నువ్వెవరు? by S Sridevi

“ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం నిజమేనట. ఇంకా ఏవో ఆధారాలు దొరికాయని శ్రీరామచంద్రమూర్తి పోస్టు పెట్టాడు” అంటూ వచ్చి కూర్చుంది పరిమళ.
“శ్రీరామచంద్రమూర్తే పెట్టాడంటే వప్పుకుని తీరాల్సిన విషయమే” పరిహాసంగా అన్నాడు చంద్ర.
చంద్ర ఇంకా అంటునే వున్నాడు, అతను రానే వచ్చాడు.
వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. శ్రీరామచంద్రమూర్తితో కలిసి చదువుకున్నారు. ఎక్కడెక్కడో వుద్యోగాలు చేసి రిటైరయాక స్వంతయిళ్ళలో పక్కపక్కని స్థిరపడ్డారు. వాళ్ళకిద్దరూ, వీళ్ళకిద్దరూ పిల్లలు. దేశదేశాల్లో వుద్యోగాలు చేసుకుంటున్నారు. శ్రీరామచంద్రమూర్తి భార్య జానకి ఆర్నెల్లు అమెరికాలో, ఆర్నెల్లు ఇక్కడా వుంటుంది. ఇక్కడుండే ఆర్నెల్లలోకూడా రెండునెలలు పుట్టింట్లో వుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆవిడ వివాహబంధాన్ని వదులు చేసుకుంది. అతను ఎక్కడికీ వెళ్ళడు. వెళ్ళినా వారమో, పదిరోజులో. అంతే.
ఫేస్‍బుక్‍లోనూ, వాట్సప్‍లోనూ, ఇతర సోషల్‍మీడియా యాప్‍ల్లోనూ గగనవిహారం చేస్తూ సమాచారం సేకరిస్తుంటాడు.
“రారా! నీగురించే అనుకుంటున్నాం” అన్నాడు చంద్ర. ఆత్మీయపరిహాసంతో అతని ఆహ్వానిస్తూ. పరిమళ అతనికి జూస్ తెచ్చి యిచ్చింది.
“ఇంతకీ ప్రయాణమెప్పుడు?” అడిగాడు చంద్ర.
“ఎక్కడికీ?!” ఆశ్చర్యపోయాడు శ్రీరామచంద్రమూర్తి.
“ఆర్యులదండయాత్ర నిజమటకదా? మరి ఇరానువాళ్ళకి దేశం అప్పజెప్పేసి మనం వెళ్ళిపోవద్దూ?”
పెద్దగా నవ్వేసాడు శ్రీరామచంద్రమూర్తి. “ఎప్పుడో చరిత్రలో జరిగిన విషయాలు. సోషల్‍మీడియాలో చూస్తుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి” అన్నాడు.
“నాదిర్ షా వారసులెవరేనా వున్నారేమో, ఎవరూ వెతికి బైటపెట్టలేదా?”
“మొగలుల వారసులు పోటీకొస్తారేమో!”
“సరేగానీ, నాకో డౌటు…”
“ఏమిటది?”
“ఇరానంటే పర్షియా కదా? పర్షియన్ సామ్రాజ్యం స్థాపించబడినది 550 బీసీలోనట. మరి వాళ్ళు, వాళ్ళకో రాజ్యం ఏర్పాటు చేసుకోకుండానే మనమీదికి దండయాత్రకి వచ్చారంటావా?”
“నీ యక్షప్రశ్నలకి నేను జవాబులు చెప్పలేనొరే. గ్రూపులో పెడతాను. ఎవరేనా చెప్తారేమో చూద్దాం”
“ఈవేళెందుకో నన్ను యక్షుడు ఆవహించినట్టే వుంది. నిన్న మా పెద్దాడు ఫోన్ చేసి ఇండియన్స్ అంటే బైట ఎందుకు చులకనగా చూస్తారని మిస్సైల్‍లాంటి ప్రశ్నొకటి వేసాడు. అప్పట్నుంచీ యక్షుడు నా చుట్టే తిరుగుతున్నట్టు గమనించాను”
చంద్ర మాటలకి పరిమళ నవ్వాపుకుంది. ఇద్దరూ కలిసి శ్రీరామచంద్రమూర్తిని ఎంతేనా ఆటపట్టిస్తారు.
“సరే, ఇది చెప్పు. మనది కృష్ణా గోదావరీ పరీవాహకప్రాంతంకదా? మనం సింధులోయనాగరికతకి ఎప్పుడు షిఫ్టయాం?”
“అంటే?”
“హిందువులం ఎప్పుడయామని?”
శ్రీరామచంద్రమూర్తి గబగబ గ్రూపులో పెట్టాడు. నిముషంలో పది లైకులు నాలుగు లవ్వులు వచ్చాయి. అతని కళ్ళు మెరిసాయి.
“ఆర్యులు దండయాత్ర చేసినప్పుడు అక్కడినుంచీ పారిపోయి యిటు వచ్చేసి వుంటారు”
“అంటే మనం ద్రావిళ్ళం కాదా? యుద్ధంలో ఓడిపోయి పారిపోయి వచ్చినవాళ్ళమా?”
“ఛ ఛ… అలా అయుండదు. తరుముకొచ్చి ఇక్కడ స్థిరపడ్డవాళ్ళం కావచ్చు”
“అంటే దౌర్జన్యంగా వీళ్ళ నేల ఆక్రమించుకున్నవాళ్ళమంటావా?”
“తల తిరిగిపోతోందిరా, నీ ప్రశ్నలకి. ఎవరూ ఈ సబ్జెక్టుని ఇలా డిసెక్ట్ చేసి వుండరు”
“చెప్పాగా, ఇప్పుడు నా కొడుక్కి జవాబు చెప్పాలని… సరేగానీ, కాసేపు రాముణ్ణీ, కృష్ణుణ్ణీ దేవుళ్ళనుకోవటం మానేసి, రాజులని అనుకుందాం. వింధ్యకి అవతల ఆర్యావర్తం. ఇవతల దక్షిణాపథం. రాముడనే రాజుగారొచ్చి, దక్షిణాపథంలో వున్న ఆటవికులందర్నీ చంపి ఆర్యసంస్కృతి ఇక్కడ విస్తరింపజేసాడు… అలాంటప్పుడు మనకి రాముడు దేవుడెలా అయ్యాడు? కోపం రావాలిగాని?”
“కళ్ళు పోతాయొరే”
“సరే అనన్లే. జై యక్షా! జైజై యక్షా! మరో ప్రశ్న. రాముడెక్కిన పడవవాడి పేరు, రాముడు చంపిన రాక్షసుల పేర్లు, రాముడికి పళ్ళు పెట్టినావిడ పేరు ఇవ్వన్నీ మనకి తెలుసుగానీ రాముడి కాలంలోనూ ఆంధ్రరాజ్యం, అశ్మకరాజ్యం వున్నాయికదా, ఆ రాజులెవర్రా?”
“ఆంధ్రరాజ్యమంటే తెలుసుగానీ ఈ అశ్మకరాజ్యం ఏమిట్రా మధ్యలో?”
“బోధన్ రాజధానిగా వున్న తెలంగాణాలే”
“ఏమిటి, మనకి రెండు తెలుగు రాజ్యాలే?!”
“తెలుగురాజ్యాలనకు. రెండూ నార్త్‌వాళ్ళే స్థాపించారటలే. ఆంధ్రరాజ్యమేమో యయాతివంశస్తులు, అశ్మకరాజ్యమేమో రాముడి పూర్వీకుడూను”
“నీకెలా తెలుసు, ఇవన్నీ?”
“తర్వాతి ప్రశ్న. మనం ఆంధ్రులం. విశ్వామితృడు శునస్సేపుడి కేసులో శపిస్తే పారిపోయి వచ్చినవాళ్ళమా, లేకపోతే ఇక్కడి సహజప్రాణులమా?”
“…”
“మహాభారతయుద్ధం జరిగిందంటనా? అదీ అబద్ధమేనా?”
“కొందరు జరిగిందంటున్నారు, కొందరు లేదంటున్నారు. వాళ్ళూ, వీళ్ళూ కూడా బలంగానే చెప్తున్నారు”
“కదా? ధృతరాష్ట్రుడి భార్య, వుపభార్యల పిల్లల పేర్లు, వాళ్ళ దాసదాసీజనంపేర్లు అన్నీ మనకి తెలుసు. అశ్మకులు కౌరవులవైపు, ఆంధ్రులు పాండవులవైపూ యుద్ధం చేసారట. అశ్మకరాజు అనే కేరక్టర్ అభిమన్యుడు చంపిన లాక్షా ఒకటోవాడని రాసి వుంటుంది. వాడి పేరేమిటి? తెలిసినా చెప్పకపోయావో…?”
“అలా బెదిరించేవాడు యక్షుడు కాదు, భేతాళుడు”
“ఈమధ్య వాడుకూడా బెదిరించడం నేర్చుకున్నాట్ట. తప్పట్లేదట, ఈ ప్రశ్నలకి జవాబులు రావాలంటే”
“పాస్…”
“సరే, బుద్ధుడు ఎప్పటివాడు?”
“623 బీసీ వాడని చెప్తున్నారు”
“మౌర్యచంద్రగుప్తుడి కాలంవాడట”
“ఐతే?”
“అది సరిచెయ్యడానికే ఆయన మనవడు అశోకుడూ, శాతవాహనులోళ్ళ శ్రీముఖశాతకర్ణీ ఒక్క బళ్ళో చదువుకుని, ఒక్కసారే చక్రవర్తులై రాజ్యం పాలించారని సిద్ధాంతం చెప్తున్నారు. ఐనా తూస్…తూస్… నేనడగాలి, నువ్వు చెప్పాలి”
“ఇంకా అడగాలా?” శ్రీరామచంద్రమూర్తి ఏడుపుముఖం పెట్టాడు. “నువ్వు అడిగినవి అడిగినట్టు గ్రూపుల్లో పెడితే మూడు గ్రూపుల్లోంచీ తీసేసారు. నలుగురు అర్జెంటుగా అన్‍ఫ్రెండు చేసారు. ఒక్కావిడ మాత్రం చెప్పింది, ఇలాంటి కన్ఫ్యూజింగ్ ప్రశ్నలు వెయ్యకూడదని”
చిద్విలాసంగా నవ్వాడు చంద్ర.
“అమ్మాయ్! నీ పెద్దకొడుక్కి చెప్పుకో. మనకి కొన్ని నిజాలు తెలుసు. కానీ బైటికి చెప్పి ఎవర్నీ వప్పించలేం. మనకి తెలిసిన కొన్ని అబద్ధమనీ తెలుసు. ఐనా ఖండించలేం. ఇవన్నింటిలో క్లారిటీ వచ్చి, నువ్వెవరివో అథారిటీతో చెప్పుకోలేవు కాబట్టి మనకి నాగరికత అంటూ ఏమైనా వస్తే పరాయిపాలనవలనే వచ్చిందని అందర్నీ మనమే నమ్మిస్తున్నాం కాబట్టి… వాళ్ళు దయదలిచి ఇచ్చిన స్వాతంత్ర్యం వల్లనే మనం భారతీయులం అయాం కాబట్టి… ఇంకా ఇలాంటి ఎన్నో కాబట్టిలు వున్నాయి కాబట్టి…. మనం ఇలాగే వుంటాం, మనని ఎవరూ గౌరవించరని…” అన్నాడు పరిమళతో.
“ఇదుగో, శ్రీరాముడూ! ఇలా అన్ని గ్రూపుల్లోనూ చేరిపోకు. దీన్ని చదివి ఎవరు ఎవరో తెలుసుకుని చేరు” అని మిత్రుడి చేతిలో ఓ పుస్తకం చేతిలో పెట్టాడు. దాని పేరు.
“How does an ape recognize his fellow ape?”

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s