పగుళ్లు by S Sridevi

“శ్రీకళా!  వదిన పద్ధతేం నచ్చట్లేదు. ఎవరెవర్నో భోజనానికి పిలుస్తోంది. నేను లేని వేళ పరాయిమగవాడికి భోజనం పెట్టడమేమిటి చెప్పు?” పనిగట్టుకుని ఫోన్ చేసి చెల్లెలికి చెప్పాడు శ్రీధరమూర్తి.
“భోజనాలవేళ నువ్వు లేకపోవటమేమిటి? ఎక్కడికి వెళ్తున్నావు?” అడిగింది శ్రీకళ. ఆమెకి విషయం అంతా తెలిసిందని అర్థమైంది.
“నాకు సవాలక్షపనులుంటాయి. రోజంతా ఇల్లు కనిపెట్టుకునే వుండలేనుకదా? ఐనా నేను వద్దన్నా ఈ అల్లరేమిటి? అరవయ్యేళ్ళ మనిషి…” అన్నాడు కింద పడ్డా గెలుపు తనదేనన్నట్టు.
“నీకు అరవయ్యైదు లేవూ? నాకన్నా నాలుగేళ్ళు పెద్దవాడివికదూ?” అంది. శ్లేష అర్థమైంది. శ్రీధరమూర్తి భార్య, భానుమతి ఆమె వయసుదే.
“నీ కాలక్షేపం నువ్వు చూసుకుంటే వదిన తన కాలక్షేపం తను చేసుకుంటోందేమో!”
అతను కోపంగా ఫోన్ పెట్టేసాడు. ఆమె చిన్నగా నిట్టూర్చింది. అందరూ అరవైలు పైబడ్డవాళ్ళే. పెళ్ళిళ్ళు, పిల్లలు- వాళ్ళ చదువులు,  వుద్యోగాలు, పెళ్ళిళ్ళు,  ఆఖరికి తమ రిటైర్‍మెంటు అనే మెట్లన్నీ ఎక్కేసి తర్వాతేమిటన్న ఆలోచనలో వున్నారు. చేతినిండా డబ్బు, తీరిక.  బాధ్యతల్లేవు. ఇదివరకట్లా కాదు,  వొళ్ళలో వోపికలు వున్నాయి. బీపీ, షుగరు, థైరాయిడు కంట్రోల్లో వుంటే ప్రపంచాన్ని దున్నెయ్యచ్చనే జోష్‍లో వున్నారు.
భారతదేశమంతా తిరిగేసారు. అమెరికాకి వంతెన వేసుకున్నారు. అప్పుడు మొదలైంది శ్రీధరమూర్తిలో మార్పు. శ్రావణి అనే కవిగాయకురాలి చుట్టూ తిరుగుతున్నాడట. తమ ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఎవరో చెప్పారు ఆ విషయం. అదలా వుంచితే వదినమీద అతని అభియోగమేమిటో! ఆవిడకూడా తనదారి తను చూసుకుంటోందా? అన్నయ్య మీద కోపంతోనా? తప్పనిసరనా? బంధాలు ఎందుకింత బలహీనపడుతున్నాయి?
స్వయంగా వెళ్ళి మాట్లాడితే తప్ప తెలీదనిపించింది. తెలిసినా చెయ్యగలిగింది ఏమీ లేదు. ఇద్దరూ చిన్నవాళ్ళు కాదు. టీనేజి పిల్లలని మందలించినట్టు కోప్పడి చెప్పేవాళ్ళు ఎవరు? ఐనా ఇలా విడిపోవటంలోని నిర్ణయం వాళ్లకే వదిలేసినా, దాన్ని ప్రభావితం చేసేలా సాధకబాధకాలు వివరించాలి.
భానుమతికి ఫోన్ చేసింది తనొస్తున్నట్టు చెప్పడానికి. ఆమె ఇంట్లోనే వున్నానంది. భర్తకి చెప్పి, కారు తీసుకుని బయల్దేరింది. పావుగంట డ్రైవ్. ట్రాఫిక్ చేత ఇంకో పది నిముషాలు పట్టింది. విజిటర్స్ పార్కింగ్‍లో చోటు వెతుక్కుని పార్క్ చేసి, వీళ్ళ బ్లాక్‍కి వచ్చి, ఫ్లాట్ ముందు నిలబడి  డోర్‍బెల్ నొక్కేసరికి ఇంకో పదినిముషాలు.
ఆప్యాయంగా ఆహ్వానించింది భానుమతి ఆడబిడ్డని. కాఫీలు మానేసారు. గ్లాసునిండా చల్లటి మజ్జిగ తెచ్చిచ్చింది భానుమతి. ఇద్దరూ మాటల్లో పడ్డారు.
“ఇప్పటిదాకా వురుకులూ పరుగుల్తో గడిచిన జీవితం ఒక్కసారి ఎవరో స్టాచ్యూ చెప్తే ఆగిపోయినట్టు ఐపోయింది. మూడు వంటలు, మధ్యలో రెండు నిద్రలు, ఒక సినిమా లేదా వెబ్‍సీరీస్… చట్రంలో ఇరుక్కుపోయినట్టు  వుంది. కరోనా వచ్చాక మరీ నింపుకోవటానికేమీ లేనంత శూన్యంలా తయారైంది సమయం” అంది భానుమతి.
ఆమెకేసి నిశితంగా చూసింది శ్రీకళ.
“అందరి పరిస్థితీ అలాగే వుంది వదినా! ఇళ్ళన్నీ ఖాళీ ఐపోయాయి. వంటరితనపు గూళ్ళలా వున్నాయి”
“నాది ఇంకా భిన్నమైన పరిస్థితి శ్రీకళా! నీకు తెలుసో లేదో. శ్రీధరమూర్తి ఒకావిడతో లివింగ్ ఇన్ రిలేషన్‍షిప్‍లో వున్నారు. అదేమిటంటే నాకు కవిత్వం ఇష్టం సంగీతమంటే ప్రాణం అంటారు.  ఇంట్లో వుండరు. అస్తమానూ ఆమె దగ్గరకే వెళ్తున్నారు” అంది భానుమతి. అంటుంటే ఆమె కళ్లలో నీళ్ళు తిరిగాయి.
“నలభయ్యేళ్ళైంది మా పెళ్ళై. ఇద్దరిదీ ఒకటే జీవితమనుకుంటూ బతికాం. ఇప్పుడు ఎలా విడగొట్టుకోవాలో అర్థం కావటం లేదు”
“అన్నయ్యేమంటాడు? పిల్లలకి తెలుసా, యీ విషయం?”
“ఇప్పుడు నీకు విడాకులు దేనికి, నేనేం నిన్ను వద్దనుకోలేదుకదా, అంటారు. ఇక పిల్లలు… వాళ్ళగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది”
“అదేమిటొదినా?”
“అంతే శ్రీకళా! విన్నింగ్ సైడ్ ఎటైతే అటు సర్దుకోవటం నేర్చుకున్నారు వాళ్ళు. తండ్రి ఎంతో కష్టపడి తమని పైకి తీసుకొచ్చారట. ఆయన సంపాదించుకొస్తుంటే నేను ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేసానట.  ఇప్పుడే ఆయన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నది, నువ్వు అడ్డు చెప్పకమ్మా అంటున్నారు. అంతగా నేనిక్కడ వుండలేననుకుంటే తమ దగ్గరకి వచ్చెయ్యమన్నారు. అంటే వాళ్ళ దయాధర్మం మీద బతకడానికి”
“ఛ… అదేమిటి?”
“ఎవరికి చెప్పను? ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి”
ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకోలేదు. అన్నయ్య చెప్పిన విషయం ఎలా అడగాలో అర్థం కాలేదు శ్రీకళకి. తన స్వంత ఆడబిడ్డ సత్యమీదికి పోయాయి ఆలోచనలు. వాళ్లదీ ఇదే వయసు. అక్కడ సమస్య ఇంకోలా. మినీలు, మైక్రోలూ కొనుక్కొచ్చి ఇస్తాడట భర్త. అవి వేసుకొమ్మని సతాయింపు.
“ఇంట్లో మనిద్దరమేకదా, వుండేది?” అంటాడట. అతను షార్ట్స్ వేసుకుని పూలపూల షర్టుల్తో తిరుగుతాడు.
“తను వేసుకుంటే వేసుకున్నారు, తనిష్టం. నేను వేసుకుంటే తనకి సంతోషం కలగటమేమిటి? నాకిష్టం లేనివీ, అలవాటు లేనివీ అతనికోసం నేను వేసుకోవటమేమిటి? చీదరెత్తిపోతోంది అతని గొడవకి” అంది నాలుగైదుసార్లు ఫోన్లో. వాళ్ళ సమస్యని ఎలా పరిష్కరించాలో సత్యకి ఏమని సలహా ఇవ్వాలో అర్థమవ్వలేదు. భార్యాభర్తల బెడ్‍రూమ్ విషయాల్లో ఎవరేనా ఎలా తలదూర్చగలరు? ఆమే ఆలోచించుకుని అత్తగారిని తెచ్చి దగ్గరపెట్టుకుంది.
“పెళ్లైన కొత్తలో ఏవో భయాలతో అత్తగారి స్థానాన్ని కొద్దిగా కదుపుతాము. కానీ వదినా, మగవాడు కాస్త అదిలిస్తే ఆగేది తల్లికే. ఎంత వయసొచ్చినా. ఆవిడ రాగానే అడిగింది, ఈమధ్య ఏం చీరలు కొనుక్కునావో చూపించమని. అలవాటే అలా అడగడం. కొడుకు కొన్న గుడ్డలన్నీ తెచ్చి ఆవిడ ముందు పడేసాను. ఇంక తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. మేం ఇద్దరం వున్నప్పుడు పులిలా ఎగిరిన మనిషి ఇప్పుడు పిల్లిలా మారాడు” అంది సత్య చివరికి.
అంత గొడవా చేసిన మనిషికి హార్టెటాక్ వచ్చింది. బైపాస్ సర్జరీ చేసారు. ప్రాణభయంతోటీ భార్య మొహంలో మొహం పెట్టి చూడటానికీ కూడా హడిలిపోతున్నాడు.  
మనుషులు బంధాలు మర్చిపోతున్నారు. ముప్పయ్యేళ్ళో నలభయ్యేళ్ళో వైవాహిక జీవితం గడిపేది విశ్రాంతి సమయాన్ని ఒకరితో ఒకరు పంచుకోవటానికి, ఇంకా ముదిమివయసులో ఒకరికొకరు సాయంగా వుండటానికి. ఇది మర్చిపోయి, తనొక్కరే, సుఖం తనొక్కరిదే అనుకుంటూ భార్యని భర్తా, భర్తని భార్యా ఎందుకు బాధించుకుంటున్నారు ? మనుషుల్నీ మనుషుల్నీ విడగొట్టే సిద్ధాంతాలు ఎక్కడినుంచీ వస్తున్నాయి? పిల్లలు తల్లిదండ్రుల రిలేషిప్‍‍ని జడ్జి చెయ్యటమేమిటి?
అసలు తల్లి ఇంట్లో కూర్చుని సుఖపడిపోయిందని అన్న పిల్లలకి ఎందుకు అనిపించింది? వాళ్ళ జీవనశైలినిబట్టి అలా అనిపిస్తోందా? అందరికీ అన్నీ వేళకి అమర్చి, ఎక్కడివాళ్ళక్కడికి వెళ్ళాక, మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తారా అని నిర్వ్యాపారంగా కూర్చుని ఎదురుచూడటం, వాళ్లలో ఏ వొక్కరేనా వేళకి తిరిగి రాకపోతే పడే టెన్షను… ఇవన్నీ వాళ్లకి ఎలా అర్థమౌతాయి? ఇవన్నీ పక్కనబెడితే, ఇద్దరు పిల్లలని కనటం, వాళ్ళని పెంచి పెద్దచెయ్యటంకోసం ఆడవాళ్ళు మాత్రం త్యాగాలు చెయ్యటం లేదూ? ఉద్యోగాలు, కెరీర్, సరదాలు అన్నీ పక్కని పెడితేనేగా, మగవాళ్ళు పిల్లలతోపాటు పైకెదిగేది?
ఇంతకీ అన్నయ్య చెప్పిన విషయం?
“సమాజంలోనూ, మనం నమ్మిన విలువల్లోనూ మార్పు వచ్చింది శ్రీకళా! మనం మారకపోయినా. బాధపడుతున్నా ఎవరికీ లక్ష్యం లేదు. వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీ అన్నయ్యలో మార్పొచ్చింది. పిల్లలు వాళ్ళు బతుకుతున్న వాతావరణానికి అనుగుణంగా మారిపోయారు. నాదారి నేను చూసుకోవలసిన పరిస్థితి వచ్చింది” అంది భానుమతి కొంతసేపటికి.
“ఏం చెయ్యాలనుకుంటున్నావు వదినా?”
“మీ అన్నయ్య నీతో ఏం చెప్పలేదా? అందుకే వచ్చావనుకుంటున్నాను”  
“తను చెప్పింది కాదు, నువ్వు చెప్పేది నాకు ముఖ్యం”
“మిత్రాగారనీ పై ఫ్లాట్‍లో వుంటారు. వాకింగ్‍లో కలుస్తుంటాం. ఈమధ్యనే భార్య పోయింది. బాగా కృంగిపోయారు. నాలుగు ఓదార్పు మాటలు చెప్పాను. ఒకటి రెండుసార్లు మనింట్లో భోజనానికి పిలిచాను. మీ అన్నయ్య వుంటే బావుండేది. పిలిచినందుకు కనీసం నా మర్యాద  నిలబెట్టేందుకేనా వుండచ్చు. ఉండలేదు” భార్యాభర్తలిద్దరి మాటల్లో ఎంత తేడా!
శ్రీధరమూర్తికి తను చేస్తున్నది సరైనది కాదనే  విషయం తెలుసు.   భార్యని తప్పు పట్టి తనమీది భారం తగ్గించుకోవాలనుకుంటున్నాడు. ఆ విషయం స్పష్టంగా అర్థమైంది శ్రీకళకి.
“అతను షెఫ్‍గా చేసేవారు. అతనితో కలిసి ఫుడ్‍కోర్టు పెడితే బావుణ్ణని ఆలోచన. బ్లూప్రింటుకూడా రెడిగా చేసాము.  ఒక చిన్న కన్సర్ట్ హాలు, ఎవరికేనా ఆసక్తి వుంటే బొటిక్. బాబీకోసం కొన్న ప్లాట్ వుందికదా, అందులో మొదలుపెట్టాలని. పర్మిషన్స్ తీసుకోవాలి. మేమిద్దరమే పెడితే విమర్శలు ఎదుర్కోవాలి. మీ అన్నయ్య నాతోకూడా వుంటే బావుండేది. తన ప్రపంచం వేరైపోయింది.  ఫ్రెండ్స్‌ని కలుస్తారేమోనని అడుగుతున్నాను.”
ఇద్దరూ మరికాసేపు మాట్లాడుకున్నారు.
“బెడ్‍రూంలో పక్కపక్కని పడుకుని పంచుకుంటేనే అనుబంధం కాదు శ్రీకళా, హాల్లో ఎదురెదురుగా కూర్చుని మాటల్లోకూడా పంచుకోవచ్చు.  ముఖ్యంగా యీ వయసులో. మీ అన్నయ్యలో సుఖలాలస ఇంకా తగ్గలేదు.  అందుకే నేను తప్పుకుంటే హుందాగా వుంటుందనిపించింది” అంది భానుమతి చివరగా. పూర్తిగా అర్థమైంది శ్రీకళకి.
వెళ్తానని బయల్దేరింది.
“వదినతో మాట్లాడావా? ఏమంది?” ఇంటికి వచ్చేసరికి శ్రీధరమూర్తి ఫోను.  
“ఫుడ్‍కోర్టు పెడదామనుకుంటోంది వదిన. ఆ ఆలోచన నాకూ నచ్చింది” అంది కూల్‍గా.
“నేనడుగుతున్నది ఆ వంటలవాడిగురించి”
“నువ్వు నీ పాటకత్తెని ఎవరేనా వంటరివాడిని వెతుక్కోమని చెప్పకూడదూ?”
అతను కోపంగా ఫోన్ పెట్టేసాడు.
మనసంతా చికాగ్గా అనిపించింది శ్రీకళకి.
“ఏమైంది?” అడిగాడు ఆమె భర్త ప్రభు.
“అన్నయ్యగురించి మనం విన్నది నిజమే. వదినమీద అనవసరంగా నింద వేస్తున్నాడు”
చిన్నగా నవ్వాడు ప్రభు. “శ్రీధరమూర్తి పెద్ద స్ట్రాటజిస్టు. తప్పుచేసినవాడికన్నా, చేసినట్టు ఆరోపించబడినవాడికే తనే తప్పూ చెయ్యలేదని నిరూపించుకోవలసిన అవసరం ఎక్కువగా వుంటుంది” అన్నాడు.
ఏం జరగబోతోందో అని ఆలోచిస్తుండగా, ఏమీ జరగకుండానే నెలరోజులు గడిచిపోయాయి. అన్ ఈవెంట్‍ఫుల్‍గా.


“ఫుడ్‍కోర్టు ప్రపోజల్ ఆగిపోయింది శ్రీకళా! మిత్రాగారు పెళ్ళిచేసుకున్నారు. జాబ్ వెతుక్కున్నారు. ఇప్పుడు నేను హోటల్ మేనేజిమెంటు చేసిన మనిషిని వెతుక్కోవాలి. నాడా దొరికిందని గుర్రాన్ని కొనుక్కున్నట్టుంటుంది” అంది భానుమతి ఫోన్ చేసి.
“అదేమిటొదినా?” అంది ఇంకేమనాలో తోచక.
“అతనొక కదిలి వెళ్ళిపోయే మేఘం. అది కురవాలనీ, ఆ జల్లుల్లో నేను తడవాలనీ అనుకోలేదు”
“మరి?”
“అవంతీపురం వెళ్ళిపోదామనుకుంటున్నాను. అమ్మావాళ్ళూ ఇల్లు డెవలప్‍మెంటుకి ఇచ్చారు. అపార్ట్‌మెంటు పూర్తై ఫ్లాట్లు చేతికి వచ్చాయి. అందులో నాకొకటి వుంది. వచ్చి ఇంటీరియర్స్ పూర్తి చేసుకొమ్మని నాన్న చెప్పారు. అక్కడ కొన్నాళ్ళు వుండిపోయి, తర్వాతేం చెయ్యాలో ఆలోచిస్తాను”
“ఇక్కడి యిల్లు? నువ్వూ అన్నయ్యా ఎంతో కష్టపడి యిష్టంగా కట్టుకున్నది?”
“చిన్నప్పుడు నది వొడ్డునా, సముద్రం వొడ్డునా కూర్చుని ఇసుకతో గూళ్ళు కట్టేవాళ్ళం పిల్లలందరం. దాన్ని గవ్వలతోటీ శంఖాలతోటీ అలంకరించేవాళ్ళం. గడ్డిపువ్వులు, ఆకులు తెచ్చి గుచ్చేవాళ్ళం. ఆటైపోయాక దాన్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. అందరం వున్నప్పుడేకదా, ఆట? పిల్లలు ఎలాగా దగ్గర లేకుండా పోయారు. శ్రీధరమూర్తికూడా లేకుండా పోయాక ఇంక అదేం యిల్లు?”
“బాధగా అనిపిస్తోంది”
“మనుషులం స్వేచ్ఛ కోరుకుంటున్నాంకదూ? బంధాలు బరువనిపిస్తున్నాయి”
“పిల్లలేమటున్నారు?” అడగక తప్పని ప్రశ్న.
“మీరిద్దరూ కల్సి వున్నారంటే ఒకరికొకరు తోడుగా వున్నారని ధైర్యం మాకు. నాన్న తనదార్లో వెళ్తున్నా, నిన్నూ చూసుకుంటానంటున్నారు కదా, అది కాదనకు. ఒక్కదానివీ అవంతీపురం వెళ్ళి ఏం చేస్తావు- అని దెబ్బలాడుతున్నారు. పాతమితృలున్నారని చెప్పాను. వాళ్లకర్థమైందో లేదో!”
“కొత్తశతృవు అన్నయ్యని వాళ్ళు వప్పుకోలేరు”
“అంతేకదా? నేనే తప్పుచేస్తున్నట్టు “
“ఎప్పుడు నీ ప్రయాణం?”
“వచ్చే వారం”
“గొడవ నీకూ అన్నయ్యకీ మధ్యని. మనిద్దరికీ ఏమీలేదు. నలభయ్యేళ్ళ స్నేహం మనది. నన్ను మర్చిపోకు”
“నేనూ అదే చెప్తున్నాను. అక్కడికోసారి వచ్చి వెళ్ళు. ప్రభుకికూడా చెప్పు”


“వదిన వాళ్ల వూరు వెళిపోతోంది. చక్కటి సంసారాన్ని చిందరవందర చేసి, ఆమెని బాధపెట్టేందుకు నీకు మనసెలా వప్పింది అన్నయ్యా?” ఆవేదనగా అడిగింది శ్రీకళ.
నవ్వేసాడు శ్రీధరమూర్తి.
“చిన్నప్పటినుంచీ నాకు సంగీతం అన్నా, కవిత్వమన్నా ఎంత ఇష్టమో నీకు తెలీనిది కాదు. రెండిట్లో ఏ ఒక్కటీ నాకు నాన్న పడనివ్వలేదు. మీ వదినకి అసలు ఆసక్తే లేదు”
“అమ్మానాన్నలు చెడ్డవాళ్ళు కాదన్నయ్యా! పాటలూ పద్యాలూ పాడుకుంటూ తిరిగితే కడుపు నిండదని వాళ్ళకి తెలుసు. కడుపు నిండాలంటే డబ్బుకావాలి. ఆ డబ్బొచ్చే చదువు చదివించారు. కళల్లోనూ సాహిత్యంలోనూ ఏ ఒకరో ఇద్దరో పైకొస్తారు. చదువుకున్నవాళ్ళుమాత్రం అందరూ పైకొస్తారు. వదినకూడా నీలాగే పెరిగింది. తను నీకన్నా ప్రాక్టికల్”
“జీవితం చాలా వెల్తిగా అనిపిస్తోంది. శ్రావణి… తనొక వసంతంలా వచ్చింది. నాలో వున్న వెల్తిని నింపింది”
“వదిన తెచ్చింది వసంతం కాదా?”
“కాదని ఎందుకంటాను? కానీ మార్పుకూడా కావాలికదా? ఎంతకాలం ఒకేలా బతుకుతాం? వండుకుంటూ, తింటూ, తిరుగుతూ… అదే మనిషితో? అదే మూసలో? వదిన్ని నేను వద్దనుకోలేదు. ఇక్కడే వుండచ్చు. కానీ తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరకి వెళ్ళాలనుకుంది.   ఇప్పటికే ఇద్దరిని వదిలేసి నాదగ్గరికి వచ్చిన శ్రావణి నాతోటే వుంటుందని అనుకోను. మా ఇద్దరిలో ఎవరికి నచ్చకపోయినా ఎవరి దారి వాళ్ళది. భాను ఆ వంటలవాడిని పెళ్ళిచేసుకుంటే అన్న భయం నాలో వుండేది. తనే దగ్గరుండి వాడి పెళ్ళి చేయించింది. ఇప్పుడింక  ఎప్పుడేనా అవంతీపురంలో నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వచ్చు” అన్నాడు.
అతన్ని ఎంత సంస్కారంగా పెంచామనుకున్నారో తల్లిదండ్రులు! ఇదా అతని సంస్కారం! కాలం మార్పు తెచ్చిందా? పరిస్థితులు మార్పు తెచ్చాయా? ఇదే అతని నైజగుణమా? లేక మగబుద్ధంటే ఇదా? రేపెప్పుడేనా అవకాశం దొరికితే ప్రభు కూడా ఇలాగే మారిపోతాడా? ఒక్క క్షణం తన చుట్టూ వున్న ప్రపంచమంతా మారిపోయి, భూకంపం తర్వాత పగుళ్ళేసిన భవనాల్లా మనుషులు అనిపించారు. ఈ అనుభవం రంగుటద్దంలా మారి, ఆమె మనసులో చేరి భయపెట్టింది.


భానుమతి అవంతీపురం వెళ్ళిపోయింది.
“అతనేమైనా చిన్నవాడా, చితకవాడా? అరవయ్యైదేళ్ళ మనిషి. బుద్ధి వుండాలి. ఈ వయసులో ఏమని చెప్తాం?” అన్నాడు ఆమె తండ్రి. కూతురు చూసీచూడనట్టు వూరుకోవలసిందని ఆయన అభిప్రాయం. పైకి అనలేదు. అంటే కూతురు, భార్య విరుచుకు పడతారని వూరుకున్నాడు.
“రేప్పొద్దున్న కాలూచెయ్యీ సాగకపోతే అప్పుడు అతనికే తెలిసొస్తుంది. ఇక్కడే వుండు హాయిగా. ఆ యిల్లూ మిగిలిన ఆస్తుల గొడవ పిల్లలు చూసుకుంటార్లే. వాళ్ళేం అంత తెలివితక్కువవాళ్ళు కారు” అంది తల్లి నిరసనగా. ఆవిడ మాటలు ఆమెకి కొత్త సమస్యని చూపించాయి.


ఇంకో నెలకి విడాకుల కేసు మొదలైంది.
“ఎందుకొదినా?” అడిగింది శ్రీకళ.
“రేపెప్పుడేనా పరిస్థితులు మారిపోతే అతను నాకొక లీగల్ ఆబ్లిగేషన్ కాకూడదని” జవాబిచ్చింది భానుమతి.
పగుళ్ళేసిన మనుషుల్లో క్షమకూడా కనుమరుగౌతుందని అర్థమైంది శ్రీకళకి.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s