వాకింగ్ చేసే చోటు. ఇద్దరో ముగ్గురో కలిసి కబుర్లు చెప్పుకుంటున్నవాళ్ళని దాటుకుంటూనో, మెళ్ళో సెల్‍ఫోను వెలాడేసుకుని చెవులకి బ్లూటూత్ తగిలించుకుని వినపడని మనిషికి అరిచి చెప్తున్నట్టు మాట్లాడేవాళ్ళ మధ్యనో నడవటం నాకు నచ్చదు. ఏకాంతం, నాలోకి నేను చూసుకుంటూ, బాహ్యప్రపంచాన్ని మర్చిపోయి ఆలోచనల్లో నన్ను నేను వెతుక్కుంటూ నడవటం నాకు చాలా యిష్టం. ఇక్కడ భూమ్యాకాశాలు నావేనన్నంత స్వతంత్రంగా వుంటుంది. అలాంటి యిష్టాలకి మూల్యం చెల్లించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది అలా చెల్లించే సందర్భం.
ఎప్పటినుంచీ నామీద రెక్కీ చేసాడో, నేను జనానికి చాలా దూరంగా వుండి ఎవరికీ కనిపించని మలుపులో వున్నప్పుడు అతను వెనకనుంచీ వచ్చి నా వీపుకి గన్ పెట్టి బలవంతంగా కోటలోని ఒక పాడుబడ్డ గదిలోకి తీసుకొచ్చాడు. నడిపించే. నెమ్మదిమీద అతను నా ఎదుటికి వచ్చాడు. గన్ నా కణతకి వచ్చింది.  ఇక్కడ అప్పుడప్పుడూ హత్యలు జరుగుతుంటాయి. నేను కారు పార్క్ చేసినచోటికీ ఇక్కడికీ  పెద్ద దూరం వుండదు.
ఇతనెవరు? నన్నెందుకు కిడ్నాప్ చేసాడు? కిడ్నాప్ అనచ్చా దీన్ని? ఇతనొక్కడేనా? ఇతని వెనుక ఇంకెవరేనా వున్నారా? ఒక్క క్షణంలో ఎన్నో ప్రశ్నలు నాలో. వాటిని తాత్కాలికంగా ఆపి అతనిమీద దృష్టి పెట్టాను.
గన్ పట్టుకున్న అతని చెయ్యి వణుకుతోంది. ట్రిగ్గర్‍మీద వున్న అతని వేలుకూడా. అతను ప్రొఫెషల్ కిల్లర్ కాదని గ్రహించాను. తల ఏమాత్రం కదపకుండా నెమ్మదిగా కళ్ళుమాత్రం ఎత్తి అతని ముఖంలోకి చూసాను. నిండా చెమటలు పట్టి వున్నాయి. మా యిద్దరి చూపులూ కలుసుకున్నాయి.
“నావల్ల కావట్లేదు. ఇలాంటి దందాలెప్పుడూ చెయ్యలేదు” అన్నాడు పైకే.
అతనంత తేలిగ్గా నన్ను చంపడని అర్థమైంది. ఐనప్పటికీ గన్ను, బులెట్ సంభావ్యత ఇంకా అలాగే వుందికాబట్టి, ఇంకొంచెం మాత్రమే సాహసం చేసాను.
“చూడు, ఎలాగా నన్ను చంపాలనుకున్నావు. చంపేముందు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు. ఎందుకు చంపాలనుకుంటున్నావు? చంపితే నీకేమొస్తుంది?”
పళ్ళ బిగువుని అడిగాను.
అతను తెల్లబోయాడు.  గన్ గురిపెట్టిన చేతిని కిందకి దింపేసాడు.
“నువ్వేకదా, నిన్న రాత్రి నాకు సుపారీ ఇచ్చావు? తొమ్మిదివందల ముప్పై తొమ్మిది రూపాయలా ఆఠాణాకి ” అన్నాడు.
నాకు వూపిరి నిలిచిపోయినంతపనైంది. “నన్ను చంపమని నీకు నేనే సుపారీ ఇచ్చానా? అదీ తొమ్మిదివందల ముప్పైతొమ్మిదిన్నరకి?” అతికష్టమ్మీద అడిగాను. నా స్టేచరేమిటి? నన్ను వెయ్యిరూపాయల కిరాయికి చంపడమేమిటి?
“ఔను. అందులో ఒకనోటు బొమ్మది. వంద తక్కువిచ్చావు. ముందసలు ఆ లెక్క చెప్పు. నిన్ను తేంగానే అడగాల్సింది. భయమేసి అడగలే” అన్నాడు. నేనిచ్చానని చెప్తున్న డబ్బులోంచీ ఆ నోటు తీసి చూపించాడు.
నిజమే. అది బొమ్మనోటే. దానిమీద బార్‍కోడ్ కూడా వుంది. నేనున్న షాక్‍లో అది నాకెక్కడిదన్న ఆలోచన రాలేదు. మడిచి జేబులో పెట్టుకుని వేరేది ఇచ్చాను.
నా తెలివిని పూర్తిగా వుపయోగించాను.
“చూడు, నన్ను చంపమన్నది నేనే కాబట్టి, వద్దనికూడా చెప్తున్నాను. వదిలెయ్ నన్ను” అన్నాను.
“ఐతే డబ్బులు వెనక్కి తీసుకుంటావా? నేనివ్వను” అన్నాడు. అతని కళ్ళలో ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకుంటానేమోననే భయం కనిపించింది.
నేను చిన్నగా నవ్వి, “ఆ డబ్బులు ఇవ్వక్కర్లేదు. నన్ను వదిలేసినందుకు లక్షరూపాయలుకూడా ఇస్తాను” అన్నాను.
“లక్షంటే?”
“చాలా డబ్బు. కానీ నన్నెందుకు చంపాలనుకున్నావో, ఎవరు చంపమన్నారో చెప్పాలి. నీకేం భయం లేదు. నేను నిన్ను కాపాడతాను” అన్నాను.
అతను రెండు నిముషాలు మాట్లాడలేదు. తర్వాత అడిగాడు. “నీకేమైనా పిచ్చా?”
“అదే తెలుసుకోవాలి” అని, అంత భారీ డైలాగ్ అతనికి అర్థమవదని గ్రహించి, “ఆ యెదురుగా ఏటీఎమ్ సెంటరు వుందికదా, అక్కడికి నాతో రా, డబ్బులిస్తాను” అన్నాను.
“నేను రాను. పోలీసులకి పట్టిస్తావు. నువ్వే తీసుకు రా!”  అన్నాడు.
అతడి తెలివెంతో నాకు అర్థమవలేదు. సరేనని చెప్పి, వెళ్ళాను. రెండు కార్డులు వాడి, డబ్బు డ్రా చేసి తిరిగొచ్చాను. అతను ఇదివరకటిచోట లేడు. నేనుగానీ పోలీసుల్ని వెంటబెట్టుకుని వస్తే మాయమవటానికి సిద్ధంగా సందుమలుపులో నిలబడ్డాడు. నేను ఒక్కడినే రావటం చూసి నెమ్మదిగా దగ్గరకొచ్చాడు.
“లక్ష కాదు, రెండు లక్షలు కావాలి” అన్నాడు తలొంచుకుని నిలబడి. అతని వెనుక ఎవరో వున్నారని నిర్ధారణైంది. నేను ఏటీయంకి వెళ్ళిన ఈ కొద్ది నిముషాలలో ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఎవరది? ఆ వ్యక్తి ఇక్కడే వున్నాడా? నాకు కనిపించకుండా దాక్కున్నాడా? నన్ను చంపాలనుకుంటే ప్రొఫెషనల్ కిల్లర్‍కి ఇవ్వచ్చు. వదిలెయ్యాలంటే కోట్లలో రాన్సమ్ అడగచ్చు. ఎందుకిలా చేస్తున్నాడు? ఏమి ఆశించి?  
డ్రా చేసి తీసుకొచ్చిన రెండువేలనోట్లు యాభై ఇవ్వబోతే తీసుకోలేదు. చెయ్యి వెనక్కి తీసుకున్నాడు.
“ఈ నోటు నాదగ్గర చూస్తే పోలీసులు బొక్కలిరగ్గొడతారు” అన్నాడు.  
“మరి?”
“అన్నీ పదినోట్లే కావాలి.  ఒకటీ రెండూ మార్చుకుంటా” అన్నాడు. “మరి ఇంకో లక్ష?”
గొంతు కొంచెం కఠినంగా మార్చి అడిగాను.
“అదీ నాకే”
“ఎవరు చెప్పారు, ఇంకో లక్ష అడగమని?”
అతను నాకేసి భయంగా చూసాడు. చెప్పలేదు.  
“చెప్పు. అన్నీ చెప్తే నిన్నేమీ అనను. డబ్బిచ్చి వదిలేస్తాను. లేకపోతే మాత్రం వదిలిపెట్టను”
“నువ్వేకదా?” అన్నాడు, నా గొంతులో కాఠిన్యానికి బెదిరి.
“నే…నా?!!”
ఇందులో ఏదో మిస్టరీ వుంది. అది తెలుసుకోవాలి. అంతదాకా ఇతన్ని వదిలిపెట్టకూడదు. నాలాగా వున్న వ్యక్తి ఎవరేనా ఈ నాటకం ఆడుతున్నాడా? అలా మనిషిని పూర్తిగా పోలిన వ్యక్తి వుండటం సాధ్యమా? ఇతనెలా పొరబడుతున్నాడు, నేనేనని?    
“సరే. ఇప్పటికిప్పుడు అన్ని చిన్ననోట్లు దొరకవు. రేపు బేంకుకి వెళ్ళి తీసుకుంటాను. నీకెక్కడికి తెచ్చి ఇవ్వాలి?” అడిగాను. అతని ఆచూకి తెలుసుకోవాలని.
అతను వెంటనే చెప్పలేదు. “కాసేపాగి నువ్వే వచ్చి చెప్తావ్” అన్నాడు నెమ్మదిగా. నాకు జుత్తు పీక్కోవాలనిపించింది.
“నీ ఫోన్ నెంబరివ్వు” అడిగాడు.
విజిటింగ్ కార్డు ఇచ్చాను. అది నేను చేసిన మరో తప్పు. “సరే ఐతే” నేను వచ్చేసాను. ఏదో తెలియని భయం సన్నగా. ఎవరో నన్ను వెంటాడుతున్నారనిపించింది. నన్నెందుకు చంపాలనుకున్నారు? చంపకుండా ఎందుకు వదిలేసారు? నాలాగే వుండి నేనేనన్న భ్రమ కలిగిస్తూ తిరుగుతున్న ఆ వ్యక్తి ఎవరు?  తప్పిపోయిన కవలసోదరుడు, నాన్నకి మరో కుటుంబంలాంటి ఎపిసోడ్సేవీ మా కుటుంబంలో లేవు. నేను పూర్తిగా అమ్మపోలిక.
మరెవరు?  
ఇంటికి వచ్చేలోపే ఫోనొచ్చింది. డబ్బు ఎక్కడికి తీసుకురావాలో చెప్పానని చెప్పడానికి.
“చెప్పాకదా? నువ్వే వచ్చి చెప్తావని” అన్నాడతడు. నేనక్కడే వుండి వుంటే బావుండేదనిపించింది. కానీ నేనున్నంతసేపూ అతను రాడుకదా? ఇప్పుడు ప్రయత్నిస్తే దొరుకుతాడేమో! సర్రుమని కారు రివర్స్ తీసుకుని వురికించాను. ఎవరూ లేరక్కడ. ఇద్దరూ వెళ్ళిపోయినట్టున్నారు.   ఇల్లు చేరుకున్నాను. ఒక్కడినే వుంటాను. ఆఫీసువాళ్ళిచ్చిన క్వార్టరు. ఇంకా పెళ్ళవలేదు. అమ్మానాన్నా నా దగ్గర వుండరు.  
రాత్రంతా నిద్రలేదు. ఇంట్లో ఎవరో తిరుగుతున్న భావన. ఆ మనిషి కనిపించడు. అర్థం తెలియని అలజడి. ఎవరికేనా చెప్పాలి. ఏమని చెప్పను? ముందు నాకే స్పష్టత లేదు.
అతికష్టమ్మీద రాత్రి గడిచింది. మరుసటిరోజు పొద్దున్నే  లేచి, బేంకు టైముకల్లా తయారై వెళ్ళిపోయాను. నేను చాలా పాత కస్టమర్ని. మేనేజరుకూడా తెలిసినవాడు. అతనికి చెప్తే రెండులక్షలకి పదినోట్లు ఏర్పాటు చేస్తానన్నాడు. పదికట్టలున్న రెండు పేకెట్స్ ఇప్పించాడు. చేత్తో తీసుకెళ్ళేలా లేవు.
“కార్డులు పట్టుకుని తిరగడం అలవాటైపోయింది. రెండులక్షలంటే ఇంత కరెన్సీ వస్తుందనుకోలేదు. ఏదైనా బేగ్ అరేంజి చెయ్యగలరా?” మేనేజర్ని అర్థించాను.
“ప్లాస్టిక్ బేన్‍డ్ కదా, కవర్స్ లోపలికి అనుమతించడం లేదు” అని ఒక్క క్షణం ఆలోచించి, సబ్‍స్టాఫ్‍ని పిలిచి గార్బేజి కవర్ ఇప్పించాడు.
“క్షమించండి. ఇంకేమీ లేవు” అన్నాడు.
అందులో డబ్బులు సర్ది, పక్కనున్న కుర్చీలో పెట్టాను.   ఇద్దరం ఏవో మాటల్లో పడ్డాము. నేను కవర్ మర్చిపోయి అలాగే చేతులూపుకుంటూ వెళ్ళిపోయాను. బాగా దూరం వెళ్ళాక బేగ్ గుర్తొచ్చింది. వెంటనే కారు రివర్స్ తీసుకుని బేంకుకి వెళ్ళాను. అక్కడ కుర్చీలో కవరు లేదు. “కేష్ పెట్టిన కవరు… ఇక్కడే కుర్చీలో పెట్టాను…”అన్నాను.
“ఇప్పుడేకదా, మర్చిపోయానని వచ్చి తీసుకెళ్ళారు?” మేనేజరులో ఆశ్చర్యం.
“నేను… నేనొచ్చి తీసుకెళ్ళానా?” నాలో దిగ్భ్రమ.
మేనేజరు ముఖంలో నవ్వు ఎగిరిపోయింది.
“అంటే?” గొంతులో కోపం వ్యక్తమైంది. తనని అనుమానిస్తున్నాననుకున్నట్టున్నాడు. అదేం పట్టించుకునే స్థితిలో లేను.
“నేనేనా? మీరు చూసారా?” ఆతృతగా అడిగాను.
“ఔను” కచ్చితమైన జవాబు.
నేనేమీ మాట్లాడకుండా అక్కడే కూర్చుండిపోయాను.
“ఏదైనా సమస్యా?”
మళ్ళీ ఆట మొదలైందా?  ఏం జరగబోతోంది?
“సీసీ కెమెరా వుంది ఈ రూంలో. చూస్తారా?”
“ప్లీజ్!”
అతను తన స్టాఫ్ మెంబర్ని పిలిచాడు. నేను వచ్చి వెళ్ళినప్పటిదాకా వెనక్కి వెళ్ళి ప్లే చేసాడు. చూసిన నా ముఖం వివర్ణమైంది. అందులో వున్నది నేనే. ఎలా?
“థాంక్యూ” అన్నాను మేనేజర్తో. “నేను మిమ్మల్నిగానీ బేంకునిగానీ అనుమానించట్లేదు.  ఆ వీడియోలో వున్న వ్యక్తి నేను కాదు” అని  లేచాను. మేనేజరుకూడా లేచాడు.
“మీరు నాకు చాలాకాలంగా తెలుసు. ఒక చిన్న సలహా ఇస్తాను. ఏమనుకోకండి… నాకు తెలిసిన మంచి సైకియాట్రిస్ట్ వున్నాడు. ఒకసారి వెళ్ళి కలవండి. సలహా ఇస్తాడు” అన్నాడు.
నాకు కోపం రాలేదు. నేనున్న కన్ఫ్యూజన్‍లో రాదు కూడా. బ్లాంక్‍గా చూసి, ఇవతలికి వచ్చాను. ఎవరేనా నన్ను అనుసరిస్తున్నారా? అనుమానంగా కార్లోకి చూసాను. చుట్టుపక్కలకూడా చూసాను. ఎవరూ లేరు. తర్వాతేం జరగబోతోంది?
ఎక్కడా ఆగకుండా నేరుగా క్వార్టర్‍కి వెళ్ళాను.
“సర్, ఒక్క నిముషం. ఇందాకా మీరిచ్చిన పేకెట్” వాచ్‍మేన్ గార్బేజి కవర్ ఇచ్చాడు. “నేనిచ్చానా?” అని అడగడం మానేసి, “ఎంతసేపైంది?” అని అడిగాను, తెలివిగా అడుగుతున్నాననుకుని.
ఐనా వింతగా  చూసాడు. నాకూ అర్థమైంది. ఇంకేం మాట్లాడకుండా పేకెట్ తీసుకుని వెళ్ళిపోయాను. ఇంట్లోకి వెళ్ళాక చూస్తే అందులో ఒక లక్ష లేదు.
చిన్న స్లిప్. అవసరమై లక్ష తీసుకున్నాను- అని.
ఏం జరుగుతోంది? లేక నాకే ఏదైనా అయిందా? ఒకరు కాదు, ఇప్పటికి ముగ్గురు చెప్పారు.  ఇప్పుడు నేను వెళ్ళాల్సింది ఎక్కడికి? సైకియాట్రిస్ట్ దగ్గరకా? పోలీసుల దగ్గరకా? నిన్న రాత్రి నన్ను తీసుకెళ్ళినవాడేమైపోయాడు? వాడికి డబ్బు అక్కర్లేదా? లేక వాడే గేమ్ ఆడుతున్నాడా? యస్ వాడే… వాడి డబ్బు వాడు తీసుకెళ్ళిపోయాడు. వాచ్‍మెన్‍కి పదో పాతికో ఇచ్చి ఇలా చెప్పమని వుంటాడు… మరైతే బేంకు వీడియోలో వున్నదెవరు?
సెల్ క్లింగ్‍మంది. మెసేజి అలర్ట్. ఏదో కొత్త నెంబరునించీ మెసేజి. సెల్ పక్కని పడేసాను. మరో మెసేజి. అదే నెంబరునించీ. తెరిచాను.
ఆటైపోయింది… టైముకూడా… మెసేజితోపాటు నవ్వుతున్నట్టు ఇమోజీ.
ఎవరు? ఏ ఆట?
ఆ నెంబరు ట్రూకాలర్‍లో కొట్టి చూసాను. ఇంటర్నెట్ సెంటరు నడుపుతున్న శిబి అనే వ్యక్తిది. వెంటనే పోలీస్‍స్టేషన్‍కి వెళ్ళాను. నిన్నటినుంచీ జరుగుతున్నదంతా చెప్పి కంప్లెయింటు ఇచ్చాను. వాళ్ళు కంప్లెయింటు బుక్ చేసుకున్నారు.
నిన్నరాత్రి నన్ను బెదిరించిన మనిషిని తీసుకొచ్చారు, పాతసామాన్లు అమ్ముకునేవాడట. గన్‍తో సహా వచ్చాడు. నాకు తోడుగా ఒక కానిస్టేబుల్‍ని ఇచ్చి ఇంటర్నెట్ సెంటరుకి పంపించారు. ప్రిలిమినరీ ఎంక్వైరీకి.
“తమ్మీ! ఈ నెంబరు నీదేనా?”  కానిస్టేబుల్ నా సెల్‍లో మెసేజి వచ్చిన నెంబరు చూపిస్తూ అడిగాడు.  శిబి తలూపాడు.
“ఈ మెసేజి నువ్విచ్చినదేనా?” కానిస్టేబుల్ గొంతు కటువుగా మారింది.
ఆ ప్రశ్నకి శిబి తెల్లబోయాడు.  “నువ్వేకద సార్, గంటకిందట వచ్చి, నీ సెల్ పనిచేస్తలేదని చెప్పి, నా ఫోన్లో  మెసేజి పెట్టుకున్నవ్? అదయ్యాక ఈమెయిల్ ఎట్ల పంపిస్తరో చెప్పమని మెయిల్‍కూడా పెట్టుకున్నవ్?” అన్నాడు నావైపు తిరిగి.
“ఏం నకరాల్ జేస్తున్నవా? ” అన్నాడు  కానిస్టేబుల్.
“దీంట్ల నకరాలేముంటయ్? కావాలంటే సీసీ కెమెరా చూస్కో” అన్నాడు శిబి.
“ఈ సార్ను చంపుతామని  చూస్తున్నరట. కంప్లెయింటిచ్చిండు”
శిబి సీసీ కెమెరా ప్లే చేసాడు. బేంకులోలాగా… నేనే. కానీ నేను కాదు.
“సారూ! పాగల్‍ఖానానుండి వచ్చినవా?” అన్నాడు కానిస్టేబుల్ నన్ను.
నాకు తల పగిలిపోతుందనిపించింది.
“ఒకమాటు మెయిల్ చూసుకో సారు. నీకు నువ్వే మెసేజి పెట్టుకున్నవ్. మెయిల్‍సుత నీకే పంపుకున్నవేమో!” అన్నాడు శిబి. అతనిముఖంలో ఒకలాంటి నవ్వు. జాలి.
“పోలీస్‍స్టేషనుకి వచ్చి ఎస్సైకి సారీ చెప్పి కంప్లెయింటు వెనక్కి తీసుకో సార్”   అని వెళ్ళిపోయాడు కానిస్టేబుల్.
పోలీస్‍స్టేషన్‍కి వెళ్ళాను. అప్పటికే నాతో ఇంటర్నెట్ సెంటర్‍కి వచ్చిన కాన్‍స్టేబుల్ వచ్చి వున్నాడు.
“ఇదేనా మిమ్మల్ని చంపడానికి వాడిన గన్?” అడిగాడు సీఐ. ఔను. అదే. తుప్పు పట్టిన గన్. తలూపాను. నా మాట వినగానే అతను నవ్వింక ఆపుకోలేకపోయాడు. అతనితోపాటు సెల్‍లో వున్న పాతసామాన్లవాడు, కాన్‍స్టేబుల్ ఇద్దరూ కూడా నవ్వటం మొదలుపెట్టారు. అప్పుడు చూసాను, సిఐ టేబుల్‍మీద వున్న చీకిపోయిన కేపులరీలు.
“మొదటేమో పైసలిచ్చి చంపమన్నాడు. దిమాగ్ బాలేదనుకున్న. నా దగ్గరున్న పాత పిస్తోలు గురిపెట్టిన. మనసు మార్చుకున్నాడు. చంపకు లక్ష ఇస్తానన్నాడు. మళ్ళొచ్చి రెండులక్షలు అడగమన్నాడు. ఇప్పుడొచ్చి పోలీసులకు పట్టించాడు” అన్నాడు పాతసామాన్లవాడు. వాడిని కాస్త బెదిరించి  వదిలిపెట్టాడు సీఐ.
“ఎవరేనా సైకియాట్రిస్టుకి చూపించుకోండి” అని నాకు సలహా యిచ్చి వదిలాడు.
నేను తిరిగి ఇంటికొచ్చాను. కోపం. ఉక్రోషం. ఏం జరుగుతోంది? నాలా వుండే అతనెవరు?
శిబి చెప్పినట్టు మెయిల్‍కూడా పంపించాడేమో! చెక్ చేసాను. “మీ” అని నోటిఫికేషన్ వుంది. అంటే నా మెయిల్‍నుంచి నాకే. తెరిచాను.
మిత్రమా!
నిన్న రాత్రినుంచీ మనం బాగానే ఆడుకున్నాం. సరదాగా అంతే…. నేను నీలా వుండటం కాదు. నేనే నువ్వు… కన్‍ఫ్యూజ్‍డ్? మల్టీవర్స్ గురించి నీకు తెలుసుకదా? ఒకే విశ్వానికి అనేక జిరాక్స్ కాపీల్లా. మనుషులూ అంతే. మాది అమిత్సుఖి విశ్వం. అన్సన్సనూసా దేశం.  నీకు నేను జిరాక్స్ కాపీ. అలాగ ప్రతి మనిషికీ ప్రతి విశ్వంలో ఒకరుంటారు. మీరింకా గెలాక్సీలు దాటి ముందుకు వెళ్ళలేదనుకుంటాను. మేం దాటేసాము. మా టైమ్ జోన్ కూడా వేరే.
వర్మ్‌హోల్‍లో ప్రయాణిస్తున్నప్పుడు పొరపాట్న నీ లైఫ్‍చానెల్లోకి వచ్చాను. అంటే తెలుసా? ఒక పార్టికల్ స్పేస్‍టైమ్ కంటిన్యువమ్‍లో ప్రయాణిస్తున్న ప్రతి ఈవెంట్‍నీ కలిపితే ఏర్పడే రేఖని వరల్డ్‌లైన్ అంటారు. మనిషి విషయంలో దాన్ని మేము లైఫ్‍చానెల్ అంటాము. నీకు పదినిముషాల దూరంలో ఆగాను. మనిద్దరం కలుసుకోలేము. పక్కపక్కనుంచీ వెళ్ళినా రెండు టైంజోన్స్‌లో సమాంతరంగా మాత్రమే కదులుతాము. ఫిజికల్‍గా మనిద్దరం పదడుగుల దూరంలో నడుస్తున్నామనుకో. నిన్ను నేను తాకలేను. కానీ నువ్వు దాటి వచ్చిన మనుషులంతా నాకు కలుస్తారు.
నీతో కొంతసేపు గడపాలనుకున్నాను. నా చుట్టూ తిప్పుకోవాలనుకున్నాను. కానీ ఎలా?
కొన్నివేలసంవత్సరాల వెనక్కి వచ్చి నన్ను నేను చూసుకోవటం చాలా వింతైన అనుభవమే ఐనా కొన్ని యిబ్బందులు ఎదురయాయి. ముందు మా దేశాన్ని గురించి చెప్తే అవేంటో నీకే తెలుస్తాయి.
మేము తిండికోసం కొంత సెస్ కడతాం. పండించడానికి శ్రమపడతాం. మిగతాది ప్రభుత్వం చూసుకుంటుంది. రోడ్లకి రెండువైపులా పళ్లచెట్లుంటాయి. ఆకలేస్తే కోసుకుని తింటాం. ఎవరూ అడగరు. పార్కుల్లోనూ ఇంకా ఇతరత్రా ఎక్కడ చెంచాడు స్థలం వున్నా, కూరగాయలు, ఆకుకూరలూ పెంచుతాం. ఇవి కాక మిగిలిన పంటలు సరే. కమ్యూనిటీ కిచెన్స్ వుంటాయి. ఎవరేనా ఎక్కడేనా వండుకుని తినచ్చు.
మాకూ మీలా డబ్బుంటుంది. వ్యాపారాలుంటాయి. పెళ్ళిళ్ళౌతాయి. ఒక పిల్లో పిల్లవాడో పుట్టగానే గవర్నమెంటు వాళ్ళ పేరుమీద డబ్బు ఇస్తుంది. అన్ని కరెన్సీ నోట్లమీద బార్‍కోడ్ వుంటుంది. స్కానింగ్ చేసి మాత్రమే నోట్లు ఒకరికి మరొకరు ఇవ్వచ్చు. ఆ నోటు ఎక్కడుందో రికార్డౌతుంది.  అనాథరైజెడ్‍గా ఎవరిదగ్గరా ఏ నోటూ వుండకూడదు.  దాన్ని వాడుకోలేరు. అలా  వుంచుకున్నవాళ్ళకి శిక్షకూడా పడుతుంది.  
నాకిక్కడికి రాగానే చాలా ఆకలేసింది. తిండి అమ్ముతారటకదా? నా దగ్గర డబ్బులేదు. అలా మొదలయ్యాయి నా కష్టాలు. నా వస్తువులు కొన్ని అమ్ముతానని ఒక వ్యక్తితో చెప్పాను. అదృష్టవశాత్తూ సాంకేతికత కారణంగా కమ్యూనికేషన్ సమస్య రాలేదు. మా యిద్దరి థాట్‍వేవ్స్ సరిగానే ట్రాన్స్‌మిటయ్యాయి. ఆపైన నీ వర్చువల్ ఇమేజి, ఒక పాతసామాన్లవాడు, వాడి తుప్పుతుపాకీ నాకు సహాయం చేసాయి. వాడికి లక్షో రెండు లక్షలో ఇస్తానన్నావటగా, ఇచ్చెయ్. పాపం బాగుపడతాడు. అన్నట్టు ఆ డబ్బులోంచీ నేను కొంత తీసుకున్నాను. నా ఫియాన్సీకి కానుక కొనటానికి.
ఎంజాయ్‍డ్.
ఫన్.
థేంక్స్.
నాకు తల గిర్రుని తిరిగిపోయింది. ఈ సంఘటన ఇలా జరిగిందని ఎవరికేనా చెప్తే నమ్ముతారా? శిబి ఫోన్లోంచీ పంపుకున్న మెసేజి, నా ఐడీనుంచి నేనే పంపుకున్న మెయిల్… ఎవరికేనా చూపిస్తే, వూళ్ళో వున్న ప్రముఖ సైకియాట్రిస్టుల పేర్లు చదువుతారు.


Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s