సందిగ్ధపు రహదారులు by S Sridevi

“నాన్నా! సాయంత్రం మాయింటికి రాగలవా?” అని అదితి అడిగిన ప్రశ్నకి-
“అలాగే. ఆఫీసయాక అటే వస్తాను” అని జవాబిచ్చాడు ఆనంద్. ఆ విషయంమీద పెద్దగా ఏమీ ఆలోచించలేదు. అప్పుడప్పుడు కూతురలా రమ్మనడం తను వెళ్ళడం అలవాటే. కూతురూ అల్లుడూ ప్రైవేటు సంస్థల్లో వుద్యోగస్థులు. తను చేసేది పార్ట్ టైమ్ వుద్యోగం, అదీ గవర్నమెంటు ఆఫీసులో కాబట్టి వాళ్ళకి లేని వెసులుబాట్లు తనకి వుంటాయి. అలాంటి వెసులుబాటు వాడుకోవలసిన పనులేవైనా వచ్చినప్పుడు ఆమె రమ్మంటుంది. అదీకాక ఆనంద్ కి భార్యలేదు. చనిపోయింది. కొడుకు భార్యాపిల్లల్తో వేరే వుంటాడు. అతనితో సంబంధాలు లేవు. అందుకని సాయంత్రం ఆఫీసయాక తనింటికి వెళ్ళటానికీ కూతురింటికి వెళ్ళటానికీ పెద్ద తేడా ఏమీ కనిపించదు.
ఒకొక్కసారి ఏదేనా టైముకి చెయ్యలనుకున్నప్పుడు కచ్చితంగా ఆటంకాలొస్తాయి. ఆఫీసవగానే వస్తానని కూతురికి చెప్పాడేగానీ స్నేహితుడు డాక్టర్ దగ్గిరకి వెళ్తూ తోడు రమ్మంటే కాదనలేకపోయాడు. అదయ్యీ కూతురింటికి వెళ్ళేసరికి ఎనిమిదయ్యింది. ఆలస్యమైందేం అని అడగడంగానీ రమ్మన్న పనేమిటో వెంటనే చెప్పడంగానీ చెయ్యలేదు అదితి. చాలా ముభావంగా వుంది. ఇంట్లో వాతావరణంకూడా తేడాగా వుంది. అదేమిటో అతనికి గ్రహింపుకి రాలేదు.
మంచినీళ్ళూ, కాఫీ ఇచ్చింది అదితి. అతనవి తాగగానే “స్నానం చేసెయ్యి నాన్నా! భోజనం చేద్దాం. నేను వుదయంనుంచీ ఏమీ తినలేదు. చాలా ఆకలిగా వుంది” అంది.
“అదేం? ఎందుకు తినలేదు? ఇంట్లో వండుకోవడం కుదరకపోతే ఆఫీసు కేంటిన్ లో తినచ్చు కదమ్మా! శరత్ ఏడీ? ఇంకా రాలేదా?” అడిగాడు.
“శరత్ ఇక్కడుండనని గొడవపడి వాళ్ళ తల్లిదండ్రులదగ్గిరకి వెళ్ళిపోయాడు. అన్ని విషయాలూ తింటూ మాట్లాడుకుందాం” అంది అదితి.
ఆనంద్ అయోమయంలో పడ్డాడు. కూతురికి పెళ్ళై పాతికేళ్ళు. భార్యాభర్తలు గొడవలేం లేకుండా సరదాగానే వుంటారు. అంతకాలానికి వాళ్ళమధ్య విడిపోయేంత గొడవలు ఏం వచ్చాయో అర్థం కాలేదు. కూతురు అభోజనంగా వుందని గబగబ వెళ్ళి స్నానంచేసి వచ్చాడు. అదితి కంచాల్లో అన్నీ వడ్డించింది. తినటానికి వుపక్రమించారు.
“ఇప్పుడు చెప్పు” అన్నాడు నాలుగుముద్దలు నోట్లోకి వెళ్ళిన తర్వాత.
“మాయ ఫోన్ చేసింది” అంది అదితి ఉపోద్ఘాతంగా. మాయ అదితి కూతురు. కాలిఫోర్నియాలో వుంటుంది. యెమ్మెసై వుద్యోగం చేస్తోంది. రోజూ ఫోన్ చేస్తుంది. అదేం వింత కాదు. కానీ ఆ విషయం ప్రత్యేకంగా చెప్పడమే వింత.
“అక్కడ అది ఎవర్నో ఇష్టపడుతోందట. దానిమీద కొంత వాదన జరిగింది. అతన్ని తప్ప ఇంకెవర్నీ చేసుకోనని కచ్చితంగా చెప్పింది. దాంతో గొడవ మొదలు. శరత్ బాగా ఆవేశపడిపోయాడు. మమ్మల్ని ఆలోచించుకొమ్మని ఫోన్ పెట్టేసింది. ఏడ్చి మొత్తుకునో చస్తానని బెదిరించో దాన్ని ఇక్కడికి రప్పించమంటాడు. ఒకసారి ఇక్కడికి వచ్చిందంటే నయాన్నో భయాన్నో వప్పించి వేరే సంబంధం చూసి చెయ్యచ్చునని తన ఆలోచన. నేను వప్పుకోలేదు” అంది.
ఇంటింటా వుండే గొడవే. ప్రతి తరంలోనూ వుండేదే. తల్లిదండ్రుల ఆకాంక్షల్ని పిల్లలు గుర్తించరు. చదువై వుద్యోగం రాగానే తమ జీవితం తమదనుకుంటారు. నిర్ణయాలన్నీ తమకి తామే తీసేసుకుంటారు.
“అతను చెప్పింది నిజమేకదా, అదితీ? ఒకమాటు మాయ వస్తే అన్నీ మాట్లాడుకోవచ్చు” అన్నాడు.
అదితి నవ్వింది. “ఏం మాట్లాడదాం నాన్నా? ఎదిగిన పిల్ల. మాకన్నా ఎక్కువ చదివింది. మాకన్నా ఎక్కువ ప్రపంచాన్ని చూసింది. తన జీవితానికి సంబంధించిన నిర్ణయం తను తీసుకుంది. మనం ఒప్పుకుంటే మంచిది. లేకపోతే దూరమౌతుంది. ఒకప్పట్లా ఆడపిల్లలుగానీ మగపిల్లలుగానీ సెంటిమెంటల్ గా ఆలోచించడం లేదు. నేనిక్కడ పెళ్ళి చేసేసుకున్నాను వప్పుకోవడం వప్పుకోకపోవడం మీయిష్టం అనచ్చు. కాదూ ఇక్కడికి పిలిపించి మన నిర్ణయాన్ని బలవంతంగా రుద్దుతాం. తప్పించుకునే వీలులేక మనం చూపించినవాడిని చేసుకుంటుంది. సర్దుకుపోలేక నాలుగురోజులయాక విడాకులిచ్చేస్తుంది. అప్పుడు? అదీకాదు, మననీ అతన్నీ ద్వేషిస్తూ గడుపుతుంది. అప్పుడు? ఇవన్నీ అవసరమా? తనకి ఇష్టంలేని జీవితానికి కట్టుబడి ఇక్కడ వుండడంకన్నా అంత దూరాన్నేనా సంతోషంగా వుండటాన్ని నేను కోరుకుంటున్నాను” స్పష్టంగా చెప్పింది అదితి. అందుకే శరత్ కి కోపం వచ్చి వెళ్ళిపోయాడని అర్థమైంది ఆనంద్ కి.
“అన్నీ నువ్వే నిర్ణయించేసుకున్నావా?” అన్నాడు. అందులో కొంచెం వ్యంగ్యం వుంది.
“అలా సామరస్యంగా అన్ని నిర్ణయాలూ తీసుకునే అవకాశం ఆడవాళ్ళకి వుంటే పరిస్థితులు మరోలా వుంటాయి నాన్నా! అమ్మ ఆత్మహత్య చేసుకునేది కాదు”
“అదితీ!! అమ్మ చనిపోయినది అన్నయ్య చేసిన పనికి గుండె పగిలి… మనసు చెదిరి. వాడు కులంకాని పిల్లని చేసుకుని వచ్చాడు.”
“అనే భ్రమలో నువ్వున్నావు. కానీ అది నిజం కాదు. అన్నయ్యమీది ప్రేమని తను చంపుకోలేకపోయింది. నీకు తెలియకుండా వాడిని కలవడానికి నాలుగైదుసార్లు వెళ్ళింది. వాడలా చెయ్యద్దని కచ్చితంగా చెప్పేసాడు. వెళ్ళిన ప్రతీసారి వోడిపోయి తిరిగి వచ్చేది. మీ యిద్దరిమధ్యనీ నలిగిపోయింది. వాడి పేరే ఎత్తద్దని నువ్వు శాసించావు. నీకు తెలియకుండా రావద్దని వాడు శాసించాడు. అమ్మ మనసునిండా ప్రేమ వుండేది. కొడుకు, కోడలు, మనవలతో తన జీవితం నిండిపోవాలని కోరుకుంది. కానీ నువ్వు ఆ స్పేస్ అంతా బలవంతంగా ఆక్రమించుకున్నావు. మీ యిద్దర్లో ఎవరు తగ్గినా ఆమె చచ్చిపోవాలనే నిర్ణయం తీసుకునేది కాదు”
“నువ్వూ, నీ పిల్లలూ వున్నారుకదా?”
“మేం ఒక భాగం మాత్రమే”
“ఏదైనా చూడటంలో వుంటుంది.”
“అంతేకదా? అన్నయ్యని వద్దనుకోవడం నీ యిష్టం! నీ యిష్టాన్ని అమ్మమీద రుద్దడం తప్పని నేనంటాను. శరత్ కి కూడా ఇదే చెప్తున్నాను. మాయ పెళ్ళిని నేను సమర్థిస్తున్నానా అంటే దానికి లేదనే కచ్చితమైన జవాబు నాదగ్గిర వుంది. కానీ అది మాయ జీవితం. నాది కాదు. కాబట్టి నా నిర్ణయానికి విలువ లేదు. నాకులేని విలువని ఆపాదించుకోలేను. ఈ విషయం అర్థమైతే శరత్ కి నామీద కోపం వుండదు. అమ్మని బాధపెట్టి తప్పుచేసానని ఆమె పోయాక అన్నయ్య ఇప్పుడు బాధపడుతున్నాడు. నీకు దూరమైకూడా బాధపడుతున్నాడేమో నాకు తెలీదు. ఎప్పుడూ బైటపడలేదు. మనుషుల్ని పోగొట్టుకున్నాక వాళ్ళ విలువ తెలుసుకోవడంకంటే తెలివితక్కువతనం ఇంకేదీ వుండదు. నేను మాయకి దూరం కావడానికి సిద్ధంగా లేను. అలాగే శరత్ కికూడా. మీకు అర్థమైతే శరత్ తో మాట్లాడండి. ఆ పెళ్ళేదో జరిపించేస్తాం. వాళ్ళు తిరిగి అమెరికా వెళ్ళిపోతారు. మేం ఇక్కడ వుండిపొతాం…ఎవరికి వాళ్ళం సంతోషంగా. ఎవరం ఎవరికీ దూరంకాకుండా. ” చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పింది అదితి.
భోజనాలయాయి. అదితి డైనింగ్ టేబుల్ సర్దేసింది. ఆనంద్ మాయ గదిలోకి వెళ్ళిపోయాడు. అతనెప్పుడూ ఆ గదిలోనే పడుకుంటాడు. ఎన్నో ఆలోచనలు. కొడుకు మరోకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన విషయం తమకి చూచాయగాకూడా తెలియదు. ముందే తెలిస్తే పడనివ్వరని జాగ్రత్తపడి వుంటాడు. తన వూహల్లో తనున్నాడు. సంబంధాలు వెతుకుతున్నాడు. అన్నివిధాలా అనుగుణమైన అమ్మాయికోసం చూస్తున్నాడు. ఇంతలో పెళ్ళిచేసుకుని వచ్చేసాడు. పిడుగుపాటులాంటి సంఘటన. జీర్ణించుకోలేకపోయాడు.
నీ పెంపకం ఇలాంటిదా అని నలుగురూ తనని వేలెత్తి చూపించి హేళన చేస్తారనిపించింది. తన పెంపకంలో ఏదో లొసుగు వుండబట్టే అవతలివాళ్ళు కొడుకుని అంత దూరం తీసుకెళ్ళారనిపించింది. అవమానం. . .చిన్నతనం. . . కొడుకుని ఇంట్లోకి రానివ్వలేదు. ఆ యిల్లు తన భార్యదికూడాననిగానీ, ఆ కొడుకు ఆమెకీ కొడుకేననిగానీ, ఆమె నాన్నలాకాకుండా అమ్మలా ఆలోచిస్తుందనిగానీ అనిపించలేదు. అప్పుడేకాదు, ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పుడు అదితి ఎత్తి చూపిస్తే మొదటిసారి అనిపించింది…కొడుకుని విడిచిపెట్టి వుండలేక, వాడి ప్రేమకి దూరమయ్యే భార్య ఆత్మహత్య చేసుకుందని. కొడుకు ప్రేమవివాహం అనేది పైకి కనిపించే కారణం. లోపలున్నదిమాత్రం ప్రాణప్రదంగా ప్రేమించినవాడిని వదులుకోలేని, ఆ విషయం చెప్పి తనని వప్పించలేని నిస్సహాయత.
అదితి చెప్పింది నిజమే. వప్పుకున్నా వప్పుకోకపోయినా తన నిర్ణయం కొడుకు జీవితాన్ని పెద్దగా ప్రభావితం చెయ్యలేదు. తల్లిదండ్రులకి దూరమయ్యాననే కొద్ది బాధతప్ప మిగిలినవన్నీ మామూలుగానే జరిగిపోయాయి. పెళ్ళిచేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. వాళ్ళ ముద్దుముచ్చట్లు అనుభవించాడు. ఏదీ ఆగలేదు. పెళ్ళిని ఆమోదించి వుంటే అందరూకలిసి కొన్నేనా సంతోషపు క్షణాలని పంచుకుని వుండేవారు. విడివిడిగా అనుభవించిన దు:ఖానికీ, కోపానికీ అప్పుడు చోటుండేదికాదు. తనది అహం. ఆమెది ప్రేమ.
ఎలా వున్నాడో కొడుకు! తల్లిపోయినప్పుడు శవాన్నికూడా చూడనివ్వలేదు తను. దూరంనుంచే చూసి వెళ్ళిపొయాడు. ఎంత బాధని మూటకట్టుకుని వెళ్ళాడో! మనోనేత్రం తెరుచుకున్నట్టైంది ఆనంద్ కి. భార్య చాలా గుర్తొచ్చింది. కొడుక్కి దూరమయ్యాక ఆమె ఎంత నిరాసక్తతని పెంచుకున్నదీ, క్రమంగా ఎలా డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నదీ గుర్తొచ్చింది. ఆమె అప్పట్లో అనుభవించిన బాధ ఇప్పుడు గుర్తొచ్చి విలవిల్లాడిపొయాడు.
కూతురు మాయకోసం పడుతున్న తపన అర్థమైంది. పెళ్ళయాక మాయ జీవితంలోని ప్రాథమ్యాలు మారుతాయి. భర్త మొదటివరుసలోకీ తల్లితండ్రులు తరువాతి వరుసలోకీ చేరతారు. తల్లిదండ్రుల జీవితాల్లోని ప్రాథమ్యాలుమాత్రం మారవు. అలాగే వుంటాయి. కాని సంతోషాలుమాత్రం ఒకరినుంచీ ఇంకొకరికి ప్రవహిస్తుంటాయి. వాటిని పొందాలనుకోవడం వద్దనుకోవడం తమ ఇష్టం. చాలా చిన్న సూత్రం. అది అర్థమయ్యాక ఆనంద్ కి ఎప్పుడో తెల్లవారి నిద్రపట్టింది.


పొద్దున్నే లేచి దినచర్య పూర్తి చేసుకుని శరత్ దగ్గిరకి బయల్దేరాడు. శరత్, అతని తల్లిదండ్రులు ఇంట్లోనే వున్నారు. ఆనంద్ ని బాగానే ఆహ్వానించారుగానీ అందులో ఏదో వెల్తి.
“చూడండి అన్నయ్యగారూ! మీ మనవరాలు ఏం చేసిందో!” అంది శరత్ తల్లి జరగబోయే సంభాషణకి వుపోద్ఘాతంగా.
“ఎలాగో ఒకలా మాయని ఇండియా పిలుచుకొస్తే పరిస్థితులు చక్కదిద్దచ్చు” అన్నాడు శరత్.
“తల్లి ఏ మందో మింగుతానంటే రాకుండా వుంటుందా? ముందసలు మీ అమ్మాయే వప్పుకోవడంలేదు.”
“మేనమామ పోలికే వచ్చింది పిల్లకి. మంచి రాకపోయినా ఇలాంటి బుద్ధులు బాగానే వస్తాయి.”
“అమెరికాలో వుద్యోగం చేసుకు౦టున్న పిల్లంటే కుప్పలు తిప్పలుగా సంబంధాలు వచ్చి పడుతున్నాయి. జవాబు చెప్పలేకపోతున్నాం. లోకం ఏం గొడ్డుపోయిందని కులంకాని సంబంధానికి వెళ్ళాలి?”
ఆరోపణలన్నీ అయ్యాయి. అదితి చెప్పిన మాటలు చెప్పాడు.
“నా కొడుకు విషయంలో తప్పుచేసి భార్యని భౌతికంగానూ కొడుకుని మానసికంగానూ దూరంచేసుకున్నాను. ఇప్పుడు సరిదిద్దుకోవాలన్నా సర్దుకోలేనంత దూరానికి వచ్చేసాను. అదితి మధ్యేమార్గంగా ఆలోచిస్తోంది. మనం కాదంటే మాయ పంతానికి పోతుంది. బలవంతంగా రప్పించి ఇంకోళ్ళతో పెళ్ళిచేసినా అది నిలుస్తుందన్న నమ్మకంలేదు. బలవంతపు బంధంలో ఇరుక్కుని వుండట్లేదు ఇప్పటి పిల్లలు. మనం సరేనన్నా కాదన్నా మాయ జీవితంలో వచ్చే మార్పేం వుండదు. మనమే కొంత సంతోషాన్ని కోల్పోతాం. అదితీ మీరూ ఒకరికోసం ఒకరు ఆలోచించుకోవాలి. మధ్యేమార్గంగా వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం. ఎగేసినవాళ్ళేతప్ప నాకారోజున ఇలా చెప్పినవాళ్ళు లేరు. అనుభవంమీద చెప్తున్నాను” అని చెప్పాడు.
శరత్ ఆలోచనలో పడ్డాడు.”అలా ఎవరిష్టం వాళ్ళదనుకుంటే అది దాంపత్యం ఎలాగౌతుంది? అదితి నన్ను సమర్ధించక్కర్లేదా?” అడిగాడు.
“అది కావాలనుకుంటోంది. మీరు వద్దనుకుంటున్నారు. పొందడం తేలికో వదులుకోవడం తేలికో మీరే నిర్ణయించుకోండి” ఆనంద్ అల్లుడికి జవాబిచ్చాడు.
తర్వాత అక్కడే భోజనం చేసి అట్నుంచీ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.


సాయంత్రం ఆఫీసునుంచీ వచ్చేసరికి అదితి ఇంట్లోనే వుంది. ఆరోజుకూడా సెలవుపెట్టిందట.
“శరత్ ఏమన్నాడు నాన్నా? ఆడవాళ్ళకి ఈ క్రాస్ రోడ్స్ దాటడం ఎప్పుడూ తప్పడం లేదు. ఆమె కోరుకున్న ప్రతిదాన్నీ తనతో పణం పెట్టి తేల్చుకోమంటాడు భర్త. ఎలా నాన్నా, మా యిష్టాలని గుర్తించకపోతే? నాకు శరత్ నిగానీ మాయనిగానీ దూరం చేసుకోవాలనిలేదు. ఆమాటకొస్తే మాకు అహాలుండవు. ఎవర్నీ దూరం చేసుకోవాలని వుండదు. ఏదో ఒక సర్దుబాటు చేసుకుని అందర్నీ కలుపుకోవాలనే వుంటుంది” అంది కన్నీళ్ళతో.
“నువ్వు చెప్పినదంతా అతనికి చెప్పాను. నువ్వే దార్లో వెళ్ళాలో నిర్ణయం బాగానే చేసుకున్నావు. క్రాస్ రోడ్స్ లో వున్నది అతను” అన్నాడు ఆనంద్.
రాత్రి మాయ ఫోన్ చేసి౦ది.
“తాతయ్యా! ఈ విషయం నీకు అర్థమౌతుందని నేను అనుకోను. కాని చెప్పవలసిన బాధ్యత వుంది. అన్ని స్నేహాలూ ఒక్కలాగే సాగుతాయి. ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి విషయంలో ఇతన్ని పెళ్ళిచేసుకుంటే బావుంటుందికదా అనే ఆలోచన వస్తుంది. అతనుకూడా బయటపడేదాకా ఆ విషయంలో సందిగ్ధమే. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనంత దూరం వచ్చేసి వుంటాం. మా బాడీలేంగ్వేజిద్వారా మా ప్రవర్తనద్వారా అందరికీ అర్థమైపోతుంది. దాన్ని ప్రేమ అని అంటున్నాంగానీ అదొక అనివార్యత. మామయ్య విషయంలోనేనా నా విషయంలోనేనా జరిగింది ఇదే. ఈ స్టేజిలో మేం వెనక్కి తిరిగి రాలేం. మీ సహకారం వున్నా లేకపోయినా ముందుకి వెళ్ళక తప్పదు. అమ్మ సరిగానే అర్థం చేసుకుంది. మీరూ నాన్నాకూడా అర్థం చేసుకుంటే మనందరం ఒకరికొకరం వుంటాం. లేకపోయినా మీరు నాకుంటారుగానీ నేను మీకు వుండను. ఎందుకంటే నాదీ మామయ్యదీ షరతుల్లేని ప్రేమ. మీరుమాత్రం మేం మీమాట వింటేనే ప్రేమించగలరు” అంది.
అదితి మాటల్లోలాగే మాయమాటల్లోకూడా స్పష్టత వుంది. తనభార్య మాటల్లోకూడా వుండేదా? ఏమో! తనెప్పుడూ వినే ప్రయత్నం చెయ్యలేదు.
రాత్రి శరత్ వచ్చాడు. అదితి ముఖంలో కనీకనిపించని సంతోషం.
“నీకూ నీకూతురికీ ఎలా ఇష్టమైతే అలాగే చేసుకోండి. నేనుమాత్రం పెళ్ళికి రాను. అది నా యింటికి రాకూడదు” అన్నాడు.
అదితి చిరునవ్వు నవ్వింది.
“దాన్ని ద్వేషించమని మీరు నన్ను నిర్బంధించనందుకు థేంక్స్. అలాగే మీ యిద్దరిమధ్యా సంబంధాలు ఎలా వుండాలో నేనూ నిర్దేశించను. నాకు మీరూ కావాలి, మాయా కావాలి” అంది.
సందిగ్ధంలోంచీ బైటపడి అందరూ సరైనదారిలోకి వచ్చిన భావన కలిగింది ఆనంద్ కి. ఎవరిదారి వారిదైనా అన్నీ ఒకచోట కలుసుకునేరోజూ త్వరలోనే వస్తుందనిపించింది.
(ఆంధ్రభూమి వారపత్రిక 2017)

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s