చిట్టికి క్షమాపణలతో by S Sridevi

చిట్టీ!
నీ పేరేమిటోకూడా నాకు సరిగ్గా గుర్తులేదు. లక్ష్మీస్వరాజ్యం అని లగ్నపత్రిక రాయించినప్పుడు పురోహితుడు చదివినట్టు జ్ఞాపకం. చిట్టెమ్మని అందరూ అనేవారు.
తాటాకుబొమ్మలా అల్పంగా వున్న నీకు తెల్లటి మధుపర్కాలు కట్టించి, పూలజడేసి, కంటో కాసులపేరో పేరు తెలియని ఒక నగ వేసి నా ఎదురుగా తెరకి అటువైపు కూర్చుండబెట్టారు. మంత్రాలూ, తదితరాలయ్యాయి. జీలకర్ర, బెల్లం పెట్టుకున్నాం. తెర తీసేసారు. నువ్వొచ్చి పెళ్ళిపీటమీద నాపక్కని కూర్చున్నావు. నేను నీమెళ్ళో మంగళసూత్రాలు కట్టాను. దట్టంగా కాటుక పెట్టుకున్న కళ్ళెత్తి నువ్వు తలొంచుకునే నన్ను వోరగా చూసావు. మన పెళ్ళికి సంబంధించి నాకు గుర్తున్న విషయాలు అంతవరకే.
తర్వాత కార్యం అన్నారు. అదీ అయింది. వరసగా పిల్లలు పుట్టుకు రావడం మొదలైంది. నాలుగోపిల్ల పుట్టినప్పటికి నీకు ఇరవయ్యేళ్ళు కూడా లేవనుకుంటాను. ఇంత వెంటవెంటనే కాన్సులైతే ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టరు కోప్పడటంచేత ఆ విషయం గుర్తుంది. నలుగురు పిల్లల తల్లిని చేసాక నిన్ను పిల్లల్తోసహా వదిలేసి నేను చెన్నపట్టణం రైలెక్కడం స్కృతిపథంలో ముద్రపడిన మరో విషయం. అప్పటిదాకా నేను అనుభవించినది సుఖం కాదు. ఏం చెయ్యాలో తెలీని గందరగోళంలో వున్నప్పుడు ఏదో ఒకటి చేసెయ్యటం.
ఇప్పుడు అంటే ఇన్నేళ్ళ జీవితం ఇలా గడిపాక నేను చేసింది తప్పో వప్పో నిర్ణయించలేను. నావరకూ నాకది స్వేచ్ఛని పొందటం. ఒక చట్రంలో ఇరుక్కుపోయి వున్న నన్ను నేను విడిపించుకుని ఎలాంటి హద్దులూ లేని చోటుకి వెళ్ళడం. నా ప్రపంచంలో నేనుండి మిగిలినవాళ్ళని నాకు నచ్చినప్పుడు మాత్రమే అందులోకి ఆహ్వానించడం… లేదా నేనే ఎప్పుడో మనసు పుట్టినప్పుడు బయటి ప్రపంచంలోకి రావటం.
కొందరు సాంప్రదాయస్తులు వుంటారు. వాళ్ళు పిల్లలుగా వున్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమగా పెంచుతారు. అందమైన బాల్యాన్ని ఇస్తారు. ఎదిగాక నచ్చిన చదువు చెప్పిస్తారు, అభిరుచిని గౌరవిస్తారు. నప్పే సంబంధం వెతికి జతకలుపుతారు. ఆపైన వాళ్ళు అందమైన ప్రేమికులు, అన్యోన్యమైన దంపతులు. తమ సాంప్రదాయాన్ని పిల్లలకి అందిస్తారు. వాళ్ళు మనని వూరిస్తూ వుంటారు. మనం వాళ్ళలా బతకగలమా? లేదు. నారుపోసినవాడే నీరుపోస్తాడనేసుకుని పిల్లల్ని కనేసి ఏదో ఒకలా పెంచేసి, ఇదే జీవితం పొమ్మంటే మనకి కలిగిన అనుభవాలు వూరుకోవు.
నాకు పరిచయస్తురాలైన ఒక స్త్రీ అంది- ఇంట్లో అందరూ ఎక్కడివాళ్ళక్కడికి వెళ్ళిపోయాక ఒక చక్కటి పాట వింటాను. మనసు ఆ రసానుభూతినుంచీ విడివడదు. టిఫినుకి జంతికలు చేస్తావా, కారప్పూస చేస్తావా అని పిల్లల గొడవ… రాత్రికి కూరలో వుప్పెక్కువవైందనో కారం తక్కువైందనో భర్తగారి ఆగ్రహం. నాకు అత్యంత ప్రధానమైనవి వాళ్ళ దృష్టికే రావు.
నేనీ పాట విన్నాను. ఆ ఆనందంలో వున్నాను. నన్ను విసిగించకండని అరిచి చెప్పాలనిపిస్తుంది. అలా చెప్పినా ప్రయోజనం వుంటుందంటారా? ఆ పిచ్చిపాటలు వింటూ వంట తగలేసావా, పిల్లలకి నాలుగు జంతికముక్కలు చెయ్యడానికి వొళ్ళొంగక మార్వాడీ కొట్లో కొనుక్కొచ్చి పడేసావా? అని తిడతారు. నా మనసంతా పాడుచేసుకుని కమ్మగా నాలుగూ వండిపెడితే తిన్నాక వీళ్ళు పొందే అనుభూతి అలాంటివేవీ లేకుండానే నేను పొందుతుంటే ఆ మార్గంలోకి వీళ్ళెందుకు రారనే ప్రశ్న నన్ను నిరంతరం వేధిస్తుంటుంది_అని.
నిజమే. ప్రతిమనిషికీ ఒక్కో ప్రపంచం వుంటుంది. కొందరి ప్రపంచాలు చాలా లోతైనవి. అందులోంచీ వాళ్ళు ఇవతలికి రాలేరు. ఇతరులు అందులోకి వెళ్ళలేరు. పొరబాట్న వెళ్ళినా వుండలేరు. లోతుతక్కువ ప్రపంచాలవాళ్ళు ఎక్కడేనా ఎలాగేనా సర్దుకుపోగలరు. వాళ్ళకి అభినివేశం వుండదు.
మిమ్మల్నందర్నీ వదిలిపెట్టి చెన్నై వచ్చాక నాకు గేయరచయితగానూ, కవిగానూ చాలా పేరొచ్చింది. సినిమాల్లో ఎన్నో అవకాశాలొచ్చాయి. పూర్తిగా
నేను ఆ ప్రపంచంలో మునిగిపోయాను. మానాన్న, మీనాన్న వెతుక్కుంటూ వచ్చారు.
“నువ్వు కోరుకున్నది సాధించావు, ఇకనేనా తిరిగి వచ్చెయ్” అన్నారు. వెన్నెల విహారంలోంచీ ఖైదులోకి తిరిగి వెళ్ళటం కుదరదన్నాను. నిన్నూ పిల్లల్నీ పంపిస్తామన్నారు. అదీ కుదరదన్నాను.
“పిల్లాడి పాలడబ్బాకోసమో, వాడి వళ్ళు వెచ్చబడితే డాక్టరుకోసమో తిరిగేంత నేలబారుగా నా జీవితాన్ని చేసుకోలేను” అని తెగేసి చెప్పాను. మరైతే పెళ్ళెందుకు చేసుకున్నావని అడిగారు.
“వివాహం అంటే ఏమిటో, దాని పర్యవసానాలు ఏమిటో తెలియని వయస్సులో, నా యిష్టానిష్టాలతో సంబంధం లేకుండా ఒక తోలుబొమ్మలాటలా జరిగిన పెళ్ళి నా జీవితాన్ని శాసించడాన్ని వప్పుకోను” అదీ నా స్థిరమైన జవాబు.
“అంత యిష్టం లేనివాడివి కాపురం ఎలా చేసావు? పిల్లల్నెలా కన్నావు?” మరిన్ని ప్రశ్నలు.
“చెప్పానుగా, అదొక అవగాహన లేని వ్యవహారమని. దాన్నిక్కడితో ముగించాలనుకుంటున్నాను”
వాళ్ళిద్దరూ కోపంతో వెళ్ళిపోయారు.
చిట్టీ, నిన్ను నేను ఎప్పుడూ మర్చిపోలేదు. నీపట్లా, పిల్లలపట్లా బాధ్యతని వదిలెయ్యలేదు.
మీ అన్నకూడా ఓమోస్తరు కవేకదా? నామీద కోపంతో కొన్నాళ్ళు రాయటం మానేసాడుగానీ మళ్ళీ రాస్తూనే వున్నాడు. ఏవి ఎన్ని జరిగినా ఎప్పటికీ రాయలేని అసక్తత ఆ రాసే చైతన్యం వున్న మనసుకి రాదు. కష్టాలూ, కలతలూ ప్రభావం చూపించినా అది తాత్కాలికం. అవన్నీ ముగిసాక మనసు మరింత పదును తేలుతుంది. మీ అన్న నాకు అప్పుడప్పుడు కవితాగోష్టుల్లోనూ, సాహితీసభల్లోనూ కలిసేవాడు. నీగురించీ పిల్లలగురించీ అడిగాను.
“నేలబారు మనుషులగురించి మీకెందుకు బావగారూ?” అన్నాడు.
ఈ రెండుకొసల జీవితాన్ని ఎలా సమన్వయపరచాలో నాకు తెలీలేదు. అతను మీగురించి నాకే సమాచారం ఇవ్వలేదు. నేనే ప్రయత్నించి మీ వివరాలు తెలుసుకున్నాను.
పెద్దదానికి పెళ్ళైందనీ, రెండోదానికి కట్నం ఇవ్వలేక రెండో సంబంధం చేసారనీ, ఫీజులు కట్టలేక మగపిల్లలు చదువులు ఆపేసి చిన్నచిన్న పనులు చేసుకుంటూ భుక్తి గడుపుకుంటున్నారనీ తెలిసి బాధపడ్డాను. నీకు ఎన్నో విధాలుగా డబ్బు ఏర్పాటు చేసాను. నా జీవితంలోకి పరాయి స్త్రీలు రావటం నీకు పెద్ద ఆక్షేపణ.
“హైందవస్త్రీని కాబట్టి మంగళసూత్రం తీసేస్తే అతనికి కీడు జరుగుతుందని నమ్ముతున్నాను. నా జీవితంలోకి మరో వ్యక్తి వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే వున్న అతనికి కీడు జరగలని కోరుకునేంత దుర్మార్గురాలిని కాదు. ఈ పసుపుతాడు మెడలో వుంచుకోవటం నాకు బరువు కాదు” అని జవాబు పంపావు.
నీ మనసు క్షోభపడుతోందని నాకు తెలుసు. కానీ మనిషిని స్వంతం చేసుకుని, ఒక బంధంలో ఇరుక్కుని గిజగిజలాడుతూ బతకడమేనా జీవితం? నాకు నీ ఆలోచనలు నచ్చలేదు. నేను పంపే డబ్బుతో పిల్లల బాధ్యతలు తీర్చుకుని నీకు నచ్చినవిధంగా నువ్వు సుఖపడతావని ఆశించాను. నేను నీకు ద్రోహం చేసినట్టూ, దాన్ని నువ్వు సహనంతో భరిస్తున్నట్టూ రక్తికెక్కిన నాటకం నాకు నచ్చలేదు. దానివలన ఏం జరిగింది? పిల్లల జీవితాలుకూడా పాడయ్యాయి.
ఒక వ్యక్తి విభిన్నంగా ఆలోచిస్తేనూ, అందరూ నడిచేదారిని విడిచిపెడితేనూ అది పెడదారేనా? మన పెళ్ళి మనకోసం జరగలేదు. ఒక సామాజిక అవసరంగానూ, సాంప్రదాయంగానూ జరిగింది. నువ్వుగానీ నేనుగానీ సుఖపడలేదు. కలిసి వుండీ మనం సుఖపడలేదు, విడిపోయీ సుఖపడలేదు. అలాంటి బ్రహ్మముడి అది. నన్ను ద్వేషిస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకున్నావు. పెళ్ళి, మగవాడి పెత్తనం అనే బంధాల్లోంచీ విడివడికూడా నిన్ను నువ్వు పరిపోషించుకోలేకపోయావు. మరో పెళ్ళి చేసుకోవటమనేది అప్పటి రోజులకి సాధ్యపడని పని. అది నీ ఆంతరంగికం కూడా. కానీ వ్యక్తిగతంగా ఎదిగే ప్రయత్నాన్ని చెయ్యలేదు చూడు, అదే, నేను చెప్పిన లోతుతక్కువతనం.
నా మనసులో ఒకప్పుడు వూటలాగ వూరి, మరొకప్పుడు వుప్పెనలా ఎగజిమ్మే భావాలకి నా బయటి, నాతో సంబంధంలేని ప్రపంచంతో వారధి కట్టడానికి ఎందరినో జీవితంలోకి ఆహ్వానించాను. నేను కోరుకున్న సాంగత్యంకోసం పరితపించాను.
చాలా గొప్ప సాహిత్యాన్ని సృష్టించాను… ట. అందరికీ అన్నీ తెలుసు. నేను పుస్తకం రాస్తే అచ్చెయ్యడానికి ప్రచురణకర్తలు క్యూలో వుండేవారు. దాన్ని సినిమాలు తీయడానికి నిర్మాతలు వరుసకట్టేవారు. ఒక పాట రాస్తే… ఒక సంభాషణ రాస్తే జేజేలు…. సాహిత్యప్రపంచంలోని శిఖరాలన్నీ ఎక్కాను. శిష్యులు, ప్రశిష్యులు… సభలు, సత్కారాలు, సన్మానాలు. ఇదంతా దీపం వెలుగు. దాని వెంబడే నీడలు.
నా వ్యక్తిగత జీవితం బహిరంగ రహస్యం. ఆయనెంత గొప్పవాడైనా ఆయన వ్యక్తిగతజీవితం అంత గొప్పది కాదు. భార్యాపిల్లల్ని వదిలిపెట్టి తన స్వార్ధం తను చూసుకున్నాడు. పిల్లలు గుప్పెడు తిండికోసం నానాపాట్లూ పడుతుంటే ఈయన మాత్రం ఏసీరూముల్లో విలాసాల్లో గడుపుతున్నాడు… నా వెనుక ఎన్నో విమర్శలు. ఇవన్నీ శరీరం కోరుకునే అవసరాలు. మనసుకు కావల్సింది మాత్రం ఆంతరంగిక సహచర్యం. నా జీవితంలోకి వచ్చినవన్నీ కదిలే మేఘాలు. అవి వర్షించవు. దప్పిక తీర్చవు.
అత్యున్నత కీర్తిశిఖరంమీద ఒక్కడినే నిలబడి వున్నాను. ఇప్పటికి నాలోని ఇచ్ఛంతా తీరి, వైరాగ్యం మొదలైంది. శరీరంలోని శక్తి వుడిగింది. వయసైపోయింది. మనసుకింకా వృద్ధాప్యం రాలేదు. నాగురించి నాకిలాంటి అసంతృప్తి లేదు. కానీ నీకు అలా బతకగలిగే అవకాశం లేకుండా చేసాను చూడు, అది నన్నిప్పుడు బాధపెడ్తోంది. నా పరిధిలో వుందనుకున్నది నేను కోరుకున్నట్టే, నీ పరిధిలో కనిపిస్తున్నది నువ్వు కోరుకున్నావు. ఒకరు వదులుకోవాలి. దాన్ని త్యాగం అని పిలవలేను. ఎందుకంటే అనివార్యత్వం త్యాగం కాదు. పరిస్థితి అదుపులోకి తీసుకోవటం స్వార్థం కాదు.
నా జీవితంలోని ఆఖరిరోజు ఇంకెంతో దూరం లేదు. అందుకే ఈ వుత్తరం రాస్తున్నాను. నేను పోయాక నా శరీరాన్ని తీసుకుపొమ్మని మెడికల్ కాలేజికి రాసిచ్చేసాను. నా గుర్తులేవీ మిగలవు. నాపరమైన నైతికబాధ్యతలూ వుండవు. కారణాలు ఏమైనా నీ జీవితం వృధా అయింది. అదొక్కటే నాలో నేను చూసుకున్న వైఫల్యం. అందుకు క్షమించమని అడిగి నిన్నిబ్బంది పెట్టను. కానీ తెలియజెప్పాలికదా? చిన్నదనుకుని వుపేక్షించానుగానీ నా జీవితమంతా ఆవరించుకున్నదీ, నేను ఒకలాగో, మరొకలాగో ప్రవర్తించడానికి కారణం అదే.
ఇట్లు
సూర్యం

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s