కన్నీటి చుక్క ప్రయాణం by S Sridevi

ఏదో జరిగింది. ఇంటర్నెట్ పనిచెయ్యటం లేదు. ప్రపంచవ్యాప్తంగా. అప్పటికే కంప్యూటరైజేషన్ చేసుకున్న చాలాదేశాలు అల్లకల్లోలంగా వున్నాయి. ఇండియాకూడా కొంతవరకూ ప్రభావితమైంది. ఇంటర్నెట్‍కి సెర్వర్లుగా పనిచేస్తున్న సూపర్‍కంప్యూటర్లని హాక్ చేసారని ఒక అనుమానం. బగ్, వైరస్ ఏదేనా కావచ్చు. సమస్య, పరిష్కారం విడివిడిగా ప్రయాణిస్తూ కలయికకోసం వెతుక్కుంటున్నాయి.


అవంతీపురం.
ఇంటి నెంబరు 2-734.
వంశీ ఇంటి అరుగుమీద కూర్చుని వున్నాడు. పదేళ్ళవాడు. అతని చిన్నిగుండె అలజడిగా వుంది. తల్లిదండ్రులు అమెరికాలో వుంటారు. విపరీతమైన అల్లరి చేస్తూ, తల్లిదండ్రులని ఎదిరిస్తున్నాడని వాళ్ళ అభియోగం. వాళ్ళు ఇండియాలో వున్నప్పటి తమ బాల్యంతో అతని బాల్యాన్ని పోలుస్తున్నారు. ఆ పోలిక తప్పని తెలీక అతని ప్రవర్తనకి కంగారుపడుతున్నారు. కొద్దిరోజులకోసం తాతగారింటికి పంపారు. తాతగారు అతనికి క్రమశిక్షణ నేర్పిస్తారని వాళ్ళ ఆశ.
రోజూ వాళ్ళు వీడియో కాల్ చేస్తారు. ఈరోజు కాల్ రాలేదు. టీవీలో వస్తున్న వార్తలు… ఇంటర్నెట్ రావట్లేదన్న విషయం అతన్ని కలవరపరుస్తోంది. తల్లిదండ్రులు అక్కడ క్షేమంగానే వుంటారన్న విషయాన్ని, టెక్నాలజీ సమస్యతో సమన్వయించుకోలేకపోతున్నాడు.
పోస్ట్‌మేన్ సైకిలు ఇంటిముందు ఆగింది. సైకిలుకి స్టాండు వేసి అతను ఒక పార్సెల్ తెచ్చి వంశీకి ఇచ్చి,
“తాతగారు లేరా?” అని అడిగాడు.
వంశీ తాతగారు లోపల్నుంచీ వచ్చి డెలివరీస్లిప్ మీద సంతకం చేసి యిచ్చారు. వంశీ పార్సెల్‍ని తిప్పితిప్పి చూసాడు. తండ్రి దగ్గర్నుంచీ వచ్చింది. ఇక్కడికి పంపేముందు తండ్రి అతనికి ప్రామిస్ చేసాడు, సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిస్తానని. ఇది అదే కావచ్చు. అతనికి ఆశ్చర్యంగానూ అపనమ్మకంగానూ అనిపించింది.
పోస్ట్‌మేన్‍ని అడిగాడు. ” ఇంటర్నెట్ లేదని అంటున్నారు. డాడ్ రోజూలా కాల్ చెయ్యలేదు. మీరీ పార్సెల్ ఎలా తెచ్చివ్వగలిగారు?”
“మా నెట్‍వర్క్ ఎప్పుడూ పనిచేస్తుంటుంది. We reach out through out. ఎక్కడికేనా చేరుకోగలం”
“అంటే?”
పోస్ట్‌మేన్ వంశీనీ, తాతగారినీ చూసాడు. అబ్బాయి చిన్నవాడు. ఇక్కడివాడు కాదు. తను చెప్పేవి అర్థమౌతాయో లేదో? తాతగారు చెప్పమన్నట్టు చూసారు.
“ఇలాంటి ఎంత మారుమూల వూరికేనా మేము చేరుకోగలం. మాకు బ్రాంచిలు వుంటాయి”
“మీరు ఇంటర్నెట్ వాడరా? మీ ఆఫీసులు ఆటొమేట్ కాలేదా? మీకు కంప్యూటర్లు లేవా? మీరంతా పెద్దగా చదువుకోలేదా?” వంశీకి ఎన్నో ప్రశ్నలు కనిపించాయి. కంప్యూటర్లు వాడుతూ ప్రపంచం చాలా ముందుకి వెళ్తోందనీ, కంప్యూటర్లవల్లనే తల్లిదండ్రులిద్దరికీ అమెరికాలో పెద్ద జీతాలతో వుద్యోగాలు వచ్చాయనీ అర్థమయ్యీకాని విషయాలు చాలా తెలుసు. తల్లిదండ్రులు వాళ్ళ స్నేహితులతో మాట్లాడుకుంటుంటే విన్నవి.
పోస్ట్‌మేన్ చిన్నగా నవ్వాడు. “మా డిపార్టుమెంటు బలంగా విస్తరించిన మహావృక్షంలాంటిది. వేర్లు నేలలోకి లోతుగా పాతుకుపోయి, కొమ్మలు విశాలంగా ఆకాశంలోకి విస్తరిస్తూ ఎలా ఎదుగుతుందో, మా కన్వెన్షనల్ సర్వీసెస్ అంత బలంగానూ, టెక్నాలజీలోకి అంత విస్తృతంగానూ వున్నాం. ఇక్కడి లెటర్ బాక్స్‌లో వేస్తే వుత్తరాన్ని ఎక్కడికేనా తీసుకెళ్ళి ఇస్తాం. ఆఫీసుకి తెచ్చిస్తే విదేశాల్లోనైనా ఎక్కడికేనా పంపిస్తాం. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అని వుంటుంది. 180 దేశాల సమాఖ్య. ఈ అన్ని దేశాల పోస్టల్ సర్వీసెస్ ఒకదానికొకటి అనుగుణంగా పనిచేస్తాయి. ఇవి కాక ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్‌ఫర్, ఎలక్ట్రానిక్ మనియార్డర్‍లాంటివి వున్నాయి. మేము లోకల్ ఏరియా నెట్‍వర్క్ లాన్‍ వాడుకుంటూ మిగతా పని చేస్తాం. పూర్తిగా మిషన్లమీదే ఆధారపడం. మిషన్లు పనిచెయ్యకపోయినా మనుషులం పనిచేస్తాం. సర్వీసెస్ ఆపం” అన్నాడు.
పోస్ట్‌మెన్ చెప్పినవి తాతగారికి చక్కగా అర్థమయ్యాయి. వంశీకి కాలేదు. అతని సమస్య ఒక్కటే. ఇంటర్నెట్ లేకుండా కూడా విశేషాలు జరుగుతాయా అని.
“నేను మా డాడ్‍ని కాంటాక్ట్ చేయొచ్చా?” అడిగాడు.
“ఉత్తరం రాయొచ్చు. స్పీడ్‍పోస్టు సర్విసుంది, మీ వుత్తరానికి రెక్కలు కడుతుంది”
“ఉత్తరం అంటే?”
“మీనాన్నగారితో ఏం చెప్పాలనుకుంటున్నావో దాన్ని ఒక కాగితం తీసుకుని రాయటమన్నమాట”
“ఎవరూ చూడకూడదు”
“చూడరు”
“జాగ్రత్తగా వెళతుందా?”
“వెళ్తుంది”
“డాడ్ చూస్తారా? ఎలా? “
“మీ వుత్తరం మా చేతుల్లో చాలా జాగ్రత్తగా వుంటుంది. మమ్మల్ని చక్కగా నమ్మవచ్చు. మేము మీ నీడలాంటివాళ్ళం. మీరెక్కడికి వెళ్ళినా మిమ్మల్ని కలుసుకుందుకు అక్కడికి చేరుకుంటాం “
“థాంక్యూ దెన్”
“అబ్బాయికి ఎంత అర్థమైందో తెలీదండయ్యా! మీకర్థమయ్యేలా చెప్పాను. కంప్యూటర్లు, ఇంటర్నెట్టు లేకపోతే ప్రపంచం ఆగిపోయినట్టు కంగారెత్తిపోతున్నారు జనాలు. అంతకుముందుకూడా బతికాముకదా? మా ఆఫీసులో కొత్తపిల్లలుకూడా అలానే వున్నారు” అని తాతగారికి చెప్పి వెళ్ళిపోయాడు పోస్ట్‌మేన్.


ఇంటర్నెట్ రిస్టోరైంది. రెండురోజులకి. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నాలు ఇంకా జరుగుతునే వున్నాయి. వంశీ తన తల్లిదండ్రులతో కాల్ మాట్లాడాడు. తన వుత్తరాన్ని గురించి అడిగాడు. అదేమిటో, నెట్ లేని ఈ రెండురోజులూ ఆ పిల్లవాడెలా తల్లడిల్లిపోయాడో తాతగారు వాళ్ళకి వివరించి చెప్పారు.
మరో నాలుగురోజులకి వుత్తరం వంశీ తండ్రికి చేరింది.
తెల్లటి కాగితంమీద పరచబడిన కొడుకు హృదయం. తల్లితండ్రులపట్ల అతనికి వున్న బాధ్యత, వాళ్ళకేమైందోనన్న ఆతృత … అతని వయసుని మించి చూపించింది. ఆతృతతో వణికిన చిన్నిచేతుల కదలిక… అన్నిటినీ మించి… ఒక కన్నీటి చుక్క కళ్ళలోంచీ జారిపడితే, మగపిల్లలు ఏడవకూడదని గుర్తొచ్చి చప్పున తుడిచేసిన మరక… అన్నిటితోసహా.
కొడుక్కి తమమీద వున్న ప్రేమకి అతను ఆశ్చర్యపోయాడు. ఆ వుత్తరాన్ని పెదవులకి తాకించుకుని గుండెకి హత్తుకుని దాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. కొడుకుని వెంటనే వెనక్కి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s