వంటింటి కిటికీ by S Sridevi

వంటింటి కిటికీలోంచి చూస్తే పెరడంతా కనిపిస్తుంది. గుత్తులు గుత్తులుగా పూసిన గన్నేరుపూలు, నందివర్ధనాలు, నూరు వరహాలు, విరగబూసిన మందారాలు ఒక్కటేంటి అన్నీ నన్ను పిలుస్తున్నట్టు తలలూపుతాయి. వాటిమీద సీతాకోకచిలుకలా ఎగురుతుంది నా మనసు.
చిన్నప్పటినుంచి నాకా కిటికీ అంటే చాలా ఇష్టం. బాగా చిన్నప్పుడు అమ్మ నన్ను ఎత్తుకుని వంట చేస్తుంటే నేను కిటికీలోంచి చూస్తూ పూలని రమ్మని చెయ్యూపేదాన్నిట.ఇంకొంతకాలం గడిచాక అమ్మ చీర కుచ్చెళ్ళు పట్టుకుని నిలబడి కాళ్లు కాస్త పైకెత్తి చూస్తే ఎక్కడో ఆకాశాన్ని అంటుతున్నట్టు కనిపించేవి అవి.
“ఎందుకూ, అలా తొంగిచూడటం? పెరట్లోకెళ్లి ఆడుకోవచ్చుకదా?” నవ్వుతూ అడిగేది అమ్మ నన్ను ఎత్తుకుని చూపిస్తూ.నాకు అలా చూడటమే బావుండేది. ఆ బాగుండటం ఒక అనుభవమైతే పెరట్లోకి వెళ్ళగానే నా పాదాలలో గుచ్చుకునే గులకరాళ్లు, చెట్ల మొదళ్లలో ఉండే చీమల పుట్టలు, చెట్ల మీద పాకే గండుచీమలు, పువ్వు కోద్దామని చెయ్యి చాపితే గీరుకునే ఎండుపుల్లలు,  రాలిపడే నిన్నటి పువ్వులు… ఇవన్నీ గుర్తుండడం మరో అనుభవం. ఒకటి మనసుకు సంబంధించినదైతే మరొకటి శరీరానికి సంబంధించినది . ఒకటి ఊహ. రెండోది వాస్తవం. మనసుకు సంబంధించినవి ఎప్పుడూ మనల్ని ప్రలోభపెడతాయి. వాస్తవాలని మరిపింపచేస్తాయి. ప్రేమ అనేది పూర్తిగా మానసికం.
” షాపింగ్ కి వెళ్దాం వస్తావా?” సుడిగాలిలా వచ్చి అడిగింది మంజు. వస్తాననే జవాబివ్వాలి. రాననే ఆస్కారం ఉండదు.  ” అబ్బ! ఎంత హాయిగా, ఏం బేఫికర్ గా ఉన్నావే?  లైఫ్ అంటే నీదే. ఎలాంటి కృత్రిమత లేకుండా గడిపేయడంలో ఎంతో థ్రిల్లుంది కదూ?” అంది నా ఒంటిగది కాపురాన్ని గురించి.నేను నిర్వేదంగా నవ్వాను.మూడునెలలైంది నేను, హేమంత్ ఇంట్లోంచి వచ్చేసి పెళ్లి చేసుకుని . ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. సింపుల్ గా కాక ఇంకెలా ఉంటాం?
“పద… వెళ్దాం…లేటా?” అంది తనే హడావిడి పెడ్తూ.
“ ఏంటి ప్రత్యేకం? ఇప్పుడు ఇంత హఠాత్తుగా చెయ్యాల్సిన షాపింగ్ ఏమిటో?” కుతూహలంగా అడిగాను.
“ప్రత్యేకమే!” సిగ్గుగా నవ్వేసింది. “వచ్చేవారం మా బావ స్టేట్స్ నుంచి వస్తున్నాడు.ఇరవై రోజులు ఉంటాడట. మా పెళ్లికి నిర్ణయించారు” అంది.
“కంగ్రాట్స్!” తన చెయ్యి అందుకుని నొక్కి వదిలేస్తూ ప్రేమగా అన్నాను.
“ఏం  కంగ్రాట్సో ఏమో! చచ్చేంత భయం వేస్తోంది నాకు” అంది దిగులుగా.
“భయం ఎందుకు?” తెల్లబోయాను.          “బావామరదళ్లమన్నమాటేగానీ, కలుసుకున్నది చాలా తక్కువ . అతను పుట్టి పెరిగింది అక్కడే. ఆన్లైన్లోనూ ఫోన్లోనూ మాట్లాడుకున్నది తప్ప ఒకరి గురించి ఒకరికి ఏమి తెలుసు ఏం తెలుసు?  ఎలా సర్దుకుపోతామోననిపిస్తోంది” అంది.         
“అతను మంచివాడనేగా పెద్దవాళ్లు నిర్ణయించింది? అయినా, మీరిద్దరూ చేసుకునేది పెళ్లిగానీ యుద్ధం కాదు”
“యుద్ధం అయితే డిషుం డిషుం అని చేసేసుకుని తాడోపేడో తేల్చుకోవచ్చు. కానీ పెళ్లంటే జీవితకాలపు సహచర్యం.  దానికి మంచివాడవటం ఒకటే అర్హత కాదు”
“మరి?”
“అతనికోసం నేను కొంత సర్దుకుపోతాను. తప్పదు. అతన్లోనూ అలాంటి సర్దుబాటు గుణం వుందా? లేదా? లేకపోతే ఏం చెయ్యాలి? నా యిష్టానిష్టాలని గౌరవిస్తాడా? నా వ్యక్తిత్వాన్ని గుర్తిస్తాడా? అన్నీ భయాలే. అదే ప్రేమించి చేసుకుంటే…. ఒక జాతి పక్షులు దగ్గరకు చేరినట్టు అభిరుచులు కలిసినవాళ్ళే ప్రేమలో పడతారు. వాళ్లకి పెళ్లయాక ఈ సర్దుబాటు సమస్యలు వుండవు “
“కేవలం అభిరుచులే మనిషి కాదు కదా మంజూ? జీవనశైలి, కుటుంబనేపథ్యం కూడా కలవాలి కదా?”
“అభిరుచులనేవి మిగిలిన రెండిటినుంచీ ఏర్పడతాయి”
“అలా ఏర్పడ్డవే వాళ్లు చూపించుకుంటారనేమిటి? మంచిగా కనపడటానికి కొన్ని కృత్రిమంగా కూడా నేర్చుకుంటే?”
” కావచ్చు. రోడ్లు పక్క బండిమీద వేసే మిరపకాయ బజ్జీలు ఇష్టపడేవాడు గర్ల్ ఫ్రెండ్ ముందు  ఆ యిష్టాన్ని దాచుకుని ఆమెని స్టార్ హోటల్లో మంచూరియా తినిపించి అదే తన ఇష్టమని చెప్పినంతమాత్రాన నష్టం ఏంటి?”
నేను నవ్వి వూరుకున్నాను. మూడు నెలలముందు నేనుకూడా ఇలాంటి వాదనే చేసేదాన్ని.ప్రేమ  గురించి వూహించుకుంటే చాలా అద్భుతంగా వుంటుంది.  అనుభవం గులాబీ పొదల మధ్యనుండి పువ్వు కొయ్యటంలాంటిది. పువ్వుగా చేతికి రావచ్చు లేక ఆ ప్రయత్నంలో రెక్కలు రాలిపోవచ్చు. నా చెయ్యి ప్రస్తుతం పొదలో వుంది. మంజుతో అదే చెప్పాను. తనకి అర్థం అవ్వలేదు.
“పెళ్లి కూడా అయ్యాక?” ఆశ్చర్యంగా అడిగింది. నేను ఇంకేమీ విశ్లేషించలేదు. సాయంత్రం దాకా ఇద్దరం బజారంతా తిరిగి అన్నీ కొన్నాము. హోటల్ లో టిఫిన్ తిన్నాము . బిల్లు మంజుకే వదిలేశాను. ఫ్యాషన్ జువెలరీ, క్యాజువల్స్, కాస్మెటిక్స్, శారీ యాక్ససరీస్… లక్షకి పైనే ఖర్చుపెట్టింది.
” నువ్వేం కొనవా?” అడిగింది నన్ను ఆశ్చర్యంగా చూస్తూ. ఇద్దరం కలిసి బజారంతా కొన్న రోజులు గుర్తొచ్చాయేమో! నేను కొంచెం ఇబ్బందిగా చూసి, “డార్విన్ పరిణామక్రమం సిద్ధాంతం రెండవ స్టేజిలో ఉన్నాము” అన్నాను.
తను అర్థం కానట్టు చూసింది.
” ఉనికి కోసం పోరాటం” అన్నాను.మంజు కళ్ళల్లో లీలగా బాధ కదలాడింది.
” ఎన్ని కష్టాలు! ఇవన్నీ ప్రేమ కోసమే?” అడిగింది.
“మా ప్రేమ కుటీరం చూసి థ్రిల్లయ్యావుగా?” నవ్వుతూ అడిగాను.
కొద్దిసేపటి మౌనం తర్వాత అంది.
“పెళ్లి తిరుపతిలో. ఇక్కడినుంచి కార్లు, బస్సులు మాట్లాడుతున్నాం. నువ్వు, హేమంత్ తప్పకుండా రావాలి. శుభలేఖలు వచ్చాక నేనొచ్చి తనకి మళ్లీ చెప్తాను” నన్ను మా రూమ్ దగ్గర దించి వెళ్ళిపోయింది. మంజు పెళ్లికి నేనూ, హేమంత్ వెళ్ళాము. బస్సులో కూర్చున్నాక గమనించాను, అతని చేతికి వాచీ లేకపోవటాన్ని.
“నీ వాచీ?” అనాలోచితంగా అడిగేసాను, పెట్టుకోవటం మర్చిపోయాడనుకుని. అతను డిప్లమాటిగ్గా నవ్వేసి ఊరుకున్నాడు. చాలాసేపటికిగానీ ఆ నవ్వు వెనకాల అర్థం నాకు తోచలేదు. గుండెల్లో నుంచి సన్నటి మంటలాంటి బాధ ఎగజిమ్మింది.పెళ్లి చాలా ఘనంగా జరిగింది. లక్షలు చేతులు మారాయి. పుట్టింటి పుత్తడి బొమ్మ అత్తింటి అంబరాల తారకై మెరిసింది.


“అందమైన జీవితం, ఆహ్లాదకరమైన భావాలూ డబ్బున్నప్పుడే సాధ్యపడతాయా?”
“కాదేమో!”
“మరెందుకు మనిద్దరిలో ఈ అసంతృప్తి?”
“అసంతృప్తి కాదు, ఏదో కావాలన్న ఆరాటం”
పెళ్ళినుంచీ తిరిగొచ్చాక నాలోనూ హేమంత్ లోనూ స్పష్టమైన మార్పు … మాకే తెలుస్తోంది. దేన్ని కోల్పోయామో అర్థమౌతోంది. డబ్బు, పెద్ద వాళ్ళ ప్రేమ , అయినవాళ్ల ఆదరణ, వీటన్నిటినీ వదులుకుని ప్రేమకోసం మాకు మేమే బతకడం ఎంత డ్రైగా ఉంటుంది? పెళ్ళికి ముందు ఎంతో ఆకర్షణీయంగా కనిపించిన ప్రేమ ఇప్పుడు ఎందుకు ఫేడ్ అవుట్ అయ్యింది?డబ్బు… కేవలం డబ్బు లేకేనా? నాకు చాలా దిగులేసింది. డబ్బు ఇబ్బందులు ప్రేమనీ, మనుషులమధ్యనుండే సున్నితమైన బంధాన్నీ తెంచివేస్తాయని గ్రహించడానికి నేను సుముఖంగా లేను. ఈ వాస్తవాన్ని హేమంత్ యధాతధంగా స్వీకరించాడనే విషయాన్ని గుర్తించడానికి కూడా.
భార్య జేబులు తడుముతుంది, తల్లి కడుపు నింపుతుందని సామెత. ఇక్కడ ఒకే స్త్రీ.  ఆమె పోషించే పాత్రలు రెండు.  భార్యగా జేబులు తడిమాకే తల్లిగా కడుపు నింపగలదని ఎవరూ అనుకోరు.  ఇద్దర్నీ వేరువేరుగా చూసి ఒకరికి లేని చెడ్డతనాన్నీ, ఇంకొకరికి లేని మంచితనాన్నీ ఆపాదిస్తేనే తృప్తి. హేమంత్ కి నాలో చెడ్డతనం కనిపిస్తోంది.  వాళ్ళ అమ్మానాన్నలు, అక్కలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా ఈ చెడ్డతనం ద్విగుణీకృతమౌతుందనుకుంటాను.రెండు రోజులైంది ఇంట్లో అన్నం వండి. ఇద్దరూ చెప్పులరిగేలా తిరుగుతున్నాము షాపులు, చిట్ ఫండ్ కంపెనీలు , ప్రైవేట్ సంస్థలు! ఏ చిన్న ఉద్యోగం దొరికినా చాలని అడుగుపెట్టని ఆఫీసు లేదు. నాకన్నా హేమంత్ నయం. పదో పాతికో తెచ్చి నా చేతికిస్తున్నాడు. కానీ అతడి ముఖంలో ఇదివరకటి ప్రసన్నత లేదు .  ఊరికే చిరాకుపడుతున్నాడు. అతని చికాకు నా అహాన్ని దెబ్బతీస్తోంది. గాయపరుస్తోంది.
బియ్యం తేవాలి” అనో,
“పాలవాడికి డబ్బు ఇవ్వాలి. రెండుసార్లు తిరిగి వెళ్ళాడు” అనో ,
మరోరకంగానో ఒక అవసరాన్ని చెప్పే భార్యకి విలువ ఉండదు. వాళ్ళు రొమాంటిక్ హీరోయిన్స్ గా గుర్తింపబడరు.


లోపల శూన్యాన్ని పెట్టి మనిషిని సృష్టిస్తాడు దేవుడు. అందులో తిరుగాడుతూ ఉంటుంది మనసు. దానికి మూడు రకాలైన ఆకలి .  మొదటిది జిజ్ఞాస. ఇది మనుష్య లక్షణం. రెండోది క్షుధ.  జీవలక్షణం. మూడవది కామం. కాల లక్షణం. యౌవ్వనదశలో ఉంటుంది .ఈ మూడింటిలో ఏ ఒక్కటీకూడా  ప్రేమ వలన చల్లారదు.
మంజు గుర్తొచ్చింది. భర్త అపురూపంగా గుండెల్లో దాచుకుంటున్నాడేమో! ఎందుకంటే మంజు ప్రేమకి అవసరాలనే ముళ్ళు ఉండవు మరి.
“వంటకి ఏమీ లేవు” అని నేననగానే హేమంత్ మండిపడ్డాడు.
జేబులోఉంచీ ఐదురూపాయల కాయిన్ నామీదకి విసిరేసి, ” నా దగ్గర ఏమైనా డబ్బు చెట్టు వుందా, నువ్వు అడగ్గానే కోసుకొచ్చి ఇవ్వటానికి?  ప్లేటు ఇడ్లీ కొనుక్కుని తిను” అన్నాడు.
పౌరుషం, అభిమానంలాంటి పదాలకి నా డిక్షనరీలోనుంచి అర్థాలు చెరిగిపోతున్నాయి. నేనా  కాయిన్ని చేత్తో పట్టుకున్నాను.” దీన్ని ఇలా నామీదికి విసిరే బదులు ఆ ప్లేట్ ఇడ్లీ నువ్వే తీసుకొస్తే ఇద్దరం చెరొకటి తినేవాళ్ళం” అన్నాను.అతను ఖంగుతిన్నా వెంటనే సర్దుకున్నాడు.
” ఇలా ఇంతగా ఇబ్బందులు పడాల్సిన అవసరం మనకేంటి? నువ్వే పెళ్లి గురించి తొందర పెట్టేసావు” ఆరోపించాడు.
“ఎందుకంట?” వ్యంగ్యంగా అడిగాను.
“ఎందుకేంటి. ఆడవాళ్ళంత సెంటిమెంటల్ ఫూల్స్ ఎవరూ ఉండరు. జస్ట్ … సరదాగా ఫ్రెండ్ రూమ్ లో ఒక గంట గడిపేసి ప్లెజెంట్ గా ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయేదానికి ఇంతదాకా తీసుకొచ్చావు”
అతని మాటలకి నా ముఖంలోకి వెచ్చటి రక్తం చిమ్మింది.
“అవును. అమ్మా నాన్నా ఇచ్చే పాకెట్ మనీతో సినిమాలకీ షికార్లకీ తిరిగి, ఆపైన చాటుగా రొమాన్స్ చేసి , అది వికటిస్తే ఎబార్షన్ టేబుల్స్ వెతుక్కోవటం… ఇదేనా, ప్రేమంటే?”  పదునుగా అడిగాను.
“తిండికీ,  బట్టకీ మొహం వాచిపోయి అందరికీ దూరంగా ఎవరికీ ఏమీ కానట్టు  ఇలా బతకడం మాత్రం కాదు” అతను కూడా అంతే తీవ్రంగా జవాబిచ్చాడు.
“హేమంత్!!”
“సారీ అన్నూ! మనం ఒక గంట సరదాకోసం ఇంత పెద్ద పొరపాటు చేసామనే వాస్తవం  జీర్ణించుకోలేకపోతున్నాను”
“దయచేసి ఇంకేం మాట్లాడకు”
“ఓకే… ఓకే!  ఆఖరి మాట. ఈ సమస్యలు ఎదుర్కోవడం ఇక నావల్ల కాదు .ఇదంతా నాకు నచ్చట్లేదు” అనేసి అతను చాలా తేలిగ్గా మా బంధాన్ని తుంచేసి వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను.
వంటికి కిటికీ 2రచన యస్. శ్రీదేవి“కలం పేరు – సాహితి ***
హేమంత్ నన్నొదిలేసి వెళ్ళిపోయాడన్న విషయాన్ని నిర్ద్వందంగా ఒప్పుకోలేకపోతోంది నా మనసు. ఎక్కడో ఆశ, అతను తిరిగొచ్చేస్తాడని, అతనొచ్చేదాకా ఎదురుచూడాలన్నా, అలా ఎదురుచూడకుండా నా దారి నేను చూసుకోవాలన్నా కూడా కావల్సింది ఒక్కటే ఒక్కటి…. డబ్బు.
హేమంత్ మొదట తన గొలుసు అమ్మేశాడు. తర్వాత బ్రేస్ లెట్,వుంగరాలు, ఆఖర్లోవాచీ. అవేవీ అతను స్వంతంగా సంపాదించుకుని చేయించుకున్నవి కాదు. తల్లిదండ్రులు ప్రేమతోటీనమ్మకంతోటీ కొనిచ్చిన కానుకలు. వాటిని ఒకటొకటిగా అమ్మేస్తుంటే అతనికి ఎంతగా బాధనిపించేదో!
అతన్ని నేను డబ్బడిగేదాన్ని. అలా అడగకుండా రోజులు గడపటం ఎలాగో నాకు తెలిసేదికాదు.ఆలోచనలు ఆపి గొలుసు మెడలోంచి  తీసి చేత్తో పట్టుకున్నాను.
టెస్త్ లో స్కూల్ ఫస్టొచ్చానని అమ్మకొనిచ్చింది. ఎర్రరాయి లాకెట్టుంది. దాన్నలా చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. దీన్ని నేనూ హేమంత్ లాగే మొదట్లోనే అమ్మేసి ఉంటే మా మధ్య బంధం మరికొంత సామరస్యంగా వుండేదేమో! నావైపునుంచి ఎలాంటి సహకారం లేకనే అతను విసిగిపోయాడేమో!
చెంపలమీంచి జారుతున్న కన్నీళ్లని తుడుచుకుని తయారై నగల దుకాణానికి వెళ్ళాను. మార్వాడీ నన్ను పైనుంచి కిందిదాకా చూశాడు. తర్వాత గొలుసుని నాలుగైదుసార్లు గీటు పెట్టాడు.
“ప్చ్….బంగారం మంచిదికాదు. రాగి బాగా కలిసింది” అన్నాడు తిరిగి కౌంటర్ మీద పడేస్తూ.
అమ్మ చేయించిన గొలుసులో మోసం ఉంటుందంటే నాకు నమ్మకం లేదు. కానీ మరోమార్గం లేదు. అతనిచ్చిన డబ్బు తీసుకుని లేచాను. అతని ముందే లెక్క పెట్టుకోవాలన్న చిన్న నియమం కూడా నాకు తెలీదు. తర్వాతెప్పుడో లెక్కపెడితే వంద తక్కువుంది.
ఇదంతా జరుగుతున్నంతసేపూ ఎవరివో చూపులు నన్ను స్పృశించడాన్ని గుర్తించాను. ఆ చూపుల తాలూకూ వ్యక్తి అమ్మ. నాకన్నా ముందు షాపులోంచి బైటికెళ్లి నాకోసం ఎదురుచూస్తూ నిలబడింది.
క్రీమ్ కలర్ మైసూర్ సిల్క్ చీర, చేతులకి మూడేసి బంగారు గాజులు, మెడలో రెండుపేటల సూత్రాల గొలుసు, పోనీటెయిల్ తో నాకెంతో చిరపరిచితమైన అమ్మ. తనని గట్టిగా అల్లుకుపోయి గుండెల్లో ముఖం దాచుకోవాలనుకున్నాను అన్నీ మర్చిపోయి.
“అంత గొలుసమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చిందే?” ఖంగుమన్న తన గొంతునన్నంత దూరాన నిలబెట్టింది.
“ఈ పనికి నువ్వొచ్చావేంటి? అతనేడి?” రెండోప్రశ్న మా ఇద్దరికీ మధ్యని హేమంత్ అనే అగాధం ఉన్నట్టు గుర్తుచేసింది. తలదించుకున్నాను.
“వదిలేశాడా?”
చాలు, ఈ ప్రశ్నతో నా స్థాయి అమ్మ ముందు నిలబడ్డానికి కూడా సరిపడనంతగా దిగజారిపోయిందని అర్థమైంది.
“అంతా మనిద్దర్నే చూస్తున్నారు. కారెక్కు” అంది.
నేను నిశ్శబ్దంగా కారు దగ్గిరకి నడిచాను. ఎక్కబోయేముందు గోవీ కనిపించాడు.గోవీ అంటే గోవర్ధన్, హేమంత్ ఫ్రెండు. నన్ను ఆశ్చర్యంగా చూస్తుంటే చెయ్యూపి, కార్లో కూర్చున్నాను.
అమ్మకూడా ఎక్కి స్టార్ట్ చేసింది. ఎందుకో నాకేసి చూసి, “ముందా మెడలోంచీ పసుపుతాడు తీసెయ్” అంది చిరాగ్గా.
ఏమీ మాట్లాకుండా తీసి డేష్ బోర్డు మీద పెట్టాను. ఇరుకు గోడల్లోంచి విశాలమైన ఆరుబయటకి వచ్చినంత రిలీఫ్ కలిగింది.
“ఆస్తి, అంతస్తూ అన్నీ కాదనుకుని వచ్చారుగా, డబ్బెందుకు అవసరమైంది? ప్రేమ తిని, తాగి బతకలేకపోయారా?” అని అడిగింది. తన మాటల్లో కోపం వ్యక్తమైంది. నేనుమౌనం వహించాను.
“డబ్బంటే అసలేంటో తెలుసా?”
“…”
“స్టోర్ చేసుకున్న మేన్ పవర్. మీ నాన్న రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి సంపాదించేది ఈవేళ్టిది ఈవేళే ఖర్చు చెయ్యటానికి కాదు. ప్రిమిటివ్ బార్టర్ సిస్టమ్ నుంచి స్టాక్ ఎక్సేంజీల దాకా ఎదిగిన ఈ ఆర్థిక వ్యవస్థని నడిపే మాధ్యమం డబ్బుగా మారిన నేపథ్యంలో మనిషియొక్క శ్రమశక్తికూడా డబ్బు రూపంలోకి మారుతుంది”
అమ్మ చెప్తోంటే నేను మౌనంగా వింటున్నాను. తనకింత తెలుసనిగానీ, ఇంత బాగా మాట్లాడటం వచ్చనిగాని నాకు తెలీదు. తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు. తెలియబర్చుకునే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. ఈ ఒక్క విషయంలో తప్ప నేనెప్పుడూ తెలివిగానే ఉండేదాన్ని.
“….. దాన్ని తన ఇప్పటి అవసరాలకీ, రేపటి అవసరాలకీ, తన ముందు తరానికీ, రేపటి తరానికీ విభజించి వినియోగంచటమే కుటుంబ వ్యవస్థ. సమాజం కుటుంబాలుగా విభజించబడి ఉంది. యుక్తవయసొచ్చాక ఆడ, మగ పెళ్లి చేసుకుంటారు. ఆడపిల్లల తండ్రివాళ్ల భవిష్య అవసరాలని దృష్టిలో ఉంచుకుని తన శక్తికి తగినంత స్త్రీధనాన్ని ఇస్తాడు. మగపిల్లవాడి తండ్రి కొత్త జంట నిలదొక్కుకునేదాక ఆశ్రయం ఇస్తాడు. అది మరో కుటుంబంఏర్పడటానికి పునాదౌతుంది. ఇవన్నీ నీకు వివరంగా చెప్పి పెళ్లినీ తద్వారా వైవాహిక జీవితాన్ని అందంగా మలుచుకోవటం నేర్పించాలనుకున్నాను. అన్నూ…. నువ్వు చాలా తప్పటడుగులువేశావు” అంది.
“…”
“నాకు డబ్బు అక్కర్లేదు, నా కాళ్ళమీద నేను బతుకుతాను… ఇలాంటి మాటలు వినటానికి చాలా బావుంటాయి. కానీ అలా బతకడానికి చెల్లించే మూల్యం జీవనసౌందర్యం. దాన్ని పోగొట్టుకున్నాక అలాంటి మనిషి సమాజానికి ఎలా వుపయోగపడతాడు? అన్నూ! డబ్బనేది వుంటే దారులన్నీ ప్రపంచానికి అంటే… మన వికాసంవైపుకి తెరుచుకుంటాయి. నువ్వే దారి ఎంచుకున్నావనేది నీ జన్మ, కర్మ సంస్కారాలమీద ఆధారపడి వుంటుంది.  ఆ డబ్బు లేకపోతే దారులన్నీ డబ్బువైపుకే తిరుగుతాయి. ఏం చెయ్యాలన్నా డబ్బులేమి ఒక ఆటంకమౌతుంది”
ఆ తర్వాత మా మధ్య మౌనం చోటు చేసుకుంది. కారు ఇంటిదార్లో కాకుండా మరోవైపుకి వెళ్తోంది. ఎక్కడికని అడగలేకపోయాను. నా ప్రశ్నకి జవాబుగా హోటల్ ముందు ఆగాం .అమ్మ దిగింది. నేను తనని అనుసరించాను. ఫేమిలీ రూమ్ లో కూర్చున్నాం. ఎటూ కాని వేళ  కావటంతో అంతా ఖాళీగా ఉంది.
“నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతాను. ఏం చెయ్యమంటారో” అని, నాకు టిఫిన్ కి ఆర్డరిచ్చింది. టిఫెన్ వచ్చింది.  నన్ను తింటుండమని చెప్పి అమ్మ బయటికి వెళ్ళి దాదాపు అరగంట తర్వాత వచ్చింది. అప్పటికి నా టిఫిన్ పూరైంది.
“ఇంటికొద్దన్నారు. హాస్టల్లో వెయ్యమన్నారు. చదువుకో. తర్వాతేం చెయ్యాలో ఆలోచిద్దాం” అంది. తగలకూడని చోటెక్కడో దెబ్బ తగిలినట్టు విలవిల్లాడాను.
“గంటాగి మళ్లీ ఫోన్ చెయ్యమన్నారు. అన్నీ సెటిల్ చేసి ఉంచుతారట” అంది.
నేను అలిగీ, అన్నం మానేసీ అన్నీ సాధించుకున్నప్పటి అనుబంధాలేవీ మిగిలి లేవు. మిగిలున్నవల్లా వాళ్లకి బాధ్యత. అది కూడా వాళ్లు ఉందనుకుంటేనే! నాకు అవసరం. అమ్మ, నేను కలుసుకోవటం కేవలం కాకతాళీయం…. అంతే!


హాస్టల్లో చేరాను. మళ్లీ చదువు, కొత్త స్నేహితులు. బాధ్యతలేని జీవితం. కానీ మనసు  సీతాకోక చిలుకలా రెక్కలిప్పుకుని ఎగరలేదు. ఎగరలేనంత బరువుగా ఉంది. అనుభవం మనసునింత శిథిలపరుస్తుందా? మనుష్యులని దూరం చేస్తుందా?అనుబంధాలని తెంచుతుందా?నిశ్శబ్దపు రాత్రులలో నా కళ్లనుంచి వెచ్చటి కన్నీరు జాలువారేది. నిద్రపట్టక లేచి కిటికీ ముందు నిల్చుంటే నా మనసు నిండా ఉన్న చీకటే లోకమంతా పరుచుకున్నట్టు అనిపించేది. హేమంత్ ఎప్పుడోగానీ గుర్తొచ్చేవాడు కాదు. కానీ అతన్తో చేసుకున్న పెళ్లిలాంటిదాని పర్యవసానం నన్నెంత అవమానానికి గురి చేసిందో అది నన్ను దహించివేసేది.
అమ్మ ఎప్పుడేనా నాకు ఫోన్ చేసేది. నాన్న…. నాన్న మాత్రం ఇనుపతెర వెనకేఉండిపోయారు. నేనంటే ప్రాణం పెట్టే వ్యక్తులు వాళ్లిద్దరూ. అంత అభిమానాన్ని తెంచుకోగలిగారంటే వాళ్ల అహాన్ని నేనెంతగా గాయపర్చానో అర్థమౌతోంది. చదువుకని కాలేజికి పంపిస్తే ప్రేమకలాపాలు సాగించిన నామీద నాకే అసహ్యం వేసింది.పగలంతా క్లాసులు, చదువు, స్నేహితుల  సందడితో బాధనుంచి, జ్ఞాపకాలనుంచి  మనసు మళ్ళినా  రాత్రయేసరికి ఆ ఆలోచనలన్నీ నామీద దాడి చేసేవి. అలాంటి ఒక చీకటి రాత్రి నా భుజంమీద చెయ్యిపడింది. ఉలిక్కిపడి తలతిప్పాను. నా రూమ్మేట్ హరిణి.
“అన్నూ! ఏ మనిషీ పెర్ఫెక్షనిస్టు కాదు. పొరపాట్లు చేస్తుంటాం అవకాశం వచ్చినప్పుడు వాటిని సరిదిద్దుకోవాలి అంతేగానీ ఇంకా వాటినే తలుచుకుని బాధపడే ఎలా?”మృదువుగా అడిగింది.
నా ముఖంలోకి వెచ్చటి రక్తం చివ్వున ఎగజిమ్మింది. తనకి నా గురించి తెలుసా? ఎంతవరకు?తనొక్కదానికేనా? కాలేజిలో అందరికీనా?
“గోవీ చెప్పాడు. నువ్వొక తప్పుదారిలోకి వెళ్లావని, ఇప్పుడు సరైనదారిలోకి వచ్చావని” అంది నా కళ్లలోకి చూస్తూ.
“గోవీ నీకెలా తెలుసు?” విస్మయంగా అడిగాను.
“నాకు కాబోయే భర్త”
ప్రపంచం ఎంత ఇరుగ్గా ఉంటుంది! మనకి తెలిసినవాళ్లే మనచుట్టూ తిరుగుతుంటారు.
“ఇంకేం చెప్పాడు?”
“నీతో స్నేహం  చెయ్యమన్నాడు. హేమంత్ తో పరిచయానికి ముందు నువ్వెంత సరదాగా, ఉండేదానివో చెప్పి నా స్నేహంలో నువ్వు మళ్లీ అలా కావాలన్నాడు. దురదృష్టవశాత్తూ నాకు వెర్బల్ కమ్యూనికేషన్ అంత బాగా రాదు. కానీ నీ బాధని నేను అర్థం చేసుకోగలను. పంచుకోగలను. అయాం ట్రూలీ యువర్స్” అంది.
“థ్యాంక్యూ” అన్నాను తడికళ్ళతో.
తర్వాత కొద్ది రోజులకి గోవీ నన్ను కలుసుకున్నాడు.
“నిన్ను హేమంత్ కి పరిచయం చేసి చాలా పెద పొరపాటు చేశాను. కానీ…… నువ్వు అదృష్టవంతురాలివి. నీకిది పునర్జన్మ  అన్నూ! ఎవరూ ఇవ్వని అవకాశాన్ని నీకు నీ తల్లిదండ్రులు  ఇచ్చారు. జరిగిందంతా మర్చిపోయి చదువు పూర్తిచేసి వుద్యోగం సంపాదించుకుని  కనీసం ఇలాగేనా వాళ్ళని సంతోషపెట్టు” అన్నాడు బాధపడూ.
అతని మాటల్లో నిజాయితి ఉంది. ప్రోత్సాహంఉంది. ఆ రెండూ నన్ను కదిల్చాయి.ఆ తర్వాతెప్పుడూ మా మధ్య హేమంత్ ప్రస్తావన రాలేదు. నేను పూర్తిగా చదువుకే అంకితమైపోయాను.పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. కంప్యూటర్స్ లో సీ, వొరాకిల్, జావాలాంటివన్నీ చేశాను. ఇంటికెపుడూ వెళ్ళలేదు. రమ్మనకుండా వెళ్ళి నాన్నని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది.చదువవ్వగానే ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాను. జావా క్వాలిఫికేషన్ మీద తేలిగ్గానే ఉద్యోగం వచ్చింది. మూడు నెలల అప్రెంటిషిప్. తర్వాత వుద్యోగం. నిజంగానే పునర్జన్మ నెత్తినట్టనిపించింది.
“నాకొకసారి ఇంటికి రావాలనుందమ్మా” అన్నాను మొదటి జీతం తీసుకున్నాక అమ్మతో ఫోన్లో మాట్లాడినప్పుడు. అమ్మ వెంటనే జవాబివ్వలేదు. రెండు మూడు క్షణాల తర్వాత నెమ్మదిగా అంది. “రావటమే మంచిదిలే. నీకూ మీ నాన్నకీ మధ్యని మళ్ళీ సంబంధాలు మొదలౌతాయేమో! ఎంతకాలం ఒకరికొకరు ఏమీ కానట్టుంటారు? మాకున్నది మాత్రం ఎవరు?నువ్వొక్కదానివేగా?” అని అంది.
నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికి హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు నాన్న. నేను ఆఖరిసారి చూసింది, హేమంత్ తో ఇంట్లోంచి వెళ్ళిపోయేముందు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళతర్వాత… రానిస్తారా? ఎందుకొచ్చావని మండిపడతారా?
నా అలికిడికి తను తలతిప్పి చూసారు. కళ్ళలో అపనమ్మకం, విస్మయం. చప్పున బేగ్ లోంచి శాలరీ పేకెట్ తీసి తన పక్కన ఉన్న సోఫాలో ఉంచి వంగికాళ్ళకి నమస్కరించి వెళ్ళిపోయాను. వెళ్ళి వంటింట్లో నిలబడ్డాను… నాకెంతో ఇష్టమైన కిటికీముందు.
కిటికీ అవతల రకరకాల పూలు భావరహితంగా కనిపించాయి. వాటి భావరాహిత్యం నన్ను కలవరపరిచింది. కొద్దిసేపటికి గ్రహించాను. దృశ్యాన్ని చూసేది కంటితో. దానికి భావాలద్దేది మనసు. నా మనసిప్పుడు భావశూన్యంగా ఉంది. నేను వాస్తవాలని మాత్రమే గుర్తించగలుగుతున్నాను. ఎలాంటి భావాలూ లేని అననుభవైక వాస్తవాలని మాత్రమే!
తిరిగి ప్రయాణమయ్యాను. యూనివర్సిటీ హాస్టల్లోంచీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోకి మారాను.
జీవితమనేది ఇప్పుడు చాలా నిస్సారంగా అనిపిస్తోంది. ప్రేమలో పడడానికేనా పెళ్లి చేసుకోవటానికేనా బహుశా ఇది సరైన సమయమేమో!


హర్షిణి, గోవి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరికీ వుద్యోగాలు వచ్చాయి. హర్షిణి పోస్టల్లో అసిస్టెంట్ గా చేరింది. వుద్యోగం నచ్చలేదని  చెప్పింది రెండోరోజే. గోవీది ప్రైవేట్ జాబ్ .వాళ్ళ పెళ్ళికి ఇంట్లో పెద్ద యుద్ధం జరిగిందట. పెద్దవాళ్ళెవరికీ ఇష్టం లేదట. ఐనా వాళ్లని వప్పించగలిగారు. తరువాతి  జీవితం కూడా సవ్యంగా గడిచిపోతుంది.  వాళ్లకి ఎవరూ డబ్బు ఇవ్వక్కర్లేదు. అనుబంధాలని పెంచినా తుంచినా డబ్బే.
నాకు మంజు గుర్తొచ్చింది. స్టేట్స్ వెళ్ళాక ఒక్క లెటర్ కూడా రాయలేదు. నన్ను మర్చిపోయిందా? గుండెల్లో ఎక్కడో గుచ్చుకున్న భావన!
ప్రపంచాన్ని చదివిన జ్ఞానం ఇక్కడ కొంచెం ఉపయోగపడింది. నేను, మంజు ప్రాణస్నేహితులమి. నేను లవ్ మేరేజి చేసుకోవటం చూసి, తనూ అలా చేస్తుందేమోనని భయపడి పెళ్లి చేసి దూరం పంపేసారు  తన తల్లిదండ్రులు. అమెరికా వెళ్ళిపోయి, ఇంకా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ ఎంజాయ్ చేస్తోందేమో మంజు! నాలాంటి తెలివితక్కువది తనకి గుర్తుండనక్కర్లేదు. బహుశా తను హేమంత్ తో కాంటాక్ట్ లో ఉందేమో! బిట్టర్ గా అనుకున్నాను.


సూర్యప్రకాష్ నా కొలీగ్. ఈ ప్రపంచంలో నన్ను పూర్తి పేరుతో పిలిచే వ్యక్తంటూ ఎవరేనా ఉన్నారంటే అది అతనొక్కడే. “అనూషా” అని అతను పిలిచినప్పుడు నాకు నేనే అపరిచిత వ్యక్తిలా అనిపిస్తాను. ఆరోజు కంప్యూటర్ లేబ్ లో మేమిద్దరమే ఉన్నాం.
“ఐ లవ్ యూ” హఠాత్తుగా స్క్రీన్ మీద అక్షరాలు కనిపించాయి.
ఆశ్చర్యంగా  తలతిప్పి చూశాను. సూర్యప్రకాష్ అల్లరిగా నవ్వుతున్నాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పటికప్పుడు సిస్టమ్ షట్  డౌన్ చేసేసి, ఆపూటకి సెలవు పెట్టి రూమ్ కొచ్చేశాను. చదువుకున్న వాళ్ళూ, చదువుకోనివాళ్ళూ, ఎదిగినవాళ్ళు, పరిపక్వత లేనివాళ్ళూ… అంతా మంత్రంలా జపించే ప్రేమ  … ఏమిటది? అదో జవాబు దొరకని ప్రశ్న…. పరిష్కారం లేని సమస్య


“మనింటికొక ముఖ్యమైన అతిథి వస్తున్నాడు. అతను నిన్ను ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నాడు. ఒకసారి వచ్చి వెళ్ళు” అంది అమ్మ ఫోన్ చేసి.
ఎవరా అతిథి? అంత  ముఖ్యమైనవాడు?మా బంధువులతో నాకు సంబంధాలు లేవు. నేను ఎలాంటి  శుభాశుభకార్యాలకీ వెళ్ళను.మరి నన్ను ప్రత్యేకించి కలవాలనుకుంటున్న వ్యక్తి ఎవరు? ఏదైనా పెళ్లిసంబంధమా?హేమంత్ గుర్తొచ్చాడు. అప్పటి రోజులు, అప్పటి సరదాలు, ఆ తర్వాతి వైఫల్యం.ఇవన్నీ మనసులో అలాగే ఉన్నాయి. వాటిని అలాగే సజీవంగా ఉండగా  నేను మరో వ్యక్తితో జీవితం పంచుకోగలనా? సూర్యప్రకాష్ తోగానీ, మరొకర్తోగానీ….?కొన్ని నెలలు మాత్రమే ఉన్న ఆ అనుబంధంలో నేను కోల్పోయినదేమిటో అర్థమైంది…  ఫ్రెష్ నెస్. మానసిక స్వాస్థ్యత. ఇష్టం లేకపోయినా అమ్మ పిలిచిందని వెళ్ళాను.నేను వెళ్ళేసరికి అతనొచ్చి ఉన్నాడు. హాల్లో కూర్చుని అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి నాకు కనిపించినది అతని వెనుకభాగం మాత్రమే.అస్పష్టమైన ఏవో పోలికలు. వాటిని గుర్తుపట్టేలోపే అతను నా అడుగుల చప్పుడుకి తలతిప్పాడు. నేను స్థాణువయ్యాను. క్షణం సేపే. గబగబా లోపలికి వెళ్ళిపోయాను. నా గదిలోకికాదు, నా మనసుకి అద్దంపట్టే కిటికీ దగ్గరకి, వంటింటి కిటికీ దగ్గరకి.
చువ్వల్ని పట్టుకుని మొక్కల్ని పిచ్చిగా చూస్తూ నిల్చున్నాను.  చేతులు చువ్వలమీద బిగుసుకున్నాయి. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు నావి నాకు పెద్ద చప్పుడుగా వినిపిస్తున్నాయి.  గుండె వడివడిగా కొట్టుకోవడం తెలుస్తోంది. “అన్నూ”! అమ్మ పిలుపు వినిపించింది.
“వచ్చి కూర్చో. అతను నీతో మాట్లాడతాడట” అంది అమ్మ.                 
“నాకతనితో ఏమీ మిగిలిలేవమ్మా! క్షమించు. అప్పుడూ ఇప్పుడూ కూడాఈ విషయంలో మీమాట వినలేకపోతున్నాను” తల తిప్పకుండానే చెప్పాను.
అమ్మ నిట్టూర్చడాన్ని విన్నాను. కొద్దిసేపలాగే నిల్చుని వెళ్ళిపోయింది. మళ్ళీ అడుగుల చప్పుడు. ఈమాటు అమ్మదికాదు. నాగుండె కొట్టుకునే వేగం పెరిగింది.అమ్మానాన్నల ముందు, ఈ సమాజం ముందు నన్ను దోషిగా నిలబెట్టిన వ్యక్తినాతో ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడబోయినా నేనెందుకు వినాలి?
“అన్నూ!” మెల్లిగా పిలిచాడతను.
“ఏంటి?” కటువుగా అడిగాను. అతను తడబడలేదు. ఇదివరకట్లా కోపం తెచ్చుకుని మండిపడలేదు. మాటలు విసరలేదు
.“చూడు, ఇద్దరం కలిసి చేసిన పొరపాటుని తిరిగి మనిద్దరమే సరిదిద్దుకుంటే బాగుంటుందని వచ్చాను. కొద్దిసేపు కోపాలు, పంతాలు, పట్టుదలలూ వదిలిపెట్టి మాట్లాడుకుంటే ఒక నిర్ణయానికి రాగలుగుతాం” అన్నాడు చాలా నిలకడగా. నేను చివాల్న వెనక్కి తిరిగాను. “ఏం మాట్లాడాలి?” హేళనగా అడిగాను. “ఇప్పుడు నాకు వుద్యోగం వుంది . నా భారం నీకుండదుగాబట్టి మళ్ళీ ఆట కొనసాగిద్దామనా?”
“ష్…. సిల్లీగా మాట్లాడకు జరిగిన దాంట్లో మనిద్దరి తప్పూ ఉంది. సరిచేసుకుందామని చెప్తున్నాను.”
“ఎప్పుడు కలిగింది నీకా జ్ఞానోదయం? నాకు ఉద్యోగం వచ్చినట్టు తెలిశాకనా?ఎలా తెలిసింది? గోవీ చెప్పాడా?” నేనంత తీవ్రంగా మాట్లాడినా అతను కోపం తెచ్చుకోలేదు.
“నీ వుద్యోగం సంగతి ఇక్కడికొచ్చాకే తెలిసింది. నేనొచ్చినది నా ఉద్యోగం గురించి చెప్పి, నాతో వస్తావేమోనని అడగడానికి. నేను ఎదురుచూసింది. ఇలాంటి క్షణం కోసమే. అన్నూ! మనం తొందరపడి పెళ్ళి చేసుకుని నష్టపోయినా, డబ్బులేక విడిపోయి నష్టపోయినా సమానంగా నష్టపోయాం. మళ్ళీ కలుసుకుంటేనే అది తీరేది” అన్నాడు మృదువుగా.
అంత మార్ధవ్యాన్ని నేను తట్టుకోలేకపోయాను. ఏడ్చేశాను. అతను చిన్నగా నవ్వాడు.
“నేను నిన్నెప్పుడూ ఓ ఆడపిల్లవనో, నాకన్నా తక్కువదానివీ, సున్నితమైన ప్రాణివనో అనుకోలేదు. నాతో సమానంగా భావించాను. నా భాగస్వామివనుకున్నాను. అందుకే నీ బాధ్యతని నేనెప్పుడూ ఫీల్ చెయ్యలేదు. అన్నూ…. నిన్ను నేనే రాజుల అంతఃపురంనుంచో ఎత్తుకొస్తే…. లేక నువ్వీ వంటింటి కిటికీ వెనక నాలుగ్గోడల మధ్యా బందీగా ఉంటే లేపుకుపోతే నీ బాధ్యత నాది. కానీ మనం కాలేజీ కేంపస్ లో కలుసుకున్నాం. ప్రేమించుకున్నాం. వన్ బై టూ ఐస్ క్రీం తిన్నాం. బిల్స్ పంచుకున్నాం. నా పాకెట్ మనీ చాలకపోతే నిన్నడిగేవాడిని. నీక్కావల్సినవి కొనేవాడిని. ఐ లవ్ యూ అని అనగానే సిగ్గుతో తలొంచుకోకుండా ఐటూ అని చెప్పి నీ సమానత్వాన్ని చూపించుకున్నావు. ఇట్సిట్….”
అన్నీ నిజమే! అతను నాకన్నా ఎక్కువని ఎప్పుడూ నేననుకోలేదు.
“ఆరోజు నీతో దెబ్బలాడి నేను మా ఇంటికి వెళ్ళాను. అన్నూ! ఆ క్షణాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేను. దారితప్పి కుక్క ఇంట్లోకొస్తే ఎలా చూరో అలా చూశారు ఇంట్లోవాళ్ళు నన్ను. అయినా అభిమానాన్ని చంపుకుని అమ్మనడిగి కొంత డబ్బు తెచ్చుకోవాలనుకున్నాను. డబ్బు లేకుండా ఎలా?”
“నాతో చెప్పచ్చుగా?”
“చెప్పటానికి ముందు మనం దెబ్బలాడుకున్నాం”
“…”
“ఇంతలొకే గోవీ వచ్చి నీ విషయం చెప్పాడు. నాకోలాంటి నిశ్చింత కలిగింది. నీమంచిచెడులు మీవాళ్ళింక చూసుకుంటారన్న నిశ్చింత. గోవీ కూడా అదే చెప్పాడు. నిన్నింక కలవద్దని హెచ్చరించి వెళ్ళాడు.”
“……”
“నన్ను వెళ్ళి పొమ్మని అమ్మావాళ్ళూ అనలేదు. నాన్న మాత్రం ఇంకోసారి ఇలాంటి వేషాలేస్తే ఊరుకోనని చెప్పాడు.”
“మగపిల్లాడివికదా! చెయ్యి దాటిందనుకున్న కట్నం తిరిగొచ్చిందనుకుని ఉంటారు” మరో వ్యంగ్యం విసరకుండా ఉండలేకపోయాను.
అతను హర్టయ్యాడు. నెమ్మదిగా నా దగ్గిరకొచ్చి మృదువుగా నా భుజంమీద చెయ్యేసి నన్ను తనవైపు తిప్పుకున్నాడు. సూటిగా నా కళ్ళలోకి చూస్తూ అడిగాడు. “నీలోఫ్రెండ్లీనెస్ కొంచెం కూడా లేదేంటి అన్నూ? ఎందుకు నన్నింత ద్వేషిస్తున్నావు?” అతని గొంతు వణికింది. నేను చూపులు మరల్చుకున్నాను. ఏమీ జరగనట్టు ఎంత మెత్తగా అడుగుతున్నాడు? ఎంత అవమానపడ్డాను అందర్లో! ఇప్పటికీ మాట్లాడని నాన్న….. మాట్లాడి అన్నీ చేసినా దూరాన్ని నిర్దేశించే అమ్మ…. ఎవరితోటీ కలవలేని న్యూనత…. వీటన్నింటికీ ఎవరు జవాబు చెప్తారు? అతనికేం…. మగవాడు? నిరసనగా అనుకున్నాను.
“నీతో సమానంగా నేనూ అవమానపడ్డాను అన్నూ!” నా మనసు చదివినట్టుగా అన్నాడు. “సమాజం నిర్దేశించిన హద్దుల్ని దాటితే ఆడేనా మగేనా ఒకటే. దాన్ని పట్టించుకోవడం. పట్టించుకోకపోవడం మనలోనే ఉంటుంది. అప్పటిదాకా నన్నో చిన్నపిల్లాడిలా చూసిన అక్కయ్యల దృష్టిలో నేను మగవాడిగా ఎదిగిపోవడం. ఏరోయ్, పెద్ద హీరోవయ్యావుటఅని అంకుల్స్ పరిహాసం చేయడం, అప్పటిదాకా నోట్సుకోసం సబ్జెక్ట్ లో డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం నా చుట్టూ తిరిగిన జూనియర్స్ , ఫ్రెండ్స్,’ ఈ లవ్ లెటర్ రాసి పెట్టుగురూ! ‘అనో, ‘ఆ పిల్లకెలా లైనెయ్యాలి గురూ’ అనో, అడుగుతుంటే ఓహ్! నరకం చూసాను!” హేమంత్ గొంతు వణికింది.
నేను ప్రతిఘటన మర్చిపోయి వింటున్నాను. అతనెంతో సెన్సిటివ్. చిన్నమాటకూడాపడే మనస్తత్వం కాదు. అలాంటిది ఇవన్నీ ఎలా సహించాడు? “లాస్ట్ స్ట్రా ఎప్పుడు పడిందో తెలుసా అన్నూ?  అక్కలు, అమ్మా వాడిని మా ఇళ్ళకు పంపకు, మా ఆడబడుచులుంటారు, వీడక్కడేవైనా వెధవ్వేషాలేస్తే మా అత్తగారు ఆక్షేపిస్తుంది అన్నప్పుడు.”
“హే… మం…..త్…..!”
“అన్నూ! మన ప్రేమని పునరుద్ధరించుకోవడం కాదు ఇప్పుడు ముఖ్యం. మనం మళ్ళీ కలుసుకుని మనది ప్రేమేనని ప్రకటించి, పోయిన గౌరవాన్ని తిరిగి పొందడం” అని ఒక్క క్షణం ఆగి, “కానీ ఒక్క విషయం మాత్రం నిజం…. నువ్వు, నమ్మినా, నమ్మకపోయినా అది ప్రేమౌనో కాదో నాకు తెలీదు. నువ్వు కాదంటే ఇలాగే ఉండిపోతానుగానీ ఇంకో అమ్మాయిని మాత్రం భార్యగా ఒప్పుకోను. అలాగని నిన్ను బలవంతం కూడా చెయ్యలేను. ఎందుకంటేమరోసారి మనం పశ్చాత్తాప పడే పరిస్థితి రాకూడదు” అన్నాడు.
అతని మాటలు విన్నాక నా మనసు మంచులా కరిగిపోయింది. అతనన్నట్టు మేం మళ్ళీ కలిసుంటే మాది ప్రేమగా నిరూపించబడుతుంది. అందరూ మమ్మల్నిపొగుడుతారు. ఎంతోమంది మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ప్రేమలో పడ్డారు. అదంతాలోకం కోసం, మరి నాకోసం? సూర్యప్రకాష్ గుర్తొచ్చాడు. అతనికి నేనేదో ఒక జవాబు చెప్పాలి. సరేననే అవకాశం నాకు లేదు. వాస్తవం చెప్పి బంతిని అతని కోర్టులోకి వదలగలనంతే, అలా కాకపోతే నో చెప్పి హుందాగాతప్పుకోవడం. హేమంత్… సూర్యప్రకాష్… ఈ ఇద్దరి మధ్యా నా మనసు డోలాయమానంగా ఉంది.
నేను ఆలోచనలో పడడం చూసి హేమంత్ అన్నాడు. “సరే, ఆలోచించుకో.  నేను రేపే ముంబై వెళ్తున్నాను జాయినవ్వడానికి. వెళ్ళాక ఫోన్ చేస్తాను” అన్నాడు వెళ్ళడానికిఉద్యుక్తుడయ్యి. మరికాసేపటికి వెళ్ళిపోయాడు.
నాలో ఎలాంటి చలనం లేదు.అమ్మ వచ్చింది. నేనింకా అలాగే నిల్చుని ఉండడం చూసి, “ఏముందా చీకట్లోచూడడానికి? అతనన్నట్టు వంటింటి కిటికీ స్త్రీ బానిసత్వానికి నిదర్శనం. నీకు నేను పూర్తి స్వేచ్ఛనిచ్చినా ఎందుకు  వుపయోగించుకోవు?” అంది.
“ఒకసారి దుర్వినియోగం చేశాక నాకు స్వేచ్చంటే భయంగా ఉంది” అన్నాను.
“నాకు పద్దెనిమిదేళ్లకి పెళ్లైంది. ఆ వయసు వస్తూనే పెళ్ళి చెయ్యాలని ఇంట్లోవాళ్ళు తొందరపడ్డారు.నీకూ ఆ వయసుకి మనసు వికసించింది. వాస్తవానికి పెళ్ళి చెయ్యాలి మేం. కానీ రోజులు మారిపోయాయనుకున్నాం. ఎక్కడ మారాయి? మొగ్గ విచ్చుకోవడం మానిందా? చెట్టు చిగురెయ్యటం మానిందా? వసంత ఋతువు రాక ఆగిందా? “
నేను జవాబు చెప్పలేదు.
“అష్టవర్షసాలంకృత కన్యని లక్ష్మీనారాయణ స్వరూపుడని భావించిన వరుడికి శాస్త్రోక్తంగా దానమిచ్చి,  వాళ్లు వ్యక్తులయేసరికి తరువాతి మెట్టుని పరిచేవారు. బాల్యవివాహవ్యవస్థ పోయింది.  కళ్ళలో పెట్టుకుని కాపాడుకున్న కూతుర్ని యుక్తవయస్కుడైన వరుడికి ఇచ్చి చేస్తే అతడు గుండెల్లో పెట్టుకు చూసుకునేవాడు. కలకంఠి కంట కన్నీరొలికిన అని భయపడి కన్నీరొలకనివ్వని రీతి ఆమెని చూసుకునేవాడు. అదయింది. అవసరాలు పెరిగాయి. జీవనం సంక్షుభితమైంది. ఆడపిల్ల మగవాడికి ఆదాయవనరుగా మారింది.  హింసపడింది, పీడింపబడింది. తండ్రి గుండెల్లో స్థానాన్ని పోగొట్టుకుని గుండెలమీది కుంపటైంది”
“…”
“తనేమిటని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నకి ఆఖరి రూపమే ఇప్పటి స్త్రీ. అన్నూ! ఇవన్నీ బాహ్యం. సమాజమనే తొడుగుకి వచ్చిన మార్పులు. ఆంతరంగికమైనది ఏదీ మారలేదు. పధ్నాలుగేళ్ళకి వ్యక్తులౌతున్నారు. ఎండార్ఫిన్లు పుడుతున్నాయి. సృష్టి కొనసాగించమని  ప్రకృతి ప్రేరేపిస్తుంది.  కొంతమంది ఆ పిలుపుని గుర్తించరు. ఇంకొందరిని అదొక వేణుగానంలా ఆకర్షిస్తుంది. పిల్లలు ప్రకృతి పిలుపుని గుర్తించకూడదని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ తమ ఆకాంక్ష పిల్లలకి విడమరిచి చెప్పరు.  అందుకే కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి”
“…”
“ఒక పొరపాటు జరిగిపోయింది.  దాన్ని సరిదిద్దుకునే అవకాశం నీ ముందు వుంది.  మరేంటి సమస్య?”
“…”
“మేం మగవాడితో సమానంగా చూడబడాలని ఆరాటపడేవాళ్ళం. అలా ఎవరూ చూడరని అర్థమయ్యేసరికి ఈ వయసొచ్చింది. మరతను నిన్ను తనతో సమానమని చెప్తున్నా నీకెందుకింత ఆలోచన?”
“అంటే? అతను నన్నొదిలి పెట్టేసి వెళ్ళిపోయినపుడుకూడా మౌనంగా ఊరుకుని అదీ సమానత్వంలోని భాగమే అనుకోవాలా? “రోషంగా అడిగాను.
“మీ ఇద్దరికీ అంత గొడవెందుకొచ్చింది?”
“డబ్బు దగ్గరేనా?”
“…”
“నిన్ను డబ్బు తెమ్మన్నాడా అతను?”
“ఊహూ ….”
“మరి? అతనే డబ్బు తెచ్చి నిన్ను పోషించాలనుకున్నావా?” ఛెళ్ళుమని చరిచినట్లైంది అమ్మ ప్రశ్నకి.
నేను జీన్ ఫ్యాంట్సు, టీషర్టులు వేసుకుంటాను. స్కూటీమీద తిరుగుతాను. కొన్నాళ్ళు క్రాఫ్ కూడా చేయించుకున్నాను. కాలేజీకెళ్ళిచదువుకున్నాను. ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నాను. అంతవరకేనా అభ్యుదయం? నేను భావసామ్యాన్ని గురించి ఆలోచించాను. అతను ఆర్ధిక సమానత్వాన్ని ఆశించాడు.దండిగా కట్నకానుకలు తెచ్చిన అమ్మాయికి అత్తింట్లో గౌరవం ఉంటుంది.సంపాదించే భార్యకి భర్త దగ్గర విలువ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ విలువైన కానుకలు  ఇవ్వాలని ఆడపిల్లలు ఆశపడుతున్నారు. పెళ్లి చేసుకునేసరికే అన్నీ అమరిపోవాలనీ, జీవితం హనీమూన్ లా వుండాలనీ ఇద్దరూ కలిసి కోరుకుంటున్నారు. ఏ సంపాదనా లేనప్పుడు మేం పెద్దవాళ్ల నెదిరించి పెళ్ళి చేసుకున్నాం. కలలుకూడా కనలేనంత పేదరికంలోకి జారిపోయాం.నేను హేమంత్ నెందుకు కాదనలేక పోయాను? నాలోకూడా ఆ కోరిక ఉందా అప్పుడు? పెళైతే తప్పుకాదనే ఎస్కేపిస్టు సిద్ధాంతాన్ని ఆశ్రయించానా? కాదంటే అతనికి కోపమొస్తుందని భయపడ్డానా?నిజమే! ఏ ప్రేమేనా మాట్లాడుకోవటం, ఆంతరంగిక విషయాలు పంచుకోవటం, చేతులు పట్టుకుని కళ్ళలోకి చూసుకుంటూ గంటలతరబడి కూర్చోవటం వరకూ చాలా బాగుంటుంది. ఎప్పడైతే మగవాడు శారీరక సాన్నిహిత్యం కోరుకుంటాడో స్త్రీ పెళ్లికి తొందరపడుతుంది. పరిస్థితి మారిపోతుంది. జరిగినదాన్నంతా? విశ్లేషించుకుంటే అందులో నా తప్పే బలంగా కనిపిస్తోంది.తప్పు చెయ్యడంకన్నా తప్పని తెలిసీ దానికి సహకరించడం ఇంకా పెద్ద తప్పు. ఇంకా నా ఆలోచనలు ఒకదారికి రాలేదు. బంతిని సూర్యప్రకాష్ దగ్గరకు విసరాలనిపించింది.
అతని నెంబరు డయల్  చేశాను. ఎవరో చిన్నపాప ఎత్తింది. “హలో! మీరు అనూషనా! మీరు ఫోన్ చేస్తే లేనని చెప్పమన్నాడు. మా బాబాయ్.  చెప్పేశానుగా………. బై” పెట్టేసింది.
ఆ చిన్న గొంతుకి నేర్పించిన  డైలాగ్స్ నా గుండెలో సూటిగా దిగాయి. తలగిర్రుమని తరిగింది. సూర్యప్రకాష్…..దిగ్ర్భాంతిగా అనుకున్నాను. నాతో ఐలవ్ యూ అన్నాక అతను నన్ను తప్పించుకు తిరగడం గుర్తొచ్చింది. సిగ్గుపడుతున్నాడనో లేక నాకు కోపం ..వచ్చిందని భయపడుతున్నాడనో అనుకున్నాను. నా గురించి నేను చెప్పేలోగా మరో దార్లో తెలుసుకుంటాడని ఊహించలేదు. తిరస్కారం…. ఇంత మొరటుగా  ఉంటుందనుకోలేదు. ఏమీ తెలుసుకోకుండా ప్రేమించానని చెప్పటమేమిటి? చెప్పాక నిర్ణయాన్ని మార్చుకోవటమేమిటి? ఇదెలాంటి ప్రేమ?కాంట్రాస్ట్ లో  నాకు హేమంత్ గుర్తురాలేదు. పెరట్లోని పూలు గుర్తొచ్చాయి.పెరట్లోని పూలు! విచ్చుకోవాలని ఎంతో ఆశగా ఆకాశంకేసి చూసి, విచ్చుకుని నిరర్ధకంగా రాలిపోతాయి. వాటికెలాంటి అనుభవాలూ ఉండవు. వంటింటి కిటికీ వెనకే నేనూ ఉండిపోతే నాకు అనుభవాలుండేవికాదు. ప్రపంచం మన చుట్టూ తిరగదు. అనుభవాలని వెతుక్కుంటూ ప్రపంచంలోకి మనమే వెళ్తాం. సంభవించాకగానీ వాటి తీవ్రత తెలీదు. నేను హేమంత్ తో పొందిన జీవితానుభవాలవలన పాఠాలు నేర్చుకుని ఉన్నాను. ఆ అనుభవాలు వీధివాకిలిలాంటివి. నేను మళ్ళీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే అందులోంచే వెళ్ళాలి.
ఫోన్ మోగింది. ఎత్తి “హలో!” అన్నాను. కొద్ది క్షణాల తర్వాత డిస్కనెట్టింది. మళ్ళీమళ్ళీ రింగౌతూనే ఉంది. అన్ని బ్లాంక్ కాల్సే. నా గొతు విని పెట్టేస్తున్నారు.
“ఎవరు?!!!”


తర్వాతెప్పుడో చాలాకాలానికి హేమంత్ మా పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోన్ చెయ్యడం నేర్పిస్తూ చెప్తున్నాడు. “అమ్మకి మనిషి ఎదురుగా ఉండి చెప్పే మాటలక్కర్లేదు.బ్లాంక్ కాల్స్ కోసం కావాలంటే ఎన్ని గంటలైనా ఎదురుచూస్తూ   వుండగలదు”  

(విపుల 2001)                                  

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s