కాగితంమీది జలపాతం by S Sridevi

“వదినా! మీరసలు ఎక్కడున్నారు? చుట్టూ జరిగే విషయాలేమైనా పట్టించుకుంటున్నారా? లేదా? అమెరికాలో వున్న నాకే అన్ని విషయాలూ తెలుస్తుంటే అక్కడే వున్న మీకు యీ విషయం తెలీకపోవటమేమిటి?” ఫ్లోరిడానుంచీ వడగళ్ళవాన కురిసినట్టు రఘు ఫోను.
“ఇప్పుడేమైంది?” నా దృష్టినుంచీ తప్పించుకుపోయిన జాతీయ, అంతర్జాతీయ విషయం ఏమై వుంటుందా అని ఆలోచించాను. అలాంటివేవీ గుర్తుకి రాలేదు.
“మనూర్లో రింగురోడ్డు పడుతోందటకదా? సిటీకి డైరెక్టుగా కలుపుతూ రోడ్డేస్తున్నారటకదా? ఆ అలైన్‍మెంట్స్‌కి అటూ యిటూ వున్న భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరాకి కోటి దాటిపోయిందట. ఇళ్ళ స్థలాలూ అలాగే వున్నాయి” అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని ముఖం ఎలా వుండి వుంటుందో వూహించుకోవటానికి ప్రయత్నం చేసాను. ఆశ్చర్యమా, అవధుల్లేని సంతోషమా అందులో నాట్యం చేసేది?
“మనకి అక్కడ రెండువేల గజాల స్థలం వుంది. ఎంత లేదన్నా రెండుమూడుకోట్ల పైమాటే. ఇదంతా షేర్‍మార్కెట్ బూమ్‍లాంటిది. ఇప్పుడున్న రేటు రేపు వుండకపోవచ్చు. గవర్నమెంటు నిర్ణయం మారినా, అలైన్‍మెంటు కాస్త మారినా దెబ్బతినిపోతాం. అందుచేత మీరిద్దరూ వెంటనే బయల్దేరిపోయి వెళ్ళి నాన్నని వప్పించి అమ్మెయ్యండి. వాళ్ళని మీదగ్గర పెట్టుకోండి. అలాకాకపోతే అందులోంచే పాతికలక్షలు పెడితే స్టూడియోనో సింగిల్ బెడ్రూందో ఫ్లాట్ వస్తుంది. ఈ వయసులో వాళ్ళకి అంతకన్నా ఎందుకు?” అన్నాడు.
నేనేమీ మాట్లాడలేదు. అంత డబ్బు ఒక్కసారి వస్తుందంటే మెరుస్తున్న మెరుపుల్లో నా మనసు వుద్విగ్నమైంది.
“నాన్నది అసలే చాదస్తం. అంతస్థలంలోనూ ఓమూలకి ఇల్లు కట్టుకుని కూరగాయలమళ్ళూ అవీ వేస్తారు. అడ్డమైనవాళ్ళనీ చేరదీస్తారు. ఏవిటొదినా, అది? ఇద్దరు పెద్దవాళ్ళకి ఎన్నికూరలు, పళ్ళు కావాలి? ఈరోజుల్లో బజార్లో దొరకనిదేమిటి? దిక్కూదివాణం లేనివాళ్ళందరినీ అందులోకి తీసుకొచ్చి పెడతారు. అన్నీ మనమే చేస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? పన్నులకి పన్నులూ కడుతున్నాం. ఇలా ఆస్తులుకూడా తగలేసుకోవాలా?” అన్నాడు.
“అవంతీపురం రోడ్డుగురించి నీకెలా తెలుసు? ఆ మధ్యని మామయ్యగారు అన్నార్లే. మేమే పట్టించుకోలేదు” అన్నాను.
“నా ఫ్రెండొకడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. వాడు నాకు ఫోన్ చేసి స్థలం అమ్ముతారా అని అడిగాడు. మంచి అఫరు. నువ్వూ అన్నయ్యా అదే పనిమీద వుండండి” అని పెట్టేసాడు.
సుధీర్ ఆఫీసునుంచీ వచ్చేదాకా అదే విషయాన్నిగురించి ఆలోచిస్తూ వుండిపోయాను. రెండుమూడుకోట్లు… స్థలం విలువ. ఎంత తేలిగ్గా కోటీశ్వరులైపోతున్నారు! ఒకప్పుడక్కడ ఏమీ వుండేది కాదు. చీకటిపడితే బయటికి రావటానికి భయమేసేది. ఇల్లు చేరటానికి సరైన దారి వుండేది కాదు. సుధీర్ తండ్రి కోరిక, పెద్దస్థలం కొనుక్కుని అందులో ఇల్లు కట్టుకుని చెట్లవీ పెంచుతూ ఆమధ్యలో ఇల్లుకట్టుకుని ప్రశాంతంగా బతకాలని. రిటైర్‍మెంటు డబ్బుతో ఆ కోరిక తీర్చుకున్నారు.  అందరం లోపల్లోపల చిరాకుపడ్డాము, ఆ మారుమూల యిల్లేమిటని. ఇప్పుడు ఆ పెట్టుబడికి, శ్రమకి ప్రతిఫలం కనిపిస్తోంది.
“అంత డబ్బంటే మాటలు కాదు స్రవంతీ! నాన్న కూడా కాదనరు” అన్నాడు సుధీర్ రాగానే విషయం విని. ఇద్దరం వెంటనే బయల్దేరిపోయాము.


ముందుగా ఫోనేనా చెయ్యకుండా వచ్చినందుకు సుధీర్ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఇంట్లో వాళ్ళిద్దరే కాకుండా యింకొకతనుకూడా వున్నాడు. ఎక్కడో చూసిన జ్ఞాపకం కదిలింది. చిన్నవాడే. ఇంకా అమాయకత్వం వీడని లేతముఖం. కానీ ఏదో అసహజత్వం అతన్లో. కళ్ళు నిస్తేజంగా వున్నాయి. హాల్లో సోఫాలో పడుకుని నిర్వికారంగా పైకి చూస్తున్నాడు. మమ్మల్ని చూసి కూడా లేవలేదు.అ
“సత్తిబాబు కొడుకు … శరత్” అంది సుధీర్ తల్లి.
చప్పుని గుర్తొచ్చాడా అబ్బాయి. మొదటి ప్రయత్నంలోనే  ఐఐటీ చెన్నైలో బీటెక్ సీటు తెచ్చుకుని, అది పూర్తిచేసి, వుద్యోగంలో చేరాడు. బంధువుల్లో అంతా అతన్నిగురించి గొప్పగా చెప్పుకుంటారు. అతనికన్నా చిన్నపిల్లలకి అతనే రోల్‍మోడల్. మరి అతనేంటిలా?
“వాడికి డిప్రెషనట. గంజాయికీ, నల్లమందుకీ అలవాటు పడ్డాడు. ఉద్యోగం వదిలేసాడు. ఎక్కడికీ వెళ్ళడు. ఎవరితోటీ మాట్లాడడు. మొన్న మాలక్ష్మిగారి మనవరాలి పెళ్ళికి వెళ్ళినప్పుడు సత్తిబాబు భార్య ఒకటే ఏడుపు. ఎందరో డాక్టర్లకి చూపించారట. ఏ ప్రయోజనం లేదు. మార్పుగా వుంటుందని నాతో తీసుకొచ్చాను” అంది ఆవిడ నన్ను పక్కకి తీసుకెళ్ళి.
“చాకులాంటి కుర్రాడు ఎలా ఐపోయాడో! “ఆవిడ కళ్లలో నీరు నిలిచింది. “వయసుకి మించిన డబ్బు, బాధ్యతలు వుండకూడదమ్మా! ఇరయ్యేళ్ళు నిండేసరికి లక్షల్లో జీతం. అది మంచీ చెడూ చెప్పినా వినలేనంత అహంకారం తెచ్చిపెట్టింది. స్నేహితులు. వాళ్ళెంత చెప్తే అంత.  ఆ వుద్యోగమేమిటో, ఏం చేస్తున్నాడో తెలుసుకునేంత తెలివీ, జ్ఞానం వాడి తల్లిదండ్రులకెక్కడివి? ఏవో వుద్యోగాలు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. వాళ్ళ వుద్యోగాల్లాంటిదే వాడిదీ అనుకుంటే కొంపముంచాడు” అంది.
నా గుండె బరువెక్కింది. తల్లిదండ్రులని దాటుకుని పిల్లలు ఎదిగిపోతున్నారు. ప్రపంచాలు విడిపోతున్నాయి. పిల్లలు ఇరవైనాలుగ్గంటలూ కంప్యూటరు ముందు కూర్చునీ, సెల్ చూసుకుంటూనూ ఏం చేస్తున్నారో తెలియదు. తెలుసుకోలేనంతగా అగాథం ఏర్పడిపోయింది. నియంత్రించలేనంత దూరం పెరిగిపోయింది. నిట్టూర్చాను.
రాత్రి భోజనాలు చేసి ఆరుబయట కూర్చున్నాం. ఇంత తీరిగ్గా ఎప్పుడూ వుండమేమో, కాలం ఆగిపోయినట్టు అనిపిస్తోంది. ఏవో మామూలు మాటలు సాగాయి. పిల్లలగురించి, వాళ్ళ చదువుల గురించి అడిగింది సుధీర్ తల్లి. ఇద్దరూ హాస్టల్స్‌లో వుంటారు. ఇంకా ఆలస్యం దేనికని సుధీర్ మేము వచ్చిన పని తండ్రితో చెప్పాడు. ఆయన జవాబివ్వలేదు. ఆ మౌనం చూసాక మరోసారి అనలేకపోయాం.
ఆ రాత్రి గడిచింది. ఉదయం చూసాను తోట అందం. రకరకాల మొక్కలు. అరచేతులంతంత గులాబీలు, చామంతులు మనసు దోచేసాయి. ఎక్కడెక్కడినుంచో వచ్చి పూలు, కూరలు, పళ్ళు కొనుక్కుని వెళ్తారట.  ఇంట్లో అంతా లేచేసారు. సుధీర్ వాళ్ళమ్మ వెంట తిరుగుతూ “నువ్వు చెప్పు, నువ్వు చెప్పు” అంటున్నాడు. నోట్లో ఇన్ని నీళ్ళు పోసుకుని పుక్కిలించి, మొక్కలమధ్యకి వెళ్ళాను. ఒక బల్లమీద శరత్ కనిపించాడు.
“ఏం చేస్తున్నావు శరత్?” పలకరించాను. అతను తలతిప్పి చూసాడు. కళ్లనిండా నీళ్ళు.
“ఎందుకో… చచ్చిపోవాలనిపిస్తోంది” అన్నాడు అస్పష్టంగా. ఉలిక్కిపడ్డాను. వెంటనే సర్దుకుని పక్కని కూర్చుంటూ అడిగాను, “ఎందుకలా?”
“తెలీదు”
“ఎవర్నేనా ప్రేమించావా? అమ్మానాన్నా వద్దన్నారా? ” ఆ వయసులో అంతకన్నా పెద్ద సమస్యలు… చచ్చిపోవాలనిపించేంత తీవ్రమైనవి ఇంకేం వుంటాయి? ఆ నిస్పృహలోంచీ బైటపడటానికి యువత వెతుక్కునే మార్గాలు డ్రింక్స్, డ్రగ్స్… అతని మనోద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేసాను. అతను నిర్జీవంగా నవ్వాడు. “పిల్లల్ని తీసుకురాలేదా, వదినా?” మాట మార్చేసాడు.
“స్కూలు పోతుందని తీసుకురాలేదు. ఐనా వాళ్ళుండేది హాస్టల్లోకదా? ప్రిన్సిపల్‍కి చెప్పి తీసుకొచ్చేంత టైం లేకపోయింది” చాలా మామూలుగా అన్నాను. నా జవాబు అతన్లో అంత స్పందన పుట్టిస్తుందని అనుకోలేదు.
“ఔను. వాళ్ళకి యిల్లూ, అమ్మానాన్నలూ, చుట్టాలూ, ప్రేమలూ ఏవీ అక్కర్లేదు. గాలీ నీళ్ళూ అక్కర్లేదు. చదువు తిని, చదువు పీల్చి బతుకుతూ పెద్దయ్యాక డబ్బుని పుష్పిస్తే చాలు ” గట్టిగా అరిచాడు. ఆ అరుపులకి లోపలెక్కడో వున్నవాళ్ళంతా వచ్చేసారు.అందరం దిగ్భ్రమగా చూస్తుంటే శరత్ తన ఆవేదనంతా బైటపెట్టేసాడు.
“కమ్మటి కలలిచ్చే వుషోదయపు నిద్రలు, ఆటలతో తుళ్ళిపడాల్సిన సాయంత్రాలూ స్టడీఅవర్స్‌గా మారిపోతున్నాయి. చెరువ్వొడ్డునా, పార్కులోనూ, స్నేహితులమధ్యా హుషారుగా గడవాల్సిన యౌవనం ఏసీరూముల్లో కంప్యూటర్ ముందు నిస్సారంగా గడిచిపోయి, రూపాయలుగా, డాలర్లుగా మారిపోతోంది. భార్యాభర్తలకి కాపురం చేసే టైము, ఓపికా చిక్కక స్క్రీన్‍లకి కళ్ళప్పజెప్పేస్తున్నారు. వదినా! ఎంత… ఎంత సంపాదిస్తే మీకు సరిపోతుంది?” నిలదీసినట్టు అడిగాడు.
నా కళ్ళు వాలిపోయాయి. నేను, సుధీర్ అనుభవించిన, అనుభవిస్తున్న జీవితం అదే. మాలో అప్పుడప్పుడూ పుట్టే విసుగు, అశాంతిల మూలకారణం ఏమిటని ఎప్పుడూ ఆలోచించలేదు. దాన్ని వెతుక్కొచ్చి చూపించాడు. ఇద్దరికీ వుద్యోగాలు. ఆఫీసునించీ ఇంటికొచ్చాకకూడా ఫోన్లు వస్తునే వుంటాయి. లాప్ టాప్ మూసి పెట్టడానికి లేదు. ఇద్దరం సన్నిహితంగా గడిపి ఎంతకాలమైందో! అసలు జీవశక్తి అనేది వుందా మా యిద్దర్లో? పిల్లలు డాక్టర్లో ఇంజనీర్లో కావాలనే కృత్రిమయింధనంతో బతుకుతున్నామా?
“నాకు…బహుశ: అత్త తాత అంటున్నప్పట్నుంచీ  ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అని నేర్పించటం మొదలై వుంటుంది. నడకే సరిగ్గా రాని వయసులో వీపుకో బరువు వేలాడదీసి కాన్వెంటుకీ అక్కడినుంచీ రెసిడెన్షియల్ స్కూలుకీ, ఐఐటీకీ, ఏసీ చాంబర్లకీ దారులు వేసారు. నాకు ఇంజనీరింగ్ వద్దు, అది నా చదువు కాదని చెప్తే విన్నారా? సరే, మీకోసం మోసాను. ఇప్పుడు దాన్ని ఎక్కడ వదిలించుకోను? నాకిప్పుడు డబ్బొద్దు. అందమైన జీవితం కావాలి. ఈ పువ్వుల్లా స్వేచ్ఛగా ప్రకృతిలో కలిసిపోయేలాంటి జీవితం…. నేను సంపాదించినదంతా యిచ్చేస్తాను. ఇంకాకూడా సంపాదించి యిస్తాను… నాకు తెచ్చివ్వగలరా?” అన్నాడు.
నాకు నా పిల్లలు గుర్తొచ్చారు. తెల్లారి మూడున్నరకి లేపేస్తారట, బ్రహ్మీముహూర్తంలో చదువుకుంటే మంచిదని. అప్పట్నుంచీ రాత్రి పదిన్నరదాకా చదువే చదువు. వాళ్ళకా కోరిక వుందోలేదోగానీ అమ్మానాన్నలకోసం ఆ చదువు. రేపు వాళ్ళుకూడా ఇలాగే నిలదీస్తారేమో!
సుధీర్ కలగజేసుకున్నాడు.
“చాల్లేరా! పదేళ్ళనుంచీ చేస్తున్నాను, నీ స్టార్టింగ్ పేకేజి ఇప్పటికి చేరుకోలేదు నేను. వీకెండ్ పార్టీలు, హాలీడే ట్రిప్పులు… ఇంకేం కావాల్రా? హాయిగా పెళ్ళిచేసుకో. ఈ వంటరితనం వదిలిపోతుంది” అన్నాడు.
శరత్ మళ్ళీ తన భావరాహిత్యంలోకి జారుకున్నాడు.
“వాడు యిన్ని మాటలు మాట్లాడటం ఈమధ్య కాలంలో చూడలేదు” అంది సుధీర్ తల్లి.
“ఉద్యోగం మానేసి లేజీగా గడపటానికి అలవాటుపడిపోతున్నాడమ్మా! దాన్ని సమర్ధించుకోవటానికి ఏవేవో సిద్ధాంతాలు” లోపలికొచ్చాక నిరసనగా అన్నాడు సుధీర్.
“ఎంతకాలం చెయ్యాలి యిలా? ఇష్టంగానైతే పర్వాలేదు… అయిష్టంగా” అంది అతని తల్లి.
“నాన్న యిష్టపడే చేసారామ్మా, గుమస్తా వుద్యోగం?” ఠపీమని అడిగాడు.
“కుటుంబాన్ని పోషించడం బాధ్యత అనుకుని మొదలుపెట్టారు. బాధ్యతలు ఒకొక్కటీ తీరుతుంటే చేస్తున్న పనియొక్క ప్రయోజనం కనిపించి దాన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. శరత్‍కి ఎలాంటి బాధ్యతలూ లేవు, ఇంకో నాలుగు యిళ్ళు కొనుక్కోవటం తప్ప వాడు సంపాదిస్తే వచ్చే ప్రయోజనమూ లేదు. వాడికి నచ్చిన చదువు చదివించి వుంటే ఇంత చికాకు పడేవాడు కాదు” ఆవిడ జవాబు.
“మేము చెయ్యటంలేదామ్మా?” సుధీర్ వదిలిపెట్టలేదు.
“మీరు ఇష్టపడి చేస్తున్నారు. వాడు విసుగుతో చేస్తున్నాడు” ఆవిడ కచ్చితమైన జవాబు శరత్ మనసు తెరిచి చదివినట్టు,చదివింది మాముందు పరుస్తున్నట్టు.
ఎలాంటి మోటివేషన్ లేని అయిష్టమైన పని… నాకు అర్థమైంది. అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది.
పగలు సుదీర్ఘంగా గడిచింది.
సత్తిబాబుగారూ, ఆయన భార్యా శరత్‍ని తీసుకెళ్ళడానికి వస్తున్నామని ఫోన్ చేసారు. రాత్రికి వచ్చారు.
“బిడ్డ అలిసిపోయాడమ్మా! మాకు ఈ వయసులో వస్తుందే వైరాగ్యం, అలాంటిది వచ్చింది. కనీసం కోటిదాకానేనా మిగిలి వుంటుంది వాడి సంపాదనలో. అది చాలదూ బతకడానికి? ఏవైతే తనకి సంకెళ్ళనుకుంటున్నాడో, వాటినుంచీ వాడిని విడుదల చేస్తే మళ్ళీ శక్తీ ఉత్సాహం వస్తాయేమో! అలా ఎవరూ ఆలోచించడం లేదు. మీ ఆయన మాట్లాడినట్టే వాడి తల్లీ అంటుంది. సత్తిబాబూ అంతే. ఎవరూ అర్థం చేసుకోరు” అంది సుధీర్ తల్లి నాతో.
“ఉద్యోగం చెయ్యకుండా ఎలా? క్రమబద్ధమైన జీవితం లేకపోతే మనిషి శిథిలపడడూ?” అడిగాను.
“ఇది శైథిల్యం కాదా?”తిరుగులేని జవాబులాంటి ప్రశ్న.
శరత్ తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడు.
సుధీర్ తండ్రిని మళ్ళీ అడిగాడు.
“స్థలం అమ్మకం విషయంలో ఏమాలోచించారు? మీరిద్దరే ఇక్కడ ఎంతకాలం వుంటారు? మాతో వచ్చెయ్యండి. అలా కాదంటే అందులోంచే కొంత పెట్టి ఇంకో ఫ్లాట్ తీసుకుందాం” అన్నాడు.
“ఎందుకు?” అడిగారాయన. “ఇప్పుడు ఇక్కడ సుఖంగానే వున్నాం. ఈ సుఖాన్ని డబ్బుగా మార్చుకుని ఆ డబ్బుతో ఇంకో సుఖాన్ని కొనుక్కోవటం దేనికి? ఈ వయసులో?” ఆయన ప్రశ్న ఆయన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నట్టు స్పష్టంగా వుంది.
“ఈవేళ యీ స్థలానికి వున్న విలువ రేపు వుండకపోవచ్చు. రేటుండగానే అమ్మేస్తే మంచిదని” అన్నాడు సుధీర్.
“అదే ఎందుకని? స్థలం ఎప్పటికేనా స్థలమే. పునాదులు వేసుకుని యిల్లు కట్టుకుంటాం. లేదా మొక్కలూ చెట్లూ పెంచుకుంటాం. అందులో ఎలాంటి మార్పూ వుండదు. డబ్బువిలువల్లోనే మార్పులు వుండేది”
“అంతేకదా నాన్నా! డబ్బులోకి మార్చుకుంటే దేనికేనా విలువ పెరుగుతుంది”
“సరే, ఆ డబ్బేం చేస్తావు? ఇంకో స్థలం కొంటావు. దాన్నీ లాభానికి అమ్ముతావు. ఇంకా లాభం వచ్చిందనుకుంటావు. సంతోషపడతావు. ఇప్పుడున్న సంతోషాన్ని ఆరకంగా మారకం చేసుకునే అవసరం వుందా?”
సుధీర్‍కి ఆయన అయిష్టం అర్థమైంది. కోపం వచ్చింది. రిటైరైనప్పుడు కొంత డబ్బు ఇస్తారని ఆశపడ్డారు కొడుకులిద్దరూ. అలాంటిదేం చెయ్యకపోగా ఇక్కడ స్థలం కొని యిల్లు కట్టించారు. అది ఇద్దరికీ నచ్చలేదు. కానీ ఎదురుచెప్పలేకపోయారు. ఆయన డబ్బు . దగ్గర్లో బస్తీ వుంది. ఆ పిల్లలని చేరదీసి చదువు చెప్తారు. ఆపైన రోజంతా తోటపని. వ్యవసాయంలో కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతొస్తోందో ఎప్పుడూ మాకు చెప్పలేదు. తగలేస్తున్నారని కొడుకుల భయం.  
“మీరు అందమైన వాల్‍పేపర్లో ఇంకా అందమైన జలపాతాన్ని చూసి అందులో స్నానించిన అనుభూతిని పొందాలనుకుంటున్నారు. మాకు నిజమైన జలపాతం, అందులోని అందంతోపాటు సాధకబాధకాలుకూడా తెలుసు.కిటికీలోంచీ తొంగిచూసే వుషస్సులు, తలవాకిట నిలబడి రంగవల్లులు తీర్చే వెన్నెలబాలలూ వుండగా వూహాదృశ్యాలెందుకురా? మా మానాన్న మమ్మల్నిలా వదిలెయ్యండి. మాక్కొంచెం బతుకు మిగల్చండి” కచ్చితంగా అన్నారు.
సుధీర్ కోపం ముఖంలో తెలిసిపోతోంది. ఆయన పట్టించుకోలేదు.
“మీకులాగే మాకు కూడా కొన్ని కలలుంటాయి. చందమామ కథలు చదువుతూ పెరిగాము నేనూ, మీ అమ్మాను. ఎత్తు అరుగుల ఇళ్ళూ, వాటిమీద విశ్రమించే బాటసారులూ, వాళ్లు చెప్పే కథలు, వారిని ఆదరించే గృహస్థులు ఆ కలల్లో కనిపించి ఆశపెట్టే అంశాలు. పెద్ద యిల్లు కట్టుకుని, పదిమందిని ఆదరిస్తూ బతకాలనేది మా కోరిక. అందుకోసం మా బాధ్యతలన్నీ తీరేదాకా ఎదురుచూసాం. మీ చదువులు, పెళ్లిళ్ళు అయాక మాకు నచ్చినట్టు మేము వుంటున్నాం” ఆయన స్పష్టంగా చెప్పారు.
సుధీర్ కోపాన్నీ, నేను ఆశాభంగం తెచ్చిన నిస్పృహనీ అదుపుచేసుకునే ప్రయత్నం చేస్తున్నాము.
“నువ్వు మానసికంగా ఆనందంగా వున్నావంటే నీ చుట్టూ అంతా ఆనందం నిండుతుంది. వస్తుపరమైన ఆనందాన్ని నువ్వు పొందుతున్నావంటే నీ చుట్టూ వెల్తిని అసంతృప్తినీ నింపుతున్నట్టు. అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్. మరోసారి చెప్తున్నా! మీరు ప్రయోజకులయ్యేదాకా నా కోరికలన్నీ  వాయిదా వేసుకుని, ఇప్పుడింక నేనేం చేసినా మీ అభివృద్ధికి అడ్డం కాదనుకున్నాక అప్పుడు నాకు నచ్చినట్టుగా బతకడం మొదలుపెట్టాను. ఇది మా జీవితం. దీన్ని మార్చే హక్కు నీకుగానీ నీ తమ్ముడికిగానీ లేదు. మా తదనంతరం మీ యిష్టం. డబ్బు చెట్లే మొలిపించుకుంటారో, కాంక్రీటు వనాలే కట్టుకుంటారో మీయిష్టం” అనేసి లేచి వెళ్ళిపోయారు.
మర్నాడు వుదయాన్నే మేము తిరుగు ప్రయాణమైపోయాం. పెద్దవాళ్ళిద్దరూ వుదాశీనంగా వున్నారు. వాళ్ళ జీవనశైలిని మేము మార్చబోయినదాని ఫలితం యిది. కావచ్చు. ఒక ప్రతిపాదన… మంచో చెడో మేం చేసినది ఆయన కాదనటంతో మా యిద్దరి అహాలూ దెబ్బతిన్నాయి. మనసెంతో చిన్నబుచ్చుకుంది.  
“ఆయన వినరు. నాకు తెలుసు. ఊళ్ళోవాళ్ళని వుద్ధరించడంలో వున్న ఆనందం స్వంత కొడుకులకి మేలుచెయ్యడంలో లేదు. కోటిన్నరరూపాయలు మన వాటా … ఎంతకాలం కష్టపడితే అంత పోగుచెయ్యగలం? ఈ ముసలాళ్ళకి అర్థమై చావదు. రేపేదైనా ఎక్కువతక్కువలొస్తే వీళ్ళకోసం పరుగులు పెట్టాల్సినదీ, చూడవలసినదీ నేనేకదా? ఆ ఆలోచనకూడా లేదు” అని సుధీర్ దారంతా గొణుగుతునే వున్నాడు.
నాకెందుకో శరత్ నిస్తేజపు చూపులు గుర్తొచ్చాయి. నా పిల్లల భవిష్యత్తు ఆ చూపుల చివర వేలాడుతోందేమోననే భయం కూడా వేసింది. నిజానికి రెండూ వేర్వేరు విషయాలే ఐనా ఎక్కడో కలుసుకుంటున్నాయనే భావన.
“ఆ శరత్‍గాడికేం రోగం? యాభైలక్షల జీతమంటే మాటలా? తిన్నదరక్క డిప్రెషనట… ” అనికూడా విసుక్కున్నాడు. నాలాగే సుధీర్ కీ  లోలోపలెక్కడో పిల్లలగురించి అనిపించిందేమో!
ఇల్లు ఇంకా చేరకుండానే రఘు ఫోన్‍చేసాడు. తండ్రి వప్పుకోని విషయం సుధీర్ చెప్పాడు. అతనికీ కోపం వచ్చింది.
“పొరపాటు చేసాను. ఇక్కడే అడ్వాన్సు తీసేసుకుని నా ఫ్రెండుకి స్థలం ఆక్రమించుకునే విషయం వదిలెయ్యాల్సింది. వాడే చూసుకునేవాడు” అన్నాడు కోపంగా. “ఐనా ఇప్పుడింక ఏమీ చెయ్యలేం. అలైన్‍మెంటు మార్చారట. మన స్థలం విలువ పడిపోయింది… ఛ… ఛ…” అతను చాలాసేపుదాకా మాట్లాడుతునే వున్నాడు.
ఇంటికెళ్ళాక మళ్ళీ ఫోను.
ఆ రియల్టరు ఫ్రెండు ఇప్పటికే కొన్ని కోట్లు పెట్టి భూమి కొన్నాడట. మారిన అలైన్‍మెంటువలన అతనికి కోట్లలో నష్టం. హార్టెటాకొచ్చి హాస్పిటల్లో వున్నాడట. అదీ కొసమెరుపు.
మరో ఫోను. ఈసారి నాకు. సుధీర్ తల్లిదగ్గర్నుంచీ.
శరత్ ఇంట్లోంచీ వెళ్ళిపోయాడట.
సుధీర్ తండ్రి చెప్పిన, కాగితంమీద వేసుకున్న అందమైన చిత్రం చెరిగిపోయిన భావన.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s