అస్తిత్వసంతకం by S Sridevi

“ఆర్యూ క్రేజీ?” మెయిల్ చూసి వెంటనే ఫోన్ చేసి దిగ్భ్రాంతిగా అడిగింది హెచార్ మేనేజర్ లాస్య.
“సరిగానే నిర్ణయిచుకున్నాను. ఒక సమయంలో అవసరాలన్నీ డబ్బుగా మారిపోయాయి. తర్వాత డబ్బు కాలంగా మారింది. ఇప్పుడు కాలాన్ని ప్రేమగా మార్చుకోకపోతే ఆ తర్వాత మార్చుకోవటానికి ఇంకేదీ వుండదు” అంది ప్రజ్ఞ.
ఇరవయ్యేళ్ళకి బీటెక్. ఇరవై రెండేళ్ళకి ఎంబియ్యే. ఆ తర్వాత వెంటనే వుద్యోగం. పదిలక్షల పేకేజి. చక్కటి కార్పొరేట్ ఉద్యోగం. రోజూ ఏసీ కార్లో వెళ్లి రావడం. కంప్యూటర్లు, ల్యాప్‍టాప్‍లు, ఏసీ చాంబర్లు… కంపెనీలు మారటాలు, క్లయింటు మీటింగ్స్, వాటిల్లో విజయం, ఇంకా ఇంకా ఇన్సెన్టివ్‍లు, అవకాశాలు… చుట్టూ ఆరాధనగా చూసే కొలీగ్స్… ఊపిరి పీల్చి వదిలినంత చులాగ్గా గడిచిపోయాయి రోజులు.
ఉద్యోగం వచ్చి ఏడాది గడవగానే సుధీర్‍తో పెళ్ళి. సుధీర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రెండు జీతాలు… పిల్లలూ బాధ్యతలూ లేకుండా ఆరేళ్లు దొర్లిపోయాయి.
వారాంతపు సరదాలు, వినోదాలు, విలాసాలు… పెద్దఫ్లాట్ కొనుక్కున్నారు. ఇద్దరికీ చెరో ప్రిమియమ్ కారు, లాకర్‍నిండా బంగారం, ఇంట్లో సుఖజీవనానికి కావలసిన సామగ్రి… వృత్తిలో విజయం, వివాహజీవితంలోని సామరస్యత ఒకదాన్లో ఒకటి కలిసిపోయి పల్చటి మంచుపొరలా తనని చుట్టేసుకున్నాయి. చూసే ప్రపంచం కొంచెం భిన్నంగా కనిపించడం మొదలైంది… అలా భిన్నంగా చూసున్నట్టు తనకి తెలియకుండానే. అప్పుడొచ్చింది ఆలోచన…
“జీవితం యాంత్రికంగా అనిపించట్లేదూ? బాబో పాపో ఉంటే బావుంటుంది కదూ?” తనే అంది.
“గుడ్ ఐడియా. ఇదే సరైన సమయం మనకి. నాకైతే పాప కావాలి” అన్నాడు సుధీర్.
“నీకేనా? నాక్కూడా పాపే కావాలి”
అప్పటికే ఇటూ అటూ పెద్దవాళ్ళు అడుగుతునే వున్నారు, పిల్లల్నెప్పుడు కంటారని.
“చిన్నవయసులో కంటే మీరు పెద్దవాళ్ళయ్యేసరికి వాళ్ళు అందివస్తారు. వాళ్ళ పెంపకంలో సహకరించే ఓపిక మాకూ వుంటుంది” అంది తల్లి.
“ఒకళ్ళో ఇద్దరో పిల్లల్ని కని ఆ అధ్యాయం అయిందనిపించుకోండి. అందరూ అడుగుతున్నారు, కొడుక్కి పెళ్ళై ఆరేళ్ళైనా ఇంకా పిల్లల్లేరా అని. జవాబు చెప్పలేక చస్తున్నాను” సుధీర్ తల్లి అంది.
కార్పొరేట్ సెక్టర్లో పెళ్ళికీ పిల్లల్ని కనటానికీ వున్న నిర్వచనాలు వేరు. అప్పుడే పెళ్ళా అంటుంది పాతికేళ్ళ అమ్మాయికూడా. తన బాస్, అతని భార్య పిల్లలు వద్దనుకున్నారట కెరీర్‍కి అడ్డని. తన ఇంకో కొలీగ్‍కి పెళ్ళైందిగానీ భార్యాభర్తలమధ్య ఏకాంతాలు సాధ్యపడట్లేదట. ఇద్దరికీ పని వత్తిడి. సుదీర్ఘమైన పనివేళలు అవకాశాలని చంపేస్తుంటే అవకాశాలని సృష్టించుకునే ఆసక్తిని జీవనశైలి చంపేస్తోంది. ఇరవైమూడేళ్ళకి తనకి పెళ్ళైందంటే బాల్యవివాహం అని వేళాకోళం చేసారు. ఇప్పుడే పిల్లల్ని కనద్దని సలహా ఇచ్చారు చాలామంది. తనకీ అలాగే అనిపించింది. సుధీర్‍కూడా కాదనలేదు. తనకి ముప్పయ్యేళ్ళు వచ్చేదాకా పిల్లలు వద్దనుకున్నారు.
ఇప్పుడింక ఆ తరుణం వచ్చింది.
ఇద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆమె సలహా మీద కాంట్రసెప్టివ్స్ ఆపేసారు. ఆ వెంటనే కోరుకున్నట్టు ప్రెగ్నెన్సీ. డెలివరీ అయేదాకా ఎన్నో వూహలు. కలలు. కలలకి కామా పెట్టినట్టు డెలివరీ. డెలివరీ తన పుట్టింట్లో. పాప. కలల కొనసాగింపు. పాపని ఎలా ఎత్తుకోవాలో, డయపర్లు ఎలా మార్చాలో హాస్పిటల్లో నేర్పిస్తుంటే అతను వుత్సాహంగా నేర్చుకున్నాడు, కొత్త సాఫ్ట్‌వేర్ తెలుసుకున్నట్టు. సంతోషం ఒక కెరటంలా ఇద్దరినీ కుదిపేసింది. బుల్లిబుల్లి పిడికిళ్ళు బిగించి, చిన్నిచిన్ని పాదాలతో తనని తంతూ పక్కలో కదుల్తున్న ఆ ప్రాణి తమ జీవితాల్లో ఒక భాగమనే అవగాహన వచ్చి కొత్తగా వచ్చిన ఈ బాధ్యతని సక్రమంగా నెరవేర్చడం జీవితధ్యేయంగా మారిపోయింది ఇద్దరికీ. పాపని చూస్తుంటే కొంచెం గర్వంగానూఅనిపించింది. ఫస్ట్ క్రై, అమెజాన్ డెలివరీ బాయ్స్ ఇంటికి వరసకట్టారు.
తనకి ఆర్నెల్ల మెటర్నిటీ లీవు, సుధీర్‍కి పదిహేనురోజుల పెటర్నిటీ లీవు. అమ్మానాన్నలు, అన్నావదినలు, వారాంతాల్లో అదో డ్యూటీలా వచ్చిపోయే సుధీర్, మనవరాలు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చేసే అత్తమామలు…పదకొండో రోజుని పుణ్యవచనం, ఇరవయ్యొకటిన బారసాల, బోర్లాపడ్డందుకు బొబ్బట్లు ఎన్నో వేడుకలు… ఇన్నిటి, ఇందరి మధ్య రోజులెలా గడిచిపోయాయో తెలీలేదు.
మెటర్నిటీ లీవు చివరికొచ్చింది. లీవైపోతుంటే అప్పుడు అర్థమయింది సమస్య. తను వెళ్లి ఆఫీసులో చేరితే పాపనెవరు చూస్తారు?
“నువ్వొచ్చి కొన్నాళ్ళు మాదగ్గిర వుండకూడదూ?” తల్లినడిగింది.
“నెలో రెండునెలలో అంటే కుదురుతుంది. ఆ తర్వాత?”
అసలలా అంటుందని వూహించలేదేమో తెల్లబోయింది. “నువ్వూ నాన్నా వచ్చి నా దగ్గిరే వుండిపొండి” అంది.
“అదెలా కుదుర్తుంది?” అడిగింది.
“మరి పాపెలా?”
“ఇంకొన్నాళ్ళు సెలవు పెట్టవచ్చేమో చూడు” ఆవిడ జవాబు.
“ఆ తర్వాతేనా ఎవరో ఒకరు వచ్చి వుండాలి కదా?”
“మీ అత్తగారు వచ్చి వుంటారేమో అడుగు. ఆవిడకంటే కొడుకిల్లుకాబట్టి స్వతంత్రం కూడా వుంటుంది”
“మీకేంటి సమస్య?” కొంచెం అసహనంగా అడిగింది తను.
“మా యిల్లూ వాకిలి వదులుకుని నీ దగ్గర ఎలా వుంటాం? నాన్న అసలు వప్పుకోరు”.
“అదే ఎందుకు?”
“అర్థం చేసుకో ప్రజ్ఞా! ఆడపిల్ల ఇంట్లో ఎలా వచ్చి వుండాలి?”
“ఇంకా ఈరోజుల్లో అవన్నీ ఏమిటి?”
ఆవిడ కచ్చితమైన జవాబు చెప్పకపోయినా తప్పనిసరిగా అర్థం చేసుకోవలసిన ఆర్థికసూత్రాలు. తండ్రి, అన్న కలిసి కొన్న ఫ్లాటది. అంతా కలిసి వుంటున్నారు. ఒకసారి ఇవతలికి వచ్చేస్తే మళ్ళీ తిరిగి ప్రవేశించడానికి అవకాశం వుంటుందో వుండదో! ఒక మార్పుకి అలవాటుపడ్డాక దాన్ని రివర్స్ చెయ్యటం సాధ్యం కాకపోవచ్చు. ఎన్ట్రొపీ. అత్తమామల ప్రమేయంలేని జీవితానికి అలవాటుపడ్డాక వదిన మళ్ళీ వాళ్ళతో వెనకట్లా వుండగలుగుతుందా?
అతని తల్లిని అడిగాడు సుధీర్.
“అత్తాఆడబిడ్డలపోరు తీరి ఇన్నాళ్ళకి తెరిపినపడ్డాను. ఇప్పుడు కోడలిపోరా? మీ తిప్పలు మీరు పడండి” అందావిడ.
తనకి మనసుకి కష్టమనిపించింది. “కోడలిపోరంటున్నారు, మిమ్మల్ని నేనెప్పుడేనా ఒక్కమాటేనా అన్నానా?” అడిగింది రోషంగా.
“అత్తలేని కోడలు, కోడల్లేని అత్త అని వుత్తిగా అనలేదు. ఇప్పటిదాకా గొడవల్లేకుండా సుఖంగా వున్నాం. నాలుగురోజులు చుట్టంచూపుగా వచ్చిందీ, అందరం ఒకచోట చేరిందీ వేరు. మీరు చేసేవి మాకర్థం కావు. మేం చెప్పేవి మీకు నచ్చవు. మీతరం పిల్లల్తో మేము నెగ్గలేము. మా అక్కయ్య పడుతోంది. చూస్తునే వున్నాను. మనవడినెత్తుకోబోతే చేతులు కడుక్కున్నారా అనడుగుతుందట కోడలు. ఇద్దరేసి ముగ్గురేసి పిల్లల్ని కనిపెంచినవాళ్ళం, మాకు మీరు చెప్పాలా?” అందావిడ.
సుధీర్ పెద్దమ్మగురించి తనకి తెలుసు. ఏ చేతుల్తో పడితే ఆ చేతుల్తోటే పిల్లవాడిని ఎత్తేసుకుంటుంది. హేండ్‍వాష్ తెప్పించి పెట్టినా వాడదు. వాడికేవైనా ఇన్ఫెక్షన్లొస్తే అని వాళ్ళ కోడలి భయం. ఐనా ఎవరిపిల్లల్ని వాళ్ళ ఇష్టం ప్రకారం పెంచుకుంటారు. కోడలు చెప్పినట్టు చేస్తే సరిపోదా?
తల్లి భయాన్నే గుర్తించాడో, తన భావాలనే చదివాడో, సుధీర్ ఆవిడ్ని రమ్మని మళ్ళీ అడగలేదు. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే వుంది. తెలీని పోరాటమేదో మొదలై, అందులో తను వోడిపోతోందన్న భావన కలిగింది.
“కొన్నాళ్ళపాటు వుద్యోగం మానెయ్” అంది తల్లి అదేదో చిన్నవిషయమన్నట్టు.
“మరి నన్నెందుకు చదివించావ్?” ఎదురుదాడికి దిగింది.
“అవకాశం వున్నన్నాళ్ళు చేసావు. ఇప్పుడిక వీలుకుదరనప్పుడు మానేస్తే తప్పేంటి? మళ్ళీ పాప పెద్దదయ్యాక చేరుదువుగాని” కొంచెం గట్టిగానే అందావిడ.
“నాకు కావల్సినప్పుడు చేసి అక్కర్లేదనుకున్నప్పుడు మానెయ్యటానికి మన స్వంతకంపెనీలేవీ లేవు”
“వాదన దేనికి ప్రజ్ఞా? అంత జీతం వస్తున్న వుద్యోగం మానటం అంటే కష్టంగానే వుంటుంది. అతనికీ జీతం బాగానే వస్తోందికదా? ఒక జీతంలో కొన్నాళ్ళు సర్దుకోలేరా?”
“ఉద్యోగం చేసేది జీతంకోసమేనా? “
“కాక? పదిలక్షలకి చేరావు. పద్ధెనిమిదిలక్షలకి ఎదిగావు. ఇంకా ఎదుగుతావు. ఎంత పైకి వెళ్ళినా నీకు మిగిలేది ఆ జీతమేకదా? కంపెనీకి నువ్వెంత చేసినా కంపెనీ నీది కాదు. నువ్వు వ్యక్తిగా చేసినా అది సమిష్ఠి కృషే. ఆ తర్వాత కంపెనీ లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. మీరు మానవవనరులు. వనరులని వినియోగించుకుంటారుతప్ప, వాటి సంక్షేమంగురించి ఎవరూ ఆలోచించరు. ఆలోచించినా వాళ్ళకి వుపయోగపడేవరకు మాత్రమే.”
కటువైన వాస్తవం. అది అర్థమైతే జీవితం తెరిచిన పుస్తకంలా మారుతుంది. ప్రాథమ్యాలు వాటి స్థానాల్లోకి అవి సర్దుకుంటాయి. ఐనా కూడా సమాధానపడలేకపోయింది ప్రజ్ఞ.
కొంతమంది స్నేహితుల్తో చర్చించింది. ఒకరికి వాళ్ళ కంపెనీ డేకేర్ నడిపిస్తోంది. ఇంకొకరింట్లో దూరపుబంధువు వుండి చూసుకుంటోందట.
“ఈ ముసలాళ్ళని ఎవరు భరించగలరు? దగ్గు, ఆయాసం… మందులు. ముందు ఆమెకే నేను చెయ్యాల్సొస్తోంది. కనీసం ఏడాది నిండితేగానీ డేకేర్‍లో తీసుకోరు. అప్పటిదాకా ఆమెని భరించాలి. ఆ తర్వాత పంపేస్తాను. నువ్వు మాత్రం ఇలాంటి తలనొప్పి తెచ్చి పెట్టుకోకు” అంది ఆమె. “దుర్గని అడుగు. తను నానీని పెట్టుకుంది”
“ఇది నీ ఒక్కదాని సమస్యే కాదు ప్రజ్ఞా! మన తరంలో అందరం ఎదుర్కొంటున్నదే! పిల్లల్ని కను, కనని వెంటపడతారు. తీరా కన్నాక చూసుకోవటానికి ఎవరూ ముందుకు రారు. ఈ అమ్మలకీ అత్తలకీ ఎవరి కారణాలు వాళ్ళకి వుంటాయి. పదిమంది వచ్చిపోయే యిల్లు, నీ దగ్గిరకి వచ్చి వుండటం ఎలా కుదుర్తుందంటుంది మా అమ్మ. నీయింట్లో నేనెందుకు వచ్చి వుంటానంటుంది మా అత్తగారు. బాబుని వాళ్ళ దగ్గిర వదిలిపెడితే అవిడ చూసుకుంటుందట. అది సాధ్యమేనా? వాడి బాల్యాన్ని నేనెంత మిస్సౌతాను? అక్కడా ఇక్కడా పెరిగేట్టైతే వాడిని కనడమెందుకు? చదివించి, వుద్యోగాల్లో పెట్టి ఒక త్రిశంకుస్వర్గంలో వదిలేస్తారు మనల్ని. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మన వుద్యోగంకేసే చూస్తుంటారు. గొప్పగా చదువుకుని, ఇంతంత జీతాల్తో వుద్యోగాలు చేసి, చేసినచోట ప్రతిభ చూపించి, పిల్లలు పుట్టేసరికి వుద్యోగం మానేసి వాళ్ళ డయపర్లు మారుస్తూ కూర్చోవాలా?” అంది దుర్గ.
ఎవరి చెప్పు వాళ్ళదే. మరొకరికి పట్టదు.
ఆమెతో చర్చ కొంచెం ముందుకు సాగింది.
“మీ బాబుకి పదినెలలుకదా? నువ్వేం చేస్తున్నావు?” కుతూహలంగా అడిగింది.
“వర్క్ ఫ్రం హోం తీసుకున్నాను. ఆయా వుంది”
“నాది మార్కెటింగ్. వర్క్ ఫ్రం హోం ఇవ్వరు…”
“పాప వయసెంత?”
“ఆర్నెల్లు. ఇంకా నిండలేదు.”
“డేకేర్‍లో తీసుకోరు అంత చిన్నపిల్లల్ని. తీసుకున్నా అదొక సమస్యలే. ఊరికే పిల్లలకి ఇన్ఫెక్షన్లు. దగ్గులు, జలుబులు. నువ్వేం ఆలోచిస్తున్నావు? జాబ్ వదిలేస్తావా?”
“నో వే”
“మరి?”
“అదే అర్థమవటం లేదు. ఇప్పటికే కంపెనీనుంచీ కాల్స్ వస్తున్నాయి…వచ్చి చేరమని. ఐనా ఇంకొన్నాళ్ళు శలవు పెడతాను”
“ఆ తర్వాత?”
“…”
“ఏదేనా మంచి కన్సల్టెన్సీద్వారా నానీని తెప్పించుకో. వాళ్ళు పోలీస్ ఎంక్వైరీ అవీ చేసి పంపిస్తారు. అలా కూడా కొంతమంది మేనేజ్ చేసుకుంటున్నారు.”
“పరాయిమనిషి పాపని సరిగా చూస్తుందా?”
“చూస్తుందా అంటే నా జవాబు చూడదనే. ఇది గిన్నెలు తోమటం, ఇల్లు మాపింగ్ చెయ్యటంలాంటి బండపని కాదు. ఇందులో భావోద్వేగాలు వుంటాయి”
“అంటే?”
“ఇన్‍ఫాంట్ అబ్యూజ్ బాగానే జరుగుతోంది. పుట్టుకతో ఎవరికీ క్రిమినల్ హిస్టరీ వుండదు ప్రజ్ఞా! మొదటినేరం అనేది ఎక్కడో ఒకచోట జరిగాకే నేరచరిత్ర మొదలౌతుంది. ఆ మొదటి నేరం ఎక్కడేనా ఎప్పుడేనా జరగవచ్చు. జరగటానికిగల అవకాశాలు ఎక్కువగా వుంటాయి ఇలాంటి సందర్భాల్లో” తను చెప్పాలనుకున్నది ఇంకా విడమర్చి ఎలా చెప్పాలో అర్థమవలేదు.
ప్రజ్ఞకి సమస్య యొక్క ఒకొక్క పొరా విడుతున్నట్టు అనిపిస్తోంది.
“ఒక వస్తువు బజార్లోంచీ కొనుక్కునేముందు మనం ఎన్నో విచారిస్తాం. ఇక్కడ అలా కాదు. ఈ వచ్చే మనిషి వ్యక్తిగతంగా మనకి తెలీదు. బేసిగ్గా ఆమె మనస్తత్త్వం ఎలాంటిది, అలవాట్లేమిటి, బలహీనతలేమిటి, ఎంత వత్తిడిని తట్టుకోగలదు, ఎంతవరకు సంయమనం పాటించగలదు అనే విషయాలు మనకి తెలీవు. కొత్త పరిసరాలు. వంటరితనం. తనది కాని పాప. తనకి తెలీని పద్ధతిలో పెంచటం. స్వంతపిల్లల్నో మనవల్నో పెంచాల్సిన తనకి ఆ పాపని చూసుకోవలసిరావటం… అందుకు కారణమైన పరిస్థితులు, వాటిని తప్పించుకోలేని నిస్సహాయత… ఇలా ఎన్నో విషయాలు ఆమెమీద ప్రభావం చూపిస్తాయి. తనేం చేసినా చూసేవాళ్ళు లేరనుకున్నప్పుడు ఆమెలో వున్న నేరప్రవృత్తిని ట్రిగ్గర్ చేసినట్టౌతుంది. అది నేరప్రవృత్తికూడా కాదు. ఉక్రోషాన్ని చూపించుకోవటానికి నోరూ వాయీ లేని పిల్లల్ని ఔట్‍లెట్‍గా వాడుకుంటారు. పెద్దవాళ్లెవరేనా వుండి పైనుంచీ చూసుకుంటే బావుంటుంది. అలా లేనప్పుడు వుద్యోగం నీకు ఎంతవరకూ అవసరమో ఆలోచించు” అంది.
ఆఖరిపొరకూడా విడిపోయింది. ఇంక ఆలోచించుకోవలసినది తనే.
“పిల్లలు మన సిగ్నేచర్ స్టేట్‍మెంట్స్. అస్తిత్వసంతకాలు” ఆఖర్లో ఆమె అన్న మాటలు ఛెళ్ళుమని తాకినట్టయాయి ప్రజ్ఞకి. ఆలోచనలో పడింది. పగలూ రాత్రీ మథనపడింది. సుధీర్‍తో చెప్పడానికిముందూ, ఆ తర్వాతాకూడా.
అతనికి నచ్చలేదు. ఇద్దరూ తెచ్చుకుంటూ విలాసంగా గడిపేస్తున్నారు. ఇప్పుడు ప్రజ్ఞ వుద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే ఆదాయం సగానికి తగ్గిపోతుంది. కారు లోన్, హోమ్‍లోను వాయిదాలు అలాగే వుంటాయి. పాపకూడా వుంది కాబట్టి ఖర్చులు ఇంకా పెరుగుతాయి. చదువు, పెళ్ళి… సరేననలేకపోయాడు.
“పాప ఇంకా చిన్నది. దాని నవ్వులూ, దాని వూసులూ… తన లోకంలో తనుంటుంది. అంతే తప్ప ఎత్తుకోమనీ, ఆడించమనీ గొడవచేసే వయసు కాదు. ఎవర్నేనా పెట్టుకుందాం. వచ్చిన అమ్మాయి వేళకి అన్నీ చేసి తన మానానికి తను కూర్చోవచ్చు. పదిహేనువేలో ఇరవైవేలో జీతం ఇస్తాం. తిండిపెడతాం. సదుపాయాలన్నీ ఇస్తాం. ఎందుకు చూడదు? బైట ఎంత చాకిరీ చేస్తే అంత డబ్బొస్తుంది? కృతజ్ఞత వుండదా? ఒక్క ఆరునెలలు సర్దుకున్నామంటే ఆ తర్వాత నానీ నచ్చకపోతే డేకేర్‍లో వేద్దాం” అన్నాడు. అది అతను తనకి తను నచ్చచెప్పుకోవడమో, అతను ధైర్యంగా వుండి తనకి నచ్చచెప్పడమో అర్థమవని సన్నటి గీత రెండిటికీ మధ్యని.
మళ్ళీ సందిగ్ధం.
“ఏం ఆలోచించుకున్నావు ప్రజ్ఞా! అల్లుడేమంటున్నాడు?” అడిగింది తల్లి.
“ఆయాని పెడదామంటున్నారు”
మాట ఇంకా పూర్తవలేదు. ఆవిడ కోపంతో విరుచుకుపడింది.
“నీ వుద్యోగం పిచ్చి నాశనమైపోనూ! పసిపిల్లని ముక్కూ మొహం తెలీని మనిషిమీద వదిలేసి ఆఫీసుకి వెళ్తావా? నువ్వసలు ఆడపిల్లవేనా? నేను కన్న కూతురివేనా? వుద్యోగం మానెయ్యమని చెప్పాను. మానెయ్యలేనిదానివి పిల్లనెందుకు కన్నావు?” కంఠనాళాలు తెగిపోయేలా అరిచింది .
పాపని గుండెలకి హత్తుకుని ఏడ్చేసాడు తండ్రి. “నాకూతుర్ని పెద్ద చదువులు చదివిస్తున్నాననుకున్నానుగానీ డబ్బు యంత్రాన్ని చేస్తున్నాననుకోలేదు” అన్నాడు దు:ఖం నిలవరించుకోలేక.
“అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు ప్రజ్ఞా? నీ సెల్‍ఫోను ఎవర్నీ ముట్టుకోనివ్వవు. అలాంటిది ప్రాణాలు పణంగా పెట్టి కన్న పాపాయిని పరాయిమనిషి చేతికి ఎలా ఇవ్వగలవు? ఫోనుపాటి విలువ మనిషికి లేదా?” సూటిగా అడిగింది వదిన. ఔను. ఆమె పెళ్ళయాక వుద్యోగం చెయ్యనని ముందే నిర్ణయించుకుంది.
“మేమెప్పుడూ సంపాదించి మాకున్న మేడలమీద ఇంకో అంతస్థు వెయ్యమని నిన్నడగలేదు. చదువుకున్న పిల్లవి, చదువుకున్నావుకాబట్టి వుద్యోగం చేస్తున్నావు. పెళ్ళై పిల్లలు పుట్టాక కుదిర్తే చేస్తావు, లేకపోతే మానేస్తావనుకున్నాం. అంతేగానీ పిల్లల్ని కనను, పెంచను అని మొండికేసే శఠారిని చేసుకుంటున్నామనుకోలేదు” అంది సుధీర్ తల్లి.
అన్ని వేళ్ళూ తనవైపే చూపించాయి. అందరూ తననే దోషిగా చూసారు. ఎన్ని ప్రశ్నలు! వాటికి జవాబులు వెతకడానికి తన మనసు గిజగిజలాడిపోయింది. సుధీర్ వప్పుకోవటం లేదని చెప్పెయ్యచ్చు. కానీ తనే ఇంకా వూగిసలాటలో వుంది.
ఈ చర్చలు ఇలా జరుగుతునే వున్నాయి. లీవు పొడిగించి పుట్టింట్లోనే వుండిపోయింది.
ఇంతలో దుర్గనుంచీ ఫోను.
“వర్క్ ఫ్రం హోం కూడా చెయ్యలేనని అర్థమైంది ప్రజ్ఞా!” అంది. ఆమె గొంతులో నిస్పృహ.
“ఏమైంది?” ఆతృతగా అడిగింది ప్రజ్ఞ.
“నానీ సడెన్‍గా మానేసింది. కొడుక్కి ఏక్సిడెంటైందట. బాబు ఆమెకోసం బెంగపడ్డాడు. రెండురోజుల్నించీ విపరీతమైన జ్వరం. హాస్పిటల్లో చేర్చాం. ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్లు పిల్లల్ని బాగా చూసుకున్నా మనకి సమస్యేకదా?” అంది.
ఊగిసలాట ఆగిపోయింది. నిర్ణయం తీసేసుకుంది. రెజిగ్నేషన్ మెయిల్ చేసింది. ముందే చెప్తే తన నిర్ణయం మారిపోతుందేమోనని సుధీర్‍కి చెప్పలేదు. ఆఫీసునించీ ఇంటికొచ్చాక ఫోన్లో చెప్పింది.
అతను షాకయాడు. “నీకేమైనా పిచ్చిపట్టిందా? నెలకి లక్షన్నర వచ్చే వుద్యోగాన్ని వదిలేస్తావా? ఒకసారి వదిలేస్తే మళ్ళీ ఇంత మంచి పొజిషన్‍కి రాగలవా? పాపదేముంది? ఒక్క మూడేళ్ళు ఎవరేనా చూసుకుంటే స్కూలుకి పోతుంది. ఆ తర్వాతంతా నువ్వు ఫ్రీయేగా?” అన్నాడు. మెయిల్ చేసే ముందే తనకి చెప్పలేదని ఎంతేనా కోపం వచ్చింది.
“ఎవరు చూస్తారు?” సూటిగా అడిగింది.
అతను ఫోన్ పెట్టేసాడు. ఆరోజంతా కోపమే అతనికి.
“ఎవరు చూస్తారు?” ప్రజ్ఞ ప్రశ్న. మనసులో పదేపదే కదిలింది. నెమ్మదిగా కోపం కరిగింది.
ఎవరూ వాళ్ళ జీవితాల్లోంచీ వలసవచ్చి, తమ జీవితంలో వుండిపోయి పాపని చూడరు. పిల్లలు పుట్టడం, వాళ్ళు పెరగడం అనేది సహజమైన విషయంలా జరగాలి. నానమ్మ, తాతయ్యల జీవితాలకి నాన్న, అమ్మలు కొనసాగింపుగా వుండేవారు. పెళ్ళై అమ్మ అత్తగారింటికి వచ్చింది. వాళ్ళతో కలుపుకుని ఆవిడ జీవితం కొనసాగింది. తమని అందరూ కలిసి పెంచారు. ఇప్పుడు ప్రజ్ఞ పుట్టింట్లో జరుగుతున్నది అదే. బావమరిది, అత్తమామలు కలిసే వుంటారు. అతని భార్య ఇంట్లోనే వుంటుంది. తమ విషయంలో అలా జరగలేదు. తమవి కార్పొరేట్ వుద్యోగాలు. పెద్దపెద్ద సిటీస్‍లో తప్ప ఇంకెక్కడా దొరకవు. పాపని చూసుకోవటానికి ఇద్దర్లో ఒకరు వుద్యోగం మానక తప్పదు.
పనివాళ్ళమీద ఇంటినీ పిల్లనీ వదిలేసి మరీ డబ్బులు సంపాదించుకోవాలా అని ఆలోచిస్తే మాత్రం ప్రజ్ఞ తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఆమెకూడా తనలాగే ఎగ్జిక్యూటివ్. ఏం చెయ్యాలో నిర్ణయించే తెలివి ఆమెకి కూడా వుంటుంది. ఇది ఆదాయానికి మాత్రమే కాక, ఆమె జీవితానికి సంబంధించిన విషయం. ఎంతో ఆలోచించి వుంటుంది.
ఈ నిర్ణయం వలన ఆమె తన కార్పొరేట్ వునికిని, ఉజ్వలమైన భవిష్యత్తునీ కోల్పోతుంది. ఎవరితోనేనా తన పరిచయం చేసుకోవలసి వచ్చినప్పుడు ఏమీ చెయ్యను, ఇంట్లోనే వుంటాను, హౌజ్‍వైఫ్‍ని అని చెప్పుకోవాలి. రేపెప్పుడేనా మళ్ళీ వుద్యోగం చేసే అవకాశమో, అవసరమో వచ్చినా, ఎంతో స్ట్రగుల్ చెయ్యాల్సి వుంటుంది. ఐనా వదిలేసింది.
ఈ టైంలో ఆమెకి ఎంతో మోరల్ సపోర్టు కావాలి…
అతను వెంటనే ప్రజ్ఞకి ఫోన్ చేసాడు. ఆమె ఎత్తింది.
“సారీ! ” నిజాయితీగా వప్పుకున్నాడు.
ఆమె నవ్వింది.
“పాప పిక్?” అడిగాడు.
తమ అస్తిత్వపుతునకని ఫొన్లో చూపించింది. అతను అపురూపమైన కానుకలా పిక్ తీసి దాచుకున్నాడు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s